‘హృదయంలోనూ మనస్సులోనూ జిజ్ఞాస జ్వాలలు’
“మీ పట్ల శ్రద్ధవహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) పుస్తకాన్ని నేను చదువుతూ ఉండగా చెప్పనలవికాని ఆనందాన్నీ ఉత్తేజాన్నీ నేను పొందుతున్నాను. ఈ పుస్తకం మరింత ఎక్కువ తెలుసుకోవాలన్న కోరికను పుట్టిస్తుంది—కాదు కాదు, తెలుసుకోవల్సిన అవసరాన్ని గ్రహించేలా చేస్తుంది. నా హృదయంలోనూ మనస్సులోనూ జిజ్ఞాస జ్వాలలను రగిలించినందుకు మీకు కృతజ్ఞతలు.”
అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఒక యెహోవాసాక్షి, 1998/99లో జరిగిన “దైవిక జీవిత మార్గము” జిల్లా సమావేశాల్లో వాచ్ టవర్ సొసైటీ విడుదల చేసిన పుస్తకం గురించి అలా భావించింది. మీ దగ్గర ఆ పుస్తకం లేకపోయినా ఇతరుల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో గమనించండి.
అమెరికాలోని కాలిఫోర్నియాలోని సాన్ డియాగోలో జరిగిన సమావేశంలో ఈ పుస్తకాన్ని పొందిన తర్వాతి కొన్ని రోజులకు ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “ఈ పుస్తకం విశ్వాసాన్ని ఎంతో దృఢపరచేదిగా ఉందని నేను గ్రహిస్తున్నాను. ఈ పుస్తకం నా హృదయాన్ని యెహోవా చేసిన సృష్టికార్యాలపట్ల ప్రగాఢమైన మెప్పుదలతో నింపింది. నేనిప్పటికి 98వ పేజీకి చేరుకున్నాను, పుస్తకం త్వరగా ముగించేస్తానేమోనని భయంగా ఉంది! ఇది ఎంతో సంతృప్తితో కూడిన ఆనందాన్నిస్తుంది.”
ఒక ప్రాచ్యదేశపు స్త్రీ ఇలా వ్రాసింది: “సమావేశంలోని ప్రసంగీకుడు ‘సాటిలేని పుస్తకం’ అనే వ్యక్తీకరణను ఉపయోగించాడు, ఆ మాటలు ఇందులో ఉన్న విషయాలకు నిజంగానే సరిపోతాయి. ఈ పుస్తకం యొక్క ఒక అసాధారణమైన విశిష్టత ఏమిటంటే, దేవుడు ఉన్నాడన్న విషయాన్ని పాఠకునిపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించదు, అయితే వాస్తవాలను మాత్రం ముందుంచుతుంది.”
ఆ వాస్తవాల్లో మన విశ్వం గురించీ, జీవం గురించీ, మన గురించీ శాస్త్రజ్ఞులు కనుక్కున్న ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇది చాలామందిని ముగ్ధులను చేసింది. “ఈ చిన్న పుస్తకం నన్ను ఎంత గాఢంగా ప్రభావితం చేసిందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను” అని కాలిఫోర్నియా నుండి ఒక స్త్రీ వ్రాసింది. “మన విశ్వాన్ని గురించీ, జీవాన్ని గురించీ వైజ్ఞానికులు కనుగొంటున్న క్రొత్త క్రొత్త విషయాల్ని ఒక్కొక్క పేజీ వర్ణిస్తుండగా నేను పుస్తకాన్ని ప్రక్కనపెట్టేయలేకపోతున్నాను. నిజంగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను! ఈ చిన్న పుస్తకాన్ని నేను పదిలంగా దాచుకుంటాను, సాధ్యమైనంత మందికి ఈ పుస్తకాన్ని చదవడానికి ఇస్తాను.”
ఈ పుస్తకంలో చాలామందిని ఆకట్టుకున్న ఒక అంశం ఏమిటంటే, సృష్టికర్త వ్యక్తిత్వాన్ని ఉన్నతపరుస్తూ, బైబిలు ఏమి చెబుతుందో సంగ్రహంగా తెలపబడింది. “ఈ పుస్తకం చివర్న ఇవ్వబడిన, మొత్తంమ్మీద బైబిలు ఉద్దేశాన్ని గూర్చిన క్లుప్తవివరణ నేను ఇదివరకు చదివిన వాటన్నింటిలోకెల్లా అతి శ్రేష్ఠమైనది” అన్నది ఒక సగటు వ్యాఖ్యానం. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన తొలి సమావేశాల్లో ఒకటి జరిగిన తర్వాత ఒక స్త్రీ ఇలా వ్రాసింది: “మీరు ముద్రించిన పుస్తకాల్లోకెల్లా ఈ క్రొత్త పుస్తకం అత్యంత ఉత్కంఠభరితమైనదై ఉండాలి. సృష్టికర్త ఉన్నాడన్న దానికిగల వైజ్ఞానికపరమైన రుజువులను చదివి నేను చాలా ముగ్ధురాలినయ్యాను. అక్కడ చర్చించబడిన విషయాల్ని వివరించడానికీ, మరింత చదవాలన్న ఆతురతను పెంచడానికీ క్లుప్తమైన బైబిలు సారాంశం చాలు.”
అర్థంచేసుకోదగ్గ విజ్ఞానశాస్త్రం
తొలి అధ్యాయాల్లో ఉన్న శాస్త్రీయ సమాచారం అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉన్నట్లు అన్పించినా, సగటు ప్రతిస్పందనలు ఇలా ఉన్నాయి.
కెనడా నుండి ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “తమ పెద్ద పెద్ద పదజాలంతో మనల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించే రచయితల సాంకేతికపరమైన పుస్తకాలకు ఇది ఎంత భిన్నంగా ఉంది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, డిఎన్‌ఎ, క్రోమోజోములు, వగైరా విషయాలు మాకు చక్కగా అర్థమయ్యేలా చేయడంలో మీ పాండిత్యం నిజంగా అమోఘంగా ఉంది. నేను ఎన్నో సంవత్సరాల క్రితం చదివిన కళాశాల పాఠ్యపుస్తకాలను మీరు వ్రాసి ఉంటే ఎంత బాగుండు!”
ఒక విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర ప్రొఫెసర్ ఇలా వ్రాశాడు: “[ఇది] సాంకేతికపరమైన వివరాలను అందించడంలో చిక్కుకుపోకుండా ఇమిడివున్న వివాదాంశాలు స్పష్టమయ్యేలా ముందుంచింది. ఈ పుస్తకం పాఠకునితో తర్కిస్తుంది, సుప్రసిద్ధులైన అనేకమంది వైజ్ఞానికుల మాటలను ఉటంకిస్తుంది. ఒక శాస్త్రజ్ఞుడుగా అయినా, సామాన్యుడుగా అయినా, విశ్వావిర్భావంలోను, జీవావిర్భావంలోను ఆసక్తివున్న ప్రతి ఒక్కరు, ‘తప్పక చదవాల్సిన’ పుస్తకమిది.
నర్సింగ్ కోర్సు చేస్తున్న ఒక యువతి ఇలా వ్యాఖ్యానించింది: “మేము మా తరగతిగదిలో ఉపయోగిస్తున్న పుస్తకంలో నుండి తీసుకున్న కొటేషన్‌ను 4వ అధ్యాయంలో చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను! నేను ఈ పుస్తకాన్ని మా ప్రొఫెసర్‌కి ఇచ్చి, ఇందులోని సమాచారం ఆయనకు తాజాదనాన్నిస్తుందని చెప్పాను. మెదడు గురించి 54వ పేజీని ఆయనకు చూపించాను. దాన్ని తానే చదువుకుని, ‘చాలా ఆసక్తికరంగా ఉంది! నేనీ పుస్తకం చదివి చూస్తాను’ అని అన్నారు.”
బెల్జియంలోని ఒక పార్లమెంట్ సభ్యుడు ఇలా వ్రాశాడు: “నాకు చాలా విభ్రాంతిని కల్గించినదీ, నన్ను బాగా ఆకట్టుకున్నదీ ఏమిటంటే, ఆధునిక విజ్ఞానశాస్త్రం బైబిలులోని దేవుడు ఒక్కడేనన్న సిద్ధాంతాన్ని వ్యతిరేకించడంలేదు గానీ, బదులుగా దానికి మద్దతునిస్తుందని నొక్కిచెబుతున్న వైజ్ఞానిక వివరణే. ఇది చాలా గమనార్హమైన దృక్కోణం.”
సృష్టికర్తను మరింత ఎక్కువగా తెలుసుకోవడం
అనేక దేశాల్లోని అనేకమంది ప్రజలు దేవుణ్ని మరింత ఎక్కువగా తెలుసుకోవడానికీ ఆయనకు మరింత సన్నిహితులమయ్యామన్న అనుభూతిని పొందడానికీ ఈ పుస్తకం సహాయం చేసింది. జపాన్‌లోని ఫుకువోకా సిటీలోని ఒక పాఠకుడు ఇలా వ్రాశాడు: “మొట్టమొదటిసారిగా లెన్స్‌ను ఖచ్చితంగా యెహోవాపైకి ఫోకస్ చేసినట్లుగా అన్పించింది. ఈ పుస్తకం అద్భుతమైన రీతిలో ఒప్పిస్తుంది. నేనిప్పటి వరకు ఆలోచించి ఎరుగని దృక్కోణంలో యెహోవాను తెలుసుకోగల్గాను.” ఎల్ సాల్వడార్ నుండి ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “దేవుడు ఎంతటి కరుణా, దయా, దీర్ఘశాంతం, ఆప్యాయతానురాగాలు గలవాడో మీరు చాలా స్పష్టంగా వివరించారు. నిజంగా, ఆయనకూ ఆయన కుమారునికీ సన్నిహితంగా ఉండేందుకు ఖచ్చితంగా కావాల్సింది ఇదే. యెహోవా భావోద్వేగాల్నీ ఆయన కుమారుని మానవానుభూతుల్నీ వివరించిన మొదటి పుస్తకం ఇది.” జాంబియాలోని ఒక పాఠకుడు ఇలా ప్రతిస్పందించాడు: “నా విషయంలో యెహోవా పూర్తిగా క్రొత్త అర్థాన్ని సంతరించుకున్నాడు.”
మీ పట్ల శ్రద్ధవహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? పుస్తకాన్ని ఇతరులకు పంచిపెట్టేందుకు యెహోవాసాక్షులు అత్యుత్సాహంతో ఉన్నారన్నది అర్థంచేసుకోదగినదే. ఒక స్త్రీ ఇలా అన్నది: “నేను 10వ అధ్యాయాన్ని [“సృష్టికర్త శ్రద్ధవహిస్తున్నట్లయితే, ఎందుకిన్ని బాధలు?”] చదివేసిన తర్వాత, ‘జపాన్‌లో మాకు కావల్సిన పుస్తకం సరిగ్గా ఇదే!’ అని ఆశ్చర్యానందాలతో అనుకోకుండా ఉండలేకపోయాను. నేనీ అధ్యాయంలోని సమాచారాన్ని నా సొంతం చేసుకొని, ఇంకా ఇంకా ఎక్కువగా ప్రాంతీయ సేవలో నేను దీన్ని ఉపయోగించాలనుకుంటున్నాను.” ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న తన తండ్రి పెంపకంలో ఆలయంలోనే పెరిగిన ఒక అమ్మాయితో మరొక స్త్రీ బైబిలు పఠనం చేస్తుంది. “సృష్టికర్త అన్న తలంపునే అర్థం చేసుకోవడం కష్టమైంది ఆమెకు. ఈ పుస్తకంలోని వివరణలో ఒకరిపై వేరే భావాల్ని రుద్దడం అనేది జరుగలేదు, కానీ వాస్తవాలు మాత్రం ఉన్నాయందులో, అందుకని బౌద్ధులు కూడా ఏమాత్రం సంకోచించకుండా చదువగలరని నేను అనుకుంటున్నాను. మనం యెహోవా ప్రేమను మరింత ఎక్కువగా అనుభవిస్తున్న అనుభూతి కూడా కలిగేలా చేస్తుంది.”
దీని విలువను చెబుతూ ఇంగ్లాండ్‌నుండి ఈ వ్యాఖ్యానాలు వచ్చాయి: “నేనిప్పుడే సృష్టికర్త పుస్తకాన్ని చదవడం ముగించాను, మళ్లీ మొదలుపెట్టబోతున్నాను. ఎంతటి అద్భుతమైన పుస్తకం! దాన్ని చదువుతూ ఎవరైనా యెహోవాను ప్రేమించకుండా ఉండలేరు. నేను నా పొరుగింటామెకు ఒక పుస్తకాన్ని ఇచ్చాను. ఆమె రెండు అధ్యాయాలు చదివి, ‘నేను దీన్ని ప్రక్కన పెట్టలేకపోతున్నాను అంత ఉత్తేజకరంగా ఉంది’ అన్నది. ప్రజలు మన మహాగొప్ప సృష్టికర్తను తెలుసుకుని ఆయన్ను ప్రేమించేలా ఇది సహాయపడుతుందని నాకు నిశ్చయత ఉంది.”
అమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఒకాయన ఇలా అన్నాడు: “ఇది నిజంగానే నా ఆధ్యాత్మిక ఎముకల్లోనికీ, మూలుగలోనికీ చొచ్చుకొని పోయింది! బిజినెస్ వ్యవహారాల్లో నేను కలిసే ప్రజలందరికీ ఒక్కొక్క పుస్తకం ఇవ్వాలనుకుంటున్నాను. అంత బిజీగా ఉన్న వ్యక్తులకు, విద్యాధికులకు సాక్ష్యాన్నివ్వడం ప్రారంభించడమే కష్టంగా ఉంటున్నట్లు నాకు కొన్నిసార్లు అన్పిస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకంతో, ఆకర్షణీయమైన విధంగా, ప్రభావవంతమైన విధంగా ప్రజల్ని సమీపిస్తాను.”
మీ పట్ల శ్రద్ధవహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? అనే ఈ పుస్తకం భూవ్యాప్తంగా ప్రజలపై ఒక సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుందన్నది స్పష్టం.
[25వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover photo above, Eagle Nebula: J. Hester and P. Scowen (AZ State Univ.), NASA