సమయమూ, నిత్యత్వమూ—వీటి గురించి మనకు నిజానికి ఏమి తెలుసు?
“మానవ అనుభవాల్లో అత్యంత మర్మమైన వాటిలో సమయం ఒకటి అనిపిస్తుంది” అని ఒక విజ్ఞాన సర్వస్వం చెబుతుంది. అవును, సమయాన్ని సరళమైన మాటల్లో నిర్వచించడం అనేది దాదాపుగా అసాధ్యమే. సమయం “గతించిపోతుంది,” “గడిచిపోతుంది,” “రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది” అనీ, మనం “కాలప్రవాహంలో” కదిలిపోతున్నామనీ కూడా మనం అంటుండవచ్చు. కానీ మనం దేన్ని గురించి మాట్లాడుతున్నామో నిజానికి మనకు తెలియదు.
“రెండు సంఘటనల మధ్య ఉండే నిడివే” సమయం అని నిర్వచించబడుతూ వస్తోంది. అయితే, సమయం అనేది సంఘటనలపై ఆధారపడి ఉండదని మన అనుభవం చెబుతున్నట్లు అనిపిస్తుంది; ఏదైనా సంభవించినా, సంభవించకపోయినా, అది ముందుకు సాగిపోతూనే ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి సమయమనేది ఉనికిలో లేదు, కానీ అదున్నట్లు ఊరికే ఊహించబడుతుంది అని ఒక తత్త్వవేత్త అంటున్నాడు. మన అనుభవంలో ఎక్కువ శాతం దేని ఆధారంగా కలిగిందో అది కేవలం మన ఊహలలో నుండి రూపుదిద్దుకున్నదై ఉండవచ్చా?
సమయం విషయంలో బైబిలు దృక్కోణం
సమయాన్ని గురించి బైబిలు ఏ నిర్వచనాన్నీ ఇవ్వడంలేదన్న విషయం, సమయం అనేది బహుశా మానవుడు పూర్తిగా అర్థం చేసుకోలేని విషయమై ఉండవచ్చని సూచిస్తుంది. అది అనంతమైన అంతరిక్షం లాంటిది—అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమైనదేనని మనం కనుగొంటాం. స్పష్టంగా, సమయం అనేది దేవుడు మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగల విషయాల్లో ఒకటి. ఆయన మాత్రమే ‘యుగయుగములు’గా ఉన్నవాడు.—కీర్తన 90:2.
బైబిలు సమయాన్ని నిర్వచించకపోయినప్పటికీ, సమయమనేది వాస్తవమైనదన్నట్లుగానే అది మాట్లాడుతోంది. “సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచిం”చేందుకుగాను కాల సూచికలుగా దేవుడు “జ్యోతుల”ను—సూర్య, చంద్ర, నక్షత్రాలను సృష్టించాడని బైబిలు ప్రారంభ భాగం చెబుతుంది. బైబిలులో వ్రాయబడిన అనేక సంఘటనలు కాలప్రవాహంలో ఖచ్చితంగా ఎప్పుడు సంభవించాయో కనుగొనగలం. (ఆదికాండము 1:14; 5:3-32; 7:11, 12; 11:10-32; నిర్గమకాండము 12:40, 41) దేవుడు ఇచ్చే అనంత కాలము అనే దీవెనను—నిరంతరం జీవించే ఉత్తరాపేక్షను—పొందేందుకు గానూ, మనం జ్ఞానపూర్వకంగా ఉపయోగించుకోవలసిన దానిగా సమయాన్ని గురించి బైబిలు మాట్లాడుతుంది కూడా.—ఎఫెసీయులు 5:15, 16.
నిత్యజీవం—అది తర్కబద్ధమేనా?
సమయం అంటే నిజానికి ఏమిటో అర్థం చేసుకోవాలన్న ప్రయత్నమే విఫలమైపోతుండగా, చాలా మంది ప్రజలకు నిత్యజీవం, లేదా నిరంతరం జీవించడం అనే తలంపు అంత కన్నా అర్థంకాని విషయంగా ఉంది. సమయాన్ని గురించిన మన అవగాహన పుట్టడం, ఎదగడం, వృద్ధులు కావడం, మరణించడం అనే వాటితో ముడి పడి ఉంది అన్నదే దానికి ఒక కారణం కావచ్చు. కనుక, మనం వృద్ధులమౌతున్నప్పుడే కాలప్రవాహాన్ని గుర్తిస్తాం. మరే విధంగానైనా ఆలోచించడమంటే, సమయాన్ని గురించిన తలంపునే అతిక్రమించడమని అనేకులకు అనిపిస్తుంది. మిగతా జీవజాలాలన్నీ లోబడుతున్న దానికి లోబడడంలో మానవులకు మాత్రం మినహాయింపు ఎందుకు?’ అని వాళ్ళు అడుగవచ్చు.
ఈ విధమైన తర్కనలో తరచూ నిర్లక్ష్యం చేయబడుతున్నదేమిటంటే, అనేక విషయాల్లో మానవులు మిగతా సృష్టినుండి ఇప్పటికే ఒక మినహాయింపుగా ఉన్నారన్న వాస్తవమే. ఉదాహరణకు, మానవులకున్న మేధాశక్తి సామర్థ్యాలు జంతువులకు లేవు. ఎవరెన్ని చెప్పినా, జంతువులు వాటికున్న సహజ జ్ఞానం పురికొల్పే దానికన్నా ఎక్కువ సృజనాత్మకంగా వాటంతటవి మారలేవు. వాటికి కళాత్మక వరాలూ లేవు, మానవులకున్న ప్రేమను మెప్పుదలను చూపించే సామర్థ్యమూ లేదు. జీవితాన్ని అర్థవంతమైనదిగా చేసే ఈ లక్షణాలూ, సామర్థ్యాలూ మానవులకు ఎంతో ఎక్కువగా ఇవ్వబడగా, జీవితం విషయానికొస్తే, వాళ్ళకు ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఉండడం ఎందుకు సాధ్యం కాదు?
మరొకవైపు, ఆలోచించలేని చెట్లు, కొన్ని, వేలాది సంవత్సరాలు జీవిస్తుండగా, మేధాశక్తిగల మానవులు సగటున 70 నుండి 80 ఏండ్లే జీవించగలగడం వింతగా లేదా? సృజనాత్మక, లేక కళాత్మక సామర్థ్యాలు ఏమీ లేని తాబేళ్ళు 200 కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుండగా, ఈ సామర్థ్యాలు మెండుగా ఉన్న మానవులు తాబేలుకుండే ఆయుష్షులో సగం కన్నా తక్కువ కాలం జీవించడం పరస్పర విరుద్ధంగా అనిపించడం లేదా?
మానవుడు సమయాన్నీ, నిత్యత్వాన్నీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, నిత్యజీవం అనే వాగ్దానం, ఇప్పటికీ బైబిలులో తగినంత ఆధారంగల ఒక నిరీక్షణే. అందులో, “నిత్యజీవము” అనే పదం దాదాపు 40 సార్లు కనిపిస్తుంది. మానవులు నిరంతరం జీవించాలన్నదే దేవుడి ఉద్దేశమైతే, అది ఇప్పటికీ ఎందుకు వాస్తవం కాలేదు? ఈ ప్రశ్న తరువాతి శీర్షికలో చర్చించబడుతుంది.