‘మేము చెప్పకుండా ఉండలేము’
1 ప్రకటనా పని అతి ప్రాముఖ్యమైనది, దాన్ని యేసు క్రీస్తు ఎంతో శ్రద్ధతీసుకుని నడిపిస్తున్నాడు. (మత్త. 28:20; మార్కు 13:10) ప్రస్తుతం 234 దేశాల్లో ఎంతో చురుకుగా సాక్ష్యం ఇస్తున్నవారి సంఖ్య అరవై లక్షలుగా ఉన్నప్పటికీ మన సాక్ష్యపు పని ఇంతటితో అయిపోయిందని ఏమాత్రం తలంచకూడదు. పని పరిసమాప్తమైందని దేవుడు ప్రకటించేంత వరకు, మనం నేర్చుకున్న విషయాల్ని గురించి ఇతరులకు చెబుతూనే ఉంటాము, వాటిని గురించి ‘మనం చెప్పకుండా ఉండలేము.’—అపొ. 4:20.
2 దేవుని ఆత్మపై ఆధారపడండి: అత్యంత ప్రాముఖ్యమైన ప్రకటనా పనిలో మనల్ని నిరుత్సాహపర్చటానికి సాతాను గొప్ప ఒత్తిడిని తీసుకువస్తాడు. (ప్రక. 12:17) అపరిపూర్ణమైన మన శరీరం కూడా మనల్ని ఎన్నో సమస్యల్తో సతమతం చేస్తుంది. ఇటువంటివి మన అవధానాన్ని ప్రక్కకు మళ్ళించగలవు. అయినా, మనం యెహోవాపై నమ్మకముంచితే, ఎటువంటి అవరోధాన్నైనా అధిగమించేందుకు ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తుంది.
3 మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంపై తీవ్రమైన హింసాజ్వాలలు చెలరేగినప్పుడు సహోదరులు సహాయం నిమిత్తం దేవునికి ప్రార్థించారు. ఆయన వాక్యాన్ని బహు ధైర్యంగానూ నిరాటంకంగానూ ప్రకటించేందుకు సహాయాన్ని అర్థించారు. వారిని తన ఆత్మతో నింపి ప్రకటనా పనిలో కొనసాగటానికి కావాల్సిన ఉత్సాహాన్నీ, కృత నిశ్చయాన్నీ ఇవ్వడం ద్వారా వారి ప్రార్థనలకు యెహోవా సమాధానమిచ్చాడు. దీని ఫలితంగా, వారు వెనుకకు తగ్గక ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ కొనసాగారు.—అపొ. 4:29, 31; 5:42.
4 నిరుత్సాహాన్ని కలిగించే మాటలకు భయపడకండి: ప్రజల్లోని అభిప్రాయాలూ, మనపైని అపవాదులూ, మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. అయితే, పేతురూ ఇతర అపొస్తలులూ యూదుల మహాసభలోని వారితో ధైర్యంగా అన్న మాటల్ని గుర్తుతెచ్చుకోండి, వాటిని మనం అపొస్తలుల కార్యములు 5:29-32 వచనాల్లో చూడవచ్చు. మహాసభలోని ఒక ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అంగీకరించినట్లుగా, దేవుని కార్యాల్ని వ్యర్థపర్చడం అసాధ్యం. ఈ గొప్ప పనికి దేవుని మద్దతు ఉంది, అది మన శక్తి మూలంగా జరగటం లేదు. ఆయన మాత్రమే దీన్ని సాధించగలడు!—జెక. 4:6.
5 సువార్తను అత్యంతాసక్తితో ప్రకటించటానికి మనకు సహాయాన్నివ్వమనీ, మనకు తన ఆత్మను ప్రసాదించమనీ మనం యెహోవాను ప్రతిదినం వేడుకుందాము. యిర్మీయా చెప్పినట్లే, రాజ్య సందేశం మన ఎముకలలో మండుతున్న అగ్నిలా ఉందని మనమూ చెబుదాము. (యిర్మీ. 20:9) మనం మౌనంగా ఉండలేము!