మసరెట్లు ఎవరైయుండిరి?
‘సత్య దేవుడైన’ యెహోవా తన వాక్యమైన బైబిలును కాపాడాడు. (కీర్తన 31:5) కాని సత్య విరోధియైన సాతాను దాన్ని కలుషితం చేసి నాశనం చేయాలని ప్రయత్నించాడు గనుక, బైబిలు అది వ్రాయబడినట్లుగానే మనకెలా చేరింది?—మత్తయి 13:39 చూడండి.
పండితుడైన రాబెర్ట్ గార్డిస్ చేసిన ఈ వ్యాఖ్యానంలో కొంత సమాధానం దొరుకుతుంది: “మసరెట్లు లేక ‘సాంప్రదాయాన్ని కాపాడేవారు’ అని పిలువబడిన హెబ్రీ లేఖికుల పని తగినంతగా మెచ్చుకొనబడలేదు. ఈ అనామక లేఖికులు పరిశుద్ధ గ్రంథాన్ని అత్యంతాసక్తితో, ప్రేమపూర్వకమైన శ్రద్ధతో నకలు వ్రాశారు.” ఈ నకలు వ్రాసినవారిలో అనేకులు నేడు మనకు అనామకులుగానే మిగిలిపోయినప్పటికీ, మసరెట్ల ఒక కుటుంబపు పేరు మాత్రం స్పష్టంగా రికార్డు చేయబడింది—బెన్ ఆషేరు. వారి గురించి, వారి తోటి మసరెట్ల గురించి మనకేమి తెలుసు?
బెన్ ఆషేరు కుటుంబం
తొలుత హెబ్రీ భాషలో వ్రాయబడిన బైబిలు భాగం, తరచూ పాత నిబంధన అని పిలువబడేది, అది యూదా లేఖికులచే నమ్మకంగా నకలు వ్రాయబడింది. సా.శ ఆరు నుండి పది శతాబ్దాలలో, ఈ నకలు వ్రాసేవారు మసరెట్లు అని పిలువబడ్డారు. వారిపనిలో ఏమి చేరివుండేది?
శతాబ్దాల వరకు హెబ్రీ భాష హల్లులతో మాత్రమే వ్రాయబడింది, చదువరి అచ్చులను కలుపుకొనేవాడు. అయితే, అనేకమంది యూదులు ఆ భాషలో ఇక ఎంత మాత్రం సరళత కలిగిలేనందున, మసరెట్ల కాలానికల్లా హెబ్రీ భాష యొక్క సరైన ఉచ్చారణ తెలియకుండా పోయింది. బబులోను, ఇశ్రాయేలులలో ఉన్న మసరెట్ల గుంపులు అచ్చుల ఉచ్చారణా శైలులను, సరైన ఉచ్చరింపును సూచించేందుకు హల్లుల చుట్టూ పెట్టడానికి గుర్తులను కనిపెట్టారు. కనీసం మూడు విభిన్న రకాలు పెంపొందింప చేయబడ్డాయి, కాని బెన్ ఆషేరు కుటుంబానికి నివాసమైన గలిలయ సముద్రం వద్దనున్న టైబెరియస్ మసరెట్లు చేసినది ఎంతో ప్రభావం గలదిగా నిరూపించబడింది.
సా.శ ఎనిమిదవ శతాబ్దానికి చెందిన పెద్దయైన ఆషేరు మొదలుకొని, ఈ విశేషమైన కుటుంబంలో నుండి ఐదు తరాల మసరెట్లను మూలాధారాలు పట్టిక చేశాయి. ఇతరులు నెహమయ బెన్ ఆషేరు, ఆషేరు బెన్ నెహమయ, మోసెస్ బెన్ ఆషేరు, చివరిగా సా.శ. పదియవ శతాబ్దపు ఏరన్ బెన్ మోసెస్ బెన్ ఆషేరు.a హెబ్రీ బైబిలు లేఖనాల సరైన ఉచ్చరింపు ఏదని వారు అర్థంచేసుకున్నారో దాన్ని చక్కగా వ్యక్తపర్చగల వ్రాతపూర్వక గుర్తులను సంపూర్ణం చేసేవారిలో ఈ వ్యక్తులు అగ్రగాములుగా ఉండిరి. ఈ గుర్తులను పెంపొందింపజేయడానికి, వారు హెబ్రీ వ్యాకరణ విధాన మూలాన్ని నిశ్చయపర్చుకోవలసి ఉండినది. హెబ్రీ వ్యాకరణానికి నియమాల కచ్చితమైన విధానం ఎన్నడు రికార్డు చేయబడలేదు. కాబట్టి ఈ మసరెట్లు హెబ్రీ వ్యాకరణకర్తలలో మొదటి వారని చెప్పవచ్చు.
బెన్ ఆషేరు కుటుంబ సాంప్రదాయంలోని చివరి మసరెట్ అయిన ఏరన్ ఈ సమాచారాన్ని రికార్డు చేసి సవరించిన వారిలో మొదటివాడు. హెబ్రీ వ్యాకరణ నియమాల మొదటి పుస్తకమైన “సెఫెర్ దిక్‌దుకేయి హా-టె’ఆమిమ్” అనే పేరుగల దానిలో ఆయన అలా చేశాడు. రాబోయే శతాబ్దాల్లో ఇతర హెబ్రీ వ్యాకరణకర్తల పనులకు ఈ పుస్తకమే ఆధారమయ్యింది. కాని మసరెట్లు చేసిన అత్యంత ప్రాముఖ్యమైన పనిలో ఇది ఒకటి మాత్రమే. అదేమిటి?
విశేషమైన జ్ఞాపకశక్తి అవసరమైంది
బైబిలు లేఖనాల ప్రతి పదాన్ని, చివరికి ప్రతి పొల్లును కచ్చితంగా అందజేయాలన్నదే మసరెట్ల ముఖ్య ఉద్దేశమై ఉండింది. కచ్చితత్వం ఉండేలా చూసేందుకు, ప్రతి పేజీలో ఉండే ఇరుప్రక్కలలోని మార్జిన్‌లను మసరెట్లు ఉపయోగించుకొని, నకలు వ్రాసిన పూర్వికులు పొరపాటునగాని లేక కావాలనేగాని లేఖనంలో చేసిన మార్పును సూచించే సమాచారాన్ని రికార్డు చేశారు. ఈ మార్జినల్ నోట్సులలో, మసరెట్లు అసాధారణమైన పదరూపాలను, కలయికలను కూడా సూచించి, ఒక పుస్తకంలో గాని లేక మొత్తం హెబ్రీ లేఖనాల్లో గాని ఇవి ఎంత తరచుగా వచ్చాయో చూపించారు. స్థలం పరిమితంగా ఉండేది గనుక ఈ వ్యాఖ్యానాలు ఎంతో సంక్షిప్తంగా వ్రాయబడ్డాయి. అదనపు క్రాస్ చెకింగ్‌కు ఉపయోగపడేలా వారు కొన్ని పుస్తకాల మధ్య పదాన్ని, అక్షరాన్ని గుర్తుపెట్టారు. కచ్చితమైన నకలువ్రాత జరిగేలా చూడడానికి వారు బైబిలులోని ప్రతి అక్షరాన్ని కూడా లెక్కపెట్టారు.
ప్రక్క మార్జిన్‌లలోని కొన్ని సంక్షిప్త నోట్సులకు సంబంధించి పేజీ యొక్క పై మరియు క్రింది మార్జిన్‌లలో మసరెట్లు ఎంతో విస్తృతమైన వ్యాఖ్యానాలను రికార్డు చేశారు.b వారి పనిని క్రాస్ చెకింగ్ చేయడానికి ఇవి సహాయకరంగా ఉండేవి. అప్పుడు వచనాలకు సంఖ్యలు మరియు బైబిలు ప్రతిపద సూచికలు లేవు గనుక, ఈ క్రాస్ చెకింగ్ చేయడానికి మసరెట్లు బైబిలు యొక్క ఇతర భాగాలను ఎలా పరిశీలించేవారు? పై మరియు క్రింది మార్జిన్‌లలో, సూచింపబడిన పదం లేక పదాలు బైబిలులో మరోచోట ఎక్కడ కనుగొనవచ్చో వారికి గుర్తుచేయడానికి వారు సమాంతర వచనపు కొంత భాగాన్ని పట్టిక చేశారు. స్థలం కొంచెమే ఉన్నందున, ప్రతి సమాంతర వచనాన్ని వారికి గుర్తు చేసేందుకు వారు తరచూ కేవలం ఒక ముఖ్య పదాన్ని వ్రాసేవారు. ఈ మార్జినల్ నోట్సు ప్రయోజనకరంగా ఉండాలంటే ఈ లేఖికులు మొత్తం హెబ్రీ బైబిలును కంఠస్థం చేయవలసి ఉంటుంది.
మార్జిన్‌లలో మరీ పెద్దగా ఉండే లిస్టులు చేవ్రాతప్రతి మరోభాగానికి మార్చబడేవి. ఉదాహరణకు, ఆదికాండము 18:3 యొక్క ప్రక్క మార్జిన్‌లోని మసోరెటిక్ నోట్సు קלד అనే మూడు హెబ్రీ అక్షరాలను చూపిస్తుంది. ఇది 134 అనే సంఖ్యకు సమానమైన హెబ్రీ పదం. మసరెట్లకు ముందున్న లేఖికులు హెబ్రీ లేఖనాల్లో నుండి కావాలని యెహోవా నామాన్ని తీసివేసి దాని స్థానంలో “ప్రభువు” అనే పదాన్ని ఉంచిన 134 స్థలాలను సూచించే ఒక లిస్టు చేవ్రాతప్రతిలో ఎక్కడో ఒకచోట ఉంటుంది.c ఈ మార్పుల గురించి తెలిసినప్పటికీ, వారికి అప్పగింపబడిన లేఖనాలను మార్పుచేసే స్వాతంత్ర్యాన్ని మసరెట్లు తీసుకోలేదు. బదులుగా, వారు తమ మార్జినల్ నోట్సులలో ఈ మార్పులను సూచించారు. కాని మునుపటి లేఖికులు లేఖనాల్ని మార్చినప్పటికీ మసరెట్లు వాటిని మార్చకుండా ఉండేందుకు అలాంటి అత్యంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నారు? వారి పూర్వికుల నుండి వారి యూదా సంబంధ విశ్వాసం భిన్నంగా ఉండేదా?
వారేమి విశ్వసించారు?
మసరెటిక్ అభివృద్ధి యొక్క ఈ కాలంలో, యూదామతం లోతుగా పాతుకుపోయిన భావనా పోరాటంలో ఇమిడి ఉండినది. సా.శ మొదటి శతాబ్దం నుండి రబ్బీల యూదామతం తన అదుపును అధికం చేస్తున్నది. టాల్‌ముడ్ వ్రాతతో, రబ్బీలు దాని భావం చెప్పుటతో మౌకిక ధర్మశాస్త్రం యొక్క రబ్బీల తర్జుమాలకు బైబిలు లేఖనాలు రెండవ వాటిగా తయారౌతుండినవి.d గనుక, బైబిలు లేఖనాల జాగ్రత్తతోకూడిన సంరక్షణ దాని ప్రాముఖ్యతను కోల్పోయి ఉండేది.
ఎనిమిదవ శతాబ్దంలో, కరేయులు అని పిలువబడే ఒక గుంపు దీనికి వ్యతిరేకంగా ఎదురు తిరిగింది. వ్యక్తిగత బైబిలు పఠన ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, వారు రబ్బీలు మరియు టాల్‌ముడ్‌ల అధికారాన్ని వారు చెప్పే భావాలను నిరాకరించారు. వారు బైబిలు లేఖనాలను మాత్రమే తమ అధికారంగా అంగీకరించారు. ఇది ఆ లేఖనాలను కచ్చితంగా అందించడం యొక్క అవసరతను అధికం చేసింది, మసరెటిక్ అధ్యయనాలు పునర్‌నూతనం చేయబడిన ప్రేరణను పొందాయి.
రబ్బీల లేక కరేయుల నమ్మకం మసరెట్లను ఎంతమేరకు ప్రభావితం చేసింది? హెబ్రీ బైబిలు చేవ్రాతప్రతుల నిపుణుడైన ఎమ్. హెచ్. గోషేన్-గాట్స్‌టిన్ ఇలా చెబుతున్నాడు: “తాము ఒక ప్రాచీన సాంప్రదాయాన్ని కాపాడుతున్నామని, కావాలని దానిలో జోక్యం చేసుకోవడమన్నది అతిపెద్ద నేరాల్లో ఒకటై ఉండేదని . . . మసరెట్లు ఒప్పించబడ్డారు.”
బైబిలు లేఖనాలను సరైన విధంగా నకలు వ్రాయడాన్ని మసరెట్లు ఒక పరిశుద్ధమైన కార్యంగా దృష్టించారు. వారు ఇతర మతసంబంధమైన పరిస్థితులనుబట్టి వ్యక్తిగతంగా ఎంతగానో పురికొల్పబడినప్పటికీ, మసరెటిక్ పని మాత్రం అలాంటి అంశాలచే ప్రభావితం కానట్లున్నది. క్లుప్త మార్జినల్ నోట్సులు ఆధ్యాత్మిక చర్చకు ఎక్కువ అవకాశాన్నివ్వలేదు. బైబిలు లేఖనాలే వారి జీవితపు ముఖ్యాంశం; వారు వాటితో చెలగాటమాడరు.
వారి పని నుండి ప్రయోజనం పొందుట
సహజ ఇశ్రాయేలీయులు ఇక ఎంతమాత్రం దేవుని ఎన్నుకొనబడిన ప్రజలు కాకపోయినప్పటికీ, ఈ యూదా లేఖికులు దేవుని వాక్యాన్ని కచ్చితంగా కాపాడడానికే పూర్తిగా సమర్పించుకున్నారు. (మత్తయి 21:42-44; 23:37, 38) బెన్ ఆషేరు కుటుంబం మరియు ఇతర మసరెట్ల పనులను చక్కగా సమీకరించిన రాబెర్ట్ గార్డిస్, ఇలా వ్రాశాడు: “దీనులైన, కాని అజేయులైన ఆ పనివారు . . . నష్టమైపోకుండా లేక మార్పు చెందకుండా బైబిలు లేఖనాలను కాపాడడమనే ఎంతో కష్టమైన, విస్తారమైన తమ పనిని గుప్తంగా చేశారు.” (ది బిబ్లికల్ టెక్ట్స్ ఇన్ ది మేకింగ్) తత్ఫలితంగా, లూథర్ మరియు టిండేల్ వంటి 16వ శతాబ్దపు సంస్కర్తలు చర్చి అధికారాన్ని సవాలుచేసి, అందరూ చదవగలిగేలా బైబిలును సామాన్య భాషల్లోకి తర్జుమా చేయడం ప్రారంభించినప్పుడు, వారు తమ పనికి ఆధారంగా ఉపయోగించడానికి చక్కగా సిద్ధం చేయబడిన హెబ్రీ లేఖనాలు ఉండినవి.
నేడు మసరెట్ల పని మనకు ప్రయోజనం కలుగజేయడంలో కొనసాగుతోంది. వారి హెబ్రీ లేఖనాలు పరిశుద్ధ లేఖనాల నూతన లోక అనువాదానికి ఆధారాన్నిస్తున్నాయి. ప్రాచీన మసరెట్లు చూపించినలాంటి అదే సమర్పణా స్ఫూర్తితో మరియు కచ్చితత్వం కొరకైన శ్రద్ధతో ఈ తర్జుమా అనేక భాషల్లోకి అనువాదం చేయబడుతోంది. యెహోవా దేవుని వాక్యానికి శ్రద్ధ చూపించడంలో మనం కూడా అలాంటి స్ఫూర్తినే చూపించాలి.—2 పేతురు 1:19.
[అధస్సూచీలు]
a హెబ్రీ భాషలో “బెన్” అంటే “కుమారుడు” అని భావం. కాబట్టి బెన్ ఆషేరు అంటే “ఆషేరు కుమారుడు” అని భావం.
b ప్రక్క మార్జిన్‌లలో ఉండే మసోరెటిక్ నోట్సు చిన్న మసోరాలని పిలువబడేవి. పై మరియు క్రిందనున్న మార్జిన్‌లలోని నోట్సులు పెద్ద మసోరాలని పిలువబడేవి. చేవ్రాతప్రతిలో ఎక్కడో ఒక చోట ఉండేవి చివరి మసోరాలని పిలువబడేవి.
c పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదం రెఫరెన్సులతో కూడిన దాని అనుబంధంలో 1బి చూడండి.
d మౌఖిక ధర్మశాస్త్రం మరియు రబ్బీల యూదా మతంపై విస్తృత సమాచారం కొరకు, న్యూయార్క్‌లోని వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన యుద్ధంలేని లోకం ఎన్నడైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్‌లోని 8-11 పేజీలను చూడండి.
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
హెబ్రీ ఉచ్చరింపు కొరకు ఒక విధానం
మసరెట్లలో అచ్చుల గుర్తులను, ఉచ్చారణా శైలి గుర్తులను రికార్డు చేయడానికి శ్రేష్ఠమైన విధానం కొరకైన అన్వేషణ శతాబ్దాలుగా కొనసాగింది. గనుక, బెన్ ఆషేరు కుటుంబంలోని ప్రతి తరంతో అభివృద్ధి కొనసాగడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఉనికిలోవున్న చేవ్రాతప్రతులు బెన్ ఆషేరు కుటుంబంలోని కేవలం చివరి ఇద్దరు మసరెట్లెన మోసెస్, ఏరన్‌ల శైలీ విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి.e ఈ చేవ్రాతప్రతులను గూర్చి తారతమ్యము చొప్పున చేయబడిన పఠనం, ఉచ్చరింపు యొక్క మరియు సంకేతముగా గురుతులను వేయుట యొక్క కొన్ని అల్ప విషయాలపై ఏరన్ వృద్ధిచేసిన నియమాలు తన తండ్రియైన మోసెస్ వృద్ధి చేసిన వాటినుండి భిన్నంగా ఉన్నాయి.
బెన్ నఫ్తాలి, ఏరన్ బెన్ ఆషేరు సమకాలీనులు. మోసెస్ బెన్ ఆషేరు యొక్క కాయిరో కోడెక్స్ బెన్ నఫ్తాలికి చెందిన కొన్ని తర్జుమాలను కలిగివుంది. కాబట్టి, బెన్ నఫ్తాలి మోసెస్ బెన్ ఆషేరు వద్ద అధ్యయనం చేసి ఉండాలి లేదా ఇద్దరూ మరింత ప్రాచీనమైన సామాన్య సాంప్రదాయాన్ని కాపాడి ఉండాలి. అనేకమంది విద్వాంసులు బెన్ ఆషేరు మరియు బెన్ నఫ్తాలి విధానాల మధ్యనున్న తేడాల గురించి మాట్లాడతారు, కాని ఎమ్. హెచ్. గోషేన్-గాట్స్‌టిన్ ఇలా వ్రాస్తున్నాడు: “బెన్ ఆషేరు కుటుంబంలోని రెండు ఉపవిధానాల గురించి మాట్లాడడం మరియు బెన్ ఆషేరు వెర్సస్ బెన్ ఆషేరు యొక్క పఠనాల తేడాను సూచించడం కచ్చితంగానే అనిపించవచ్చు.” కాబట్టి ఒకే బెన్ ఆషేరు విధానం గురించి మాట్లాడడం అప్రామాణికం. ఏరన్ బెన్ ఆషేరు యొక్క విధానాలు అంగీకరింపబడిన చివరి విధానంగా అయ్యాయంటే దానికి కారణం వారసత్వ ఉన్నతత్వం కాదు. పన్నెండవ శతాబ్దపు టాల్‌ముడ్ విద్వాంసుడైన మోసెస్ మైమోనిడస్ ఏరన్ బెన్ ఆషేరు లేఖనాలను మెచ్చుకున్నాడు గనుక దానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.
[Artwork—Hebrew characters]
అచ్చుల గుర్తులు, భాషాసంబంధ గుర్తులుగల మరియు గుర్తులులేని నిర్గమకాండము 6:2 యొక్క భాగం
[అధస్సూచీలు]
e కేవలం మునుపటి మరియు తర్వాతి ప్రవక్తలను మాత్రమే కలిగివున్న కాయిరో కోడెక్స్ (సా.శ 895) మోషే విధానాల గురించి ఉదాహరణను అందజేస్తుంది. అలెప్పో (దాదాపు సా.శ 930) మరియు లెనిన్‌గ్రాడ్ (సా.శ 1008) కోడెక్సులు ఏరన్ బెన్ ఆషేరు విధానాలకు ఉదాహరణలుగా పరిగణింపబడతాయి.
[26వ పేజీలోని చిత్రం]
ఎనిమిది నుండి పది శతాబ్దాలలో మసరెటిక్ కార్యానికి కేంద్రమైన టైబెరియస్
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.