కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/15 పేజీలు 16-21
  • ‘వాక్య ప్రకారం,’ ఆనందమయంగా ‘చేసేవారు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘వాక్య ప్రకారం,’ ఆనందమయంగా ‘చేసేవారు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆనందంతో కూడిన సహనం
  • జ్ఞానాన్ని వెదకడం
  • ‘వాక్యప్రకారం చేసేవారు’ కావడం
  • శోధనలున్నా, మీ విశ్వాసానికి హత్తుకొని ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • విశ్వాసము మరియు జ్ఞానము మన కెందుకవసరము?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • యేసు తమ్ముడి నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • కష్టాలు ఎదురైనా ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/15 పేజీలు 16-21

‘వాక్య ప్రకారం,’ ఆనందమయంగా ‘చేసేవారు’

‘లోపల నాటబడి మీ ప్రాణములను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండకుండా వాక్యప్రకారం చేసేవారై ఉండండి.’—యాకోబు 1:21, 22, NW.

1. మన 1996 వార్షిక వచనాన్ని ఎలా దృష్టించాలి?

‘వాక్యప్రకారం చేసేవారై ఉండండి.’ ఈ క్లుప్త వ్యాఖ్యానం ఒక శక్తివంతమైన వర్తమానాన్ని కలిగివుంది. అది బైబిలులోని “యాకోబు వ్రాసిన పత్రిక” నుండి తీసుకోబడింది, మరి 1996 సంవత్సరమంతా ఇది యెహోవాసాక్షుల వార్షిక వచనంగా వారి రాజ్యమందిరాల్లో ప్రదర్శింపబడుతుంది.

2, 3. తన నామాన్ని కల్గివున్న పత్రికను యాకోబు వ్రాయడం ఎందుకు యుక్తమై ఉంది?

2 ప్రభువైన యేసు సహోదరుడైన యాకోబు, తొలి క్రైస్తవ సంఘంలో ప్రముఖుడు. యేసు పునరుత్థానం తర్వాత ఒక సందర్భంలో మన ప్రభువు యాకోబుకు స్వయంగా కనిపించి, ఆ తర్వాత అపొస్తలులందరికీ కన్పించాడు. (1 కొరింథీయులు 15:7) పిమ్మట, అపొస్తలుడైన పేతురు అద్భుతరీతిలో చెరసాలనుండి విడిపింపబడినప్పుడు, సమావేశమైన క్రైస్తవ గుంపుకు ఆయనిలా చెప్పాడు: ‘యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడి.’ (అపొస్తలుల కార్యములు 12:17) క్రైస్తవులుగా మారిన అన్యులకు సున్నతి చేయవలసిన అవసరం లేదని అపొస్తలులు మరియు పెద్దలు నిర్ణయించినప్పుడు ఆయన అపొస్తలుడు కాకపోయినప్పటికీ యెరూషలేములో పరిపాలక సభ జరిపిన కూటంలో యాకోబే అధ్యక్షత వహించినట్లు కనిపిస్తుంది. యాకోబు విషయాలను క్రోడీకరించాడు, పరిశుద్ధాత్మ చేత ధృవపర్చబడిన నిర్ణయం అన్ని సంఘాలకు పంపబడింది.—అపొస్తలుల కార్యములు 15:1-29.

3 యాకోబు యొక్క పరిపక్వత చెందిన తర్కం ఎంతో విలువను కలిగివుండినదన్న విషయం స్పష్టం. అయితే, ఆయన తాను “దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసు”డనని చెప్పుకున్నాడు. (యాకోబు 1:1) నేటి క్రైస్తవులకు ఆయన ప్రేరేపితపత్రిక ఎంతో చక్కని సలహాను, ప్రోత్సాహాన్ని కలిగివుంది. సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింప”బడిన తర్వాత, అంటే సేనాధిపతియైన సెస్టియస్‌ గాలస్‌ యెరూషలేముపై చేసిన రోమాసైన్యపు మొదటి దాడికి దాదాపు నాల్గు సంవత్సరాల ముందు అది పూర్తి చేయబడింది. (కొలొస్సయులు 1:23) అవి క్లిష్ట కాలాలు, యూదా జనాంగంపై యెహోవా తీర్పులు అమలు చేయబడబోతున్నాయని ఆయన సేవకులకు సంపూర్ణంగా తెలుసు.

4. తొలి క్రైస్తవులకు దేవుని వాక్యంపై గొప్ప నమ్మకం ఉండినదని ఏది చూపుతుంది?

4 ఆ క్రైస్తవులవద్ద పూర్తి హెబ్రీ లేఖనాలు మరియు గ్రీకు లేఖనాల్లో చాలా వరకు ఉండేవి. తొలి వ్రాతలను అనేకసార్లు సూచించడం ద్వారా వారు చూపుతున్నట్లు, క్రైస్తవ బైబిలు రచయితలకు నిజంగా దేవుని వాక్యంపై గొప్ప నమ్మకం ఉండేదన్న విషయం స్పష్టమే. అదే విధంగా, మనం నేడు దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా పఠించి దాన్ని మన జీవితాలలో అన్వయించుకోవలసిన అవసరం ఉంది. సహించాలంటే, పరిశుద్ధ లేఖనాలు అందించే శక్తిని, ధైర్యాన్ని మనం పొందాల్సిన అవసరత ఉంది.—కీర్తన 119:97; 1 తిమోతి 4:13.

5. మనకు నేడు ప్రత్యేకమైన నడిపింపు ఎందుకు అవసరం, మరి మనం దాన్ని ఎక్కడ కనుగొనగలం?

5 నేడు మానవజాతి, ‘లోకారంభము నుండి ఇప్పటివరకును కలుగని, ఇక ఎప్పుడును కలుగబోని శ్రమ’ యొక్క ద్వారంనొద్ద ఉంది. (మత్తయి 24:21) దేవుని నడిపింపు మీదనే మనం తప్పించుకోవడం ఆధారపడివుంది. దీన్ని మనమెలా కనుగొనగలం? దేవుని ప్రేరేపిత వాక్యం యొక్క బోధలను వినేందుకు మన హృదయాలను తెరువడం ద్వారా దీన్ని కనుగొనగలం. గతకాలాల్లో యెహోవా యథార్థ సేవకులవలె ‘వాక్యప్రకారం చేసేవారమై ఉండేందుకు’ ఇది మనకు నడిపింపునిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి, పఠించి దాన్ని యెహోవా స్తుతి కొరకు ఉపయోగించాలి.—2 తిమోతి 2:15; 3:16, 17.

ఆనందంతో కూడిన సహనం

6. మనం శ్రమలెదుర్కొన్నప్పుడు ఎందుకు ఆనందించాలి?

6 తన లేఖను ప్రారంభించడంలో, దేవుని ఆత్మ ఫలాల్లో రెండవదైన ఆనందాన్ని గురించి యాకోబు ప్రస్తావించాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.” (యాకోబు 1:2-4; గలతీయులు 5:22, 23) అనేక శ్రమలను ఎదుర్కోవడం “మహానందమని” ఎలా అనగలం? యేసు కూడా తన కొండమీది ప్రసంగంలో ఇలా చెప్పాడు: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” (మత్తయి 5:11, 12) మనం నిత్యజీవ గమ్యం వైపు వెళ్లేందుకు కృషి చేస్తుండగా, మన ప్రయత్నాలపై యెహోవా దీవెనలను చూడటంలోనే ఆనందంతోకూడిన సంతృప్తి ఉంది.—యోహాను 17:3; 2 తిమోతి 4:7, 8; హెబ్రీయులు 11:8-10, 26, 35.

7. (ఎ) సహించేందుకు మనకెలా సహాయం లభించవచ్చు? (బి) యోబువలె, మనమెలా ప్రతిఫలం పొందగలం?

7 యేసు కూడా “తనయెదుట ఉంచబడిన ఆనందము” కొరకు సహించాడు. (హెబ్రీయులు 12:1, 2) యేసు యొక్క ధైర్యవంతమైన ఉదాహరణ వైపు నిశితంగా చూస్తూ మనం కూడా సహించవచ్చు! యాకోబు తన పత్రిక చివరిబాగంలో ప్రస్తావించినట్లు, యథార్థతను కనపర్చేవారిని యెహోవా మెండుగా ఆశీర్వదిస్తాడు. “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు,” అని యాకోబు చెబుతున్నాడు. (యాకోబు 5:11) యోబుకు మంచి ఆరోగ్యం తిరిగి ఇవ్వబడినప్పుడు, తన ప్రియమైన వారితో నిండు జీవితాన్ని ఆనందించడానికి ఆయన పునరుద్దరించబడినప్పుడు ఆయన యథార్థతకు ఎలా ప్రతిఫలం లభించిందో జ్ఞాపకం చేసుకోండి. యెహోవాను ఇప్పుడు సేవించడంలో గల ఆనందానికి పరాకాష్టగా దేవుని నూతనలోకం యొక్క వాగ్దాన పరదైసులో మీ సహనముతో కూడిన యథార్థత మీకును అలాంటి ఆనందాలనే తేగలదు.

జ్ఞానాన్ని వెదకడం

8. మనం నిజమైన, ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని ఎలా కనుగొనగలం, మరి దీనిలో ప్రార్థన ఏ పాత్ర వహిస్తుంది?

8 దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధతో చదవడం, దాన్ని ఆచరణాత్మకంగా అన్వయించడం ద్వారా, క్షీణిస్తున్న సాతాను వ్యవస్థ యొక్క భ్రష్టత్వం మధ్యలో శ్రమలను సహించేందుకు మనకు వీలు కలిగించే దైవిక జ్ఞానం కలుగుతుంది. అలాంటి జ్ఞానాన్ని కనుగొనడంలో మనమెలా నిశ్చయతను కలిగి ఉండగలం? యాకోబు మనకిలా చెబుతున్నాడు: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్రతరంగమును పోలియుండును.” (యాకోబు 1:5, 6) యెహోవా మన విన్నపాలను వింటాడని మరి తన నియమిత సమయంలోను మార్గంలోను జవాబిస్తాడు అనే దృఢమైన నమ్మకంతో మనం ఎడతెగక ప్రార్థించాలి.

9. దైవిక జ్ఞానాన్ని మరి దాని అన్వయింపును యాకోబు ఎలా వర్ణిస్తున్నాడు?

9 దైవిక జ్ఞానం యెహోవానుండి వచ్చు బహుమానం. అలాంటి బహుమానాలను వివరిస్తూ, యాకోబు ఇలా చెబుతున్నాడు: “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.” తర్వాత తన పత్రికలో ఇలా చెబుతూ, నిజమైన జ్ఞానాన్ని సంపాదించడంలోని ఫలితాన్ని యాకోబు వివరిస్తున్నాడు: “మీలో జ్ఞానవివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్యప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను. . . . అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.”—యాకోబు 1:17; 3:13-17.

10. అబద్ధ మతం నిజమైన దానికి ఎలా భిన్నంగా ఉంది?

10 అబద్ధమత సామ్రాజ్యంలో ఉన్న క్రీస్తుమత సామ్రాజ్యంలోనైనా, లేక ఇతర ప్రాంతాల్లోనైనా సరే కొన్ని పాటలు పాడడం, మరల మరల పునరావృత్తం చేయబడే ప్రార్థనలను వినడం, బహుశా ఒక ప్రసంగం వినడంవంటి ఆచారం ఉంది. అనేక మతాలు ఉజ్వల భవిష్యత్తును గురించి నిరీక్షించలేకపోతున్నాయి గనుక, నిరీక్షణావర్తమానాన్ని ప్రకటించడం గురించి ఎలాంటి ప్రోత్సాహమూ ఇవ్వడంలేదు. దేవుని మెస్సీయ రాజ్యాన్ని గూర్చిన నిరీక్షణ ఎన్నడూ ప్రస్తావించబడటం లేదు లేక పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. క్రీస్తుమత సామ్రాజ్యానికి హత్తుకునే వారిని గురించి యెహోవా ప్రవచనార్థకంగా ఇలా చెబుతున్నాడు: “నా జనులు రెండు నేరములు చేసియున్నారు; జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.” (యిర్మీయా 2:13) వారివద్ద సత్యజలాలు లేవు. పరలోక జ్ఞానం లోపించింది.

11, 12. (ఎ) దైవిక జ్ఞానం మనల్ని ఎలా పురికొల్పుతుంది? (బి) దేని గురించి దైవిక జ్ఞానం మనల్ని హెచ్చరిస్తుంది?

11 యెహోవాసాక్షుల విషయంలో నేడెంత వ్యత్యాసం ఉంది! దేవుడిచ్చిన మహాశక్తితో, ఆయన రాబోయే రాజ్యాన్ని గురించిన సువార్తతో భూమ్యంతటిని నింపేస్తున్నారు. వారు మాట్లాడే జ్ఞానం దేవుని వాక్యంపై దృఢంగా ఆధారపడి ఉంది. (సామెతలు 1:20; యెషయా 40:29-31 పోల్చండి.) మన దేవుడు, సృష్టికర్తయునైనవాని దివ్య సంకల్పాలను ప్రకటించడంలో వారు నిజమైన జ్ఞానాన్ని, అవగాహనను ఆచరణాత్మకంగా ఉపయోగిస్తారు. సంఘంలో ఉన్న వారందరూ “సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, [దేవుని] చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై” ఉండాలన్నది మన కోరికై ఉండాలి. (కొలొస్సయులు 1:9) ఈ పునాదిని కలిగివుండి, ఎల్లప్పుడూ ‘వాక్యప్రకారం చేసేవారై ఉండేందుకు’ పెద్దలూ పిన్నలు కూడా పురికొల్పబడతారు.

12 దైవిక అనంగీకారానికి దారితీయగల పాపాలను గురించి “పైనుండివచ్చు జ్ఞానము” మనల్ని హెచ్చరిస్తుంది. “నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు” అని యాకోబు చెబుతున్నాడు. అవును, దైవిక సలహాను విని అన్వయించడానికి మనం వేగిరపడుతూ ఆతృతతో ఉండాలి. అయితే, “చిన్న అవయవమైన” నాలుకను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు మనం జాగ్రత్తపడాలి. ప్రగాల్భాలు పలకడం, అవివేకమైన వృధాప్రసంగం లేక తమదే సరైనదని వాదించడం ద్వారా నాలుక సూచనార్థకంగా “విస్తారమైన అడవిని” తగులబెట్టగలదు. కాబట్టి, మనం మన సహవాసాలన్నింటిలో సౌమ్యతను మరియు ఆశానిగ్రహాన్ని వృద్ధిపర్చుకోవాల్సిన అవసరం ఉంది.—యాకోబు 1:19, 20; 3:5.

13. మనం ‘వాక్యం నాటబడుటను’ అంగీకరించడం ఎందుకు ప్రాముఖ్యం?

13 ‘అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ప్రాణములను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.’ (యాకోబు 1:21, NW) డంబంతో కూడిన, వస్తుదాయకమైన, నేనే ముందు అనే జీవన విధానం మరి క్షీణిస్తున్న నైతికతలుగల ఈ అత్యాశగల లోకం త్వరలో గతించబోతోంది. “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:15-17) ‘వాక్యం లోపల నాటబడ’డానికి, మనం అనుమతించడం ఎంత ప్రాముఖ్యం! దేవుని వాక్యం అందించే జ్ఞానం, క్షీణిస్తున్న లోకం యొక్క చెడుతనానికి పూర్తిగా భిన్నంగా ఉంది. మనకు ఆ చెడుతనంలో కొంచెం కూడా వద్దు. (1 పేతురు 2:1, 2) యెహోవా యొక్క నీతియుక్తమైన మార్గాలనుండి ఎన్నడూ మరలకుండా ఉండాలని తీర్మానించుకునేందుకు, మనకు సత్యంపట్ల ప్రేమ మరియు మన హృదయాల్లో దృఢమైన విశ్వాసం నాటబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే సరిపోతుందా?

‘వాక్యప్రకారం చేసేవారు’ కావడం

14. మనం వాక్యాన్ని ‘వినే వారం’ మరియు దాని ‘ప్రకారం చేసేవారం’ కూడా ఎలా కాగలం?

14 యాకోబు 1:22నందు మనమిలా చదువుతాం: ‘మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారం చేసేవారై ఉండండి.’ ‘వాక్యప్రకారం చేసేవారై ఉండండి’! యాకోబు పత్రికలో ఈ అంశం ఎంతో ఉన్నతంగా చెప్పబడింది. మనం విని, తర్వాత ‘ఆలాగుననే’ చేయాలి! (ఆదికాండము 6:22) ఒక ప్రసంగాన్ని వినడం లేక అప్పుడప్పుడూ నామమాత్రంగా ఆరాధనలో పాల్గొనడం చాలని నేడు అనేకమంది చెబుతారు, అయితే వారు అంతకంటే ఇంకేమీ చేయరు. తాము తమ ప్రమాణాల ప్రకారంగా ‘మంచి జీవితాన్ని’ జీవిస్తున్నంత కాలం అది చాలని వారు భావించవచ్చు. అయినప్పటికీ యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) దేవుని చిత్తాన్ని చేయడంలోను, యేసు మాదిరిని అనుసరించడంలోను స్వయం త్యాగ ప్రవర్తన, సహనం అనేవి నిజక్రైస్తవులకు తప్పనిసరిగా అవసరం. “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని పునరుత్థానుడైన యేసు ఆజ్ఞాపించినప్పుడు మొదటి శతాబ్దంలో దేవుని చిత్తం వారికెలా ఉండెనో, నేడు కూడా అలాగే ఉంది. (మత్తయి 28:19) ఈ విషయంలో మీరెలా చేస్తున్నారు?

15. (ఎ) మనం ‘వాక్య ప్రకారం,’ సంతోషంగా ‘చేసేవారం’ ఎలా కాగలమో చూపుతూ యాకోబు ఏ ఉదాహరణనిచ్చాడు? (బి) కేవలం నామమాత్రపు ఆరాధన ఎందుకు సరిపోదు?

15 మనం దేవుని వాక్యంలోకి తేరిచూస్తూ ఉంటే, మనమెలాంటి వ్యక్తులమో ప్రతిబింబించడంలో అదొక అద్దంలా పనిచేయగలదు. యాకోబు ఇలా చెబుతున్నాడు: “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.” (యాకోబు 1:23-25) అవును, అతను ‘వాక్యప్రకారం’ సంతోషంగా ‘చేసేవాడై ఉంటాడు.’ అంతేకాకుండా, మన క్రైస్తవ జీవితాల్లోని ప్రతి విషయంలో మనం ‘చేసేవారమై’ ఉండటం ప్రాముఖ్యం. నామమాత్రపు ఆరాధన చాలనే ఆలోచనతో మనల్ని మనం మోసగించుకోకూడదు. ఆసక్తిగల క్రైస్తవులు సహితం అలక్ష్యం చేసి ఉండిన సత్యారాధన యొక్క కొన్ని అంశాలను గమనించాలని యాకోబు మనకు సలహానిస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.”—యాకోబు 1:27.

16. అబ్రాహాము ఏయే రీతుల్లో ‘యెహోవా స్నేహితుడయ్యాడు,’ మరి మనం ఆయన స్నేహాన్ని ఎలా పొందగలం?

16 ‘నేను దేవున్ని విశ్వసిస్తున్నా,’ అని చెప్పి ఇక అంత వరకే వదిలేయడం సరిపోదు. యాకోబు 2:19 పేర్కొంటున్నట్లు: “దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.” “విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును,” అని యాకోబు నొక్కి చెబుతున్నాడు మరియు అబ్రాహామును సూచిస్తూ ఇలా చెబుతున్నాడు: ‘విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెను, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది.’ (యాకోబు 2:17, 20-22) తన బంధువులకు సహాయసరఫరాలను అందించడం, ఆతిథ్యమివ్వడం, ఇస్సాకును బలి అర్పించేందుకు సిద్ధపడటం మరియు భవిష్యత్‌ మెస్సీయ రాజ్యమైన “పునాదులుగల ఆ పట్టణము”ను గూర్చిన దేవుని వాగ్దానంలో నిశ్చలమైన విశ్వాసముందని ‘ఒప్పుకొనడం’ కూడా అబ్రాహాము చేసిన పనులలో చేరివున్నాయి. (ఆదికాండము 14:16; 18:1-5; 22:1-18; హెబ్రీయులు 11:8-10, 13, 14; 13:2) సరైన రీతిలో, “దేవుని స్నేహితుడని” అబ్రాహాముకు “పేరుకలిగెను.” (యాకోబు 2:23) యెహోవా యొక్క నీతియుక్తమైన రాజ్యంలో మన విశ్వాసాన్ని, నిరీక్షణను మనం చురుకుగా ప్రకటిస్తుండగా, మనం కూడా ‘యెహోవా స్నేహితులంగా’ ఎంచబడతాం.

17. (ఎ) రాహాబు ‘నీతిమంతురాలిగా’ ఎందుకు ‘ప్రకటింపబడింది’, మరి ఆమెకు ఎలా ఫలితం లభించింది? (బి) ‘వాక్య ప్రకారం చేసేవారిగా తయారైన’ వారి ఏ సుదీర్ఘపట్టికను బైబిలు అందిస్తుంది? (సి) యోబుకు ఎలా ఫలితం లభించింది, ఎందుకు?

17 ‘వాక్యప్రకారం చేసేవారుగా’ తయారయ్యేవారు వాస్తవంగా ‘విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతులని యెంచబడుదురు.’ (యాకోబు 2:24) యెహోవా గొప్ప క్రియలను గురించి తాను వినిన ‘వాక్యం’లో తనకుగల విశ్వాసానికి తన క్రియలను జోడించిన వారిలో రాహాబు ఉంది. ఆమె ఇశ్రాయేలు వేగులవారిని దాచింది, వారు పారిపోడానికి సహాయం చేసింది, తదుపరి కాపాడబడటానికి ఆమె తన తండ్రి కుటుంబాన్ని సమకూర్చింది. క్రియలుగల తన విశ్వాసం తాను మెస్సీయ యొక్క పూర్వికురాలయ్యేందుకు దారితీసిందనే విషయాన్ని పునరుత్థానంలో తెలుసుకుని ఆమె ఎంతగా ఆనందిస్తుందో కదా! (యెహోషువ 2:11; 6:25; మత్తయి 1:5) తమ విశ్వాసాన్ని ప్రదర్శించడంలో, వాక్య ‘ప్రకారం చేసిన’ వారిని గురించిన ఒక పెద్ద పట్టికను హెబ్రీయులు 11వ అధ్యాయం అందిస్తుంది, మరి వారు మెండుగా దీవించబడతారు. తీవ్రమైన శ్రమల్లో కూడా ఇలా చెప్పిన యోబును మనం ఎన్నడూ మర్చిపోకూడదు: “యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.” మనం ఇదివరకే గమనించినట్లు, ఆయన విశ్వాసం మరియు క్రియలు దివ్యమైన దీవెన లభించేందుకు నడిపించాయి. (యోబు 1:21; 31:6; 42:10; యాకోబు 5:11) అదే విధంగా, ‘వాక్య ప్రకారం చేసే వారిగా’ మన సహనం నేడు యెహోవా యొక్క అంగీకార దరహాసాన్ని తెస్తుంది.

18, 19. దీర్ఘకాలం అణచివేయబడిన సహోదరులు ఎలా ‘వాక్య ప్రకారం చేసేవారయ్యారు,’ ఈ కార్యకలాపం ఏ దీవెనలను తెచ్చింది?

18 అనేక సంవత్సరాలు ఎన్నింటినో సహించిన వారిలో తూర్పు ఐరోపాలోని మన సహోదరులు ఉన్నారు. ఇప్పుడు అనేక నిర్బంధాలు తీసివేయబడటంతో, తమ క్రొత్తపరిసరాల్లో వారు వాస్తవంగా ‘వాక్య ప్రకారం చేసే వారు అయ్యారు.’ బోధన మరియు సంస్థీకరణలో సహాయపడేందుకు పొరుగు ప్రాంతాల్లోని మిషనరీలు మరియు పయినీర్లు అక్కడకు వచ్చారు. ఫిన్లాండ్‌ బ్రాంచి మరియు వాచ్‌టవర్‌ సొసైటీ యొక్క చుట్టుప్రక్కలగల ఇతర బ్రాంచీలు నిపుణులైన నిర్మాణకులను పంపారు, ప్రపంచవ్యాప్తంగా వెల్లువైన ఉదార సహోదరత్వం క్రొత్త బ్రాంచి కార్యాలయాలు మరియు రాజ్యమందిరాల నిర్మాణానికి ఆర్థికంగా సహాయపడింది.—2 కొరింథీయులు 8:14, 15 పోల్చండి.

19 దీర్ఘ కాలంగా అణచివేయబడిన ఈ సహోదరులు ప్రాంతంలో ఎంత ఆసక్తితో పనిచేశారో కదా! “అసమయమందు” తమకు లభించని అవకాశాలను ఇప్పుడు చేజిక్కించుకోవాలన్నట్లు వారు ‘ప్రయాసతో పాటుపడుతున్నారు.’ (1 తిమోతి 4:10; 2 తిమోతి 4:2) ఉదాహరణకు, అణచివేత ఎంతో కఠినంగా ఉండిన అల్బానియానందు గత ఏప్రిల్‌లో, “జీవితం ఎందుకు ఇంతగా సమస్యలతో నిండివుంది?” అనే శీర్షికగల రాజ్య వార్తను కేవలం మూడు దినాల్లో పంచిపెట్టడం జరిగింది. యేసు మరణ జ్ఞాపకార్థ దిన ఆచరణకు 3,491 మంది హాజరయ్యారు, అది వారి చురుకైన ప్రచారకులకంటే 538 రెట్లు ఎక్కువ. దీని తర్వాత అలా పంచిపెట్టడం మహత్తరంగా జరిగింది.

20. ఇటీవలి జ్ఞాపకార్థదిన హాజరు ఏమి సూచిస్తుంది, మరి అనేకులకు ఎలా సహాయం చేయవచ్చు?

20 ఇతర దేశాలు కూడా జ్ఞాపకార్థ దిన హాజరుకు గణనీయంగా తోడ్పడ్డాయి, అది ఇటీవలి సంవత్సరాల్లో 1,00,00,000 కంటే ఎక్కువకు పెరిగింది. అనేక ప్రాంతాల్లో, జ్ఞాపకార్థ దినానికి హాజరై, దాన్ని ఆచరించడం ద్వారా తమ విశ్వాసాన్ని బయల్పరచిన అనేకమంది క్రొత్తవారు, ‘వాక్య ప్రకారం చేసే వారౌతున్నారు.’ అట్టి ఆధిక్యతకు అర్హులగునట్లు క్రొత్త సహవాసులలో అనేకులను మనం ప్రోత్సహించగలమా?

21. మన వార్షిక వచనానికి అనుగుణంగా మనమే మార్గాన్ని అనుసరించాలి, ఏ గమ్యంతో?

21 మొదటి శతాబ్దంలోని ఆసక్తిగల క్రైస్తవులు మరియు ఆ తర్వాతి వారు అనేకులవలె, పరలోక రాజ్యంలోనైనా లేక భూమ్మీది రాజ్యంలోనైనా నిత్య జీవాన్ని పొందాలన్న ‘గురి యొద్దకే పరుగెత్తడంలో’ మనం కృషి సలుపుదామని తీర్మానించుకుందాం. (ఫిలిప్పీయులు 3:12-14) ఆ గమ్యాన్ని చేరడానికి మన ప్రతి ప్రయత్నం యోగ్యమైనదే. కేవలం వినేవారిగా మాత్రమే ఉండేందుకు ఇది సమయం కాదు, అయితే ‘ధైర్యం తెచ్చుకొని పని చేయడానికి’ ఇది అత్యంత ముఖ్యమైన సమయం. (హగ్గయి 2:4; హెబ్రీయులు 6:11, 12) మనం ‘వాక్యం లోపల నాటబడిన’ వారమై, ఇప్పుడు మరి రాబోయే నిత్యత్వంలో కూడా ‘వాక్య ప్రకారం,’ ఆనందమయంగా ‘చేసేవారమై’ ఉందాం.

మీరెలా జవాబిస్తారు?

◻ మనం ఆనందంతో ఎలా సహించాలి?

◻ “పైనుండి వచ్చు జ్ఞానము” ఏది, మరి మనం దాన్నెలా వెంబడించగలం?

◻ మనం ఎందుకు ‘వినువారు మాత్రమైయుండకుండా వాక్యప్రకారం చేసేవారమై ఉండాలి’?

◻ మనం ‘వాక్య ప్రకారం చేసే వారమై’ ఉండేలా ఏ నివేదికలు మనల్ని పురికొల్పాలి?

[17వ పేజీలోని చిత్రం]

మనం కూడా దైవిక బోధను వినేందుకు మన హృదయాలను తెరుద్దాం

[18వ పేజీలోని చిత్రం]

యోబు తన ప్రియమైన వారితో నిండు జీవితాన్ని ఆనందించడానికి ఆయన పునరుద్దరించబడినప్పుడు ఆయన యథార్థతకు ప్రతిఫలం లభించింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి