‘పరిశుద్ధాత్మతో ప్రకాశించండి’
1. మన ప్రకటనా పనిలో ఏది ముఖ్యంగా కనిపించాలి?
1 మన క్రైస్తవ పరిచర్యకు సంబంధించిన ఏ విషయంలోను మనం ఎప్పుడూ ఒకేలా ఉండిపోకూడదు. ‘పరిశుద్ధాత్మతో ప్రకాశించండి. యెహోవాను సేవించండి’ అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (రోమా. 12:11, NW) అయితే పరిచర్యలో మన ఆసక్తి తగ్గిపోయేలా చేసేవి చాలావున్నాయి. మన రాజ్య సేవలో మనకున్న ఆసక్తిని, ఉత్సాహాన్ని మనం ఎలా ‘ప్రజ్వలింప చేసుకోవచ్చు?’—2 తిమో. 1:6, 7.
2. వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడం వల్ల ప్రకటనాపనిని ఉత్సాహంగా ఎలా చేయవచ్చు?
2 వ్యక్తిగత బైబిలు అధ్యయనం: సమర్థులైన రాజ్య ప్రచారకులు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దానిలోని సత్యాలను మనసులోకి తీసుకుంటారు. (కీర్త. 119:97) వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు సత్యసంపదలను కనుగొంటాం. దానివల్ల మన హృదయాలు ఉప్పొంగి మన ఉత్సాహం అధికమౌతుంది. అలాంటి సత్యాలను అందించిన దేవుని పట్ల ప్రేమ, రాజ్య సువార్తను ఇతరులతో పంచుకోవాలనే కోరిక ఆయనను స్తుతించేలా చేస్తాయి. అందువల్లే ఆయన నామాన్ని నలుగురికీ ప్రకటిస్తాం. (హెబ్రీ. 13:15) హృదయపూర్వకంగా రాజ్య సువార్తను ప్రకటించడం మనం దానికి ఎంత విలువిస్తున్నామో చూపిస్తుంది.
3. పరిచర్య చేయడానికి దేవుని ఆత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది?
3 పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించండి: సమర్థవంతంగా ప్రకటించడానికి మన శక్తి సరిపోదు. పరిశుద్ధాత్మ మనకు చక్కగా సహాయం చేస్తుంటేనే మనలో నిజమైన ఉత్సాహం ఉంటుంది. (1 పేతు. 4:11) “అధిక శక్తి” ఉన్న దేవునికి దగ్గరైనప్పుడు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి కావలిసిన ఆధ్యాత్మిక స్థైర్యాన్ని ఆయన మనకు ఇస్తాడు. (యెష. 40:26, 29-31) అపొస్తలుడైన పౌలు పరిచర్యలో వ్యతిరేకత ఎదురైనప్పుడు ‘దేవుని సహాయం పొందాడు.’ (అపొ. 26:21, 22) ఉత్తేజాన్నిచ్చే యెహోవా పరిశుద్ధాత్మ మనం ఆసక్తితో పరిచర్య చేసేలా నడిపిస్తుంది కాబట్టి మనం దాని కోసం ప్రార్థించాలి.—లూకా 11:9-13.
4. ఉత్సాహంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి, అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
4 సాధారణంగా రాజ్యాన్ని ప్రకటించడానికి మనలో ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పుడు మన తోటి క్రైస్తవులకు కూడా ఆసక్తి కలుగుతుంది. (2 కొరిం. 9:2) మనం ఉత్సాహంగా, నమ్మకంతో సందేశాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఉత్సాహంగా ఉండడమే కాక ఎప్పుడూ మనం చెప్పిందే వినాలన్నట్లు ఉండకుండా, యుక్తిగా, సాత్వీకంగా ఉండడం కూడా అవసరం. (తీతు 3:1, 2) ఎప్పుడైనా సరే, ఇంటివారిని మనం గౌరివించాలి, వారినే నిర్ణయించుకోనివ్వాలి.
5. బైబిల్లోని ఏ ఆజ్ఞను పాటించడానికి మనం కృషిచేయాలి?
5 రాజ్య ప్రకటనా పనిలో మనమెప్పుడూ ‘పరిశుద్ధాత్మతో ప్రకాశించాలి.’ వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేస్తూ, శక్తివంతమైన తన పరిశుద్ధాత్మను ఇచ్చే యెహోవాకు క్రమంగా ప్రార్థిస్తూ ఉత్సాహాన్ని పెంపొందించుకుందాం. అలా చేస్తే మనం “పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను” ఉత్సాహంగా పరిచర్య చేయగలుగుతాం.—1 థెస్స. 1:4, 5.