ఎల్లప్పుడూ చేయడానికి ఎంతో ఉంది
1 యెహోవా ప్రజలు ఖాళీ లేని ప్రజలు. మనకు మన కుటుంబపరమైన, ఉద్యోగ సంబంధమైన, పాఠశాల సంబంధమైన అనేక బాధ్యతలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాక ఎల్లప్పుడు ‘ప్రభువు కార్యమునందు ఎంతో చేయడానికి’ ఉంది. (1 కొరిం. 15:58) మనం వారపు సంఘ కూటాలకు తప్పనిసరిగా సిద్ధపడాలి, హాజరు కావాలి. మనం ఒక్క వారం కూడా ప్రాంతీయ సేవలో కొంతైనా పాల్గొనకుండా ఉండకూడదని ప్రోత్సహించబడుతున్నాము. వ్యక్తిగత, కుటుంబ బైబిలు పఠనానికి సరిపడేంత సమయాన్ని క్రమంగా కేటాయించాలి. పెద్దలకు, పరిచారకులకు సంఘ నియామకాలు అనేకము ఉన్నాయి. అవసరతలో ఉన్న వారు సహాయం చేయమని కొన్నిసార్లు మనల్ని అడుగుతారు.
2 అప్పుడప్పుడు, మనలో కొందరు మనం చేయవలసిన వాటన్నింటిని బట్టి కలత చెందినట్లు భావించవచ్చు. అయినప్పటికీ, ఖాళీ అనేది లేనే లేని ప్రజలు సమతుల్యతను, సరైన నిరీక్షణను కాపాడుకుంటే, ఎక్కువ సంతోషంగల వారి కోవకు చెందినవారవుతారు.—ప్రసం. 3:12, 13.
3 అపొస్తలుడైన పౌలుకు కూడా చేయడానికి ఎంతో ఉండేది. ఆయన గుడారాలను కుట్టేవానిగా పనిచేయడం ద్వారా, తన వ్యక్తిగత అవసరతలను తీర్చుకొంటూ ఇతర అపొస్తలులకన్నా ఎక్కువ కష్టపడి పని చేశాడు. ఆయన మంద కాపరిగా తన బాధ్యతలను అశ్రద్ధ చేయకుండానే, ఇంటింటా, బహిరంగంగా ప్రకటిస్తూ, అలసట ఎరుగని సువార్తికునిగా పనిచేశాడు. (అపొ 20:20, 21, 31,34, 35) ఖాళీలేని పట్టిక ఉన్నప్పటికీ, పౌలు ఎల్లప్పుడు యెహోవా సేవలో ఎక్కువ చేయడానికి ఆతురతతో ఉండేవాడు.—రోమా. 1:13-15 పోల్చండి.
4 పౌలు బలం కొరకు యెహోవాపై ఆధారపడుతూ తన సమతుల్యతను, సంతోషంగల హృదయాన్ని కాపాడుకున్నాడు. ఆయన తన పరిచర్య ప్రతిఫలదాయకంగాను, సంతృప్తికరమైనదిగాను ఉందని గ్రహించాడు. (ఫిలి. 4:13) దేవుడు తన పనిని మరిచిపోడని అతనికి తెలుసు. (హెబ్రీ. 6:10) యెహోవాను తెలుసుకొనుటకు యితరులకు సహాయపడడంలోని సంతోషం అతనికి శక్తినిచ్చింది. (1 థెస్స. 2:19, 20) బైబిలు ఆధారితమైన తన నిరీక్షణను గ్రహించడం వలన కలిగిన విశ్వాసం అతడు కష్టపడి పని చేయడానికి ప్రేరేపించింది.—హెబ్రీ. 6:11.
5 మనం కష్టపడినదాని నుండి వచ్చిన మంచి ఫలితాలను గూర్చి కూడా మనం తలంచాలి. వారపు కూటాలకు మనం హాజరు కావడం, వాటిలో భాగం వహించడం యితరులను పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి దోహదపడుతాయి. (హెబ్రీ. 10:24, 25) ఆసక్తిగల, క్రొత్తవాళ్ళు మనతో సహవసిస్తుండగా, అందరికి సువార్త అందజేయడానికి మనం హృదయపూర్వకంగా చేసే ప్రయత్నాలు, సంఘ పురోభివృద్ధికి దోహదపడుతాయి. (యోహా. 15:8) అవసరతలోవున్న యితరులకు సహాయం చేయడం, సన్నిహిత భావాన్ని, సంఘంలో ఒకే కుటుంబమనే భావాన్ని పెంపొందింపజేస్తుంది. (యాకో. 1:27) అంతేకాక, పౌలువలె, ఉపయోగకరమైన పనుల్లో నిమగ్నమై ఉండడం యెహోవా దేవుణ్ణి బాగా ప్రీతిపరుస్తుందని మనం మరువకూడదు. ఆయనను సేవించడం గొప్ప ఆధిక్యతయని మనం ఎంచుతాము. మనకు ఇంతకన్నా మేలైన జీవిత విధానం లేదు!
6 ఎక్కువగా చేయడంలో అదనపు ప్రయోజనముంది. ఆరోగ్యకరమైన ఆత్మీయ కార్యక్రమాన్ని అనుసరించడంలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు, సమయం అతి త్వరగా గతించిపోతున్నట్లుగా ఉంటుంది. ఒక్కో రోజు గతించిపోవడం, క్రొత్త లోకానికి మనల్ని మరింత సమీపస్థులనుగా చేస్తుందని గ్రహించడంతో, యిప్పటి మన ఖాళీలేని జీవితాన్ని సంతోషంగా అంగీకరిస్తాము. నిష్ఫలమైన లోక వినోదాల్లో మునిగిపోడానికి మనకు ఎక్కువ సమయం లేని విధంగా ఖాళీగా ఉండకపోవడంలోని జ్ఞానాన్ని మనం గ్రహిస్తాము.—ఎఫె. 5:15, 16.
7 నిజంగా, ప్రభువు కార్యమునందు చేయడానికి ఎంతో ఉంది. మన పరిచర్యను ఉత్సాహపూరితంగాను, ప్రతిఫలదాయకంగాను చేసే యెహోవా దేవునిపై, యేసు క్రీస్తుపై ఆధారపడడంలో మనం కొనసాగితే, మనం సంతోషంగా ఉండగలము.—మత్త. 11:28-30; 1 యోహా. 5:3.