అధ్యయన ఆర్టికల్ 51
పాట 132 మనమిప్పుడు ఒక్కరం
యెహోవాను మహిమపర్చే పెళ్లిని ఎలా చేసుకోవచ్చు?
“ అన్నీ మర్యాదగా, పద్ధతి ప్రకారం జరగనివ్వండి.”—1 కొరిం. 14:40.
ముఖ్యాంశం
పెళ్లి చేసుకునేవాళ్లు తమ పెళ్లిని యెహోవాకు మహిమ తెచ్చేలా ఎలా చేసుకోవచ్చు?
1-2. మీ పెళ్లి ఎలా జరగాలని యెహోవా కోరుకుంటున్నాడు?
మీకు పెళ్లి కుదిరిందా? కంగ్రాట్స్! చాలా సంతోషం. ఇప్పటికే మీ పెళ్లి సందడి మొదలై ఉంటుంది. యెహోవా కూడా మీ పెళ్లి చూడాలని అనుకుంటున్నాడు. మీరిద్దరూ పెళ్లిa రోజున ఉన్నట్టే, కలకాలం సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు.—సామె. 5:18; పరమ. 3:11.
2 మీ పెళ్లి యెహోవాకు మహిమ తీసుకొచ్చేలా ఉండాలి. ఎందుకు? దాన్ని ఎలా చేయవచ్చు? ఈ ఆర్టికల్‌లోని సలహాలు పెళ్లి చేసుకునేవాళ్లకే కాదు, ఆ పెళ్లికి వెళ్లేవాళ్లకు లేదా ఆ పెళ్లికి సలహాలు ఇచ్చేవాళ్లకు కూడా ఉపయోగపడతాయి.
మీరు యెహోవాను ఎందుకు మహిమపర్చాలి?
3. పెళ్లి చేసుకునేవాళ్లు పెళ్లి గురించి ప్లాన్ చేసుకునేటప్పుడు, దేనిగురించి ఆలోచించాలి? ఎందుకు?
3 పెళ్లి చేసుకునేవాళ్లు తమ పెళ్లిని బైబిలు సూత్రాలకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే, యెహోవాయే పెళ్లికి మూలం. ఆయనే ఆదాముహవ్వల పెళ్లి చేసి, వాళ్లను ఒకటి చేశాడు. (ఆది. 1:28; 2:24) పెళ్లి చేసుకునేవాళ్లు అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాను మహిమపర్చడం గురించి ఆలోచించాలి.
4. మీ పెళ్లిని ప్లాన్ చేసుకునేటప్పుడు యెహోవా గురించి ఆలోచించడానికి ఒక కారణం ఏంటి?
4 మీ పెళ్లిని ప్లాన్ చేసుకునేటప్పుడు యెహోవా గురించి ఆలోచించడానికి ఒక మంచి కారణమే ఉంది. అదేంటంటే: ఆయన మీ పరలోక తండ్రి, మీ బెస్ట్ ఫ్రెండ్. (హెబ్రీ. 12:9) ఆయనతో మీ స్నేహం చిరకాలం ఉండాలనుకుంటారు. కాబట్టి మీరు ఏ రోజూ, ఆఖరికి మీ పెళ్లిరోజున కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన యెహోవాను బాధపెట్టాలని అస్సలు కోరుకోరు. (కీర్త. 25:14) యెహోవా మీకోసం ఇప్పటికే చేసిన వాటిగురించి అలాగే చేయబోయే వాటిగురించి ఆలోచించినప్పుడు, ఆయన్ని మహిమపర్చే పెళ్లి చేసుకుంటారు.—కీర్త. 116:12.
మీరు యెహోవాను ఎలా మహిమపర్చవచ్చు?
5. పెళ్లి పనుల విషయంలో బైబిలు ఎలా సహాయం చేస్తుంది?
5 యెహోవాసాక్షుల పెళ్లిళ్లు ఎలా జరగాలి, అక్కడ ఎలాంటి భోజన ఏర్పాట్లు ఉండాలి అని చెప్పే రూల్స్ బైబిల్లో ఎక్కడా లేవు. కాబట్టి పెళ్లి చేసుకునేవాళ్లు తమ ప్రాంతానికి, సంస్కృతికి, అభిరుచులకు తగ్గట్టు చేసుకోవచ్చు. నిజ క్రైస్తవులు పెళ్లి విషయంలో చట్టపరమైన నియమాలను కూడా పాటిస్తారు. (మత్త. 22:21) ఏదేమైనా, బైబిలు సూత్రాలకు తగ్గట్టు పెళ్లి పనులు చేసుకుంటున్నప్పుడు యెహోవాకు మహిమ తీసుకొస్తాం, ఆయన మనసును సంతోషపెడతాం. అయితే, పెళ్లి పనులు చేసుకుంటున్నప్పుడు ఎలాంటి బైబిలు సూత్రాలను మనసులో ఉంచుకోవాలి?
6. పెళ్లి చేసుకునేవాళ్లు చట్టానికి లోబడడం ఎందుకు ప్రాముఖ్యం?
6 చట్టానికి లోబడండి. (రోమా. 13:1, 2) చాలా దేశాల్లో, పెళ్లికి ముందు ఒక అబ్బాయి-అమ్మాయి చట్ట ప్రకారం కొన్ని పనులు చేయాలి. అయితే, మీరిద్దరు ఉంటున్న ప్రాంతంలో అవేంటో మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీకు అవి తెలియకపోతే మీ సంఘపెద్దల్ని అడగవచ్చు.b
7. పెళ్లి ఎలా జరిగేలా చూసుకోవాలి?
7 పెళ్లి గౌరవంగా, మర్యాదగా జరిగేలా చూసుకోవాలి. (1 కొరిం. 10:31, 32) పెళ్లిలో ఈ లోక స్ఫూర్తి కాకుండా, పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు కొట్టొచ్చినట్టు కనపడేలా చూసుకోవాలి. (గల. 5:19-26) లేఖనాలు చెప్పే శిరస్సత్వ సూత్రం ప్రకారం, పెళ్లంతా మర్యాదగా-సంతోషంగా జరిగేలా పెళ్లికొడుకు చూసుకోవాలి. దానికోసం బైబిలు ఆధారంగా ఇచ్చే పెళ్లి ప్రసంగం సహాయం చేస్తుంది. ఆ ప్రసంగం ప్రేమగా, ఆప్యాయంగా, గౌరవంగా ఇచ్చినప్పుడు దేవుడు చేసిన పెళ్లి ఏర్పాటు మీద కృతజ్ఞత పెరుగుతుంది. పెళ్లికి వచ్చినవాళ్లు కూడా పెళ్లంటే ఆషామాషీ కాదని అర్థం చేసుకోగలుగుతారు. దానికోసం చాలామంది తమ పెళ్లిని రాజ్యమందిరంలో చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ మీరు మీ పెళ్లిని రాజ్యమందిరంలో చేసుకోవాలనుకుంటే, ఆ విషయాన్ని పెద్దల సభకు రాతపూర్వకంగా చాలారోజుల ముందే ఇవ్వండి.
8. ఒకవేళ భోజన ఏర్పాట్లు ఉంటే అవి గౌరవంగా, మర్యాదగా ఉండేలా ఎలా చూసుకోవచ్చు? (రోమీయులు 13:13)
8 రోమీయులు 13:13 చదవండి. ఒకవేళ మీ పెళ్లిలో భోజన ఏర్పాట్లు లాంటివి చేయాలనుకుంటే, ఈ లోక స్ఫూర్తి కనిపించకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు? “విచ్చలవిడి విందులు” అని అనువదించబడిన గ్రీకు పదం, విపరీతంగా తాగడం, అర్ధరాత్రి వరకు సంగీతం పెట్టేలాంటి పార్టీలను సూచిస్తుంది. ఒకవేళ మీ పెళ్లిలో మద్యం ఏర్పాటు చేయాలనుకుంటే, వచ్చిన అతిథుల్లో ఎవ్వరు కూడా అతిగా తాగకుండా చూసుకోండి.c ఒకవేళ సంగీతం పెట్టాలనుకుంటే, వచ్చిన అతిథులందరూ మాట్లాడుకోగలిగేలా తగిన సౌండ్‌లో పెట్టుకోండి. అయితే, ఆ సంగీతం అలాగే ఆ పాటల్లో ఉన్న మాటల వల్ల ఎవ్వరూ అభ్యంతరపడకుండా చూసుకోండి.
9. పెళ్లిలో వినోద కార్యక్రమాల్ని పెట్టాలనుకుంటే ఏ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి?
9 మీ పెళ్లిలో ఎవరైనా వచ్చి నాలుగు మంచిమాటలు చెప్పడం గానీ, ఏదైనా ఫోటోలు-వీడియోలు చూపించడం గానీ, ఇంకేదైనా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గురించి గానీ ఆలోచిస్తున్నారా? నిజమే, ఇలాంటివన్నీ ఆ రోజుకు కాస్త కళను తీసుకొస్తాయి. కానీ అవి వేరేవాళ్లను బాధ పెట్టకుండా చూసుకోండి. (ఫిలి. 4:8) దానికోసం మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ కార్యక్రమాలు వేరేవాళ్ల మీద గౌరవం ఉన్నట్టు చూపిస్తున్నాయా? ఇవి పెళ్లి ఏర్పాటుమీద ఉన్న గౌరవాన్ని పెంచుతాయా? అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా, ఇవన్నీ యెహోవాను మహిమపరుస్తాయా?’ నిజమే కొన్ని జోకులు వేయడం తప్పులేదు. కానీ అవి అసభ్యంగా, అభ్యంతరంగా ఉండకుండా చూసుకోండి. (ఎఫె. 5:3) కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు స్టేజి మీద నుండి మాట్లాడాలని అనుకుంటే, వాళ్లు మీకు ఇష్టం లేనివి మాట్లాడకుండా జాగ్రత్తపడండి.
10. పెళ్లి గురించి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అణకువ ఎలా చూపించవచ్చు? (1 యోహాను 2:15-17)
10 అణకువ చూపించండి. (1 యోహాను 2:15-17 చదవండి.) నలుగురి కళ్లు తమ మీదే పడాలని కాకుండా, ఆయన్ని మహిమపర్చడం మీద తన ఆరాధకులు మనసుపెడితే యెహోవాకు నచ్చుతుంది. కాబట్టి అణకువ ఉన్న క్రైస్తవులు, పెళ్లికోసం విపరీతమైన ఖర్చులు చేయరు. అలాగే తమకున్న వాటిని ‘గొప్పగా చూపించుకోరు.’ పెళ్లిని సింపుల్‌గా చేసుకోవడం వల్ల మీకేంటి ప్రయోజనం? బహుశా మీకు కూడా, నార్వేలో ఉంటున్న మైక్ అనే బ్రదర్‌కి జరిగినట్టే జరగవచ్చు. ఆయన ఇలా అంటున్నాడు: “మేము సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం వల్ల అప్పుల పాలవ్వలేదు, మా పయినీరు సేవను కూడా ఆపలేదు. మా పెళ్లి సింపుల్‌గా జరిగి ఉండొచ్చేమో గానీ, ఆ రోజు చాలా సందడిగా సాగింది, ఎన్నో మధుర జ్ఞాపకాల్ని ఇచ్చింది.” ఇండియాలో ఉంటున్న తబితా అనే సిస్టర్ ఇలా అంటుంది: “మేము చాలా తలనొప్పుల్ని తప్పించుకున్నాం. మా పెళ్లిని సింపుల్‌గా చేసుకోవడం వల్ల, ఆ ఏర్పాట్ల కోసం నానా హైరానా పడాల్సిన అవసరం రాలేదు. ఎలాంటి మనస్పర్థలు కూడా రాలేదు.”
మనం ఎక్కడ ఉంటున్నా మన పెళ్లి అణకువగా, అందంగా, మంచి జ్ఞాపకంగా ఉండేలా చూసుకోవాలి (10-11 పేరాలు చూడండి)
11. బట్టలు, తయారయ్యే విధానంలో పెళ్లికొడుకు-పెళ్లికూతురు అణకువను ఎలా చూపించవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
11 మీ పెళ్లికి ఏ బట్టలు వేసుకోవాలనుకుంటున్నారు? నిజమే మీరు ఆ రోజు చాలా అందంగా కనబడాలనుకుంటారు. బైబిలు కాలాల్లో కూడా, పెళ్లికొడుకు-పెళ్లికూతురు చక్కగా రెడీ అయ్యేవాళ్లు. (యెష. 61:10) నిజమే, మీరు మామూలుగా వేసుకునే బట్టల కన్నా పెళ్ళిరోజు కాస్త వేరుగా వేసుకోవాలనుకోవచ్చు. అందులో తప్పేంలేదు. కానీ అవి ఎవ్వరినీ అభ్యంతర పెట్టకూడదు. (1 తిమో. 2:9) మీ పెళ్లిలో మీ బట్టలు లేదా నగలే హైలైట్ అవ్వకుండా చూసుకోండి.—1 పేతు. 3:3, 4.
12. పెళ్లి చేసుకునేవాళ్లు లేఖన విరుద్ధమైన ఆచారాల్ని ఎందుకు చేయకూడదు?
12 లేఖన విరుద్ధమైన ఆచారాలు చేయకండి. (ప్రక. 18:4) సాతాను లోకం పెళ్లిళ్లను అన్యమత ఆచారాలతో, మంత్రతంత్రాలతో, మూఢనమ్మకాలతో కలుషితం చేసింది. అలాంటి అపవిత్రమైన ఆచారాల జోలికి వెళ్లకూడదని యెహోవా హెచ్చరిస్తున్నాడు. (2 కొరిం. 6:14-17) ఒకవేళ మీ ప్రాంతంలో ఉన్న ఏదైనా ఆచారం లేదా పద్ధతి గురించి మీకు డౌట్ ఉంటే, అది ఎక్కడి నుండి వచ్చిందో, అది మీ పెళ్లిలో పెట్టాలో వద్దో నిర్ణయించుకోవడానికి ముందు, దానికి సరిపోయే బైబిలు సూత్రాల గురించి వెతకండి.
13. గిఫ్ట్‌ల విషయంలో పెళ్లి చేసుకుంటున్నవాళ్లు యెహోవాలా ఎలా ఉండొచ్చు?
13 మామూలుగా మీ ప్రాంతంలో పెళ్లి చేసుకుంటున్నవాళ్లకు గిఫ్ట్‌లు ఇస్తుంటారా? గిఫ్ట్‌లు అనేవి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్లు ఇస్తారు. నిజమే, క్రైస్తవులు ఉదారంగా ఇవ్వాలనీ, ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని రుచి చూడాలనీ లేఖనాలు చెప్తున్నాయి. (సామె. 11:25; అపొ. 20:35) కానీ మీ పెళ్లికి వచ్చినవాళ్లు ఖచ్చితంగా గిఫ్ట్‌లు ఇవ్వాల్సిందే అనిపించేలా చేయకూడదు. ఇచ్చిన గిఫ్ట్ చాలా చిన్నదని మూతి ముడుచుకోకూడదు. మనం కూడా యెహోవాలా గిఫ్ట్‌ను కాదు, అది ఇచ్చేవాళ్ల మనసును చూడాలి.—2 కొరిం. 9:7.
సమస్యలు రాకుండా చూసుకోవడం, ఒకవేళ వస్తే పరిష్కరించుకోవడం
14. కొంతమందికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి?
14 యెహోవాను మహిమపర్చే పెళ్లికోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కొన్ని అడ్డంకులు రావచ్చు. ఉదాహరణకు, పెళ్లిని సింపుల్‌గా చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. సాలమన్ దీవుల్లో ఉండే చార్లీ అనే బ్రదర్ ఇలా చెప్తున్నాడు: “మా పెళ్లికి ఎవరెవర్ని పిలవాలని నిర్ణయించుకోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మా సంస్కృతిలో అందర్నీ పిలవాలని ఆశిస్తారు!” ముందు పేరాలో చెప్పుకున్న తబితా ఇలా అంటుంది: “మేము ఉంటున్న ప్రాంతంలో పెళ్లిళ్లు చాలా గ్రాండ్‌గా జరుగుతాయి కాబట్టి, మా పెళ్లికి కేవలం 100 మందినే పిలవాలని మా అమ్మానాన్నల్ని ఒప్పించడానికి మాకు కొంచెం టైమ్ పట్టింది.” ఇండియాలో ఉంటున్న శారా అనే సిస్టర్ ఇలా అంటుంది: “కొంతమంది సమాజంలో పేరుప్రఖ్యాతులకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. మా చుట్టాల్లో చాలామంది పెళ్లిళ్లు గ్రాండ్‌గా జరిగాయి. కాబట్టి నా పెళ్లి కూడా వాళ్లలాగే చేసుకోవాలనే ఒత్తిడి వచ్చింది.” మరి అలాంటి అడ్డంకుల్ని దాటడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?
15. పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రార్థన ఎందుకు చాలా ప్రాముఖ్యం?
15 మీ పెళ్లి పనుల్ని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు యెహోవాకు ప్రార్థిస్తూ ఉండండి. మీ ఇబ్బందులు, మీ ఫీలింగ్స్ అన్నీ ప్రార్థనలో యెహోవాకు చెప్పుకోండి. (ఫిలి. 4:6, 7) మంచి నిర్ణయం తీసుకునేలా, కంగారుగా అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండేలా, ధైర్యం అవసరమైనప్పుడు ధైర్యం చూపించేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. (1 పేతు. 5:7) మీ ప్రార్థనలకు జవాబు దొరికినప్పుడు, మీకు యెహోవామీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ముందు పేరాలో చెప్పుకున్న తబితా అనే సిస్టర్ ఇలా అంటుంది: “పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మా మధ్య, మా కుటుంబాల మధ్య ఏమైనా మనస్పర్థలు వస్తాయేమో అని మేము చాలా కంగారుపడ్డాం. అందుకే, పెళ్లి పనుల గురించి మాట్లాడుకునే ప్రతీసారి ప్రార్థన చేసుకున్నాం. దానివల్ల మేము యెహోవా సహాయాన్ని రుచిచూశాం. అలా అన్ని పనులు ప్రశాంతంగా జరిగాయి.”
16-17. పెళ్లి పనుల్ని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు స్పష్టంగా, దయగా ఎందుకు మాట్లాడుకోవాలి?
16 స్పష్టంగా, దయగా మాట్లాడుకోండి. (సామె. 15:22) పెళ్లి చేసుకునే మీరు మీ పెళ్లి గురించి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో, పెళ్లి ఏ రోజు చేసుకోవాలి? బడ్జెట్ ఎంత? ఎవరెవర్ని పిలవాలి? లాంటి చాలా విషయాలు ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు, మీరిద్దరూ మీ దగ్గరున్న ఆప్షన్లు అన్నీ చర్చించుకొని, వాటికి సరిపోయే బైబిలు సూత్రాల్ని వెతికి, పరిణతి-అనుభవం ఉన్న క్రైస్తవుల సలహా తీసుకోండి. మీ అభిరుచుల గురించి చెప్తున్నప్పుడు దయగా, ఎదుటివాళ్లను అర్థం చేసుకుంటూ ఉండండే గానీ, పట్టుబట్టే వాళ్లలా ఉండకండి. మీ అమ్మానాన్నలు లేదా దగ్గరి కుటుంబ సభ్యులు ఏదైనా అడిగినప్పుడు, అది మీకు ఫర్వాలేదు అనిపిస్తే వాళ్లు అడిగింది చేయవచ్చు. ఎందుకంటే, మీ పెళ్లి వాళ్లకు కూడా చాలా స్పెషల్. ఒకవేళ వాళ్లు అడిగింది మీరు చేయలేకపోతే దానికిగల కారణాల్ని దయగా వివరించండి. (కొలొ. 4:6) మీ పెళ్లి సంతోషంగా సాగడమే కాదు యెహోవాకు మహిమ తెచ్చేలా కూడా జరగాలన్నదే మీ ముఖ్య ఉద్దేశం అని కుటుంబ సభ్యులందరికీ స్పష్టంగా చెప్పండి.
17 మీ అభిరుచుల గురించి సత్యంలో లేని అమ్మానాన్నలకు వివరించడం ఇంకా కష్టం, కానీ వాళ్లను మీరు ఒప్పించవచ్చు. ఇండియాలో ఉన్న సంతోష్ అనే బ్రదర్ ఇలా చెప్తున్నాడు: “మా పెళ్లిలో హిందూ ఆచారాలు పాటించాలని మా అమ్మానాన్న కోరుకున్నారు. కానీ ఆ విషయంలో మా నిర్ణయం చెప్పడానికి నాకు, నా కాబోయే భార్యకు చాలా టైమ్ పట్టింది. అయితే, యెహోవా ప్రమాణాలకు విరుద్ధంగా లేని కొన్నింటిని వాళ్లు అడిగినప్పుడు, మేము దానికి ఒప్పుకున్నాం. ఉదాహరణకు, మా పెళ్లిలో మా అమ్మానాన్నలకు నచ్చిన వంటలు చేయించాం. అలాగే పాటలు, డాన్స్ లాంటివి తీసేశాం. ఎందుకంటే అవి వాళ్లకు నచ్చవు.”
18. పెళ్లిరోజు అన్నీ సాఫీగా జరగడానికి మీరు ఏం చేయవచ్చు? (1 కొరింథీయులు 14:40) (చిత్రం కూడా చూడండి.)
18 అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోండి. చివరిక్షణం వరకు ఆగకుండా అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే పెళ్లిరోజు ఏ టెన్షన్ ఉండదు. (1 కొరింథీయులు 14:40 చదవండి.) తైవాన్‌లో ఉంటున్న వేన్స్ అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “మా పెళ్లికి కొన్నిరోజుల ముందు, పెళ్లిలో వేర్వేరు పనులు చేయడానికి ముందుకొచ్చిన బ్రదర్స్‌సిస్టర్స్‌తో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. పెళ్లిరోజు అన్నీ సాఫీగా సాగేలా, ఆ రోజు జరిగే కొన్ని భాగాల్ని ప్రాక్టీస్ చేసుకున్నాం.” అతిథుల మీద గౌరవంతో వీలైనంతవరకు అన్నీ టైమ్‌కి అయ్యేలా చూసుకోండి.
చివరిక్షణం వరకు ఆగకుండా అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే పెళ్లిరోజు ఏ టెన్షన్ ఉండదు (18వ పేరా చూడండి)
19. మీ పెళ్లి మీరు అనుకున్నట్టే జరగడానికి ఇంకేం చేయవచ్చు?
19 అన్నీ ముందే ఆలోచించి పెట్టుకోవడం వల్ల చాలా తలనొప్పులు తప్పించుకోవచ్చు. (సామె. 22:3) ఉదాహరణకు, మీరు ఉంటున్న ప్రాంతంలో పెళ్లిళ్లకు పిలవని వాళ్లు కూడా వచ్చే అవకాశం ఉందా? అలా జరగకుండా మీరు ఏం చేయవచ్చంటే, మీరు పెళ్లికి పిలిచే స్నేహితులకు, బంధువులకు మీరు పెళ్లికి ఎంతమందిని పిలవాలనుకుంటున్నారో, పెళ్లి ఏర్పాట్లు ఏంటో వాళ్లకు చెప్పండి. వీలైతే వాళ్లకు “యెహోవాసాక్షుల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి?” అనే jw.org ఆర్టికల్‌ని కూడా పంపించండి. పెళ్లంతా మీరు అనుకున్నట్టు జరగడానికి ఒక పరిణతిగల సహోదరుడిని ‘విందు నిర్వాహకుడిగా’ లేదా మ్యారేజ్ డైరెక్టర్‌గా పెట్టవచ్చు. (యోహా. 2:8) మీరు పెళ్లి ఎలా జరగాలనుకుంటున్నారో ఆయనకు చెప్పండి, మీరు అనుకున్నట్టుగానే పద్ధతిగా, గౌరవంగా జరగడానికి ఆయన సహాయం చేస్తాడు.
20. పెళ్లి గురించి పెళ్లి చేసుకునేవాళ్లు ఏం గుర్తుంచుకోవాలి?
20 ఇన్ని పెళ్లి పనులు చూశాక మీకు ఊపిరాడనట్టు అనిపించవచ్చు. మీరిద్దరు కలిసి యెహోవా సేవలో చేసే ప్రయాణానికి అది తొలి రోజు మాత్రమే. కాబట్టి మీ పెళ్లిని వీలైనంత సింపుల్‌గా, పద్ధతిగా ఉంచుకోవడానికి చూడండి. ఈ విషయంలో యెహోవామీద నమ్మకం ఉంచండి. ఆయన నిర్దేశంతో మీ పెళ్లిని గౌరవంగా, పద్ధతిగా చేసుకుంటే మీ పెళ్లి రోజు ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుంది గానీ చేదు జ్ఞాపకంగా మిగిలిపోదు!—కీర్తన 37:3, 4.
పాట 107 దేవునిలా ప్రేమ చూపిద్దాం
a పదాల వివరణ: చాలా సంస్కృతుల్లో, పెళ్లి కార్యక్రమంలో అబ్బాయి-అమ్మాయి దేవుని ముందు పెళ్లి ప్రమాణాలు చేసుకుంటారు. దాని తర్వాత, భోజన ఏర్పాట్లు ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కార్యక్రమం గానీ, భోజన ఏర్పాట్లు గానీ లేకపోయినా, పెళ్లిరోజుకు సంబంధించిన బైబిలు సూత్రాలు తెలుసుకోవడం వల్ల పెళ్లి చేసుకునేవాళ్లు ప్రయోజనం పొందుతారు.
b పెళ్లి చట్టప్రకారం చేసుకోవడం క్రైస్తవులకు ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోవడానికి అక్టోబరు 15, 2006, కావలికోట పత్రికలో ఉన్న “దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో గౌరవప్రదమైన వివాహాలు” అనే ఆర్టికల్ చూడండి.
c jw.orgలో, నేను మందు ఏర్పాటు చేయవచ్చా? అనే వీడియోను చూడండి.