కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w11 3/15 పేజీలు 24-28
  • సిద్ధంగా ఉండండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సిద్ధంగా ఉండండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నోవహులా సిద్ధంగా ఉండండి
  • నోవహు ఆయన కుటుంబం సిద్ధంగా ఉన్నారు
  • మోషే మెలకువగా ఉన్నాడు
  • మెలకువగా ఉండండి!
  • ఆయన ‘దేవునితో నడిచాడు’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆయన, ‘మరి ఏడుగురు’ రక్షణ పొందారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • మీ విశ్వాసమునుబట్టి మీరు లోకముపై నేరస్థాపన చేయుదురా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • నోవహు విశ్వాసం లోకంపై నేరస్థాపన చేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
w11 3/15 పేజీలు 24-28

సిద్ధంగా ఉండండి!

“మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.”—మత్త. 24:44.

1, 2. (ఎ) బైబిల్లో ప్రవచించబడిన ఏ సంఘటనలను పులి చేసే దాడితో పోల్చవచ్చు? (బి) భవిష్యత్తులో దాడి జరిగినప్పుడు మనకు ఏమౌతుంది?

కొన్ని సంవత్సరాలపాటు, ఓ పేరుగాంచిన కళాకారుడు తాను శిక్షణ ఇచ్చిన బెంగాల్‌ పులులతో నిర్భయంగా ఆడుతూ ప్రేక్షకులను అలరించేవాడు. ఆయనిలా చెప్పాడు: “ఓ జంతువు మిమ్మల్ని నమ్మినప్పుడు, ప్రపంచంలోనే అత్యంత చక్కని బహుమతిని పొందినట్లు మీకు అనిపిస్తుంది.” కానీ 2003, అక్టోబరు 3న పరిస్థితి తారుమారైంది. ఏమైందో తెలియదు కానీ ఆ రోజు, తన దగ్గరున్న 172 కేజీల తెల్ల పులి ఒకటి ఆయన మీద దాడి చేసింది. అలా జరుగుతుందని ఊహించలేదు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా లేడు.

2 ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఓ “మృగము” చేసే దాడి గురించి బైబిలు ప్రవచిస్తోంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. (ప్రకటన 17:15-18 చదవండి.) ఆ మృగం ఎవరిపై దాడి చేస్తుంది? అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల అపవాది లోకం విభజించబడుతుంది. ఆ లేఖనంలో ప్రస్తావించబడిన ఎర్రని క్రూరమృగం ఐక్యరాజ్యసమితిని సూచిస్తుంది, “పది కొమ్ములు” రాజకీయ శక్తులన్నిటినీ సూచిస్తున్నాయి. ఈ రాజకీయ శక్తులు, వేశ్యలాంటి మహాబబులోనుపై అంటే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంపై దాడి చేసి దాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆ దినము గురించి, గడియ గురించి మనకు తెలియదు. (మత్త. 24:36) కానీ, అది మనం ఊహించని సమయంలో జరుగుతుందని, ఆ సమయం దగ్గరపడిందని మాత్రం మనకు తెలుసు. (మత్త. 24:44; 1 కొరిం. 7:29) అయితే ఆ దాడి జరిగిన తర్వాత తీర్పును అమలు చేయడానికి క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉంటే, ఆయన మనకు విడుదలను దయచేస్తాడు. (లూకా 21:28) సిద్ధంగా ఉండడం వల్ల దేవుని వాగ్దానాల నెరవేర్పును చూసిన తన నమ్మకమైన సేవకుల ఉదాహరణలను పరిశీలిస్తే, మనం ఎలా సిద్ధంగా ఉండవచ్చో నేర్చుకుంటాం. మనం వారి మాదిరిని అనుకరించాలంటే ఏమి చేయాలి?

నోవహులా సిద్ధంగా ఉండండి

3. ఎలాంటి పరిస్థితులవల్ల దేవుణ్ణి నమ్మకంగా సేవించడం నోవహుకు కష్టమై ఉంటుంది?

3 తన కాలంలో భూమిపై పరిస్థితులు ఘోరంగా ఉన్నా, నోవహు దేవుని వాగ్దానాల నెరవేర్పును చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవదూతలు మానవ శరీరాలను దాల్చి అందమైన స్త్రీలతో సహజీవనం చేసినప్పుడు నోవహు ఎన్ని సవాళ్లు ఎదుర్కొని ఉంటాడో ఆలోచించండి! అలాంటి అసహజమైన కలయికల వల్ల సంకరజాతి పిల్లలు పుట్టారు. ఆ “శూరులు” తమ అధికమైన బలంతో ఇతరులను పీడించేవారు. (ఆది. 6:4) వెళ్లిన ప్రతీచోట వారు విధ్వంసం సృష్టిస్తుంటే హింస ఎంతగా చెలరేగివుంటుందో ఆలోచించండి. దానివల్ల దుష్టత్వం భూమంతటా వ్యాపించడమేగాక మానవుల ఆలోచనాతీరు, వారి ప్రవర్తన పూర్తిగా దిగజారిపోయాయి. అప్పుడు, ఆ దుష్ట ప్రజలను నాశనం చేయడానికి సర్వాధికారియైన యెహోవా ఒక సమయాన్ని నిర్ణయించాడు.—ఆదికాండము 6:3, 5, 11, 12 చదవండి.a

4, 5. ఏయే విధాలుగా నేటి పరిస్థితులు నోవహు దినాల్లోని పరిస్థితుల్లాగే ఉన్నాయి?

4 నేటి పరిస్థితులు నోవహు దినాల్లోని పరిస్థితుల్లాగే ఉంటాయని యేసు ప్రవచించాడు. (మత్త. 24:37) ఉదాహరణకు, ఇప్పుడు కూడా దుష్టాత్మల ప్రభావాన్ని మనం చూస్తున్నాం. (ప్రక. 12:7-9, 12) ఈ దయ్యాలే నోవహు కాలంలో మానవ శరీరాలు దాల్చాయి. వాటికి ఇప్పుడు మానవ శరీరాలను దాల్చే సామర్థ్యం లేకపోయినా పెద్దాచిన్నా అనే తేడా లేకుండా అందరినీ తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ లైంగిక ఉన్మాదులు తెర వెనుక ఉండి, భూమ్మీద తమ ప్రభావానికి లోనుకాగల వ్యక్తుల దౌర్జన్యపూరితమైన, అనైతికమైన ప్రవర్తనను చూసి వికృతానందం పొందుతున్నారు.—ఎఫె. 6:11, 12.

5 దేవుని వాక్యం అపవాదిని “నరహంతకుడు” అని, “మరణముయొక్క బలముగలవా[డు]” అని వర్ణిస్తోంది. (యోహా. 8:44; హెబ్రీ. 2:14) కానీ, సాతాను తాను అనుకున్న ప్రతి ఒక్కరినీ చంపలేడు. అయినా ఈ క్రూరుడు మోసాన్ని, దుర్నీతిని పెంచిపోషిస్తూ ఇతరులను చంపాలనే ఆలోచనలను ప్రజల మనసుల్లో నాటుతున్నాడు. ఉదాహరణకు, అమెరికాలో పుట్టిన ప్రతి 142 మంది పిల్లల్లో ఒకరు హత్యకు గురౌతారు. నోవహు కాలంలో తగిన చర్య తీసుకున్న యెహోవా, ఇప్పుడు ఘోరమైన హింస చెలరేగిపోతుంటే దాన్ని చూస్తూ ఊరుకుంటాడని మీరనుకుంటున్నారా? ఆయన చర్య తీసుకోడా?

6, 7. నోవహు ఆయన కుటుంబం విశ్వాసాన్ని, దైవభయాన్ని ఎలా చూపించారు?

6 పరిస్థితులు అలా మారిన కొంతకాలానికి దేవుడు, భూమ్మీదున్న ప్రాణులన్నిటినీ నాశనం చేసేందుకు జలప్రళయాన్ని రప్పిస్తానని నోవహుకు తెలియజేశాడు. (ఆది. 6:13, 17) పెద్ద పెట్టె ఆకారంలో ఉండే ఒక ఓడను నిర్మించమని ఆయన నోవహుకు చెప్పాడు. దాంతో నోవహు ఆయన కుటుంబం ఆ పనిని మొదలుపెట్టారు. దేవునికి లోబడుతూ ఉండేందుకు, ఆయన తీర్పును అమలుచేసినప్పుడు సిద్ధంగా ఉండేందుకు వారికి ఏది సహాయం చేసింది?

7 బలమైన విశ్వాసం వల్ల, దైవభయం వల్ల నోవహు ఆయన కుటుంబం దేవుడు చెప్పినట్లే చేశారు. (ఆది. 6:22; హెబ్రీ. 11:7) కుటుంబ శిరస్సుగా నోవహు ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉంటూ, తన చుట్టూ ఉన్న ప్రజల చెడు ప్రవర్తనను అనుసరించలేదు. (ఆది. 6:9) అలాగే ఆ ప్రజల దౌర్జన్యపూరిత ప్రవర్తనను, తిరుగుబాటు స్వభావాన్ని తన కుటుంబం అనుసరించకూడదని, రోజువారీ పనుల్లో మునిగిపోకుండా దేవుడు తమకు అప్పగించిన పనికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని నోవహుకు తెలుసు.—ఆదికాండము 6:14, 18 చదవండి.

నోవహు ఆయన కుటుంబం సిద్ధంగా ఉన్నారు

8. నోవహు కుటుంబ సభ్యులు కూడా దైవభక్తిగలవారే అని దేన్నిబట్టి తెలుస్తోంది?

8 ఈ బైబిలు వృత్తాంతం కుటుంబ శిరస్త్సెన నోవహు గురించే చెబుతున్నా ఆయన భార్య, కుమారులు, కోడళ్లు కూడా యెహోవా ఆరాధకులే అని మనం గుర్తుంచుకోవాలి. యెహెజ్కేలు ప్రవక్త ఈ విషయాన్నే సమర్థించాడు. ఒకవేళ నోవహు తన కాలంలో జీవించివుంటే ఆయన పిల్లలు తమ తండ్రి నీతిని బట్టి రక్షించబడరని యెహెజ్కేలు అన్నాడు. ఎందుకంటే అప్పటికి నోవహు కుమారులు దేవునికి లోబడాలో వద్దో నిర్ణయించుకునేంత పెద్దవారు. కాబట్టి, వారిలో ప్రతీ ఒక్కరు దేవుని పట్ల, ఆయన మార్గాల పట్ల తమకున్న ప్రేమను నిరూపించుకొని ఉంటారు. (యెహె. 14:19, 20) నోవహు కుటుంబ సభ్యులు ఆయన నిర్దేశాన్ని పాటించారు, ఆయనలాగే విశ్వాసాన్ని చూపించారు, ఇతరుల మాటలనూ చేతలనూ బట్టి దేవుడు తమకిచ్చిన పనిని ఆపలేదు.

9. నోవహులాంటి విశ్వాసాన్ని ఎవరు చూపిస్తున్నారు?

9 నోవహును అనుకరించడానికి శాయశక్తులా కృషి చేస్తున్న క్రైస్తవ కుటుంబ శిరస్సులను చూస్తే మనకెంత ప్రోత్సాహం కలుగుతుంది! తమ కుటుంబంలోని వారికి ఆహారాన్ని, బట్టలను, వసతిని సమకూర్చడం, విద్యను అభ్యసింపజేయడం మాత్రమే సరిపోదనీ వారి ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీర్చాలనీ వారికి తెలుసు. అలా చేయడం ద్వారా కుటుంబ యజమానులు త్వరలోనే రాబోయే యెహోవా దినం కోసం సిద్ధపడుతున్నారు.

10, 11. (ఎ) ఓడలో ఉన్నప్పుడు నోవహు ఆయన కుటుంబ సభ్యులు తప్పక ఏమి అనుకొనివుంటారు? (బి) మనం ఏ ప్రశ్న వేసుకోవాలి?

10 నోవహు, ఆయన భార్య, కుమారులు, కోడళ్లు ఓడను నిర్మించడానికి దాదాపు 50 సంవత్సరాలు పనిచేసి ఉంటారు. వారు ఓడను నిర్మించేటప్పుడు ఎన్నోసార్లు దాని లోపలికి వెళ్లుంటారు. వారు దానిలోకి నీళ్లు రాకుండా చేశారు, ఆహారాన్ని నిలువచేశారు, జంతువులను లోపలికి తీసుకొచ్చారు. ఒక్కసారి ఊహించుకోండి! వారు ఎంతగానో ఎదురుచూసిన రోజు రానేవచ్చింది. అది సా.శ.పూ. 2370వ సంవత్సరంలోని రెండవ నెలలో, 17వ రోజు. నోవహు, ఆయన కుటుంబం ఓడలోకి వెళ్లారు. యెహోవా ఓడ తలుపును మూసేశాడు, వర్షం కురవడం మొదలైంది. అది కేవలం ఆ ప్రదేశంలో మాత్రమే కురిసిన భారీ వర్షం కాదు. ఆకాశమందున్న మహాగాధజలాలు ఒక్కసారే విడువబడడంతో కుండపోతగా వర్షం కురిసింది. ఆ జలాలు ఓడను బలంగా తాకాయి. (ఆది. 7:11, 16) ఆ ప్రళయానికి ఓడ బయటవున్న ప్రజలు చనిపోతున్నారు కానీ లోపల ఉన్నవారు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అప్పుడు నోవహు కుటుంబానికి ఎలా అనిపించి ఉండవచ్చు? నిజంగా వారి హృదయాలు దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోయి ఉంటాయి. ‘మనం సత్య దేవునితో నడిచి, సిద్ధంగా ఉండడం వల్ల ఎంత మేలు జరిగింది!’ అని వారు తప్పక అనుకొనివుంటారు. (ఆది. 6:9) ఇప్పుడు, మీరు హార్‌మెగిద్దోనులో రక్షించబడినట్లు, మీ హృదయం కూడా కృతజ్ఞతతో ఉప్పొంగుతున్నట్లు ఊహించుకోగలరా?

11 ఇప్పుడున్న సాతాను లోకాన్ని అంతం చేస్తానని తాను చేసిన వాగ్దానాన్ని యెహోవా తప్పక నెరవేరుస్తాడు. ఆయనను ఎవ్వరూ ఆపలేరు. మీరు ఈ ప్రశ్న వేసుకోండి: ‘దేవుడు చేసిన వాగ్దానాలన్నీ చిన్నచిన్న వివరాలతో సహా ఆయన అనుకున్న సమయంలో పూర్తిగా నెరవేరతాయని నేను బలంగా నమ్ముతున్నానా?’ అలాగైతే, అతి త్వరలో రాబోతున్న ‘యెహోవా దినాన్ని’ మనసులో ఉంచుకొని సిద్ధంగా ఉండండి.—2 పేతు. 3:11, 12.

మోషే మెలకువగా ఉన్నాడు

12. ఏ పరిస్థితులవల్ల మోషే యెహోవా ఆరాధన నుండి పక్కకు మళ్లివుండేవాడు?

12 మోషే ఉదాహరణను కూడా పరిశీలించండి. వస్తుపరంగా చూస్తే, ఆయన ఐగుప్తులో మంచి స్థితిలో ఉండివుంటాడు. ఫరో కుమార్తె దత్తత తీసుకున్న కుమారుడిగా ఆయనను ప్రజలు ఎంతో గౌరవించివుంటారు. అంతేకాక ఆయన మంచి ఆహారాన్ని భుజించాడు, నాణ్యమైన బట్టలు వేసుకున్నాడు, విలాసవంతమైన పరిసరాల మధ్య జీవించాడు, ఉన్నత విద్యను అభ్యసించాడు. (అపొస్తలుల కార్యములు 7:20-22 చదవండి.) ఆయన అక్కడే ఉంటే ఎంతో స్వాస్థ్యాన్ని వారసత్వంగా పొందివుండేవాడు.

13. దేవుని వాగ్దానాలను మోషే ఏ విధంగా ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోగలిగాడు?

13 బహుశా పసితనంలో తన తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణ వల్ల మోషే ఐగుప్తీయులు చేస్తున్న విగ్రహారాధన ఎంత అవివేకమైనదో గుర్తించివుంటాడు. (నిర్గ. 32:8) ఐగుప్తులో ఉన్న విద్యా విధానం గానీ, రాజ గృహంలో వైభవవంతమైన జీవితం గానీ మోషేను సత్యారాధన నుండి పక్కకు మళ్లించలేకపోయాయి. తన పితరులకు దేవుడు చేసిన వాగ్దానాల గురించి ఆయన ఖచ్చితంగా ఎంతో ధ్యానించివుంటాడు. అందుకే, దేవునికి ఇష్టమైనది చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎంతగానో కోరుకున్నాడు. అంతేకాదు, మోషే ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెను.”—నిర్గమకాండము 3:15-17 చదవండి.

14. మోషే విశ్వాసం, ధైర్యం ఎలా పరీక్షించబడ్డాయి?

14 మోషే దృష్టిలో సత్య దేవుడైన యెహోవా నిజమైన వ్యక్తి. యెహోవా ఐగుప్తులోని నిర్జీవమైన దేవతా విగ్రహాల వంటి వాడు కాడు. మోషే “అదృశ్యుడైనవానిని” చూస్తున్నట్లుగా జీవించాడు. దేవుడు తన ప్రజలను విడుదల చేస్తాడని మోషే నమ్మాడు. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఆయనకు తెలియదు. (హెబ్రీ. 11:24, 25, 27) ఇశ్రాయేలీయుడైన బానిసను ఓ ఐగుప్తీయుడు కొడుతున్నప్పుడు మోషే అడ్డుకున్న సందర్భాన్ని చూస్తే, హెబ్రీయులను విడుదల చేయాలనే బలమైన కోరిక ఆయనకుందని తెలుస్తోంది. (నిర్గ. 2:11, 12) అయితే ఇశ్రాయేలీయులను విడుదల చేయడానికి యెహోవా నియమించిన సమయం అది కాదు కాబట్టి, మోషే ఓ దూర దేశంలో పరదేశిగా జీవించాల్సి వచ్చింది. ఐగుప్తు రాజ గృహంలో సౌకర్యవంతమైన పరిసరాల మధ్య జీవించిన మోషేకు అరణ్యంలో జీవించడం ఎంతో కష్టమైవుంటుంది. అయినా, యెహోవా తనకు ఇచ్చిన ప్రతీ నిర్దేశాన్ని పాటించడం ద్వారా మోషే సిద్ధంగా ఉన్నాడు. అందుకే, ఆయన మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత యెహోవా ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఆయనను ఉపయోగించుకోగలిగాడు. యెహోవా చెప్పినట్లే మోషే మళ్లీ ఐగుప్తుకు వెళ్లాడు. అప్పుడు దేవుడు ఇచ్చే నియామకాన్ని నెరవేర్చడానికి, ఆయన చెప్పిన పనిని ఆయన నిర్దేశించే విధంగా నిర్వర్తించడానికి మోషేకు సమయం వచ్చింది. (నిర్గ. 3:2, 7, 8, 10) ఐగుప్తుకు వెళ్లాక ఫరోను కలవడానికి, ‘మిక్కిలి సాత్వికుడైన’ మోషేకు విశ్వాసం, ధైర్యం అవసరమయ్యాయి. (సంఖ్యా. 12:3) యెహోవా తెగుళ్లను పంపిస్తున్నప్పుడు ఒక తెగులుకూ మరో తెగులుకూ మధ్య ఎన్నిసార్లు ఫరో దగ్గరికి వెళ్లాల్సి వస్తుందో మోషేకు తెలియదు. అయినా యెహోవా చెప్పిన ప్రతీసారి మోషే ఫరో దగ్గరికి వెళ్లాడు.

15. ఆటంకాలున్నా, తన పరలోక తండ్రిని ఘనపర్చే అవకాశాల కోసం మోషే ఎలా కనిపెట్టుకొని ఉండగలిగాడు?

15 ఆ తర్వాత దాదాపు 40 సంవత్సరాల పాటు అంటే సా.శ.పూ. 1513 నుండి సా.శ.పూ. 1473 వరకు మోషేకు నిరాశలే ఎదురయ్యాయి. అయినా, ఆయన యెహోవాను ఘనపర్చే అవకాశాల కోసం చూశాడు, అలా చేయమని ఇశ్రాయేలీయులను కూడా ప్రోత్సహించాడు. (ద్వితీ. 31:1-8) ఎందుకు? ఎందుకంటే మోషే తన పేరుప్రతిష్ఠలకన్నా యెహోవా నామాన్ని, ఆయన సర్వాధిపత్యాన్ని ఎక్కువగా ప్రేమించాడు. (నిర్గ. 32:10-13; సంఖ్యా. 14:11-16) మనం కూడా నిరాశలు, ఆటంకాలు ఎదురైనా యెహోవా మార్గాలను అనుసరించడమే అత్యంత జ్ఞానయుక్తమని, నీతియుక్తమని, ప్రయోజనకరమని నమ్ముతూ ఆయన పరిపాలనను సమర్థిస్తూ ఉండాలి. (యెష. 55:8-11; యిర్మీ. 10:23) అలా చేయాలని మీరనుకుంటున్నారా?

మెలకువగా ఉండండి!

16, 17. మార్కు 13:35-37లోని మాటలకు మీరెందుకు ప్రాముఖ్యతనివ్వాలి?

16 ‘జాగ్రత్తపడండి, మెలకువగా ఉండండి, ఆ కాలమెప్పుడు వస్తుందో మీకు తెలియదు.’ (మార్కు 13:33) ఈ దుష్ట విధానాంతానికి ముందు జరిగే సంఘటనల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ఆ హెచ్చరికనిచ్చాడు. ఆయన చెప్పిన ఆ గొప్ప ప్రవచనంలోని ముగింపు మాటలను మనమిప్పుడు చూద్దాం. దాని గురించి మార్కు ఇలా రాశాడు: “ఇంటి యజమానుడు ప్రొద్దుగ్రుంకి వచ్చునో, అర్థరాత్రి వచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడి.”—మార్కు 13:35-37.

17 యేసు ఇచ్చిన ఉపదేశం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆయన రాత్రివేళ ఉండే నాలుగు జాముల గురించి చెప్పాడు. చివరి జాము దాదాపు ఉదయం మూడు గంటల నుండి సూర్యోదయం వరకు ఉంటుంది కాబట్టి, అప్పుడు మెలకువగా ఉండడం చాలా కష్టం. ఆ సమయంలో శత్రువులు ‘నిద్రపోయే’ అవకాశం ఉంది. అందుకే యుద్ధ ప్రణాళికలు వేసేవారు శత్రువు మీద దాడి చేసేందుకు అది ఎంతో అనుకూలమైన సమయమని భావిస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన చుట్టూ ఉన్న లోకం ఆధ్యాత్మికంగా గాఢనిద్రలో ఉంది కాబట్టి, మనం మెలకువగా ఉండడానికి మరింత తీవ్రంగా కష్టపడాల్సి రావచ్చు. అందుకే రాబోయే అంతం కోసం, విడుదల కోసం మనం ఎల్లప్పుడూ ‘మెలకువగా,’ ‘జాగ్రత్తగా’ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.

18. యెహోవాసాక్షులముగా మనకు ఏ శ్రేష్ఠమైన అవకాశం ఉంది?

18 మొదట్లో ప్రస్తావించబడిన వ్యక్తి బెంగాల్‌ పులి చేసిన దాడి నుండి తప్పించుకున్నాడు. అయితే అబద్ధమతం గానీ, మిగతా దుష్టవిధానం గానీ రాబోతున్న అంతం నుండి తప్పించుకోలేవని బైబిలు ప్రవచనం స్పష్టంగా తెలియజేస్తోంది. (ప్రక. 18:4-8) పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దేవుని సేవకులందరూ నోవహు ఆయన కుటుంబంలాగే యెహోవా దినం కోసం సిద్ధంగా ఉండేందుకు తాము చేయగలిగింది చేయడం ఎంత ప్రాముఖ్యమో గుర్తించాలి. దేవుడంటే అస్సలు గౌరవం లేని అబద్ధమత బోధకులు, అస్తిత్వవాదులు, నాస్తికులు వారి మాటలతో ఆయనను అపహాస్యం చేస్తున్న లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే మనం వారిని బట్టి ప్రభావితులం కాకుండా జాగ్రత్తపడాలి. మనం పరిశీలించిన ఉదాహరణలను మనసులో ఉంచుకొని, ‘పరమదేవుడు, మహాదేవుడు, పరాక్రమవంతుడు,’ భయాన్ని కలిగించే దేవుడు అయిన యెహోవాను సమర్థించి, ఆయనను ఘనపర్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉందాం.—ద్వితీ. 10:17.

[అధస్సూచి]

a ఆదికాండము 6:3లో ప్రస్తావించబడిన “నూట ఇరువది యేండ్ల” గురించి తెలుసుకోవడానికి కావలికోట డిసెంబరు 15, 2010 సంచికలోని 30వ పేజీ చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

• నోవహు తన కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలకు ఎందుకు ప్రాముఖ్యతనిచ్చాడు?

• మన కాలానికి, నోవహు కాలానికి మధ్య ఎలాంటి దగ్గరి పోలికలున్నాయి?

• నిరాశలు ఎదురైనా మోషే ఎల్లప్పుడూ యెహోవా వాగ్దానాలపై ఎందుకు మనస్సు నిలిపాడు?

• ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండమని ఏ బైబిలు ప్రవచనాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి?

[25వ పేజీలోని చిత్రం]

నోవహు ఆయన కుటుంబం యెహోవా పనికే ప్రాముఖ్యతనిస్తూ వచ్చారు

[26వ పేజీలోని చిత్రం]

యెహోవా చేసిన నమ్మదగిన వాగ్దానాల వల్ల మోషే మెలకువగా ఉండగలిగాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి