నాఖమనైడెస్—ఆయన క్రైస్తవత్వాన్ని ఖండించాడా?
మధ్యయుగాలు. అవి మీకు ఏ విషయాలను జ్ఞాపకం చేస్తాయి? క్రూసేడ్‌లనా? ఇంక్విజీషన్‌లనా? హింసించడాన్నా? మత చర్చలు నిస్సంకోచంగా జరిగిన కాలం కాకపోయినప్పటికీ, ఆ సమయంలో అంటే 1263వ సంవత్సరంలో యూరప్ చరిత్రలోని అత్యంత విశేషమైన యూదాక్రైస్తవ చర్చ ఒకటి జరిగింది. అందులో ఎవరు ఇమిడి ఉన్నారు? ఏ వివాదాంశాలు రేకెత్తించబడ్డాయి? నిజమైన మతాన్ని గుర్తించేందుకు అది నేడు మనకు ఎలా సహాయం చేయగలదు?
వివాదాన్ని ఏది రేకెత్తించింది?
మధ్య యుగాల్లో, రోమన్ కాథోలిక్ చర్చి తనదే సత్యమైన మతం అని చెప్పుకుంది. అయితే, తామే దేవుడు ఎన్నుకున్న ప్రజలమనే తమ వాదాన్ని యూదా ప్రజలు ఎన్నడూ విడనాడలేదు. తమ మతాన్ని మార్చుకోవలసిన అవసరత తమకుందని యూదులను ఎన్నడూ చర్చి ఒప్పించలేకపోవడం చర్చి నిరాశ చెందేందుకు మరియు తరచుగా దౌర్జన్యానికీ హింసకూ పాల్పడేందుకు దారి తీసింది. క్రూసేడ్‌ల కాలంలో బాప్తిస్మం తీసుకుంటారా లేక మరణిస్తారా అనే ఎంపికను వారి ముందుంచినప్పుడు లక్షలాదిమంది యూదులు హింసించబడ్డారు లేక కొయ్యకు కట్టి కాల్చబడ్డారు. అనేక దేశాల్లో చర్చి పురికొల్పిన యూదా వ్యతిరేక ఉద్యమం అప్పుడు ప్రబలి ఉంది.
అయితే కాథోలిక్ దేశమైన స్పెయిన్‌లో 12, 13 శతాబ్దాల్లో వేరే రకమైన స్ఫూర్తి ప్రబలి ఉంది. యూదులకు మత స్వేచ్ఛ ఇవ్వబడింది మరి వారికి రాజాస్థానంలో కూడా ప్రాముఖ్యమైన స్థానాలు ఇవ్వబడ్డాయి, అయితే అదంతా కూడా వారు క్రైస్తవ విశ్వాసంపై దాడి చేయనంత కాలమే. అయితే ఒక శతాబ్ద కాలంపాటూ వారు అలాంటి అనుగ్రహాన్ని అనుభవించిన తర్వాత, డొమినికన్ ప్రీస్టులు సమాజంలో యూదుల ప్రభావాన్ని తగ్గించేందుకు, మరియు యూదులను కాథోలిక్‌లుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. అరగన్‌కు చెందిన కింగ్ జేమ్స్ I ఒక అధికారిక చర్చను ఏర్పాటు చేయాలన్న ఒత్తిడి డొమినికన్‌ల నుండి ఎదుర్కొన్నాడు, యూదా మతం యొక్క నిమ్న స్థానాన్ని మరియు యూదులందరూ మతాన్ని మార్చుకోవలసిన అవసరతను నిరూపించడమే ఆ చర్చ యొక్క సంకల్పం.
అయితే ఇదే యూదులకు మరియు క్రైస్తవులకు మధ్య జరిగిన మొదటి చర్చ కాదు. 1240వ సంవత్సరంలో, ఫ్రాన్స్ నందలి ప్యారిస్‌లో ఒక అధికారిక వాదన జరిగింది. యూదుల పవిత్ర గ్రంథమైన టాల్‌ముడ్ యొక్క సత్యసంధతను ప్రశ్నించడమే దాని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, అందులో పాల్గొన్న యూదులకు ఎంతమాత్రం వాక్ స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం జరుగలేదు. ఈ వివాదంలో చర్చి తన విజయాన్ని ప్రకటించుకున్న తర్వాత, టాల్‌ముడ్ యొక్క అసంఖ్యాకమైన ప్రతులు బహిరంగ స్థలాల్లో దహించివేయబడ్డాయి.
అయితే అరగన్‌కు చెందిన కింగ్ జేమ్స్ I యొక్క మరింత సహనశీల స్ఫూర్తి అలాంటి అపహాస్యం చేసే విచారణను అనుమతించలేదు. ఈ విషయాన్ని గుర్తించి, డొమినికన్‌లు వేరే పంథాను ప్రయత్నించారు. జూడాయిజం ఆన్ ట్రయల్ అనే తన పుస్తకంలో ఖ్యామ్ మకోబి దాన్ని వర్ణించిన విధంగా, వారు యూదులను “ప్యారిస్‌లో వలె వారిని ఎద్దేవా చేయడానికి బదులు మర్యాద మరియు అనునయం అనే పేరుతో” వాదనకు పిలిచారు. మునుపు ఒక యూదుడైయుండి తర్వాత కాథోలిక్ మతాన్ని స్వీకరించి డొమినికన్ ప్రీస్టుగా మారిన పాబ్లో క్రిస్టియానీను డొమినికన్‌లు తమ ముఖ్య ప్రతినిధిగా నియమించారు. టాల్‌ముడ్ మరియు రబ్బీల వ్రాతలను గురించి పాబ్లో క్రిస్టియానీ కలిగివున్న జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా తాము తప్పక ఆ వివాదాన్ని గెలవగలమని డొమినికన్‌లు భావించారు.
నాఖమనైడెస్‌నే ఎందుకు ఎన్నుకున్నారు?
వాదనలో యూదుల తరఫున నిలువగల సరైన ఆత్మీయ యోగ్యతగల, స్పెయిన్‌లోని ఏకైక వ్యక్తి మోసెస్ బెన్ నఖమాన్ లేక నాఖమనైడెస్.a 1194లో గెరోనా నగరమందు జన్మించిన నాఖమనైడెస్ తన యౌవనారంభ దశలోనే తాను బైబిలు మరియు టాల్‌ముడ్ యొక్క పండితుడినని నిరూపించుకున్నాడు. 30 ఏళ్లు నిండేసరికే, ఆయన టాల్‌ముడ్ యొక్క చాలా భాగంపై వ్యాఖ్యానాలు వ్రాశాడు, మరి కొంత కాలానికే మైమోనిడెస్ యొక్క వ్రాతలను గురించిన వివాదంపై మధ్యవర్తిత్వం వహించడంలో ముఖ్యవక్త అయ్యాడు.b ఆ వివాదం యూదుల సమాజాన్ని విభజించగలిగి ఉండేది. నాఖమనైడెస్ తన తరం వారందరిలోనూ, బైబిలు మరియు టాల్‌ముడ్ యొక్క అత్యంత గొప్ప యూదా పండితుడిగా పరిగణించబడ్డాడు, ఆ కాలంలో యూదా మతంపై ఆయన ప్రభావం విషయంలో ఆయన మైమోనిడెస్‌కంటే మాత్రమే తక్కువ వానిగా పరిగణించబడేవాడు.
కాటలోనియాలోని యూదా సమాజంపై నాఖమనైడెస్ ఎంత విస్తృత ప్రభావాన్ని చూపాడంటే, కింగ్ జేమ్స్ I కూడా వివిధ ప్రభుత్వ సంబంధ విషయాల్లో ఆయనను సంప్రదించాడు. యూదులూ, అన్యులూ కూడా ఆయన నిశితమైన ఆలోచనాశక్తిని ఎంతో గౌరవించేవారు. యూదులను సమర్థవంతంగా అవమానించేందుకు ఆయన, అంటే వారి అత్యంత ముఖ్యుడైన రబ్బీ వాదనలో పాల్గొనాలని డొమినికన్‌లు గుర్తించారు.
డొమినికన్‌లు నిష్పక్షపాతంగా ఉండే ఉద్దేశాన్ని కలిగి లేరని గుర్తించి, నాఖమనైడెస్ వాదనకు ఒప్పుకునేందుకు విముఖతతో ఉన్నాడు. ఆయన, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలే గానీ ఆయనే ప్రశ్నలనూ వేయలేడు. అయితే, ఆయన రాజు చేసిన విన్నపాన్ని అంగీకరించి తాను సమాధానం చెప్పేటప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే అనుమతిని తనకివ్వమని అడిగాడు. కింగ్ జేమ్స్ I దీనికి అంగీకరించాడు. సాపేక్షికంగా స్వేచ్ఛగా మాట్లాడగలిగే అలాంటి అనుమతి మధ్య యుగాల్లో ముందెన్నడూ ఇవ్వబడలేదు మరియు మళ్లీ ఎప్పుడూ ఇవ్వబడదు, అది నాఖమనైడెస్ ఎడల రాజుకుగల మర్యాదను స్పష్టంగా చూపుతోంది. అయినప్పటికీ, నాఖమనైడెస్ భయపడ్డాడు. ఆయన వాదనలో విపరీతంగా వ్యతిరేకిస్తున్నాడని పరిగణించబడితే దాని మూలంగా తనకు మరియు యూదా సమాజానికంతటికీ విపత్కరమైన పరిణామాలు ఏర్పడగలవు. ఏ సమయంలోనైనా హింస పెల్లుబకవచ్చు.
నాఖమనైడెస్‌కూ పాబ్లో క్రిస్టియానీకి మధ్య వాగ్యుద్ధం
చర్చకు ముఖ్య స్థానం బార్సిలోనాలోని రాజ భవంతి. 1263, జూలై 20, 23, 26, 27 తారీఖుల్లో నాలుగు కార్యక్రమాలు జరిగాయి. ప్రతి కార్యక్రమంలోనూ రాజు తానే వ్యక్తిగతంగా సమావేశానికి అధ్యక్షత వహించాడు, అలాగే చర్చికి ప్రభుత్వానికి మరియు స్థానిక యూదా సమాజానికి చెందిన ప్రముఖులు కూడా దానికి హాజరయ్యారు.
చర్చలో తానే గెలుస్తానని చర్చి నమ్మకంగా ఉంది. వాదన యొక్క ఉద్దేశ్యం ‘ఏదో సందేహం ఉన్నట్లు విశ్వాసాన్ని పరీక్షించడం కాదు గానీ, యూదుల తప్పుల్ని నాశనం చేసేందుకు మరియు అనేకమంది యూదుల నమ్మకమైన విశ్వాసాన్ని తీసివేసేందుకే’ అని డొమినికన్‌లు తమ అధికారిక వృత్తాంతంలో పేర్కొన్నారు.
నాఖమనైడెస్‌కు దాదాపు 70 ఏళ్లు ఉన్నప్పటికీ, చర్చను ప్రాథమిక అంశాలకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా నాఖమనైడెస్ తన చురుకైన ఆలోచనాపటిమ కనపర్చాడు. ఆయనిలా ప్రారంభించాడు: “అన్యులకు యూదులకు మధ్య జరిగిన [మునుపటి] వివాదాల్లో విశ్వాసం యొక్క ప్రాథమిక సూత్రం ఆధారపడని మత ఆచరణల అనేక అంశాలను గురించి చర్చించడం జరిగింది. అయితే, ఈ రాజాస్థానంలో నేను పూర్తి వివాదం దేనిపై ఆధారపడి ఉందో ఆ అంశాలను గురించి మాత్రమే చర్చించేందుకు ఇష్టపడతాను.” మెస్సీయ అప్పటికే వచ్చేశాడా లేదా, ఆయన దేవుడా లేక మానవుడా, మరియు సత్యమైన ధర్మశాస్త్రం యూదుల వద్ద ఉందా లేక క్రైస్తవుల వద్ద ఉందా అనే విషయాలను గురించి మాత్రమే చర్చించాలని అంగీకరించడం జరిగింది.
తన ప్రారంభ వాదంలో, మెస్సీయ ఇప్పటికే వచ్చాడనే విషయాన్ని తాను టాల్‌ముడ్ నుండే నిరూపిస్తానని పాబ్లో క్రిస్టియానీ ప్రకటించాడు. దానికి ప్రతిగా, ఒకవేళ అదే వాస్తవమైతే, టాల్‌ముడ్‌ను అంగీకరించిన రబ్బీలు యేసును ఎందుకు అంగీకరించలేదని నాఖమనైడెస్ సవాలు విసిరాడు. తన వాదాలకు స్పష్టమైన లేఖనాధార తర్కాన్ని ఆధారం చేసుకునే బదులు తన వాదాలను నిరూపించుకునేందుకు క్రిస్టియానీ పదే పదే రబ్బీల అస్పష్టమైన వాక్య సముదాయాలను ఎత్తిచూపాడు. అవి తప్పుగా అన్వయించబడ్డాయని చూపుతూ నాఖమనైడెస్ వాటిని ఒక్కొక్క అంశం చొప్పున త్రిప్పికొట్టాడు. నాఖమనైడెస్ తన జీవిత కాలాన్నంతటినీ వేటి అధ్యయనం కొరకు సమర్పించాడో ఆ వ్రాతలను గురించి ఆయనే సమర్థవంతంగా చర్చించగలడని నిరూపించుకోగలడనటం ఎంతో సహేతుకం. క్రిస్టియానీ లేఖనాలను సూచించినప్పుడు కూడా, అతను తన వాదనలో ఎత్తి చూపిన అంశాలు సులభంగా త్రిప్పికొట్ట గలిగేవిగా ఉన్నాయి.
ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకే పరిమితం చేయబడినప్పటికీ, కాథోలిక్ చర్చి యొక్క విధానం యూదులకూ అలాగే ఆలోచనాపరులైన ఇతర ప్రజలకు కూడా ఎందుకు అనంగీకారయోగ్యంగా ఉందో అన్న విషయాన్ని నాఖమనైడెస్ తన శక్తివంతమైన వాదనలతో స్పష్టం చేయగలిగాడు. త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతూ ఆయనిలా ప్రకటించాడు: “భూమికీ ఆకాశానికీ సృష్టికర్త అయిన వాడు . . . ఒక యూదా స్త్రీ గర్భంలో . . . నుండి వచ్చి . . . తర్వాత తనను చంపబోయే తన శత్రువుల చేతులకు అప్పగించబడతాడనే విషయాన్ని నమ్మేందుకు ఏ యూదుని లేక ఏ మానవుని మనస్సు కూడా అనుమతించదు.” నాఖమనైడెస్ స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: “మీరు నమ్మే విషయం మరియు మీ విశ్వాసానికి పునాది అయిన విషయం [తర్కసంగతమైన] మనస్సుకు ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదు.”
యేసు మెస్సీయ కాగల సాధ్యతను గురించి ఆలోచించడాన్ని కూడా అనేకమంది యూదులను నేటి వరకూ నివారించిన అనేక అసంగతమైన విషయాలను గురించి పేర్కొంటూ, చర్చి యొక్క విపరీతమైన రక్తాపరాధాన్ని నాఖమనైడెస్ నొక్కి చెప్పాడు. ఆయనిలా చెప్పాడు: “మెస్సీయ కాలంలో, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు; జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును అని ప్రవక్తలు పేర్కొన్నారు. నజరేయుని దినాల నుండి నేటి వరకూ, ప్రపంచం యావత్తూ హింసతోనూ, దోపిడీతోనూ నిండిపోయింది. [వాస్తవానికి], మిగతా దేశాలకంటే క్రైస్తవులే ఎక్కువ రక్తాన్ని చిందిస్తున్నారు, వారు అనైతిక జీవితాలను గడుపుతున్నారు కూడా. వారు యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేస్తే అది మహా రాజులైన తమకు తమరి అధికారులకు ఎంత విపత్కరంగా ఉంటుందో!” (ఇటాలిక్కులు మావి.)—యెషయా 2:4.
నాల్గవ కార్యక్రమం తర్వాత, వాదనను ముగించమని రాజు ఆజ్ఞాపించాడు. ఆయన నాఖమనైడెస్‌తో ఇలా అన్నాడు: “తప్పుడు పక్షాన ఉన్న వారు ఎవరైనా మీరు వాదించినంత గొప్పగా వాదించడాన్ని నేను ఎన్నడూ చూడలేదు.” తాను వాగ్దానం చేసినట్లుగానే, అరగాన్‌కు చెందిన కింగ్ జేమ్స్ I వాక్ స్వాతంత్ర్యాన్ని మరియు కాపుదలను నాఖమనైడెస్‌కు హామీ ఇచ్చాడు, అలాగే ఆయనకు 300 దీనార్‌ల బహుమానాన్ని ఇచ్చి ఇంటికి పంపాడు. గెరోనాకు చెందిన బిషప్ విన్నపం మేరకు, నాఖమనైడెస్ ఆ చర్చ యొక్క వ్రాతపూర్వక నివేదికను సిద్ధం చేశాడు.
ఒక ప్రక్క నిర్ణాయక విజయాన్ని ప్రకటిస్తూనే, డొమినికన్‌లు కలత చెందారన్నది స్పష్టమౌతుంది. వారు చర్చను గురించి ఆయన వ్రాసిన వాటిని రుజువులుగా ఉపయోగిస్తూ, నాఖమనైడెస్ చర్చికి విరుద్ధంగా దైవదూషణ చేశాడని ఆయనపై నేరారోపణ చేశారు. నాఖమనైడెస్ పట్ల రాజు ప్రసన్నుడై ఉండటాన్ని సహించలేని డొమినికన్‌లు పోప్ క్లెమెంట్ IVకు విన్నవించుకున్నారు. నాఖమనైడెస్ 70 ఏళ్లు పైబడినవాడైనప్పటికీ, ఆయనను స్పెయిన్‌నుండి బహిష్కరించడం జరిగింది.c
సత్యాన్ని ఎక్కడ కనుగొనవచ్చు?
నిజమైన మతాన్ని కనుగొనేందుకు ఇరు వైపుల వారి వాదన సహాయం చేసిందా? ఇరువురూ ఎదుటి వారి తప్పిదాలను ఎత్తి చూపినప్పటికీ, సత్యాన్ని గురించిన స్పష్టమైన వర్తమానాన్ని ఇరువురూ అందించలేకపోయారు. అయితే నాఖమనైడెస్ అంత సమర్థవంతంగా ఖండించినది నిజమైన క్రైస్తవత్వాన్ని కాదు గానీ దానికి బదులుగా, యేసు తర్వాతి శతాబ్దాల్లో క్రైస్తవమత సామ్రాజ్యం పుట్టించిన, త్రిత్వ బోధ వంటి అనేక మానవ నిర్మిత సిద్ధాంతాలనే. నాఖమనైడెస్ ద్వారా అంత ధైర్యంగా ఎత్తి చూపించబడిన, క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క అనైతిక ప్రవర్తన మరియు బుద్ధిపూర్వకమైన రక్తపాతం కూడా నిరాకరించలేని చరిత్ర వాస్తవాలు.
ఇలాంటి పరిస్థితుల్లో నాఖమనైడెస్ మరియు ఇతర యూదులు, క్రైస్తవత్వం పక్షంలో చేయబడిన వాదనలను ఎందుకు అంగీకరించలేక పోయారనే విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. అంతేకాకుండా, పాబ్లో క్రిస్టియానీ యొక్క వాదనలు హెబ్రీ లేఖనాల స్పష్టమైన తర్కంపై కాక రబ్బీల వ్రాతల అనుచితమైన అన్వయింపులపై ఆధారపడి ఉన్నాయి.
వాస్తవానికి, నాఖమనైడెస్ నిజ క్రైస్తవత్వాన్ని ఖండించలేదు. ఆయన కాలానికల్లా యేసు బోధల మరియు యేసే మెస్సీయ అనేందుకుగల రుజువుల సత్యమైన వెలుగు అబద్ధ ప్రతినిధిత్వం వలన మసకబారింది. అలాంటి అబద్ధ బోధలు కనిపించడం వాస్తవానికి యేసు మరియు ఆయన అపొస్తలుల ద్వారా ప్రవచించబడింది.—మత్తయి 7:21-23; 13:24-30, 37-43; 1 తిమోతి 4:1-3; 2 పేతురు 2:1, 2.
అయితే, నిజమైన మతం నేడు స్పష్టంగా గుర్తించగలిగేలా ఉంది. తన నిజమైన అనుచరుల గురించి యేసు ఇలా చెప్పాడు: “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. . . . ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును.” (మత్తయి 7:16, 17) మీరు దాన్ని గుర్తించాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. లేఖనాధార రుజువులను మీరు విషయపరమైన పరిశోధన చేసేందుకు యెహోవాసాక్షులు మీకు సహాయం చేయనివ్వండి. మెస్సీయను గురించిన మరియు ఆయన పరిపాలనను గురించిన దేవుని వాగ్దానాలన్నిటి నిజమైన అర్థాన్ని మీరు ఆ విధంగా తెలుసుకోగలరు.
[అధస్సూచీలు]
a అనేకమంది యూదులు నాఖమనైడెస్‌ను “రంబన్” అని కూడా పిలుస్తారు, అది “రబ్బీ మోసెస్ బెన్ నఖమాన్” అనే పదాల మొదటి అక్షరాల నుండి ఏర్పడిన హెబ్రీ పదం.
b మార్చి 1, 1995, కావలికోటలోని 20-3 పేజీల్లోని “మైమోనిడెస్—యూదామతమును పునఃనిర్వచించిన మనిషి” అనే శీర్షికను చూడండి.
c 1267లో నాఖమనైడెస్ ఇప్పుడు ఇజ్రాయేల్ అని పిలువబడుతున్న దేశానికి చేరుకున్నాడు. ఆయన తన చివరి సంవత్సరాల్లో ఎన్నో గొప్ప కార్యాలు సాధించాడు. ఆయన తిరిగి యూదా ఉనికినీ, జెరూసలేమ్‌లో ఒక అధ్యయన కేంద్రాన్నీ పునఃస్థాపించాడు. బైబిలు యొక్క మొదటి ఐదు పుస్తకాలైన తోరాహ్‌పై ఆయన ఒక వ్యాఖ్యానాన్ని కూడా పూర్తి చేశాడు, ఉత్తరాన్నున్న తీరప్రాంత నగరమైన ఆక్రాలోని యూదా సమాజానికి ఆయన ఆధ్యాత్మిక శిరస్సు అయ్యాడు, ఆయన ఆ నగరంలోనే 1270లో మరణించాడు.
[20వ పేజీలోని చిత్రం]
నాఖమనైడెస్ తన వాదనను బార్సిలోనాలో సాగించాడు
[19వ పేజీలోని చిత్రసౌజన్యం]
19-20 పేజీల్లోని చిత్రాలు: Illustrirte Pracht - Bibel/Heilige Schrift des Alten und Neuen Testaments, nach der deutschen Uebersetzung D. Martin Luther’s నుండి పునరుత్పత్తి చేయబడ్డాయి