తర్కించే సామర్థ్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవచ్చు
1 “తర్కము” అనే పదానికి “ఒకరి చర్యలను లేదా అభిప్రాయాలను ప్రభావితం చేసేలా వారితో మాట్లాడటం” అని ఒక నిర్వచనం. మీ పరిచర్య మరింత ప్రభావవంతమైనదై ఉండాలంటే, మీరు కలిసేవారితో తర్కించే సామర్థ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉంది. (అపొ. 17:2-4) అయితే ఈ నైపుణ్యాన్ని మీరెలా వృద్ధి చేసుకోవచ్చు?
2 ఇది ధ్యానముతో మొదలౌతుంది: బైబిలు సత్యాల్ని పఠిస్తున్నప్పుడు, సమాచారం గురించి ఆలోచించటం సహాయకరంగా ఉంటుందని మీరు కనుగొనవచ్చు. అందులో కొన్ని కాస్త కష్టంగా ఉన్నట్లు అనిపించినప్పుడు, కొంత పరిశోధన చేసి సమాధానాల గురించి ధ్యానించడానికి సమయం తీసుకోండి. ఇవ్వబడిన వివరణలనే కాకుండా ఆ వివరణలకున్న లేఖనాధార కారణాలను కూడా స్పష్టంగా అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి.
3 పరిచర్య కోసం సిద్ధపడటం ఇమిడివుంది: వివిధ రకాల ప్రజలకు మీరు సత్యాన్ని ఎలా వివరిస్తారో ఆలోచించండి. ఆసక్తిని పెంపొందింపజేసేందుకు ఆలోచన రేకెత్తించే ప్రశ్నను తయారు చేసుకోండి. లేఖనాధార విషయాన్ని ఎలా ముడిపెట్టి తర్కించాలనేది తీర్మానించుకోండి. తలెత్తగల అభ్యంతరాలను ఊహించి, వాటిని ఎలా చర్చించాలో ఆలోచించండి. అందజేయబోతున్న ప్రచురణలో నుండి, చక్కగా అన్వయించే ఒక ఉన్నతాంశాన్ని నొక్కి చెప్పండి.
4 యేసు మాదిరిని అనుసరించండి: లేఖనాలనుంచి ప్రభావవంతంగా తర్కించే విషయంలో యేసు అతిచక్కని మాదిరినుంచాడు. ఆయన ఎలా బోధించాడో విశ్లేషించటానికి లూకా 10:25-37లో కనిపించే వృత్తాంతాన్ని పరిశీలించండి. ఈ విధానాన్ని గమనించండి: (1) ప్రజల ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు వారి అవధానాన్ని లేఖనాలవైపుకు మళ్లించండి. (2) వారి అభిప్రాయాన్ని అడిగి, వారు యుక్తమైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు వారిని మెచ్చుకోండి. (3) ప్రశ్నకు లేఖనాలకు మధ్యనున్న సంబంధం ఉన్నతపర్చబడేలా నిశ్చయపర్చుకోండి. (4) సమాధానం యొక్క అసలు అర్థం అవగతమయ్యిందని నిశ్చయపర్చుకునేందుకు హృదయరంజకమైన ఒక దృష్టాంతాన్ని ఉపయోగించండి.—మార్చి 1, 1986, కావలికోట, (ఆంగ్లం) 27-8 పేజీలు, 8-10 పేరాలు చూడండి.
5 మనకివ్వబడిన ఉపకరణాన్ని ఉపయోగించండి: లేఖనాలనుండి తర్కించుట (ఆంగ్లం) అనేది క్షేత్ర పరిచర్యలో కరదీపికగా ఉండేందుకు ప్రచురించబడింది. అందులోని ఉపోద్ఘాతాలు, సంభాషణను ఆపేవారికి ఇవ్వాల్సిన సమాధానాలు, తర్కబద్ధమైన విషయాలు తర్కించే మన సామర్థ్యాన్ని వృద్ధిచేసుకోవటానికి సహాయం చేస్తాయి. తర్కించుట పుస్తకం ఒక విలువైన ఉపకరణం, దాన్ని మనం ఎల్లప్పుడూ సేవలో మనతోపాటు ఉంచుకోవటమే కాక బైబిలు చర్చల్లో భాగం వహిస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించటానికి సంకోచించకూడదు. దాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించాలో చూసేందుకు అందులోని 7-8 పేజీలను సమీక్షించండి.
6 తర్కించే మీ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవటం ప్రకటనాపనిలోనూ, బోధనాపనిలోనూ మీ నైపుణ్యాన్ని పెంచుతుంది. అది మీకూ పరిచర్యలో మీరు కలిసే వారికీ విలువైన ఆశీర్వాదాలను తీసుకువస్తుంది.