కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 3/1 పేజీలు 25-28
  • ఇతరులను నమ్మాలంటే మీరు భయపడతారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరులను నమ్మాలంటే మీరు భయపడతారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భయాన్ని అర్థం చేసుకోవడం
  • ఆ అడ్డుగోడ ఎందుకు పడిపోవాలి?
  • మీ కుటుంబంలో నమ్మకముంచండి
  • సంఘంలో నమ్మకం
  • నమ్మగల బంధాలను నిర్మించుకోవడం
  • సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • పెద్దలారా మీ బాధ్యతను కాపాడుకొనుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీరు నమ్మదగినవాళ్లని నిరూపించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 3/1 పేజీలు 25-28

ఇతరులను నమ్మాలంటే మీరు భయపడతారా?

‘మాట్లాడేందుకు నాకెవరూ లేరు. ప్రజలు అర్థం చేసుకోలేరు. వారు తమ సొంత సమస్యలతో తలమునకలౌతున్నారు. నా సమస్యల గురించి మాట్లాడేందుకు వారికి సమయముండదు’ అని అనేకులు భావిస్తారు కనుక వారు తమ తలంపులను తమలోనే ఉంచుకుంటారు. మీరెలా ఉన్నారు అని ఇతరులు అడిగినప్పుడు చెప్పాలని వాళ్లు తరచూ కోరుకుంటారు కానీ చెప్పరు. వారు మనస్సు విప్పి చెప్పలేరంతే.

నిజమే, ఇతరుల నుండి సహాయాన్ని ఆశించనివారున్నారు. అయితే, చాలామందికి సహాయం అవసరం, అయితే తమ వ్యక్తిగతమైన తలంపులను, భావాలను, అనుభవాలను తెలిపేందుకు వారు భయపడతారు. మీరు అలాంటివారిలో ఒకరా? నిజంగా మీరు నమ్మగల వారెవరూ లేరా?

భయాన్ని అర్థం చేసుకోవడం

నేటి లోకంలో ఉన్నది అపనమ్మకపు పరిస్థితి. యౌవనస్థులు తమ తలిదండ్రులతో మాట్లాడరు. తలిదండ్రులు ఒకరితోనొకరు మాట్లాడుకోలేరు. అధికారంలో ఉన్నవారితో మాట్లాడేందుకు ఎక్కువ మంది సిద్ధపడరు. కొందరు ఇతరుల ముందు మనస్సు విప్పలేక, సమస్యల నుండి తప్పించుకునే ప్రయత్నంలో మద్యపానానికి, మత్తుమందుల వైపుకు లేదా విచ్చలవిడి జీవిత విధానం వైపుకు మళ్ళుతారు.—సామెతలు 23:29-35; యెషయా 56:12.

మతనాయకులు, డాక్టర్లు, థెరాపిస్టులు, మరియు ఉపాధ్యాయులు వంటి అధికారం గల వ్యక్తుల వంచన, అనైతికత అవధుల్లేకుండా బయటపడడంతో వారిలో నమ్మకం తగ్గిపోయింది. ఉదాహరణకు, 10 శాతం కన్నా ఎక్కువమంది మతనాయకులు లైంగిక దుష్ప్రవర్తనలో మునిగిపోయారని ఒక అంచనా చెబుతుంది. ఈ “విశ్వాస ఘాతకులు మానవ సంబంధాల్లో చీలికలు వేసేవారు, అగాధాలను సృష్టించేవారు” అని ఒక రచయిత పేర్కొంటున్నాడు. అది వారి సంఘాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అది నమ్మకాన్ని లేకుండా చేస్తుంది.

విస్తృతంగా నైతిక నియమాలు పడిపోవడం కుటుంబంలో క్లిష్ట పరిస్థితులకు ఎంతగా దారితీసిందంటే, కుటుంబంలో సత్సంబంధాలు లేకపోవడం అనేది ఎక్కడా మినహాయింపు లేకుండా అంతటా సాధారణమైపోయింది. ఒకప్పుడు ఇంట్లో నిర్మాణాత్మకమైన వాతావరణం ఉండేది. కాని నేడు అది తరచూ భోజనసమయాన ఇంధనాన్ని నింపుకునే స్థలమే తప్ప మరేమీ కాదన్నట్లుగా మారింది. బిడ్డ ‘అనురాగరహితమైన’ కుటుంబంలో పెరిగి పెద్దవాడైనప్పుడు యుక్తవయస్సులో ఇతరులను నమ్మలేని అసమర్థుడవ్వడమే సాధారణంగా కలిగే పర్యవసానం.—2 తిమోతి 3:3.

అంతేగాక, లోక పరిస్థితులు మరింత విషమిస్తుండగా, ఎంతో వేదనాభరితమైన అనుభవాలకు మనం మరెక్కువగా గురౌతున్నాము. “ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు” అని మీకా ప్రవక్త అలాంటి పరిస్థితిలోనే వ్రాశాడు. (మీకా 7:5) చిన్న నిరాశ తర్వాత లేదా నమ్మకద్రోహం జరిగిన తర్వాత, లేదా జీవితంలో అత్యంత భయానకమైన సంఘటన తర్వాత మీరూ అలాగే భావించవచ్చు. మీరూ మళ్ళీ ఇతరులను నమ్మడం చాలా కష్టమని భావిస్తారు, భావరహితులుగా అవుతారు, ప్రతిరోజు ఉద్వేగపు అడ్డుగోడ వెనుక జీవిస్తారు. (కీర్తనలు 102:1-7 పోల్చండి.) నిజమే, అలాంటి దృక్పథం మీరు పనులు చేసుకునేందుకు సహాయపడవచ్చు, కానీ మీ “మనోదుఃఖము” జీవితంలోని ఏ నిజమైన సంతోషాన్నైనా మీ నుండి దోచుకుంటుంది. (సామెతలు 15:13) నిజమేంటంటే మీరు ఆత్మీయంగా, ఉద్వేగపరంగా, మానసికంగా, మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆ అడ్డుగోడ పడిపోవాలి, మీరు ప్రజలను నమ్మడానికి నేర్చుకోవాలి. అది సాధ్యమేనా? అవును, సాధ్యమే.

ఆ అడ్డుగోడ ఎందుకు పడిపోవాలి?

ఇతరులతో మనస్సులోని మాట చెప్పుకోవడం కలత చెందిన హృదయానికి ఉపశమనాన్నిస్తుంది. హన్నాకు ఇలాంటి అనుభవం ఉంది. ఆమెది మంచి వివాహ జీవితం, భద్రమైన ఇల్లు, కానీ ఆమె ఎంతో క్షోభను అనుభవిస్తోంది. ఆమె “బహుదుఃఖాక్రాంతురాలై”నప్పటికీ ఆమె జ్ఞానయుక్తంగా ‘యెహోవాకు ప్రార్థన చేయనారంభించింది.’ ఆమె తీవ్రంగా ప్రార్థించడం వల్ల ఆమె పెదవులు వణికాయి. అవును, ఆమె మనస్సులోని బాధను యెహోవాకు చెప్పుకుంది. తర్వాత ఆమె దేవుని ప్రతినిధియైన ఏలీతో మనస్సు విప్పి మాట్లాడింది. దాని ఫలితం ఏమిటి? “[హన్నా] తన దారిని వెళ్లిపోయి భోజనముచేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.”—1 సమూయేలు 1:1-18.

సన్నిహితంగా మాట్లాడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా సంస్కృతులకు తెలిసినవే. ఉదాహరణకు, అలాంటి పరిస్థితుల్లోనే ఉండినవారి తలంపులను, అనుభవాలను పంచుకోవడం ప్రయోజనకరమని నిరూపించబడగలదు. పరిశోధకులు ఈ నిర్ధారణకు వస్తున్నారు: “ఉద్వేగపు ఒంటరితనం వ్యాధిని కలిగిస్తుంది—మనం బుద్ధిస్థిరతతో ఉండేందుకు విషయాలను గురించి అరమరికలు లేకుండా చెప్పుకోవలసిన అవసరముంది. “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి” అని చెప్పిన ప్రేరేపిత సామెతలోని సత్యాన్ని పెరుగుతున్న శాస్త్ర పరిశోధన రూఢిపరుస్తుంది.—సామెతలు 18:1.

మీరు ఇతరుల ముందు మీ హృదయాన్ని తెరవకపోతే వారు మీకు ఎలా సహాయం చేయగలరు? యెహోవా దేవుడు హృదయాలను చదువుతాడు కానీ, మీరు మనస్సు విప్పకపోతే మీ కుటుంబానికి, మీ స్నేహితులకు మీ ఆంతరంగిక తలంపులు, భావాలు మూసి ఉంచిన పుస్తకంలాగే ఉంటాయి. (1 దినవృత్తాంతాలు 28:9) సమస్యలో దేవుని నియమాన్ని ఉల్లంఘించడం ఇమిడివున్నట్లయితే, విషయాన్ని ఒప్పుకోవడాన్ని వాయిదావేయడం పరిస్థితిని ఇంకా విషమింపజేస్తుంది.—సామెతలు 28:13.

తప్పకుండా, బాధను ఇతరులతో చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గాయపడే అవకాశాల కన్నా చాలా ఎక్కువ. నిజమే, దానర్థం వివేచనారహితంగా వ్యక్తిగత వివరాలను బయటపెట్టాలని కాదు. (న్యాయాధిపతులు 16:18; యిర్మీయా 9:4; లూకా 21:16 పోల్చండి.) సామెతలు 18:24 “బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును” అని హెచ్చరిస్తూ “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు” అని కూడా అది చెబుతుంది. మీరు అలాంటి స్నేహితుడిని ఎక్కడ కనుగొనగలరు?

మీ కుటుంబంలో నమ్మకముంచండి

మీకొక సమస్య ఉన్నట్లయితే, మీరు దానిని మీ వివాహజతతో లేదా మీ తలిదండ్రులతో చర్చించడానికి ప్రయత్నించారా? “అనేక సమస్యల విషయానికొస్తే వాటిని గూర్చి పూర్తిగా చర్చించడమే సరిపోతుంది” అని అనుభవజ్ఞుడైన ఒక కౌన్సిలర్‌ చెబుతున్నాడు. (సామెతలు 27:9) ‘తమనువలె తమ భార్యలను ప్రేమించే’ భర్తలు, “సొంతపురుషులకు లోబడియుండు” భార్యలు, ‘తమ పిల్లలను ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచే’ దైవ నియుక్త బాధ్యతను గంభీరంగా తీసుకునే తలిదండ్రులు సానుభూతిగల శ్రోతలుగా మరియు సహాయకారులుగా ఉండే సలహాదారులుగా అయ్యేందుకు గట్టి కృషి చేస్తారు. (ఎఫెసీయులు 5:22, 33; 6:4) తనకు శారీరక భావంలో భార్యగానీ పిల్లలుగానీ లేకున్నప్పటికీ, యేసు ఈ విషయంలో ఎంత చక్కని మాదిరినుంచాడో!—మార్కు 10:13-16; ఎఫెసీయులు 5:25-27.

సమస్య కుటుంబంలోనే పరిష్కరించలేనిదైతే అప్పుడేమిటి? క్రైస్తవ సంఘంలో, మనమెన్నడూ ఒంటరిగా ఉండనవసరం లేదు. “ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా?” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (2 కొరింథీయులు 11:29) ఆయన ఈ విధంగా బోధించాడు: ‘ఒకని భారముల నొకడు భరించుడి.’ (గలతీయులు 6:2; రోమీయులు 15:1) నిస్సందేహంగా ‘దుర్దశలో సహోదరుడుగా ఉండే’టటువంటి వారిని ఒకరికన్నా ఎక్కువ మందిని మన ఆత్మీయ సహోదర సహోదరీలలో కనుగొనగలుగుతాము.—సామెతలు 17:17.

సంఘంలో నమ్మకం

భూవ్యాప్తంగా 80,000 కన్నా ఎక్కువగావున్న యెహోవాసాక్షుల సంఘాల్లో ‘మీ ఆనందమునకు సహకారులు’గా సేవచేస్తున్న వినయమనస్కులైన మనుష్యులున్నారు. (2 కొరింథీయులు 1:24) వారే పెద్దలు. ‘ప్రతి ఒక్కరు’ “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును” అని యెషయా వ్రాస్తున్నాడు. అలా ఉండాలనే పెద్దలు ప్రయత్నించేది.—యెషయా 32:2; 50:4; 1 థెస్సలొనీకయులు 5:14.

పెద్దలు ‘పరిశుద్ధాత్మచేత అభిషేకించబడక’ ముందే లేఖనాధార యోగ్యతలను పొందుతారు. దీనిని తెలుసుకోవడం వారిలో మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:28; 1 తిమోతి 3:2-7; తీతు 1:5-9) మీరు పెద్దతో చర్చించిన విషయం కచ్చితంగా రహస్యంగా ఉంచబడుతుంది. విశ్వసనీయత అన్నది ఆయన యోగ్యతలలో ఒకటి.—నిర్గమకాండము 18:21; నెహెమ్యా 7:2 పోల్చండి.

సంఘంలోని పెద్దలు “లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు.” (హెబ్రీయులు 13:17) ఈ మనుష్యులలో మీరు నమ్మకముంచేందుకు ఇది మిమ్మల్ని పురికొల్పదా? సహజంగానే, పెద్దలందరూ ఒకే గుణాల్లో ఉత్కృష్టులుగా ఉండరు. కొందరు మరెక్కువ సమీపించదగినవారిగాను, దయగలవారిగానూ, లేదా అర్థం చేసుకునేవారిగాను కనిపించవచ్చు. (2 కొరింథీయులు 12:15; 1 థెస్సలొనీకయులు 2:7, 8, 11) మీరు ఏ పెద్ద దగ్గరైతే ఊరట పొందుతారని భావిస్తారో ఆ పెద్దతో ఎందుకు మాట్లాడకూడదు?

ఈ మనుష్యులు భత్యం కోసం దీనిని వృత్తిగా చేపట్టేవారు కాదు. బదులుగా, మీకు సహాయం చేసేందుకు యెహోవా దయచేసిన “మనుష్యులకు ఈవులు” వారు. (ఎఫెసీయులు 4:8, 11-13; గలతీయులు 6:1) ఎలా? వారు బైబిలును నిపుణతతో ఉపయోగించి, దాని స్వస్థతా శక్తిని మీ వ్యక్తిగత పరిస్థితికి అన్వయిస్తారు. (కీర్తన 107:20; సామెతలు 12:18; హెబ్రీయులు 4:12, 13) వారు మీతో మీ కోసం ప్రార్థిస్తారు. (ఫిలిప్పీయులు 1:9; యాకోబు 5:13-18) అలాంటి ప్రేమపూర్వకంగా ఉండే ఉపదేశకుల నుండి లభించే సహాయం కలత చెందిన హృదయానికి ఎంతో స్వస్థతను కలుగజేసి మనశ్శాంతిని పునఃస్థాపిస్తుంది.

నమ్మగల బంధాలను నిర్మించుకోవడం

సహాయాన్ని, సలహాను, కేవలం వినే చెవులను కోరుకోవడం బలహీనతకో లేక పరాజయానికో సూచన కాదు గానీ, మనం అపరిపూర్ణులమని, ఎవరి దగ్గరా అన్ని పరిష్కారాలూ ఉండవని వాస్తవంగా గుర్తించడం మాత్రమే. తప్పకుండా, పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడే మనకున్న గొప్ప ఉపదేశకుడు, అంతరంగికుడు. “యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను” అని వ్రాసిన కీర్తనల గ్రంథకర్తతో మనం ఏకీభవిస్తాము. (కీర్తన 28:7) ఆయన మనం చెప్పేది వింటాడని, మన ఎడల శ్రద్ధ చూపిస్తాడని నమ్మకంతో ఏ సమయంలోనైనా సరే ప్రార్థనలో దాపరికం లేకుండా మన “హృదయములు కుమ్మరించ”గలుగతాము.—కీర్తన 62:7, 8; 1 పేతురు 5:7.

కానీ సంఘంలోని పెద్దలను, ఇతరులను నమ్మడాన్ని మీరెలా నేర్చుకోగలరు? మొదటిగా, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మీ భయాలకు గట్టి కారణాలున్నాయా? మీరు ఇతరుల ఉద్దేశాలను గూర్చి సంశయించేవారా? (1 కొరింథీయులు 13:4, 7) గాయపడే ప్రమాదాన్ని తగ్గించే మార్గమేదైనా ఉందా? ఉంది. అదెలా? ఆత్మీయ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఇతరులను గూర్చి బాగా తెలుసుకునేందుకు ప్రయత్నించండి. సంఘ కూటాల్లో వారితో మాట్లాడండి. ఇంటింటి పనిలో కలిసి పని చేయండి. గౌరవం కలగవలసిన అవసరమున్నట్లే, నమ్మకం కలగవలసిన అవసరముంది. కనుక వేచి ఉండండి. ఉదాహరణకు, మీరు ఒక ఆత్మీయ మందకాపరిని తెలుసుకునే కొలది, మీకు ఆయనపై నమ్మకం పెరుగుతుంది. మీ చింతలను నెమ్మదిగా తెలియజేయండి. ఆయన సముచితమైన రీతిలో, సహానుభూతితో, వివేకంతో ప్రతిస్పందించినట్లైతే, మీరు మరెక్కువగా మనస్సు విప్పి మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు.

తోటి యెహోవా ఆరాధికులు, ముఖ్యంగా క్రైస్తవ పెద్దలు తమకు ఇతరులతో గల సంబంధాల్లో దేవుని ప్రశంసార్హమైన గుణాలను అనుకరించేందుకు గట్టి కృషి చేస్తారు. (మత్తయి 5:48) ఇది సంఘంలో విశ్వస్త వాతావరణాన్ని సృష్టిస్తుంది. “సహోదరులు తెలుసుకోవలసిన ఒక విషయం: ఒక వ్యక్తి ఏమి చేసినప్పటికీ, పెద్ద అతని ఎడల గల క్రైస్తవ ప్రేమని కోల్పోడు. అతడు చేసిన పని ఆయనకు నచ్చకపోవచ్చు, అయినప్పటికి తన సహోదరున్ని ప్రేమిస్తూనే ఉంటాడు, అతనికి సహాయం చేయాలని కోరుకుంటాడు” అని ఎంతో కాలంగా పెద్దగా ఉన్న ఒకరు చెబుతున్నారు.

కనుక ఒక సమస్య ఉన్నప్పుడు ఒంటరిగా భావించనవసరం లేదు. మీ బరువును మోస్తూ మీకు సహాయం చేయగల ‘ఆత్మ సంబంధమైన అర్హతలు’ గల ఒకరితో మాట్లాడండి. (గలతీయులు 6:1) “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును,” అయితే “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి” అని గుర్తుంచుకోండి.—సామెతలు 12:25; 16:24.

[26వ పేజీలోని బాక్సు]

ఒక బంధువును గానీ, స్నేహితున్ని గానీ, లేదా అత్మీయ సహోదరునికి గానీ సహాయపడేందుకు ఏ క్రైస్తవుడ్నైనా పిలవడం జరుగవచ్చు. ఎలా సహాయం చేయాలో మీకు తెలుసా?

ఒక ఫలకరమైన ఉపదేశకుడు

సమీపించదగినవాడు: మత్తయి 11:28, 29; 1 పేతురు 1:22; 5:2, 3

సరైన పరిస్థితిని ఎన్నుకుంటాడు: మార్కు 9:33-37

సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు: లూకా 8:18; యాకోబు 1:19

అమితంగా ప్రతిక్రియ చేయడు: కొలొస్సయులు 3:12-14

బాధాకరమైన ఉద్వేగాలను ఎదుర్కోవడానికి సహాయపడతాడు: 1 థెస్సలొనీకయులు 5:14; 1 పేతురు 3:8

ఆయన తన పరిమితులను తెలుసుకుంటాడు: గలతీయులు 6:3; 1 పేతురు 5:5

ప్రత్యేక ఉపదేశాన్నిస్తాడు: కీర్తన 19:7-9; సామెతలు 24:26

రహస్యాన్ని దాచుతాడు: సామెతలు 10:19; 25:9

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి