పాఠకుల ప్రశ్నలు
పద్నాల్గవ శతాబ్దానికి చెందిన యూదా వైద్యుడైన షెమ్-టోబ్ బెన్ ఐసక్ ఇబ్న్ షాప్రూట్ నకలురాసిన మత్తయి సువార్త యొక్క హెబ్రీ పాఠంలో చతురక్షరనామం (దేవుని నామంలోని నాలుగు హెబ్రీ అక్షరాలు) కనుగొనబడిందా?
లేదు, చతురక్షరనామం లేదు. అయితే, మత్తయి సువార్తకు చెందిన ఈ పాఠం, కావలికోట ఆగష్టు 15, 1996 13వ పేజీలో సూచించినట్లుగా హాష్‌షెమ్ 19 సార్లు (పూర్తిగా లేక సంక్షిప్తంగా) ఉపయోగించబడింది.
హాష్‌షెమ్ అనే హెబ్రీ పదానికి, “పేరు” అని భావం. అది కచ్చితంగా దైవిక నామాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు, షెమ్-టోబ్ మూల పాఠంలో, మత్తయి 3:3వ వచనమందు హాష్‌షెమ్ యొక్క సంక్షిప్తరూపం కనబడుతుంది. ఆ ప్రకరణంలో మత్తయి యెషయా 40:3 వచనం నుండి ఉల్లేఖించాడు. చతురక్షర పేరున్న ఓ లేఖనాన్ని మత్తయి హెబ్రీ లేఖనాల్లో నుండి ఉల్లేఖించినప్పుడు, తన సువార్తలో దైవిక నామాన్ని చొప్పించాడనే నిర్దారణకు రావడం సహేతుకమే. కాబట్టి షెమ్-టోబ్ అందజేసిన హెబ్రీ పాఠం చతురక్షర నామాన్ని ఉపయోగించకపోయినా, మత్తయి 3:3లో వలె “పేరు” ఉపయోగించడం, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “యెహోవా” అనే నామాన్ని ఉపయోగించడాన్ని బలపరుస్తోంది.
షెమ్-టోబ్ తన వాద గ్రంథమైన ఈవెన్ బోచాన్‌లో మత్తయి యొక్క హెబ్రీ పాఠాన్ని నకలురాశాడు. అయితే, ఆ హెబ్రీ పాఠం యొక్క మూలమేది? ఈ విషయాన్ని విస్తృతంగా పరిశోధించిన ప్రొఫెసర్ జార్జ్ హొవార్డ్ “షెమ్-టోబ్ యొక్క నకలులోని మత్తయి సువార్త యొక్క హెబ్రీ పాఠం క్రైస్తవ శకంలోని మొదటి నాల్గు శతాబ్దాల్లోపల ఏదో ఒక కాలానికి చెందినదై” ఉండవచ్చని సూచిస్తున్నాడు.a ఇతరులు ఈ విషయంలో ఆయనతో విభేదించవచ్చు.
హొవార్డ్ ఇలా గమనిస్తున్నాడు: “ఈ పాఠంలో చొప్పించబడిన హెబ్రీలోని మత్తయి సువార్త, గ్రీకులో రాయబడిన మత్తయి సువార్త నుండి అనేక విషయాల్లో భిన్నంగా ఉండడాన్నిబట్టి విశేషంగా గుర్తించబడింది.” ఉదాహరణకు, షెమ్-టోబ్ పాఠం ప్రకారంగా, యోహాను గురించి యేసు ఇలా చెప్పాడు: “స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” “అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు” అని యేసు చెప్పిన ఆ తర్వాతి మాటల్ని అది విడిచిపెట్టింది. (మత్తయి 11:11) అదే విధంగా, హెబ్రీ లేఖనాల యొక్క ఇప్పటికీ ఉనికిలో ఉన్న హెబ్రీ పాఠానికీ తత్సమానమైన గ్రీకు సెప్టాజింట్ వర్షన్‌లోని పదజాలానికీ మధ్య అనేక తేడాలు ఉన్నాయి. వాటి మధ్యనున్న తేడాల్ని మనం గుర్తించినప్పటికీ, అలాంటి ప్రాచీన పాఠాలు తులనాత్మక అధ్యయనమందు కొంత స్థానాన్ని కల్గివున్నాయి.
పేర్కొనబడినట్లుగానే, షెమ్-టోబ్ యొక్క మత్తయి సువార్త పాఠం, మత్తయి చతురక్షరాన్ని నిజంగా ఉపయోగించాడని విశ్వసించేందుకు తగిన కారణమున్న స్థలాల్లో “పేరు” అనే పదాన్ని చేరుస్తోంది. ఆ విధంగా, 1950 నుండీ, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దైవికనామాన్ని ఉపయోగించేందుకు షెమ్-టోబ్ యొక్క పాఠం ఒక మద్దతుగా వినియోగించబడింది, మరి ఇప్పటికీ అది పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము—రెఫరెన్సులతో నందు (ఆంగ్లం) ఉల్లేఖించబడుతుంది.b
[అధస్సూచీలు]
a క్రొత్త నిబంధన అధ్యయనాలు (ఆంగ్లం) సంపుటి 43, సంఖ్య 1, జనవరి 1997, 58-71 పేజీలను కూడా చూడండి.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ 1984లో ప్రచురించినది.