కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 11/1 పేజీలు 19-21
  • జపానులో మతస్వాతంత్ర్యం ఉన్నతపర్చబడింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జపానులో మతస్వాతంత్ర్యం ఉన్నతపర్చబడింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • వివాదంలో ఉన్న విషయం ఏమిటి?
  • జిల్లా న్యాయస్థానం నిర్ణయం విన్నవారు కలతచెందడం
  • వాదుల నిస్వార్థ దృక్పథం
  • సర్వోన్నత న్యాయస్థానానికి
  • విస్తృతమైన ప్రభావం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 11/1 పేజీలు 19-21

జపానులో మతస్వాతంత్ర్యం ఉన్నతపర్చబడింది

జపానులో అనేక సంవత్సరాలపాటు, యెహోవాసాక్షులైన యౌవన విద్యార్థులు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని అనుసరించాలా, లేక తమ మనస్సాక్షిని ఉల్లంఘించే పాఠశాల పాఠ్య ప్రణాళికను అంగీకరించాలా అనే సందిగ్ధావస్థను ఎదుర్కొన్నారు. ఎందుకా సందిగ్ధం? ఎందుకంటే వారి పాఠశాలల్లో వ్యాయామ శిక్షణ పాఠ్యక్రమంలో సమరోచిత కళా డ్రిల్లులు ఒక భాగమై ఉన్నాయి. అలాంటి డ్రిల్లులు యెషయా 2వ అధ్యాయం 4వ వచనమందు కనుగొనబడేటువంటి బైబిలు సూత్రాలతో పొందికగాలేవని యౌవన సాక్షులు భావించారు. అదిలా చదువబడుతుంది: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”

మరో వ్యక్తికి హాని కలిగించడం ఇమిడివుండే, యుద్ధంలో ఉపయోగించేలాంటి నైపుణ్యాలను నేర్చుకోవడం ఇష్టంలేక, తాము మనస్సాక్షిపూర్వకంగా సమరోచిత కళల్లో భాగం వహించలేమని యౌవన క్రైస్తవ సాక్షులు తమ ఉపాధ్యాయులకు వివరించారు. పాఠశాల పాఠ్యక్రమాన్ని అంగీకరించేలా ఈ విద్యార్థులను ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించిన తర్వాత, అర్థం చేసుకోగలిగిన అనేకమంది ఉపాధ్యాయులు విద్యార్థుల మనస్సాక్షులను గౌరవించి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.

అయితే కొంతమంది ఉపాధ్యాయులు మానసికోద్వేగానికి గురయ్యారు, కొన్ని పాఠశాలలు యౌవన సాక్షుల వ్యాయామ శిక్షణార్హతలను నిరాకరించాయి. 1993లో కనీసం తొమ్మిదిమంది సాక్షులు పైతరగతికి వెళ్లకుండా నిలిపివేయబడి, సమరోచిత కళల్లో పాల్గొననందుకు పాఠశాలను విడిచిపెట్టేందుకు లేక బహిష్కరించబడేందుకు ఒత్తిడి చేయబడ్డారు.

స్పష్టంగా అది యౌవన క్రైస్తవులు తమ మనస్సాక్షినిబట్టి రాజీపడకుండా విద్యనభ్యసించే తమ హక్కును కాపాడుకోవలసిన సమయం. కోబ్‌ పురపాలక పారిశ్రామిక సాంకేతిక కళాశాలలో (సంక్షిప్తంగా కోబ్‌ టెక్‌ అని పిలువబడుతుంది) రెండవ గ్రేడుకు వెళ్లకుండా నిలిపివేయబడిన ఐదుగురు విద్యార్థులు చట్టపరమైన చర్య తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు.

వివాదంలో ఉన్న విషయం ఏమిటి?

1990 వసంత ఋతువులో, ఐదుగురు విద్యార్థులు కోబ్‌ టెక్‌లో ప్రవేశించినప్పుడు, తమ బైబిలు ఆధారిత దృక్పథాల దృష్ట్యా తాము కెండో (జపానీయుల ఖడ్గప్రదర్శన) డ్రిల్లుల్లో భాగం వహించలేమని ఉపాధ్యాయులకు వివరించారు. వ్యాయామ శిక్షణా విభాగం తీవ్రంగా వ్యతిరేకించి, వారు వ్యాయామ శిక్షణార్హతలను సంపాదించుకోవడానికి ఏ ప్రత్యామ్నాయ ఏర్పాటునూ చేయనన్నది. చివరికి, విద్యార్థులు వ్యాయామ శిక్షణా తరగతిలో ఉత్తీర్ణులు కాలేదు, దానితో వారు మొదటి గ్రేడునే (మొదటి సంవత్సర కళాశాల విద్య) మళ్లీ చదవవలసి వచ్చింది. పాఠశాల తీసుకున్న చర్య మతస్వాతంత్ర్యం గురించి రాజ్యాంగం హామీ ఇస్తున్నదానికి వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ 1991 ఏప్రిల్‌లో వారు కోబ్‌ జిల్లా న్యాయస్థానంలో దావా వేశారు.a

ప్రత్యామ్నాయ కార్యకలాపాలను అందజేయడం ఒక ప్రత్యేకమైన మతం ఎడల అభిమానం చూపడంతో సమానమౌతుందని, తద్వారా అది ప్రజా విద్యా తటస్థతను ఉల్లంఘించినట్లు అవుతుందని పాఠశాల తెలియజేసింది. అంతేగాక, ప్రత్యామ్నాయ వ్యాయామ శిక్షణా కార్యక్రమాన్ని అందజేయడానికి తమ వద్ద వసతులుగాని, సిబ్బందిగాని లేరని వారన్నారు.

జిల్లా న్యాయస్థానం నిర్ణయం విన్నవారు కలతచెందడం

కేసు విచారణ జరుగుతున్నప్పుడు, ఐదుగురు విద్యార్థుల్లో ఇద్దరు వ్యాయామ శిక్షణ కొరకైన గ్రేడులో మళ్లీ ఉత్తీర్ణులు కాలేకపోయారు, అయితే మిగిలిన ముగ్గురు బొటాబొటీగా ఉత్తీర్ణులై తరువాతి గ్రేడులోకి వెళ్లారు. విద్యావిషయకమైన వాటిలో వెనుకబడివున్న విద్యార్థులు, వరుసగా రెండు సంవత్సరాలు ఒకే గ్రేడులో ఉండే విద్యార్థులు బహిష్కరించబడతారని పాఠశాల నియమాలు తెలియజేశాయి. దీని దృష్ట్యా, బహిష్కరించబడక ముందే పాఠశాలను విడిచిపెట్టి వెళ్లాలని ఆ ఇద్దరిలో ఒక విద్యార్థి నిర్ణయించుకున్నాడు, కాని మరో వ్యక్తి అంటే కునిహిటో కోబయాషి విడిచిపెట్టి వెళ్లడానికి నిరాకరించాడు. కాబట్టి ఆయన బహిష్కరించబడ్డాడు. ఆసక్తికరంగా, 48 పాయింట్లతో కునిహిటో తప్పిపోయిన వ్యాయామ శిక్షణతోపాటు అన్ని సబ్జెక్టులకు కలిపి సగటున ఆయనకు వందకు 90.2 పాయింట్లు వచ్చాయి. 42 మంది విద్యార్థులున్న తన తరగతిలో ఆయనే మంచి మార్కులు పొందినవాడు.

ఫిబ్రవరి 22 1993న, కోబ్‌ జిల్లా న్యాయస్థానం కోబ్‌ టెక్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తూ, “కెండో డ్రిల్లుల్లో పాల్గొనాలని పాఠశాల కోరడం వాది యొక్క ఆరాధనా స్వాతంత్ర్యాన్ని కొంతమేరకు నిర్బంధించిందన్నది నిరాకరించలేని విషయం” అని గుర్తించినప్పటికీ, “పాఠశాల తీసుకున్న చర్యలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం లేదు” అని చెప్పింది.

మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలువలె, ఉన్నత న్యాయాధికారులకు అప్పీలు చేసుకోవడానికి వాదులు నిర్ణయించుకున్నారు. (అపొస్తలుల కార్యములు 25:11, 12) కేసు ఒసాకా ఉన్నత న్యాయస్థానానికి వెళ్లింది.

వాదుల నిస్వార్థ దృక్పథం

ఒక ప్రముఖ పండితుడు, సుకుబా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు అయిన టెసువో షీమోముర ఒసాకా ఉన్నత న్యాయస్థానంలో నిపుణతగల సాక్షిగా సాక్ష్యమిచ్చేందుకు అంగీకరించాడు. విద్యా మరియు న్యాయ సంబంధిత విషయాల నిపుణునిగా ఆయన, విద్యార్థులతో వ్యవహరించడంలో పాఠశాల చర్యలు ఎంత నిర్దయతో కూడినవిగా ఉన్నాయో నొక్కి తెలియజేశాడు. కునిహిటో కోబయాషి న్యాయస్థానంలో తన భావాలను వ్యక్తం చేశాడు, ఆయన యథార్థమైన దృక్పథం న్యాయస్థానంలో ఉన్నవారి హృదయాలను కదిలించింది. ఆ తర్వాత, 1994 ఫిబ్రవరి 22న, పాఠశాల తీసుకున్న చర్యలు కునిహిటో ఆరాధనా స్వాతంత్ర్యాన్ని మరియు విద్యనభ్యసించే ఆయన హక్కును ఉల్లంఘిస్తున్నాయని ప్రకటిస్తూ పాఠశాల ఆయనను తిరిగి చేర్చుకోవాలని కోబ్‌ బార్‌ అసోసియేషన్‌ సిఫారసు చేసింది.

ఒకాసా ఉన్నత న్యాయస్థానంలో నిర్ణయం తెలియజేసే సమయం సమీపించినప్పుడు, న్యాయపోరాటంలో చివరి వరకు భాగం వహించాలని సంబంధిత యౌవన క్రైస్తవులందరూ ఆసక్తి కలిగివున్నారు. జపానంతటిలోను పాఠశాలల్లో ఇదే వివాదాన్ని ఎదుర్కొనే వేలాదిమంది యౌవన సాక్షుల తరఫున తాము న్యాయ పోరాటాన్ని పోరాడుతున్నామని వారు భావించారు. కాని వారు పాఠశాల నుండి బహిష్కరించనందున న్యాయస్థానం వారి కేసును కొట్టివేసే సాధ్యత ఎక్కువగా ఉంది. తాము తమ విన్నపాన్ని వెనక్కి తీసుకుంటే, కునిహిటోను పాఠశాల నిర్హేతుకంగా బహిష్కరించడం ఉన్నతపర్చబడుతుందని వారు గ్రహించారు. కాబట్టి, కునిహిటో తప్ప మిగిలిన విద్యార్థులందరూ కేసును ఉపసంహరించుకోవడానికి నిర్ణయించుకున్నారు.

డిశంబరు 22, 1994న, ఒసాకా ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తియైన రసుకీ షీమాద కోబ్‌ జిల్లా న్యాయస్థానం తీర్పును కొట్టివేసే నిర్ణయాన్ని తెలియజేశాడు. కెండో డ్రిల్లులను నిరాకరించడానికి కునిహిటోకున్న కారణం యథార్థమైనదని, ఆయన తన మత నమ్మకాన్నిబట్టి తాను తీసుకున్న చర్యకు జరిగిన నష్టం ఎంతో ఎక్కువని న్యాయస్థానం గుర్తించింది. పాఠశాల ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ఏర్పాటు చేసి ఉండవలసినదని ప్రధాన న్యాయమూర్తి షీమాద అన్నాడు. ఈ చక్కని నిర్ణయం మానవ హక్కుల గురించి శ్రద్ధగలవారి హృదయాల్లో అనుకూల ప్రతిస్పందనను కలుగజేసింది. అయితే, మరో సంవత్సరం కంటే ఎక్కువ కాలం కునిహిటోకు విద్యలేకుండా చేస్తూ పాఠశాల కేసును జపాన్‌ సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించుకుంది.

సర్వోన్నత న్యాయస్థానానికి

కోబ్‌ షీంబన్‌ అనే వార్తా పత్రికలోని సంపాదకీయం తర్వాత ఇలా తెలియజేసింది: “కోబ్‌ నగర పాఠశాల బోర్డు మరియు పాఠశాల ఆ సమయంలో [ఒసాకా ఉన్నత న్యాయస్థానం యొక్క నిర్ణయం తర్వాత] మిష్టర్‌ కోబయాషిని పాఠశాలలోకి తిరిగి చేర్చుకోవలసింది. . . . వారు అనవసరంగా వివాదాస్పదమైన దృక్పథం కలిగివుండడం ఒక వ్యక్తికి ఆయన యౌవనంలోని ప్రాముఖ్యమైన కాలం నష్టమయ్యేలా చేసింది.” అయినప్పటికీ, కోబ్‌ టెక్‌ ఈ విషయంలో దృఢంగా ఉంది. ఫలితంగా, అది దేశవ్యాప్తంగా వార్తా నివేదికల్లో చర్చనీయాంశమయ్యింది. దేశమంతటా ఉన్న ఉపాధ్యాయులు మరియు పాఠశాల అధికారులు దీన్ని గమనించారు, దేశంలోకెల్లా ఉన్నతమైనదైన కోర్టు నుండి వచ్చిన నిర్ణయం భవిష్యత్తులో వచ్చే ఇదే విధమైన కేసులకు బలమైన న్యాయ ప్రమాణంగా ఉంటుంది.

పాఠశాల కేసును సర్వోన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసిన దాదాపు ఒక వారం తర్వాత, 1995 జనవరి 17న కోబ్‌ భూకంపం కునిహిటో మరియు ఆయన కుటుంబం నివసిస్తున్న అషీయా నగరాన్ని తాకింది. ఆ ఉదయం దాదాపు ఐదున్నరకు, ఆ ప్రాంతంలో భూకంపం సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు, కునిహిటో తన పాక్షికకాల ఉద్యోగం నిమిత్తం తన ఇంటిని విడిచి బయటికి వెళ్లాడు. ఆయన హన్‌షీన్‌ ఎక్స్‌ప్రెస్‌వే క్రిందనున్న రోడ్డు మీద సైకిలుపై వెళుతూ, భూకంపం సంభవించే సమయానికి, కూలిపోబోతున్న భాగానికి ఆయన అప్పుడే సమీపిస్తున్నాడు. వెంటనే ఆయన ఇంటికి తిరిగి వెళ్లి, తన ఇంటి క్రింది అంతస్తు పూర్తిగా ధ్వంసమై ఉండడాన్ని కనుగొన్నాడు. తాను భూకంపంలో తన జీవితాన్ని సుళువుగా కోల్పోయి ఉండేవాడినని కునిహిటో గుర్తించి, తనకు తప్పించుకునే అవకాశం ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయన మరణించి ఉంటే, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వకుండానే కెండో కేసు ముగిసి ఉండేది.

సాధారణంగా జపానులోని సర్వోన్నత న్యాయస్థానం అప్పీలులను కేవలం కాగితం మీదనే పరిశీలిస్తుంది, క్రింది న్యాయస్థానం నిర్ణయాలు సరైనవో కాదో తీర్పు తీరుస్తుంది. క్రింది న్యాయస్థానం నిర్ణయాన్ని మార్చడానికి ఏదైనా ప్రాముఖ్యమైన కారణముంటేనే తప్ప, విచారణలు జరుగవు. తీర్పు ఎప్పుడు చెప్పబడుతుందో సర్వోన్నత న్యాయస్థానం ఇరువర్గాలకు తెలియజేయదు. నిర్ణయం ఈ రోజు ఉదయం తెలియజేయబడుతుందని 1996 మార్చి 8న కొనిహిటోకు చెప్పబడినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. సర్వోన్నత న్యాయస్థానం ఒసాకా ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ఉన్నతపర్చిందని తెలుసుకున్నప్పుడు ఆయనకు సంభ్రమానందాలు కలిగాయి.

న్యాయమూర్తియైన షీనీచీ కావీ నాయకత్వం క్రింద నలుగురు న్యాయమూర్తులు “ప్రశ్నించబడిన చర్యలు సామాజికంగా అంగీకరింపబడిన సాంప్రదాయాల దృష్ట్యా పూర్తిగా తప్పు గనుక, వివేచనాయుతమైన హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి గనుక చట్టవిరుద్ధమని” ఏకగ్రీవంగా తీర్మానించారు. కెండో డ్రిల్లులను చేయడానికి కునిహిటో నిరాకరించడంలోని యథార్థతను న్యాయస్థానం గుర్తించి, ఇలా తెలియజేసింది: “కెండో డ్రిల్లులలో పాల్గొనడానికి వాది నిరాకరించడానికి కారణం గంభీరమైనది, అతని విశ్వాస మూలంతోనే సన్నిహిత సంబంధం కలిగివుంది.” వాది మతసంబంధమైన నమ్మకం గౌరవింపబడేలా పాఠశాల ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసి ఉండగలిగేదని, అలా చేసి ఉండవలసినదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తీర్చింది.

విస్తృతమైన ప్రభావం

పాఠశాలల్లో ఆరాధనా స్వాతంత్ర్యానికి మద్దతుగా ఈ నిర్ణయం నిస్సందేహంగా చక్కని ప్రమాణంగా ఉంటుంది. ది జపాన్‌ టైమ్స్‌ ఇలా తెలియజేసింది: “విద్య మరియు మత స్వాతంత్ర్యానికి సంబంధించిన విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినవాటిలో ఈ తీర్పు మొదటిది.” అయితే, విశ్వాస సంబంధమైన పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు తన స్వంత మనస్సాక్షిపూర్వక నిర్ణయాన్ని తీసుకునేందుకు ప్రతి యౌవన విద్యార్థికున్న బాధ్యతను ఈ నిర్ణయం తొలగించదు.

కునిహిటోకు విజయం అనుగ్రహించేలా న్యాయమూర్తులను కదిలించిన అంశాలలో ఒకటేమిటంటే అతడు “విద్యాసంబంధంగా విశేషమైన ప్రతిభను చూపిన యథార్థతగల విద్యార్థై ఉండడమేనని” సుకుబా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ మసాయుకి యచీనో వ్యాఖ్యానించాడు. తమ విశ్వాసానికి సంబంధించి పరీక్షలను ఎదుర్కొనే క్రైస్తవులకు బైబిలు ఇలా సలహా ఇస్తోంది: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (1 పేతురు 2:12) నమ్మకమైన యౌవన క్రైస్తవులు తమ జీవితమంతా బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడం ద్వారా తమ బైబిలు సంబంధిత స్థానం ప్రజల గౌరవాన్ని పొందదగినదని చూపించవచ్చు.

సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తీర్చిన తర్వాత, కునిహిటో కొబయాషి కోబ్‌ టెక్‌లోకి తిరిగి చేర్చుకొనబడ్డాడు. కునిహిటోతోపాటు పాఠశాలలో చేరిన విద్యార్థులలో అనేకులు అప్పటికే పట్టభద్రులయ్యారు. కునిహిటో ఇప్పుడు తనకంటే ఐదు సంవత్సరాలు చిన్నవాళ్లయిన వారితోపాటు చదువుకుంటున్నాడు. లోకంలోని ప్రజలనేకుల దృష్టిలో, ఆయన యౌవనంలో ఐదు అమూల్యమైన సంవత్సరాలు వ్యర్థమైపోయినట్లే. అయితే, కునిహిటో యథార్థత యెహోవా దేవుని దృష్టిలో అమూల్యమైనది, ఆయన చేసిన త్యాగం ఎంతమాత్రం వ్యర్థంకాదు.

[అధస్సూచీలు]

a వివరాల కొరకు దయచేసి, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన తేజరిల్లు! యొక్క నవంబరు 8, 1995 సంచికలోని 18 నుండి 22 పేజీలను చూడండి.

[20వ పేజీలోని చిత్రం]

ఎడమ: భూకంపం తర్వాత కునిహిటో ఇల్లు

క్రింద: కునిహిటో నేడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి