తన వాగ్దానం విషయమై దేవుడు ఆలస్యం చేయడం లేదు
“యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు?” సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో జీవించిన హెబ్రీ ప్రవక్త చెప్పిన మాటలివి. ఈ మాటలు ఎక్కడో విన్నట్లు అనిపించడం లేదా? మనం ఎంతో ఇష్టంగా వాంఛించేవాటిని వెంటనే పొందాలని కోరుకోవడం లేదా వీలైనంత త్వరగా పొందాలని కోరుకోవడం మానవ నైజం. ముఖ్యంగా, తక్షణమే పొంది తృప్తిపడాలనుకునే మన ఈ యుగంలో ఇది చాలా నిజం.—హబక్కూకు 1:2.
మొదటి శతాబ్దంలోని కొందరు, దేవుడు తన వాగ్దానాలను అతిత్వరగా నెరవేర్చి ఉండాల్సిందని భావించినట్లు స్పష్టమౌతుంది. వాళ్ళు సహనాన్ని ఎంతగా కోల్పోయారంటే, దేవుడు తన వాగ్దానాల విషయమై నిదానిస్తున్నట్లు లేక ఆలస్యం చేస్తున్నట్లు కూడా అనుకున్నారు. అందుకే, సమయాన్ని గురించిన దేవుడి దృక్కోణం మన దృక్కోణానికి చాలా భిన్నంగా ఉంటుందని అపొస్తలుడైన పేతురు వాళ్ళకు గుర్తుచేయవలసి వచ్చింది. “ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యసంవత్సరములవలెను, వెయ్యసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి” అని పేతురు వ్రాస్తున్నాడు.—2 పేతురు 3:8.
సమయాన్ని ఈ విధంగా లెక్కించి చూస్తే, 80 ఏండ్ల వయస్సుగల వ్యక్తి కేవలం దాదాపు రెండు గంటలు మాత్రమే జీవించాడన్నమాట, మొత్తం మానవజాతి చరిత్రంతా కూడా కేవలం ఆరు రోజులదేనన్నమాట. మనం ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని విషయాలను చూసినప్పుడు, మనతో దేవుడు వ్యవహరించే విధానాన్ని అర్థం చేసుకోవడం మనకు సులభమౌతుంది.
అయినప్పటికీ, దేవుడు సమయం విషయంలో ఉదాసీనంగా ఉండడం లేదు. ఆయన చాలా అప్రమత్తంగా ఉంటాడు. (అపొస్తలుల కార్యములు 1:7) కనుక, పేతురు ఇంకా ఇలా అంటున్నాడు: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యచ్ఛయంపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2 పేతురు 3:9) మానవుల్లా దేవుడు తనకు సమయం మించిపోతున్నట్లు, పనులను త్వరగా చేయాలన్న ఒత్తిడికి గురికాడు. ‘సకల యుగములలో రాజు’గా, ఆయనకు అద్భుతమైన అవగాహన ఉంది. తాను తీసుకునే చర్యలు కాలప్రవాహంలో ఎప్పుడు తీసుకుంటే తత్సంబంధితులందరికీ అవి అత్యంత క్షేమం కలుగజేస్తాయన్న విషయాన్ని ఆయన నిర్ణయించగలడు.—1 తిమోతి 1:17.
దేవుడు జాప్యం చేస్తున్నట్లు అనిపించడానికి గల కారణాన్ని వివరించిన తర్వాత, “ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును” అని పేతురు హెచ్చరిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, లెక్క అప్పజెప్పే రోజు, ప్రజలు ఏ మాత్రం ఎదురు చూడని గడియలో వస్తుంది. తర్వాతి వచనాల్లో, ‘పరిశుద్ధమైన ప్రవర్తనను దైవభక్తితో కూడిన క్రియలను’ చూపేవారి కొరకైన అద్భుతమైన ఉత్తరాపేక్షను, అంటే, దేవుడు వాగ్దానం చేసిన “క్రొత్త ఆకాశము” క్రింద “క్రొత్త భూమి” మీద జీవించడాన్ని పేతురు సూచిస్తున్నాడు.—2 పేతురు 3:10-13.
దేవుడి తీర్పు సమయం ఇంకా రాలేదని మనమింకా బాగా గ్రహించేలా ఇది చేయాలి. మనం ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవడాన్నీ, ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను పొందేందుకు గాను మన జీవితాల్లో మనం సవరింపులను చేసుకోవడాన్నీ ఆయన సహనం సాధ్యం చేసింది. పేతురు ప్రబోధిస్తున్నట్లు, “ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని” మనం దృష్టించవద్దా? (2 పేతురు 3:15) అయినప్పటికీ, దేవుడి సహనంలో మరో పార్శ్వం ఉంది.
అక్రమం గరిష్ఠస్థాయికి చేరుకోవలసి ఉంది
గత కాలంలో దేవుడు మానవజాతితో వ్యవహరించిన విధానాన్ని పఠించినప్పుడు, మెరుగుపడతారన్న ఆశ పూర్తిగా అంతరించిపోయే వరకూ దేవుడు తీర్పు విధించకుండా ఆగాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఉదాహరణకు, దేవుడు కనానీయులపై తాను విధించనున్న తీర్పుకు సంబంధించి, వారి పాపాలను చాలా కాలం ముందే అబ్రాహాముకు తెలియజేశాడు. కానీ ఆయన తన తీర్పును విధించే సమయం అప్పటికి ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? “అమోరీయుల [కనానీయుల] అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక”నే అని బైబిలు చెబుతుంది. లేదా నోక్స్ వర్షన్ చెబుతున్నట్లు, “అమోరీయుల దుష్టత్వం అత్యుచ్ఛస్థాయికి ఇంకా చేరుకోలేదు.”—ఆదికాండము 15:16.a
అయినప్పటికీ, దాదాపు 400 సంవత్సరాల తర్వాత, దేవుడి తీర్పు వచ్చింది, అబ్రాహాము సంతతివారైన ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని కైవసం చేసుకున్నారు. రాహాబు, గిబియోనీయులు వంటి కొంత మంది కనానీయులు మాత్రం, తమ మనోవైఖరిని బట్టి, క్రియలను బట్టి కాపాడబడ్డారు. కానీ అధిక సంఖ్యాకులు, ఆధునిక పురావస్తు శాస్త్ర త్రవ్వకాలు చూపిస్తున్నట్లు, అపవిత్రత యొక్క అత్యుచ్ఛస్థాయికి చేరుకున్నారు. వాళ్ళు శిశ్న ఆరాధన, దేవదాసీతనం, శిశు బలి వంటివాటిని ఆచరించేవారు. “కనాను నగరాల శిథిలాలను త్రవ్వే పురావస్తు శాస్త్రజ్ఞులు, దేవుడు వారిని నాశనం చేసినదాని కంటే ఇంకా ముందే ఎందుకు నాశనం చేయలేదా అని ఆశ్చర్యపోతున్నారు” అని హాలీస్ బైబిల్ హ్యాండ్‌బుక్ పేర్కొంటోంది. చివరికి, కనానీయుల ‘అక్రమము గరిష్ఠస్థాయికి చేరుకుంది’; వాళ్ళ దుష్టత్వం, ‘అత్యుచ్ఛస్థాయికి చేరుకుంది.’ దేవుడు సరైన మనోవైఖరిని చూపించినవారిని మినహాయిస్తూ, ఆ దేశాన్ని ప్రక్షాళనం చేసినప్పుడు, అన్యాయం చేశాడని న్యాయంగా ఎవరూ చెప్పలేరు.
నోవహు దినాల్లో, మనం అలాంటి సన్నివేశాన్నే చూస్తాం. జలప్రళయం రావడానికి ముందటి ప్రజలు దుష్టులన్నది వాస్తవమే అయినప్పటికీ, వాళ్ళ కాలం మరో 120 సంవత్సరాల వరకు కొనసాగాలని దేవుడు కరుణాపూర్వకంగా నిర్ణయించాడు. ఆ కాలంలోనే, నోవహు “నీతిని ప్రకటిం[చే వ్యక్తి]”గా పని చేశాడు. (2 పేతురు 2:5) సమయం గడుస్తున్న కొలది, వాళ్ళ దుష్టత పరిపక్వమైందని స్పష్టమైంది. “దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.” (ఆదికాండము 6:3, 12) వాళ్ళ ‘పాపం గరిష్ఠస్థాయికి చేరుకుంది’; కాలం గడుస్తున్న కొలది, వాళ్ల తప్పుడు మనో వైఖరులు తారాస్థాయికి చేరుకున్నాయి. దేవుడు చర్య తీసుకున్నప్పుడు ఆయన పూర్తిగా న్యాయాన్నే నెరవేర్చాడని నిరూపితమైంది. కేవలం, ఎనిమిది మంది మాత్రమే దేవుడి దృష్టిలో నీతిమంతులుగా నిరూపించబడ్డారు. ఆయన వాళ్ళను రక్షించాడు.
దేవుడు ఇశ్రాయేలుతో వ్యవహరించినప్పుడు కూడా అదే పద్ధతి కనిపించింది. వాళ్ళు అపనమ్మకస్థులుగాను, భ్రష్టులుగా ప్రవర్తించినప్పటికీ, దేవుడు వందల కొలది సంవత్సరాలు వాళ్ళతో సహనంతో వ్యవహరించాడు. “యెహోవా తన జనులయందు. . . కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. . . . వారు . . . ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను” అని ఈ వృత్తాంతం చెబుతుంది. (2 దినవృత్తాంతములు 36:15, 16) మెరుగుపడ్డం ఇక ఏ మాత్రం సాధ్యం కాని స్థాయికి ప్రజలు చేరుకున్నారు. యిర్మీయా, అలాగే మరి కొందరు మాత్రమే కాపాడబడగల్గారు. చివరికి దేవుడు మిగతావాళ్ళపై తీర్పు విధించినప్పుడు, ఆయన అన్యాయస్థుడని అనలేరు.
దేవుడు చర్య తీసుకునే సమయం వచ్చేసింది
దేవుడు ప్రస్తుత విధానంపై తన తీర్పును నిలుపుతున్నది కాలం పరిపూర్ణమయ్యేంత వరకు మాత్రమే అని ఈ ఉదాహరణల నుండి మనం గ్రహించగలం. “భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని” సూచనార్థకంగా దేవుడి తీర్పును అమలుచేసే దూతకు ఇవ్వబడిన ఆజ్ఞలో ఇది వ్యక్తీకరించబడింది. అప్పుడు ఆ దూత “తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను.” మానవజాతి దుష్టత్వం ‘పరిపక్వమైంది,’ అంటే అది మెరుగుపడే అవకాశం ఏ మాత్రం లేని స్థాయికి చేరుకుంది అని గమనించండి. దేవుడు తీర్పును అమలు చేసినప్పుడు, ఆయన జోక్యం న్యాయమైనదని నిరూపించబడుతుందనే దానికి ఏ మాత్రం సందేహం లేదు.—ప్రకటన 14:18, 19.
పైవాటిని పరిగణనలోకి తీసుకుంటే, గతంలో దేవుడు తీర్పు ప్రకటించిన లక్షణాలను నేటి లోకం సంతరించుకుని ఉంది కనుక, ఈ లోకానికి వ్యతిరేకంగా దేవుడు తీర్పు తీర్చే సమయం ఆసన్నమౌతోందని స్పష్టమౌతుంది. మనమెక్కడ చూసినా, భూమ్యంతా హింసతో నిండిపోయి ఉంది, నోవహు కాలంలో జలప్రళయం రాకముందు ఎలా ఉండేదో సరిగ్గా అలాగే ఉంది. ఆదికాండము 6:5లో “[మానవుడి] హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని” వర్ణించబడినట్లే మారుతోంది రాను రాను ప్రజల మనోవైఖరి. ఏ ఘోర పాపాలు కనానీయులపై దేవుడి తీర్పును తెచ్చాయో, ఆ పాపాలు సహితం నేడు సర్వసాధారణమై పోయాయి.
ముఖ్యంగా, మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకొని, మానవజాతి భయంకరమైన మార్పులను చవిచూసింది. భూమి కోట్లాదిమంది ప్రజల రక్తంతో తడిసి ముద్దయిపోవడాన్ని మానవజాతి చూస్తోంది. యుద్ధాలు, జాతినిర్మూలనము, తీవ్రవాదం, నేరం, విచ్చలవిడితనం భూమ్యంతటా విలయతాండవం చేస్తున్నాయి. కరువులు, రుగ్మతలు, అనైతికత మన భూగోళాన్ని ఆవరించి ఉన్నాయి. “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” అని యేసు చెప్పిన దుష్ట తరం మధ్య మనం ఇప్పుడు జీవిస్తున్నామని రుజువులన్నీ సూచిస్తున్నాయి. (మత్తయి 24:34) ఇప్పుడు లోకం “గరిష్ఠస్థాయి”లో “పాపం” చేస్తోంది. “భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు” ఇప్పుడు కోతకొస్తున్నాయి.
మీరు చర్య తీసుకోవలసిన సమయం
తీర్పు సమయం సమీపిస్తుండగా, రెండు రకాల కోతపనులు జరుగుతాయని అపొస్తలుడైన యోహానుకు చెప్పబడింది. ఒకవైపు, “అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము.” మరొకవైపు, “నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము.” (ప్రకటన 22:10, 11) ఈ రెండవ పరిణామం, యెహోవాసాక్షులు నిర్వహించే ప్రపంచవ్యాప్త బైబిలు విద్యా పని విషయంలో నెరవేరుతోంది. ఆ పని యొక్క లక్ష్యం, ప్రజలు నిత్యజీవాన్ని పొందేందుకు యోగ్యులుగా ఎంచబడేందుకు, దేవుడు వాళ్ళ నుండి కోరుతున్నదేమిటో వాళ్ళకు బోధించడమే. ఈ కార్యశీలత ఇప్పుడు దాదాపు 87,000 సంఘాల ద్వారా 233 దేశాలకు వ్యాపిస్తోంది.
దేవుడు ఆలస్యం చేయడం లేదు. తను వాగ్దానం చేసినవాటిని పొందేలా, “నవీనస్వభావమును ధరించు”కోవడానికి వ్యక్తులకు అవసరమైన సమయాన్ని యెహోవా సహనంతో అనుమతించాడు. (ఎఫెసీయులు 4:24) నేడు, లోకంలో పరిస్థితులు ఎడతెగక మరింత విషమ స్థితికి మారుతున్నప్పటికీ, దేవుడు ఇప్పటికీ వేచిచూస్తున్నాడు. నిత్యజీవానికి నడిపే జ్ఞానాన్ని తమ పొరుగువాళ్ళతో పంచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు సహేతుకంగా తాము చేయగల్గినంతమటుకు చేస్తున్నారు. (యోహాను 17:3, 17) సంతోషకరంగా, ప్రతి సంవత్సరం 3,00,000 కన్నా ఎక్కువ మంది ప్రజలు ప్రతిస్పందించి, బాప్తిస్మం తీసుకుంటున్నారు.
నిత్యజీవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇది చర్య తీసుకోవలసిన సమయమే కానీ, వేచి చూడవలసిన సమయం కాదు,. ఎందుకంటే, “బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు” అని యేసు చేసిన వాగ్దాన నెరవేర్పును అతి త్వరలోనే మనం చూస్తాం.—యోహాను 11:26.
[అధస్సూచీలు]
a “ఒక జనాంగం బహిష్కరణశిక్షకు అర్హురాలవ్వాలంటే, ఆ జనాంగపు పాపం గరిష్ఠస్థాయికి చేరుకోవాలి. అంత వరకు దేవుడు ఆ జనాంగాన్ని శిక్షించడు” అని ద సోన్స్యీనో కూమాష్ బైబిలులో ఈ వచనానికున్న అధస్సూచి పేర్కొంటోంది.
[6వ పేజీలోని చిత్రం]
భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనప్పుడు, కొడవలిని భూమిమీద వేయమని, దేవుడి తీర్పును అమలుచేసే దూతకు చెప్పబడింది
[7వ పేజీలోని చిత్రం]
దేవుడు ఇచ్చే నిత్య ఆశీర్వాదాలను అనుభవించేందుకు యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయపడుతున్నారు