యెహోవాకు ఘనత తెచ్చే పెళ్లిళ్లు
క్రైస్తవ పెళ్లిళ్లను గురించిన ఈ క్రింది శీర్షిక, ఇతియోపియాలో ఇటీవలనే యెహోవాసాక్షులుగా మారిన అనేకమందికి అక్కడ సహాయకరమైన నడిపింపును ఇవ్వడం కొరకు అమ్హరిక్ భాషలో మొదటిగా సిద్ధం చేయబడింది. మీరు నివసించే ప్రాంతంలోని ఆచారాలనుండీ అలవాట్ల నుండీ భిన్నంగా ఉండే కొన్ని ప్రాంతీయ అలవాట్లను గురించీ ఆచారాలను గురించీ ఇది చర్చిస్తోంది. ఆ తేడా చాలా ఆసక్తికరంగా ఉందని మీరు కనుగొనవచ్చు. అదే సమయంలో, ఈ శీర్షిక సమతూకమైన బైబిలు సలహాలను అందిస్తుంది, ఆ సలహాలు మీ ప్రాంతంలోని పెళ్లి ఆచారాలు వేరుగా ఉన్నప్పటికీ మీకు కూడా అన్వయిస్తాయని మీరు కనుగొంటారు.
“ఆనందాన్ని తెచ్చే క్రైస్తవ పెళ్లిళ్లు” అనేది ఏప్రిల్ 15, 1984, కావలికోట (ఆంగ్లం) సంచికలోని ఒక చక్కని పఠన శీర్షిక యొక్క ముఖ్యాంశం. అదే సంచికలోని తర్వాతి శీర్షిక యొక్క ముఖ్యాంశం “పెళ్లి విందుల్లో చక్కని సమతూకమైన ఆనందాన్ని పొందండి.” (వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్న వారికి, మీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకంలోని 2వ అధ్యాయం మరియు మీ యౌవనం—దానిని శ్రేష్ఠంగా అనుభవించడం (ఆంగ్లం) అనే పుస్తకంలోని 19, 20 అధ్యాయాల నుండి జ్ఞానవంతమైన సలహాలు మరిన్ని లభిస్తాయి.)a ఆ శీర్షికలు ప్రచురింపబడిన తర్వాత అనేకమంది యెహోవాసాక్షులయ్యారు, కాబట్టి మన ప్రాంతానికి ప్రాముఖ్యంగా అన్వయించే కొన్ని అంశాలనూ అలాగే వివాహానికి ఆరంభకుడైన యెహోవాకు ఘనతను తీసుకువచ్చే పెళ్లి వేడుకలను ఏర్పాటు చేసేందుకు మనకు సహాయం చేయగల ఇతర ఉచితమైన అంశాలనూ మనం ఇప్పుడు పునఃపరిశీలిద్దాము.
మొదట పరిశీలించదగిన ఒక ప్రశ్న ఏమంటే, పెళ్లి ఎప్పుడు జరగాలి? ఆచారబద్ధమైన ప్రాంతీయ పెళ్లిళ్ల సీజన్‌ను ఆధారంగా చేసుకుని ఆ తేదీని నిర్ణయించుకోవాలా? సంవత్సరంలోని ఏ ఇతర సమయంలో జరిగిన పెళ్లైనా అది విజయవంతం కాదనేది ప్రాంతీయ నమ్మకం. అది ఆధారం లేని మూఢనమ్మకం, ఎందుకంటే యెహోవాను ఆనందంగా మరియు ఐక్యంగా సేవిస్తున్న అనేకమంది వివాహిత దంపతులు ఆ ఆచారబద్ధమైన సీజన్లో పెళ్లి చేసుకోలేదు. మనం అదృష్టాన్ని గానీ దురదృష్టాన్ని గానీ నమ్మము. (యెషయా 65:11; కొలొస్సయులు 2:8) ఈ మూఢనమ్మకాలకు అనుగుణంగా పెళ్లిళ్ల తేదీలను మనం నిర్ణయిస్తే గనుక మనం అవిశ్వాసులైన బంధువులు సత్యాసత్యాలకు మధ్యనున్న వ్యత్యాసాన్ని గుర్తించడానికి సహాయం చేసిన వారముగా ఉండము. వాస్తవమేమిటంటే, క్రైస్తవులు ఏ నెలలోనైనా వివాహం చేసుకోవచ్చు.
అవసరమైన న్యాయవిధి ముగించబడిన తర్వాత పెళ్లి ప్రసంగం ఇవ్వబడేందుకు ఏర్పాటు చేయబడినప్పుడు, ఈ రెండు కార్యాలకూ మధ్య అనేక దినాల కాల వ్యవధి ఉండటం జ్ఞానయుక్తం కాదు. ఒకవేళ ఆ జంట తమ పెళ్లి ప్రసంగం రాజ్యమందిరంలో ఇవ్వబడాలని ఇష్టపడితే, హాలును ఉపయోగించుకోవడాన్ని గురించి వారు సరిపడినంత సమయం ముందే ఆ సంఘ పెద్దలకు విన్నపం చేసుకోవాలి. ఆ వేడుకకు అవసరమయ్యే ఏర్పాట్లు తాము స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉండేలా చేస్తాయా లేదాయని పెద్దలు నిశ్చయపర్చుకోవాలి. ఏ సంఘ కార్యకలాపాలకూ అది ఆటంకం కలిగించనిరీతిలో సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పెళ్లి ప్రసంగీకునిగా ఎంచుకోబడిన సహోదరుడు, కాబోయే పెళ్లి కొడుకుకూ పెళ్లి కూతురికీ సహాయకరమైన సలహాలను ఇచ్చేందుకూ ఎటువంటి నైతికపరమైన లేక చట్టపరమైన అడ్డంకులు లేవనీ దాని తర్వాత జరగబోయే వేడుక కొరకైన పథకాలను తనకు అంగీకారయోగ్యంగా ఉన్నాయో లేదోననీ నిశ్చయపర్చుకునేందుకు వారిరువురినీ ముందే కలుస్తాడు. పెళ్లి ప్రసంగం దాదాపు అరగంట సేపు సాగాలి, మరియు ఆత్మీయ అంశాలను నొక్కి చెబుతూ గౌరవనీయమైన పద్ధతిలో ఇవ్వబడాలి. దాని తర్వాత జరిగే ఎలాంటి వేడుకకంటే కూడా పెళ్లి ప్రసంగమే ఎంతో ప్రాముఖ్యమైనది.
మనం ‘లోకసంబంధులం’ కామని చూపేందుకు క్రైస్తవ పెళ్లి ఒక చక్కని అవకాశం. (యోహాను 17:14; యాకోబు 1:27) మన క్రమబద్ధత విశిష్టంగా కనిపించాలి. పెళ్లికి వచ్చిన అతిథులు మన కొరకు వేచి ఉండేలా ఆలస్యం చేసి తద్వారా సంఘ కార్యకలాపాలకు ఆటంకం కలిగించకుండా మనం సమయాన్ని పాటించాలని దీని అర్థము. ముఖ్యంగా పెళ్లి కూతురు ఈ విషయాన్ని గురించి శ్రద్ధ వహించాలి, ఎందుకంటే ఆమె తన ప్రాముఖ్యతను పెంచేందుకన్నట్లు లోక సంబంధులైన బంధువులు ఆమె ఆలస్యంగా రావాలని ఆమెకు చెప్పవచ్చు. అయితే సమయానికి రావడం ద్వారా ఒక పరిణతిగల క్రైస్తవ సహోదరి దీనత్వం మరియు శ్రద్ధ వంటి ఆత్మీయ లక్షణాలు తనకు ఎక్కువ ప్రాముఖ్యమైనవని ప్రదర్శిస్తుంది! అంతే కాకుండా, ఆ సందర్భంలో ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్‌ని పిలిచినప్పుడు ఆ విషయంలో కూడా క్రమబద్ధత అవసరం. ఫోటోలు తీసే వ్యక్తి కోటు, టై, మంచి ప్యాంటు వేసుకుని రావాలని, ప్రసంగం సమయంలో అతను ఫోటోలు తీస్తూ అంతరాయం కలిగించకూడదని కచ్చితంగా చెప్పడం అవసరం. ప్రార్థన జరిగే సమయంలో ఫోటోలు తీయకూడదు. మన క్రమబద్ధత యెహోవాకు ఘనత తెస్తుంది మరియు చక్కని సాక్ష్యాన్నిస్తుంది. ఆ సందర్భం యొక్క వాస్తవమైన అర్థాన్ని కనుమరుగు చేసే సాంఘిక ఆచారాలకు అనుగుణంగా ఉండేందుకు ప్రయత్నించవలసిన అవసరంలేదు.
పెళ్లి విజయవంతంగా జరగాలంటే విందు భోజనం తప్పనిసరి కాదు, అయితే అలాంటి ఆనందకరమైన సందర్భంలో విందు భోజనం ఏర్పాటు చేయకూడదని అభ్యంతరపర్చే లేఖనాధార కారణం ఏమీ లేదు. అయితే, నిజ క్రైస్తవులు జరుపుకునే అలాంటి సమావేశం వేరుగా ఉండాలి. అది అట్టహాసంతో, అతిగా మద్యపానం సేవించడం, అదుపు తప్పి తినడం, వికారమైన సంగీతం, పురికొలిపే డాన్సు చివరకు కొట్లాటలు వంటివి ఉండే ప్రాపంచిక రిసెప్షన్‌కి భిన్నంగా ఉండాలి. బైబిలు “అల్లరితో కూడిన ఆటపాటల”ను శరీర కార్యాలుగా వర్గీకరిస్తుంది. (గలతీయులు 5:21) మరీ పెద్ద గుంపు కంటే చిన్న గుంపును అదుపు చేయడం సులభం. ప్రముఖ ఆచారాలకు అనుగుణంగా ఉండేందుకు టెంట్ వేయవలసిన అవసరం లేదు. స్థలం మరియు వాతావరణం కారణాన టెంట్ వేయాలని కొందరు తీర్మానించుకుంటే అది వారి వ్యక్తిగతమైన విషయం.
అతిథుల సంఖ్యను అదుపు చేయగల చక్కని మార్గం వారికి జాబు వ్రాయడం ద్వారా ఆహ్వానించడమే. మొత్తం సంఘాలను ఆహ్వానించే బదులు వ్యక్తులను ఆహ్వానించడం జ్ఞానయుక్తం, మరి క్రమబద్ధతగల క్రైస్తవులుగా మనం అలాంటి పరిమితులను గౌరవించాలి. వ్రాతపూర్వక ఆహ్వానాలను ఇవ్వడం విందుకు బహిష్కరించబడిన ఒక వ్యక్తి వచ్చి కలిగించే ఇబ్బందిని నివారించేందుకు మనకు వీలు కలిగిస్తుంది, ఎందుకంటే అది జరిగితే అనేకమంది సహోదర సహోదరీలు అక్కడి నుండి వెళ్లిపోవాలని తీర్మానించుకోవచ్చు. (1 కొరింథీయులు 5:9-11) ఒకవేళ ఒక జంట అవిశ్వాసులైన తమ బంధువులను లేక పరిచయస్థులను ఆహ్వానిస్తే, ‘విశ్వాసంలో మనకు సంబంధీకులైన’ వారికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ అవిశ్వాసులు తక్కువ సంఖ్యలోనే ఆహ్వానించబడతారు. (గలతీయులు 6:10) కొందరు తమ లోకసంబంధ పరిచయస్థులను లేక అవిశ్వాసులైన స్నేహితులను విందుకు బదులు పెళ్లి ప్రసంగానికే ఆహ్వానించాలని తీర్మానించుకున్నారు. ఎందుకు? లోక సంబంధులైన బంధువులు పెళ్లి విందులో ఎలాంటి ఇబ్బందిని కలిగించే పరిస్థితిని ఏర్పర్చాంటే అనేకమంది సహోదర సహోదరీలు తాము ఇక అక్కడ ఉండటం భావ్యం కాదని భావించేలా చేసిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని జంటలు తమ సన్నిహిత బంధువులు మరియు క్రైస్తవ స్నేహితులను మాత్రమే చిన్న విందుకు ఆహ్వానించాలని ఏర్పాటు చేసుకున్నారు.
యోహాను 2:8, 9కు అనుగుణంగా “విందు ప్రధాని”ని ఏర్పాటు చేసుకోవడం ఆచరణయోగ్యం. క్రమబద్ధతను, ఉన్నతమైన ప్రమాణాలను కాపాడే ఒక నమ్మకమైన క్రైస్తవుని అందుకు ఏర్పాటు చేసుకోవాలని పెళ్లి కొడుకు తీర్మానించుకోవాలి. స్నేహితులు బహుమతులను తెచ్చినా, దాన్ని “డంబము”గా చేయకూడదు. (1 యోహాను 2:16) చక్కని సంగీతాన్ని విని ఆనందించవచ్చు, అయితే అది ప్రశ్నించదగిన పదాలు, విపరీతమైన శబ్దం లేక వెర్రి రాగాన్ని కలిగి ఉండకూడదు. ఏ సంగీతాన్ని వినిపించబోతున్నారో దాన్ని ఒక పెద్ద ముందుగా వినేలా ఏర్పాటు చేయడం మంచిదని అనేకులు కనుగొన్నారు. డాన్సు చేయడం సమస్యలను తీసుకురావచ్చు, ఎందుకంటే అనేక పారంపర్య డాన్సులు ఫలవంతత నుండి వచ్చినవి అవి అనుచితమైన లైంగికతను చిత్రీకరిస్తాయి. “కేక్ మరియు షాంపేన్ పంచే గడియ”లో లోక సంబంధులైన ప్రజలు అదుపుతప్పి ప్రవర్తించేందుకు కొన్నిసార్లు దారి తీసింది. వాస్తవానికి, అనేకమంది క్రైస్తవ దంపతులు తమ పెళ్లి విందులో అసలు మత్తుపానీయాలనే ఉపయోగించకూడదని అలా సమస్యలను నివారించాలని తీర్మానించుకున్నారు.
మనం యెహోవాను ఘనపర్చాలని కోరుకుంటాము గనుక, మన వైపుకు అత్యంత అవధానాన్ని ఆకర్షించుకునే విధంగా ప్రదర్శించడాన్ని మనం నివారిస్తాము. లోక సంబంధ ప్రచురణలు కూడా అతిగా ప్రదర్శించే స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడాయి. దుబారా ఖర్చులతో పెళ్లి చేసుకునేందుకు అప్పులపాలై ఆ ఒక్క దినం చేసిన ఖర్చులను తీర్చేందుకు అనేక సంవత్సరాల లేమిని అనుభవించడం ఎంతో అవివేకమైన పని అవుతుంది! ఆ సందర్భంలో వేసుకునే ఏ బట్టలైనా యోగ్యంగా, మంచిగా అలాగే దేవునికి భయపడే వ్యక్తికి తగినట్లు ఉండాలి అన్నది నిజమే. (1 తిమోతి 2:9, 10) “క్రైస్తవ పెళ్లిళ్లు సహేతుకతను ప్రతిబింబించాలి” అనే శీర్షిక (జనవరి 15, 1969 కావలికోట [ఆంగ్లం]) వస్త్రాలపై ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని చేసింది:
“పెళ్లి ప్రత్యేకమైన సందర్భం, కనుక ఆ సందర్భంలో ఆనందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించాలని ఎంతో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ ఒకరు ఒక ప్రత్యేక విధమైన గౌనును లేక సూట్‌ను వేసుకోవడం తప్పనిసరి ఏమీ కాదు. ప్రాంతీయ స్టయిల్‌ను, ఖర్చును, వ్యక్తిగత అభిరుచిని పరిగణలోకి తీసుకోవడం మంచిది. . . . తమకు లేక ఇతరులకు ఆర్థిక భారాన్ని కలిగించేంత ఖరీదైన వస్త్రాలను కొనుగోలు చేయడం అంత సహేతుకంగా ఉంటుందా? . . . కొందరు పెళ్లి కూతుళ్లు తమ సన్నిహిత స్నేహితురాలు లేక బంధువు యొక్క గౌనును వేసుకునేందుకు అభ్యంతరపడలేదు. ఇతరులు తమ స్వంతగా తమ పెళ్లి బట్టలు కుట్టుకోవడాన్ని ఇష్టపడ్డారు, అలా చేయడం ద్వారా వారు ఆ వస్త్రాలను మరో సందర్భంలో కూడా వాడుకునేందుకు వీలుగా కుట్టుకోగలిగారు. తమ అత్యంత ఆకర్షణీయమైన అనుదిన దుస్తుల్లో పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు . . . ఘనంగా పెళ్లి జరుపుకోగల స్తోమత ఉన్న ఇతరులు కూడా, కాలములు అపాయకరంగా ఉన్నందు మూలాన ‘నిరాడంబరంగా పెళ్లి’ చేసుకోవాలని వ్యక్తిగతంగా తీర్మానించుకోవచ్చు.
అదే విధంగా, పెళ్లి జట్టు (పెళ్లి కొడుకు స్నేహితులు మరియు పెళ్లి కూతురు స్నేహితురాండ్రు) పెద్దదిగా ఉండనవసరం లేదు. వారు కూడా తమ వస్త్రాలు, చర్యల ద్వారా అనుచితమైన అవధానాన్ని ఆకర్షించాలని అనుకోరు. రాజ్య మందిరంలో జరిగే ప్రసంగానికి బహిష్కరింపబడిన వ్యక్తి వచ్చేందుకు అనుమతింపబడినప్పటికీ, 1984 ఏప్రిల్ 15, కావలికోట (ఆంగ్లం) ఇలా చెప్పింది: “బహిష్కరింపబడిన వ్యక్తులను లేక బైబిలు సూత్రాలకు పూర్తి విరుద్ధమైన నిందించదగిన జీవిత విధానాన్ని కలిగివుండే వారిని పెళ్లి జట్టులో ఉంచుకోవడం సరైనది కాదు.”
యేసు ఒక వివాహానికి హాజరైనప్పటికీ, వీధుల్లో అల్లరి చేస్తూ కార్లను ఊరేగింపుగా తిప్పే ప్రఖ్యాత అలవాటును ఆయన ఆమోదిస్తాడనే విషయాన్ని మనం ఊహించలేము; ఒక పెళ్లి ఊరేగింపులో హారన్ మోగించినందుకు పోలీసులు డ్రైవర్లకు జరిమానా కూడా విధించారు. (మత్తయి 22:21 చూడండి.) క్లుప్తంగా చెప్పాలంటే, అన్య జనుల ఆడంబరాన్ని లేక ప్రవర్తనను అనుకరించే బదులు, క్రైస్తవులు దీనులు కలిగివుండే జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు.—సామెతలు 11:2.
అయితే పొరుగువారి, లోక సంబంధులైన తోటి పనివారి, లేక దూరపు బంధువుల, పరిచయస్థుల పెళ్లిళ్లకు హాజరవ్వడాన్ని గురించి ఏమిటి? ఈ విషయాన్ని గురించి ప్రతి క్రైస్తవుడు తానే వ్యక్తిగతంగా తీర్మానించుకోవాలి. మన సమయం ప్రశస్తమైనదనే విషయాన్ని మనస్సులో ఉంచుకోవడం మంచిది, ఎందుకంటే మనకు మన పరిచర్యకొరకు, వ్యక్తిగత పఠనం కొరకు, ఇతర కుటుంబ, సంఘ కార్యకలాపాల కొరకు సమయం అవసరం. (ఎఫెసీయులు 5:15, 16) వారాంతాల్లో, మనకు కూటాలు మరియు మనం ఎన్నడూ వదులుకోవాలని ఇష్టపడని ప్రాంతీయ సేవ ఉంటాయి. (హెబ్రీయులు 10:24, 25) అనేక పెళ్లిళ్లు మన సభలు లేక జ్ఞాపకార్థ దినం సందర్భంగా చేసే ప్రత్యేక ప్రకటనా కార్యక్రమం సమయంలోనే ఉండవచ్చు. ప్రభువు రాత్రి భోజనానికి హాజరయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా మన సహోదరులు తీసుకునే ప్రత్యేక శ్రద్ధను మనం కనపర్చకుండా ఉండేందుకు మనలను మనం అనుమతించకూడదు. మనం సత్యాన్ని తెలుసుకోక ముందు లోక సంబంధులైన ప్రజలతో ఎక్కువ సమయాన్ని గడిపాము, బహుశ దేవున్ని అగౌరవపరిచే పరిస్థితుల్లో కూడా ఉండి ఉండవచ్చు. (1 పేతురు 4:3, 4) ఇప్పుడు మన ప్రాధాన్యతలు వేరు. లోక సంబంధులైన జంటకు ఒక కార్డును పంపడం ద్వారా లేక మరొక దినాన వారి ఇంటికి వెళ్లి వారిని దర్శించడం ద్వారా మనం వారికి శుభాకాంక్షలు చెప్పడం ఎల్లవేళలా సాధ్యమే. క్రొత్తగా పెళ్లైన జంటకు తగిన కొన్ని లేఖనాలను చూపుతూ సాక్ష్యం ఇచ్చేందుకు కొందరు అలాంటి సందర్భాలను ఉపయోగించుకున్నారు.
ఏ పెళ్లిలోనైతే లోక సంబంధమైన విధానాలను ఆత్మీయ అంశాలు అధిగమిస్తాయో ఆ పెళ్లి యెహోవాకు వాస్తవంగా ఘనత తెస్తుంది. ప్రపంచంలోని మూఢనమ్మకాలకు, ఆడంబరాలకు తాము దూరంగా ఉండేలా నిశ్చయపర్చుకోవటం ద్వారా, నియమిత దైవపరిపాలనా కార్యకలాపాలకు పెళ్లి అడ్డంకుగా ఉండకుండా చేయడం ద్వారా మరియు ఆడంబరాలకు పోయే బదులు నిరాడంబరంగా ఉండటం ద్వారా క్రైస్తవులు ఆ సందర్భంలో ఆనందాన్ని కనుగొంటారు. అంతే కాకుండా, వారు ఆ సందర్భాన్ని గురించి మంచి మనస్సాక్షితో, మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకోగలుగుతారు. జ్ఞానాన్నీ సహేతుకతను ప్రదర్శించడం ద్వారా మన క్రైస్తవ పెళ్లిళ్లన్నీ కూడా యథార్థ హృదయులందరికీ సాక్ష్యాన్నివ్వాలని ఆశిద్దాం.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారు ప్రచురించినవి.
[24, 25వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు ప్రాంతీయ పెళ్లి ఆచారాలన్నింటినీ అర్థరహితంగా ఆచరించరు