ముఖకవళికలను గమనించడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తి చూపించండి
1 బహిరంగ స్థలాల్లో, ఇంటింటా మనం సాక్ష్యమిస్తున్నప్పుడు మాట్లాడడం ప్రారంభించడానికి ముందే మనం సాధారణంగా ప్రజల కళ్ళల్లోకి చూస్తాం. అలా చేసే కొన్ని సెకన్లలోనే వారి ముఖకవళికలనుండి మనం అక్కడికి వెళ్ళడాన్ని గురించి వారేమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు, వారెలాంటి మానసికస్థితిలో ఉన్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వారు కూడా మన గురించి ఎంతో తెలుసుకునే అవకాశముంది. ఒక సాక్షి తనను సందర్శించడం గురించి ఒక స్త్రీ ఇలా అంది: “చిరునవ్వు చిందించే ఆమె ముఖంలో నాకు గుర్తున్నదల్లా దానిలోని ప్రశాంతతే. అది నా ఆసక్తిని రేకెత్తించింది.” అది, ఆ స్త్రీ సువార్త వినేలా చేసింది.
2 బహిరంగ ప్రదేశాల్లో లేదా వీధి సాక్ష్యమిస్తున్నప్పుడు ప్రజల కళ్ళల్లోకి చూడడం సాక్ష్యమిచ్చేందుకు నడిపించే సమర్థవంతమైన మార్గం. ఒక సహోదరుడు తనవైపు వస్తున్న ప్రజల కళ్ళల్లోకి చూస్తాడు. వారు ఆయనవైపు చూసినప్పుడు చిరునవ్వు చిందించి ఆ తర్వాత పత్రికలను అందిస్తాడు. ఈ పద్ధతి ఉపయోగించి ఆయన అనేకమందితో చక్కగా సంభాషించగలిగాడు, అంతేగాక చాలా సాహిత్యాలను కూడా అందించగలిగాడు.
3 ఇతరుల భావాలను గ్రహించండి: ఇతరుల కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం, వారి భావాలను గ్రహించడానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, మనం చెప్పేది అర్థం చేసుకోవడం ఒక వ్యక్తికి కష్టమౌతున్నా, లేదా మనం చెప్పేదానితో అతను ఏకీభవించకపోయినా సాధారణంగా అది అతని ముఖంలో కనిపిస్తుంది. ఆయన ఖాళీగా లేడనే విషయాన్ని లేదా ఆయనలో సహనం నశిస్తోందని మనం ఆయన ముఖకవళికలను గమనించడం ద్వారా గ్రహించగలుగుతాం. దానికి అనుగుణంగా మనం మన ప్రతిపాదనను తగ్గించడమో లేక తగినవిధంగా మార్చుకోవడమో చేయవచ్చు. ఇతరుల భావాలను గుర్తించడం వారిపట్ల మనకున్న వ్యక్తిగత ఆసక్తిని చూపించేందుకు ఒక మంచి మార్గం.
4 నిజాయితీ, దృఢవిశ్వాసం: అనేక సంస్కృతుల్లో ఒక వ్యక్తి కళ్ళలోకి చూసి మాట్లాడడమనేది వారి నిజాయితీకి రుజువుగా పరిగణించబడుతుంది. “ఎవడు రక్షణపొందగలడు?” అని తన శిష్యులు ప్రశ్నించినప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడనేదాని గురించి బైబిలు ఏమి చెబుతోందో గమనించండి: ‘యేసు వారిని చూచి—ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.’ (మత్త. 19:25, 26) ఆయన చూపులోని దృఢవిశ్వాసం ఆయన మాటల ప్రాముఖ్యతను ఖచ్చితంగా నొక్కిచెప్పింది. అదేవిధంగా, ఒకరి కళ్ళలోకి చూసి మాట్లాడడం, మనం రాజ్య సందేశాన్ని నిజాయితీతో, దృఢవిశ్వాసంతో అందించడానికి సహాయం చేస్తుంది.—2 కొరిం. 2:17; 1 థెస్స. 1:4.