మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలు మీ విషయంలో ఆచరణాత్మకమైన విలువగలవిగా ఉన్నట్లు కనుగొన్నారా? అయితే, ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలతో మీ జ్ఞాపకశక్తిని ఎందుకు పరీక్షించుకోకూడదు?
◻ అర్మగిద్దోను ఎలా ఉంటుంది? (ప్రకటన 16:14, 16)
అది అణు యుద్ధమై ఉండదు, లేక మానవులు రేకెత్తించే వినాశనమై ఉండదు. అది మానవ యుద్ధాలన్నిటినీ అంతమొందించే దేవుని యుద్ధం, అంతేగాక అలాంటి యుద్ధాలను పెంపొందింపజేసే వారందరినీ నిర్మూలించే దేవుని యుద్ధం. శాంతిని ప్రేమించేవారికి నిజమైన శాంతిని తీసుకురావడానికి అది దేవుని యుద్ధం. అది ఆలస్యం కాదు. (హబక్కూకు 2:3)—4/15, పేజీ 17.
◻ ఏ తరహా పెళ్లి యెహోవాకు ఘనతను తెస్తుంది?
ఏ పెళ్లిలోనైతే లోక సంబంధమైన విధానాలను ఆత్మీయ అంశాలు అధిగమిస్తాయో ఆ పెళ్లి యెహోవాకు వాస్తవంగా ఘనత తెస్తుంది. నీచమైన ప్రాపంచిక ఆచారాలనూ మూఢనమ్మకాలనూ ఆడంబరాలనూ వాళ్లు విడనాడినట్లైతే, క్రమమైన దైవపరిపాలనా కార్యకలాపాలకు అంతరాయం కల్గించేదిగా దాన్ని వాళ్లు అనుమతించనట్లైతే, ఆడంబరాలకు పోయే బదులు నిరాడంబరతను వాళ్లు ప్రదర్శించినట్లైతే క్రైస్తవులు ఆ సందర్భాన్ని ఆనందమయంగా చేసుకుంటారు.—4/15, పేజీ 26.
◻ యథార్థవంతున్ని ఏ లక్షణాలు గుర్తిస్తాయి?
యథార్థతగల వ్యక్తిని ఆయన తోటి వ్యక్తులే కాదు అతి ప్రాముఖ్యంగా దేవుడు విశ్వసించవచ్చు. అలాంటి వ్యక్తి మనస్సులోని స్వచ్ఛత ఆయన చర్యల్లో కనిపిస్తుంది; ఆయనలో వేషధారణ ఉండదు. ఆయన మోసం చేయడు లేక అవినీతిపరుడు కాదు. (2 కొరింథీయులు 4:2)—5/1, పేజీ 6.
◻ యిర్మీయా “యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు” అని ఎందుకు చెప్పాడు? (విలాపవాక్యములు 3:27)
యౌవనంలో ఉన్నప్పుడు వచ్చే కష్టాలను సహించడాన్ని నేర్చుకోవడం, పెద్ద వయస్సులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒకరిని సిద్ధం చేస్తాయి. (2 తిమోతి 3:12) నమ్మకంగా ఉండటం యొక్క ప్రయోజనాలు, రాజీపడటం వలన వచ్చే ఎలాంటి తాత్కాలిక ఉపశమనానికంటే కూడా ఎంతో గొప్పవి.—5/1, పేజీ 32.
◻ రూపాంతర దర్శనంలో మోషే ఏలీయాలు కన్పించడం దేనికి ముంగుర్తుగా ఉంది?
రూపాంతర సందర్భంలో మోషే ఏలీయాలు యేసు అభిషిక్త సహోదరులకు ముంగుర్తుగా ఉన్నారు. యేసుతో పాటూ వాళ్లు “మహిమతో” కనబడడమనేది నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు పరలోక రాజ్య ఏర్పాటులో యేసుతో ‘మహిమపర్చబడతారని’ సూచిస్తుంది. (లూకా 9:30, 31; రోమీయులు 8:17; 2 థెస్సలొనీకయులు 1:10)—5/15, పేజీలు 12, 14.
◻ దేవుని ‘పవిత్ర రహస్యం’ అంటే ఏమిటి? (1 కొరింథీయులు 2:7, NW)
దేవుని ‘పవిత్ర రహస్యం’ యేసుక్రీస్తుపై కేంద్రీకరించబడుతోంది. (ఎఫెసీయులు 1:8-10, NW) అయినప్పటికీ, అది కేవలం యేసును వాగ్దాన మెస్సీయగా గుర్తించడం మాత్రమే కాదు. అందులో పరలోక ప్రభుత్వమైన దేవుని మెస్సీయ రాజ్యం చేరివుంది, దేవుని సంకల్పంలో నిర్వహించేందుకు యేసుకు నియమించబడిన భూమిక చేరివుంది.—6/1, పేజీ 13.
◻ వయస్సు పైబడడాన్ని లేక అనారోగ్యాన్ని ఓ క్రైస్తవుడు ఎలా దృష్టించాలి?
అటువంటి శ్రమలు యెహోవాకు తాను చేసే సేవను పరిమితం చేస్తున్నాయని భావించే బదులు, ఆయనపై మరింతగా ఆధారపడేందుకు ఒక అవకాశంగా వాటిని అతడు పరిగణించాలి. ఓ క్రైస్తవుని విలువ అతడు ఎంత సేవ చేస్తున్నాడు అనేదాన్నిబట్టి మాత్రమే కాక అతని విశ్వాసాన్నిబట్టీ, ప్రేమ యొక్క లోతునుబట్టీ కొలవబడుతుంది. (మార్కు 12:41-44)—6/1, పేజీ 26.
◻ బైబిల్ని రాయడానికి దేవదూతలకు బదులు మానవుల్ని యెహోవా ఉపయోగించడం ఆయన గొప్ప జ్ఞానాన్ని ఎలా చూపించింది?
మానవ హస్తం అసలు లేకుంటే, బైబిలు వర్తమానాన్ని అవగాహన చేసుకోవడం మనకు కష్టం అయివుండేది. అంతేగాక మానవ హస్తం బైబిలుకు చేకూర్చగల ఆప్యాయతా, వైవిధ్యం మరియు రమణీయత అందులో ఉన్నాయి.—6/15, పేజీ 8.
◻ కుటుంబ సంతోషానికిగల రహస్యం ఏమిటి?
కుటుంబ సంతోషానికిగల రహస్యం దేవుని వాక్యమైన బైబిలు పుటల్లోనూ, ఆశానిగ్రహం, శిరస్సత్వాన్ని గుర్తించడం, మంచి పరస్పరసంభాషణ, ప్రేమ వంటి దాని సూత్రాల్ని అన్వయించుకోవడంలోనూ ఉంది.—6/15, పేజీ 23, 24.
◻ యేసు చేసిన స్వస్థత, తమకు స్వస్థపర్చే శక్తివుందని చెప్పుకునే వారు చేసే స్వస్థతలకు ఎలా భిన్నంగా ఉంది?
జనాలు అరవడమూ, పదాల్ని వల్లించడమూ, రోదించడమూ, మూర్ఛపోవడమూ వంటి మరితర రకాలైన తీవ్రమైన భావోద్రేక ప్రదర్శన అక్కడ లేదు, యేసు వెర్రి ఆవేశంతోకూడిన ఉన్మాదంతో ప్రవర్తించనూ లేదు. దానికితోడు, వారు చందాలు ఉదారంగా ఇవ్వలేదన్న సాకు చెబుతూనో లేక వారికి విశ్వాసం లేదన్న సాకు చెబుతూనో యేసు రోగులను స్వస్థపర్చకుండా ఉండలేదు.—7/1, పేజీ 5.
◻ తన నామాన్ని గూర్చిన, తన రాజ్యాన్ని గూర్చిన దైవిక సంకల్పంలో ఒక స్థానాన్ని కలిగి ఉండేందుకు తన ప్రజలకు యెహోవా ఎలా సహాయం చేశాడు?
మొదటిగా, యెహోవా తన ప్రజలకు సత్యాన్ని అప్పగించాడు. రెండవది, వాళ్లకు ఆయన తన పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా. మూడవది, మనకు మన ప్రపంచవ్యాప్త సహోదరత్వం మరియు ఆరాధన కొరకు యెహోవా చేసిన సంస్థాపర ఏర్పాటు ఉన్నాయి.—7/1, పేజీలు 19, 20.
◻ సద్గుణమంటే ఏమిటి?
సద్గుణం అనేది నైతిక ఉత్కృష్టతా, మంచితనమూ, సరియైన చర్యలూ, సరియైన ఆలోచనలూ అయివుంది. ఇది జడత్వంగల లక్షణంకాదు గానీ చురుకైన, అనుకూల లక్షణమైవుంది. సద్గుణమంటే పాపాన్ని విడనాడడంకన్నా ఎక్కువేనని అర్థం; ఏది మంచిదో దానిని వెంబడించడమని దాని అర్థం. (1 తిమోతి 6:11)—7/15, పేజీ 14.
◻ తలిదండ్రులు తమ పిల్లలకు అందించగల అత్యంత విలువైన వారసత్వమేది?
అత్యంత విలువైన వారసత్వం ఏమిటంటే ఇతరుల ఎడల ప్రేమను చూపించడంలో తమ స్వంత మాదిరియే. విశేషంగా, తలిదండ్రులు దేవుని యెడల యథార్థమైన ప్రేమను వ్యక్తం చేయడాన్నీ, చూపడాన్నీ పిల్లలు చూడవలసిన మరియు వినవలసిన అవసరముంది.—7/15, పేజీ 21.
◻ ప్రతిభావంతమైన కుటుంబ పఠనానికి అవసరమైనవేమిటి?
కుటుంబ పఠనం క్రమంగా నిర్వహించబడాలి. మీరు పఠనం కొరకు ‘సమయాన్ని పోనియ్యక సద్వినియోగం చేసుకోవాలి.’ (ఎఫెసీయులు 5:15-17) బైబిలు పఠనం సజీవమైనదిగా ఉండేలా చేయడం ద్వారా పిల్లల కొరకు పఠన సమయాలను ఉత్తేజకరంగా ఉండేటట్లు చేయండి. పిల్లలు పఠనాన్ని బట్టి ఆనందించేందుకు వారు తాము కూడా అందులో భాగం వహిస్తున్నామని భావించాలి.—8/1, పేజీలు 26, 28.