జ్యోతుల్లా ప్రకాశిస్తున్న యౌవనులు
1. క్రైస్తవులు వేరుగా కనిపిస్తారని బైబిలు ఎలా సూచిస్తోంది, నేటి క్రైస్తవ యౌవనులకు ఆ మాటలు ఎలా అన్వయిస్తాయి?
1 యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు.” (మత్త. 5:14, 16) సూర్యకాంతిలో కొండమీదున్న పట్టణం తేటగా కనిపించే విధంగా వారు కూడా గమనార్హ మైన రీతిలో వేరుగా కనిపిస్తారు. నేడు, చాలామంది యౌవన క్రైస్తవులు తమ మంచి ప్రవర్తన ద్వారా, ఉత్సాహవంతంగా సాక్ష్యమివ్వడం ద్వారా “లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు.”—ఫిలి. 2:14-16 ఎ; మలా. 3:18.
2. ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు మీరు సాక్ష్యమిచ్చే కొన్ని మార్గాలేమిటి?
2 పాఠశాలలో: మీరు పాఠశాలలో ఎలా సాక్ష్యమివ్వవచ్చు? కొందరు యౌవనులు మాదకద్రవ్యాలు, పరిణామ సిద్ధాంతం, ప్రకృతి విపత్తుల వంటి కొన్ని అంశాల మీద తరగతిలో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు దొరికే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఒక సహోదరి, ఉగ్రవాదం మీద వ్యాసం వ్రాయడానికి నియామకం పొందినప్పుడు, మానవజాతికి దేవుని రాజ్యమే నిజమైన నిరీక్షణ అనే విషయం గురించి సాక్ష్యమివ్వడానికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. బాగా ఆలోచించి వ్రాసిన ఆ నివేదికనుబట్టి ఆమె ఉపాధ్యాయిని ప్రభావితురాలయ్యింది, అది ఇంకా ఎక్కువ సాక్ష్యమిచ్చేందుకు అవకాశాన్నిచ్చింది.
3. మీ ప్రవర్తన ద్వారా పాఠశాలలో మీ వెలుగును ఎలా ప్రకాశింపజేయవచ్చు?
3 జ్యోతుల్లా ప్రకాశించే మరో మార్గం, మీ ప్రవర్తన, నిరాడంబరమైన వస్త్రధారణ, కనబడే తీరు ద్వారా. (1 కొరిం. 4:9; 1 తిమో. 2:9) మీ ప్రవర్తన వేరుగా ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు గమనించినప్పుడు, కొంతమంది మీ మంచి ప్రవర్తన కారణంగా సత్యంవైపు ఆకర్షించబడవచ్చు, దానివల్ల బైబిలు సత్యాలను పంచుకునే అవకాశం మీకు లభించవచ్చు. (1 పేతు. 2:12; 3:1, 2) దైవిక ప్రవర్తన ప్రదర్శించడం సులభం కాకపోవచ్చు, కానీ యెహోవా మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు. (1 పేతు. 3:15-17; 4:14) సువార్త విషయంలో ఆసక్తి రేకెత్తించడానికి మీరు విరామ సమయాల్లో బైబిలు సాహిత్యాలను చదవవచ్చు లేక ఇతరులు చూడగలిగే స్థలంలో వాటిని ఉంచవచ్చు.
4. పాఠశాలలో సాక్ష్యమివ్వడంవల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?
4 పాఠశాలలో మీ వెలుగును ప్రకాశింపజేయడం మీ విశ్వాసాన్ని బలపరచడమే కాక, యెహోవాను సేవించడంలో ఆరోగ్యకరమైన అతిశయాన్ని వృద్ధిచేసుకునేందుకు కూడా మీకు సహాయం చేస్తుంది. (యిర్మీ. 9:24) అది మీకు రక్షణగా కూడా పనిచేస్తుంది. ఒక సహోదరి ఇలా చెప్పింది: “నా నమ్మకాల గురించి మాట్లాడడంవల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే, బైబిలు నియమాలకు వ్యతిరేకంగా ఉన్న క్రియలను చేయడానికి విద్యార్థులు నన్ను బలవంతం చేయరు.”
5. (ఎ) కొంతమంది యౌవనులు తమ పరిచర్యను ఎలా విస్తృతపరచుకుంటున్నారు? (బి) మీ ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏమిటి?
5 పరిచర్యను విస్తృతపరచుకోవడం: చాలామంది యౌవనులు జ్యోతుల్లా ప్రకాశిస్తున్న మరో మార్గం, తమ పరిచర్యను విస్తృతపరచుకోవడం. ఒక సహోదరుడు, ఉన్నత పాఠశాలను ముగించిన తర్వాత రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేయడానికి వెళ్ళాడు. ఒకే ఒక పెద్ద ఉన్న చిన్న సంఘంలో సభ్యుడయ్యాడు. “నేను ఎంతో ఆహ్లాదకరమైన రీతిలో నా జీవితం గడుపుతున్నాను. పరిచర్య ఎంతో ఉత్తేజకరంగా ఉంది! చెప్పే విషయాలన్నిటినీ వినడానికి ఇక్కడి ప్రజలు ఇష్టపడతారు కాబట్టి, మేము ప్రతీ ఇంట్లో దాదాపు 20 నిమిషాలు మాట్లాడతాం” అని ఆయన తన స్నేహితునికి వ్రాశాడు. ఆయన ఇంకా ఇలా వ్రాశాడు: “యౌవనులందరూ నేను తీసుకున్న చర్యనే తీసుకొని నేను పొందుతున్న అనుభూతినే పొందాలని ఆశిస్తున్నాను. మనకు ఉన్నవాటన్నిటితో యెహోవాను సేవించడంకన్నా మెరుగైనది మరొకటి లేదు.”
6. మీ సంఘంలోని యౌవనుల విషయంలో మీరు గర్వించేలా చేసే విషయాలు ఏమిటి?
6 లోకంలో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న యౌవనులైన మిమ్మల్నిబట్టి మేమెంతో గర్విస్తున్నాం! (1 థెస్స. 2:20) మీరు యెహోవాను మీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో, బలముతో సేవిస్తున్నప్పుడు మీరు ప్రతిఫలంగా ‘ఇప్పుడు నూరంతలు అనుభవిస్తారు, రాబోయే లోకంలో నిత్యజీవాన్ని’ అనుభవిస్తారు.—మార్కు 10:29, 30; 12:30.