“సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి”
1 మనం మన సహోదరులతో వ్యవహరించేటప్పుడు మనమేం చేసినా వారి క్షేమాభివృద్ధికి దోహదపడేదే చేయాలి. ఇందుకు వారి ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఏది మంచిదన్న విషయమై శ్రద్ధ కలిగివుండాలి. అంతేగాక, మనం ఏదైనా వ్యాపార ఉత్పత్తిని గురించి లేదా ఏవైనా సేవల్ని గురించి ప్రచారం చేసే ఉద్యోగంలో ఉన్నట్లైతే, దానికి సంబంధించి మనం చేసే ఏ పనీ కూడా మన సహోదరుల్ని అభ్యంతరపర్చకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి.—2 కొరిం. 6:3; ఫిలి. 1:9-11.
2 కొందరు సహోదరులు తోటి క్రైస్తవుల్ని కస్టమర్లుగా దృష్టిస్తూ అనేక వ్యాపారాల్లో భాగం వహించారు. అమ్మకాల వ్యాపారాలున్న కొన్ని సంస్థలు, కనబడే ప్రతి ఒక్కర్నీ ఒక కస్టమరుగా దృష్టించమని తమ ప్రతినిధుల్ని ప్రోత్సహిస్తాయి—చివరికి ఒకే మతసంస్థకు చెందిన వారిని కూడా అలానే దృష్టించాలని చెబుతాయి. కొన్ని సందర్భాల్లో, కొందరు సహోదరులు పెద్ద సంఖ్యలో యెహోవాసాక్షుల్ని ఒక్కచోట చేర్చి, వివిధ వ్యాపారాల్లో భాగస్థులు అవ్వమని వారిని ప్రోత్సహించడం జరిగింది. మరితరులు పత్రికల్ని, బ్రోషూర్లను, ఇంటర్నెట్ ద్వారా సంపాదించిన సమాచారాన్ని, ఆడియో వీడియో క్యాసెట్లనూ తోటి విశ్వాసులకు ఆయాచితంగా అందించడం ద్వారా తమ వ్యాపారాల్ని అభివృద్ధిచేసుకుంటారు. ఒక క్రైస్తవుడు ఇలా దైవపరిపాలనా సంస్థలోని పరిచయస్థులను ఉపయోగించుకుంటూ తన ఆధ్యాత్మిక సహోదరుల నుండి ప్రయోజనం పొందడం ఉచితమేనా? కాదు, అలా చేయడం ఉచితం కాదు!—1 కొరిం. 10:23, 24, 31-33.
3 సహోదరులు జాగ్రత్తగా ఉండాలి: దీనర్థం ఒక క్రైస్తవుడు తన సహోదరునితో వ్యాపారం చేయకూడదని కాదు. అలా చేయడం, చేయకపోవడం వ్యక్తిగత విషయం. అయితే, కొందరు దురాశను రేకెత్తించే కొన్ని వ్యాపారాల్ని ప్రారంభించి, వాటిలో తమ భాగస్వాములుగా చేరమనో పెట్టుబడులు పెట్టమనో తోటి విశ్వాసుల్ని కూడా పురికొల్పుతారు. వీటిలో చాలామట్టుకు విఫలం అవుతుంటాయి, తత్ఫలితంగా వాటిలో చేరేవారు భారీ నష్టాల్లో కూరుకుపోతుంటారు. వీరు సులభంగా డబ్బు సంపాదించేద్దామన్న ఉద్దేశంతోనే ఆయా వ్యాపారాల్లో చేరినప్పటికీ, వాటిని ప్రారంభించిన వ్యక్తి తాను బాధ్యుడను కానని భావించడం తప్పు. ఒకవేళ వ్యాపారం గనుక విఫలమైనట్లైతే, తన సహోదరులకు ఆధ్యాత్మికంగా శారీరకంగా ఏమైనా హాని జరుగుతుందేమోనని ఆయన ముందుగానే జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘంలో దైవపరిపాలనా బాధ్యతల్ని కలిగివున్న సహోదరులు, తాము లౌకికంగా చేపట్టే వ్యాపార ప్రయోగాల విషయమై మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సంఘంలోని సహోదరులు వారిని గౌరవంతో చూస్తారు, వారిపై ఎంతో నమ్మకాన్ని ఉంచుతారు. ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం తప్పు అవుతుంది. ఒక సహోదరుడు ఇతరుల నమ్మకాన్ని కోల్పోతే పవిత్ర సేవలో తనకున్న ఆధిక్యతలను ఆయన కోల్పోవచ్చు.
4 “సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగ”నివ్వడమే మన లక్ష్యమై ఉండాలి. (1 కొరిం. 14:26) సంఘంలోనికి వాణిజ్య కార్యకలాపాల్ని ప్రవేశపెట్టి, వాటిని అభివృద్ధి చేసే దేన్నీ మనం అనుమతించకూడదు. సమాజముగా కూడుకోవడానికి మనకుగల లేఖనాధార కారణాలతో వాటికి ఎటువంటి సంబంధమూ లేదు.—హెబ్రీ. 10:24, 25.