పాఠకుల నుండి ప్రశ్నలు
“నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి” అని చెప్పినప్పుడు శిష్యుడైన యాకోబు భావం ఏమైయుండెను?—యాకోబు 3:1.
క్రైస్తవులు సత్యాన్ని ఇతరులకు బోధించడాన్ని యాకోబు కచ్చితంగా నిరుత్సాహపర్చడం లేదు. “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అని మత్తయి 28:19, 20 నందు యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. గనుక, క్రైస్తవులందరూ బోధకులైయుండాలి. హెబ్రీ క్రైస్తవులు ఇంకా బోధకులు కాలేదు కాబట్టి అపొస్తలుడైన పౌలు వారిని గద్దించాడు. ఆయనిలా వ్రాశాడు: “కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను.”—హెబ్రీయులు 5:12.
మరయితే, యాకోబు దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘంలో ప్రత్యేక బోధనాధిక్యతలుగల వారిని ఆయన సూచిస్తున్నాడు. ఎఫెసీయులు 4:13 నందు మనమిలా చదువుతాము: “ఆయన [సంఘ శిరస్సైన యేసుక్రీస్తు] కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.” నేడున్నట్లుగానే మొదటి శతాబ్దపు సంఘాల్లో ప్రత్యేక బోధనాధిక్యతలు ఉండేవి. ఉదాహరణకు, పరిపాలక సభ “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”నికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రపంచవ్యాప్త సంఘ బోధనను పర్యవేక్షించవలసిన ప్రత్యేక బాధ్యత దానికి ఉంది. (మత్తయి 24:45) ప్రయాణ కాపరులకు, సంఘ పెద్దలకు కూడా ప్రత్యేక బోధనా బాధ్యతలున్నాయి.
దేవుని కఠినమైన తీర్పు వస్తుందనే భయం వల్ల అర్హతగల క్రైస్తవ పురుషులు బోధకుని పాత్రను అంగీకరించకూడదని యాకోబు చెబుతున్నాడా? ఎంత మాత్రం కాదు. “ఎవడైనను అధ్యక్ష్యపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని ఆపేక్షించుచున్నాడ”ని చెప్పే 1 తిమోతి 3:1 సూచిస్తున్నట్లుగా, పెద్ద యొక్క పని గొప్ప ఆధిక్యత. సంఘ పెద్దగా నియమింపబడే వ్యక్తికి ఉండవలసిన అర్హతలలో ఒకటేమిటంటే ఆ వ్యక్తి “బోధింపతగినవా”డై ఉండాలి. (1 తిమోతి 3:2) పౌలు ప్రేరేపిత మాటలను యాకోబు వ్యతిరేకించడం లేదు.
అయితే, సా.శ మొదటి శతాబ్దంలో కొందరు బోధకులుగా ఉండడానికి అర్హులు కాకపోయినప్పటికీ, నియమింపబడక పోయినప్పటికీ, వారు తమను తాము బోధకులుగా నియమించుకున్నట్లుంది. బహుశా, వారు ఆ పాత్రలో కొంత ప్రాముఖ్యత ఉన్నట్లు భావించి, వ్యక్తిగత మహిమను కోరుకుని ఉండవచ్చు. (మార్కు 12:38-40; 1 తిమోతి 5:17 పోల్చండి.) ‘ప్రధానత్వమును కోరుకున్నప్పటికీ, యోహాను నుండి గౌరవపూర్వకంగా ఏమి పొందలేకపోయిన’ దియొత్రెఫే గురించి అపొస్తలుడైన యోహాను ప్రస్తావించాడు. (3 యోహాను 9) ‘తాము చెప్పువాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరిన’ వారి గురించి 1 తిమోతి 1:7 మాట్లాడుతుంది. యాకోబు 3:1 నందలి మాటలు—బోధకులుగా ఉండగోరి చెడు ఉద్దేశం కలిగివున్న పురుషులకు ప్రాముఖ్యంగా తగినవి. అలాంటి వారు మందకు తీవ్రమైన హాని కలిగించి, తత్ఫలితంగా కఠినమైన తీర్పు పొందుతారు.—రోమీయులు 2:17-21; 14:12.
బోధకులుగా అర్హత పొంది సేవచేస్తున్న వారికి కూడా యాకోబు 3:1 మంచి జ్ఞాపిక. వారికి ఎక్కువగా ఇవ్వబడింది గనుక వారి నుండి ఎక్కువగా కోరబడుతుంది. (లూకా 12:48) యేసు ఇలా చెప్పాడు: “మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.” (మత్తయి 12:36) ఎవరి మాటలైతే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయో వారి విషయంలో అంటే నియమిత పెద్దల విషయంలో ప్రాముఖ్యంగా ఇది నిజం.
యెహోవా గొర్రెలతో తాము వ్యవహరించే విధానాన్ని బట్టి పెద్దలు లెక్క ఒప్పజెబుతారు. (హెబ్రీయులు 13:17) వారు చెప్పేది జీవితాలను ప్రభావితం చేస్తుంది. గనుక, ఒక పెద్ద తన స్వంత అభిప్రాయాలను ఉన్నతపర్చుకోవడం లేక పరిసయ్యులు చేసినట్లు గొర్రెలతో దుర్‌వ్యవహారం చేయడం వంటివి చేయకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలి. యేసు చూపించినటువంటి మిక్కటమైన ప్రేమ చూపించడానికి ఆయన ప్రయాసపడాలి. ప్రతి బోధనా సందర్భంలోను, ప్రాముఖ్యంగా న్యాయ సంబంధ విషయాల్లో ఇమిడి ఉన్నప్పుడు, ఒక పెద్ద అనాలోచితంగా పదాలను ఉపయోగించడం లేక పూర్తిగా వ్యక్తిగత ఉద్దేశాలను వ్యక్తపర్చడం వంటివి చేయకుండా తన మాటలను జాగ్రత్తగా తూచి చూసి ఉపయోగించాలి. యెహోవాపై, ఆయన వాక్యంపై, తన సంస్థ ద్వారా ఆయన ఇచ్చే నడిపింపులపై ఎక్కువగా ఆధారపడడం ద్వారా కాపరి “కఠినమైన తీర్పు”ను కాదుగాని, దేవుడిచ్చే గొప్ప దీవెనను పొందుతాడు.