సత్ప్రవర్తన ద్వారా సాక్ష్యమివ్వడం
1 అదుపులేని నేటి సమాజంలో, అనేకమంది పిల్లలు మాదక ద్రవ్యాల మూలంగా, అనైతికత మూలంగా, తిరుగుబాటు మూలంగా, హింస మూలంగా తమ జీవితాల్ని నిర్లక్ష్యంగా సర్వనాశనం చేసుకొంటున్నారు. దానికి భిన్నంగా, క్రైస్తవ సంఘంలోని చక్కని యౌవనుల మాదిరికరమైన ప్రవర్తన చూడడానికి సేదదీర్చేదిగానూ, యెహోవాకు రమ్యమైనదిగానూ ఉంది. ఇతరులు సత్యంవైపు ఆకర్షించబడేలా అది ఓ శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తోంది.—1 పేతు. 2:12.
2 క్రైస్తవ యౌవనుల సత్ప్రవర్తన అనేది దాన్ని గమనించేవారిపై అనుకూలమైన ముద్రను వేస్తుందని అనేక అనుభవాలు చూపిస్తున్నాయి. ఒక స్కూల్ టీచర్ తన విద్యార్థినియైన ఒక చిన్నారి సాక్షి గురించి మాట్లాడుతూ ఈ అమ్మాయి దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడు అని క్లాసులో ఉన్నవారందరికీ చెప్పింది. ఆ పాప ఎప్పుడూ మర్యాదకరంగానే ప్రవర్తించేది గనుకనే ఆమె అలా అంది. మరో టీచర్ సొసైటీకి రాస్తూ ఇలా అంది: “మీ మతంలో ఉన్న సంస్కారవంతులైన పిల్లలనుబట్టి మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను . . . మీ చిన్నారులు నిజంగా మాదిరికరమైన వాళ్లు. వాళ్లు పెద్దల్ని గౌరవిస్తారు, సభ్యతగలవారు, మర్యాదకరమైన రీతిలో తయారౌతారు. తమ బైబిళ్లలో ఉన్న విషయాల గురించి వారికి బాగా తెలుసు! మతమంటే అలా ఉండాలి!”
3 మరొక స్కూల్ టీచర్ తన క్లాసులోని ఏడేళ్ల ఒక సాక్షి చూపించిన సత్ప్రవర్తనకు ఎంతో ముగ్దురాలైంది. క్లాసులోని ఇతర బాలురతో పోల్చితే కొట్టొచ్చినట్టు కనబడే ఆ బాలుని సాత్వికమైన, ప్రీతికరమైన వ్యక్తిత్వం ఆమెను ఆకట్టుకొంది. అతని మతపరమైన నమ్మకాల విషయంలో అతనికున్న గంభీరమైన దృక్పథాన్నిబట్టి ఆమె ముగ్దురాలైంది. తాను నమ్మినవాటినిబట్టి భిన్నంగా ఉన్నందుకు అతడు సిగ్గుపడలేదు. అతని మనస్సాక్షి శిక్షణను పొందిందనీ, అతడు “మేలు కీడులను వివేచించ”గల్గుతున్నాడనీ ఆమె గ్రహించగల్గింది. (హెబ్రీ. 5:14) చివరకు, ఆ పిల్లవాని తల్లి టీచర్ను సందర్శించింది, బైబిలు పఠనం ఆరంభమైంది. కాలక్రమంలో, ఆ టీచర్ బాప్తిస్మం తీసుకొంది, ఆ తర్వాత క్రమ పయినీరైంది!
4 తన స్కూల్లోని ఒక సాక్షి చూపించిన సత్ప్రవర్తన ద్వారా ఒక యౌవనస్థుడు ప్రభావితుడయ్యాడు. ఆ సాక్షి నిజంగా భిన్నమైన వ్యక్తి—ఎంతో మర్యాదస్థురాలు, బాగా చదువుతుంది, ఎల్లప్పుడూ మర్యాదకరమైన దుస్తుల్ని వేసుకొంటుంది; ఇతర అమ్మాయిల్లాగాక, ఆ అమ్మాయి మగవాళ్ళ దగ్గర వగలుపోలేదు. ఆ అమ్మాయి బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవిస్తుందనే విషయాన్ని ఆయన గ్రహించగలిగాడు. ఆమె మత నమ్మకాలను గురించి ఆ అమ్మాయిని అడిగి, తాను తెలుసుకొన్న వాటినిబట్టి ఆయన ఎంతగానో ముగ్దుడయ్యాడు. ఆయన పఠనం చేయనారంభించి, త్వరలోనే బాప్తిస్మం పొందాడు. చివరకు పయినీరు పరిచర్యలోనూ, బేతేలు సేవలోనూ భాగం వహించాడు.
5 మీరు ఇతరులకు శ్రేష్ఠమైన సాక్ష్యాన్ని ఇవ్వాలనుకొనే క్రైస్తవ యౌవనుడు(రాలు) అయితే, మీ ప్రవర్తనను అన్ని విధాలా గమనించి చూసుకోండి. ఇహలోకపు అదుపులేని దృక్పథాలనూ, వైఖరులనూ, లేదా జీవన శైలులనూ అంగీకరించేవారిగా తయారుకాకుండా మీ ప్రవర్తనను కాపాడుకోండి. క్షేత్రసేవలో, క్రైస్తవ కూటాల్లో పాల్గొంటున్నప్పుడు మాత్రమేగాక స్కూల్లోనూ, వినోద కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడూ మీరు మీ మాటలోనూ, డ్రస్సులోనూ, కన్పించేతీరులోనూ ఉన్నతమైన మాదిరిని ఉంచండి. (1 తిమో. 4:12) మీ సత్ర్పవర్తన ద్వారా ‘మీ వెలుగును ప్రకాశింపజేయడం’ మూలంగా సత్యమందు ఎవరైనా ఆసక్తిని చూపించినప్పుడు మీకు నిజమైన ఆనందం ఉంటుంది.—మత్త. 5:16.