సమయం ఎందుకింత తక్కువగా ఉంది?
సమయం. ఈ పదాన్ని కచ్చితంగా నిర్వచించడం కష్టంగా ఉండవచ్చు, కానీ సరిపడినంత సమయం ఉండడం లేదన్నది మాత్రం నిశ్చయంగా మనకు తెలుసు. అది త్వరగా గతిస్తుందని కూడా మనకు తెలుసు. నిజానికి మనం తరచూ, “కాలం కరిగిపోయింది” అని నిట్టూరుస్తాము.
ఏదేమైనా, 1877లో ఇంగ్లీషు కవి అయిన ఆస్టిన్ డాబ్సన్, “సమయం గతించిపోయింది అంటున్నావూ? కానే కాదు! అయ్యో, సమయం ఉంటుంది, మనమే గతించిపోతాము” అని అన్నప్పుడు ఆయన వాస్తవానికి చాలా దగ్గరగా వచ్చాడని స్పష్టమౌతుంది. 1921లో ఆయన గతించిపోయి దాదాపు 80 సంవత్సరాలు గడిచినా, సమయం మాత్రం కొనసాగుతూనే ఉంది.
సమృద్ధిగా ఉన్న సమయం
మానవజాతిని సృష్టించిన సృష్టికర్తను గురించి బైబిలు ఇలా చెబుతుంది: “పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు.” (కీర్తన 90:2) లేక ద న్యూ జెరూసలేమ్ బైబిల్ అనువదిస్తున్నట్లుగా, “నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు నీవే దేవుడవు.” కాబట్టి దేవుడు ఉన్నట్లే సమయం నిరంతరమూ ఉంటుంది—నిత్యమూ ఉంటుంది!
నిత్యత్వమంత సమయం ఉన్న దేవునికి పూర్తి భిన్నంగా మనం మానవుల గురించి ఇలా చదువుతాము: “నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.”—కీర్తన 90:9, 10.
మానవుడు నిత్యము జీవించాలన్నది దేవుని సంకల్పం అని బైబిలు స్పష్టంగా బోధిస్తున్న దృష్ట్యా, నేడు మనిషి జీవితకాలం ఎందుకింత స్వల్పంగా ఉంది? (ఆదికాండము 1:27, 28; కీర్తన 37:29) దేవుడు సంకల్పించినట్లుగా అపరిమితమైన జీవితకాలం జీవించడానికి బదులుగా మానవులకు సగటున 30,000 కన్నా తక్కువ రోజులు మాత్రమే ఎందుకున్నాయి? మానవులకు ఎందుకు ఇంత తక్కువ సమయం ఉంది? విచారకరమైన ఈ స్థితికి ఎవరు కారణం లేదా ఏమిటి కారణం? దీనికి బైబిలు స్పష్టమైన, సంతృప్తికరమైన జవాబుల్ని ఇస్తుంది.a
సమయం తక్కువైపోతుంది
ఇటీవలి దశాబ్దాల్లో జీవనగతి వేగం పుంజుకుందని వృద్ధులు ధృవీకరిస్తారు. డా. జీబిల్ ఫ్రిచ్ అనే జర్నలిస్ట్, గత 200 సంవత్సరాల కాలంలో వారపు పనిగంటలు 80 నుండి 38కి తగ్గిపోయాయని చెబుతూ, “అయినా, మనం ఫిర్యాదు చేయకుండా ఉండలేకపోతున్నాము” అంటుందామె. ఆమె ఇలా స్పష్టం చేస్తుంది: “సమయం లేదు; టైమ్ ఈజ్ మనీ; ఊపిరికోసం గిలగిలా కొట్టుకున్నట్టు సమయం కోసం కొట్టుకుంటున్నాము; ఉరుకుల పరుగులతో కూడిన జీవితమిది.”
మునుపటి తరాలు కనీసం ఊహించనన్ని అవకాశాల్నీ సాధ్యతల్నీ క్రొత్తగా కనిపెట్టిన ఆవిష్కరణలు కలుగజేశాయి. కానీ లెక్కకు మించిన కార్యకలాపాల్లో ఎంత ఎక్కువగా మునిగిపోతే, ఆ పనులు చేయడానికి చాలా తక్కువ సమయం ఉన్నట్లు అన్పించి అంత ఎక్కువగా నిస్పృహకు గురౌతాము. ఈ కాలాల్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు కాలంతో పరుగులు తీస్తారు, ఒకదానికి నిర్ణీత గడువు ఇప్పుడే తీరితే మరోదానికి గడువు అప్పుడే దగ్గరపడుతుంది. నాన్న ఉదయం 7 గంటలకల్లా పనికెళ్లిపోవాలి, అమ్మ 8:30కల్లా పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయాలి, తాతగారు 9:40కి డాక్టరుని కలవాలి, అందరమూ రాత్రి 7:30కల్లా ముఖ్యమైన మీటింగ్‌కి హాజరు కావాలి. గడువు తీరేలోపల ఒక పని పూర్తి చేయగానే మరో పని పూర్తి చేయడానికి గడువు దగ్గరపడుతుంది, మానసికోల్లాసానికి అసలు సమయమే ఉండడంలేదు. గానుగెద్దులా పని చేయడం విషయమై, విసుగును పుట్టించే పని విషయమై మనం ఫిర్యాదు చేస్తుంటాము కూడా.
సమయం తక్కువగా ఉన్నది మనకు మాత్రమే కాదు
దేవుని విరోధి అయిన అపవాదియైన సాతాను—ఎవరి దుష్ట పథకమైతే మానవజాతి జీవిత ఆయుష్షును త్రుంచివేసిందో ఆ సాతాను—ఇప్పుడు తన దౌష్ట్యానికే బలయ్యాడు. (పోల్చండి గలతీయులు 6:7, 8.) పరలోకంలో మెస్సీయా రాజ్యం ఉద్భవించడం గురించి చర్చిస్తూ, ప్రకటన 12:12 ఇలా చెబుతూ మన నిరీక్షణకు హేతువునిస్తుంది: “పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీ యొద్దకు దిగివచ్చియున్నా[డు].”—ఇటాలిక్కులు మావి.
బైబిలులోని నమ్మదగ్గ కాల వృత్తాంతం ప్రకారమూ, నెరవేరుతున్న బైబిలు ప్రవచనాల ప్రకారమూ మనం ఇప్పుడు ఆ ‘కొంచెము సమయము’ ముగింపులో జీవిస్తున్నాము. సాతాను సమయము త్వరలోనే పూర్తిగా ముగియబోతున్నదని తెలుసుకోవడం ఎంత హాయిగా ఉంది! ఒక్కసారి సాతాను మన దారి నుండి అడ్డు తొలగించబడిన తర్వాత, విధేయులైన మానవులు పరిపూర్ణతకు పునరుద్ధరించబడతారు, యెహోవా ఆదిలో వారి కోసం సంకల్పించిన నిత్య జీవాన్ని వారు పొందగల్గుతారు. (ప్రకటన 21:1-4) సమయం కొరత అన్నది ఇక ఎంతమాత్రం సమస్యగా ఉండదు.
నిత్య జీవం అంటే ఏమిటో—నిరంతరం జీవించడం అంటే ఏమిటో మీరు ఊహించగలరా? ఇక పనుల్ని అసంపూర్ణంగా వదిలేయాల్సి వస్తుందని మీరెన్నడూ చింతించాల్సిన అవసరం లేదు. పూర్తి చేయడానికి మీకు ఇంకా ఎక్కువ సమయం కావాల్సివస్తే రేపు పూర్తి చేయవచ్చు, లేదా వచ్చేవారం, లేదా వచ్చే సంవత్సరం పూర్తి చేయవచ్చు—నిజానికి, మీ ముందు విస్తారమైన నిత్యత్వం ఉంది!
ఇప్పుడు మనకున్న సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించడం
మానవుల్ని ప్రభావితం చేయడానికి తనవద్ద సమయం పరిమితంగా ఉందని గ్రహించిన సాతాను, ఇప్పటికే స్థాపించబడిన దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను వినడానికి కూడా ప్రజలకు సమయం లేనంత బిజీగా వారిని ఉంచడానికి ప్రయత్నిస్తాడు. అందుకని మనం ఈ దైవిక ఉపదేశాన్ని వినడం శ్రేష్ఠం: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు [“యెహోవా,” NW] యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.”—ఎఫెసీయులు 5:15-17.
ఏమాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలు లేని నిష్ప్రయోజనకరమైన విషయాల వెంబడిపడి సమయాన్ని వ్యర్థం చేయడానికి బదులుగా అత్యంత ప్రాముఖ్యమైన విషయాల నిమిత్తం మనం మన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం ఎంత ఆవశ్యకం! మోషే తన హృదయపు లోతుల్లోనుండి యెహోవాకు చేసుకున్న ఈ విన్నపంలో వ్యక్తమైన ఆయన వైఖరిని మనమూ పెంపొందించుకోవాలి: “మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.”—కీర్తన 90:12.
నిజమే, నేటి లోకంలో ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, మీరు దేవుని రాజ్య పరిపాలన క్రింద నిత్య జీవాన్ని పొందాలంటే ఆయన కోరుతున్నవేమిటో నేర్చుకోవడానికి మీ అమూల్యమైన సమయంలో కొంత వెచ్చించమని యెహోవాసాక్షులు మిమ్మల్ని పురికొల్పుతున్నారు. ‘యెహోవా చిత్తమేమిటో గ్రహిస్తూ,’ బైబిలును పద్ధతి ప్రకారం పఠించడానికి వారానికొకసారి వెచ్చించిన ఒక్క గంట, మీరీ మాటల నెరవేర్పును వ్యక్తిగతంగా అనుభవించటాన్ని సాధ్యపరుస్తుంది: “కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:27, 29.
[అధస్సూచీలు]
a వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన నిత్య జీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలో 6వ అధ్యాయాన్ని చూడండి.