మా ఘనమైన ఆత్మీయ వారసత్వం
ఫిలిప్ ఎఫ్. స్మిత్ చెప్పిన ప్రకారం
“అంధకారమయమైన ఆఫ్రికానందంతటా వ్యాపించే ఒక కాగడా వెలిగించబడింది.” ఈ వాక్యాన్ని 1992 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకంలోని (ఆంగ్లం) 75వ పేజీలో మేము చదివి ఎంతగా ఆనందించామో! అప్పట్లో వాచ్‌టవర్ సొసైటీ అధ్యక్షుడు, సహోదరుడైన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్‌కు 1931లో మా తాతగారు, ఫ్రాంక్ డబ్ల్యు. స్మిత్ వ్రాసిన లేఖలో ఆ మాటలను వ్రాశారు. ఆయన, ఆయన తమ్ముడూ కలిసి చేసిన ప్రకటనా సందర్శనాన్ని గూర్చి నివేదించేందుకు ఆయన వ్రాశాడు.
ఆ 1992 వార్షిక పుస్తకం ఇలా వివరించింది: “కేప్ టౌన్‌కు చెందిన [దక్షిణ ఆఫ్రికా] ధైర్యశాలులైన పయినీరు ప్రచారకులు గ్రే స్మిత్, ఆయన అన్న ఫ్రాంక్, సువార్తను వ్యాపింపజేసే అవకాశాలను కనుగొనేందుకు, బ్రిటిష్ తూర్పు ఆఫ్రికాకు తమ ప్రయాణాన్ని సాగించారు. వారు తమ ఇల్లుగా కూడా ఉపయోగించుకుంటున్న డి సోటో కారును తీసుకుని, పుస్తకాలున్న 40 బాక్సులతో దాన్ని ఒక ఓడ మీదికి ఎక్కించి, కెన్యా సముద్ర తీరానున్న మోంబాసాకు సముద్రయానం సాగించారు.”
సహోదరుడైన రూథర్‌ఫోర్డ్‌కు మా తాతగారు వ్రాసిన ఉత్తరంలో మోంబాసా నుండి కెన్యా రాజధానియైన నయిరోబికి తాము సాగించిన ప్రయాణాన్ని ఇలా వర్ణించారు: “నేను ఇంతవరకూ చేయని అతి భయంకరమైన ప్రయాణాన్ని మేము ప్రారంభించాము. రోజంతా ప్రయాణిస్తే, 580 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మాకు నాలుగు రోజులు పట్టింది. . . . మట్టిదిబ్బలను చదునుపర్చేందుకు, గోతులను పూడ్చేందుకు, చక్రాలు జారిపోకుండా బురద నేలను గట్టిపర్చడానికి ఏపుగా పెరిగిన గడ్డిని నరికేందుకు మరియు చెట్లను నరికేందుకు నేను మైలు మైలుకు ఓ పార పుచ్చుకుని దిగవల్సివచ్చేది.”
నయిరోబిని చేరుకున్న తర్వాత, ఒకరి వెంబడి ఒకరు ఫ్రాంక్ మరియు గ్రేలు 21 రోజులవరకు బైబిలు ప్రచురణలను పంచిపెట్టేందుకు పనిచేశారు. “మేము విన్నదాన్నిబట్టి చూస్తే, మతపరమైన నయిరోబీని ఈ పని కదిపేసింది” అని మా తాతగారు వ్రాశారు. ఆ తర్వాత, తన రెండేండ్ల కుమారుడైన డొనొవాన్ దగ్గిరకూ మరో బిడ్డను, అంటే మా నాన్న ఫ్రాంక్ జన్మిస్తారని ఎదురుచూస్తున్న ఆయన భార్యయైన ఫిలిస్ వద్దకు రావాలని మా తాతగారు ఎంతగానో ఆశించారు. మోంబాసానుండి ప్రయాణమయ్యే మొట్టమొదటి ఓడను ఆయన ఎక్కారు, కానీ ఇంటికి చేరుకునే ముందే మలేరియా సోకి తాతగారు మరణించారు.
మా అక్క, మా తమ్ముడు, నేనూ ఆ వార్షికపుస్తకంలోని వృత్తాంతాన్ని గూర్చి ఆలోచించినప్పుడు మా మనస్సు మా ప్రియమైన నాన్నగారివైపుకు మళ్లింది. మే 1991 నందు, 1992 వార్షిక పుస్తకం అందడానికి కొన్ని నెలల క్రితమే, గుండె ఆపరేషన్ వల్ల వచ్చిన క్లిష్టస్థితివల్ల ఆయన మరణించారు. ఆయన తన నాన్నగారిని ఎన్నడూ కలవకపోయినప్పటికీ, వాళ్ల నాన్నగారికి యెహోవా దేవునిమీద ఉన్న గాఢమైన ప్రేమను ఆయన పంచుకున్నారు. తన కొడుకు 28 సంవత్సరాల తర్వాత, అంటే 1959లో తూర్పు ఆఫ్రికానందు ఓ క్రైస్తవునిగా తన అడుగుజాడలను అనుసరిస్తున్నాడని తెలిసిన్నప్పుడు ఆయన ఎంతగా ఆనందించివుంటారో కదా!
నాన్నగారి తొలి జీవితం
మా నాన్నగారు జూలై 20, 1931, కేప్ టౌన్‌లో, వాళ్ల నాన్నగారు మరణించిన రెండు నెలలకు జన్మించారు, నాన్నగారికి ఆయన పేరునే పెట్టడం జరిగింది. పసితనం నుండి కూడా, నాన్నగారు యెహోవా ఎడల ప్రేమను కనపర్చారు. కేవలం, తొమ్మిది ఏళ్లప్పుడే, ఆయన ముఖ్యమైన కేప్ టౌన్ రైల్వే స్టేషన్‌లో సాక్ష్యపు పనిచేసేవారు, మరి ఆయన తోటి పాఠశాల విద్యార్థులు ఆయనను హేళన చేసేవారు. సుమారు 11 ఏళ్లప్పుడు, ఆయన తన సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించారు. కొన్నిసార్లు పరిచర్యలో ఒక వీధియంతటిలోనూ నాన్నగారు ఒంటరిగా పని చేసేందుకు నియమించబడేవారు. ఆయన 18 ఏళ్లవాడయ్యేటప్పటికీ, కేప్ టౌన్ పరిసర ప్రాంతంలో వయస్సుమళ్లిన కొందరు వృద్ధ సహోదరీల గుంపుతో ఆయన కావలికోట పఠనాన్ని నిర్వహించేవారు.
తర్వాతి సంవత్సరం ఐరోపాలో అంతర్జాతీయ సమావేశాలు జరగబోతున్నాయని వాచ్‌టవర్ సొసైటీ 1954లో ప్రకటించింది. మా నాన్నగారు వెళ్లాలని ఎంతగానో కోరుకున్నారు, కానీ కేప్ టౌన్ నుండి ప్రయాణించేందుకు ఆయన వద్ద సరిపడా డబ్బులేదు. కనుక, ఉత్తర రొడేసియా (నేటి జాంబియా) రాగి ఘనులలో ఆయన రసాయనికునిగా పనిచేస్తానని ఒప్పందం చేశారు. ఈ ఖనిజ పదార్థం ఉందా లేదా అనే విషయాన్ని పరీక్షించే సదుపాయాలున్న స్థలం ఆఫ్రికా అడవిలో ఉండేది.
ఉత్తర రొడేసియానందు అనేకమంది ఆఫ్రికా సాక్షులున్నారని నాన్నగారికి తెలుసు, కనుక ఆయన అక్కడికి చేరుకుని వారికొరకు వెతికి వారు తమ కూటాలను జరుపుకునే ప్రాంతపు వివరాలను తెలుసుకున్నారు. ఆయన వారి ప్రాంతీయ భాషను మాట్లాడలేకపోయినప్పటికీ, ఆయన వారితో సహవసించి, యెహోవాసాక్షుల మైన్ సంఘానికి క్రమంగా హాజరయ్యేవారు. గనుల వద్ద ఉన్న ఐరోపావారు వర్గపరంగా దురభిమానం గలవారు, మరి వారు ఆఫ్రికా దేశీయులను మౌఖికంగా దాడిచేయడం ద్వారా వారు తమ దురభిమానాన్ని కనపర్చేవారు. అయితే నాన్నగారు మాత్రం ఎల్లప్పుడూ దయాపూర్వకంగా ఉండేవారు.
మూడు నెలలు ముగుస్తుండగా, సాక్షికాని ఓ ఆఫ్రికా పనివాడు నాన్న దగ్గిరకు వచ్చి ఇలా అడిగాడు: “మేము మిమ్మల్ని ఏమని పిలుస్తామో మీకు తెలుసా?” ఆ మనిషి నవ్వుతూ ఇలా చెప్పాడు: “మేము మిమ్మల్ని బ్వానా వాచ్‌టవర్ [గారు] అని పిలుస్తున్నాము.”
ఐరోపానందు 1955లో జరిగిన “విజయోత్సాహ రాజ్యం” అనే సమావేశాలకు నాన్నగారు హాజరవ్వగలిగారు. అక్కడ ఆయన మేరీ జహరియును కలిశారు, ఆ తర్వాతి సంవత్సరం ఆమె ఆయన భార్య అయ్యింది. వారి వివాహం తర్వాత, వాళ్లు అమెరికానందలి, ఒహాయో, పార్మాలో స్థిరపడ్డారు.
తూర్పు ఆఫ్రికాకు
అమెరికాలోని జిల్లా సమావేశ సమయంలో, పరిచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు సదస్యులు ఆహ్వానించబడ్డారు. మా తలిదండ్రులు తూర్పు ఆఫ్రికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాచ్‌టవర్ సొసైటీ వారు దేన్ని చేయమని సలహానిచ్చారో దాన్నే వారు చేశారు. ఉద్యోగులయ్యేందుకు అనుమతి ఉన్నవారు మాత్రమే అక్కడ ఉండగలరు కనుక, నాన్నగారు ఉద్యోగం సంపాదించడంలో విఫలమైతే తిరిగి రావడానికి టిక్కెట్టును కొనుక్కునేందుకు సరిపడా డబ్బును వాళ్లు దాచుకున్నారు.
పాస్పోర్టులూ వీసాలూ అంతర్నివేశనములను 1959 జూలై నెలలో పొందిన తర్వాత, అమ్మానాన్నలు కేప్ టౌన్ మీదుగా న్యూయార్క్ పట్టణం నుండి మోంబాసాకు వ్యాపార ఓడలో వెళ్లారు. ఆ ప్రయాణానికి నాలుగు వారాలు పట్టింది. మోంబాసాలోని రేవు వద్ద, అవసరత ఎక్కువగా ఉన్నందుకు వీరికంటే ముందే అక్కడికి వెళ్లిన క్రైస్తవ సహోదర సహోదరీల అనురాగంతో కూడిన ఆహ్వానాన్ని పొందారు. వారు నయిరోబిని చేరుకున్నప్పుడు, తనకొరకు ఒక ఉత్తరం వేచివుండడం నాన్నగారు చూశారు. యుగాండానందలి ఎన్‌టెబిలో భూగర్భశాస్త్ర పరిశోధక విభాగంలో కెమిస్ట్‌గా పనిచేస్తానని కోరుతూ తాను వ్రాసిన ఉత్తరానికి అది జవాబు అన్నమాట. అమ్మానాన్నలు యుగాండాలోని కంపాలాకు రైలులో వెళ్లారు, అక్కడ నాన్నగారికి ఇంటర్వ్యూ జరిగింది, మరి ఆయనను ఉద్యోగంలో చేర్చుకున్నారు. ఆ సమయంలో, ఎన్‌టెబి-కంపాలా ప్రాంతంలో, జార్జ్ కాడు అనే ఒకేఒక సాక్షి ఉండేవాడు.
కొలొనియల్ ప్రభుత్వం, ప్రాంతీయ భాషయైన లుగాండాను నేర్చుకునేందుకు నాన్నకు డబ్బు ఇచ్చింది. పరిచర్యలో మరింత ప్రభావవంతంగా ఉండేందుకుగాను దాన్ని నేర్చుకోవాలని ఆయన ముందే అనుకున్నారు కనుక, అందుకు ఆయన సంతోషించారు. తర్వాత, “ఈ రాజ్య సువార్త” అనే చిన్నపుస్తకాన్ని లుగాండా భాషలోకి అనువదించేందుకు కూడా నాన్నగారు సహాయపడ్డారు.
ఇతరులకు సాక్ష్యమివ్వడంలో నాన్నగారు భయపడేవారు కాదు. తన విభాగంలోని ఐరోపా దేశీయులందరితో ఆయన మాట్లాడారు, మరి యుగాండన్లకు క్రమంగా ప్రకటించేవారు. యుగాండాలోని ఆఫ్రికా అటార్నీ జర్నల్‌కు కూడా ఆయన సాక్ష్యమిచ్చారు. ఆ వ్యక్తి రాజ్య వర్తమానాన్ని వినడమే కాకుండ అమ్మా నాన్నలను భోజనానికి కూడా ఆహ్వానించాడు.
మా అక్క అంతీ 1960లో జన్మించింది, ఇక నేను 1965లో జన్మించాను. కంపాలా రాజధానినందున్న చిన్నదైనప్పటికీ వృద్ధిచెందుతున్న సంఘంలోని సహోదర సహోదరీలతో మా కుటుంబం ఎంతో సన్నిహితమైంది. ఎన్‌టెబికి సమీపంలో ఉన్న ఏకైక శ్వేతజాతి సాక్షులుగా, మాకు కొన్ని ఆహ్లాదకరమైన అనుభవాలున్నాయి. ఒకసారి మా నాన్నగారి స్నేహితుడు అనుకోకుండా ఎన్‌టెబి వద్ద ఆగి నాన్నగార్ని కలిసేందుకు ప్రయత్నించాడు. “ఐరోపానుండి వచ్చిన యెహోవాసాక్షులకు చెందిన దంపతులు మీకు తెలుసా?” అని అడిగేంతవరకూ ఆయన వాళ్లను కనుక్కోలేకపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆయనను నేరుగా మా అమ్మానాన్నల ఇంటికి తీసుకెళ్లాడు.
రెండు సాయుధ వ్యతిరేకతలను సహించడంతోపాటు, కష్టతరమైన పరిస్థితులను కూడా మేము అనుభవించాము. ఒకసారి ఓ నరవర్గ గుంపును ప్రభుత్వ దళాలు ఇష్టంవచ్చినట్లు కాలుస్తున్నాయి. రాత్రింబవళ్లూ ఎడతెగకుండా కాల్పులు జరిపారు. ఉ. 6.00 నుండి సా. 6.00 వరకూ కర్ఫ్యూ ఉండేది కనుక, ఎన్‌టెబిలోని మా అమ్మానాన్నల ఇంట్లో మధ్యాహ్నా కూటాలు జరిగేవి.
పిదప కర్ఫ్యూ ఎత్తేసిన తర్వాత, కంపాలాలో కావలికోట పఠనం కొరకు నాన్నగారు మమ్మల్ని తీసుకు వెళ్లారు. ఓ సైనికుడు రైఫిల్‌ను మా వైపు గురిపెట్టి, మా కారును ఆపి, మేమెక్కడికి వెళుతున్నామో చెప్పమని పట్టుపట్టాడు. నేనప్పటికీ ఇంకా పసివాణ్ణే, మరి అంతీకి అయిదేళ్లు. నాన్నగారు మా బైబిళ్లనూ సాహిత్యాలనూ ఆ సైనికునికి చూపిస్తూ నెమ్మదిగా వివరించినప్పుడు, అతను మమ్మల్ని వెళ్లనిచ్చాడు.
సుమారు యుగాండాలో ఎనిమిది సంవత్సరాలున్న తర్వాత, అంటే 1967లో మా అమ్మానాన్నలు, ఆరోగ్య సమస్యలూ కుటుంబ బాధ్యతల వల్ల అమెరికాకు తిరిగిరావాలని నిర్ణయించుకున్నారు. మేము ఒహాయో సంఘంలోని కాన్‌ఫీల్డ్‌లో భాగమయ్యాము, అక్కడ నాన్నగారు ఓ పెద్దగా సేవచేసేవారు. కంపాలాలోని చిన్న సంఘంలోని వారిని మా అమ్మానాన్నలు ఎంతగా ప్రేమించేవారో వీరిని కూడా అంతగా ప్రేమించడం ప్రారంభించారు.
ప్రేమపూర్వక క్రైస్తవ పెరుగుదల
మా తమ్ముడు డేవిడ్ 1971లో జన్మించాడు. మేము ప్రేమానురాగాలతో నిండిన ఇంటి వాతావరణంలో పెరిగాము. మా అమ్మానాన్నలు ఒకరి ఎడల ఒకరుగల ప్రేమపూర్వకమైన సంబంధం నుండే ఇది వచ్చిందనడంలో సందేహం లేదు.
మేము పసివాళ్లుగా ఉన్నప్పుడు, పడుకునే ముందు నాన్నగారు ఎప్పుడూ బైబిలు కథలను మాకు వినిపించేవారు, ప్రార్థించేవారు, ఆ తర్వాత అమ్మకు తెలియకుండా మెరిసే కాగితంలో చుట్టిన చాక్లేటును ఇచ్చేవారు. మేము ఎక్కడ ఉన్నప్పటికీ, ఎల్లప్పుడు కావలికోటను కుటుంబంగా కలిసి చదువుకునేవాళ్లం. మేము సెలవులకు వెళ్లినప్పుడు, ఒకసారి కొండ తట్టున, మరో సందర్భంలో మహా సముద్రపు అద్దరిన మేము పఠించాము. అవి నాన్నగారి ఆనందమయ స్మృతుల్లో కొన్ని అని ఆయన తరచూ చెప్పేవారు. కుటుంబ పఠనం తీసుకువచ్చే గొప్ప ఆనందాన్ని పొందలేకపోతున్న వారిని గూర్చి తాను బాధపడుతున్నారని ఆయన చెప్పారు.
యెహోవాకు ప్రేమను కనపర్చడం విషయం వచ్చేసరికి, నాన్న తన మాదిరి ద్వారా మాకు నేర్పించారు. కావలికోట లేక తేజరిల్లు! పత్రికల కొత్త ప్రతి వచ్చిన వెంటనే లేక ఏదైనా వాచ్‌టవర్ ప్రచురణను పొందిన వెంటనే, నాన్న ఎంతో ఆసక్తితో వాటిని పూర్తిగా చదివేవారు. బైబిలు సత్యాలను మనం ఎన్నడూ తేలికగా తీసుకోకూడదని, బదులుగా వాటిని అమూల్యమైన సంపదగా ఎంచాలని మేము ఆయననుండి నేర్చుకున్నాము. మా దగ్గిర ఉన్న అతి అమూల్యమైన సంపద నాన్నగారి రెఫరెన్స్ బైబిలు. ఇంచుమించు ప్రతి పేజీ కూడా ఆయన పఠనంలో సేకరించుకున్న నోట్సుతో నిండి ఉంటుంది. ఆయన మార్జిన్లలో వ్రాసిన ఈ వ్యాఖ్యానాలను మేము ఇప్పుడు చదివితే, ఇప్పటికీ ఆయన బోధిస్తున్నట్లుగా సలహానిస్తున్నట్లుగా మాకు వినిపిస్తుంది.
అంతము వరకూ నమ్మకంగా ఉండడం
మే 16, 1991 నాడు ప్రాంతీయ సేవ చేస్తుండగా, నాన్నగారికి గుండెపోటు వచ్చింది. అనేక వారాల తర్వాత, ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, అది బాగానే విజయవంతంగానే జరిగినట్లనిపించింది. కానీ, శస్త్రచికిత్స చేసిన మరునాడు రాత్రి, ఆసుపత్రి నుండి మాకు ఫోన్ వచ్చింది. నాన్నకు రక్తం ఆగడం లేదు, డాక్టర్లు ఎంతో చింతిస్తున్నారు. రక్తం పోకుండా ఆపేందుకు ఆ రాత్రి ఆయనను రెండుసార్లు శస్త్రచికిత్స చేసేందుకు తీసుకువెళ్లారు. నాన్నకు రక్తం గడ్డకట్టడం లేదు.
మరునాడు, నాన్న పరిస్థితి క్షీణించిపోతుండగా, నాన్నకు రక్తమార్పిడి చేసేందుకు ఒప్పించడానికి మొదట మా అమ్మపై ఆ తర్వాత మా తమ్మునిపై ఏకాంతంగా ఒత్తిడి తీసుకువచ్చేందుకు వారితో మాట్లాడారు. అయితే, అంతకుముందే ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్తమార్పిడిని అంగీకరించనని నాన్నగారు డాక్టర్లతో చెప్పారు. తాను రక్తాన్ని వద్దంటున్నందుకు గల లేఖనాధార కారణాలను ఆయన వివరించారు, కానీ ఆయన రక్తం లేని ప్రత్యామ్నాయాలను అంగీకరిస్తానని చెప్పారు.—లేవీయకాండము 17:13, 14; అపొస్తలుల కార్యములు 15:28, 29.
వైద్య సిబ్బందిలోని అనేకమంది సభ్యుల మనస్సుల్లో దాగివున్న ద్వేషం, ఐసియులో (ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో) తీవ్రమైన వాతావరణాన్ని సృష్టించింది. ఇది, దానితో మా నాన్నగారి క్షీణిస్తున్న పరిస్థితి, కొన్ని సార్లు వీటన్నింటినీ మేము భరించలేమేమో అన్నట్లుగా అనిపించేది. సహాయంకొరకు మేము యెహోవాను వేడుకున్నాము, అంతేకాకుండ మేము పొందిన ఆచరణాత్మక సలహాలను అన్వయించుకునేందుకు ప్రయత్నించాము. కనుక ఐసియులోకి వెళ్లేటప్పుడు, మేము ఎల్లప్పుడూ చక్కగా దుస్తులను ధరించి వైద్య సిబ్బందితో గౌరవ పూర్వకంగా మాట్లాడేవాళ్లం. అర్థవంతమైన ప్రశ్నలను అడుగుతూ నాన్నగారి ఆరోగ్యంలో మేము ఎంతో ఆసక్తిని కనపర్చాము, మరి నాన్నగారిని చూసుకునే వారిలో సభ్యులందరి ఎడల కృతజ్ఞతలు చెల్లించాము.
మా ప్రయత్నాలను వైద్య సిబ్బంది గమనించక మానలేదు. కొద్దిరోజుల్లో, ఈ తీవ్రమైన వాతావరణం దయాపూర్వకమైనదానిగా మారింది. నాన్నగార్ని చూసుకున్న నర్సులు, ఇక ఆయనను చూసుకునే నియామకం లేకపోయినా ఆయన ఎంతగా కోలుకుంటున్నారో గమనిస్తూ ఉండేవారు. మాతో చాలా కర్కశంగా ప్రవర్తించిన ఓ డాక్టర్, ఎంత మెతకయ్యాడంటే, ఈ పరిస్థితిని అమ్మ ఎలా తాళుకుంటుందోనని ఆమెను ఆయన అడిగాడు. మా సంఘం వాళ్లు మరియు బంధువులు మాకు ప్రేమపూర్వకమైన మద్దతునిచ్చారు. వారు మాకు భోజనాన్ని, ఓదార్పు కార్డులనూ పంపించారు, మా కొరకు ప్రార్థించారు.
విషాదకరంగా, నాన్నగారు ఈ చికిత్సకు ఎన్నడూ ప్రతిస్పందించలేదు. మొదటిసారి శస్త్రచికిత్స చేసిన పదిరోజుల తర్వాత ఆయన మరణించారు. నాన్న చనిపోయినందుకు మేము ఎంతో దుఃఖిస్తున్నాము. ఆయనను కోల్పోయిన భావన మరీ తీవ్రంగా ఉంటుంది. ఆనందదాయకంగా, ప్రతిదినమూ ‘మన భారము భరించు’దునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మరి మేము మునుపెన్నటికన్నాకూడా ఆయన మీద ఎక్కువగా ఆధారపడేందుకు నేర్చుకున్నాము.—కీర్తన 68:19.
నూతనలోకంలో నాన్నగారిని చూసే ఆనందాన్ని పొందేందుకు మేము కూడా యెహోవాను నమ్మకంగా సేవిస్తూనే ఉండాలని మేమందరమూ నిర్ణయించుకున్నాము.—మార్కు 5:41, 42; యోహాను 5:28; అపొస్తలుల కార్యములు 24:15.
[21వ పేజీలోని చిత్రం]
కేప్ టౌన్‌లోని ఆయన తల్లి, ఫిలిస్‌తో ఫ్రాంక్ స్మిత్
[22వ పేజీలోని చిత్రం]
తమ వివాహ సమయంలో మా అమ్మానాన్నలు
[23వ పేజీలోని చిత్రం]
ఎన్‌టెబి నందలి మొట్టమొదటి బాప్తిస్మానికి అక్కడి సహోదరులు ఆఫ్రికా అధికారి నీటి మడుగును అద్దెకు తీసుకున్నారు
[23వ పేజీలోని చిత్రం]
పారంపర్య విధంలో నమస్కరించడం
[24వ పేజీలోని చిత్రం]
నాన్నగారు మరణించే కొద్ది రోజుల ముందు అమ్మనాన్నలు