ఉత్సాహాన్ని కాపాడుకొనే విధానం
1 అపొల్లో తన పరిచర్యలో చూపించిన ఉత్సాహం గురించి చదివినప్పుడు, నేడు ప్రత్యేకంగా ప్రకటనా పనిలో ఉత్సాహంతో పనిచేసే తోటి క్రైస్తవులు మనకు గుర్తుకురావచ్చు. (అపొ. 18:24-28) కానీ మనలో ప్రతీ ఒక్కరికీ ఈ ఉపదేశం ఇవ్వబడింది: “ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.” (రోమా. 12:11) క్రైస్తవ పరిచర్యపట్ల ఉత్సాహాన్ని పెంపొందించుకొని, దానిని కాపాడుకోవడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది?
2 జ్ఞానంతో ఉత్సాహం అధికమవుతుంది: యేసు తన శిష్యుల్లో ఇద్దరికి ప్రత్యక్షమై, “లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపిన” తర్వాత వారిలా వ్యాఖ్యానించారు: ‘ఆయన త్రోవలో మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?’ (లూకా 24:27, 32) అదేవిధంగా మనలో దేవుని వాక్యం గురించిన అవగాహన పెరిగినప్పుడు మన హృదయాలు ఉత్సాహంతో నిండవా? అవును, జ్ఞానంతో విశ్వాసం బలపడుతుంది. రోమీయులు 10:17 ఇలా వివరిస్తోంది: “వినుట వలన విశ్వాసము కలుగును.” మన హృదయాలు యెహోవా వాగ్దానాలపై నమ్మకంతో నిండినప్పుడు, మనం తెలుసుకున్న విషయాల గురించి ఇతరులతో మాట్లాడకుండా ఉండలేం!—కీర్త. 145:7; అపొ. 4:20.
3 దేవునిపట్ల మన ప్రేమను బలంగా ఉంచుకోవడానికీ, ఆయన సేవలో ఉత్సాహాన్ని పదిలంగా ఉంచుకోవడానికీ మనం కేవలం గతంలో అధ్యయనం చేసినప్పుడు సంపాదించుకున్న జ్ఞానంపైనే ఆధారపడలేం. మనం సత్యంపట్ల అవగాహనను వృద్ధి చేసుకోవడంలో, యెహోవాపట్ల మనకున్న ప్రేమను ప్రగాఢం చేసుకోవడంలో కొనసాగాలి. అలా చేయనట్లైతే మనమాయనకు చేసే సేవ క్రమంగా యాంత్రికంగా తయారవుతుంది. (ప్రక. 2:4) “దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచుండాలి” అని దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది.—కొలొ. 1:9, 10.
4 మన అధ్యయన అలవాట్లు: కాబట్టి మనం మన అధ్యయన అలవాట్లను పరిశీలించుకోవాలి. ఉదాహరణకు, మనం మన కావలికోట అధ్యయన ఆర్టికల్లో జవాబులను అండర్‌లైన్ చేసుకోగలుగుతుండవచ్చు, సరైన వ్యాఖ్యానాలను కూడా ఇవ్వగలుగుతుండవచ్చు. కానీ దానిలో పేర్కొనబడిన లేఖనాలను చదివి, ఆ ఆర్టికల్లోని సమాచారం మన జీవితానికి ఎలా అన్వయిస్తుందో ధ్యానిస్తున్నామా? వారపు బైబిలు పఠనానికి నియమించబడిన దాన్ని చదవడంతోపాటు మన పరిస్థితులు అనుకూలిస్తే అదనపు పరిశోధన చేయడానికి ప్రయత్నిస్తున్నామా, దానిలోని పాఠాలను గురించి మనం ధ్యానిస్తున్నామా? (కీర్త. 77:11, 12; సామె. 2:1-5) దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దానిలో లీనమవడంలో ఎంత ప్రయోజనం ఉందో కదా! (1 తిమో. 4:15, 16) అటువంటి అర్థవంతమైన అధ్యయనం మన హృదయాల్ని పోషించి, మనం “సత్‌క్రియలయందాసక్తిగల” వారిగా ఉండేందుకు మనకు శక్తినిస్తుంది.—తీతు 2:14.