నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని దేవునితో నడవడం
‘మనం . . . మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకుంటూ నడుద్దాం.’—మీకా 4:5.
1. ‘యుగాలకు రాజు’ అని యెహోవాను ఎందుకు పిలువవచ్చు?
యెహోవా దేవునికి ఆరంభంలేదు. ఆయన ‘మహావృద్ధుడు’ అని తగ్గట్టుగానే పిలువబడ్డాడు, ఎందుకంటే ఆయన అనాదికాలం నుండీ ఉన్నాడు. (దానియేలు 7:9, 13, క్యాతలిక్ అనువాదము) యెహోవా నిత్య భవిష్యత్తును కూడా అనుభవిస్తాడు. ‘యుగాలకు రాజు’ ఆయన మాత్రమే. (ప్రకటన 10:6; 15:3) ఆయన దృష్టికి, “వేయ సంవత్సరములు గతించిన నిన్నటివలెనున్నవి. రాత్రియందలి యొక జామువలెనున్నవి.”—కీర్తన 90:4.
2. (ఎ) విధేయత చూపించే మానవులపట్ల దేవుని సంకల్పం ఏమిటి? (బి) మన నిరీక్షణల్నీ, మన ప్రణాళికల్నీ దేనిపై కేంద్రీకరించాలి?
2 జీవదాత నిత్యుడు కాబట్టే, మొదటి మానవజత అయిన ఆదాము హవ్వలకు పరదైసులో నిరంతరం జీవించే ఉత్తరాపేక్షను వారి ముందు ఉంచగలిగాడు. అయితే అవిధేయత చూపించడాన్నిబట్టి, ఆదాము నిత్యమూ జీవించే హక్కును పోగొట్టుకొని, తన సంతానానికి పాప మరణాల్ని సంక్రమింపజేశాడు. (రోమీయులు 5:12) ఆదాము చేసిన తిరుగుబాటు దేవుని ఆది సంకల్పాన్ని అంతంచేయలేదు. విధేయత చూపించే మానవులు నిరంతరం జీవించాలన్నది యెహోవా చిత్తం, ఆయన తన సంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాడు. (యెషయా 55:11) అయితే, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని యెహోవా సేవ చేయడంపై మన నిరీక్షణల్నీ, ప్రణాళికల్నీ కేంద్రీకరించుకోవడం ఎంత తగినదై ఉంది! ‘యెహోవా దినాన్ని’ మన మనస్సుల్లో పెట్టుకోవాలని అనుకొన్నప్పటికీ, దేవునితో నిరంతరమూ నడవాలనేదే మన లక్ష్యమనే విషయాన్ని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం.—2 పేతురు 3:12.
యెహోవా తన నియమిత కాలంలో పనిచేస్తాడు
3. తన సంకల్పాల్ని నెరవేర్చేందుకు యెహోవాకు ఒక ‘నియమిత సమయం’ ఉందని మనకెలా తెలుసు?
3 దేవునితో నడుస్తున్న వారిగా, మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో ఎంతో ఆసక్తిని కల్గివున్నాం. యెహోవా దేవుడు గొప్ప సమయపాలకుడని మనకు తెలుసు, ఆయన తన నియమిత కాలంలో తన సంకల్పాల్ని నెరవేర్చడంలో ఎన్నటికీ విఫలుడుకాడనే నమ్మకం మనకుంది. ఉదాహరణకు, “కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పం[పించాడు].” (గలతీయులు 4:4) సూచనల రూపంలో తాను చూసిన ప్రవచనాత్మక విషయాలు నెరవేరడానికి ఒక నియమిత ‘సమయం’ ఉందని అపొస్తలుడైన యోహానుకు తెలియజేయబడింది. (ప్రకటన 1:1-3) “మృతులు తీర్పు పొం[దడానికి] . . . [నియమిత] సమయము” ఉంది. (ప్రకటన 11:18) 1,900 సంవత్సరాలకన్నా ఎక్కువ కాలం క్రిందట, “నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును [దేవుడు] నిర్ణయం[చాడని]” చెప్పడానికి అపొస్తలుడైన పౌలు ప్రేరేపించబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 17:31.
4. ఈ దుష్ట విధానానికి అంతం తీసుకు రావాలని యెహోవా కోరుతున్నాడని మనకెలా తెలుసు?
4 ఈ దుష్ట విధానానికి యెహోవా అంతం తీసుకురానై ఉన్నాడు, ఎందుకంటే నేటి ప్రపంచంలో ఆయన నామం దూషణకు గురౌతుంది. దుష్టులు పెరిగిపోయారు. (కీర్తన 92:7) తమ మాటలద్వారా, క్రియల ద్వారా, వాళ్లు దేవుడ్ని అవమానపరుస్తారు. ఆయన సేవకులు దూషణపాలై, హింసించబడడాన్ని చూడడం ఆయనకు బాధగా ఉంటుంది. (జెకర్యా 2:8) సాతాను యావత్ సమాజం త్వరలోనే అంతంకాబోతుందని యెహోవా ప్రకటించడంలో ఆశ్చర్యమేమీలేదు. అదెప్పుడు ఖచ్చితంగా జరుగబోతుందో దేవుడు నిశ్చయించాడు. మనం ఇప్పుడు “అంత్యకాలము”లో జీవిస్తున్నామనే విషయాన్ని బైబిలు ప్రవచనాల నెరవేర్పు స్పష్టం చేస్తోంది. (దానియేలు 12:4) తనను ప్రేమించే వారందర్నీ ఆశీర్వదించేందుకు ఆయన త్వరలోనే చర్య తీసుకుంటాడు.
5. లోతు, హబక్కూకులు తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎలా దృష్టించారు?
5 గత కాలాల్లోని యెహోవా సేవకులు దుష్టత్వం యొక్క అంతాన్ని చూడాలని ఎదురు చూశారు. “దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత” నీతిమంతుడైన లోతు ‘బహుగా బాధపడ్డాడు.’ (2 పేతురు 2:7) హబక్కూకు ప్రవక్త తన చుట్టూ ఉన్న పరిస్థితులనుబట్టి కలతచెందినవాడై ఇలా విజ్ఞప్తి చేశాడు: “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.”—హబక్కూకు 1:2, 3.
6. హబక్కూకు చేసిన ప్రార్థనకు జవాబుగా యెహోవా ఏం చెప్పాడు, దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?
6 యెహోవా హబక్కూకుకు ఇచ్చిన జవాబులో కొంత భాగం: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:3) ఆ విధంగా దేవుడు తాను ‘నిర్ణయకాలం’లో చర్య తీసుకుంటానని తెలియజేశాడు. ఆలస్యం జరుగుతున్నట్టుగా కన్పించినా, యెహోవా తన సంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాడు!—2 పేతురు 3:9.
జవసత్వాలు కోల్పోని ఆసక్తితో సేవచేయడం
7. యెహోవా దినం ఎప్పుడు వస్తుందో యేసుకు ఖచ్చితంగా తెలియకపోయినా, ఆయన తన కార్యకలాపాల్ని ఎలా నెరవేర్చాడు?
7 దేవునితో ఉత్సాహపూరితంగా నడిచేందుకు సంఘటనల ఖచ్చితమైన యెహోవా సమయాన్ని గురించి తెలుసుకోవడం మనకు ఆవశ్యకమా? లేదు, అవసరంలేదు. కొన్ని ఉదాహరణల్ని పరిశీలించండి. దేవుని చిత్తం పరలోకంలో జరుగుతున్నట్టుగానే భూమిపై కూడా నెరవేరబోయే కాలం విషయంలో యేసు ఎంతో శ్రద్ధను చూపించాడు. నిజానికి క్రీస్తు “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించమని తన శిష్యులకు బోధించాడు. (మత్తయి 6:9, 10) ఈ విన్నపానికి జవాబు దొరుకుతుందని యేసుకు తెలిసినా, అది జరగబోయే ఖచ్చితమైన సమయాన్ని గురించి ఆయనకు తెలియదు. ఈ విధానాంతాన్ని గూర్చిన తన గొప్ప ప్రవచనంలో, ఆయనిలా అన్నాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:36) దేవుని సంకల్పాల్ని నెరవేర్చేందుకు యేసుక్రీస్తు కీలకం గనుక, ఆయన తన పరలోకపు తండ్రి శత్రువుల్ని నాశనంచేయడంలో ప్రత్యక్షంగా పాల్గొంటాడు. అయితే, యేసు భూమిపై ఉన్నప్పుడు, దేవుడు చర్యను ఎప్పుడు తీసుకుంటాడో ఆయనకు కూడా తెలియదు. అది ఆయన యెహోవా సేవలో అంత ఆసక్తి చూపకుండా ఉండేలా చేసిందా? నిశ్చయంగా చేయలేదు! యేసు దేవాలయాన్ని ఆసక్తితో పరిశుభ్రం చేయడాన్ని చూసి, “ఆయన శిష్యులు—నీ యంటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.” (యోహాను 2:17; కీర్తన 69:9) తాను ఏ పనికోసమైతే పంపించబడ్డాడో ఆ పనిని పూర్తిచేయడంలో యేసు పూర్తిగా నిమగ్నమైపోయాడు, ఆయన దాన్ని ఎంతో ఆసక్తితో చేశాడు. ఆయన కూడా నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని సేవ చేశాడు.
8, 9. రాజ్య పునరుద్ధరణ గురించి శిష్యులు అడిగినప్పుడు, వాళ్లకేం చెప్పబడింది, మరి వాళ్లెలా ప్రతిస్పందించారు?
8 క్రీస్తు శిష్యుల విషయంలో కూడా ఇది వాస్తవమే. యేసు తాను పరలోకానికి వెళ్లడానికి కొంచెం ముందు వారిని కలిశాడు. ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “వారు కూడివచ్చినప్పుడు—ప్రభువా, యూ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడి[గిరి].” తమ యజమానివలే, రాజ్యం రావాలని వాళ్లెంతగానో ఎదురు చూశారు. అయినప్పటికీ యేసు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచు కొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.”—అపొస్తలుల కార్యములు 1:6-8.
9 ఆ జవాబును విని శిష్యులు నిరాశా నిస్పృహలతో కృంగిపోయారని ఎక్కడా ప్రస్తావించబడలేదు. దానికి బదులుగా, వాళ్లు ప్రకటనా పనిలో పూర్తిగా మునిగిపోయారు. కొన్ని వారాల్లోనే, వాళ్లు తమ బోధతో యెరూషలేమును నింపివేశారు. (అపొస్తలుల కార్యములు 5:28) “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టి”కి సువార్త ప్రకటించబడిందని పౌలు చెప్పగలిగేంత మేరకు వాళ్లు తమ ప్రచార కార్యక్రమాన్ని 30 ఏళ్లలో విస్తృతపర్చారు. (కొలొస్సయులు 1:23) శిష్యులు తప్పుగా అపేక్షించినట్టు ‘ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించ’బడకపోయినా, అది వాళ్ల జీవితకాలంలో పరలోకమందు స్థాపించబడకపోయినా, వాళ్లు నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని యెహోవా సేవను ఉత్సాహపూరితంగా ఎడతెగకుండా చేశారు.
మన దృక్పథాల్ని పరీక్షించుకోవడం
10. సాతాను విధానాన్ని దేవుడు ఎప్పుడు నాశనంచేస్తాడో తెలియకపోవడం, దేన్ని రుజువుచేసుకునేందుకు మనకు అవకాశాన్నిస్తుంది?
10 ఈ దుష్ట విధానాంతాన్ని చూడాలని యెహోవా ఆధునికకాల సేవకులు కూడా పరితపిస్తున్నారు. అయితే, దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త లోకంలోనికి ప్రవేశించేలా మనం విడుదల పొందాలనేదే మన ప్రధాన శ్రద్ధకాదు. యెహోవా దేవుని నామం పరిశుద్ధపర్చబడి, ఆయన సర్వాధిపత్యం నిరూపించబడడాన్ని చూడాలనేదే మన అభిలాష. అదే కారణాన్నిబట్టి, సాతాను విధాన నాశనం కోసం దేవుడు నియమించిన ‘దినాన్ని లేదా గడియను’ మనకు తెలియజేయనందుకు మనం ఆనందించవచ్చు. మనం దేవుడ్ని ప్రేమిస్తున్నాం గనుకా, మనకు తాత్కాలికమైన లక్ష్యాలు స్వార్థపర లక్ష్యాలు లేవు గనుకా ఆయనతో నిరంతరమూ నడిచేందుకు మనం నిశ్చయించుకున్నామని రుజువు చేసుకునేందుకు మనకు ఇది అవకాశాన్ని ఇస్తుంది.
11, 12. (ఎ) యోబు యథార్థత ఏ విధంగా సవాలు చేయబడింది, ఆ సవాలు ఏ విధంగా మనకు సంబంధించినదై ఉంది?
11 దేవునిపట్ల మనకున్న యథార్థతను కాపాడుకోవడం, నీతిమంతుడైన యోబూ, అదే విధంగా ఆయనలాంటి మానవులూ స్వార్థంతోనే దేవుని సేవ చేస్తున్నారనే నిందను అపవాది మోపినప్పుడు, వాడు చేసింది తప్పని రుజువుచేసేందుకు సహాయపడుతుంది కూడా. యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుగలవాడని యెహోవా తన సేవకుడైన యోబును గురించి వర్ణించిన తర్వాత, సాతాను ఎంతో దుర్మార్గంగా ఇలా వాదించాడు: “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయనను నీవు ఇప్పుడు నీ చేయ చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.” (యోబు 1:8-11) శోధనలో తన యథార్థతను కాపాడుకోవడం ద్వారా యోబు తనమీద మోపబడిన ఆ తీవ్రమైన నింద అబద్ధమని రుజువు చేశాడు.
12 అదే విధమైన నడవడిని యథార్థవంతంగా చేపట్టడం ద్వారా, ప్రతిఫలం దక్కుతుందని మనకు తెలుసు గనుకనే మనం దేవుని సేవ చేస్తున్నామని సాతాను మోపే ఏ విధమైన నిందనైనా సరే, అవి తప్పు అని మనం రుజువు చేయగలం. దుష్టులపై దేవుడు ప్రతీకారం తీర్చుకొనబోయే ఖచ్చితమైన సమయం ఎప్పుడో తెలియకపోవడం, మనం యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నామనీ, ఆయన మార్గాల్లో నిరంతరం నడవాలని కోరుకుంటున్నామనీ రుజువు చేసుకునేందుకు మనకు అవకాశాన్ని ఇస్తుంది. మనం దేవునిపట్ల యథార్థంగా ఉన్నామనీ, విషయాలతో ఆయన వ్యవహరించే విధానంపై నమ్మకముందనీ అది చూపిస్తోంది. అంతేగాక, రాత్రివేళ దొంగ వచ్చినట్టుగా అంతం ఏ సమయంలోనైనా రావచ్చని మనకు తెలుసు గనుక మనం జాగ్రత్తగానూ, ఆధ్యాత్మికంగా మెలకువగానూ ఉండేలా ఆ రోజును గూర్చీ, ఆ గడియను గూర్చీ తెలియకపోవడం సహాయపడుతుంది. (మత్తయి 24:42-44) యెహోవాతో అనుదినమూ నడవడం ద్వారా, మనం ఆయన హృదయాన్ని సంతోషపరుస్తాం, తనను నిందిస్తున్న అపవాదికి జవాబిచ్చేలా చేస్తాం.—సామెతలు 27:11.
నిత్యత్వం కోసం ప్రణాళిక!
13. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడాన్ని గురించి బైబిలు ఏం చెబుతోంది?
13 దేవునితో నడిచేవాళ్లు భవిష్యత్తు కోసం సహేతుకమైన ప్రణాళికలను వేసుకోవడం జ్ఞానయుక్తమని తెలుసుకుంటారు. వృద్ధాప్యం మూలంగా రాబోయే సమస్యల్ని గురించీ, పరిమితుల్ని గురించీ బాగా ఎరిగిన అనేకమంది తమ భావి జీవితం ఆర్థికంగా భద్రంగా ఉండడానికి తమ యౌవనాన్నీ, బలాన్నీ చక్కగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఎంతో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక భవిష్యత్తు సంగతేమిటి? సామెతలు 21:5 ఇలా చెబుతోంది: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగా ప్రణాళిక వేసుకోవడం, నిజంగా లాభదాయకం. ఈ దుష్ట విధానాంతం ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు గనుక, మన భావి అవసరాల విషయమై కొంత ఆలోచించడం అవసరం. కానీ మనం సమతూకంగా ఉండి, జీవితంలో దైవిక ఆసక్తుల్ని ముందుంచుదాం. దేవుని చిత్తం చేయడంపైనే ఒకడు తన ఆసక్తిని కేంద్రీకరించడం ముందుచూపులేనితనమనే నిర్ధారణకు, విశ్వాసంలేని ప్రజలు రావచ్చు. అయితే అలా చేయడం ముందుచూపులేకపోవడమేనా?
14, 15. (ఎ) భవిష్యత్తు కోసం వేసుకునే ప్రణాళికలకు సంబంధించి యేసు ఏ ఉపమానాన్ని గురించి మాట్లాడాడు? (బి) యేసు ఉపమానంలోని ధనవంతునికి ముందుచూపు ఎందుకులేదు?
14 యేసు ఒక ఉపమానాన్ని గురించి మాట్లాడాడు, అది ఈ విషయంలో అంతర్దృష్టిని అందిస్తుంది. ఆయనిలా అన్నాడు: “ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు—నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని—నేనీలాగు చేతును; నా కొట్లువిప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో—ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయతే దేవుడు—వెఱ్ఱివాడా, యూ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.”—లూకా 12:16-21.
15 భవిష్యత్తులో ఆర్థికసంబంధమైన భద్రత కల్గివుండేందుకు ఆ ధనవంతుడు ప్రయత్నించకూడదని యేసు సూచిస్తున్నాడా? లేదు, ఎందుకంటే లేఖనాలు కష్టించి పనిచేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. (2 థెస్సలొనీకయులు 3:10) “దేవునియెడల ధనవంతుడు”గా ఉండేందుకుగాను ఆవశ్యకమైన వాటిని చేయకపోవడమే ధనవంతుని తప్పిదం. అతడు ఒకవేళ తన సిరి సంపదల్ని అనేక సంవత్సరాలపాటు అనుభవించినా, చివరకు అతడు మరణించాల్సిందే. అతనికి ముందుచూపు లేదు, నిత్యత్వాన్ని గురించి ఆలోచించలేదు.
16. భద్రతగల భవిష్యత్తు కోసం యెహోవాపై మనం నిశ్చయంగా ఎందుకు నమ్మకం ఉంచగలం?
16 నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని యెహోవాతో నడవడమనేది ఆచరణీయమైనదీ, ముందుచూపు ఉన్నదీ అయివుంది. భవిష్యత్తుకోసం ప్రణాళిక వేసుకోవడానికి అది శ్రేష్ఠమైన మార్గం. విద్యాభ్యాసానికీ, ఉద్యోగానికీ, కుటుంబ బాధ్యతలకూ సంబంధించి ఆచరణీయమైన ప్రణాళికల్ని వేసుకోవడం జ్ఞానయుక్తమైనప్పటికీ, యెహోవా యథార్థవంతులైన తన సేవకుల్ని ఎన్నడూ ఎడబాయడని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. రాజైన దావీదు ఇలా పాడాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” (కీర్తన 37:25) అదే విధంగా యేసు, దేవుని రాజ్యాన్ని మొదట వెదకి, యెహోవా నీతియుక్త మార్గాల్లో నడిచే వారందరికీ దేవుడు పోషణను అనుగ్రహిస్తాడని అభయాన్ని ఇచ్చాడు.—మత్తయి 6:33.
17. అంతం సమీపంలోనే ఉందని మనకెలా తెలుసు?
17 నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మనం దేవుని సేవ చేస్తున్నప్పటికీ, యెహోవా దినం అతి దగ్గర్లో ఉన్నట్టు దాన్ని మన మనస్సుల్లో ఉంచుకుంటాం. ఆ దినం సమీపించడాన్ని బైబిలు ప్రవచన నెరవేర్పు ఎంతో స్పష్టంగా రుజువుచేస్తోంది. ఈ శతాబ్దం నిజక్రైస్తవుల్ని హింసించడం, భూగోళవ్యాప్తంగా ప్రకటించబడుతున్న దేవుని రాజ్య సువార్తతోపాటుగా యుద్ధాలూ, తెగుళ్లూ, భూకంపాలూ, ఆహార కొరతలూ వంటి వాటితో గుర్తించబడింది. అవన్నీ ఈ విధానాంత సమయానికి సంబంధించిన అంశాలైవున్నాయి. (మత్తయి 24:7-14; లూకా 21:11) ఈ లోకం ‘స్వార్థప్రియులతోనూ, ధనాపేక్షులతోనూ, బింకములాడువారితోనూ, అహంకారులతోనూ, దూషకులతోనూ, తలిదండ్రులకు అవిధేయులైనవారితోనూ, కృతజ్ఞతలేనివారితోనూ, అపవిత్రులతోనూ, అనురాగరహితులతోనూ, అతిద్వేషులతోనూ, అపవాదకులతోనూ, అజితేంద్రియులతోనూ, క్రూరులతోనూ, సజ్జనద్వేషులతోనూ, ద్రోహులతోనూ, మూర్ఖులతోనూ, గర్వాంధులతోనూ, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారితోనూ, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయంచనివారితోనూ’ నిండిపోయింది. (2 తిమోతి 3:1-5) ఈ క్లిష్టమైన అంత్యదినాల్లో, యెహోవా సేవకులుగా మనకు జీవితం దుర్లభంగా ఉంటుంది. యెహోవా రాజ్యం భూమిపై ఉన్న చెడుతనాన్నంతటినీ తుడిచివేసే దినం కోసం మనమెంతగా పరితపిస్తున్నామో గదా! ఈలోగా, నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని దేవునితో నడవాలని నిశ్చయించుకుందాం.
నిరంతర జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని సేవ చేయడం
18, 19. నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాచీనకాలంలో నమ్మకమైన వ్యక్తులు దేవుని సేవ చేశారని ఏది చూపిస్తోంది?
18 మనం యెహోవాతో నడుస్తుండగా, హేబేలు, హానోకు, నోవహు, అబ్రాహామూ, శారాల విశ్వాసాన్ని మనస్సులో ఉంచుకుందాం. వారిని గురించి ప్రస్తావించిన తర్వాత, పౌలు ఇలా రాశాడు: “వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయనను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.” (హెబ్రీయులు 11:13) విశ్వాసులై వాళ్లు “మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు.” (హెబ్రీయులు 11:16) విశ్వాసంలో, దేవుని మెస్సీయా రాజ్య పరిపాలన క్రింద ఒక శ్రేష్ఠమైన దేశం కోసం వాళ్లు ఎదురు చూశారు. ఆ శ్రేష్ఠమైన దేశంలో అంటే, రాజ్య పరిపాలన క్రింద భూ పరదైసులో నిరంతర జీవితంతో దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడనే నిశ్చయాన్ని మనం కల్గివుండవచ్చు.—హెబ్రీయులు 11:39, 40.
19 దేవుడ్ని నిత్యమూ ఆరాధించాలనే యెహోవా ప్రజల కృత నిశ్చయాన్ని గురించి మీకా ప్రవక్త వ్యక్తపర్చాడు. ఆయనిలా రాశాడు: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” (మీకా 4:5) తన మరణ పర్యంతమూ, మీకా యెహోవా సేవను నమ్మకంగా చేశాడు. క్రొత్త లోకంలో పునరుత్థానుడైన వ్యక్తిగా, ఆ ప్రవక్త నిరంతరమూ దేవునితో ఎడతెగకుండా నడుస్తాడనడంలో సందేహమేమీ లేదు. ఈ అంత్యకాలపు చివర్లో జీవిస్తున్న మనకు ఎంతటి చక్కని మాదిరో గదా!
20. మన తీర్మానమేమై ఉండాలి?
20 యెహోవా, తన నామం కోసం మనం చూపించిన ప్రేమను ప్రశంసిస్తాడు. (హెబ్రీయులు 6:10) అపవాది ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ లోకంలో దేవునిపట్ల యథార్థతను కాపాడుకోవడం మనకు కష్టమన్న విషయం ఆయనకు తెలుసు. “లోకము . . . గతించి” పోతున్నప్పటికీ, “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:17; 5:19) అందుకని యెహోవా సహాయంతో, దిన దినం మనం ఎదుర్కొంటున్న శ్రమల్ని సహించుకుందామని తీర్మానించుకుందాం. మన ఆలోచనా సరళీ, మనం జీవించే విధానమూ, మన పరలోకపు తండ్రి వాగ్దానం చేసిన అద్భుతకరమైన ఆశీర్వాదములపై కేంద్రీకరించుగాక. నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఎడతెగకుండా నడుస్తూవుంటే అవి మనవౌతాయి.—యూదా 20, 21.
మీరెలా ప్రతిస్పందిస్తారు?
◻ విధేయులైన మానవులపట్ల దేవుని సంకల్పమేమైవుంది?
◻ భక్తిహీన లోకానికి అంతాన్ని తీసుకురావడానికి యెహోవా ఇంకా ఎందుకు చర్య తీసుకోలేదు?
◻ దేవుడు ఖచ్చితంగా ఎప్పుడు చర్య తీసుకుంటాడో మనకు తెలియకపోవడం మన ఆసక్తిని ఎందుకు తగ్గించకూడదు?
◻ నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని దేవునితో నడవడంవల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?
[17వ పేజీలోని చిత్రం]
దేవునితో నడుస్తూ ఉండడానికి, క్రీస్తు తొలి శిష్యులు చేసినట్లుగానే మనమూ దేవుని సేవను ఉత్సాహపూరితంగా చేయడం అవసరమౌతుంది