‘నేను దేవున్ని ఆశ్రయిస్తాను’
‘వ్యవహరించడానికి క్లిష్టమైన’ ఈ ‘కాలాల్లో’ శోధనలూ, ఒత్తిళ్లూ అంతకంతకూ అధికమౌతున్నాయి. ఉదాహరణకు, ఉద్యోగస్థలాల్లో మన నిజాయితీ పరీక్షకు గురికావొచ్చు. పాఠశాల సహాధ్యాయుల మధ్య మన సచ్ఛీలత పరీక్షకులోను కావొచ్చు. నైతికంగా పతనమైన ఈ లోకం మూలంగా మన యథార్థత తరచూ పరీక్షకు గురికావొచ్చు.—2 తిమోతి 3:1-5.
బైబిలు రచయితయైన ఆసాపు కూడా దుష్టులు వర్ధిల్లిన కాలంలో జీవించాడు. ఆయన సమకాలీకుల్లో కొందరు తమ భక్తిహీనతను గురించి ప్రగల్భాలు పలికారు కూడా. “గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు. ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు” అని ఆసాపు వ్రాశాడు. (కీర్తన 73:6, 8) ఇలాంటి వైఖరి సుపరిచయమైనదిగా అన్పించడంలేదా?
సరియైనదాన్ని చేయాలనే అభిలాషగల వారికి, అలాంటి ప్రవర్తన ఎంతో కలచివేసేదిగానూ, నిరుత్సాహపర్చేదిగా కూడా ఉంటుంది. “దినమంతయు నాకు బాధ కలుగుచున్నది . . . ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను” అని ఆసాపు వాపోయాడు. (కీర్తన 73:14, 17) మీరూ అదే విధంగా భావించి ఉంటారు, అయినా నిరుత్సహపడాల్సిన పనేంలేదు! తన కాలంనాటి దుష్టత్వాన్ని ఆసాపు తాళుకోగల్గేడు, మరి మీరూ అదే విధంగా తాళుకోగలరు. కానీ ఏ విధంగా?
అపరిపూర్ణ మానవ పరిపాలన క్రింద నిజమైన న్యాయం జరగడం దాదాపు దుస్సాధ్యమేనని ఆసాపు గ్రహించాడు. (కీర్తన 146:3, 4; సామెతలు 17:23) గనుకనే, తనచుట్టూ ఉన్న దుష్టత్వాన్నంతటినీ తొలగించేందుకు ప్రయత్నించడానికి తన అమూల్యమైన సమయాన్నీ, శక్తినీ, వనరుల్నీ వృథా చేసుకోవడానికి బదులుగా, ఆయన దేవునితోగల తన సంబంధంపై కేంద్రీకరించాడు. ఆసాపు ఇలా ప్రకటించాడు: “నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.”—కీర్తన 73:28.
నేడూ, అవినీతిసంబంధమైన వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొన్నవారు, వస్తుసంబంధమైన ప్రయోజనాల్ని తరచూ అనుభవిస్తున్నారు. దేవుని నైతిక చట్టాల్ని తాము ఉపేక్షించామని అనేకమంది గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ వాళ్లు కచ్చితంగా సఫలీకృతులుకాలేరు. ఆసాపు ఇలా గమనించాడు: “నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు.”—కీర్తన 73:18.
అవును, కుయుక్తినీ, హింసనూ, అవినీతినీ అలాగే ఇతర భక్తిహీన క్రియల్నీ నిజ క్రైస్తవులు తప్పక విడనాడాలి. ఇవి దేవుని నియమిత కాలంలో తీసివేయబడతాయి. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.” (కీర్తన 37:9) ఈలోగా, “యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము” అని చెప్పిన కీర్తనల గ్రంథకర్త మాటల్ని మనం ప్రతిధ్వనింపచేద్దాం.—కీర్తన 18:2.