మీరు మరీ బిజీగా ఉన్నారా?
1 మనం ‘ఎల్లప్పుడూ చేయడానికి ప్రభువు పనిలో ఎంతో ఉంది’ అని పౌలు ఉద్బోధించాడు. (1 కొరిం. 15:58) వ్యక్తిగత పఠనానికి, పరిచర్యలో క్రమంగా భాగం వహించడానికి, కూటాలకు నిష్ఠగా హాజరు కావడానికి, సంఘ నియామకాలను శ్రద్ధగా నిర్వర్తించడానికి మనం క్రమమైన దినచర్యను కలిగి ఉండాలని మనకు బోధించబడింది. వీటికి తోడు, మన సహాయం అవసరమున్న వారికి మనం తప్పకుండా సహాయం చేయాలని కూడా చెప్పబడుతుంది. చేయడానికి ఎంతో ఉన్నందున, పని అమితంగా ఉన్నట్లుగా మనం కొన్నిసార్లు భావించి, మన పని భారాన్ని తగ్గించుకునే మార్గాలను కనుక్కోవాలని మనమనుకోవచ్చు.
2 కొన్ని కార్యక్రమాలను వదిలిపెట్టుకోవడాన్ని లేదా వాటి పరిమాణాన్ని తగ్గించుకోవడాన్ని జ్ఞానయుక్తమైనదిగా మరియు సహేతుకమైనదిగా చేసే పరిస్థితులు ఉండవచ్చు. ఇతరులు తమ నుండి కోరినవన్నీ తాము చేయాలని ఆశించబడుతుందని కొందరు వ్యక్తులు భావించవచ్చు. ఈ విషయంలో సమతుల్యత లేకపోవడం చివరికి వినాశనకరం కాగల ఊపిరి సలపలేని పరిస్థితిని, ఒత్తిడిని కలుగజేస్తుంది.
3 సమతుల్యతతో ఉండండి: సమతుల్యతకు కీలకం “శ్రేష్ఠమైన కార్యములను వివేచింప”వలెనన్న పౌలు ఉపదేశంలో ఉంది. (ఫిలి. 1:10) నిజంగా ప్రాముఖ్యమైన విషయాలపై మనం శ్రద్ధ కేంద్రీకరించాలన్నదే దాని భావం, సమయమూ పరిస్థితులు అనుమతిస్తున్నట్లయితే తక్కువ ప్రాముఖ్యత గల విషయాలపై శ్రద్ధ చూపండి. ప్రాముఖ్యమైన విషయాల్లో కుటుంబ బాధ్యతలు తప్పకుండా మొదట వస్తాయి. కొన్ని లౌకిక బాధ్యతలతో కూడా వ్యవహరించాలి. అయితే, మన ముఖ్యమైన విషయాలు మనం మొదట రాజ్యాన్ని వెదకాలి అనే సూత్రంపై ఆధారపడి ఉండాలని యేసు బోధించాడు. యెహోవాకు మన సమర్పణను నెరవేర్చేందుకు అనుమతించే విషయాలను మనం మొదట చేయాలి.—మత్త. 5:3; 6:33.
4 దీనిని మనస్సులో పెట్టుకుని, మన సోత్సాహ పట్టికలోని అనవసరమైన వ్యక్తిగత పనులను, అమితమైన వినోద కార్యక్రమాలను, ఇతరులకు మాటిచ్చిన అంత అవసరం లేని విషయాలను తీసివేసేలా చూసుకోండి. ప్రతివారం కొరకైన మన కార్యక్రమాన్ని ఆలోచించుకోవడంలో, కావలసినంత వ్యక్తిగత పఠనానికి, సేవలో సహేతుకమైన భాగాన్ని వహించేందుకు, కూటాలకు హాజరయ్యేందుకు, మన ఆరాధనతో దగ్గరి సంబంధం గల ఇతర విషయాలకు మనం సమయాన్ని కేటాయించుకోవాలి. రాజ్యాన్ని మొదట ఉంచే సమతుల్య క్రైస్తవులుగా ఉండాలనే మన ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకునేందుకు మిగిలిన విషయాలు ఎంతమేరకు తోడ్పడతాయనే దానినిబట్టి మిగిలిన సమయాన్ని వాటికి కేటాయించవచ్చు.
5 అలా చేసినప్పటికీ కూడా మన బరువు మోయలేనంతగా ఉన్నట్లు మనం భావించవచ్చు. అలాగైతే, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అన్న యేసు ఆహ్వానానికి మనం ప్రతిస్పందించవలసిన అవసరం ఉంది. (మత్త. 11:28) అలాగే, సొమ్మసిల్లినవారికి బలమునిస్తున్న, ‘అనుదినము మన భారము మోయుచున్న’ యెహోవా వైపుకు చూడండి. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అని వాగ్దానం చేస్తున్నాడు. (కీర్త. 55:22; 68:19; యెష. 40:29) మన ప్రార్థనలకు జవాబు లభిస్తుందని, దైవపరిపాలనా పనులతో నిండిన జీవితంలో కొనసాగడాన్ని అది మనకు సాధ్యం చేస్తుందని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు.
6 ప్రయోజనకరమైన రాజ్యాసక్తులను వెంబడించడంలో బిజీగా ఉండేలా రూఢి చేసుకుంటుండగా, మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి మనం సంతోషంగా ఉండగలం.—1 కొరిం. 15:58.