మీ సమయాన్నెలా వినియోగిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి
1. అన్ని ప్రాంతాల్లోని ప్రజలు నేడు ఎలాంటి సవాలును ఎదుర్కొంటున్నారు?
1 సమయాన్ని ఆదాచేసి, శ్రమ తగ్గించే ఉపకరణాలెన్నో ఉపయోగించబడుతున్న ఈ కాలంలో చాలామందికి చేయవలసిన పనులు ఎక్కువగా, వాటిని చేయడానికి సమయం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుసరించడం మీకు సవాలుగా ఉందా? పరిచర్య చేయడానికి ఎక్కువ సమయముంటే బాగుంటుందని మీరు అభిలషిస్తున్నారా? మనం మన సమయాన్ని అత్యంత ఫలవంతంగా ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?—కీర్త. 90:12; ఫిలి. 1:9-11.
2, 3. సమాచార సాంకేతికత ఎలాంటి సవాళ్లు తీసుకురావచ్చు, మనలో ప్రతీ ఒక్కరం ఎలా స్వయం పరీక్ష చేసుకోవచ్చు?
2 సమయం వృధాచేసేవాటిని గుర్తించండి: మనందరం మన సమయాన్నెలా వినియోగిస్తున్నామో అప్పుడుప్పుడు పరిశీలించుకోవాలి. బైబిలు ఇలా ఉద్బోధిస్తోంది: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” (ఎఫె. 5:15, 16) సమాచార సాంకేతికతా ప్రగతి తీసుకొచ్చే సవాళ్లను పరిశీలించండి. కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తగినరీతిలో ప్రయోజనకరమైనవే కానీ మనం మన సమయాన్నెలా వినియోగిస్తున్నామో జాగ్రత్తగా చూసుకోనట్లయితే అవి మనకు ఉరి కాగలవు.—1 కొరిం. 7:29, 31.
3 మనలో ప్రతీ ఒక్కరు తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి: ‘కేవలం చికాకు కలిగించే ఈ-మెయిల్ సందేశాలు చదువుతూ, వాటికి జవాబులిస్తూ ప్రతీరోజు నేను సమయం గడుపుతున్నానా? నేను తరచూ టెలిఫోన్లు చేస్తూ లేదా అల్పప్రాధాన్య విషయాల గురించి టెక్స్ట్ సందేశాలు పంపిస్తూ ఉంటానా? (1 తిమో. 5:13) నేను ఊరకనే ఇంటర్నెట్ చూస్తూ కూర్చుంటానా లేక టీవీ చూస్తున్నప్పుడు పన్లేకుండా ఛానల్స్ మారుస్తూ ఉంటానా? ఎలక్ట్రానిక్ గేమ్సు ఆడుతూ కూర్చోవడమనేది, దేవుని వాక్య అధ్యయనానికి నాకు సమయం లేకుండా చేస్తోందా?’ ఆలాంటి అలవాట్లు మోసపూరితంగా మన ఆధ్యాత్మికతను హరించివేయవచ్చు.—సామె. 12:11.
4. ఒక యౌవనుడు ఎలాంటి సర్దుబాటు చేసుకున్నాడు, ఎందుకు?
4 సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించడం: ఎలక్ట్రానిక్ పరికరాలు మన సమయాన్ని మన అవధానాన్ని స్వాధీనం చేసుకునే అవకాశముంది. విపరీతంగా కంప్యూటర్ గేమ్‌లు ఆడే ఒక యౌవనుడు ఇలా అంగీకరిస్తున్నాడు: “పరిచర్యకు లేదా క్రైస్తవ కూటానికి వెళ్లేముందు కొన్నిసార్లు నేను గేమ్‌లు ఆడితే, ఆ తర్వాత ఏకాగ్రత నిలపడం నాకు చాలా కష్టమయ్యేది. నేను ఇంటికి వెళ్లిన తర్వాత ఫలాని గేమ్‌లోని సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. నా వ్యక్తిగత అధ్యయనం, క్రమంగా బైబిలు చదవడం కష్టమైంది. దేవుని సేవలో నా ఆనందం సన్నగిల్లడం మొదలైంది.” తను మార్పులు చేసుకోవాలని గుర్తించి ఆయన తన కంప్యూటర్లో గేమ్లన్నింటిని తీసేశాడు. “అలా చేయడం నిజంగా కష్టమైంది. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువగా నేను ఆ గేమ్‌లకు అలవాటుపడ్డాను. అయితే నా మేలుకోసమే వాటిని తీసేశాను అని తెలుసు కాబట్టి నేను గొప్ప విజయం సాధించాననే భావం నాలో కలిగింది” అని ఆయన గుర్తుచేసుకుంటున్నాడు.—మత్త. 5:29, 30.
5. ఆధ్యాత్మిక పనుల కోసం మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు, అలా చేయడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాము?
5 మీరు సర్దుబాట్లు చేసుకోవలసిన రంగాలుంటే అలాంటి చర్యలు తీసుకోవడం అవసరం కావచ్చు. అనవసర కార్యకలాపాల్లో పాల్గొనకుండా మీరు ప్రతీరోజు ఓ అరగంట సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వీలవుతుందా? బైబిలంతా ఒక సంవత్సరంలో చదవడానికి మీరు ప్రతీరోజు ఆ మాత్రం సమయం తీసుకుంటే చాలు. అది ఆధ్యాత్మికంగా ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో గదా! (కీర్త. 19:7-11; 119:97-100) బైబిలు చదవడానికి, కూటాల సిద్ధపాటుకు, క్షేత్ర పరిచర్యకు ఖచ్చితమైన సమయాలు కేటాయించుకోండి. (1 కొరిం. 15:58) ఇలా చేయడం, సమయాన్ని వృధాచేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండడానికే కాక యెహోవా ‘చిత్తమేమిటో గ్రహించడానికి’ కూడా మీకు దోహదపడుతుంది.—ఎఫె. 5:17.