నేటి వరకు యెహోవాచే బోధింపబడుట
‘శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు.’—యెషయా 50:4.
1, 2. (ఎ) యెహోవా తన అభిమాన విద్యార్థిని దేని కొరకు సిద్ధం చేశాడు, దాని ఫలితమేమిటి? (బి) యేసు తన బోధల మూలాన్ని ఎలా అంగీకరించాడు?
యెహోవా దేవుడు తండ్రి అయినప్పటి నుండి బోధకునిగా ఉన్నాడు. కొంతకాలానికి ఆయన పిల్లలలో కొందరు తిరుగుబాటు చేసిన తర్వాత, ఆయన తన జ్యేష్ఠ కుమారుడైన తన అభిమాన విద్యార్థిని భూమిపై పరిచర్య కొరకు సిద్ధం చేశాడు. (సామెతలు 8:30) ఆ విద్యార్థి ఇలా చెబుతున్నట్లుగా యెషయా 50వ అధ్యాయం ప్రవచనార్థకంగా అందజేస్తుంది: “అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు.” (యెషయా 50:4) భూమిపైనున్నప్పుడు తన తండ్రి బోధను అన్వయించుకోవడం ఫలితంగా, ‘ప్రయాసపడి భారము మోస్తున్న’ వారందరికి యేసు విశ్రాంతినిచ్చే మూలముగా ఉన్నాడు.—మత్తయి 11:28-30.
2 మొదటి శతాబ్దంలో యేసు శక్తివంతమైన అనేక కార్యాలు చేశాడు. ఆయన గ్రుడ్డివారి కన్నులు తెరిచాడు, మృతులను కూడా తిరిగి లేపాడు, అయినా ఆయన తన సమకాలీనులకు ప్రాథమికంగా బోధకునిగా తెలుసు. ఆయన అనుచరులు అలాగే ఆయన వ్యతిరేకులు ఆయనను బోధకుడనే పిలిచారు. (మత్తయి 8:19; 9:11; 12:38; 19:16; యోహాను 3:2) యేసు ఎన్నడూ తాను బోధించిన దాని గురించి తానే పేరు పొందలేదు గాని వినయంగా ఇలా అంగీకరించాడు: “నేను చేయు బోధ నాదికాదు; నన్ను పంపినవానిదే.” “తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను.”—యోహాను 7:16; 8:28; 12:49.
బోధకుడు-విద్యార్థి ఆదర్శవంతమైన సంబంధం
3. తాను బోధించేవారి ఎడల యెహోవాకున్న ఆసక్తిని యెషయా ప్రవచనం ఎలా సూచిస్తుంది?
3 ఒక మేలైన బోధకుడు తన విద్యార్థులయందు వ్యక్తిగతమైన, మనస్సాక్షిపూర్వకమైన, ప్రేమపూర్వకమైన శ్రద్ధ చూపిస్తాడు. తాను ఎవరికి బోధిస్తాడో వారి ఎడల యెహోవా దేవునికి అలాంటి శ్రద్ధనే ఉందని యెషయా 50వ అధ్యాయం తెలియజేస్తుంది. ప్రవచనం ఇలా తెలియజేస్తుంది, “శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.” (యెషయా 50:4) ఇక్కడి భాష, తన విద్యార్థులకు బోధించేందుకు వారిని తొలి ఉదయాన్నే నిద్రలేపే ఉపదేశకున్ని సూచిస్తుంది. ప్రవచన అన్వయింపుపై వ్యాఖ్యానిస్తూ, ఒక బైబిలు పండితుడు ఇలా చెప్పాడు: “ఆలోచనేమిటంటే, విమోచకుడు . . . సూచనార్థకంగా చెప్పాలంటే, దేవుని పాఠశాలలో ఉండేవాడు; మరియు ఇతరులకు ఉపదేశాన్ని ఇవ్వడానికి అర్హతగలవాడు. . . . మానవజాతికి ఉపదేశకునిగా ఉండేందుకు మెస్సీయ దైవిక బోధ ద్వారా విశేషంగా అర్హుడైయుంటాడు.”
4. తన తండ్రి బోధకు యేసు ఎలా ప్రతిస్పందించాడు?
4 విద్యార్థులు తమ ఉపదేశకుని బోధకు సంపూర్ణంగా ప్రతిస్పందించేవారిగా ఉంటారు. యేసు తన తండ్రి బోధకు ఎలా ప్రతిస్పందించాడు? ఆయన ప్రతిస్పందన మనం యెషయా 50:5 నందు చదివే దీనితో పొందిక కలిగివుంది: “ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు.” అవును, యేసు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగివుండేవాడు. ఆయన ఎంతో శ్రద్ధగా వినేవాడు. అంతేగాక, తన తండ్రి తనను ఏది అడిగినప్పటికీ చేయడానికి ఆయన సుముఖత కలిగివుండేవాడు. ఆయన తిరుగుబాటు స్వభావం కలిగి లేకుండెను; బదులుగా, ఆయనిలా చెప్పాడు: “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.”—లూకా 22:42.
5. (ఎ) తాను భూమిపై పొందబోయే శ్రమల గురించి యేసుకు ముందుగానే తెలుసని ఏమి సూచిస్తుంది? (బి) యెషయా 50:6 నందలి ప్రవచనం ఎలా నెరవేర్చబడింది?
5 దేవుని చిత్తం చేయడం వల్ల ఆయనకు కలిగే ఫలితాల గురించి కుమారునికి తెలియజేయబడిందని ప్రవచనం సూచిస్తుంది. విద్యార్థి చెప్పే దీని ద్వారా అది చూపించబడింది: “కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు.” (యెషయా 50:6) ప్రవచనం సూచిస్తున్నట్లుగా, యేసు భూమిపై క్రూరంగా వ్యవహరించబడ్డాడు. “వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి” అని అపొస్తలుడైన మత్తయి వ్రాశాడు. (మత్తయి 26:67) సా.శ. 33 పస్కా పండుగ నాటి రాత్రి మతనాయకుల చేతుల్లో ఇది జరిగింది. ఆ మరునాడు, యేసు మరణించేందుకు మ్రానుపై వ్రేలాడ దీయబడక ముందు రోమా సైనికులు ఆయనను కనికరం లేకుండా కొడుతుండగా ఆయన కొట్టువారికి తన వీపును అప్పగించాడు.—యోహాను 19:1-3, 16-23.
6. యేసు తన బోధకునియందు నమ్మకాన్ని ఎన్నడూ కోల్పోలేదని ఏది చూపిస్తుంది, ఆయన నమ్మకానికి ఎలా ప్రతిఫలం లభించింది?
6 ముందుగానే బాగా తర్ఫీదు పొందిన కుమారుడు, ఎన్నడూ తన తండ్రియందు నమ్మకాన్ని కోల్పోలేదు. ప్రవచనం ప్రకారం, ఆ తర్వాత ఆయన చెప్పేదాన్ని బట్టి ఇది చూపించబడింది: “ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు.” (యెషయా 50:7) యేసు తన బోధకుని సహాయమందు ఉంచిన నమ్మకం గొప్పగా ప్రతిఫలం పొందింది. దేవుని ఇతర సేవకులందరి కంటే ఆయనకు ఉన్నత స్థానాన్నిచ్చి ఆశీర్వదించడం ద్వారా ఆయన తండ్రి ఆయనను మహిమపర్చాడు. (ఫిలిప్పీయులు 2:5-11) మనం విధేయంగా యెహోవా బోధను అనుసరిస్తూ, ‘తొలగిపోకుండా’ ఉంటే మనం కూడా గొప్ప దీవెనలు పొందగలము. ఆ బోధ మన దినం వరకు ఎలా లభ్యం చేయబడుతుందనేది మనం చూద్దాము.
విస్తృత విద్యా కార్యక్రమం
7. యెహోవా భూమిపై తన బోధను ఎలా కొనసాగింపజేశాడు?
7 మనం ముందు గమనించినట్లుగా, మొదటి శతాబ్దంలో దైవిక బోధను అందజేసేందుకు యెహోవా తన భూ ప్రతినిధియైన యేసు క్రీస్తును ఉపయోగించుకున్నాడు. (యోహాను 16:27, 28) తాను బోధించేవారి కొరకు మాదిరినుంచుతూ యేసు, తన బోధకు మూలం దేవుని వాక్యమని తదేకంగా తెలియజేశాడు. (మత్తయి 4:4, 7, 10; 21:13; 26:24, 31) ఆ తర్వాత, అలా బోధింపబడిన వారి పరిచర్య ద్వారా యెహోవా బోధ భూమిపై కొనసాగింపబడింది. యేసు వారికిలా ఆజ్ఞాపించాడని జ్ఞాపకం తెచ్చుకోండి: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20, ఇటాలిక్కులు మావి.) శిష్యులు చేయబడినప్పుడు వీరు “దేవుని మందిరము . . . జీవముగల దేవుని సంఘములో” భాగమయ్యారు. (1 తిమోతి 3:15) వారు వ్యక్తిగత సంఘాలుగా కూడా ఏర్పడ్డారు, వాటిలో వారు యెహోవాచే బోధింపబడేవారు. (అపొస్తలుల కార్యములు 14:23; 15:41; 16:5; 1 కొరింథీయులు 11:16) దైవిక బోధ ఆ విధంగా మన కాలం వరకు కొనసాగిందా?
8. అంతం రాకమునుపు భూమిపై ప్రకటనాపని నిర్వహించబడుతుందని యేసు ఎలా సూచించాడు?
8 వాస్తవానికి, అది కొనసాగింది! ఈ విధానాంతానికి ముందు గొప్ప ప్రకటనా పని జరుగుతుందని యేసు తన మరణానికి మూడు దినాల ముందు ప్రవచించాడు. ఆయనిలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” ఈ ప్రపంచ వ్యాప్త ప్రకటన మరియు బోధనా కార్యక్రమం దేని మూలంగా నిర్వహించబడుతుందో దాన్ని గురించి యేసు వర్ణించడం కొనసాగించాడు. తన సేవకులకు ఆత్మీయాహారాన్ని అందజేసే ప్రతినిధి లేక మాధ్యం వలె పని చేసే “నమ్మకమైనవాడు బుద్ధిమంతుడునైన దాసుని” గురించి ఆయన మాట్లాడాడు. (మత్తయి 24:14, 45-47) భూమియందంతటి రాజ్యాసక్తులను పర్యవేక్షించేందుకు యెహోవా దేవుడు ఈ “దాసున్ని” ఉపయోగించుకున్నాడు.
9. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని వర్గంలో ఎవరెవరు ఉంటారు?
9 నేడు, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని వర్గం రాజ్య వారసుల శేషముచే రూపొందించబడింది. వీరు “అబ్రాహాముయొక్క సంతాన”ములో భాగమైనవారు, “క్రీస్తుకు చెందిన” వారు అయిన 1,44,000 మందిలో భూమిపై మిగిలివున్న అభిషక్త క్రైస్తవులు. (గలతీయులు 3:16, 29; ప్రకటన 14:1-3) నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసున్ని మీరెలా గుర్తించగలరు? ప్రాముఖ్యంగా, వారు చేసే పనిని బట్టి మరియు దేవుని వాక్యమైన బైబిలును వారు సన్నిహితంగా అనుసరించడాన్ని బట్టి గుర్తించవచ్చు.
10. యెహోవా బోధలను వృద్ధి చేసేందుకు దాసుని తరగతి ఏ ఉపకరణాలను ఉపయోగిస్తుంది?
10 నేడు ప్రజలకు బోధించడానికి యెహోవా ఈ “దాసున్ని” తన మాద్యంగా ఉపయోగించుకుంటున్నాడు. దాసుని తరగతికి చెందినవారు 1931లో యెహోవాసాక్షులు అనే నామాన్ని ధరించారు. అప్పటినుండి లక్షలాదిమంది వారితో సహవసించి, ఆ నామాన్ని అంగీకరించి, దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించడంలో వారితో కలిశారు. కావలికోట యెహోవా రాజ్యమును ప్రకటించుచున్నది అనే ఈ పత్రిక, బోధనాపనిలో “దాసుని” ద్వారా ఏర్పాటు చేయబడిన ముఖ్య ఉపకరణం. అయితే, పుస్తకాలు, చిన్నపుస్తకాలు, బ్రోషూర్లు, కరపత్రాలు, తేజరిల్లు! పత్రిక వంటి ఇతర సాహిత్యాలు కూడా ఉపయోగింపబడుతున్నాయి.
11. “దాసుడు” ఏ పాఠశాలలను స్థాపించాడు, ఈ పాఠశాలల్లో ఒక్కొక్కటి ఏ సంకల్పాన్ని నెరవేరుస్తాయి?
11 అంతేగాక, “దాసుడు” వివిధ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాడు. వాటిలో, విదేశీ మిషనరీ సేవకొరకు యౌవన పరిచారకులను సిద్ధం చేసేందుకు ఐదు నెలలు శిక్షణనిచ్చే వాచ్‌టవర్ బైబిలు గిలియడ్ పాఠశాల, అవివాహిత పెద్దలకు మరియు పరిచారకులకు ప్రత్యేక దైవపరిపాలనా నియామకాల్లో శిక్షణనిచ్చే పరిచారకుల శిక్షణా పాఠశాల యొక్క రెండు నెలల తరగతి వంటివి చేరివున్నాయి. క్రైస్తవ పెద్దలకు మరియు పరిచారకులకు అప్పుడప్పుడు తమ సంఘ బాధ్యతల గురించి ఉపదేశింపబడే రాజ్య పరిచర్య పాఠశాల, పూర్తికాల సువార్తీకులయ్యేవారు తమ ప్రకటనా పనిలో మరింత ప్రభావవంతంగా ఉండేందుకు వారిని సిద్ధంచేసే పయినీరు సేవా పాఠశాల వంటివి కూడా ఉన్నాయి.
12. బోధనా కార్యక్రమం యొక్క ఒక వారపు అంశం ఏమిటి?
12 ప్రపంచ వ్యాప్తంగా యెహోవా ప్రజల యొక్క 75,500 కంటే ఎక్కువ సంఘాలలో నిర్వహించబడే వారపు ఐదు కూటాలు బోధనా కార్యక్రమంలోని మరో అంశం. ఈ కూటాల నుండి మీరు వీలైనంత ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారా? ఇవ్వబడే ఉపదేశం ఎడల మీరు చూపించే శ్రద్ధ ద్వారా, సూచనార్థంగా చెప్పాలంటే దేవుని పాఠశాలలో ఉన్నానని మీరు నిజంగా నమ్ముతున్నట్లు చూపిస్తున్నారా? మీ ఆత్మీయ అభివృద్ధి మీకు “శిష్యునికి తగిన నోరు” ఉందని ఇతరులకు స్పష్టం చేస్తుందా?—యెషయా 50:4; 1 తిమోతి 4:15, 16.
సంఘ కూటాల్లో బోధింపబడుట
13. (ఎ) యెహోవా నేడు తన ప్రజలకు బోధించే ఒక ప్రాముఖ్యమైన మార్గం ఏమిటి? (బి) కావలికోట ఎడల మనం మన మెప్పును ఎలా చూపించవచ్చు?
13 కావలికోటను బోధనా సహాయకంగా ఉపయోగిస్తూ, వారపు బైబిలు పఠనం ద్వారా యెహోవా ప్రాముఖ్యంగా తన ప్రజలకు బోధిస్తాడు. మీరు ఈ కూటాన్ని యెహోవాచే బోధింపబడే స్థలంగా దృష్టిస్తారా? యెషయా 50:4 ప్రాథమికంగా యేసుకు వర్తించినప్పటికీ, “శిష్యునికి తగిన నోరును” పొందేందుకు దేవుడు చేస్తున్న ఏర్పాట్లను తమకు తాము ఉపయోగించుకొనే వారందరికీ కూడా ఇది వర్తించగలదు. మీరు కావలికోటను అమూల్యమైనదిగా ఎంచుతారని చూపించడానికి ఒక మార్గం ఏమిటంటే, మీరు దాన్ని పొందిన వెంటనే వీలైనంత త్వరగా ప్రతి సంచికను చదవడమే. అప్పుడు, కావలికోట సంఘంలో పఠించబడుతున్నప్పుడు, మీరు హాజరవ్వడం ద్వారా మరియు మీ నిరీక్షణ గురించి బహిరంగంగా తెలియజేయడానికి సిద్ధంగా ఉండడం ద్వారా కూడా మీరు మీ మెప్పును చూపించవచ్చు.—హెబ్రీయులు 10:23.
14. (ఎ) కూటాలలో వ్యాఖ్యానించడం ఎందుకు అంత ప్రాముఖ్యమైన ఆధిక్యత? (బి) యౌవనులు చేసే ఎటువంటి వ్యాఖ్యానాలు ఎంతో ప్రోత్సాహకరమైనవి?
14 కూటాలలో మీరు చేసే వ్యాఖ్యానాల ద్వారా, యెహోవా యొక్క ఘనమైన బోధనా కార్యక్రమంలో మీరు భాగం వహించవచ్చని మీరు గుణగ్రహిస్తున్నారా? మనం ఒకరి కొకరం “ప్రేమ చూపించుకొనుటకును, సత్కార్యములు చేయుటకు” పురికొల్పడంలోను కూటాలలో వ్యాఖ్యానించడం కచ్చితంగా ఒక ముఖ్యమైన మార్గమే. (హెబ్రీయులు 10:24, 25) ఈ ఉపదేశ కార్యక్రమంలో పిల్లలు కూడా భాగం వహించవచ్చా? తప్పకుండా, భాగం వహించవచ్చు. పిల్లలు హృదయపూర్వకంగా చేసే వ్యాఖ్యానాలు తరచు పెద్దవారికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొన్నిసార్లు, మన కూటాలకు క్రొత్తగా వచ్చేవారు పిల్లలు చేసే వ్యాఖ్యానాల ద్వారా బైబిలు సత్యమందు మరింత గంభీరమైన ఆసక్తి కనపర్చేందుకు పురికొల్పబడ్డారు. కొంతమంది యౌవనులు వ్యాఖ్యానాలను పేరాలో నుండి సూటిగా చదవడం లేక తమ చెవిలో గుసగుసలాడుతున్న పెద్దవారి సమాధానాన్నే తిరిగి వల్లించడం వంటివాటివి అలవాటు చేసుకుంటారు. అయితే, వారి వ్యాఖ్యానాలు చక్కగా సిద్ధం చేయబడినవైతే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలా వ్యాఖ్యానించడం మన మహా ఉపదేశకునికి మరియు ఆయన ఉన్నతమైన బోధనా కార్యక్రమానికి నిజంగా ఘనతను తెస్తుంది.—యెషయా 30:20, 21.
15. పిల్లలు మరింత ప్రభావవంతంగా వ్యాఖ్యానించేలా సహాయం చేసేందుకు తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?
15 మన దేవున్ని స్తుతించడంలో భాగం వహించాలని పిల్లలు ఇష్టపడడాన్ని చూడడం ఆనందకరంగా ఉంటుంది. పిల్లల స్తుతి మాటలను యేసు విలువైనవిగా భావించాడు. (మత్తయి 21:15, 16) ఒక క్రైస్తవ పెద్ద ఇలా చెబుతున్నాడు: “నేను పిల్లవానిగా ఉన్నప్పుడు కావలికోట పఠనంలో వ్యాఖ్యానం చేయాలని ఇష్టపడేవాన్ని. నేను వ్యాఖ్యానం సిద్ధం చేసుకోవడానికి నాకు సహాయం చేసిన తర్వాత, నేను దాన్ని కనీసం ఏడుసార్లు అభ్యాసం చేయాలని మానాన్న చెప్పేవాడు.” కావలికోటలో ఎంపిక చేయబడిన పేరాలపై తమ స్వంత మాటల్లో వ్యాఖ్యానాలు సిద్ధం చేసుకోవడానికి తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు బహుశా మీ కుటుంబ బైబిలు పఠన సమయంలో సహాయం చేయవచ్చు. యెహోవా బోధనా కార్యక్రమంలో భాగం వహించడమనే, వారికున్న గొప్ప ఆధిక్యతను గుణగ్రహించేందుకు వారికి సహాయం చేయండి.
16. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ప్రయోజనం ఏమిటి, పాఠశాలలో ఎవరు పేర్లు నమోదు చేసుకోవచ్చు?
16 ఇతర క్రైస్తవ కూటాలలో ఇవ్వబడే బోధకు కూడా, సమాచారాన్ని అందజేసేవారు అలాగే ఇవ్వబడే ఉపదేశాన్ని వినేవారు ఇద్దరూ గంభీరమైన శ్రద్ధనివ్వాలి. ఇప్పటికి 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా, రాజ్య వర్తమానాన్ని మరింత ప్రభావవంతంగా అందజేసేందుకు లక్షలాదిమంది స్త్రీ పురుషులకు శిక్షణనిచ్చేందుకు వారపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను యెహోవా ఉపయోగించుకున్నాడు. కూటాలకు రావడం ఇటీవలనే ప్రారంభించిన ప్రజలు తాము క్రైస్తవ సూత్రాలకు అనుగుణ్యంగా తమ జీవితాలను కొనసాగిస్తున్నంత వరకు వారు మరియు వారితో సహా సంఘంతో చురుకుగా సహవసిస్తున్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
17. (ఎ) బహిరంగ కూటము ప్రాముఖ్యంగా ఏ సంకల్పం కొరకు స్థాపించబడింది? (బి) బహిరంగ ప్రసంగీకులు మనస్సులో ఉంచుకోవలసిన విషయాలు ఏవి?
17 బోధనా కార్యక్రమపు మరో దీర్ఘకాలిక అంశం ఏమిటంటే, బహిరంగ కూటము. దాని పేరు సూచిస్తున్నట్లుగా, ప్రాముఖ్యంగా సాక్షులు కాని వారికి ప్రాథమిక బైబిలు బోధల గురించి తెలియజేసేందుకు ఈ కూటము స్థాపించబడింది. గనుక, ప్రసంగాన్ని ఇచ్చే వ్యక్తి, వర్తమానాన్ని మొదటిసారి వినేవారికి అర్థమయ్యేలా సమాచారాన్ని అందజేయవలసి ఉంటుంది. బహుశా సాక్షులు కానివారు అర్థం చేసుకోలేని “వేరే గొఱ్ఱెలు,” “సహోదరులు,” మరియు “శేషము” వంటి పదాలను వివరించడమని దీని భావం. బహిరంగ కూటానికి హాజరయ్యే ప్రజలకు లేఖన వ్యతిరేకమైన—అయినప్పటికీ నేటి సమాజంలో అంగీకరింపబడుతున్న—నమ్మకాలు లేక జీవన విధానాలు ఉండివుండవచ్చు గనుక ప్రసంగీకుడు ఎల్లప్పుడూ యుక్తిగా వ్యవహరించాలి, అలాంటి నమ్మకాలను లేక జీవన విధానాలను ఎన్నడూ పరిహసించకూడదు.—1 కొరింథీయులు 9:19-23 పోల్చండి.
18. ఏ ఇతర వారపు సంఘ కూటాలు ఉన్నాయి, అవి ఏ సంకల్పాన్ని నెరవేరుస్తాయి?
18 సంఘ పుస్తక పఠనమనేది, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని నడిపింపు క్రింద సిద్ధం చేయబడిన సాహిత్యాలు ప్రతివారం బైబిలుతో పాటు పఠించబడే కూటము. ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకం ప్రస్తుతం అనేక దేశాల్లో చదువబడుతోంది. రాజ్య సువార్తను ప్రకటించడంలోను శిష్యులను చేయడంలోను పూర్తిగా భాగం వహించేలా యెహోవా ప్రజలను ఆయత్త పర్చేందుకు సేవా కూటము రూపొందించబడింది.—మత్తయి 28:19, 20; మార్కు 13:10.
పెద్ద కూటాలలో బోధింపబడుట
19. “దాసుడు” ప్రతి సంవత్సరం ఏ పెద్ద సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాడు?
19 నూరు కంటే ఎక్కువ సంవత్సరాలుగా, నిజ క్రైస్తవులకు బోధించేందుకు, ప్రత్యేక ప్రోత్సాహాన్నిచ్చేందుకు ‘నమ్మకమైన దాసుడు’ సమావేశాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ప్రతి సంవత్సరం అలాంటి మూడు పెద్ద కూటాలు నిర్వహించబడుతున్నాయి. ఒక సర్క్యూట్‌కు చెందిన కొన్ని సంఘాలు హాజరయ్యే ఒకరోజు సమావేశం ఉంది. సంవత్సరంలో, సర్క్యూట్ సమావేశం అని పిలువబడే రెండు రోజుల సమావేశం కూడా ప్రతి సర్క్యూట్‌కు ఉంటుంది. అంతేగాక, అనేక సర్క్యూట్లు హాజరయ్యే, జిల్లా సమావేశం అని పిలువబడే సమావేశం ఒకటి ఉంది. అప్పుడప్పుడు అంతర్జాతీయ సమావేశాలు కూడా ఉండవచ్చు. అనేక దేశాల నుండి వచ్చే అతిథి సాక్షుల ఈ పెద్ద సమావేశాలు యెహోవా ప్రజలకు నిజంగా విశ్వాసాన్ని బలపర్చేవే!—ద్వితీయోపదేశకాండము 16:16 పోల్చండి.
20. యెహోవాసాక్షుల పెద్ద సమావేశాల్లో ఏ విషయం తదేకంగా నొక్కిచెప్పబడింది?
20 అమెరికా, ఒహాయో, సీడార్ పాయింట్నందు 1922లో 10,000 మంది సమావేశమైనప్పుడు, ప్రసంగీకుని ఈ ప్రోత్సాహం ప్రతినిధులను పురికొల్పింది: “ఇది అన్ని దినాలలోకి గొప్ప దినం. చూడండి, రాజు పరిపాలిస్తున్నాడు! మీరు ఆయన ప్రచార ప్రతినిధులు. గనుక రాజును, ఆయన రాజ్యాన్ని ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.” అలాంటి పెద్ద సమావేశాలు ప్రకటనా పనిని తదేకంగా నొక్కి చెప్పాయి. ఉదాహరణకు, 1953లో న్యూయార్క్ నగరమందు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో, అన్ని సంఘాల్లోను ఇంటింటి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని గూర్చి ప్రకటన చేయబడింది. దాన్ని అమలుపర్చడం అనేక దేశాల్లో రాజ్య ప్రకటనపై ఎంతో అనుకూలమైన ప్రభావాన్ని చూపింది.
బోధించేందుకు దేవునిచే బోధించబడ్డారు
21. మనం దాని సంకల్పాన్ని మరచిపోకుండా ఏ ఆధిక్యతను అంగీకరించాలని ఇష్టపడతాము?
21 నిజంగా, నేడు యెహోవా భూమిపై అద్భుతమైన బోధనా కార్యక్రమాన్ని కలిగివున్నాడు! దాని నుండి ప్రయోజనం పొందేవారందరు దేవునిచే బోధింపబడగలరు, అవును, వారు “శిష్యునికి తగిన నోరు” ఇవ్వబడిన వారిలో చేరివుండవచ్చు. చెప్పాలంటే, దేవుని పాఠశాలలో ఉండడం ఎంతటి ఆధిక్యత! అయితే, మనం ఈ ఆధిక్యతను అంగీకరించేటప్పుడు మనం దాని సంకల్పాన్ని మర్చిపోకూడదు. యేసు ఇతరులకు బోధించగలిగేలా యెహోవా ఆయనకు బోధించాడు, యేసు తన శిష్యులకు ఎలా బోధించాడంటే వారు ఆయన చేస్తున్న పనినే మరింత విస్తృత శ్రేణిలో చేయగలిగేలా బోధించాడు. అలాగే, మనం ఇతరులకు బోధించాలనే సంకల్పంతో, యెహోవా ఘనమైన బోధనా కార్యక్రమంలో శిక్షణ ఇవ్వబడుతున్నాము.—యోహాను 6:45; 14:12; 2 కొరింథీయులు 5:20, 21; 6:1; 2 తిమోతి 2:2.
22. (ఎ) మోషేకు, యిర్మీయాకు ఏ సమస్య ఉండినది, కాని అది ఎలా పరిష్కరించబడింది? (బి) దేవుడు రాజ్య ప్రకటన సాధించబడేలా చూస్తాడనేందుకు మనం ఏ నిశ్చయతను కలిగి ఉండగలము?
22 “నేను మాట నేర్పరిని కాను,” అని మోషే చెప్పినట్లు, “మాటలాడుటకు నాకు శక్తి చాలదని” యిర్మీయా చెప్పినట్లు మీరు చెబుతారా? వారికి సహాయం చేసినట్లుగానే యెహోవా మీకూ సహాయం చేస్తాడు. “నేను నీ నోటికి తోడై” యుందును అని ఆయన మోషేకు చెప్పాడు. యిర్మీయాకు ఆయనిలా చెప్పాడు: “భయపడకుము, . . . నేను నీకు తోడైయున్నాను.” (నిర్గమకాండము 4:10-12; యిర్మీయా 1:6-8) తన శిష్యుల నోళ్లు మూయించాలని మతనాయకులు అనుకున్నప్పుడు, యేసు ఇలా చెప్పాడు: “వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయును.” (లూకా 19:40) కాని అప్పుడు రాళ్లు కేకలు వేయనవసరం లేకపోయింది, ఇప్పుడూ అవి కేకలు వేయనవసరం లేదు, ఎందుకంటే తన రాజ్య వర్తమానాన్ని అందజేసేందుకు యెహోవా తన శిష్యుల నోటిని ఉపయోగించుకుంటున్నాడు.
మీరు సమాధానమివ్వగలరా?
◻ యెషయా 50వ అధ్యాయంలో బోధకుడు మరియు విద్యార్థి యొక్క ఏ ఆదర్శవంతమైన సంబంధం ఉన్నతపర్చబడింది?
◻ ఒక విస్తృతమైన బోధనా కార్యక్రమాన్ని యెహోవా ఎలా కొనసాగించాడు?
◻ యెహోవా బోధనా కార్యక్రమంలోని కొన్ని అంశాలు ఏవి?
◻ యెహోవా బోధనా కార్యక్రమంలో భాగం వహించడం ఎందుకు ఒక గొప్ప ఆధిక్యత?
[16వ పేజీలోని చిత్రం]
పిల్లలు చేసే హృదయపూర్వక వ్యాఖ్యానాలు తరచూ పెద్దవారికి ప్రోత్సాహకరంగా ఉంటాయి