కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 11/15 పేజీలు 5-7
  • న్యాయమైన లోకం—కేవలం ఒక కల కాదు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • న్యాయమైన లోకం—కేవలం ఒక కల కాదు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానవుడు ఎందుకు విఫలమయ్యాడు?
  • ఒక న్యాయమైన లోకం వాస్తవికమైనదే—ఎలా?
  • న్యాయమైన లోకంలో జీవితం
  • యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • దేవుడు అన్యాయమును గూర్చి ఎప్పుడైన ఏమైన చేస్తాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • “దేవుడు అన్యాయస్థుడా?”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • న్యాయము దేవుని మార్గములన్నింటిని గుర్తించుచున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 11/15 పేజీలు 5-7

న్యాయమైన లోకం—కేవలం ఒక కల కాదు!

“భూమ్మీది మానవునికి ఉన్న చింతల్లో గొప్పది—న్యాయం” అని ప్రముఖ అమెరికా రాజనీతిజ్ఞుడు డానియెల్‌ వెబ్‌స్టర్‌ అన్నాడు. బైబిలు ఇలా అంటుంది: “యెహోవా న్యాయమును ప్రేమించువాడు.” (కీర్తన 37:28) దేవుని స్వరూపంలో చేయబడిన మొదటి మానవ దంపతులకు దైవిక లక్షణాలు ఉన్నాయి, వాటిలో న్యాయ భావన కూడా ఉంది.—ఆదికాండము 1:26, 27.

‘ధర్మశాస్త్రము లేనప్పటికీ స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసే అన్యజనుల’ గురించి కూడా లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆ విధంగా, “అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.” (రోమీయులు 2:14, 15) అవును, మానవులకు మనస్సాక్షి అనే నిగూఢశక్తి, అంటే మంచిచెడులను వివేచించే ఒక అంతర్గతమైన భావన ఇవ్వబడింది. స్పష్టంగానే, న్యాయం కొరకైన అవసరత మానవునిలో స్వాభావికంగానే ఉంది.

న్యాయం కొరకైన అవసరతతో దగ్గరి సంబంధం గలది సంతోషం కొరకైన మానవుని అన్వేషణ. ఎందుకంటే కీర్తన 106:3 ఇలా చెబుతుంది: “న్యాయము ననుసరించువారు, ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.” అయితే, మానవుడు న్యాయమైన లోకాన్ని ఎందుకు తీసుకురాలేకపోయాడు?

మానవుడు ఎందుకు విఫలమయ్యాడు?

ఒక న్యాయమైన లోకాన్ని సాధించడంలోని వైఫల్యతకు ఒక ప్రాథమికమైన కారణం, మన ఆది తలిదండ్రులైన ఆదాము హవ్వల నుండి వారసత్వంగా మనకు వచ్చిన దోషమే. బైబిలు ఇలా వివరిస్తుంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ఆ దోషం పాపమే. నిర్దోషంగా సృజింపబడినా, ఆదాము హవ్వలు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయడానికి నిశ్చయించుకున్నారు, అలా వారు తమను తాము పాపులుగా చేసుకున్నారు. (ఆదికాండము 2:16, 17; 3:1-6) ఇందు మూలాన, వారు తమ పిల్లలకు పాపభరితమైన, తప్పుడు ప్రవృత్తుల వారసత్వాన్ని మిగిల్చిపోయారు.

దురాశ, దురభిమానం వంటి వ్యక్తిత్వ లక్షణాలు పాపభరిత ప్రవృత్తుల ఫలితాలు కావా? మరి ఈ లక్షణాలు లోకంలోని అన్యాయాలకు కారణం కావడం లేదా? అంతెందుకు, ఉద్దేశపూర్వకంగా పర్యావరణాన్ని నాశనం చేయడానికీ, ఆర్థిక అణచివేతకూ మూల కారణం దురాశే! జాతిపరమైన సంఘర్షణలకు, అన్యాయాలకు మూలహేతువు నిశ్చయంగా దురభిమానమే. అటువంటి లక్షణాలు ప్రజల్ని దోచుకోవడానికి, మోసం చేయడానికి, ఇతరులకు హాని కలిగించే విధంగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తాయి.

న్యాయాన్ని అమలుపర్చడానికీ, మేలు చేయడానికీ ఎంతో ఉన్నతమైన సంకల్పాలతో చేసే ప్రయత్నాలు కూడా తరచు విఫలమౌతుంటాయి, దానికి కారణం మనం పాపంవైపు మొగ్గు చూపడమే. అపొస్తలుడైన పౌలు తానుగా ఇలా ఒప్పుకున్నాడు: “నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.” ఆ సంఘర్షణను వివరిస్తూ ఇంకా ఇలా అంటున్నాడాయన: “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.” (రోమీయులు 7:19-23) బహుశ, మనం కూడా నేడు అటువంటి సంఘర్షణే అనుభవిస్తుండవచ్చు. అందుకనే అన్యాయాలు అంత తరచుగా జరుగుతున్నాయి.

మానవ పరిపాలనా విధానం కూడా లోకంలోని అన్యాయానికి తోడ్పడింది. ప్రతి దేశంలోనూ చట్టాలున్నాయి, వాటిని అమలుపర్చేవారూ ఉన్నారు. జడ్జీలున్నారు, కోర్టులున్నాయి. నిశ్చయంగా, నీతినియమాలుగల కొంతమంది వ్యక్తులు మానవ హక్కులను సమర్థించడానికీ, అందరికీ సమాన న్యాయం జరిగేలా చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయినా, వారి ప్రయత్నాల్లో అత్యధికం విఫలమయ్యాయి. ఎందుకు? వారి వైఫల్యంలో ఇమిడివున్న వివిధ మూల కారకాలను సారాంశపూర్వకంగా, యిర్మీయా 10:23 ఇలా చెబుతుంది: “యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” దేవుని నుండి వేరుపడిన మానవుడు ఒక నీతియుక్తమైన, న్యాయమైన లోకాన్ని స్థాపించడంలో విఫలమైపోయాడు.—సామెతలు 14:12; ప్రసంగి 8:9.

న్యాయమైన లోకాన్ని నిర్మించడానికి మానవుడు చేసే ప్రయత్నాలకు ఒక పెద్ద అవరోధం అపవాదియైన సాతానే. తిరుగుబాటు చేసిన దేవదూతయగు సాతానే తొలి ‘నరహంతకుడు’ అనీ “అబద్ధికుడు” అనీ బైబిలు స్పష్టంగా చెబుతుంది. అంతేగాక “లోకమంతయు దుష్టునియందున్నదని” కూడా బైబిలు చెబుతుంది. (యోహాను 8:44; 1 యోహాను 5:19) అపొస్తలుడైన పౌలు అతనిని “ఈ యుగ సంబంధమైన దేవత” అని గుర్తిస్తున్నాడు. (2 కొరింథీయులు 4:3, 4) సాతాను నీతిని అసహ్యించుకునే వ్యక్తి గనుక అతడు దుష్టత్వాన్ని పెంపొందించేందుకు తనకు చేతనైనదంతా చేస్తాడు. ఈ లోకాన్ని అతడు నియంత్రించినంత వరకు అన్ని రకాల అన్యాయాలు వాటి పర్యవసానంగా వచ్చే శ్రమలు మానవజాతిని పట్టిపీడిస్తునే ఉంటాయి.

దీనంతటి అర్థం మానవ సమాజంలో అన్యాయం తీసివేయలేనిదనా? ఒక న్యాయమైన లోకం నిజంకాలేని ఒక కలయేనా?

ఒక న్యాయమైన లోకం వాస్తవికమైనదే—ఎలా?

ఒక న్యాయమైన లోకం కోసరమైన నిరీక్షణ వాస్తవరూపం దాల్చాలంటే, అన్యాయాలకు కారణమైన వాటిని రూపుమాపగల్గే ఒక మూలాధారం వైపుకి మానవజాతి తిరగాలి. కానీ పాపాన్ని తీసివేసి, సాతానునీ అతని పరిపాలననూ కూకటివేళ్లతో సహా పెకిలించగలవారు ఎవరు? స్పష్టంగా, ఏ మానవమాత్రుడూ లేక ఏ మానవ సంస్థా అటువంటి అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయలేరు. యెహోవా దేవుడు మాత్రమే చేయగలడు! ఆయనను గురించి బైబిలు ఇలా చెబుతుంది: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4) యెహోవా “న్యాయమును ప్రేమించువాడు” గనుక మానవజాతి ఒక న్యాయమైన లోకంలో జీవితాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు.—కీర్తన 37:28.

ఒక న్యాయమైన లోకాన్ని తీసుకురావడానికైన దేవుని ఏర్పాటును గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) ఈ ‘క్రొత్త ఆకాశములు’ ఏవో క్రొత్తవైన భౌతిక ఆకాశములు కావు. దేవుడు మన భౌతిక ఆకాశాల్ని పరిపూర్ణంగా చేశాడు, అవి ఆయనకు మహిమను తెస్తున్నాయి. (కీర్తన 8:3; 19:1, 2) భూమిపైన పరిపాలించే ఒక క్రొత్త ఆధిపత్యమే ‘క్రొత్త ఆకాశములు.’ ప్రస్తుత ‘అకాశములు’ మానవనిర్మిత ప్రభుత్వాలను సూచిస్తున్నాయి. చాలా త్వరలో, దేవుని యుద్ధమైన అర్మగిద్దోనులో ఇవి, “క్రొత్త ఆకాశముల” కొరకు—దేవుని పరలోక రాజ్యం లేదా ప్రభుత్వం కొరకు స్థానమివ్వడానికి తీసివేయబడతాయి. (ప్రకటన 16:14-16) ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు. మానవ పరిపాలనకు శాశ్వత ముగింపును తీసుకువచ్చి, ఈ ప్రభుత్వం యుగయుగముల వరకు పరిపాలిస్తుంది.—దానియేలు 2:44.

మరైతే, “క్రొత్త భూమి” ఏమిటి? అది ఏదో క్రొత్త గ్రహం కాదు, ఎందుకంటే దేవుడు భూమిని పరిపూర్ణంగా మానవ నివాసానికి యోగ్యంగా ఉండేలా చేశాడు, మరి అది నిరంతరం నిలిచివుండాలన్నది ఆయన చిత్తం. (కీర్తన 104:5) ఈ “క్రొత్త భూమి” ఒక క్రొత్త మానవ సమాజాన్ని సూచిస్తుంది. (ఆదికాండము 11:1; కీర్తన 96:1) నాశనమయ్యే “భూమి” ఏదంటే, తమనుతాము ఈ దుష్ట విధానంలో భాగస్తులుగా చేసుకునే ప్రజలే. (2 పేతురు 3:7) దుష్టత్వాన్ని ద్వేషించి, నీతినీ న్యాయాన్నీ ప్రేమించే దేవుని నిజ సేవకులే వారి స్థానంలో వచ్చే ఆ “క్రొత్త భూమి.” (కీర్తన 37:10, 11) ఆ విధంగా, సాతాను లోకం నాశనమౌతుంది.

మరి సాతానుకు ఏమి జరుగబోతుంది? అపొస్తలుడైన యోహాను ముందే ఇలా చెప్పాడు: “అతడు [యేసుక్రీస్తు] ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను.” (ప్రకటన 20:1-3) నేలమాళిగలో బంధించబడిన ఖైదీ ఎలాగైతే ఎటువంటి ప్రభావాన్నీ చూపలేడో, అలాగే సంకెళ్లతో బంధించబడిన సాతాను కూడా ఇక ఎటువంటి ప్రభావాన్నీ చూపలేడు. మానవజాతికి ఎంత ఉపశమనంగా ఉంటుంది! ఈ ఉపశమనం ఒక న్యాయమైన లోకానికి ముంగుర్తుగా ఉంటుంది. వెయ్యేండ్ల అంతంలో సాతాను అసలు ఉనికిలోనే లేకుండా నిర్మూలించబడతాడు.—ప్రకటన 20:7-10.

అయితే వారసత్వంగా వచ్చిన పాపం సంగతేమిటి? యెహోవా ఇప్పటికే పాపాన్ని నిర్మూలించడానికి ఆధారాన్ని అందించాడు. “ఆలాగే మనుష్యకుమారుడు [యేసుక్రీస్తు] . . . అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చె[ను].” (మత్తయి 20:28) “విమోచన క్రయధనము” అనే మాట బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి అవసరమయ్యే రుసుమును సూచిస్తుంది. యేసుక్రీస్తు మానవజాతిని విమోచించడానికి తన పరిపూర్ణ మానవ జీవితాన్ని విమోచన క్రయధనముగా చెల్లించాడు.—2 కొరింథీయులు 5:14; 1 పేతురు 1:18, 19.

యేసు చెల్లించిన విమోచన క్రయధన బలి మనకు ఇప్పుడూ ప్రయోజనం చేకూర్చగలదు. దానియందు విశ్వాసముంచడం ద్వారా మనం దేవుని ఎదుట ఒక పరిశుభ్రమైన స్థానాన్ని అనుభవించగలము. (అపొస్తలుల కార్యములు 10:43; 1 కొరింథీయులు 6:11) దేవుని రాజ్య పరిపాలన క్రింద, మానవజాతి పాపం నుండి పూర్తిగా విముక్తి పొందడాన్ని విమోచన క్రయధనం సాధ్యపరుస్తుంది. బైబిలులోని ఆఖరి పుస్తకం దేవుని సింహాసనం నుండి బయలువెడలే అలంకారికమైన “జీవజలముల నది”ని వర్ణిస్తుంది. దానికి ఇరుప్రక్కలా “జనములను స్వస్థపరచుటకై” ఆకులుగల సూచనార్థకమైన పండ్ల చెట్లు ఉన్నాయి. (ప్రకటన 22:1, 2) యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా మానవజాతిని పాపం నుండి విముక్తి చేయడానికి సృష్టికర్త చేసిన అద్భుతమైన ఏర్పాటును బైబిలు ఇక్కడ చిత్రిస్తుంది. ఈ ఏర్పాటును పూర్తిగా అన్వయించడం, పాపమరణముల నుండి విధేయులైన మానవులను విడుదల చేస్తుంది.

న్యాయమైన లోకంలో జీవితం

రాజ్య పరిపాలన క్రింద జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నేరము, హింస గతించిపోయినవై ఉంటాయి. (సామెతలు 2:21, 22) ఆర్థిక అన్యాయం అంతమైపోయి ఉంటుంది. (కీర్తన 37:6; 72:12, 13; యెషయా 65:21-23) సాంఘికమైన, జాతిపరమైన, తెగపరమైన, వర్గపరమైన విచక్షణల జాడలన్నీ రూపుమాపబడతాయి. (అపొస్తలుల కార్యములు 10:34, 35) యుద్ధాలు, యుద్ధ సామగ్రి ఇక ఉండవు. (కీర్తన 46:9) చనిపోయిన లక్షలాదిమంది, అన్యాయం లేని లోకంలో తిరిగి సజీవులౌతారు. (అపొస్తలుల కార్యములు 24:15) ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన పూర్తి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. (యోబు 33:25; ప్రకటన 21:3, 4) “[యేసుక్రీస్తు] సత్యము ననుసరించి న్యాయమును కనుపరచును” అని బైబిలు హామీనిస్తుంది.—యెషయా 42:3.

ఈ లోపల, మనకు అన్యాయం జరుగవచ్చు, కానీ మనం తిరిగి అన్యాయంగా ప్రవర్తింపకుందాము. (మీకా 6:8) అన్యాయాన్ని సహించాల్సివచ్చినప్పటికీ మనం ఆశాభావ దృక్పథం కలిగివుందాము. వాగ్దానం చేయబడిన న్యాయమైన లోకం త్వరలోనే ఒక వాస్తవరూపం దాల్చుతుంది. (2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:11-13) సర్వశక్తిమంతుడైన దేవుడు మాట ఇచ్చాడు, అది తప్పక “నెరవేరుతుంది.” (యెషయా 55:10, 11, NW) దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో నేర్చుకోవడం ద్వారా, ఆ న్యాయమైన లోకంలో జీవితం కొరకు సిద్ధపడే సమయం ఇదే.—యోహాను 17:3; 2 తిమోతి 3:16, 17.

[7వ పేజీలోని చిత్రం]

వాగ్దానం చేయబడిన దేవుని నూతన లోకంలో అన్యాయపు జాడలన్నీ రూపుమాపబడతాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి