స్వాతంత్ర్యంతో క్రైస్తవ సమర్పణకు తగ్గట్టుగా జీవించడం
“ప్రభువు [“యెహోవా,” NW] యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.”—2 కొరింథీయులు 3:17.
1. యెహోవాసాక్షులు ఎవరికి సమర్పించుకున్నారు, వారు చట్టబద్ధమైన సంస్థలను ఎందుకు ఉపయోగించుకుంటారు?
యెహోవాసాక్షులు తమ మతం నిత్యమూ నిలుస్తుందని నమ్ముతారు. అందుకని వారు, “ఆత్మతోను సత్యముతోను” నిరంతరమూ దేవునికి సేవ చేయాలని ఆశిస్తారు. (యోహాను 4:23, 24) నైతిక స్వేచ్ఛ గలవారిగా, ఈ క్రైస్తవులు యెహోవా దేవునికి నిర్నిబంధంగా సమర్పణను చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా జీవించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అందు నిమిత్తం, వారు దేవుని వాక్యంపైనా, ఆయన పరిశుద్ధాత్మపైనా ఆధారపడతారు. వారు దేవుడిచ్చిన స్వాతంత్ర్యంతో మనస్ఫూర్తిగా తమ క్రైస్తవ సమర్పణా మార్గాన్ని వెంబడిస్తుండగా, ప్రభుత్వ “పై అధికారుల” పాత్రకు గౌరవాన్ని చూపిస్తారు. సాక్షులు చట్టబద్ధమైన మాధ్యమాలను, చట్టబద్ధమైన ఏర్పాట్లను యుక్తమైన రీతిలో ఉపయోగించుకుంటారు. (రోమీయులు 13:1; యాకోబు 1:25) ఉదాహరణకు, తోటి మానవులకు సహాయపడే పనిని, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గాల్లో సహాయపడే పనిని నెరవేర్చడానికి సాక్షులు వివిధ దేశాల్లో ఉన్న వాచ్ టవర్ సొసైటీలను చట్టబద్ధమైన ఉపకరణాలుగా ఉపయోగిస్తారు. కానీ సాక్షులు దేవునికి సమర్పించుకున్నారు, ఏదో చట్టబద్ధమైన సంస్థకు కాదు, యెహోవాకు వారు చేసుకున్న సమర్పణ నిరంతరమూ నిలుస్తుంది.
2. వాచ్ టవర్ సొసైటీనీ, అటువంటి మరితర చట్టబద్ధమైన సంస్థల్నీ యెహోవాసాక్షులు ఎందుకు అమూల్యంగా ఎంచుతారు?
2 ‘సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, . . . వారికి బోధించుడి’ అని యేసు ఇచ్చిన నిర్దేశాలను పాటించాల్సిన బాధ్యత, దేవునికి సమర్పించుకున్న సేవకులుగా యెహోవాసాక్షులకు ఉంది. (మత్తయి 28:19, 20) ఈ పని ఈ విధానాంతము వరకు కొనసాగుతుంది, ఎందుకంటే యేసు ఇలా కూడా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:3, 14) యెహోవాసాక్షులు తమ ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిలో ఉపయోగించడానికి, వాచ్ టవర్ సొసైటీ యొక్క ముద్రణా కేంద్రాలూ, అటువంటి మరితర చట్టబద్ధమైన సంస్థలూ ప్రతి సంవత్సరం వారికొరకు కోట్లాది బైబిళ్లను, పుస్తకాలను, బ్రోషూర్లను, పత్రికలను పంపిణీ చేస్తున్నాయి. ఆ విధంగా దేవుని సమర్పిత సేవకులు ఆయనకు తాము చేసుకున్న సమర్పణకు తగ్గట్టుగా జీవించడానికి ఈ చట్టబద్ధమైన సంస్థలు వారికి అమూల్యమైన సహాయాన్ని అందిస్తున్నాయి.
3. యెహోవాసాక్షులు మునుపు “సొసైటీ” అనే పదాన్ని ఏ భావంలో ఉపయోగించేవారు?
3 సాక్షులు వాచ్ టవర్ సొసైటీ గురించి మాట్లాడే విధానం—లేక ఎక్కువగా “సొసైటీ” అని మాత్రం సూచిస్తూ వారు మాట్లాడే విధానం, వారు ఆ సంస్థను కేవలం ఒక చట్టబద్ధమైన ఉపకరణంకన్నా ఎక్కువని దృష్టిస్తున్నట్లు సూచిస్తుందని కొందరు తర్కిస్తారు. వారు ఆరాధనకు సంబంధించిన విషయాలపై చివరి మాట దానిదే అని పరిగణించరా? యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకం ఈ విషయాన్ని ఈ విధంగా వివరిస్తూ స్పష్టంచేస్తుంది: “కావలికోట [జూన్ 1, (ఆంగ్లం) 1938] ‘సొసైటీ’ అని అన్నప్పుడు, దానర్థం అది కేవలం ఒక చట్టబద్ధమైన ఉపకరణం అని మాత్రమే కాదుగాని, ఆ చట్టబద్ధమైన విభాగాన్ని రూపొందించి, దాన్ని ఉపయోగించుకుంటున్న అభిషిక్త క్రైస్తవుల సమూహం అని అర్థం.”a అందుకని ఆ పదం ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ వర్తిస్తుంది. (మత్తయి 24:45) సాక్షులు సాధారణంగా “సొసైటీ” అనే పదాన్ని ఈ భావంలోనే ఉపయోగించారు. అయితే, చట్టబద్ధమైన కార్పోరేషను మరియు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అనే వ్యక్తీకరణలు ఒకదానికి బదులుగా మరోటి ఉపయోగించగల్గేవి కావు. వాచ్ టవర్ సొసైటీ యొక్క డైరెక్టర్లు ఎన్నిక చేయబడతారు, కానీ ‘నమ్మకమైన దాసుడు’గా రూపొందే సాక్షులు యెహోవా పరిశుద్ధాత్మచే అభిషేకించబడతారు.
4. (ఎ) అపార్థాలను నివారించడానికి చాలామంది సాక్షులు తమను తాము ఎలా వ్యక్తం చేసుకుంటారు? (బి) పారిభాషికా పదాల విషయంలో మనం ఎందుకు సమతుల్యత కల్గివుండాలి?
4 అపార్థాలను నివారించడానికి యెహోవాసాక్షులు తమను తాము వ్యక్తం చేసుకునే విధానంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తారు. “సొసైటీ బోధించేది ఏమిటంటే” అనడానికి బదులుగా “బైబిలు చెప్పేదేమిటంటే” లేక, “బైబిలు ఇలా బోధిస్తుందని నేను అర్థంచేసుకుంటున్నాను” అనే మాటలను ఉపయోగించడానికి చాలామంది సాక్షులు ఇష్టపడతారు. ఈ విధంగా బైబిలు బోధలను అంగీకరించడంలో ప్రతి సాక్షి తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని వారు నొక్కిచెబుతారు. అంతేగాక ఆ విధంగా, సాక్షులు మొత్తానికి ఏదో మతశాఖ అదుపాజ్ఞల్లో నిర్బంధించబడివున్నారన్న తప్పుడు భావనను కలిగించడాన్ని నివారిస్తారు. నిజమే, పారిభాషికా పదాలకు సంబంధించి చేయబడిన సూచనలు ఎన్నడూ ఒక వివాదాంశం కాకూడదు. ఎంతైనా, అపార్థాలను నివారించేంత మేరకే పారిభాషికా పదాల ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ క్రైస్తవ సమతుల్యత కావాల్సివస్తుంది. “మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని” బైబిలు మనకు ఉద్బోధ చేస్తుంది. (2 తిమోతి 2:14, 15) లేఖనాలు ఈ సూత్రాన్ని కూడా ఇస్తున్నాయి: “మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును?”—1 కొరింథీయులు 14:9.
దేవుని ఆత్మ, నియమాల అవసరతను తగ్గిస్తుంది
5. మొదటి కొరింథీయులు 10:23ను ఎలా అర్థం చేసుకోవాలి?
5 “అన్ని విషయములు చట్టబద్ధమైనవే; కానీ అన్ని విషయములు ప్రయోజనకరమైనవి కావు” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “అన్ని విషయములు చట్టబద్ధమైనవే; కానీ అన్ని విషయములు క్షేమాభివృద్ధిని కలుగజేయవు.” (1 కొరింథీయులు 10:23, NW) పౌలు చెబుతున్న మాటలకు, దేవుని వాక్యము సుస్పష్టంగా ఖండించే కార్యాలను చేయడం చట్టబద్ధం అని కాదు భావం. ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దాదాపు 600 చట్టాలతో పోలిస్తే, క్రైస్తవ జీవితాన్ని నిర్దేశించే స్పష్టమైన ఆజ్ఞలు చాలా తక్కువే ఉన్నాయి. అందుకని, చాలా విషయాలు వ్యక్తిగత మనస్సాక్షికే విడిచిపెట్టబడ్డాయి. యెహోవాకు సమర్పించుకున్న వ్యక్తి దేవుని ఆత్మ నిర్దేశం వల్ల కలిగే స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తాడు. సత్యాన్ని తన స్వంతం చేసుకున్నవానిగా, ఒక క్రైస్తవుడు బైబిలు-శిక్షణ పొందిన తన మనస్సాక్షిని అనుసరిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా లభించే దేవుని నిర్దేశంపై ఆధారపడతాడు. ఇలా చేయడం సమర్పిత క్రైస్తవుడు తనకూ, ఇతరులకూ ఏది “క్షేమాభివృద్ధిని” కలుగజేస్తుందో ఏది ‘ప్రయోజనకరంగా’ ఉంటుందో నిర్ధారించుకోవడానికి సహాయం చేస్తుంది. తాను తీసుకునే నిర్ణయాలు తాను ఎవరికైతే సమర్పించుకున్నాడో ఆ దేవునితో తనకుగల వ్యక్తిగత సంబంధాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన గ్రహిస్తాడు.
6. క్రైస్తవ కూటాలవద్ద, మనం సత్యాన్ని మన స్వంతం చేసుకున్నట్లు ఎలా రుజువుచేయవచ్చు?
6 క్రైస్తవ కూటాలవద్ద వ్యాఖ్యానించడం ద్వారా, ఒక సాక్షి తాను సత్యాన్ని తన స్వంతం చేసుకున్నట్లు రుజువు చేస్తాడు. మొదట్లో, పఠిస్తున్న ప్రచురణలో ఏముందో దాన్నే ఆయన అప్పజెబుతుండవచ్చు. అయితే, కాలక్రమేణా ఆయన బైబిలు బోధలను తన స్వంత మాటల్లో వ్యక్తం చేసే స్థాయికి అభివృద్ధిచెందుతాడు. కేవలం ఇతరులు చెప్పినదాన్ని తిరిగి చెప్పక, ఆయన ఆ విధంగా తన ఆలోచనా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడని రుజువునిస్తాడు. తలంపులను తన స్వంత మాటల్లో కూర్చడం, సరియైన సత్యపదాలను హృదయపూర్వకంగా వ్యక్తం చేయడం ఆయనకు ఆహ్లాదాన్ని తెస్తుంది, ఆయన తన స్వంత మనస్సులో నిశ్చయపర్చుకున్నాడన్నదాన్ని చూపిస్తుంది.—ప్రసంగి 12:10; పోల్చండి రోమీయులు 14:5బి.
7. యెహోవా సేవకులు ఏ నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకున్నారు?
7 యెహోవాసాక్షులు దేవుని పట్లా, తోటి మానవుని పట్లా ప్రేమతో పురికొల్పబడతారు. (మత్తయి 22:36-40) ఇది నిజం, వారు ప్రపంచవ్యాప్త సహోదర సహవాసంగలవారిగా క్రీస్తు చూపించినటువంటి ప్రేమబంధంలో దగ్గరగా అల్లబడివున్నారు. (కొలొస్సయులు 3:14; 1 పేతురు 5:9) కానీ, నైతిక స్వేచ్ఛగలవారిగా, ప్రతి ఒక్కరు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికీ, రాజకీయంగా తటస్థంగా ఉండడానికీ, రక్తాన్ని విసర్జించడానికీ, కొన్ని రకాల వినోద వేడుకల్ని నివారించడానికీ, బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికీ వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాలు వారిపై బలవంతంగా రుద్దబడినవి కావు. అవి సాక్షులుకాదగ్గవారు క్రైస్తవ సమర్పణ అనే చర్యను తీసుకోవడానికి ముందే, తాముగా స్వేచ్ఛగా ఎంపిక చేసుకున్న జీవిత విధానంలో భాగం.
పరిపాలక సభకు లెక్క ఒప్పజెప్పవలసినవారా?
8. ఏ ప్రశ్నను స్పష్టపర్చవలసిన అవసరం ఉంది?
8 నిజ క్రైస్తవులు బలవంతం మీద దేవుని సేవ చేసేవారు కారని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. అది ఇలా చెబుతుంది: “ప్రభువే ఆత్మ. ప్రభువు [“యెహోవా,” NW] యొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.” (2 కొరింథీయులు 3:17) కానీ ఈ వాస్తవాన్ని, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు,’ ఆలాగే ఆ దాసుని పరిపాలక సభ అనే తలంపులతో ఎలా పొందిక చేయగలము?—మత్తయి 24:45-47.
9, 10. (ఎ) క్రైస్తవ సంఘంలో శిరస్సత్వ సూత్రం ఎలా వర్తిస్తుంది? (బి) శిరస్సత్వ సూత్రాన్ని అనుసరించడానికి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో ఏమి అవసరమైంది?
9 ఈ ప్రశ్నకు జవాబివ్వాలంటే, మనం శిరస్సత్వం అనే లేఖనాధార సూత్రాన్ని మనస్సులో ఉంచుకోవాలి. (1 కొరింథీయులు 11:3) ఎఫెసీయులు 5:21-24లో, క్రీస్తు ‘సంఘమునకు శిరస్సు’ అని గుర్తించబడ్డాడు, ఆ సంఘము ఆయనకు ‘లోబడివుంది.’ నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడంటే, యేసు యొక్క ఆధ్యాత్మిక సహోదరులని యెహోవాసాక్షులు గ్రహిస్తారు. (హెబ్రీయులు 2:10-13) ఈ ‘నమ్మకమైన దాసుని’ తరగతి, దేవుని ప్రజలకు “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము పెట్టుటకు” నియమించబడింది. ఈ అంత్యకాలములో, క్రీస్తు ఈ దాసుడ్ని “తన యావదాస్తిమీద” నియమించాడు. అందుకని క్రైస్తవులమని చెప్పుకునే ఎవరైనా ఆ దాసుని స్థానానికి గౌరవాన్ని చూపవలసివున్నారు.
10 శిరస్సత్వం సంకల్పం ఏమిటంటే ఐక్యతను కాపాడి, ‘సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగేలా’ నిశ్చయపర్చుకోవడమే. (1 కొరింథీయులు 14:40) దీన్ని సాధించడానికి మొదటి శతాబ్దంలో, మొత్తం గుంపుకు ప్రాతినిధ్యం వహించడానికి నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతినుండి కొంతమంది అభిషిక్త క్రైస్తవులు ఎంపిక చేసుకోబడ్డారు. అటుతర్వాత జరిగిన సంఘటనలు, ఈ మొదటి-శతాబ్దపు పరిపాలక సభ పర్యవేక్షణపై యెహోవా ఆమోదమూ, ఆయన ఆశీర్వాదమూ ఉన్నాయని రుజువుచేశాయి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ ఏర్పాటును ఆనందంగా స్వీకరించారు. అవును, ఆ ఏర్పాటు ఉత్పత్తి చేసిన ఫలితాలనుబట్టి వారు నిజంగా ఆనందాన్ని ప్రకటించి, అందుకు కృతజ్ఞతలు తెలిపారు.—అపొస్తలుల కార్యములు 15:1-32.
11. ప్రస్తుతదిన పరిపాలక సభను ఎలా దృష్టించాలి?
11 అటువంటి ఏర్పాటు నేడు కూడా విలువైనదే. ప్రస్తుతం, యెహోవాసాక్షుల పరిపాలక సభలో పదిమంది అభిషిక్త క్రైస్తవులు ఉన్నారు, వీరందరికీ క్రైస్తవులుగా దశాబ్దాల అనుభవం ఉంది. వారు మొదటి శతాబ్దపు పరిపాలక సభలాగానే యెహోవాసాక్షులకు ఆధ్యాత్మిక నిర్దేశాన్ని అందిస్తారు. (అపొస్తలుల కార్యములు 16:4) తొలి క్రైస్తవుల్లాగానే, సాక్షులు ఆరాధన విషయాల్లో బైబిలు ఆధారిత నిర్దేశం కొరకూ, నడిపింపు కొరకూ పరిపాలక సభలోని పరిణతి చెందిన సహోదరులవైపు ఆనందంతో చూస్తారు. పరిపాలక సభలోని సభ్యులు తమ తోటి క్రైస్తవుల్లాగానే యెహోవాకూ, యేసుక్రీస్తుకూ దాసులైనప్పటికీ బైబిలు మనకు ఇలా ఉపదేశిస్తుంది: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.”—హెబ్రీయులు 13:17.
12. ప్రతి క్రైస్తవుడు ఎవరికి లెక్క ఒప్పగించాలి?
12 లేఖనాలు పరిపాలక సభకు పైవిచారణ చేసే స్థానం ఇస్తున్నందున, యెహోవాసాక్షుల్లో ప్రతి ఒక్కరు ఆ సభకు తాము చేసే పనుల విషయమై లెక్క ఒప్పచెప్పాలా? రోమ్‌లోని క్రైస్తవులకు పౌలు వ్రాసిన ఈ మాటలనుబట్టి చూస్తే మాత్రం, అక్కరలేదు: “నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. . . . మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.”—రోమీయులు 14:10-12.
13. యెహోవాసాక్షులు తమ ప్రకటనా పనిని ఎందుకు రిపోర్టు చేస్తారు?
13 అయితే, ప్రతి సాక్షి తన ప్రకటనా పనిని గురించిన రిపోర్టును ఇవ్వాలని కోరబడడా? అవును, కానీ దీని సంకల్పం ఏమిటో సాక్షుల చేతిపుస్తకం ఒకటి ఇలా స్పష్టంగా తెలియజేస్తుంది: “యేసుక్రీస్తు తొలి అనుచరులు తమ ప్రచారపు పని అభివృద్ధిని గూర్చి రిపోర్టు చేయుటలో శ్రద్ధ కనబరచారు. (మార్కు 6:30) సేవ వృద్ధియగుకొలది, సువార్త ప్రకటించువారి ప్రముఖ అనుభవాలతో పాటు సంఖ్యాపరమైన రిపోర్టులు సేకరించారు. . . . (అపొస్తలుల కార్యములు 2:5-11, 41, 47; 6:7; 1:15; 4:4, NW) . . . చేసిన సేవనుగూర్చి రిపోర్టులను వినుటకు ఆ విశ్వాసులైన క్రైస్తవ సేవకులకు అవి ఎంత ప్రోత్సాహకరంగా వుండెనో! . . . అదేమాదిరి యెహోవా యొక్క ఆధునిక సంస్థ . . . మత్తయి 24:14లో చెప్పబడిన దానికి నెరవేర్పుగా చేసేపనికి సంబంధించిన కచ్చితమైన రికార్డులను భద్రపరచుటకు ప్రయత్నిస్తున్నది.”
14, 15. (ఎ) రెండవ కొరింథీయులు 1:24 పరిపాలక సభకు ఎలా వర్తిస్తుంది? (బి) ప్రతి క్రైస్తవుడు దేని ఆధారంగా వ్యక్తిగత నిర్ణయాలను తీసుకోవాలి, ఏ వాస్తవాన్ని గుర్తించి అలా చేయాలి?
14 పరిపాలక సభ ఒక ప్రేమపూర్వకమైన ఏర్పాటు, అది విశ్వాసం విషయంలో అనుకరించదగిన ఒక మాదిరి. (ఫిలిప్పీయులు 3:17; హెబ్రీయులు 13:7) క్రీస్తును ఒక మాదిరిగా అంటిపెట్టుకుని ఆయన్ను అనుసరించడం ద్వారా వారు పౌలు చెప్పిన ఈ మాటలనే ప్రతిధ్వనించగలరు: “మీ విశ్వాసముమీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము. విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.” (2 కొరింథీయులు 1:24) లోకం పోకడలను గమనిస్తూ పరిపాలక సభ, బైబిలు సలహాను అనుసరించడంవల్ల కలిగే ప్రయోజనాలవైపుకి అవధానాన్ని మళ్లిస్తుంది, బైబిలు నియమాలనూ, సూత్రాలనూ అన్వయించుకునే విషయంలో సూచనలు ఇస్తుంది, దాగివున్న ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది, తమ ‘సహకారులకు’ అవసరమైన ప్రోత్సాహాన్ని అందజేస్తుంది. ఆ విధంగా అది క్రైస్తవ గృహనిర్వాహకునిగా తన పనిని నెరవేరుస్తుంది, వారు తమ ఆనందాన్ని కొనసాగించుకొనేందుకు సహాయపడుతుంది, వారు స్థిరంగా నిలువగల్గేలా వారిని విశ్వాసంలో బలపరుస్తుంది.—1 కొరింథీయులు 4:1, 2; తీతుకు 1:7-9.
15 పరిపాలక సభ అందించిన బైబిలు సలహా ఆధారంగా ఒక సాక్షి ఏమైనా నిర్ణయాలను తీసుకున్నప్పుడు, ఆయనలా తన స్వంత చిత్తప్రకారమే చేసినట్లు, ఎందుకంటే తన స్వంత బైబిలు పఠనం ఆయనకు అదే సరియైన మార్గమన్న నమ్మకాన్ని కలుగజేసింది. తాను తీసుకునే నిర్ణయాలు, తను ఎవరికైతే సమర్పించుకున్నాడో ఆ దేవునితో తనకుగల వ్యక్తిగత సంబంధాన్ని ప్రభావితం చేస్తాయని పూర్తిగా గుర్తించి, పరిపాలక సభ అందించిన స్థిరమైన లేఖనాధార సలహాను అన్వయించుకునేందుకు ప్రతి సాక్షి దేవుని స్వంత వాక్యంచే ప్రభావితుడవుతాడు.—1 థెస్సలొనీకయులు 2:13.
విద్యార్థులు, సైనికులు
16. ప్రవర్తనకు సంబంధించిన నిర్ణయాలు వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ, కొందరు ఎందుకు బహిష్కరించబడ్డారు?
16 కానీ ప్రవర్తనకు సంబంధించిన నిర్ణయాలు వ్యక్తిగత విషయాలైతే, యెహోవాసాక్షుల్లో కొందరు ఎందుకు బహిష్కరించబడ్డారు? ఫలాని పాపం చేస్తూపోతుంటే బహిష్కరణ విధించాల్సిందేనని ఎవరూ నిర్హేతుకంగా నిర్ధారించరు. అందుకు బదులుగా, సంఘంలోని ఒక సభ్యుడు మొదటి కొరింథీయులు ఐదవ అధ్యాయంలో పేర్కొనబడిన ఘోరమైన పాపాలను పశ్చాత్తాపం లేకుండా చేస్తూపోతుంటే మాత్రమే ఈ చర్య లేఖనాధారంగా అవసరమౌతుంది. ఆ విధంగా, వ్యభిచారం చేస్తూవున్నందుకు ఒక క్రైస్తవుడ్ని బహిష్కరించడమన్నది, ఆ వ్యక్తి ప్రేమపూర్వకమైన కాపరుల ఆధ్యాత్మిక సహాయాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తేనే జరుగుతుంది. ఈ క్రైస్తవ చర్యను అనుసరించేది యెహోవాసాక్షులు మాత్రమే కాదు. ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ ఇలా అంటుంది: “తన సభ్యులకు అనురూపంగా ఉండడానికి తిరస్కరించేవారినుండి తనను కాపాడుకోవడం తన హక్కు అని ఏ సమాజమైనా అంటుంది. మత విషయంగా చూస్తే, ఆంక్షలు విధించడం దేవుని ఎదుట ఒకరి స్థానాన్ని ప్రభావితం చేస్తుందన్న నమ్మకం ఈ హక్కుకు మరింత బలంచేకూర్చింది.”
17, 18. బహిష్కరణ యుక్తమైనదని ఎలా దృష్టాంతపర్చవచ్చు?
17 యెహోవాసాక్షులు బైబిలు విద్యార్థులు. (యెహోషువ 1:8; కీర్తన 1:2; అపొస్తలుల కార్యములు 17:11) పరిపాలక సభ అందించే బైబిలు విద్యా కార్యక్రమాన్ని ఒక విద్యా శాఖ అందించే పాఠశాల కోర్సుతో పోల్చవచ్చు. బోధించబడుతున్న పాఠాలకు మూలం ఆ విద్యాశాఖే కాకపోయినప్పటికీ, ఆ శాఖ కోర్సును మాత్రం నియమిస్తుంది, బోధనా పద్ధతిని నిర్ణయిస్తుంది, కావల్సిన నిర్దేశాలను జారీచేస్తుంది. ఎవరైనా పాఠశాల నియమాలకు అనుగుణ్యంగా జీవించడానికి మూర్ఖత్వంతో తిరస్కరించి, తోటి విద్యార్థులకు సమస్యలను సృష్టిస్తూ, లేక పాఠశాలకే తలవంపులు తీసుకొస్తూ ఉంటే ఆ వ్యక్తి బహిష్కరించబడవచ్చు. మొత్తం విద్యార్థులందరి ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని చర్య తీసుకునే హక్కు స్కూలు అధికారులకు ఉంది.
18 యెహోవాసాక్షులు విద్యార్థులు మాత్రమే కారు, వారు యేసుక్రీస్తు సైనికులు కూడాను. ‘విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుమని’ వారికి బోధించబడింది. (1 తిమోతి 6:12; 2 తిమోతి 2:3) సహజంగానే, ఒక క్రైస్తవ సైనికునికి తగనివిధంగా ప్రవర్తిస్తూ ఉన్నందుకు దైవిక అంగీకారాన్ని కోల్పోవచ్చు. ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం ఇవ్వబడిన ఒక వ్యక్తిగా, ఒక క్రైస్తవ సైనికుడు తనకు ఇష్టంవచ్చినట్లే నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ తన నిర్ణయాలవల్ల కలిగే పరిణామాలను కూడా ఆయన భరించాలి. పౌలు ఇలా తర్కిస్తున్నాడు: “సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.” (2 తిమోతి 2:4, 5) పరిపాలక సభలోని సభ్యులతో సహా పరిణతి చెందిన క్రైస్తవులు, నిత్యజీవ బహుమానాన్ని గెలుచుకోగల్గేలా ‘నియమాలను’ అనుసరిస్తూ, పూర్తిగా తమ నాయకుడైన యేసుక్రీస్తు అధీనంలో ఉంటారు.—యోహాను 17:3; ప్రకటన 2:10.
19. క్రైస్తవ సమర్పణను గురించిన వాస్తవాలను పరిశీలించిన పిమ్మట, మనం దేని గురించి నిశ్చయతతో ఉండవచ్చు?
19 యెహోవాసాక్షులు దేవుని సేవకులనీ, వారు మనుష్యులకు దాసులు కారనీ వాస్తవాలు స్పష్టం చేయడంలేదా? సమర్పించుకున్న క్రైస్తవులుగా క్రీస్తు తమను దేనికి స్వతంత్రులను చేశాడో ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ, దేవుని సంఘంలోని తమ సహోదరులతో తాము ఐక్యంగా సేవచేస్తుండగా, వారు దేవుని ఆత్మ, ఆయన వాక్యము తమ జీవితాలను నియంత్రించడానికి అనుమతిస్తారు. (కీర్తన 133:1) ఇందుకుగల రుజువులు వారి బలానికిగల మూలాన్ని గురించిన సందేహాలన్నింటినీ కూడా తుడిచివేయాలి. కీర్తనల గ్రంథకర్తతోపాటు వారు ఇలా పాడగలరు: “నాకు యెహోవాయే బలం. ఆయన నాకు డాలులాంటివాడు. హృదయపూర్వకంగా ఆయనను నమ్ముకొన్నాను, అందుచేత నాకు సాయం లభించింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతూవుంది. నా కీర్తనద్వారా ఆయనకు కృతజ్ఞత అర్పిస్తాను.”—కీర్తన 28:7, పవిత్ర గ్రంథం—వ్యాఖ్యాన సహితం.
[అధస్సూచి]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ 1993లో ప్రచురించింది.
మీరెలా జవాబిస్తారు?
◻ వాచ్ టవర్ సొసైటీ, అటువంటి మరితర చట్టబద్ధమైన సంస్థలూ యెహోవాసాక్షులకు ఎలా సహాయం చేస్తాయి?
◻ యెహోవాసాక్షుల పరిపాలక సభ పోషించే పాత్రనుండి క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందుతారు?
◻ యెహోవా ప్రజలు తమ ప్రకటనా పనిని గురించి ఎందుకు రిపోర్టు చేస్తారు?
◻ ఒక సమర్పిత క్రైస్తవుడ్ని బహిష్కరించడం ఏ పరిస్థితుల్లో యుక్తమైనది?
[19వ పేజీలోని చిత్రం]
మొదటిశతాబ్దపు పరిపాలక సభ సిద్ధాంతపరమైన ఏకత్వాన్ని కాపాడింది
[23వ పేజీలోని చిత్రం]
ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు క్రీస్తు తమను దేనికి స్వతంత్రులను చేశాడో ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు