మరలా సేవ చేసేలా వారికి సహాయం చేయండి
1 తన తోటి క్రైస్తవులకు సంభవించగల ఆత్మీయ ప్రమాదాన్ని గుర్తిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.” (రోమా. 13:11) ఆత్మీయంగా మత్తులైన తన సహోదరుల విషయమై పౌలు చింతించాడు; పునర్నవీన కార్యాలకై వారిని ఉజ్జీవులను చేయాలని ఆయన ఆతురతతో ఉన్నాడు.
2 ఈ పాత లోకపు రాత్రి గడిచి నూతన లోకపు అరుణోదయం మన ఎదుటే ఉందని నిజంగా చెప్పవచ్చు. (రోమా. 13:12) సువార్త ప్రచారకులుగా మనతో సహవసించడం ఆపివేసిన మన సహోదరుల విషయమై చింతించడానికి మనకు మంచి కారణముంది. గత సేవా సంవత్సరంలో, కేవలం ఇండియాలోనే 230 మంది కన్నా ఎక్కువ ప్రచారకులు తిరిగి కార్యశీలురుగా చేయబడ్డారు. మరలా యెహోవాకు సేవ చేసేలా ఇతర నిష్క్రియులకు మనం ఎలా సహాయం చేయగలము?
3 పెద్దలు ఏమి చేయగలరు: నిష్క్రియులైన అనేకమంది సత్యాన్ని విడనాడలేదు; వారు కేవలం నిరుత్సాహం, వ్యక్తిగత సమస్యలు, ధనాపేక్ష, లేక ఇతర జీవితపు చింతల వలన ప్రకటనా పనిని ఆపివేశారు. (లూకా 21:34-36) ఒకవేళ సాధ్యమైతే, వారు నిష్క్రియులవ్వకముందే వారికి సహాయం చేయడం చాలా మంచిది. ఒక ప్రచారకుడు సేవా రిపోర్టు ఇవ్వడంలో క్రమం తప్పితే సంఘ కార్యదర్శి సంఘ పుస్తక పఠన నిర్వాహకుని అప్రమత్తం చేయాలి. కాపరి సందర్శనానికి ఏర్పాట్లు చేయవచ్చు. వారు సమస్యకుగల అసలు కారణాన్ని, సహాయం ఎలా ఇవ్వవచ్చన్నదాన్ని నిర్ధారించడానికి ప్రయత్నించాలి.—సెప్టెంబరు 15, 1993 కావలికోట (ఆంగ్లం), పేజీలు 20-3 చూడండి.
4 ఇతరులు ఎలా సహాయం చేయగలరు: మనలో అనేకమందికి నిష్క్రియులైన వారిలో ఎవరో ఒకరు తెలుసు. ఆ వ్యక్తి గతంలో మనకు ఎంతో సన్నిహితుడై ఉండవచ్చు. సహాయం చేయడానికి మనం ఏమి చేయవచ్చు? కొంచెంసేపు మాట్లాడడానికి ఎందుకు వెళ్లకూడదు. ఆయన సహచర్య కొరతను మీరు అనుభవిస్తున్నారని చెప్పండి. ప్రసన్నంగాను, అనుకూల దృక్పథంతోను ఉండండి. ఆయన ఆత్మీయ రోగిగా ఉన్నాడనే విషయాన్ని కనబరచకుండా మీ శ్రద్ధను వ్యక్తం చేయండి. క్షేమాభివృద్ధికరమైన అనుభవాలు లేక సంఘం సాధించే ఇతర మంచి విషయాలను గురించి చెప్పండి. “దైవికశాంతి సందేశకులు” జిల్లా సమావేశాన్ని గురించి ఉత్సాహంతో చెప్పి, ఆయనను హాజరవ్వమని ప్రోత్సహించండి. ఏ ఇతర వాటికన్నా సంఘంతో మరలా సహవసించడం ఆయనకు ఎంతో సహాయం చేయగలదు. ఆయనతో కలిసి కూటాలకు వచ్చే విషయాన్ని ప్రతిపాదించండి. మీరు పొందిన ప్రతిస్పందన గురించి పెద్దలకు తెలియనివ్వండి.
5 నిష్క్రియుడైన ఒక వ్యక్తి మరలా కూటాలకు వస్తే, బహుశా గతంలో తనకు తెలిసిన వారిని ఎదుర్కోవడం తనకు ఇబ్బందికరమని అనిపించవచ్చు. “మీరెక్కడికి వెళ్లారు?” అని అడగకండి. బదులుగా, ఆయనను ఆహ్వానించండి. సంభాషణలో ఆయనను ఇమడ్చండి. ఆయనకు తెలియని వారిని ఆయనకు పరిచయం చేయండి. పాటల పుస్తకము, పఠించబడుతున్న ప్రచురణలు ఆయన దగ్గర ఉన్నాయో లేవో చూసుకుని కూటము జరుగుతుండగా ఆయనతో కూర్చోండి. మరలా రమ్మని ఆయనను ప్రోత్సహించండి, ఏదైనా అవసరముంటే మీ సహాయాన్ని అందించండి.
6 తప్పిపోయిన వారి కొరకు హృదయపూర్వక అనురాగం కలిగివుండండి, అటువంటి వారు ఆత్మీయంగా కోలుకుంటే యెహోవా, యేసుక్రీస్తు ఆనందిస్తారు. (మలా. 3:7; మత్త. 18:12-14) యెహోవాకు మరలా సేవ చేసేలా వారికి సహాయపడడంలో విజయవంతులమైతే మనం అదే ఆనందాన్ని పొందగలము.