చర్య తీసుకోవడానికి విశ్వాసం మనల్ని ప్రేరేపిస్తుంది!
“విశ్వాసము అతని [అబ్రాహాము] క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?”—యాకోబు 2:22.
1, 2. మనకు విశ్వాసం ఉంటే మనమెలా ప్రవర్తిస్తాం?
తమకు దేవునియందు విశ్వాసం ఉందని అనేకులు చెబుతారు. అయినా విశ్వాసాన్ని కల్గివున్నామని కేవలం చెప్పుకోవడం ప్రాణంలేని మృతదేహం లాంటిది. “విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును” అని శిష్యుడైన యాకోబు రాశాడు. దైవభయం గల అబ్రాహాముకు అతని “క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజే[సిన]” విశ్వాసం ఉందని కూడా ఆయన చెప్పాడు. (యాకోబు 2:17, 22) అలాంటి మాటలు మన విషయంలో ఏ ప్రాముఖ్యతను కల్గివున్నాయి?
2 మనకు నిజమైన విశ్వాసం ఉంటే, క్రైస్తవ కూటాల్లో మనం విన్న వాటిని కేవలం నమ్మేవారిగా ఉండం. మనం యెహోవా దేవుని చురుకైన సాక్షులం గనుక విశ్వాసానికి తగిన రుజువును ఇస్తాం. అవును, జీవితంలో దేవుని వాక్యాన్ని అన్వయించుకునేలా విశ్వాసం మనల్ని పురికొల్పుతుంది. అది చర్య తీసుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది.
పక్షపాతం విశ్వాసంతో పొందికగలది కాదు
3, 4. ఇతరులతో మనం ప్రవర్తించే విధానాన్ని విశ్వాసమెలా ప్రభావితం చేయాలి?
3 దేవునియందూ, క్రీస్తునందూ మనకు యథార్థమైన విశ్వాసం ఉంటే, మనం పక్షపాతవైఖరిని చూపించం. (యాకోబు 2:1-4) యాకోబు తన పత్రికను ఎవరికైతే రాశాడో వారిలో కొందరు, నిజ క్రైస్తవులకు ఉండాల్సిన నిష్పక్షపాతవైఖరిని చూపించలేదు. (రోమీయులు 2:11) కాబట్టి యాకోబు ఇలా అడుగుతున్నాడు: “[మీరు] మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయంలో మోమాటంగలవారై [“పక్షపాతవైఖరిగలవారై,” NW] యుండకుడి.” బంగారపు ఉంగరాలు పెట్టుకొని ప్రశస్త వస్త్రాల్ని ధరించుకొన్న అవిశ్వాసియైన ధనవంతుడొకడూ, ‘మురికి బట్టలు కట్టుకొన్న’ బీదవాడొకడూ కూటానికి వచ్చినట్లైతే, ఇరువుర్నీ సగౌరవంగా ఆహ్వానించాలి, అయితే ప్రత్యేకమైన శ్రద్ధ ధనవంతునికే చూపించబడింది. బీదవారైన అవిశ్వాసుల్ని నిల్చోమనో లేక ఎవరో ఒకరి పాదాల చెంతన నేలపై కూర్చోమనో చెప్పి, ధనవంతుల్ని ‘మంచి స్థలమందు’ కూర్చోబెట్టేవారు.
4 యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధనబలిని ధనికులకూ బీదలకూ ఒకే విధంగా యెహోవా దయచేశాడు. (2 కొరింథీయులు 5:14) కాబట్టి, మనం పక్షపాతంతో ధనికుల ఎడల ఆదరణ చూపించినట్లైతే, “తన దారిద్ర్యమువలన [మనం] ధనవంతు[లం] కావలెనని, [మన] నిమిత్తము దరిద్రు[డైన]” క్రీస్తు విశ్వాసం నుండి మనం వైదొలగిపోతాం. (2 కొరింథీయులు 8:9) ఆ విధంగా, స్వలాభాపేక్షతో మనుషుల్ని ఘనపర్చే తగని దృక్పథంతో మనం ప్రజల్ని ఎన్నడూ తీర్పుతీర్చకుండా ఉందాం. దేవుడు పక్షపాతికాడు గనుక మనం పక్షపాతం చూపించినట్లైతే మనం “దురాలోచనతో విమర్శచేసిన” వారమౌతాం. (యోబు 34:19) దేవున్ని ప్రీతిపర్చాలనే కోరికతో, పక్షపాతాన్ని చూపించే లేక “లాభమునిమిత్తము మనుష్యులను కొనియా[డే]” దుష్ప్రేరణకు మనం కచ్చితంగా లోబడకూడదు.—యూదా 4, 16.
5. ‘విశ్వాసమందు భాగ్యవంతులుగా’ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, వస్తుదాయకంగా ధనవంతులైనవారు తరచూ ఎలా ప్రవర్తిస్తారు?
5 యాకోబు నిజమైన ధనవంతుల్ని గుర్తిస్తూ, ప్రేమను నిష్పక్షపాతంగా అందరికీ చూపించాలని ఉద్బోధిస్తున్నాడు. (యాకోబు 2:5-9) ‘బీదల్ని విశ్వాసంలో భాగ్యవంతులుగానూ, రాజ్యవారసులుగానూ దేవుడు ఏర్పరచుకున్నాడు.’ ఇది నిజం, ఎందుకంటే తరచూ బీదలే సువార్తకు ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. (1 కొరింథీయులు 1:26-29) బాకీపడిన ధనం విషయంలోనూ, వేతనాల విషయంలోనూ, చట్టపరమైన చర్యల విషయంలోనూ ఒక తరగతిగా భౌతికంగా ధనవంతులైనవాళ్లు ఇతరుల్ని అణగద్రొక్కుతారు. వాళ్లు క్రీస్తును దూషిస్తారు, మనం ఆయన నామాన్ని ధరించుకొన్నందుకు మనల్ని హింసిస్తారు. అయితే, ధనికులనూ బీదలనూ సమానంగా ప్రేమించే పొరుగువానిపై ప్రేమను చూపించాలని కోరే ‘ప్రాముఖ్యమైన ఆజ్ఞకు’ విధేయత చూపించాలని మనం నిర్ణయించుకుందాం. (లేవీయకాండము 19:18; మత్తయి 22:37-40) దేవుడు దీన్ని కోరుతున్నాడు గనుక పక్షపాతాన్ని చూపించడం అంటే ‘పాపం చేయడమే.’
‘కనికరం తీర్పును మించి అతిశయిస్తుంది’
6. మనం ఇతరులతో దయాపూర్వకంగా వ్యవహరించకపోతే, మనమెలా నియమోల్లంఘన చేసినవారం కాగలం?
6 మనం నిర్దయగా పక్షపాతాన్ని చూపిస్తే, మనం నియమోల్లంఘన చేసిన వారమౌతాం. (యాకోబు 2:10-13) ఈ విషయంలో తప్పిపోవడం ద్వారా, దేవుని ఆజ్ఞలన్నిటి విషయంలో మనం అపరాధులమౌతాం. ఇశ్రాయేలీయుల్లో వ్యభిచరించకపోయినప్పటికీ దొంగతనం చేసిన వ్యక్తులు ధర్మశాస్త్రం విషయంలో అపరాధులుగా తీర్పుతీర్చబడ్డారు. క్రైస్తవులముగా, మనం “స్వతంత్ర ప్రజల నియమం” (NW) ద్వారా అంటే స్వతంత్ర ప్రజలైన క్రొత్త నిబంధనలోని ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల నియమం ద్వారా తీర్పుపొందుతాం. వాళ్లు తమ హృదయాల్లో దాని ఆజ్ఞల్ని కల్గివున్నారు.—యిర్మీయా 31:31-33.
7. నిర్విరామంగా పక్షపాతాన్ని చూపించేవారు దేవుని నుండి దయను ఎందుకు అపేక్షించలేరు?
7 మనకు విశ్వాసం ఉందని చెప్పుకొన్నా పక్షపాతాన్ని చూపిస్తూ ఉన్నట్లైతే, మనం అపాయంలో ఉన్నవారమౌతాం. ప్రేమనూ కనికరాన్నీ చూపనివారు, కనికరంలేని తీర్పు పొందుతారు. (మత్తయి 7:1, 2) యాకోబు ఇలా చెబుతున్నాడు: ‘కనికరం తీర్పును మించి అతిశయపడుతుంది.’ మన వ్యవహారాలన్నింటిలో కనికరాన్ని చూపించడం ద్వారా యెహోవా దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును గనుక మనం అంగీకరిస్తే, మనం తీర్పుతీర్చబడినప్పుడు అపరాధులుగా తృణీకరించబడం. బదులుగా, మనం కనికరాన్ని అనుభవిస్తాం. ఆ విధంగా, మనం కఠినమైన తీర్పుపై లేక తీవ్రమైన తీర్పుపై గెలుపును పొందుతాం.
విశ్వాసం శ్రేష్ఠమైన క్రియల్ని కలుగజేస్తుంది
8. తనకు విశ్వాసం ఉందని చెప్పుకున్న క్రియల్లేని వ్యక్తి పరిస్థితి ఏమైవుంది?
8 మనల్ని ప్రేమా, కనికరంగల వారిగా చేయడమేగాక, విశ్వాసం ఇతర శ్రేష్ఠమైన క్రియల్ని కూడా కలుగజేస్తుంది. (యాకోబు 2:14-26) క్రియలు లేకుండా విశ్వాసముందని చెప్పుకోవడం మనల్ని కాపాడదనుకోండి. నిజమే, ధర్మశాస్త్రసంబంధ క్రియల ద్వారా మనం దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడే అర్హతను సంపాదించలేం. (రోమీయులు 4:2-5) ధర్మశాస్త్రం ప్రేరేపించిన క్రియల్ని గురించిగాక విశ్వాస ప్రేమలు ప్రేరేపించిన క్రియల్ని గురించే యాకోబు మాట్లాడుతున్నాడు. అలాంటి లక్షణాలు మనల్ని ప్రేరేపిస్తే, అవసరతలో ఉన్న తోటి ఆరాధికునితో మనం కేవలం కనికరంగల మాటలే మాట్లాడం. వస్త్రాల్లేని లేక ఆకలితో ఉన్న సహోదరునికో లేక సహోదరికో మనం వస్తుదాయక సహాయం చేస్తాం. యాకోబు ఇలా అడుగుతున్నాడు: “కావలసినవాటిని ఇయ్యక—సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని” అవసరతలో ఉన్నవానితో మీరు చెబితే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనమేమీ ఉండదు. (యోబు 31:16-22) అలాంటి “విశ్వాసము” జీవంలేనిది.
9. మనకు విశ్వాసం ఉందని ఏది చూపిస్తుంది?
9 మనం కొంతమేరకు దేవుని ప్రజలతో సహవసిస్తూ ఉండవచ్చు, కానీ విశ్వాసాన్ని కల్గివున్నామని మనం చెప్పుకోవడాన్ని హృదయపూర్వకంగా చేసే క్రియలే సమర్థించగలవు. త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించి, సత్య దేవుడొక్కడేనని మనం నమ్మడం మంచిదే! కానీ, వట్టి నమ్మకమే విశ్వాసం కాదు. ‘దయ్యాలు కూడా నమ్మి,’ తమ కొరకు పొంచివున్న నాశనాన్నిబట్టి భయంతో ‘వణకుతున్నారు.’ మనకు నిజంగా విశ్వాసం ఉంటే సువార్తను ప్రకటించడం, అవసరతలో ఉన్న తోటి విశ్వాసులకు అన్నవస్త్రాల్ని ఇవ్వడం వంటి క్రియల్ని చేసేలా అది మనల్ని ప్రేరేపిస్తుంది. యాకోబు ఇలా అడుగుతున్నాడు: “[దేవుని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానంతో నింపబడని] వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసికొనగోరుచున్నావా?” అవును, విశ్వాసానికి తగిన క్రియలు అవసరం.
10. “నమ్మినవారికందరికి . . . తండ్రి” అని అబ్రాహాము ఎందుకు పిలువబడ్డాడు?
10 దైవభక్తిగల పితరుడగు అబ్రాహాము విశ్వాసం, క్రియలు చేయడానికి ఆయనను ప్రేరేపించింది. “నమ్మినవారికందరికి . . . తండ్రి”గా ఆయన “తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు [తన] క్రియలవలన నీతిమంతుడని తీర్పు” పొందాడు. (రోమీయులు 4:11, 12; ఆదికాండము 22:1-14) దేవుడు ఇస్సాకును పునరుత్థానం చేయగలడనే, అతని ద్వారా సంతానాన్ని కలుగజేస్తానని తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చగలడనే విశ్వాసం అబ్రాహాముకు లేకపోతే ఏమి చేసేవాడు? అబ్రాహాము తన కుమారున్ని అర్పించడానికి ప్రయత్నించి ఉండేవాడే కాదు. (హెబ్రీయులు 11:19) అబ్రాహాము విధేయతతో చేసిన “క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైన[ది]” లేక సంపూర్ణమైనది. “కాబట్టి—అబ్రాహాము దేవుని [యెహోవాను] నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము [ఆదికాండము 15:6] నెరవేర్చబడెను.” అబ్రాహాము నీతిమంతుడని దేవుడు ముందు ప్రకటించిన దానిని, ఇస్సాకును అర్పించేందుకు ప్రయత్నించడంలో అబ్రాహాము చూపించిన క్రియలు ధృవపర్చాయి. విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా, దేవుని ఎడలగల తన ప్రేమను చూపించి, ఆయన “దేవుని [యెహోవా] స్నేహితుడని” పిలువబడ్డాడు.
11. రాహాబు విషయంలో విశ్వాసానికి సంబంధించిన ఏ రుజువును మనం కల్గివున్నాం?
11 “మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని” అబ్రాహాము రుజువుపర్చాడు. యెరికో పట్టణంలో వేశ్యయైన రాహాబు విషయంలో కూడా అది నిజమని రుజువైంది. ఆమె “[ఇశ్రాయేలీయులకు చెందిన] దూతలను [ఆతిధ్యపూర్వకంగా] చేర్చుకొని” వాళ్లు కనానీయులైన తమ శత్రువుల బారినుండి తప్పించుకొని పారిపోయేలా “వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను.” ఇశ్రాయేలు వేగులవారిని కలుసుకోక మునుపు ఆమె యెహోవాను సత్యదేవునిగా గుర్తించింది. అటు తర్వాత ఆమె వ్యక్తపర్చిన మాటలూ, వేశ్యావృత్తిని వదిలిపెట్టడమూ ఆమె విశ్వాసాన్ని రుజువు పర్చాయి. (యెహోషువ 2:9-11; హెబ్రీయులు 11:31) క్రియల ద్వారా చూపించబడిన విశ్వాసాన్ని గూర్చిన ఈ రెండవ మాదిరిని చర్చించిన తర్వాత యాకోబు ఇలా చెబుతున్నాడు: “ప్రాణము లేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.” ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఏ విధమైన సచేతనశక్తీ లేక “ప్రాణము” అతనిలో ఉండదు, మరి అతడేమీ చేయలేడు. విశ్వాసముందని ఊరకే చెప్పుకోవడం, జీవంలేని ఎందుకూ పనికిరాని మృతదేహం లాంటిదే. మనకు నిజమైన విశ్వాసం ఉంటే, అది దైవిక క్రియల్ని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది.
నాలుకను అదుపులో ఉంచుకోండి!
12. సంఘంలోని పెద్దలు దేనిని పరిగణనలోనికి తీసుకోవాలి?
12 మాట్లాడడం, బోధించడం కూడా విశ్వాసం ఉందనడానికి రుజువును ఇవ్వగలవు, కానీ అదుపు అవసరం. (యాకోబు 3:1-4) సంఘంలో బోధకులుగా, పెద్దలు బరువైన బాధ్యతను కల్గివుండి దేవునికి గొప్ప లెక్కనప్పగించాల్సిన వారిగా ఉన్నారు. అందుకే, వాళ్లు తమ ఉద్దేశాల్నీ, అర్హతల్నీ వినయంతో పరిశీలించుకోవాలి. జ్ఞాన సామర్థ్యాలతోపాటూ, దేవుని ఎడలా, తోటి విశ్వాసుల ఎడలా ప్రగాఢమైన ప్రేమను ఈ పురుషులు కల్గివుండాలి. (రోమీయులు 12:3, 16; 1 కొరింథీయులు 13:3, 4) పెద్దలు సలహాలిచ్చేటప్పుడు అవి లేఖనాలపై ఆధారపడి ఉండాలి. ఒక పెద్ద తప్పుడు సలహాను ఇచ్చి, మరి ఆ తప్పుడు సలహా ఇతరులకు సమస్యల్ని తీసుకొచ్చినట్లైతే, అతడు క్రీస్తు ద్వారా దేవునినుండి కఠినమైన తీర్పు పొందుతాడు. కాబట్టి పెద్దలు వినయవంతులుగానూ, పఠనశీలురుగానూ, దేవుని వాక్యాన్ని విశ్వాసంతో హత్తుకొనేవారిగానూ ఉండాలి.
13. మాటలో మనమెందుకు తప్పిపోతాం?
13 అపరిపూర్ణతనుబట్టి ఉత్తమ బోధకులు కూడా ‘అనేకసార్లు తప్పిపోతారు,’ నిజానికి మనమంతా తప్పిపోతాం. మాటయందు తప్పిపోవడమనేది అతి తరచుగా హానిని కల్గించే లోపాల్లో ఒకటైవుంది. “ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును” అని యాకోబు చెబుతున్నాడు. యేసుక్రీస్తువలే గాక, మనం మన నాలుకను పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోలేం. మనం దాన్ని గనుక అదుపులో ఉంచుకుంటే, మన శరీరంలోని ఇతర అవయవాల్నీ అదుపులో ఉంచుకోగలం. కళ్లెములూ, లంఖనీలూ (నోటిలో పెట్టే కళ్లెము యొక్క తునకలూ) గుఱ్ఱాల్ని మనమెక్కడికి నిర్దేశిస్తే అక్కడకి వెళ్లేలా చేస్తాయి. ఎంతో పెద్దవైన ఓడలు పెనుగాలికి కొట్టుకొని పోబడినా, ఓడ నడిపే వ్యక్తి ఉద్దేశ ప్రకారం అతి చిన్నదైన చుక్కానిచేత త్రిప్పబడగలవు.
14. నాలుకను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం అవసరమని యాకోబు ఏ విధంగా నొక్కిచెప్పాడు?
14 నాలుకను అదుపులో ఉంచుకోవడానికి నిజమైన ప్రయత్నం అవసరమని మనమంతా నిజాయితీగా అంగీకరించాలి. (యాకోబు 3:5-12) గుఱ్ఱానికి పోల్చితే కళ్లెము చిన్నది; ఆలాగే ఓడతో పోల్చితే చుక్కాని చాలా చిన్నది. మానవ దేహంతో పోల్చితే నాలుక చిన్న అవయవమే అయినా ‘బహుగా అదిరిపడుతుంది.’ గొప్పలు చెప్పుకోవడం దేవున్ని ప్రీతిపర్చదని లేఖనాలు స్పష్టం చేస్తున్నందున, నాలుకను అదుపుచేసుకునేందుకు ఆయన సహాయాన్ని మనం వెదకాలి. (కీర్తన 12:3, 4; 1 కొరింథీయులు 4:7) అడవి తగలబడ్డానికి ఓ నిప్పురవ్వ మాత్రమే చాలునని గుర్తుచేసుకుంటూ, రెచ్చగొట్టబడినప్పుడు కూడా మన నాలుకను మనం అదుపులో ఉంచుకొందాం. యాకోబు సూచిస్తున్నట్లుగా, నాలుక గొప్ప నాశనాన్ని కలుగచేసే సామర్థ్యంగల “అగ్నియే.” (సామెతలు 18:21) అదుపులోలేని నాలుక “పాపప్రపంచమై” ఉంది! ఈ భక్తిహీన ప్రపంచపు దుష్టలక్షణాలన్నీ అదుపులోలేని నాలుకకు సంబంధించినవే. కొండెములు చెప్పడం, అబద్ధబోధల వంటి నాశనం కలుగజేసే వాటికి బాధ్యురాలు అదే. (లేవీయకాండము 19:16; 2 పేతురు 2:1) మీరేమనుకుంటారు? మన నాలుకను అదుపులో ఉంచుకోవడంలో బాగా కృషిచేయడానికి మన విశ్వాసం మనల్ని ప్రేరేపించవద్దా?
15. కళ్లెము వేయబడని నాలుక మూలంగా ఏ హాని జరగవచ్చు?
15 కళ్లెం వేయబడని నాలుక పూర్తిగా ‘మలినపరుస్తుంది.’ ఉదాహరణకు, మనం పదే పదే అబద్ధాలాడుతూ దొరికిపోయినట్లైతే, మనం అబద్ధికులుగా పేరుపొందుతాం. అయితే, అదుపులోలేని నాలుక ఏ విధంగా ‘ప్రకృతి చక్రానికి చిచ్చుపెడుతుంది’? జీవితాన్ని ఓ దుర్భర చక్రంగా చేయడం ద్వారానే. అదుపులేని ఒక్క నాలుక మూలంగా సంఘమంతా కలతకు గురికావొచ్చు. యాకోబు హిన్నోము లోయ అయిన గెహెన్నాను ప్రస్తావిస్తున్నాడు. ఒకప్పుడు పిల్లల్ని బలి అర్పించడానికి ఉపయోగించబడిన ఆ లోయ, అగ్నితో కాల్చివేయడానికి యెరూషలోములోని చెత్తా చెదారాన్ని పారవేసే స్థలంగా తయారయ్యింది. (యిర్మీయా 7:31) కాబట్టి గెహెన్నా సర్వనాశనానికి సూచనగా ఉంది. గెహెన్నా (NW) భావగర్భితంగా, దాని వినాశకర శక్తినిబట్టి అది అదుపులేని నాలుకకు అన్వయిస్తుంది. మనం మన నాలుకకు కళ్లెం వేయకపోతే, మనం రగిల్చిన అగ్నికి మనమే ఆహుతైపోవొచ్చు. (మత్తయి 5:22, NW) ఎవరో ఒకరిని దుర్భాషలాడినందుకు సంఘంలో నుండి మనం వెలివేయబడవచ్చు కూడా.—1 కొరింథీయులు 5:11-13.
16. అదుపులేని నాలుక మూలంగా కలిగే నాశనాన్ని దృష్టిలో పెట్టుకొని, మనమేమి చెయ్యాలి?
16 జంతుజాలాన్ని మానవుడు లోబర్చుకోవాలని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మీరు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా బహుశా తెలుసుకొనే ఉంటారు. (ఆదికాండము 1:28) అన్ని రకాల ప్రాణులూ మచ్చిక చేసుకొనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకు, బాగా తర్ఫీదివ్వబడిన డేగలు వేటాడడంలో ఉపయోగించబడుతున్నాయి. యాకోబు ప్రస్తావించిన ‘ప్రాకెడు జంతువులలో’ (NW) పాములాడించే వాళ్లు ఆడించినట్టల్లా ఆడే సర్పాలూ ఉండొచ్చు. (కీర్తన 58:4, 5) తిమింగలాలను సహితం మానవుడు లోబర్చుకోగలడు కానీ పాపభరిత మానవులముగా మనం మన నాలుకను పూర్తిగా అదుపులో ఉంచుకోలేం. అయితే, మనం దుర్భాషలాడడాన్నీ లేక కొండెములు చెప్పడాన్నీ విడనాడాలి. అదుపులేని నాలుక, మరణకరమైన విషంతో నింపబడిన అపాయకరమైన ఆయుధం కాగలదు. (రోమీయులు 3:13) విచారకరంగా, అబద్ధబోధకుల నాలుకలు తొలి క్రైస్తవులలో కొందరు దేవునినుండి వైదొలగిపోయేలా చేశాయి. కాబట్టి మాటపూర్వకంగా చేసే లేక రాతపూర్వకంగా ఉన్న విషపూరిత భ్రష్టత్వపు బోధలు మనల్ని అధిగమించేలా మనం వాటిని ఎన్నటికీ అనుమతించకూడదు.—1 తిమోతి 1:18-20; 2 పేతురు 2:1-3.
17, 18. యాకోబు 3:9-12 వచనాల్లో ఏ పరస్పర విరుద్ధత సూచించబడింది, ఈ విషయంలో మనమేమి చెయ్యాలి?
17 దేవునియందు విశ్వాసమూ, ఆయన్ని ప్రీతిపర్చాలనే కోరికా మనల్ని భ్రష్టత్వం నుండి కాపాడగలవు, అలాగే పరస్పర విరుద్ధమైన రీతిలో నాలుకను ఉపయోగించకుండా మనల్ని అరికట్టగలవు. పరస్పర విరుద్ధమైన రీతిలో తమ నాలుకను ఉపయోగించిన కొందరిని ఎత్తిచూపిస్తూ, ‘దీనితోనే తండ్రియైన యెహోవాను స్తుతిస్తాం. దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపిస్తామని’ యాకోబు చెబుతున్నాడు. (ఆదికాండము 1:26) “అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు” యెహోవాయే గనుక ఆయన మనకు తండ్రియైవున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:24, 25) ఆధ్యాత్మిక భావంలో ఆయన అభిషిక్త క్రైస్తవులకు కూడా తండ్రి. జంతువుల నుండి మనల్ని వేరుపర్చే లక్షణాలైన ప్రేమా, న్యాయమూ, జ్ఞానములతోపాటూ మానసిక నైతిక లక్షణాలకు సంబంధించి మనమంతా ‘దేవుని పోలికలో’ ఉన్నాం. కాబట్టి, యెహోవాయందు మనకు విశ్వాసం ఉంటే మనమెలా ప్రవర్తించాలి?
18 మనం మనుష్యుల్ని శపించడం అంటే మనం వాళ్లపైకి కీడు రావాలని లేక వాళ్లు కీడుకు గురవ్వాలని కోరుకుంటున్నామని అర్థం. ఎవరిపైకైనా కీడును రప్పించేందుకు మనం అధికారం ఇవ్వబడిన దైవప్రేరేపిత ప్రవక్తలం కాదు గనుక, అలాంటి శాపవచనాలు ద్వేషానికి ప్రతీకలుగా ఉండి, మన ఆరాధనను వ్యర్థపరుస్తాయి. ఒకే నోటిలో నుండి “ఆశీర్వచనమును శాపవచనమును” రావడమనేది సరైంది కాదు. (లూకా 6:27, 28; రోమీయులు 12:14, 17-21; యూదా 9) కూటాల్లో దేవున్ని కీర్తించి, అటు తర్వాత తోటి విశ్వాసుల్ని గురించి చెడుగా మాట్లాడడం ఎంత పాపభరితమైన విషయమో కదా! నీటిబుగ్గలో ఒక్క జలనుండే తియ్యని నీరూ చేదునీరూ ఊరదు. “అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెన అంజూరపు పండ్లయినను” కాయనట్లే ఉప్పునీళ్లలోనుండి తియ్యని నీళ్లు ఊరవు. మేలైన దాన్ని గురించి మాట్లాడాల్సిన మనం అదే పనిగా నొప్పించే మాటల్ని మాట్లాడుతున్నాం అంటే మనలో ఆధ్యాత్మికంగా ఎక్కడో లోపం ఉండాలి. నొప్పించే రీతిగా మాట్లాడే అలవాటువుంటే, అలా మాట్లాడకుండా ఉండడానికి యెహోవా సహాయం కొరకు మనం ప్రార్థిద్దాం.—కీర్తన 39:1.
పైనుండి వచ్చే జ్ఞానం చొప్పున ప్రవర్తించండి
19. మనం పరలోక జ్ఞానంచే గనుక నడిపించబడితే, మనం ఇతరులమీద ఎలా ప్రభావం చూపించవచ్చు?
19 విశ్వాసం కల్గివున్న వారికి తగిన రీతిలో మాట్లాడడానికీ, చేయడానికీ మనందరికీ జ్ఞానం అవసరం. (యాకోబు 3:13-18) దేవుని ఎడల పూజ్యనీయ భయం మనకున్నట్లైతే, ఆయన మనకు పరలోక సంబంధమైన బుద్ధినీ, జ్ఞానాన్ని సరియైన రీతిగా ఉపయోగించే సామర్థ్యాన్నీ అనుగ్రహిస్తాడు. (సామెతలు 9:10; హెబ్రీయులు 5:14) “జ్ఞానముతో కూడిన సాత్వికము”ను ఎలా చూపించాలో ఆయన వాక్యం మనకు బోధిస్తుంది. మనం సాత్వికులం గనుక, మనం సంఘంలో శాంతిని పెంపొందిస్తాం. (1 కొరింథీయులు 8:1, 2) తోటి విశ్వాసులకంటే గొప్ప బోధకులుగా ఉన్నామని అతిశయించే వారెవరైనా వారి అహంకార గుణాన్ని ఖండిస్తున్న ‘క్రైస్తవ సత్యానికి విరోధంగా అబద్ధం ఆడుతున్నారు.’ (గలతీయులు 5:26) వారి “జ్ఞానము” దేవుని నుండి వేరుపర్చబడ్డ పాపభరితులైన మానవుల లక్షణాల్ని సూచించే “భూసంబంధమైన”దై ఉంది. అది శరీరేచ్ఛల నుండి వచ్చిన “ప్రకృతి [మృగ] సంబంధమైన”దై ఉంది. దుష్టాత్మలు గర్వంగలవైనందున అది “దయ్యముల” సంబంధమైనదై కూడా ఉంది. (1 తిమోతి 3:6) కాబట్టి కొండెములు చెప్పడం, పక్షపాతం చూపించడం వంటి ‘నీచకార్యాలు’ వృద్ధికాగలిగే వాతావరణాన్ని సృష్టించడానికి మనం దోహదపడకుండా ఉండేలా జ్ఞానంతోనూ, వినయంతోనూ మనం ప్రవర్తిద్దాం.
20. పరలోక జ్ఞానాన్ని మీరెలా వర్ణిస్తారు?
20 “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది.” అది నైతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. (2 కొరింథీయులు 7:11) అది “సమాధానకరమైనది,” శాంతిని వెంబడించేలా మనల్ని ప్రేరేపిస్తుంది. (హెబ్రీయులు 12:14) పరలోక జ్ఞానం మనల్ని మూర్ఖమైనవారిగానూ, వ్యవహరించడానికి క్లిష్టమైన వారిగానూ గాక ‘మృదువైన’ [“సహేతుకమైన,” NW] వారిగా చేస్తుంది. (ఫిలిప్పీయులు 4:5) పైనుండి వచ్చే జ్ఞానం దైవిక బోధకు విధేయత చూపించడాన్నీ, యెహోవా సంస్థతో సహకరించడాన్నీ పెంపొందిస్తూ ‘సులభంగా లోబడుతుంది.’ (రోమీయులు 6:17) పైనుండి వచ్చు జ్ఞానం మనల్ని దయ, కనికరంగల వారిగా కూడా చేస్తుంది. (యూదా 22, 23) “మంచి ఫలములతో” నిండుకొన్నదై, అది ఇతరుల ఎడల శ్రద్ధనూ, అలాగే మంచితనమూ నీతి సత్యాలకు అనుగుణమైన క్రియల్నీ పురుకొల్పుతుంది. (ఎఫెసీయులు 5:9) శాంతికాముకులుగా, సమాధానకరమైన పరిస్థితుల్లో వృద్ధిచెందే ‘నీతి ఫలాన్ని’ మనం అనుభవిస్తాం.
21. యాకోబు 2:1–3:18 ప్రకారంగా, దేవునియందలి మన విశ్వాసం ఏ క్రియలు చేయడానికి మనల్ని ప్రేరేపించాలి?
21 కాబట్టి, విశ్వాసం క్రియలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుందనే విషయం స్పష్టమే. అది మనల్ని పక్షపాతంలేని వారిగానూ, దయగలవారిగానూ, మంచి పనుల్లో చురుకుగా ఉండేవారిగానూ చేస్తుంది. నాలుకను అదుపుచేసుకోవడానికీ, పరలోక జ్ఞానంకల్గి ప్రవర్తించడానికీ విశ్వాసం మనకు సహాయపడుతుంది. అయితే ఈ పత్రికనుండి మనం నేర్చుకొనగల్గేదంతా ఇంతే కాదు. యెహోవాయందు విశ్వాసం ఉన్న వారికి తగిన రీతిలో మనం ప్రవర్తించడానికి సహాయపడగల మరిన్ని సలహాలు యాకోబు దగ్గర ఉన్నాయి.
మీరు ఎలా జవాబిస్తారు?
◻ పక్షపాతాన్ని చూపించడంలో తప్పేముంది?
◻ విశ్వాసమూ, క్రియలూ ఎలా పరస్పర సంబంధాన్ని కల్గివున్నాయి?
◻ నాలుకను అదుపులో ఉంచుకోవడం ఎందుకు అంత ప్రాముఖ్యం?
◻ పరలోక జ్ఞానాన్ని వర్ణించండి?