కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 3/1 పేజీలు 14-19
  • మెలకువగా ఉండువారు ధన్యులు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మెలకువగా ఉండువారు ధన్యులు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దొంగవలె వచ్చుచున్నాను
  • మనం మెలకువగా ఉండగల విధానం
  • సమయం గతించిపోతోంది
  • మనం తప్పకుండా మెలకువగా ఉండాలి!
  • ‘మెలకువగా నుండుడి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా దినము కోసం సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • “అంత్యకాలములో” మెలకువగా ఉండుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ‘మెలకువగా ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 3/1 పేజీలు 14-19

మెలకువగా ఉండువారు ధన్యులు!

“ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; . . . మెలకువగా ఉండి తన [పై]వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.”—ప్రకటన 16:15.

1. యెహోవా దినం సమీపంగా ఉంది గనుక మనం ఏం ఎదురు చూడగలం?

యెహోవా మహాదినం సమీపంగా ఉంది. మరి దాని అర్థం యుద్ధమే! దర్శనంలో అపొస్తలుడైన యోహాను, భూ “రాజులు” అందరి దగ్గరకూ లేక పాలకులు అందరి దగ్గరకూ ‘దయ్యాలచే ప్రేరేపించబడిన’ కప్పలవంటి ‘అపవిత్రాత్మలు’ బయలువెడలడాన్ని చూశాడు. ఏమి చెయ్యడానికి? “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు” వారిని “పోగు” చేయడానికే! యోహాను ఇంకా ఇలా తెలియజేశాడు: “హెబ్రీభాషలో హార్‌మెగిద్దోనను, చోటుకు వారిని పోగుచేసెను.”—ప్రకటన 16:13-16.

2. మాగోగువాడైన గోగు ఎవరు, అతడు యెహోవా ప్రజలపై దాడి చేసినప్పుడు ఏమి జరుగుతుంది?

2 త్వరలోనే, యెహోవా ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనును నాశనం చేసేందుకు, ఈ విధానపు రాజకీయ మూలకాన్ని ప్రేరేపిస్తాడు. (ప్రకటన 17:1-5, 15-17) తర్వాత మాగోగు వాడైన గోగు అంటే భూమిపైకి పడద్రోయబడిన అపవాదియైన సాతాను, శాంతికాముకులూ, రక్షణలేనివారిగానూ కన్పిస్తున్న యెహోవా ప్రజలమీదికి తన సైన్యాల్ని నడిపించి, సర్వశక్తుల్నీ ఒడ్డి దాడి చేస్తాడు. (యెహెజ్కేలు 38:1-12) కానీ తన ప్రజల్ని కాపాడేందుకు, దేవుడు చర్య తీసుకుంటాడు. “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదిన” ఆరంభానికి అదే గుర్తవుతుంది.—యోవేలు 2:31; యెహెజ్కేలు 38:18-20.

3. యెహెజ్కేలు 38:21-23 వచనాల్లో ప్రవచించబడిన పురోభివృద్ధులను మీరు ఎలా వర్ణిస్తారు?

3 అవును, మనం హర్‌మెగిద్దోను లేక అర్మగిద్దోను అని పిలువబడిన ప్రపంచ స్థితికి చేరుకున్నప్పుడు, యెహోవా తన ప్రజల్ని కాపాడి, సాతాను విధానంలో చివరకు మిగిలివున్న ప్రతిదానినీ నాశనం చేస్తాడు. యెహెజ్కేలు 38:21-23 వచనాల్లోని ప్రవచనాత్మక మాటల్ని చదివి, ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఉద్ధృతమైన కుంభవృష్టినీ, వినాశనాన్ని కల్గించే పెద్ద వడగండ్లనూ, తీవ్రమైన అగ్నినీ, మరణకరమైన తెగుళ్లనూ రప్పించ్చేందుకు యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. గోగు సైన్యాలు తికమకకు గురై తమలోతామే పోరాడుకుంటుండగా, ప్రపంచమంతా ఆందోళన రాజ్యమేలుతుంది. సర్వాధికారియైన దేవుని శత్రువులలో తప్పించుకున్నవారు ఎవరైనాసరే, యెహోవా తన సేవకుల్ని కాపాడేందుకు మానవాతీత శక్తుల్ని ఉపయోగించినప్పుడు నాశనం చేయబడతారు. ప్రవచించబడిన ‘మహా శ్రమ’ ముగిసేసరికి, సాతాను భక్తిహీన విధానంలోనిదేదీ మిగిలివుండదు. (మత్తయి 24:21) అయినా, దుష్టులు తామనుభవించే మరణకరమైన వేదనల్లో కూడా, తమ విపత్తుకు బాధ్యుడెవరో గ్రహిస్తారు. విజేతయైన మన దేవుడే ఇలా చెబుతున్నాడు: ‘నేను యెహోవానై ఉన్నానని వాళ్లు తెలిసికోవాల్సిందే.’ యేసు ప్రత్యక్షతా సమయంలో అంటే మన కాలంలో ఈ అసమానమైన సంఘటనలు సంభవిస్తాయి.

దొంగవలె వచ్చుచున్నాను

4. ఈ దుష్ట విధానాన్ని నాశనం చేసేందుకు యేసు ఏ రీతిలో వస్తాడు?

4 మహిమపర్చబడిన ప్రభువైన యేసుక్రీస్తు ఇలా తెలియజేశాడు: “నేను దొంగవలె వచ్చుచున్నాను.” దొంగవలె రావడం అంటే అనేకమంది ప్రజలు నిద్రపోతున్నప్పుడు ఆకస్మికంగానూ, అనుకొనని సమయంలోనూ రావడమైవుంటుంది. ఈ దుష్ట విధానాన్ని నాశనం చేసేందుకు యేసు దొంగవలె వచ్చినప్పుడు, నిజంగా మెలకువగా ఉన్నవారిని ఆయన కాపాడతాడు. ఆయన యోహానుతో ఇలా చెప్పాడు: “తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన [పై]వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.” (ప్రకటన 16:15) ఈ మాటల భావమేమైవుంది? మనం ఆత్మీయంగా ఎలా మెలకువగా ఉండగలం?

5. యేసు భూమిపై ఉన్నప్పుడు ఆలయ సేవ కోసం ఏ ఏర్పాటు ఉండేది?

5 సాధారణంగా, కావలివాడు కావలికాసే పనిలో ఉండగా నిద్రపోతే, అతడు దిగంబరిగా చేయబడడు. కానీ యేసు భూమిపై ఉన్నప్పుడూ, యెరూషలేము ఆలయంలో యాజకుల విభాగాలూ లేవీయుల విభాగాలూ సేవ చేస్తున్నప్పుడూ యెరూషలేము ఆలయంలో అదే జరిగింది. సా.శ.పూ. 11వ శతాబ్దంలో, రాజైన దావీదు ఇశ్రాయేలీయులలోని వందలాదిమంది యాజకుల్నీ, వారి సహాయకులైన వేలాదిమంది లేవీయుల్నీ 24 విభాగాలుగా రూపొందించబడిన ఒక వ్యవస్థగా ఏర్పాటుచేశాడు. (1 దినవృత్తాంతములు 24:1-18) తర్ఫీదు పొందిన పనివారు వేయిమందికిపైగా కల్గివున్న ప్రతీ విభాగమూ దాని దాని వంతుల ప్రకారం, పాలికి ఓ వారం చొప్పున కనీసం సంవత్సరానికి రెండు పర్యాయాలు, ఆలయ సేవకు సంబంధించిన వివిధ పనుల్ని నిర్వహించింది. అయితే, పర్ణశాలల పండుగలో సేవచేసేందుకు, మొత్తం 24 విభాగాలవారూ అందుబాటులో ఉండేవారు. పస్కాపండుగల్లో అదనపు సహాయం కూడా అవసరమయ్యేది.

6. “మెలకువగా ఉండి తన [పై]వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు” అని యేసు చెప్పినప్పుడు ఆయన దేనిని ఉల్లేఖించి ఉండొచ్చు?

6 “మెలకువగా ఉండి తన [పై]వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు” అని యేసు చెప్పినప్పుడు, ఆలయం దగ్గర కావలికాసే పనికూడా చేరివున్న, ఆ కాలంలో అనుసరించబడిన ఓ పద్ధతిని ఆయన ఉల్లేఖించి ఉండవచ్చు. యూదుల మిష్నా ఇలా చెబుతోంది: “ఆలయంలోని మూడు స్థలాల్లో యాజకులు కావలికాసేవారు అంటే అబ్టినాస్‌ కక్ష్యలోనూ, జ్వాలా కక్ష్యలోనూ, అగ్నిగుండ కక్ష్యలోనూ, కావలికాసేవారు; మరి లేవీయులు ఇరవై ఒక్క స్థలాల్లో అంటే ఆలయ పర్వతపు గుమ్మాలు ఐదింటి దగ్గరా ఐదుగురూ, వాటి లోపల నలుమూలలా నలుగురూ, ఆలయ ఆవరణలోని గుమ్మాలు ఐదింటి దగ్గరా ఐదుగురూ, వాటి వెలుపలవున్న నలుమూలల్లో నల్గురూ, ఒకరు అర్పణల కక్ష్యలోనూ, మరొకరు తెరగల కక్ష్యలోనూ, కరుణాపీఠమున్న [అతి పరిశుద్ధ స్థలానికి వెనుకవైపునున్న రక్షణ గోడకు అవతల] స్థలం వెనుక ఇంకొకరూ ఉంచబడేవారు. పర్వతంమీదవున్న ఆలయ అధిపతి దివిటీ పుచ్చుకొని ప్రతి కావలివానిని గమనించడానికి పహారాకు వెళ్తుండేవాడు. మరి ఏ కావలివాడైనా సరే మెలకువగావుండి లేచినిలబడి “పర్వతంమీదనున్న ఆలయ అధిపతీ నీకు సమాధానం కల్గునుగాక” అని చెప్పకపోతే అతడు నిద్రపోతున్నాడని స్పష్టమౌతుంది. అప్పుడు ఆయన తన దండంతో వాన్ని కొడతాడు. మరి అతని వస్త్రాల్ని కాల్చివేసే హక్కు ఆయనకు ఉండేది.”—ది మిష్నా, మిద్ధోత్‌ (“కొలతలు”), 1, పేరాలు 1-2, హెర్బెర్ట్‌ డన్బీ అనువదించినది.

7. యాజకులూ, లేవీయులూ ఆలయంలో కావలికాసే పనిలో ఉన్నప్పుడు ఎందుకు మెలకువగా ఉండాలి?

7 కావలికాసేందుకూ, అపవిత్రుడు ఎవ్వడూ ఆలయ ఆవరణలోనికి ప్రవేశించకుండా అరికట్టేందుకూ ఆ సేవా విభాగానికి చెందిన అనేకమంది లేవీయులూ, యాజకులూ రాత్రంతా మేల్కొని ఉంటారు. “పర్వతంమీదవున్న ఆలయ అధిపతి” లేక “ఆలయ అధికారి” రాత్రివేళ కావలికాసే సమయంలో మొత్తం 24 స్థలాల్లో పహారాకు వెళ్తాడు గనుక తాను పట్టుబడకుండా ఉండాలంటే ప్రతి కావలివాడూ తన తన నియమిత స్థానంలో కావలికాస్తూ మెలకువగా ఉండాలి.—అపొస్తలుల కార్యములు 4:1, NW.

8. క్రైస్తవుల అలంకారిక పైవస్త్రాలు ఏవి?

8 అభిషిక్త క్రైస్తవులూ, వారి తోటి సేవకులూ ఆత్మీయంగా మెలకువగావుండి, తమ అలంకారిక పైవస్త్రాల్ని కాపాడుకోవాల్సిన అవసరంవుంది. ఇవి, యెహోవా ఆత్మీయ ఆలయంలో పరిచర్యచేసే మన నియామకానికి సంబంధించిన బాహ్య రుజువులై ఉన్నాయి. ఈ నియామకాన్ని గుర్తించినందున, మన కర్తవ్యాల్ని నెరవేర్చేందుకూ, రాజ్య ప్రచారకులుగా మన ఆధిక్యతల్ని నిర్వర్తించేందుకూ మనకు సహాయపడే దేవుని పరిశుద్ధాత్మనీ లేక దేవుని చురుకైన శక్తినీ మనం కల్గివున్నాం. దేవుని పరిచారకులుగా మనం మన నియామకస్థానాల్లో నిద్రపోతుండగా, గొప్ప ఆత్మీయ ఆలయ అధిపతియైన యేసుక్రీస్తుకి మనల్ని పట్టించే ప్రమాదంలో పడవేస్తుంది. ఆ సమయంలో గనుక మనం ఆత్మీయంగా నిద్రపోతుంటే, మనం అలంకారికంగా దిగంబరులం చేయబడతాం, మన సూచనార్థక వస్త్రాలు కాల్చివేయబడతాయి. కాబట్టి, మనం ఆత్మీయంగా ఎలా మెలకువగా ఉండగలం?

మనం మెలకువగా ఉండగల విధానం

9. క్రైస్తవ ప్రచురణల సహాయంతో బైబిల్ని పఠించడం ఎందుకు అంత ప్రాముఖ్యమైన విషయం?

9 ఆత్మీయ మెలకువను కల్గివుండేందుకు ఓ ఉత్ప్రేరకం ఏమిటంటే, క్రైస్తవ ప్రచురణల సహాయంతో శ్రద్ధగా లేఖనాల్ని పఠించడమే. అలాంటి పఠనం, మనల్ని పరిచర్యకు సిద్ధపరుస్తుంది, విపత్తుల్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది, నిరంతర సంతోషానికి మార్గాన్ని చూపిస్తుంది. (సామెతలు 8:34, 35; యాకోబు 1:5-8) మనం చేసే పఠనం క్షుణ్ణంగానూ, పురోభివృద్ధిదాయకంగానూ ఉండాలి. (హెబ్రీయులు 5:14–6:3) మెలకువగానూ, అప్రమత్తంగానూ మనల్ని ఉంచుకునేందుకు క్రమంగా తినే మంచి ఆహారం సహాయపడగలదు. అది, పోషకాహార లోపంవల్ల వచ్చే అవకాశమున్న అతినిద్రను పోగొట్టగలదు. ఆత్మీయంగా పోషకాహారలోపానికి గురయ్యేందుకూ, నిద్రమత్తులుగా ఉండేందుకూ మనకు ఎటువంటి కారణమూ లేదు. ఎందుకంటే “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” అభిషిక్త దాసుని ద్వారా ఆత్మీయాహారం కోసం సమృద్ధికరమైన ఏర్పాట్లను దేవుడు చేస్తున్నాడు. (మత్తయి 24:45-47) మెలకువగా ఉండడానికీ, ‘విశ్వాసం విషయంలో స్వస్థతగల్గి’ ఉండడానికీ గల ఓ మార్గం ఏమిటంటే వ్యక్తిగత పఠనాన్నీ, కుటుంబ పఠనాన్నీ చేయడం ద్వారా ఆత్మీయాహారాన్ని క్రమంగా తీసుకోవడమే.—తీతు 1:13.

10. ఆత్మీయ మెలకువను కల్గివుండేందుకు క్రైస్తవ కూటాలూ, సభలూ, సమావేశాలూ మనకు ఎలా సహాయపడతాయి?

10 ఆత్మీయ మెలకువను కల్గివుండేందుకు మనకు క్రైస్తవ కూటాలూ, సభలూ, సమావేశాలూ సహాయపడతాయి. అవి, ‘ప్రేమ చూపడానికీ సత్కార్యాలు చేయడానికీ ఒకనినొకడు పురికొల్పుకొనేందుకూ’ ప్రోత్సాహాన్నీ అవకాశాల్నీ ఇస్తాయి. విశేషంగా, మనం ‘ఆ దినం సమీపించడాన్ని చూసేకొలదీ’ క్రమంగా కూడుకోవాలి. ఆ దినం ఇప్పుడు నిశ్చయంగా సమీపంగావుంది. అది “యెహోవా దినము.” అప్పుడు ఆయన తన సర్వాధిపత్యాన్ని సమర్థించుకుంటాడు. ఆ దినం నిజంగా మనకు ప్రాముఖ్యమైనదైతే—అది ప్రాముఖ్యమైనది కావాలి—మనం ‘సమాజముగా కూడుట మానం.’—హెబ్రీయులు 10:24, 25; 2 పేతురు 3:10.

11. ఆత్మీయ మెలకువను కల్గివుండేందుకు క్రైస్తవ పరిచర్య చేయడం అవసరమని ఎందుకు చెప్పవచ్చు?

11 ఆత్మీయ మెలకువను కల్గివుండేందుకు, క్రైస్తవ పరిచర్యలో హృదయపూర్వకంగా భాగం వహించడం అవసరం. సువార్తను ప్రకటించడంలో క్రమంగానూ, ఆసక్తికరంగానూ భాగం వహించడం మనల్ని అప్రమత్తులుగా ఉంచుతుంది. మన పరిచర్య మనం ప్రజలతో దేవుని వాక్యాన్ని గూర్చీ, ఆయన రాజ్యాన్ని గూర్చీ, ఆయన సంకల్పాల్ని గూర్చీ మాట్లాడేందుకు అనేక అవకాశాల్ని కలిగిస్తోంది. ఇంటింటా సాక్ష్యమివ్వడమూ, పునర్దర్శనాల్ని చేయడమూ, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము వంటి ప్రచురణలలో నుండి గృహ బైబిలు పఠనాల్ని నిర్వహించడమూ తృప్తిని ఇస్తాయి. ప్రాచీన ఎఫెసులోని పెద్దలు పౌలు తమకు “బహిరంగముగాను, ఇంటింటను” బోధించాడని ధృవపర్చగల్గారు. (అపొస్తలుల కార్యములు 20:20, 21) తమ పరిచర్యను ఎంతోకొంత ఆటంకపర్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు విశ్వాసులైన కొంతమంది యెహోవాసాక్షులకు ఉన్నా, వాళ్లు యెహోవాను గురించీ, ఆయన రాజ్యాధిపత్యాన్ని గురించీ ఇతరులకు తెలియజేసే మార్గాల్ని కనుగొని, అలా చేయడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు.—కీర్తన 145:10-14.

12, 13. ఏ కారణాల్నిబట్టి ఆహార పానీయాల్లో మితిమీరకుండా మనం జాగ్రత్తపడాలి?

12 ఆత్మీయ మెలకువను కల్గివుండేందుకు, మితిమీరకుండా ఉండడం మనకు సహాయపడుతుంది. యేసు తన ప్రత్యక్షతను గురించి మాట్లాడుతూ, తన అపొస్తలులకు ఇలా ఉద్బోధించాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.” (లూకా 21:7, 34, 35) తిండిబోతుతనమూ, త్రాగుబోతుతనమూ బైబిల్లోని సూత్రాలతో పొందిక కలిగిలేవు. (ద్వితీయోపదేశకాండము 21: 18-21) సామెతలు 23:20, 21 వచనాలు ఇలా చెబుతున్నాయి: “ద్రాక్షారసము [అధికంగా] త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.”—సామెతలు 28:7, పోల్చండి.

13 అయితే, అధికంగా తినడమూ, మితిమీరి త్రాగడమూ ఒకవేళ ఆ స్థాయికి వెళ్లకపోయినప్పటికీ, అవి ఓ వ్యక్తిని మగతకు గురిచెయ్యగలవు, సోమరివానిగానూ, దేవుని చిత్తాన్ని చేయడాన్ని నిర్లక్ష్యపెట్టేవానిగానూ చేయగలవు. కుటుంబ జీవితమూ, ఆరోగ్య విషయాలూ మరి అలాంటి ఇతర విషయాలూ చేరివున్న చింతలు ఉండడం సహజమే. కానీ, మనం జీవితంలో దేవుని రాజ్యాసక్తుల్ని మొదట ఉంచుకొని, మన పరలోకపుతండ్రి మనకు దయచేస్తాడనే నమ్మకాన్ని మనం కల్గివుంటే, మనం ధన్యులం అవుతాం. (మత్తయి 6:25-34) అలాకాకపోతే, “ఆ దినము” మనపైకి “ఉరివచ్చినట్లు” వస్తుంది. బహుశా అది, మనకు తెలియకుండా మనల్ని పట్టుకునే కనీకన్పించని మాటుగానో లేక అనుమానం ఇసుమంతైనాలేని జంతువుల్ని ఆకర్షించి పట్టించే ఎరవున్న బోనులాగానో ఉంటుంది. మనం మెలకువగా ఉన్నట్లైతే, “అంత్యకాలము”లో జీవిస్తున్నామని మనం పూర్తిగా గుర్తెరిగినట్లైతే ఇది జరుగదు.—దానియేలు 12:4.

14. హృదయపూర్వకమైన ప్రార్థనలో మనం ఎందుకు భాగం వహించాలి?

14 ఆత్మీయ మెలకువను కల్గివుండేందుకు మరొక సహాయం ఏమిటంటే ప్రార్థనయందు పట్టుదల కల్గివుండడమే. తన గొప్ప ప్రవచనంలో, యేసు ఇంకా ఇలా ఉద్బోధించాడు: ‘మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.’ (లూకా 21:36) అవును, మనం ఎల్లప్పుడూ యెహోవా పక్షాన ఉండాలనీ, మనుష్యకుమారుడైన యేసుక్రీస్తు ఈ దుష్ట విధానాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అంగీకృతమైన రీతిలో నిలబడాలనీ మనం ప్రార్థిద్దాం. మన స్వంత ప్రయోజనార్థమై, మనం ఎవరి కొరకైతే ప్రార్థిస్తామో ఆ మన తోటి విశ్వాసుల ప్రయోజనార్థమై మనం ‘ప్రార్థనలో మెలకువగా ఉండాల్సిన’ అవసరంవుంది.—కొలొస్సయులు 4:2; ఎఫెసీయులు 6:18-20.

సమయం గతించిపోతోంది

15. నీతి ప్రచారకులుగా మనసేవ దేనిని నెరవేరుస్తుంది?

15 యెహోవా మహాదినం కోసం మనం ఎదురు చూస్తుండగా, ఆయన సేవలో మనం చేయగల్గినంతా చేయాలని నిస్సందేహంగా కోరుకుంటాం. దీన్ని గురించి మనం ఆయన్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, ‘కార్యానుకూలమైన ఓ గొప్ప ద్వారం’ మనకొరకు తెరవబడొచ్చు. (1 కొరింథీయులు 16:8, 9, అధఃసూచి చూడండి.) దేవుని నియమిత కాలంలో, యేసు తీర్పుతీరుస్తాడు, అలాగే నిత్య నాశనానికి పాత్రులైన భక్తిహీనులైన ‘మేకల’ నుండి నిత్యజీవానికి పాత్రులైన నీతిమంతులైన ‘గొఱ్ఱెల్ని’ వేరుపరుస్తాడు. (యోహాను 5:22) మేకలలో నుండి గొఱ్ఱెల్ని వేరుపరిచేది మనం కాదు. కానీ నీతిని ప్రకటించేవారిగా ఇప్పుడు మనం చేసే సేవ, దేవునికి చెల్లించే ఓ సేవా జీవితాన్ని ప్రజలు ఎంపిక చేసుకునేలా వారికి అవకాశాన్ని ఇస్తోంది. మరి ఆ విధంగా, యేసు ‘తన మహిమతో వచ్చినప్పుడు’ వాళ్లు జీవించేలా వేరుచేయబడే నిరీక్షణను కల్గివున్నారు. ‘నిత్యజీవం కొరకు నియమించబడిన’ వారి కోసం మనం అన్వేషిస్తుండగా, ఈ విధానానికి మిగిలివున్న పరిమితమైన కాలం హృదయపూర్వకంగా పనిచేసే అవసరతను ఉద్ధృతపరుస్తోంది.—మత్తయి 25:31-46; అపొస్తలుల కార్యములు 13:48.

16. మనం ఎందుకు ఆసక్తికల్గిన రాజ్య ప్రచారకులుగా ఉండాలి?

16 నోవహు దినాల్లోని ప్రపంచానికి ఇవ్వబడిన సమయం గతించిపోయింది. మరి ఈ విధానానికి ఇవ్వబడిన సమయం త్వరలోనే గతించిపోతుంది. కాబట్టి, మనం ఆసక్తిపరులైన రాజ్య ప్రచారకులుగా ఉందాం. మన ప్రచార పని ఫలిస్తోంది, ఎందుకంటే, ప్రతి సంవత్సరం, లక్షలాదిమంది ప్రజలు దేవునికి తాము చేసుకున్న సూచనార్థక సమర్పణలో భాగంగా బాప్తిస్మం తీసుకుంటున్నారు. వాళ్లు యెహోవా దీవెనకరమైన సంస్థలో అంటే ‘ఆయన ప్రజల్లోనూ ఆయన మేపు గొఱ్ఱెల్లోనూ’ భాగస్థులు అవుతున్నారు. (కీర్తన 100:3) అనేకమందికి నిరీక్షణను ఇస్తున్న రాజ్య ప్రచార పనిలో, “యెహోవా యొక్క భయంకరమైన ఆ మహా దినము” రాకమునుపు భాగం వహించడం ఎంత ఆనందమో కదా!

17, 18. (ఎ) మనం ప్రకటిస్తుండగా, కొంతమంది వ్యక్తులనుండి మనమే ప్రతిస్పందనను ఎదురు చూడాలి? (బి) అపహాసకులపైకి ఏది నిశ్చయంగా వస్తుంది?

17 నోవహువలె, దేవుని మద్దతూ సంరక్షణా మనకు ఉన్నాయి. అవును, నోవహు ప్రకటించిన సందేశాన్ని ప్రజలూ, భౌతిక రూపాన్ని ధరించిన దేవదూతలూ అలాగే నెఫీలులూ హేళన చేసి ఉండొచ్చు. కానీ అది ఆయనను ఆపుచేయలేక పోయింది. మనం “అంత్య దినములలో” జీవిస్తున్నామనే విస్తృతమైన రుజువుల్ని మనం సూచించినప్పుడు, నేడు కూడా కొంతమంది హేళన చేస్తారు. (2 తిమోతి 3:1-5) అలాంటి అవహేళన, యేసు ప్రత్యక్షతను గూర్చిన బైబిలు ప్రవచన నెరవేర్పులోని భాగమే. ఎందుకంటే దానిని గురించి పేతురు ఇలా వ్రాశాడు: ‘అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,—ఆయన రాకడను [“ప్రత్యక్షతను,” NW] గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురు.’—2 పేతురు 1:16; 3:3, 4.

18 ప్రస్తుత దినాల్లోని అపహాసకులు ఇలా ఆలోచించవచ్చు: ‘సృష్ట్యారంభం నుండీ ఏదీ మార్పుచెందలేదు. జీవితం గడుస్తూనే ఉంది, ప్రజలు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లిచేసుకొంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. ఒకవేళ యేసు ప్రత్యక్షమైతే, ఆయన నా కాలంలో తీర్పును అమలు చేయడులే.’ వాళ్లెంత తప్పుగా ఆలోచిస్తున్నారో కదా! యెహోవా భయంకరమైన ఆ దినం వచ్చేలోగా వాళ్లు గనుక ఏ విధమైన ఇతర కారణాల మూలంగానూ మరణించకపోతే, జలప్రళయంలో జరిగిన వినాశనం నోవహు కాలంలోని దుష్టతరాన్ని అంతమొందించినట్లుగానే ఆ దినం వారిని అంతమొందిస్తుంది.—మత్తయి 24:34.

మనం తప్పకుండా మెలకువగా ఉండాలి!

19. శిష్యుల్ని చేసే మన కార్యకలాపాల్ని మనం ఎలా దృష్టించాలి?

19 మనం యెహోవాకు సమర్పించుకుంటే, అయుక్తమైన కారణాల్నిబట్టి ఎన్నటికీ నిద్రలోకి జారుకోకుండా ఉందాం. మెలకువగా ఉండేందుకూ దైవిక ప్రవచనమందు విశ్వాసాన్ని ఉంచడానికీ “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని మనకు ఇవ్వబడిన నియామకాన్ని నెరవేర్చడానికి ఇదే సమయం. (మత్తయి 28:19, 20) ఈ విధానం దాని తుది అంతాన్ని ఎదుర్కోబోతుండగా, యేసుక్రీస్తు నాయకత్వంలో యెహోవా దేవుని సేవించడంకన్నా, అలాగే అంతానికి ముందు “ఈ రాజ్యసువార్త”ను ప్రకటించే ప్రపంచవ్యాప్త పనిలో భాగం వహించడంకన్నా మిన్నయైన ఆధిక్యత మనకు మరేదీ ఉండదు.—మత్తయి 24:14; మార్కు 13:10.

20. కాలేబూ యెహోషువాలు ఏ మాదిరిని ఉంచారు, వాళ్ల నడవడిక మనకేం తెలియజేస్తోంది?

20 యెహోవా ప్రజల్లో కొందరు ఆయనను దశాబ్దాలుగానూ బహుశా జీవితకాలమంతా సేవచేస్తున్నారు. మనం ఇటీవలెనే సత్యారాధనను స్వీకరించినప్పటికీ, ‘పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన’ ఇశ్రాయేలీయుడైన కాలేబువలె ఉందాం. (ద్వితీయోపదేశకాండము 1:34-36) ఐగుప్తీయుల చెరనుండి ఇశ్రాయేలీయులు విడుదల పొందిన తర్వాత కొద్దికాలానికే, ఆయనా యెహోషువా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేందుకు పూర్తిగా సంసిద్ధులయ్యారు. అయితే, వయోజనులైన ఇశ్రాయేలీయులకు విశ్వాసం కొరవడి, అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. వాళ్లు అక్కడే మరణించారు. ఆ కాలమంతటిలోనూ కాలేబూ యెహోషువాలు వాళ్లతోపాటూ కష్టాల్ని అనుభవించినా, చివరకు ఆ ఇద్దరు పురుషులూ వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. (సంఖ్యాకాండము 14:30-34; యెహోషువ 14:6-15) మనం ‘యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించి,’ ఆత్మీయ మెలకువను కల్గివున్నట్లైతే మనం దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త లోకంలోనికి ప్రవేశించే ఆనందాన్ని కల్గివుంటాం.

21. మనం ఆత్మీయ మెలకువను కల్గివుంటే, మనం ఏం అనుభవిస్తాం?

21 మనం అంత్యకాలంలో జీవిస్తున్నామనీ, యెహోవా మహాదినం సమీపంగా ఉందనీ రుజువులు స్పష్టపరుస్తున్నాయి. నిద్రావస్థలో ఉండడానికీ, దైవిక చిత్తాన్ని చేయడాన్ని అలక్ష్యం చేయడానికీ ఇది సమయం కాదు. మనం ఆత్మీయ మెలకువను కల్గివుంటే, క్రైస్తవ పరిచారకులుగానూ యెహోవా సేవకులుగానూ మనల్ని గుర్తించే మన వస్త్రాల్ని కాపాడుకొన్నట్లైతేనే, మనం ఆశీర్వాదించబడతాం. ‘మెలకువగానూ, విశ్వాసమందు నిలకడగానూ, పౌరుషం కల్గినవారిగానూ, బలవంతులుగానూ’ ఉండడమే మన నిర్ణయమై ఉండాలి. (1 కొరింథీయులు 16:13) యెహోవా సేవకులుగా, మనలో ప్రతి ఒక్కరమూ స్థిరులుగానూ, ధైర్యవంతులుగానూ ఉందాం. అప్పుడు మనం యెహోవా మహాదినం వచ్చినప్పుడు సంసిద్ధంగా ఉండేవారిలోనూ, మెలకువగా ఉండి నమ్మకంగా సేవిస్తున్న ధన్యుల శ్రేణిలోనూ ఉంటాం.

మీరు ఎలా జవాబిస్తారు?

◻ మన అలంకారిక పైవస్త్రాల్ని మీరు ఎలా నిర్వచిస్తారు, మరి మనం వాటినెలా కాపాడుకోగలం?

◻ ఆత్మీయ మెలకువను కల్గివుండేందుకు కొన్ని మార్గాలేమిటి?

◻ అవహేళన చేసేవారు ఉంటారని మనం ఎందుకు ఎదురు చూడాలి, మరి మనం వారిని ఎలా దృష్టించాలి?

◻ ఈ అంత్యదినాల్లో శిష్యుల్ని చేసే మన పనిని మనం ఎలా దృష్టించాలి?

[16వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు మెలకువగా ఉండేందుకూ, తమ కర్తవ్యాల్ని నిర్వర్తించేందుకూ సహయపడే దేవుని పరిశుద్ధాత్మను వారు కల్గివున్నారు

[15వ పేజీలోని చిత్రం]

ఆత్మీయ మెలకువను కల్గివుండి, మీ అలంకారిక పైవస్త్రాల్ని కాపాడుకొనేందుకు మీరు నిశ్చయించుకున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి