దేవుని ధర్మశాస్త్రమును మన ‘ఆంతర్య భాగములలో’ నుంచుట
1 యెహోవా ధర్మశాస్త్రము యేసు యొక్క ‘ఆంతర్య భాగములలో ఉండునని ముందుగానే ప్రవచింపబడెను. (కీర్తనలు 40:8) అది నిజమాయెను. మరియు తన తండ్రి చిత్తమును చేయుటలో అది ఆయనకు సహాయపడెను.
2 అదే విధముగా ఆయన అభిషక్త శిష్యులును యెహోవా ధర్మశాస్త్రమును “వారి మనస్సులలోను మరియు హృదయములమీదను” వ్రాయబడియుండిరి. (హెబ్రీయులు 8:10) అది వారు సత్ప్రవర్తనను కలిగియుండి తమ పరిచర్యను పూర్తిగా చేయుటకై వారికి సహాయపడెను. మరి మన మనస్సులలోను మరియు మన హృదయపు పలకలమీదను యెహోవా ధర్మశాస్త్రమును వ్రాసియున్నదను నిశ్చయతకై మనమేమి చేయవలెను?—సామెతలు 3:3.
వ్యక్తిగత పఠనము మరియు పరిశోధన
3 దేవుని వాక్యముయొక్క పఠనము సత్యమును మన సొంతదిగా చేసుకొనుటకు సహాయపడును. పఠనములో పరిశోధన మరియు ధ్యానము ఇమిడియున్నది. అది వివరములను జాగ్రత్తగా గమనించు సంకల్పముతో కొనసాగించు ధ్యానమై యున్నది. (ఏకాగ్రతను నిలుపుట) మనము సంస్థయొక్క సాహిత్యములను చదవటమే గాక వార కూటములకు తయారగుటకు క్రమమైన పఠన ప్రణాళికను కలిగియుండునట్లు స్వకీయమైన క్రమశిక్షణను కూడా కలిగియుండుట అవసరము.
4 మంచి పఠన అలవాట్లు సత్యమును గూర్చి మన ధృఢ విశ్వాసమును బలపరచి భవిష్యత్తును గూర్చి మన నిరీక్షణను మెరుగుపరుస్తుంది. అవును, “మనము రక్షణ విషయములో ఎదుగుదుము.” (1 పేతురు 2:2) మనము లేఖనముల నుండి ఆసక్తికరమగు విషయములను నేర్చుకొనునప్పుడు వాటిని గూర్చి మాట్లాడుదుము. మనము నేర్చుకొన్న విషయములను గూర్చి మాట్లాడుట ద్వారా మన పొరుగు వారియెడల ప్రేమను చూపించగలము. మనము “రాజ్యమును గూర్చిన వాక్యము” మాట్లాడు పనిలో ఆసక్తితో భాగము వహించుట మంచి వ్యక్తిగత పఠన అలవాట్ల ద్వారా ఆత్మీయ విషయములను గుణగ్రహించుటపై ఆధారపడియున్నది.—మత్తయి 13:19.
పఠనమునకు సహాయకములు
5 సత్యమును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానమును పొందుటకు యెహోవా సంస్థ మనకు అవసరమైనవన్నియు అందించియున్నది. మీరు 1930-1985 ఇండెక్స్‌ను సరిగా వాడుతున్నారా? ఈ మంచి సాధనమును మరియు అందుబాటులో ఉన్న ఇతర ప్రచురణలను కలిగియున్న మనము అనుభవ జ్ఞానము పొందుటకు ఎంతటి నిధిని కలిగియున్నాము! ఇన్సైట్ మరియు రివలేషన్ క్లైమెక్స్ పుస్తకములను కూడా మరువకూడదు. వీటన్నిటిని ఫలవంతముగా వాడుచున్నారా?
6 మన వ్యక్తిగత పఠనము నుండి అత్యధిక లాభమును పొందుట. దానికొరకు మనమేమి చేయుచున్నామో అను దానిపై ఆధారపడియున్నది. మీ అనుదిన పరిస్థితులలోనే ఏకాగ్రతను నిలిపి ధ్యానించుటకు ఎక్కడ మరియు ఎప్పుడు అనుకూలతను కనుగొనగలవో నిర్ణయించుకొనుడు. పఠనమును ప్రారంభించుటకు ముందు యెహోవాను సహాయమునకై ప్రార్థించుము. ఈ క్లిష్టకాలములలో జ్ఞానయుక్తముగా ప్రవర్తించుటకు మన హృదయములలో దేవుని వాక్య సత్యము లోతుగా రాయబడవలసియున్నది. (సామె. 7:1-3; యెహో. 1:8) తన జ్ఞాపక సూచకములను మన హృదయములలో నాటుటకు యెహోవా తన ఆత్మను వాడును. (యోహాను. 14:26; 1 కొరింథి. 2:10) తన వాక్యములోని ఐశ్వర్యమును కనుగొని అర్థము చేసుకొనుటకు, హృదయపూర్వకముగా సహాయమును అడిగినప్పుడు ఆయన తప్పక వినును.—సామె. 2:1-6.
7 దేవుని ధర్మశాస్త్రము మన ఆంతర్యభాగములో నుండుటకు క్రమమైన మరియు స్థిరమైన పఠనము అవసరము. దానిద్వారా అధిక ఆత్మీయతను పెంపొందించుకొని జీవపు మార్గంలో స్థిరపడగలము.—కీర్తన 16:11; కొలొ. 2:7.