యేసు రాజ్య మహిమతో వచ్చినప్పుడు
“ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడ[రు].”—మత్తయి 16:28.
1, 2. సా.శ. 32 పెంతెకొస్తు పండుగ జరిగిన తర్వాత కొంతకాలానికి ఏమి జరిగింది, ఆ సంఘటన ఉద్దేశ్యమేమైవుంది?
సా. శ. 32 పెంతెకొస్తు పండుగ జరిగిన కొంతకాలం తర్వాత, యేసుక్రీస్తు ముగ్గురు అపొస్తలులు చిరస్మరణీయమైన ఓ దర్శనాన్ని చూశారు. ప్రేరేపిత నివేదిక ప్రకారంగా, “యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.”—మత్తయి 17:1, 2.
2 ఆ రూపాంతర దర్శనం ఓ ప్రాముఖ్యమైన సమయంలో వచ్చింది. తాను బాధను అనుభవించి, యెరూషలేములో మరణించబోతున్నానని యేసు తన అనుచరులకు చెప్పనారంభించాడు, కానీ ఆయన మాటల్ని వాళ్లు గ్రహించలేకపోయారు. (మత్తయి 16:21-23) రాబోయే యేసు మరణం కొరకూ, అలాగే క్రైస్తవ సంఘం అనుభవించబోయే కష్టకాలాల కొరకూ, శోధనల కొరకూ సిద్ధపడడానికి ఆ దర్శనం యేసు ముగ్గురు అపొస్తలుల విశ్వాసాన్ని బలపర్చింది. ఆ దర్శనం నుండి నేడు మనం ఏమైనా నేర్చుకోగలమా? అవును, ఎందుకంటే అది దేనికి ముంగుర్తుగా ఉందో, అదే మన కాలంలో నిజంగా జరుగుతుంది.
3, 4. రూపాంతరం చెందడానికి ఆరు రోజులు ముందు యేసు ఏమి చెప్పాడు? (బి) రూపాంతరం చెందే సమయంలో ఏమి జరిగిందో వర్ణించండి.
3 రూపాంతరం చెందడానికి ఆరు రోజులు ముందు, యేసు తన అనుచరులతో ఇలా చెప్పాడు: “మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.” ఈ మాటలు ‘ఈ విధానాంత ముగింపు’లో నెరవేరతాయి. యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.” (మత్తయి 16:27, 28; 24:3; 25:31-34, 41; దానియేలు 12:4) ఈ చివరి మాటల నెరవేర్పుగా ఆ రూపాంతరం జరిగింది.
4 ఆ ముగ్గురు అపొస్తలులు కచ్చితంగా దేనిని చూశారు? ఆ సంఘటనను గూర్చి లూకా ఇచ్చిన వివరణ ఇలావుంది: “ఆయన [యేసు] ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి.” తర్వాత “మేఘమొకటి వచ్చి [అపొస్తలుల్ని] కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు—ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు; ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.”—లూకా 9:29-31, 34, 35.
విశ్వాసం బలపర్చబడింది
5. అపొస్తలుడైన పేతురుపై రూపాంతరం ఏ ప్రభావాన్ని కల్గివుంది?
5 అపొస్తలుడైన పేతురు “సజీవుడగు దేవుని కుమారు[డై]న క్రీస్తు”గా యేసును అప్పటికే గుర్తించాడు. (మత్తయి 16:16) పరలోకంలోనుండి వచ్చిన యెహోవా మాటలు ఆ గుర్తింపును స్థిరపర్చాయి. యేసు రూపాంతరం చెందడాన్ని గూర్చిన దర్శనం, క్రీస్తు రాజ్య శక్తితోనూ మహిమతోనూ అలాగే చివరకు మానవజాతిని తీర్పుతీర్చడానికీ వస్తున్నాడనేందుకు పూర్వప్రదర్శనయై ఉంది. ఆ రూపాంతరం జరిగి 30 ఏళ్లకుపైగా గడిచిపోయిన తర్వాత, పేతురు ఇలా వ్రాశాడు: “ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినవారమై, ఆ శబ్దము ఆకాశమునుండి రాగా వింటిమి.”—2 పేతురు 1:16-18; 1 పేతురు 4:17.
6. రూపాంతరం తర్వాత సంఘటనలు అంచెలంచెలుగా ఏ విధంగా సంభవించాయి?
6 ఆ ముగ్గురు అపొస్తలులు దేనిని చూశారో దానినిబట్టే నేడు మన విశ్వాసం కూడా బలపర్చబడుతుంది. సా.శ. 32 నుండీ సంఘటనలు అంచెలంచెలుగా సంభవించాయి. ఆ మరుసటి సంవత్సరమే, యేసు మరణించి పునరుత్థానుడై తన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోవడానికి ఆరోహణుడయ్యాడు. (అపొస్తలుల కార్యములు 2:29-36) ఆ సంవత్సరంలోనే జరిగిన పెంతెకొస్తు పండుగలో ‘దేవుని’ క్రొత్త ‘ఇశ్రాయేలు’ ఉనికిలోనికి వచ్చింది. ప్రచారకార్యక్రమం ఆరంభమైంది. అది యెరూషలేములో ప్రారంభమై అటుతర్వాత భూదిగంతాలవరకూ వ్యాపించింది. (గలతీయులు 6:16; అపొస్తలుల కార్యములు 1:8) దాదాపుగా వెనువెంటనే, యేసు అనుచరులందరి విశ్వాసమూ పరీక్షకు గురైంది. అపొస్తలులు ప్రకటనాపనిని నిలిపివేయడానికి నిరాకరించినందున, వాళ్లను నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. త్వరలోనే స్తెఫను హత్య చేయబడ్డాడు. తర్వాత రూపాంతారాన్ని ప్రత్యక్షంగా చూసిన యాకోబు చంపబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 5:17-40; 6:8–7:60; 12:1, 2) అయితే, మరిన్ని సంవత్సరాలు నమ్మకంగా యెహోవాను సేవించడం కోసం, పేతురు యోహానులు తప్పించబడ్డారు. నిజానికి, సా. శ. మొదటి శతాబ్దాంతానికల్లా యోహాను పరలోక మహిమతోనున్న యేసును గూర్చిన మరిన్ని దర్శనపు రూపురేఖలను లిఖించాడు.—ప్రకటన 1:12-20; 14:14; 19:11-16.
7. (ఎ) రూపాంతర దర్శనం ఎప్పుడు నెరవేరడం ఆరంభించింది? (బి) యేసు కొందరికి వారి వారి క్రియల చొప్పున ఎప్పుడు ప్రతిఫలం ఇచ్చాడు?
7 1914లో ‘ప్రభువు దినము’ ఆరంభమైనప్పటి నుండీ, యోహాను చూసిన దర్శనాల్లో అనేకం నెరవేరాయి. (ప్రకటన 1:10) రూపాంతరం ద్వారా ముందుగా సూచించబడిన విధంగా, యేసు ‘తన తండ్రి మహిమతో’ రావడాన్ని గూర్చిన విషయం ఏమిటి? 1914లో దేవుని పరలోక రాజ్యం ఆవిర్భవించినప్పుడు ఈ దర్శనం నెరవేరడం ఆరంభించింది. వేకువచుక్కవలె యేసు క్రొత్తగా సింహాసనాసీనుడైన రాజుగా విశ్వతెరపై ఉదయించినప్పుడు, అది ఓ నూతన శుభోదయంలానేవుంది. (2 పేతురు 1:19; ప్రకటన 11:15; 22:16) ఆ సమయంలో, కొంతమందికి వారి వారి క్రియల్నిబట్టి యేసు ప్రతిఫలాన్నిచ్చాడా? అవును ప్రతిఫలాన్నిచ్చాడు. కొంతకాలానికే అభిషిక్త క్రైస్తవుల పరలోక పునరుత్థానం ప్రారంభమైనదనేందుకు బలమైన రుజువు ఉంది.—2 తిమోతి 4:8; ప్రకటన 14:13.
8. రూపాంతర దర్శన నెరవేర్పు తారాస్థాయిని ఏ సంఘటనలు సూచిస్తాయి?
8 అయినా, త్వరలోనే యేసు, సమస్త మానవజాతికీ తీర్పుతీర్చేందుకు ‘తన మహిమతోనూ . . . సమస్త దూతలతోనూ’ వస్తాడు. (మత్తయి 25:31) ఆ సమయంలో, ఆయన తన దివ్యమైన మహిమతో తననుతాను బయల్పర్చుకొని, ‘ఎవని క్రియలచొప్పున వానికి తగిన ప్రతిఫలాన్ని’ ఇస్తాడు. గొఱ్ఱెల్లాంటి వారు తమ కొరకు సిద్ధపర్చబడిన రాజ్యంలో నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటారు, మరి మేకల్లాంటి వారు “నిత్యశిక్షకు” పోతారు. రూపాంతర దర్శనపు నెరవేర్పుకు, అదెంతటి దివ్యమైన ముగింపు అవుతుందో కదా!—మత్తయి 25:34, 41, 46; మార్కు 8:38; 2 థెస్సలొనీకయులు 1:6-10.
యేసు యొక్క మహిమపర్చబడిన సహచరులు
9. రూపాంతర దర్శన నెరవేర్పులో యేసుతోపాటు మోషే ఏలీయాలు ఉంటారని మనం ఎదురు చూడాలా? వివరించండి.
9 రూపాంతరంలో యేసు ఒక్కడే లేడు. ఆయనతోపాటు మోషే ఏలీయాలు ఉన్నారు. (మత్తయి 17:2, 3) వాళ్లు అక్షరార్థంగా అక్కడ ఉన్నారా? లేదు, ఎందుకంటే వారిరువురూ ఎంతో కాలంక్రిందటే మరణించి, పునరుత్థానం కొరకు వేచివుండి మంటిలోనే నిద్రిస్తున్నారు. (ప్రసంగి 9:5, 10; హెబ్రీయులు 11:35) యేసు పరలోక మహిమతో వచ్చినప్పుడు, వారు ఆయనతోపాటు కనబడతారా? లేదు, ఎందుకంటే మోషే ఏలీయాలు, మానవులకు పరలోక నిరీక్షణ తెరవబడక మునుపు జీవించిన వ్యక్తులు. వాళ్లు “నీతిమంతుల . . . [భూ]పునరుత్ధానము”లో భాగస్థులవుతారు. (అపొస్తలుల కార్యములు 24:14) కాబట్టి రూపాంతర దర్శనంలో వాళ్లు కన్పించడం అనే విషయం సూచనార్థకమైంది. దేనికి?
10, 11. వేర్వేరు పూర్వపర సందర్భాల్లో మోషే ఏలీయాలు ఎవరిని సూచిస్తున్నారు?
10 ఇతర పూర్వపర సందర్భాల్లో, మోషే ఏలీయాలు ప్రవచనాత్మక రూపాలైవున్నారు. ధర్మశాస్త్ర నిబంధనకు మధ్యవర్తియైన మోషే, క్రొత్త నిబంధన మధ్యవర్తియైన యేసునకు ముంగుర్తుగా ఉన్నాడు. (ద్వితీయోపదేశకాండము 18:18; గలతీయులు 3:19; హెబ్రీయులు 8:6) ఏలీయా, మెస్సీయాకు అగ్రగామిగావున్న బాప్తిస్మమిచ్చు యోహానుకు ముంగుర్తుగా ఉన్నాడు. (మత్తయి 17:11-13) అంతేగాకుండా, ప్రకటన 11వ అధ్యాయంలోని సందర్భాన్నిబట్టి మోషే ఏలీయాలు కాలాంతంలో ఉన్న శేషించబడిన అభిషిక్తులకు ముంగుర్తుగా ఉన్నారు. అది మనకెలా తెలుసు?
11 ప్రకటన 11:1-6 వచనాలను చూడండి. 3వ వచనంలో మనమిలా చదువుతాం: “నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.” ఈ ప్రవచనం, మొదటి ప్రపంచ యుద్ధకాలంలో శేషించబడిన అభిషిక్త క్రైస్తవుల విషయంలో నెరవేరింది.a ఇద్దరు సాక్షులెందుకు? ఎందుకంటే మోషే ఏలీయాలు చేసిన కార్యాల్లాంటి కార్యాల్నే అభిషిక్త శేషం ఆత్మీయ రీతిలో చేస్తారు. 5, 6 వచనాలు ఇలా తెలియజేస్తున్నాయి: “ఎవడైనను వారికి [ఆ ఇద్దరు సాక్షులకు] హానిచేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.” ఆ విధంగా మోషే ఏలీయాలు చేసిన అద్భుతకార్యాలు మనకు గుర్తుచేయబడ్డాయి.—సంఖ్యాకాండము 16:31-34; 1 రాజులు 17:1; 2 రాజులు 1:9-12.
12. రూపాంతర సందర్భంలో మోషే ఏలీయాలు ఎవరికి చిత్రీకరణగా ఉన్నారు?
12 మరైతే రూపాంతర సందర్భంలో మోషే ఏలీయాలు ఎవరికి ముంగుర్తుగా ఉన్నారు? వారు యేసుతో పాటూ “మహిమతో” వాళ్లు కనబడ్డారని లూకా చెబుతున్నాడు. (లూకా 9:31) యేసు ‘తోటి వారసులు’గా పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, ఆ విధంగా ఆయనతో ‘కూడ మహిమపొందు’ అద్భుతమైన నిరీక్షణను పొందిన క్రైస్తవులకు వాళ్లు ముంగుర్తుగా ఉన్నారు. (రోమీయులు 8:17) ‘ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం’ ఇవ్వడానికి తన తండ్రి మహిమతో యేసు వచ్చినప్పుడు, పునరుత్థానులైన అభిషిక్తులు ఆయనతోపాటు ఉంటారు.—మత్తయి 16:27.
మోషే ఏలీయాలవంటి సాక్షులు
13. యేసుతో మహిమపర్చబడిన ఆయన అభిషిక్త తోటి వారసుల ప్రవచనాత్మక చిత్రీకరణలకు తగినవారిగా మోషే ఏలీయాలను ఏ అంశాలు గుర్తించాయి?
13 యేసు తోటి అభిషిక్త వారసులకు తగిన ప్రవచనాత్మక చిత్రీకరణలుగా మోషే ఏలీయాలను గుర్తించే విశిష్టమైన అంశాలున్నాయి. అనేక సంవత్సరాలు, యెహోవా వాగ్దూతలుగా మోషే ఏలీయాలు ఇరువురూ పనిచేశారు. పరిపాలకుల కోపోద్రేకానికి ఇరువురూ గురయ్యారు. అత్యవసర సమయంలో, ఇరువురూ అన్య కుటుంబాలచే సంరక్షించబడ్డారు. ఇరువురూ రాజులకు ధైర్యంగా ప్రవచించారు, అబద్ధప్రవక్తలకు వ్యతిరేకంగా స్థిరంగా నిలబడ్డారు. మోషే ఏలీయాలు ఇరువురూ, సీనాయి పర్వతంపై (హోరేబు కొండ అని కూడా పిలువబడింది) యెహోవా శక్తి యొక్క ప్రదర్శనలను చూశారు. ఇరువురి వారసులూ, యొర్దానుకు తూర్పు వైపు నందే నియమించబడ్డారు. యేసు జీవితకాలంలో సంభవించిన అద్భుతాలు మినహా, (యెహోషువతోపాటు) మోషే, (ఎలీషాతోపాటు) ఏలీయాల దినాల్లో అనేకమైన అద్భుతాలు జరుపబడ్డాయి.b
14. మోషే ఏలీయాలవలె అభిషిక్తులు యెహోవా వాగ్దూతలుగా ఎలా పనిచేశారు?
14 ఇవన్నీ మనకు దేవుని ఇశ్రాయేలును జ్ఞప్తికి తీసుకురావడం లేదా? అవును, నిశ్చయంగా జ్ఞప్తికి తెస్తున్నాయి. యేసు తన నమ్మకమైన అనుచరులతో ఇలా తెలియజేశాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” (మత్తయి 28:19, 20) ఈ మాటలకు లోబడి, అభిషిక్త క్రైస్తవులు సా.శ. 33 నుండి నేటివరకూ యెహోవా వాగ్దూతలుగా పనిచేస్తున్నారు. మోషే ఏలీయాలవలె, వాళ్లూ పాలకుల కోపోద్రేకానికి గురయ్యారు, మరి వారికి సాక్ష్యమిచ్చారు. యేసు తన 12 మంది అపొస్తలులతో ఇలా చెప్పాడు: “వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.” (మత్తయి 10:18) క్రైస్తవ సంఘచరిత్రలో ఆయన మాటలు పదేపదే నెరవేరాయి.—అపొస్తలుల కార్యములు 25:6, 11, 12, 24-27; 26:3.
15, 16. (ఎ) సత్యం విషయమై నిర్భయంగా నిలబడడంలోనూ (బి) ఇశ్రాయేలీయులుకాని వారినుండి సహాయాన్ని పొందడం విషయంలోనూ అభిషిక్తులకూ మోషే ఏలీయాలకూ మధ్య ఏ సమాంతరాలు ఉన్నాయి?
15 అంతేగాకుండా, మతసంబంధమైన అబద్ధాలకు వ్యతిరేకంగా సత్యం కొరకు నిలబడ్డం విషయంలో మోషే ఏలీయాలు ఎంత నిర్భయంగా ఉండేవారో అంతే నిర్భయంగా అభిషిక్త క్రైస్తవులూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు యూదుల అబద్ధ ప్రవక్తయైన బర్ యేసును ఎలా ఖండించాడో, ఏథెన్సులోని అబద్ధ దేవతల్ని వివేకంగానైనప్పటికీ దృఢచిత్తంతో ఎలా బయల్పర్చాడో జ్ఞాపకం చేసుకోండి. (అపొస్తలుల కార్యములు 13:6-12; 17:16, 22-31) ఆధునికకాలంలో కూడా అభిషిక్త శేషం క్రీస్తుమత సామ్రాజ్యాన్ని ధైర్యంగా బయల్పర్చారనీ, అలాంటి సాక్ష్యం దాన్ని బాధించిందనీ జ్ఞాపకం చేసుకోండి.—ప్రకటన 8:7-12.c
16 ఫరో కోపోద్రేకాన్నిబట్టి మోషే పారిపోయినప్పుడు, ఆయన యిత్రో అని పిలువబడిన రగూయేలు అను ఇశ్రాయేలీయుడుకాని వాని ఇంట ఆశ్రయాన్ని పొందాడు. ఆ తర్వాత కాలంలో, మోషే రగూయేలు నుండీ, అతని కుమారుడైన హోబాబు నుండీ విలువైన సంస్థాగత సలహాలను పొంది, ఇశ్రాయేలీయులను అరణ్యంగుండా నడిపించాడు.d (నిర్గమకాండము 2:15-22; 18:5-27; సంఖ్యాకాండము 10:29) దేవుని ఇశ్రాయేలు యొక్క సభ్యులు, దేవుని ఇశ్రాయేలులో అభిషిక్త సభ్యులుకాని వ్యక్తులనుండి అదే విధంగా సహాయాన్ని పొందారా? అవును, అంత్యదినాల్లో తెరపై ప్రత్యక్షమైన “వేరే గొఱ్ఱెలకు” చెందిన “గొప్ప సమూహము,” వారికి మద్దతును ఇచ్చింది. (ప్రకటన 7:9; యోహాను 10:16; యెషయా 61:5) తన అభిషిక్త సహోదరులకు ఈ “గొఱ్ఱెలు” అందించబోయే ఉత్సాహవంతమైన, ప్రేమపూర్వకమైన మద్దతును గురించి యేసు ప్రవచిస్తూ వారితో ప్రవచనాత్మకంగా ఇలా చెప్పాడు: “నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి; పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితి[రి]. . . . మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా[ను].”—మత్తయి 25:35-40.
17. హోరేబు కొండపై ఏలీయా పొందినలాంటి అనుభవాన్ని అభిషిక్తులు ఏ విధంగా కల్గివున్నారు?
17 అంతేకాకుండా, హోరేబు కొండపై ఏలీయా పొందిన అనుభవం వంటిదాన్నే దేవుని ఇశ్రాయేలూ అనుభవించింది.e యెజెబెలు రాణి దగ్గర నుండి పారిపోతున్న సమయంలో ఏలీయా తలంచినట్లుగానే, అభిషిక్త శేషం మొదటి ప్రపంచ యుద్ధం అంతమైనప్పుడు తమ పని పూర్తియైందని తలంచింది. తర్వాత ఏలీయా వలెనే వాళ్లూ, ‘దేవుని ఇంటివారమని’ చెప్పుకుంటున్న సంస్థలపైకి తీర్పును తీసుకు వచ్చిన యెహోవాతో సమావేశమయ్యారు. (1 పేతురు 4:17; మలాకీ 3:1-3) క్రైస్తవమత సామ్రాజ్యం ఆ స్థాయికి చేరుకోకపోగా, అభిషిక్త శేషం ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’గా గుర్తించబడి, యేసు భూసంబంధమైన ఆస్తులన్నిటిపైనా నియమించబడింది. (మత్తయి 24:45-47) హోరేబు కొండపై ఏలీయా విన్న ‘మిక్కిలి నిమ్మళంగా మాట్లాడే స్వరం’ యెహోవాదని రుజువైంది. అది ఆయనకు చేయడానికి మరింత పనిని అప్పగించింది. యుద్ధానంతరమున్న ప్రశాంత కాలంలో, యెహోవా నమ్మకమైన అభిషిక్త దాసులు ఆయన స్వరాన్ని బైబిలు పుటల్లోనుండి విన్నారు. తాము నెరవేర్చాల్సిన నియామకం ఒకటుందని వాళ్లు కూడా గ్రహించారు.—1 రాజులు 19:4, 9-18; ప్రకటన 11:7-13.
18. యెహోవా శక్తిని గూర్చిన విశిష్టమైన నిదర్శనాలు దేవుని ఇశ్రాయేలు ద్వారా ఏ విధంగా బయల్పర్చబడ్డాయి?
18 చివరకు, యెహోవా శక్తిని గూర్చిన విశిష్టమైన నిదర్శనాలు దేవుని ఇశ్రాయేలు ద్వారా వెలువడ్డాయా? యేసు మరణించిన తర్వాత, అపొస్తలులు అనేకమైన అద్భుతాల్ని చేసినప్పటికీ అవి కాలక్రమేణా నిలిపివేయబడ్డాయి. (1 కొరింథీయులు 13:8-13) ఈ రోజుల్లో, మనం అద్భుతాల్ని భౌతిక భావంలో చూడం. మరో వైపున, యేసు తన అనుచరులతో ఇలా చెప్పాడు: “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (యోహాను 14:12) మొదటి శతాబ్దంలో యేసు శిష్యులు రోమా సామ్రాజ్యమందంతటా సువార్తను ప్రకటించినప్పుడు, దాని మొదటి నెరవేర్పు జరిగింది. (రోమీయులు 10:18) ‘సకల జనములకు సాక్ష్యార్థంగా లోకమందంతటా’ సువార్తను ప్రకటించడంలో అభిషిక్త శేషం నాయకత్వాన్ని తీసుకొనగా, నేడు అంతకన్నా గొప్ప కార్యాల్ని చేయడం జరిగింది. (మత్తయి 24:14) ఫలితం? చరిత్రలో ఈ 20వ శతాబ్దం, అధిక సంఖ్యలో యెహోవా సమర్పిత నమ్మకమైన సేవకులు సమకూడడాన్ని చూసింది. (ప్రకటన 5:9, 10; 7:9, 10) యెహోవా శక్తికి ఇదెంత దివ్యమైన రుజువో కదా!—యెషయా 60:22.
యేసు సహోదరులు మహిమతో వస్తారు
19. యేసు అభిషిక్త సహోదరులు ఎప్పుడు ఆయనతోపాటు మహిమనందు కనబడ్డారు?
19 యేసు అభిషిక్త సహోదరుల శేషం తమ భూసంబంధమైన జీవితాన్ని చాలించగానే, ఆయనతోపాటు వాళ్లూ మహిమపర్చబడతారు. (రోమీయులు 2:6, 7; 1 కొరింథీయులు 15:53; 1 థెస్సలొనీకయులు 4:14, 17) ఆ విధంగా వాళ్లు పరలోక రాజ్యంలో అమర్త్యమైన రాజులుగానూ, యాజకులుగానూ అవుతారు. అటుతర్వాత, యేసుతోపాటు వాళ్లు ‘ఇనుపదండముతో వారిని [జనులను] ఏలుదురు; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు.’ (ప్రకటన 2:26; 20:4-6; కీర్తన 110:2, 5, 6) యేసుతోపాటు వాళ్లు సింహాసనాలపై కూర్చుని “ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.” (మత్తయి 19:28) “దేవుని కుమారుల ప్రత్యక్షత”లో భాగమైన ఈ సంఘటనల కొరకు మూల్గులిడుచున్న సృష్టి మిగుల ఆశతో కనిపెట్టింది.—రోమీయులు 8:19-21; 2 థెస్సలొనీకయులు 1:6-8.
20. (ఎ) ఏ ఉత్తరాపేక్షకు సంబంధించి పేతురు విశ్వాసాన్ని రూపాంతరం బలపర్చింది? (బి) నేటి క్రైస్తవుల్ని రూపాంతరం ఏ విధంగా బలపరుస్తోంది?
20 ‘ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరియందు ప్రశంసింపబడుటకును, యేసు వచ్చినప్పుడు’ అని అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు, ఆయన ‘మహా శ్రమ’ జరుగు కాలంలో యేసు ప్రత్యక్షతను గురించి మాట్లాడాడు. (మత్తయి 24:21; 2 థెస్సలొనీకయులు 1:9) పేతురు యాకోబు యోహానులకూ, ఆత్మాభిషిక్త క్రైస్తవులందరికీ అదెంత దివ్యమైన ఉత్తరాపేక్షో కదా! రూపాంతరం పేతురు విశ్వాసాన్ని బలపర్చింది. దానిని గురించి చదవడం మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది, అలాగే యేసు ‘ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలాన్ని’ త్వరలోనే ఇస్తాడనే మన నమ్మకాన్ని పటిష్టపరుస్తోంది. ఈ నాటివరకూ జీవించివున్న నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు, యేసుతోపాటు తాము మహిమపర్చబడతామనే తమ నమ్మకం రూఢిపర్చబడడాన్ని చూస్తారు. ఆయన ఈ దుష్ట విధానాంతం నుండి తమను కాపాడి, మహిమకరమైన నూతన లోకంలోనికి తీసుకెళ్తాడనే విషయాన్ని ఎరిగి ఉన్నందున వేరే గొఱ్ఱెల విశ్వాసం బలపర్చబడింది. (ప్రకటన 7:14) అంతంవరకూ స్థిరంగా నిలబడ్డానికి ఇదెంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా! దీని తర్వాత శీర్షికను మనం పరిశీలిస్తుండగా, ఈ దర్శనం మరిన్ని విషయాల్ని మనకు బోధించగలదు.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారు ప్రచురించిన “నీ నామం పరిశుద్ధపర్చబడు గాక” (ఆంగ్లం) అనే పుస్తకంలోని 313-14 పేజీలనూ, ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని 164-5 పేజీలనూ చూడండి.
b నిర్గమకాండము 2:15-22; 3:1-6; 5:2; 7:8-13; 8:18; 19:16-19; ద్వితీయోపదేశకాండము 31:23; 1 రాజులు 17:8-16; 18:21-40; 19:1, 2, 8-18; 2 రాజులు 2:1-14.
c ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని 133-41 పేజీలను చూడండి.
d వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారు ప్రచురించిన అర్మగిద్దోను నుండి దేవుని నూతన లోకంలోనికి మీరు తప్పించబడవచ్చు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 281-3 పేజీలను చూడండి.
e “నీ నామం పరిశుద్ధపర్చబడు గాక” (ఆంగ్లం) అనే పుస్తకంలోని 317-20 పేజీలను చూడండి.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
◻ రూపాంతరంలో యేసుతోపాటు ఎవరు కన్పించారు?
◻ రూపాంతరం ద్వారా అపొస్తలుల విశ్వాసం ఎలా బలపర్చబడింది?
◻ రూపాంతరంలో యేసుతోపాటు మోషే ఏలీయాలు “మహిమతో” కన్పించినప్పుడు, వాళ్లు ఎవరికి ప్రాతినిధ్యం వహించారు?
◻ మోషే ఏలీయాలకూ దేవుని ఇశ్రాయేలుకూ మధ్య ఏ సమాంతరాలు ఉన్నాయి?
[10వ పేజీలోని చిత్రం]
గతకాలంలోని క్రైస్తవుల విశ్వాసాన్నీ, ఇప్పుడున్న క్రైస్తవుల విశ్వాసాన్నీ రూపాంతర దర్శనం బలపర్చింది