నాజీ హింసల మధ్య వాళ్లు స్థిరంగా నిలబడ్డారు
నాజీ జర్మనీలో యెహోవాసాక్షుల నిర్భయమైన యథార్థత, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు వహించిన స్థానానికి పూర్తి భిన్నంగా ఉంది. ఐడియాలజీ ఆఫ్ డెత్ అనే తన పుస్తకంలో జాన్ వైస్ అనే చరిత్ర ప్రొఫెసర్ దీన్ని గుర్తించాడు. ఆయనిలా రాస్తున్నాడు:
“1934లో ఇవాంజిలికల్ చర్చి, నాజీలను ‘లూథరన్లు ఆహ్వానించాలనీ’ మరి జర్మను వారికి ‘మతవిశ్వాసీ, నమ్మకమైనవాడూ అయిన ప్రభువులకు ప్రభువును’ ఇచ్చినందుకు ‘ప్రభువైన దేవునికి’ కృతజ్ఞతలు చెప్పాలనీ పట్టుపట్టింది. . . . ‘[హిట్లర్] మనకోసం దేవునిచే పంపించబడ్డాడు’ అని ఓ ప్రొటెస్టంట్ బిషప్ తన మతగురువులకు రాశాడు.” వైస్ ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు: “జర్మన్ మెథడిస్ట్ చర్చి, . . . హిట్లర్ శాంతి స్థిరత్వాల్ని తెస్తూ, రాబోయే బోల్షెవిక్ విప్లవం నుండి జర్మనీని కాపాడాడని . . . బిషప్ డీబేల్యోస్తో ఏకీభవించింది. హిట్లర్ను వ్యతిరేకించడం మార్మోను చట్టోల్లంఘనమేనని మార్మోను చర్చి దాని విశ్వాసులకు ఉపదేశించింది.” మరి ఆయన ఇంకా ఇలా చేరుస్తున్నాడు: “కొత్త ప్రభుత్వానికి లోబడడం ఓ పవిత్రమైన కర్తవ్యమనీ, నాజీలు తూర్పుప్రాంతమందు దారుణమైన ఘోరకృత్యాల్ని చేశారని మత గురువులకు తెల్సిన తర్వాత కూడా, అది ఎన్నటికీ విడనాడకూడని కర్తవ్యమనీ కాథోలిక్కులకు చెప్పబడింది.”
అయితే యెహోవాసాక్షుల సంగతేమిటి? “ఓ గుంపుగా, యెహోవాసాక్షులు మాత్రమే నాజీలను నిరోధించారు” అని ప్రొఫెసర్ వైస్ సూచించాడు. ఆయన ఇంకా ఇలా తెలియజేశాడు: “వారిలో వేలాదిమంది నిర్బంధించబడ్డారు. కానీ నిర్బంధ శిబిరాలకు పంపించబడిన ఏ సాక్షియైనా తాను తన విశ్వాసాన్ని త్యజిస్తున్నానని ఓ కాగితంపై సంతకం చేయడం ద్వారా విడుదలచేయబడగల్గేవాడే.”
యెహోవాసాక్షుల యథార్థతను గురించి ప్రొఫెసర్ వైస్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “క్రైస్తవత్వం సంస్థీకరించబడక మునుపూ, రాజీపడని జీవితాన్ని జీవించేందుకైన కోరికను అధిగమించేలా సమాజానికి కట్టుబడక మునుపూ తొలి క్రైస్తవత్వం కల్గివున్న అసమానమైన దృఢసంకల్పాన్నీ, నాయకత్వపు శక్తినీ వారి మాదిరి ఉదహరిస్తోంది. ఒక ప్రొటెస్టంట్ పాస్టర్ వారిని గూర్చి రాసినట్లుగా, ‘గొప్పగొప్ప చర్చీలు కాదుగానీ అపనిందలకు గురైన, అపహసించబడిన ప్రజలైన వీళ్లే మొట్టమొదట నాజీ పిశాచపు మహోగ్రతకు వ్యతిరేకంగా నిలబడ్డారు, తమ విశ్వాసం ప్రకారంగా నిరోధించడానికి తెగించినవాళ్లూ వీళ్లే.’”