ఎపఫ్రా—“నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు”
కొరింథులోనూ, ఎఫెసులోనూ, ఫిలిప్పీలోనూ ఉన్న క్రైస్తవ సంఘాల్ని స్థాపించినది ఎవరు? ‘అన్యజనులకు అపొస్తలుడగు’ పౌలే స్థాపించాడని జవాబివ్వడానికి మీరు బహుశా వెనుకంజ వెయ్యకపోవచ్చు. (రోమీయులు 11:14) మీరు చెప్పిన జవాబు సరియైందే.
అయితే కొలొస్సయిలోనూ, హియెరాపొలిలోనూ, లవొదికయలోనూ ఉన్న సంఘాల్ని స్థాపించింది ఎవరు? మనకు కచ్చితంగా తెలియకపోయినప్పటికీ, ఎపఫ్రా అను పేరుగల వ్యక్తే స్థాపించి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ, ఈయన “నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు” అని పిలువబడ్డాడు గనుక ఈ సువార్తకుని గురించి బహుశా మీరు కొంత తెల్సుకోవాలని అనుకోవచ్చు.—కొలొస్సయులు 1:8.
లైకుస్ లోయ ప్రాంత సువార్తికుడు
ఎపఫ్రా అను పేరు, ఎపఫ్రొదితుకు సంక్షిప్తరూపం. ఎపఫ్రా, ఫిలిప్పీయుడైన ఎపఫ్రొదితు ఇరువురూ ఒక్కరేనని మనం తలంచకూడదు. ఎపఫ్రా, చిన్న ఆసియాలో ఉన్న లైకుస్ నదీ లోయ ప్రాంతమందలి క్రైస్తవ సంఘాలకు కేంద్ర స్థానాలైన మూడింటిలో ఒకటైన కొలొస్సయికి చెందినవాడు. ప్రాచీన ఫ్రుగియ ప్రాంతంలో అంటే లవొదికయకు 18 కిలోమీటర్ల దూరంలోనూ, హిరాపొలికి 19 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న ప్రాంతంలో కొలస్సయి పట్టణం ఉంది.
ఫ్రుగియ ప్రాంతానికి దేవుని రాజ్య సువార్త ఏ విధంగా చేరుకుందనే విషయాన్ని గురించి బైబిలు స్పష్టంగా తెలియజేయడం లేదు. అయినప్పటికీ, సా.శ. 33లో జరిగిన పెంతెకొస్తు పండుగ రోజున ఫ్రుగియ పట్టణవాసులు యెరూషలేములో హాజరయ్యారు, బహుశ వారిలో కొందరు కొలస్సయి నుండి వచ్చిన వారైవుంటారు. (అపొస్తలుల కార్యములు 2:1, 5, 10) ఎఫెసులో పౌలు చేసిన పరిచర్య (దాదాపు సా.శ. 52-55) కాలంలో, ఆ ప్రాంతంలో ఇవ్వబడిన సాక్ష్యం ఎఫెసీయులకు మాత్రమే కాదుగానీ “యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న” వారందరికీ ఎంతో ప్రబలమైనదిగానూ, ప్రభావవంతమైనదిగానూ ఉన్నందున వారందరూ “ప్రభువు వాక్యము వినిరి.” (అపొస్తలుల కార్యములు 19:10) లైకస్ నదీలోయ ప్రాంతంలో అనేకమంది క్రైస్తవులు పౌలును ఎన్నడూ చూడనందున, ఆయన సువార్తను ఆ ప్రాంతమందంతటా ప్రకటించనట్లు కనబడుతోంది.—కొలొస్సయులు 2:1.
అపొస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారంగా, సత్యమందలి “దేవుని కృపనుగూర్చి” కొలస్సయులకు బోధించినవ్యక్తి ఎపఫ్రాయే. “మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు” అని ఈ తోటి పనివానిని అపొస్తలుడైన పౌలు పిలవడమే, ఎపఫ్రా ఆ ప్రాంతంలో ఓ చురుకైన సువార్తికుడు అనే విషయాన్ని సూచిస్తోంది.—కొలొస్సయులు 1:6, 7, 8.
అపొస్తలుడైన పౌలూ, సువార్తికుడైన ఎపఫ్రా ఇరువురికీ, లైకస్ నదీలోయ ప్రాంతంలో ఉన్న తమ తోటి విశ్వాసుల ఆత్మీయ క్షేమం విషయంలో ఎంతో శ్రద్ధవుంది. ‘అన్యజనులకు అపొస్తలునిగా,’ పౌలు ఈ పురోభివృద్ధిని గూర్చిన వార్తను స్వీకరించేందుకు ఆనందించి ఉంటాడు. కొలస్సయుల ఆత్మీయ స్థితిని గూర్చి పౌలు మరెవరి నుండోగాక ఎపఫ్రానుండే విన్నాడు.—కొలొస్సయులు 1:4, 8.
ఎపఫ్రా యొక్క నివేదిక
కొలస్సయులు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని గూర్చి పౌలుతో చర్చించాలనే ప్రత్యేకమైన సంకల్పంతో ఎపఫ్రా సుదీర్ఘమైన ప్రయాణం చేసి, రోముకు వెళ్లేలా చేసినంత గంభీరమైన సమస్యలు. తనకు మరేవిధంగానూ తెలియని ఆ సహోదరులకు రెండు పత్రికల్ని వ్రాసేలా పౌలును ఎపఫ్రా నివేదించిన వివరణాత్మకమైన నివేదికే ప్రేరేపించింది. అందులో ఒకటి కొలస్సయులకు వ్రాసిన పత్రిక. మరొకటి లవొదికయులకు పంపించిన పత్రిక. ఆ పత్రిక భద్రపర్చబడినట్లుగా దాఖలాలేమీలేవు. (కొలొస్సయులు 4:16) ఆ పత్రికల్లోని విషయాలు, ఎపఫ్రా గమనించినటువంటి ఆ క్రైస్తవుల అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించబడ్డాయని తలంచడం సహేతుకమైన విషయమే. అతడు ఏ అవసరాలు ఉన్నట్టు గ్రహించాడు? మరి ఇది ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనకేం తెలియజేస్తోంది?
సన్యాసత్వమూ, అభిచారమూ, విగ్రహసంబంధమైన మూఢాచారాలు చేరివున్న అన్యమత తత్వసిద్ధాంతాల అపాయంలో కొలస్సయలో ఉన్న క్రైస్తవులు ఉన్నారనే చింత, ఎపఫ్రాకు ఉందని కొలస్సయులకు వ్రాసిన పత్రిక సూచిస్తున్నట్లు కన్పిస్తోంది. అంతేకాకుండా, ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలనే, ఫలానా దినాల్ని ఆచరించాలనే యూదా బోధలు సంఘంలోవున్న కొంతమంది సభ్యులపై ప్రభావం చూపించి ఉండొచ్చు.—కొలస్సయులు 2:4, 8, 16, 20-23.
పౌలు ఈ అంశాలను గురించి వ్రాశాడనే వాస్తవం, తన తోటి క్రైస్తవుల అవసరాల ఎడల ఎపఫ్రా ఎంత చురుకుగానూ, ఎంత సూక్ష్మబుద్ధితోనూ ఉన్నాడనే విషయాన్ని సూచిస్తుంది. వారు ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నారో ఆ పరిస్థితులు ఎంత అపాయకరమైనవై ఉన్నాయో ఎరిగినవాడై, ఆయన వారి ఆత్మీయ సంక్షేమం ఎడల ప్రేమపూర్వకమైన శ్రద్ధను చూపించాడు. ఎపఫ్రా పౌలు సలహాను అర్థించాడు, ఆయన నమ్రతగలవ్యక్తి అనే విషయాన్ని అది బయల్పరుస్తుంది. మరింత అనుభవం గల వ్యక్తినుండి సలహా పొందవలసిన అవసరత ఉందని ఆయన బహుశా భావించి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ, ఎపఫ్రా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు.—సామెతలు 15:22.
ప్రార్థనను విలువైన దానిగా ఎంచిన వ్యక్తి
కొలస్సయులకు తాను పంపిన పత్రిక ముగింపులో పౌలు ఇలా చెబుతున్నాడు: “మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరాపొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.”—కొలొస్సయులు 4:12, 13.
అవును, ఆయన పౌలు “తోడి ఖైదీ”గా రోమాలో ఉన్నప్పుడు కూడా, కొలస్సయలోనూ, లవొదికయలోనూ, హియెరాపొలిలోనూ ఉన్న తన ప్రియమైన సహోదరుల గురించి ఎపఫ్రా ఆలోచించేవాడు, వారి కొరకు ప్రార్థించేవాడు. (ఫిలేమోను 23) అక్షరార్థంగా, వారి కొరకు ప్రార్థనలో ‘ఆయన పోరాడాడు.’ గెత్సేమనే తోటలో యేసు ప్రార్థించినప్పుడు ఆయన అనుభవించిన మానసిక “వేదన”ను పోలినటువంటి “తీవ్రమైన, వెలగల చర్య” అని ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం సూచిస్తోంది. (లూకా 22:44) తన క్రైస్తవ సహోదర సహోదరీలు స్థిరత్వాన్నీ, పూర్ణ క్రైస్తవ పరిపక్వతనూ పొందాలని ఎపఫ్రా హృదయపూర్వకంగా అభిలషించాడు. అలాంటి ఆత్మీయ మనస్సు కల్గిన సహోదరుడు సంఘాల్లో ఉండడం ఎంత ఆశీర్వాదకరమై ఉండి ఉండవచ్చు కదా!
ఎపఫ్రా ‘ప్రియుడైన తోటిదాసుడని’ పిలువబడ్డాడు గనుక ఆయన తోటి క్రైస్తవుల హృదయాలను చూరగొన్నాడనటంలో సందేహమేమీ లేదు. (కొలొస్సయులు 1:7) పరిస్థితులు అనుకూలించినంత మేరకు, సంఘంలోవున్న సభ్యులందరూ ప్రేమాశ్రద్ధలను స్వేచ్ఛగా ప్రదర్శించుకోవాలి. ఉదాహరణకు, రోగులకూ వృద్ధులకూ ప్రత్యేక అవసరతల్లో ఉన్న ఇతరులకూ మద్దతునిచ్చే విషయానికి శ్రద్ధనివ్వాల్సి ఉండవచ్చు. సంఘంలో శ్రద్ధ వహించాల్సిన విభిన్నమైన బాధ్యతలు ఉండవచ్చు లేక దైవ పరిపాలనా నిర్మాణ ప్రాజెక్టులకు సహాయపడేందుకు బహుశా వీలుకలుగవచ్చు.
ఎపఫ్రా ప్రార్థించినట్లుగా ఇతరుల కొరకు ప్రార్థించడం, మనం అందరమూ చేయగల్గే పవిత్రసేవా రూపమైవుంది. అలాంటి ప్రార్థనల్లో, ఆత్మీయంగాగానీ లేక భౌతికంగాగానీ విభిన్నమైన అపాయాల్నీ లేక కష్టాల్నీ ఎదుర్కొంటున్న యెహోవా ఆరాధికుల ఎడల శ్రద్ధను కనపర్చుతూ వారిని గురించి కూడా ప్రార్థించవచ్చు. ఈ విధంగా కృషి చేయడం ద్వారా, మనం ఎపఫ్రావలె ఉండగలం. యెహోవా యొక్క నమ్మకమైన సేవకుల కుటుంబంలో ‘ప్రియుడైన తోటి సేవకునిగా’ తనను తాను నిరూపించుకునే ఆధిక్యతనూ ఆనందాన్నీ మనలో ప్రతి ఒక్కరమూ పొందగలము.