వారి విశ్వాసాన్ని అనుకరించండి
1 అపొస్తలుడైన పౌలు, విశ్వాసాన్ని “నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది” అని నిర్వచించాడు. “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” అని కూడ ఆయన అన్నాడు. (హెబ్రీ. 11:1, 6) విశ్వాసాన్ని ఉంచుడని, దానిలో స్థిరపరచబడుడని, దాన్ని వెంటాడుడని పౌలు మనకు ఉద్బోధించాడు.—2 కొరిం. 4:13; కొలొ. 2:7; 2 తిమో. 2:22.
2 బైబిలులో విశ్వాసం యొక్క అనేక విశేష ఉదాహరణలు వివరించబడ్డాయి. హెబ్రీయులు 11వ అధ్యాయంలో, పౌలు అచంచలమైన విశ్వాసాన్ని కనపర్చిన సాక్షుల ఒక పొడవైన చిట్టాను ఇచ్చాడు. ఈ చిట్టాలో తన విశ్వాసం విషయమై మొట్టమొదట హతసాక్షి అయిన హేబెలు ఉన్నాడు. చిట్టాలో నోవహు ఉన్నాడు ఎందుకంటే, ఆయన తన విశ్వాసం ద్వారా తన ఇంటివారిని రక్షించడానికి అవసరమైన దైవిక భయాన్ని చూపించాడు. అబ్రాహాము తన విశ్వాస విధేయతలనుబట్టి మెచ్చుకోబడ్డాడు. మోషే ప్రశంసించబడ్డాడు, ఎందుకంటే తన విశ్వాసం ద్వారా ఆయన అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడైయుండెను. ఉదాహరణల చిట్టా ఎంత పొడుగ్గా ఉందంటే వారందరిని గూర్చి తాను వివరించుకుంటూపోతే తనకు సమయము చాలదని పౌలు అన్నాడు. వారి ‘పరిశుద్ధమైన ప్రవర్తనను, భక్తితో కూడిన కార్యాలను’ మనం సమీక్షించుకోవడం ద్వారా మన విశ్వాసాన్ని బలపర్చుకోగలందులకు మనమెంత కృతజ్ఞులము!—2 పేతు. 3:11.
3 మొదటి శతాబ్దంలో యేసు ఈ ప్రశ్న అడిగాడు: “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” (లూకా 18:8) మరయితే, నేడు మనం మనమధ్య సజీవ ఉదాహరణలను కలిగివున్నామా? బైబిలు కాలాల్లో దేవుని ప్రజల విషయంలో నిజమైనట్టే యెహోవాయందు అచంచల విశ్వాసంగల స్త్రీపురుషులను, యౌవనులను, వృద్ధులను చూడగలమా?
4 విశ్వాసం యొక్క ఆధునిక దిన ఉదాహరణలు: విశ్వాసం యొక్క విశేష ఉదాహరణలు మనచుట్టూ కనబడతాయి! మన మధ్య నాయకత్వం వహిస్తున్న అధ్యక్షుల విశ్వాసం అనుకరించదగ్గది. (హెబ్రీ. 13:7) కానీ విశ్వాసం విషయంలో వీరు మాత్రమే అనుకరణీయులు కాదు. యెహోవాకు చేసిన విశ్వసనీయ సేవలో గొప్ప రికార్డును కలిగివున్న యథార్థపరులు ప్రతి సంఘంతో సహవసిస్తున్నారు. వారు తరచూ చాలా కష్టతర పరిస్థితులలో ఆ సేవ చేశారు.
5 వ్యతిరేకిస్తున్న భర్తలనుండి సంవత్సరాల తరబడి వ్యతిరేకతను సహిస్తున్న విశ్వాసం గల మన సహోదరీలను మనం అభినందించాలి. ఒంటరి తల్లి లేక తండ్రి ఒంటరిగా పిల్లలను పెంచాల్సిన సవాలును ఎదుర్కోవలసి వచ్చింది. ఏమాత్రం కుటుంబ మద్దతు లేకపోయినప్పటికీ సంఘ కార్యకలాపాల నుండి ఎన్నడూ తప్పిపోని వృద్ధ విధవరాండ్రు మనమధ్య ఉన్నారు. (లూకా 2:37 పోల్చండి.) దీర్ఘకాల ఆరోగ్య సమస్యలను సహిస్తున్న వారి విశ్వాసాన్ని చూసి మనం అబ్బురపడతాము. అదనపు సేవాధిక్యతలు పొందకుండా అడ్డగించే కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, అనేకమంది యథార్థంగా సేవ చేయడంలో కొనసాగుతున్నారు. పాఠశాలలో వ్యతిరేకత ఉన్నా నిర్భీతితో విశ్వాసాన్ని చూపించిన యౌవన సాక్షులు ఉన్నారు. చెప్పలేనన్ని సమస్యలు ఉన్నప్పటికీ సంవత్సరం తరువాత సంవత్సరం పట్టుదల కలిగివున్న నమ్మకమైన పయినీర్లను చూస్తుండగా మన దైవిక భక్తి మరింత బలంగా వృద్ధిచెందుతుంది. రాజ్య సేవలోని అనుభవాలన్నింటినీ, ఈ సహోదర సహోదరీలు చేసిన విశ్వాస క్రియలన్నింటినీ వివరించడానికి ప్రయత్నిస్తే పౌలుకు వలె మనకూ సమయము చాలదు!
6 విశ్వాసం గల వ్యక్తుల ఉదాహరణలు మనకు ఆదరణను, ప్రోత్సాహాన్నీ ఇస్తాయి. (1 థెస్స. 3:7, 8) ‘సత్యవర్తనులు యెహోవాకు ఇష్టులు’ గనుక మనం వారి విశ్వాసాన్ని అనుకరించడం మంచిదే.—సామె. 12:22.