యెహోవాకు తగినట్టు నడుచుకునేందుకు ఇతరులకు సహాయం చేయండి
‘ప్రతి సత్కార్యములో సఫలులగుచు, . . . అన్ని విషయములలో యెహోవాను సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని . . . మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానలేదు.’—కొలొస్సయులు 1:9-12.
1, 2. ప్రాముఖ్యంగా ఏది మన ఆనందానికి, సంతృప్తికి మూలం కాగలదు?
“మేము ఒక పొలంలో చిన్న ట్రెయిలర్లో నివసిస్తున్నాము. మా జీవితాలను నిరాడంబరంగా ఉంచుకోవడం వల్ల ప్రజలకు సువార్తను ప్రకటించడానికి మాకు సమయం ఎక్కువ లభిస్తోంది. తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకొనేలా అనేకమందికి సహాయంచేసే ఆధిక్యతతో మేమెంతగానో ఆశీర్వదించబడ్డాం.”—దక్షిణ ఆఫ్రికాలో పూర్తికాల పరిచారకులుగా సేవచేస్తున్న ఒక వివాహిత జంట.
2 ఇతరులకు సహాయం చేయడం ఆనందాన్ని తెస్తుందని మీరు అంగీకరించరా? రోగులకు, పేదవారికి లేక ఒంటరివారికి క్రమంగా సహాయం చేస్తుండడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు—అలా చేయడం ద్వారా వారు సంతృప్తిని పొందుతారు. యెహోవా దేవుని గూర్చిన, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం తాము చేయగల అత్యంత గొప్ప సహాయమని నిజక్రైస్తవులకు నిశ్చయంగా తెలుసు. ఇతరులు యేసు విమోచన క్రయధనాన్ని అంగీకరించడానికీ, దేవునితో మంచి సంబంధాన్ని పెంపొందింపజేసుకోవడానికీ, నిత్యజీవాన్ని పొందేందుకు అర్హులవ్వడానికీ అది మాత్రమే నడిపించగలదు.—అపొస్తలుల కార్యములు 3:19-21; 13:48.
3. ఏ విధమైన సహాయం అందించడానికి మన అవధానాన్నివ్వడం ప్రాముఖ్యం?
3 అయితే, ఇప్పటికే “మార్గమును” అనుసరిస్తూ దేవుని సేవ చేస్తున్నవారికి సహాయం చేసే విషయమేమిటి? (అపొస్తలుల కార్యములు 19:9) వారిపట్ల మీకు ఎప్పటివలెనే నిజమైన శ్రద్ధాసక్తులు ఉండివుండవచ్చు, కానీ ఇంకా ఎక్కువ శ్రద్ధ ఎలా చూపించవచ్చు. లేదా ఎలా సహాయాన్ని అందిస్తూనే ఉండవచ్చుననేది మీకు అర్థం కాకపోవచ్చు. లేదా వారికి సహాయం చేసే విషయంలో మీ పరిస్థితి మీకు పరిమితులను ఏర్పరచి తద్వారా మీరు పొందగల సంతృప్తిని కూడా పరిమితం చేస్తుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:35) ఆ రెండు అంశాల గురించి కొలొస్సయులకు వ్రాసిన పత్రిక నుండి మనం నేర్చుకోవచ్చు.
4. (ఎ) ఎటువంటి పరిస్థితుల్లో, పౌలు కొలొస్సయులకు పత్రికను వ్రాశాడు? (బి) ఎపఫ్రా ఎవరు, ఆయనేమి చేశాడు?
4 అపొస్తలుడైన పౌలు కొలొస్సయిలోని క్రైస్తవులకు వ్రాసేటప్పటికి, ఆయన రోములో గృహనిర్బంధంలో ఉన్నాడు. అయితే, ఇతరులు వచ్చి ఆయనను దర్శించవచ్చు. మీరు ఊహిస్తున్నట్లుగానే, తనను దర్శించడానికి వచ్చినవారికి దేవుని రాజ్యం గురించి ప్రకటించేందుకు తనకున్న పరిమితమైన స్వేచ్ఛను పౌలు సద్వినియోగం చేసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 28:16-31) తోటి క్రైస్తవులు పౌలును దర్శించి ఉండవచ్చు, బహుశా వారిలో కొందరు ఆయనతోపాటు కొన్నిసార్లు నిర్బంధించబడి ఉండవచ్చు. (కొలొస్సయులు 1:7, 8; 4:10) వారిలో అత్యంతాసక్తిగల సువార్తికుడైన ఎపఫ్రా కూడా ఉన్నాడు. ఆయన ఆసియా మైనరులోని (ఆధునిక టర్కీ) ఎఫెసుకు తూర్పున ఉన్న పీఠభూమి ఫ్రుగియలోని కొలొస్సయి నగరం నుండి వచ్చాడు. కొలొస్సయిలో సంఘాన్ని స్థాపించడంలో ఎపఫ్రా ప్రముఖ పాత్ర వహించాడు. లవొదికయ, హియెరాపొలిలలో ఉన్న సంఘాల కోసం ఆయన ఎంతగానో శ్రమించాడు. (కొలొస్సయులు 4:12, 13) రోములో ఉన్న పౌలును చూడడానికి ఎపఫ్రా ఎందుకు వెళ్లాడు, పౌలు ప్రతిస్పందన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
కొలస్సయులకు ప్రభావవంతమైన సహాయం
5. పౌలు కొలొస్సయులకు ఆ పత్రిక ఎందుకు వ్రాశాడు? ఏమి వ్రాశాడు?
5 కొలొస్సయి సంఘంలోని పరిస్థితుల గురించి పౌలును సంప్రదించడానికి ఎపఫ్రా ఎంతో శ్రమ తీసుకుని రోముకు వెళ్లాడు. అక్కడి క్రైస్తవుల విశ్వాసం, ప్రేమ, సువార్త నిమిత్తమైన వారి ప్రయాసల గురించి ఆయన నివేదించాడు. (కొలొస్సయులు 1:3-8) అయితే, కొలొస్సయుల ఆధ్యాత్మికతకు ముప్పువాటిల్లజేస్తున్న ప్రతికూల ప్రభావాల గురించిన తన చింతను కూడా ఆయన పౌలుకు చెప్పి ఉంటాడు. అబద్ధ బోధకులు వ్యాప్తి చేస్తున్న కొన్ని దృక్కోణాలను త్రిప్పికొడుతూ పౌలు ఒక ప్రేరేపిత పత్రికను వ్రాశాడు. యేసుక్రీస్తు నిర్వహించవలసిన ప్రముఖ పాత్రపై పౌలు ప్రాముఖ్యంగా దృష్టిని కేంద్రీకరించాడు.a ఆయన చేసిన సహాయం కీలకమైన బైబిలు సత్యాలను నొక్కి చెప్పడానికే పరిమితం చేయబడిందా? ఆయన కొలొస్సయులకు ఇంకే విధంగా సహాయం చేయగలిగాడు, ఇతరులకు సహాయం చేసే విషయంలో మనం ఏ యే పాఠాలు నేర్చుకోవచ్చు?
6. కొలొస్సయులకు వ్రాసిన తన పత్రికలో పౌలు దేన్ని నొక్కి చెప్పాడు?
6 పౌలు తన పత్రిక ప్రారంభంలో, మనం అలక్ష్యం చేసే అవకాశమున్న ఒక సహాయం గురించి తెలియజేశాడు. పౌలు ఎపఫ్రాలు కొలొస్సయికి దూరంగా ఉన్నారు గనుక, దూరం నుండే ప్రయోజనం చేకూర్చగల సహాయాన్ని గురించి ఆయన తెలియజేశాడు. “మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసుక్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము” అని పౌలు నొక్కిచెప్పాడు. అవును, ఇవి కొలొస్సయిలోని క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా చేయబడిన ప్రార్థనలు. పౌలు ఇంకా ఇలా జతచేశాడు: ‘అందుచేత, ఆ సంగతి వినిననాటనుండి, మీరు సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు కావలెనని మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానలేదు.’—కొలొస్సయులు 1:3, 4, 9.
7, 8. మన వ్యక్తిగత, సంఘ ప్రార్థనలు తరచు ఏ విషయాన్ని గురించినవై ఉంటాయి?
7 యెహోవా ‘ప్రార్థన ఆలకించువాడని’ మనకు తెలుసు, కాబట్టి ఆయన చిత్తానికి అనుగుణంగా మనం చేసే ప్రార్థనలు వినడానికి ఆయన చూపే సుముఖతయందు మనం నమ్మకం ఉంచవచ్చు. (కీర్తన 65:2; 86:6; సామెతలు 15:8, 29; 1 యోహాను 5:14) అయితే మనం ఇతరుల కోసం ప్రార్థించే విషయానికొస్తే మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి?
8 మనం తరచూ ‘లోకమందున్న మన సహోదరులందరి’ గురించి ప్రార్థిస్తుండవచ్చు. (1 పేతురు 5:9) ఏదైనా దుర్ఘటన లేదా అపార నష్టం జరిగిన ప్రాంతంలో ఉన్న క్రైస్తవుల గురించి, ఇతరుల గురించి మనం యెహోవాను సమీపించవచ్చు. మొదటి శతాబ్దంలో యూదయలో సంభవించిన కరువు గురించి విన్నప్పుడు, వేరే ప్రాంతంలో నివసిస్తున్న శిష్యులు సహాయనిధి పంపడానికి ముందు తమ సహోదరుల కోసం ఎన్నో ప్రార్థనలు చేసివుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 11:27-30) నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులందరి గురించి లేక సహోదరుల పెద్ద గుంపు గురించి చేసే ప్రార్థనలు తరచూ క్రైస్తవ కూటాల్లో వినిపిస్తుంటాయి, అక్కడ చేసే ప్రార్థనలను చాలామంది అర్థం చేసుకుని, “ఆమేన్” అని చెప్పగలగాలి.—1 కొరింథీయులు 14:16.
ప్రత్యేకంగా ప్రార్థించండి
9, 10. (ఎ) ఆయా వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించడం సరైనదని ఏ యే ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) పౌలు ఎలా నిర్దిష్టమైన ప్రార్థనాంశముగా ఉన్నాడు?
9 అయినప్పటికీ, ఇతరుల కోసం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనల ఉదాహరణలు బైబిలులో ఉన్నాయి. లూకా 22:31, 32 నందు వ్రాయబడివున్న యేసు వ్యాఖ్యానం గురించి ఆలోచించండి. ఆయన చుట్టూ 11 మంది అపొస్తలులు ఉన్నారు. రానున్న కష్టతరమైన సమయాల్లో వాళ్లందరికీ దేవుని మద్దతు అవసరం, కాబట్టి యేసు వారి కోసం ప్రార్థించాడు. (యోహాను 17:9-14) అయితే, యేసు పేతురు కోసం మాత్రం ప్రత్యేకంగా ప్రార్థించాడు. ఇతర ఉదాహరణలు: తన పనివాడైన ఒక వ్యక్తికి దేవుడు సహాయం చేయాలని ఎలీషా ప్రార్థించాడు. (2 రాజులు 6:15-17) గాయు శారీరకంగానూ, ఆధ్యాత్మికంగానూ చక్కగా కొనసాగాలని అపొస్తలుడైన యోహాను ప్రార్థించాడు. (3 యోహాను 1, 2) ఇతర ప్రార్థనలు ఆయా నిర్దిష్ట గుంపువారి కోసం పరిమితం చేయబడ్డాయి.—యోబు 42:7, 8; లూకా 6:28; అపొస్తలుల కార్యములు 7:60; 1 తిమోతి 2:1, 2.
10 ప్రత్యేకంగా చేయబడిన ప్రార్థనల గురించి పౌలు వ్రాసిన పత్రికలు నొక్కి చెప్తున్నాయి. తన కోసం లేదా తన కోసమూ తన సహవాసుల కోసమూ ప్రార్థనలు చేయమని ఆయన కోరాడు. కొలొస్సయులు 4:2-4 లో ఇలా ఉంది: “ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి.” ఈ ఇతర ఉదాహరణలను కూడా పరిశీలించండి: రోమీయులు 15:30-32; 1 థెస్సలొనీకయులు 5:25; 2 థెస్సలొనీకయులు 3:1,2; హెబ్రీయులు 13:18.
11. రోములో ఉన్నప్పుడు, ఎపఫ్రా ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు?
11 రోములోని పౌలు సహవాసి విషయంలో కూడా అలాగే జరిగింది. ‘మీలో ఒకడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; యతడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.’ (కొలొస్సయులు 4:12) ‘పోరాడుచున్నాడు’ అన్న పదం, ప్రాచీన క్రీడలలో ఒక వ్యాయామకారుడు చేసే తీవ్ర శారీరక కసరత్తును సూచించగలదు. ఎపఫ్రా సాధారణంగా ప్రపంచవ్యాప్త విశ్వాసులందరి కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాడా లేదా ఆసియా మైనర్ అంతటా ఉన్న నిజ క్రైస్తవులందరి కోసం ప్రార్థిస్తున్నాడా? ఎపఫ్రా కొలొస్సయిలోని వారికోసం ప్రత్యేకంగా ప్రార్థించాడని పౌలు సూచించాడు. ఎపఫ్రాకు వారి పరిస్థితి గురించి బాగా తెలుసు. మనకు వాళ్లందరూ పేరు పేరున తెలియదు, వారు ఏ యే సమస్యలను ఎదుర్కున్నారో కూడా తెలియదు, కాని కొన్ని సాధ్యతల గురించి ఊహించండి. బహుశా యౌవనస్థుడైన లిను ఆ కాలంలో ప్రబలంగా ఉన్న తత్వశాస్త్రాల ప్రభావంతో పోరాడుతూ ఉండవచ్చు. రూపు అనే వ్యక్తికి, తాను ముందు ఉండిన యూదా మతంలోని అభ్యాసాల ఆకర్షణను ఎదిరించేందుకు శక్తి అవసరమై ఉండవచ్చు. పెర్సిసు భర్త అవిశ్వాసి గనుక తన పిల్లలను ప్రభువునందు పెంచడానికి ఆమెకు సహనం, జ్ఞానం అవసరమై ఉండవచ్చా? మరణకరమగు అనారోగ్యంతో బాధపడుతున్న అసుంక్రితుకు అదనపు ఆదరణ అవసరమై ఉండవచ్చా? అవును ఎపఫ్రాకు తన స్వంత సంఘంలో ఉన్నవారి గురించి తెలుసు. ఆ భక్తిపరులు యెహోవాకు తగినట్టుగా నడుచుకోవాలని ఆయనా పౌలూ కోరుకున్నారు గనుక ఆయన వారికోసం హృదయపూర్వకంగా ప్రార్థించాడు.
12. మనం వ్యక్తిగతంగా ప్రార్థించేటప్పుడు మరింత ప్రత్యేకంగా ఎలా ప్రార్థించవచ్చు?
12 మన కోసం ఉన్న ఒక మాదిరిని అంటే ఇతరులకు సహాయం చేసేందుకు మన కోసం ఉన్న ఒక విధానాన్ని మీరు చూశారా? మునుపు పేర్కొన్నట్లుగా, క్రైస్తవ కూటాల్లో చేయబడే సార్వజనిక ప్రార్థనలు సాధారణంగా అక్కడ ఉండే ప్రేక్షకులను బట్టి విస్తృత పరిధిలో చేయబడతాయి. అయితే మన వ్యక్తిగత లేక కుటుంబ ప్రార్థనలు ఎంతో ప్రత్యేకంగా చేసేవై ఉండవచ్చు. మనం సాధారణంగా ప్రయాణ పై విచారణకర్తలందరినీ లేక ఆధ్యాత్మిక కాపరులందరినీ ఆశీర్వదించమని, వారికి నడిపింపునివ్వమని దేవుడ్ని అడిగినప్పటికీ, కొన్నిసార్లు ప్రత్యేకంగా ప్రార్థించలేమా? ఉదాహరణకు, మీ సంఘాన్ని సందర్శిస్తున్న ప్రాంతీయ పైవిచారణకర్త కోసం లేక మీ సంఘ పుస్తక పఠన నిర్వాహకుని కోసం ప్రత్యేకంగా ఎందుకు ప్రార్థించకూడదు? ఫిలిప్పీయులు 2:25-28 మరియు 1 తిమోతి 5:23 వచనాలు ఎపఫ్రోదితు, తిమోతిల ఆరోగ్యం గురించి పౌలుకున్న వ్యక్తిగత చింతను చూపిస్తున్నాయి. అలాగే మనం మనకు తెలిసిన రోగగ్రస్థుల కోసం పేరుపేరున ప్రార్థించగలమా?
13. వ్యక్తిగత ప్రార్థనల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి ప్రార్థించడం సరైనది?
13 నిజమే, మనం ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ మనకు తెలిసిన వారి గురించీ మనం శ్రద్ధచూపే వారి గురించీ మనం చేసే ప్రార్థనల ద్వారా నిజమైన ఆసక్తిని వ్యక్తం చేయడం సరైనదే. (1 తిమోతి 5:13; 1 పేతురు 4:15) ఒక సహోదరుడు తన ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు, మనం ఆయనకు మరో ఉద్యోగాన్ని ఇవ్వలేము. అయినప్పటికీ మనం మన వ్యక్తిగత ప్రార్థనల్లో ఆయన పేరును ప్రస్తావించి, ఆయనకు వచ్చిన కష్టంపై అవధానం నిలపవచ్చు. (కీర్తన 37:25; సామెతలు 10:3) “ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం మూలంగా భర్త, పిల్లలు లేకుండానే వృద్ధురాలైపోతున్న ఒంటరి సహోదరి మనకు తెలుసా? (1 కొరింథీయులు 7:39) ఆమెను ఆశీర్వదించమని, తాను చేస్తున్న సేవలో యథార్థంగా కొనసాగడానికి ఆమెకు సహాయాన్ని అందించమని మీ వ్యక్తిగత ప్రార్థనల్లో యెహోవాను ఎందుకు అడుగకూడదు? మరో ఉదాహరణగా, తప్పు చేసిన ఒక సహోదరునికి ఇద్దరు పెద్దలు దిద్దుబాటు చేసివుండవచ్చు. ఆ ఇద్దరు పెద్దలూ తమ వ్యక్తిగత ప్రార్థనల్లో అప్పుడప్పుడూ ఆయన పేరున ఎందుకు ప్రార్థన చేయకూడదు?
14. ప్రత్యేకంగా చేసే ప్రార్థనలు ఇతరులకు సహాయం చేయడంతో ఎలా సంబంధం కల్గివున్నాయి?
14 యెహోవా మద్దతు, ఓదార్పు, జ్ఞానము, పరిశుద్ధాత్మ అవసరమైన, లేక ఆత్మఫలాలు ఫలించవలసిన అవసరమున్న వ్యక్తులని మీకు తెలిసిన వారి గురించి మీ వ్యక్తిగత ప్రార్థనల్లో చేర్చే అవకాశాలు సమృద్ధిగా ఉంటాయి. దూరాభారాన్నిబట్టో ఇతర పరిస్ధితులనుబట్టో మీరు వస్తుసంబంధంగాగానీ, స్వయంగాగానీ సహాయం చేయగలిగినంతగా చేయలేకపోతున్నట్టు భావించవచ్చు. అయితే మీ సహోదర సహోదరీల కోసం ప్రార్థించడం మాత్రం మరచిపోకండి. వాళ్లు యెహోవాకు తగినట్టుగా నడుచుకోవాలని కోరుకుంటున్నారని మీకు తెలుసు, అయినా నిరంతరం అలాగే కొనసాగడానికి వాళ్లకు నిజంగా సహాయం అవసరం కావచ్చు. అలా సహాయం చేయడానికి ఒక కీలకం మీ ప్రార్థనలే.—కీర్తన 18:2; 20:1, 2; 34:15; 46:1; 121:1-3.
ఇతరులను బలపర్చేందుకు కృషి చేయండి
15. కొలొస్సయులకు వ్రాసిన పత్రిక చివరిభాగం విషయమై మనం ఎందుకు ఆసక్తి కల్గివుండాలి?
15 ఇతరులకు సహాయం చేయాలంటే, ప్రాముఖ్యంగా మీకు సన్నిహితులైన వారికీ ప్రియమైన వారికీ సహాయం చేయాలంటే, వారి కోసం తీవ్రంగానూ ప్రత్యేకంగానూ ప్రార్థించడం మాత్రమే ఏకైక మార్గం కాదు. కొలొస్సయులకు వ్రాసిన పత్రిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. పౌలు సిద్ధాంతపరమైన నడిపింపునూ, ఆచరణాత్మకమైన సలహానూ ఇచ్చిన తర్వాత, ప్రేమలు తెలియజేసేవాడని లేక వ్యక్తిగత అభినందనలు చేర్చేవాడని కొందరు పండితులు భావిస్తారు. (కొలొస్సయులు 4:7-18) దానికి భిన్నంగా, కొలొస్సయులకు వ్రాసిన పత్రిక చివరి భాగంలో గుర్తించదగిన ఉపదేశం ఉందని మనం ఇప్పటికే గ్రహించాం, అయితే దాని నుండి నేర్చుకోవలసినది ఇంకా చాలా ఉంది.
16, 17. కొలొస్సయులు 4:10, 11 నందు ప్రస్తావించబడిన సహోదరుల గురించి మనం ఏమి చెప్పవచ్చు?
16 పౌలు ఇలా వ్రాశాడు: “నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరిన వారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను [“వీరు నాకు గొప్ప సహాయకంగా ఉన్నారు,” NW].”—కొలొస్సయులు 4:10, 11.
17 ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసినటువంటి అర్హులైన కొంతమంది సహోదరుల గురించి పౌలు అక్కడ చెప్తున్నాడు. వారు సున్నతి పొందిన వారని, అంటే యూదా పూర్వరంగం నుండి వచ్చిన వారని ఆయన అన్నాడు. రోములో సున్నతి పొందిన యూదులు చాలామంది ఉన్నారు, వారిలో కొందరు ఇప్పుడు క్రైస్తవులు. అయినప్పటికీ, పౌలు ప్రస్తావించినవారు ఆయనకు సహాయం చేయడానికి వచ్చినవారు. అన్యులైవుండి క్రైస్తవులుగా మారిన వారితో సహవసించడానికి వాళ్లు వెనుకాడి ఉండకపోవచ్చు, అన్యులకు ప్రకటించడంలో వారు పౌలుతో కలసి ఆనందంగా భాగం వహించి ఉండవచ్చు.—రోమీయులు 11:13,14; గలతీయులు 1:16; 2:11-14.
18. తనతో ఉన్న కొంతమందిని పౌలు ఎలా మెచ్చుకున్నాడు?
18 పౌలు చేసిన వ్యాఖ్యను గమనించండి: “వీరు నాకు గొప్ప సహాయకంగా ఉన్నారు.” ఆయన ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం బైబిలంతటిలో కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. చాలామంది అనువాదకులు దాన్ని “ఆదరణ” అని అనువదించారు. అయితే, మరింత సాధారణంగా “ఆదరణ” అని అనువదించబడే మరో గ్రీకు పదం (పారాకాలీయో) ఉంది. పౌలు ఆ పదాన్ని ఇదే పత్రికలో మరోచోట ఉపయోగించాడు గానీ కొలొస్సయులు 4:11 నందు మాత్రం మరో పదాన్ని ఉపయోగించాడు.—మత్తయి 5:4; అపొస్తలుల కార్యములు 4:36; 9:31; 2 కొరింథీయులు 1:4; కొలొస్సయులు 2:2; 4:8.
19, 20. (ఎ) రోములో తనకు సహాయం చేస్తుండిన సహోదరులకు పౌలు అన్వయించిన పద భావం ఏమిటి? (బి) ఆ సహోదరులు పౌలుకు ఏ యే విధాలుగా సహాయం చేసివుంటారు?
19 పౌలు ఎవరి గురించైతే ప్రస్తావించాడో వారు కేవలం మాటల ఓదార్పు కంటే ఎక్కువే చేసివుంటారు. కొలొస్సయులు 4:11 నందు “ఆదరణ” అని అనువదించబడిన గ్రీకు పదం కొన్నిసార్లు లౌకిక వ్రాతల్లో, మనోవేదన నుండి ఉపశమనం కల్గించే ఔషధం కోసం ఉపయోగించబడింది. న్యూ లైఫ్ వెర్షన్ నందు ఇలా చదువుతాం. “నాకు వారెంత గొప్ప సహాయకంగా ఉన్నారో!” టుడేస్ ఇంగ్లీష్ వెర్షన్ ఆ వాక్యభాగాన్ని యిలా చెబుతోంది: “వాళ్లు నాకు ఎంతో గొప్ప సహాయకరంగా ఉన్నారు.” పౌలు దగ్గరున్న ఆ క్రైస్తవ సహోదరులు ఆయనకు సహాయం చేసేందుకు ఏమి చేసి ఉండవచ్చు?
20 పౌలును చూడడానికి వచ్చిపోయేవాళ్లు ఉండవచ్చుగానీ, తనే స్వయంగా చేసుకోలేని పనులు అంటే తనకు ప్రాధమికంగా అవసరమైన ఆహారం, శీతాకాల దుస్తులు కొనడంవంటి అనేక పనులు ఆయనకు ఉండి ఉండవచ్చు. ఆయన అధ్యయనం కోసం గ్రంథపు చుట్టలు లేక వ్రాతకు అవసరమైనవాటిని ఎలా పొంది ఉంటాడు? (2 తిమోతి 4:12,13) తనకవసరమైన సరకులు కొనడం, తనకవసరమైన పనులు చేయడం వంటివి చేస్తూ పౌలుకు సహాయపడిన ఆ సహోదరులను మీరూహించలేరా? ఏదైనా సంఘాన్ని పరిశోధించి, దాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. కానీ నిర్బంధంలో ఉన్నందున ఆయనలా చేయలేడు, కాబట్టి ఆ సహోదరులు పౌలును సందర్శిస్తూ, సందేశం తీసుకువెళ్తూ, నివేదికలు వెనక్కి తెస్తూ ఉండేవారు. ఎంతటి ప్రోత్సాహకరమైన విషయం!
21, 22. (ఎ) కొలొస్సయులు 4:11 నందలి మాటలు మనకు ఎందుకు ఆసక్తి కల్గించేవై ఉండాలి? పౌలుతో ఉన్నవారి మాదిరిని మనం అన్వయించుకోగల కొన్ని మార్గాలు ఏవి?
21 “సహాయకరంగా” ఉండడం గురించి పౌలు వ్రాసిన విషయం, మనం ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చుననే దాని గురించి అంతర్దృష్టిని అందజేస్తుంది. యెహోవా నైతిక ప్రమాణాలకు కట్టుబడివుంటూ, క్రైస్తవ కూటాలకు హాజరవుతూ, ప్రకటనాపనిలో భాగం వహిస్తూ వారు యెహోవాకు తగిన విధంగా నడుచుకుంటూ ఉండివుండవచ్చు. దానికి వారు మన మెప్పుదలను పొందటానికి అర్హులు. పౌలుతో ఉన్నవారిలా మనం కూడా మరింత “సహాయకంగా” ఉండగలమా?
22 ఒంటరిగా ఉండడాన్ని గురించి చెబుతున్న 1 కొరింథీయులు 7:37 (డబ్లుబిటిసి వారి తెలుగు రిశుద్ధ బైబ) వచనానికి జ్ఞానయుక్తంగా అంటిపెట్టుకుని ఉండి, ఇప్పుడు తనదంటూ ఒక స్వంత కుటుంబంలేని సహోదరి ఎవరైనా ఉంటే, బహుశా మీరు ఆమెను భోజనానికి పిలిచో, స్నేహితులతోనో బంధువులతోనో చేసుకునే చిన్న పార్టీకి ఆహ్వానించో ఆమెను మీ కుటుంబ కార్యకలాపాల్లో భాగంవహించేలా చేయగలరా? సమావేశానికి గానీ సెలవులకు గానీ ఆమెను మీ కుటుంబంతో పాటు రమ్మని కోరడం మాటేమిటి? లేదా మీరు ఇంటికి కావలసిన వస్తువులేవైనా కొనుగోలు చేయడానికి వెళ్తుంటే తనకు అనుకూలమైన సమయంలో మీతోపాటు రమ్మని ఆమెను అడగండి. విధవరాండ్రు, భార్యావియోగం పొందినవారు లేక ఇప్పుడు డ్రైవింగ్ చేయలేని వారి గురించి కూడా అలాగే శ్రద్ధ తీసుకోవచ్చు. వాళ్ల అనుభవాలను వినడం నుండి ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ఫలాల్ని ఎంపిక చేసుకోవడం లేదా పిల్లల బట్టలు కొనడం వంటి అతి సాధారణమైన విషయాల్లో వాళ్లకున్న జ్ఞానం నుండి కూడా మీరు ఎంతో ప్రయోజనం పొందవచ్చు. (లేవీయకాండము 19:32; సామెతలు 16:31) తత్ఫలితంగా మీకు వారితో మరింత సన్నిహితత్వం ఏర్పడుతుంది. అలా వారు, తమకు మందుల దుకాణాన్నుండి ఏవైనా మందులు కొనవలసివస్తే మీ సహాయం కోసం అర్థించడానికి వెనుకాడరు. రోములో పౌలుతోనున్న సహోదరులు ఆచరణాత్మకమైన సహాయాన్ని అందించి ఉండవచ్చు, మీరిచ్చే సహాయం కూడా అలాగే ఉండగలదు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ప్రేమానుబంధాలను బలపర్చుకోవడం, మనం యథార్థంగా యెహోవా సేవను కలిసి చేయాలన్న దృఢ నిశ్చయత కల్గివుండడమే.
23. మనలో ప్రతి ఒక్కరం ఏమి చేస్తూ ఉండడం మంచిది?
23 మనలో ప్రతి ఒక్కరం ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన పరిస్థితుల గురించి ఆలోచించవచ్చు. అవి కేవలం ఉదాహరణలు మాత్రమే, కానీ మనం మన సహోదర సహోదరీలకు “సహాయకంగా” ఉండగల నిజమైన పరిస్థితులను అవి మనకు జ్ఞాపకం చేయవచ్చు. ఇక్కడి విషయం, మనం మానవతావాదుల దృక్పధాన్ని అలవర్చుకోవాలన్నది కాదు. కొలొస్సయులు 4:10, 11 నందు పేర్కొనబడిన సహోదరుల లక్ష్యం అది కాదు. వారు ‘దేవుని రాజ్యము నిమిత్తము జత పనివారు.’ సహాయకంగా ఉండడం యొక్క ప్రభావం దానితో సూటిగా సంబంధం కల్గివుంది. మన విషయంలో కూడా అదే నిజమై ఉండు గాక.
24. మనం ఇతరుల కోసం ప్రార్థించడం, వారిని బలపర్చడానికి ప్రయత్నించడం వెనుకనున్న ముఖ్యోద్దేశం ఏమిటి?
24 మనం ఇతరుల పేరు తీసుకుని వారి కోసం వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ, వారిని బలపర్చేందుకు కృషి చేయడానికిగల కారణం ఇదే: మన సహోదర సహోదరీలు ‘అన్ని విషయములలో యెహోవాను సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని’ కోరుకుంటున్నారని మనం నమ్మడమే. (కొలొస్సయులు 1:9-12) ఆ వాస్తవం, ‘దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండవలెనని’ ఎపఫ్రా కొలొస్సయుల కోసం ప్రార్థించాడనేదాని గురించి వ్రాసేటప్పుడు పౌలు ప్రస్తావించిన మరోదానితో సంబంధం కల్గివుంది. (కొలొస్సయులు 4:12) మనం దాన్ని వ్యక్తిగతంగా ఎలా సాధించగలం? మనం చూద్దాం.
[అధస్సూచి]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి సంపుటి 1, పేజీలు 490-1, “ప్రతి లేఖనము దైవ ప్రేరేపితమును ప్రయోజనకరమునై ఉన్నది,” పేజీలు 226-8 చూడండి.
మీరు గమనించారా?
• మనం మన వ్యక్తిగత ప్రార్థనల ద్వారా మరింత సహాయకరమైన వారిగా ఎలా తయారు కాగలం?
• కొంతమంది క్రైస్తవులు ఏ భావంలో పౌలుకు “సహాయకంగా” ఉన్నారు?
• ఎలాంటి పరిస్థితుల్లో మనం “సహాయకంగా” ఉండగలం?
• మనం మన సహోదర సహోదరీల కోసం ప్రార్థించడం, వారిని బలపర్చాలని ప్రయత్నించడం వెనుకనున్న లక్ష్యం ఏమిటి?
[18వ పేజీలోని చిత్రం]
మీరు మీ కుటుంబంతో కలసి బయటికి వెళ్లేటప్పుడు మరో క్రైస్తవురాలిని మీతో పాటు తీసుకువెళ్లగలరా?
[చిత్రసౌజన్యం]
Courtesy of Green Chimney’s Farm