యెహోవా—బోధించే దేవుడు
‘వారందరును దేవుని [“యెహోవా,” NW] చేత బోధింపబడుదురు.’—యోహాను 6:45.
1. యేసు ఎక్కడ సూచక క్రియలు చేశాడు, ఆయన ఇప్పుడు అక్కడ ఏమి చేస్తున్నాడు?
యేసు క్రీస్తు ఇటీవలనే సూచక క్రియలు చేశాడు, ఇప్పుడు గలిలయ సముద్రం సమీపాన కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తూ కనిపిస్తున్నాడు. (యోహాను 6:1-21, 59) “పరలోకమునుండి దిగి వచ్చితిని” అని ఆయన చెప్పినప్పుడు అనేకులు అపనమ్మకాన్ని వెలిబుచ్చారు. వారిలా సణిగారు: “ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తలిదండ్రులను మన మెరుగుదుముగదా?—నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడు.” (యోహాను 6:38, 41, 42) వారిని గద్దిస్తూ యేసు ఇలా ప్రకటించాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.”—యోహాను 6:44.
2. పునరుత్థానాన్ని గూర్చి యేసు చేసిన వాగ్దానాన్ని విశ్వసించడానికి ఏ ఆధారం ఉంది?
2 దేవుని రాజ్యం పరిపాలించేటప్పుడు, అంత్యదినమున పునరుత్థానం చేయబడడం—ఎంత అద్భుతమైన వాగ్దానం! తండ్రియైన యెహోవా దేవుని హామీ దానికి ఉంది గనుక మనం ఈ వాగ్దానాన్ని నమ్మవచ్చు. (యోబు 14:13-15; యెషయా 26:19) వాస్తవానికి, మృతులు లేపబడతారని బోధించే యెహోవా “అందరికంటే గొప్ప బోధకుడు.” (యోబు 36:22, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) తండ్రి బోధవైపుకు శ్రద్ధ మళ్లిస్తూ యేసు ఆ తర్వాత ఇలా చెబుతాడు: “వారందరును దేవుని [యెహోవా] చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది.”—యోహాను 6:45.
3. మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాము?
3 “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు” అని ప్రవక్తయైన యెషయా ఎవరి గురించి వ్రాశాడో వారి మధ్య ఉండడం నిజంగా ఒక ఆధిక్యతే. (యెషయా 54:13) మనమలా ఉండగలమా? ఆయనకు కుమారుల వలె ఉండి ఆయన ఉపదేశాలను పొందిన వారెవరు? యెహోవా ఆశీర్వాదాన్ని పొందగలిగేలా మనం తెలుసుకొని వాటి ప్రకారం ప్రవర్తించవలసిన ఆయన ప్రాముఖ్యమైన బోధలు ఏవి? యెహోవా గతంలో ఎలా బోధించాడు, నేడు కూడా ఆయన అలాగే బోధిస్తున్నాడా? ఇవి మనం పరిశీలించబోయే ప్రశ్నలు.
తండ్రి, బోధకుడు, భర్త
4. యెహోవా బోధలను పొందడంలో ఆయన కుమారులలో ఎవరు మొదటి వారు?
4 యెహోవా తన అద్వితీయ కుమారున్ని, మానవ పూర్వపు యేసును సృష్టించినప్పుడు మొదటగా తండ్రి మరియు బోధకుడు అయ్యాడు. ఈయన యెహోవా యొక్క ముఖ్య ప్రతినిధి గనుక “వాక్యము” అని పిలువబడ్డాడు. (యోహాను 1:1, 14; 3:16) వాక్యము “[తండ్రి] యొద్ద ప్రధానశిల్పి”గా పనిచేశాడు, తన తండ్రి బోధ నుండి ఆయన ఎంతో నేర్చుకున్నాడు. (సామెతలు 8:22, 30) వాస్తవానికి, ఆయన ద్వారానే “దేవుని [ఆత్మీయ] కుమారుల”తో సహా ఇతరమైనవన్నీ సృష్టించబడ్డాయి గనుక ఆయన ప్రతినిధి అయ్యాడు. దేవునిచే బోధించబడేందుకు వారు ఎంతగా సంతోషించి ఉండవచ్చు! (యోబు 1:6; 2:1; 38:7, అథఃస్సూచి; కొలొస్సయులు 1:15-17) ఆ తర్వాత, మొదటి మానవుడైన ఆదాము సృష్టించబడ్డాడు. ఆయన కూడా ‘దేవుని కుమారుడే,’ యెహోవా ఆయనకు బోధించాడని బైబిలు తెలియజేస్తుంది.—లూకా 3:38; ఆదికాండము 2:7, 16, 17.
5. ఆదాము ఏ అమూల్యమైన ఆధిక్యతను కోల్పోయాడు, అయినా యెహోవా ఎవరికి బోధించాడు, ఎందుకు?
5 దుఃఖకరంగా, ఆదాము తాను ఇష్టపూర్వకంగా అవిధేయత చూపడం ద్వారా దేవుని కుమారునిగా కొనసాగే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. గనుక, ఆయన సంతానం కేవలం జనన ఆధారంగా తాము దేవుని కుమారులమనే సంబంధాన్ని చెప్పుకోలేరు. అయినా, నడిపింపు కొరకు ఆయన వైపు చూసిన అపరిపూర్ణ మానవులకు యెహోవా బోధించాడు. ఉదాహరణకు, “దేవునితోకూడ నడిచిన” నోవహు “నీతిపరుడు” అని నిరూపించుకున్నాడు, అందుకే యెహోవా నోవహుకు బోధించాడు. (ఆదికాండము 6:9, 13–ఆదికాండము 6:13 నుండి 7:5) తన విధేయత ద్వారా అబ్రాహాము తనను తాను “దేవుని [“యెహోవా,” NW] స్నేహితునిగా” నిరూపించుకున్నాడు గనుక ఆయన కూడా యెహోవాచే బోధింపబడ్డాడు.—యాకోబు 2:23; ఆదికాండము 12:1-4; 15:1-8; 22:1, 2.
6. యెహోవా తన “కుమారునిగా” ఎవరెవరిని దృష్టిస్తున్నాడు, ఆయన వారికి ఎటువంటి బోధకుడైయుండెను?
6 ఆ తర్వాత చాలా కాలానికి, మోషే కాలంలో, యెహోవా ఇశ్రాయేలు జనాంగముతో ఒక నిబంధన సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఫలితంగా, ఆ జనాంగము ఆయన ఏర్పరచుకొనిన ప్రజ అయ్యింది మరియు ఆయన “కుమారునిగా” దృష్టించబడింది. దేవుడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు నా కుమారుడు.” (నిర్గమకాండము 4:22, 23; 19:3-6; ద్వితీయోపదేశకాండము 14:1, 2) ఆ నిబంధన సంబంధం ఆధారంగా, ప్రవక్తయైన యెషయాచే వ్రాయబడినట్లుగా, ఇశ్రాయేలీయులు ఇలా చెప్పగలిగారు: “యెహోవా, నీవే మా తండ్రివి.” (యెషయా 63:16) యెహోవా తన పితృత్వపు బాధ్యతను చేపట్టి తన పిల్లలైన ఇశ్రాయేలుకు ప్రేమపూర్వకంగా బోధించాడు. (కీర్తన 71:17; యెషయా 48:17, 18) వాస్తవానికి, వారు అపనమ్మకస్థులైనప్పుడు, ఆయన దయాపూర్వకంగా వారినిలా అభ్యర్థించాడు: “భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి.”—యిర్మీయా 3:14.
7. ఇశ్రాయేలు జనాంగానికి యెహోవాతో ఏమి సంబంధం ఉండెను?
7 ఇశ్రాయేలుతోనున్న నిబంధన సంబంధం ఫలితంగా, యెహోవా ఆ జనాంగానికి సూచనార్థకంగా భర్త కూడా అయ్యాడు, అది ఆయన సూచనార్థక భార్య అయ్యింది. ఆమె గురించి ప్రవక్తయైన యెషయా ఇలా వ్రాశాడు: “నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.” (యెషయా 54:5; యిర్మీయా 31:32) యెహోవా భర్తగా తన పాత్రను గౌరవపూర్వకంగా నెరవేర్చినప్పటికీ, ఇశ్రాయేలు జనాంగము అపనమ్మకస్థురాలైన భార్య అయ్యింది. యెహోవా ఇలా చెప్పాడు: “స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి.” (యిర్మీయా 3:20) విశ్వాసం లేని తన భార్య కుమారులను యెహోవా అభ్యర్థిస్తూనే ఉన్నాడు; ఆయన వారి “మహోపదేశకుడు”గా ఉండడం కొనసాగించాడు.—యెషయా 30:20 (NW); 2 దినవృత్తాంతములు 36:15.
8. ఇశ్రాయేలు ఒక జనాంగముగా యెహోవాచే నిరాకరించబడినప్పటికీ, ఆయనకు ఇప్పటికీ ఏ సాదృశ్యమైన సూచనార్థక భార్య ఉంది?
8 ఇశ్రాయేలు తన కుమారుడైన యేసుక్రీస్తును నిరాకరించి చంపినప్పుడు, దేవుడు తుదకు ఆమెను నిరాకరించాడు. గనుక ఆ యూదా జనాంగము ఇక ఎంతమాత్రం ఆయనకు సూచనార్థక భార్య కాదు, అవిధేయులైన ఆమె కుమారులకు ఆయన తండ్రి మరియు బోధకుడూ కాదు. (మత్తయి 23:37, 38) అయితే, ఇశ్రాయేలు మాదిరియైన లేక సూచనార్థకమైన భార్య మాత్రమే అయ్యుండెను. సహజ ఇశ్రాయేలు జనాంగమైన “సంసారి” నుండి భిన్నమైన మరియు విశేషమైన “గొడ్రాలు” గురించి చెప్పే యెషయా 54:1ని అపొస్తలుడైన పౌలు ఉదాహరించాడు. అభిషక్త క్రైస్తవులు “గొడ్రాలు” పిల్లలని తెలియజేస్తూ, పౌలు ఆమెను “పైనున్న యెరూషలేము” అని పిలిచాడు. ఈ సాదృశ్యమైన సూచనార్థక స్త్రీ దేవుని పరలోక సంస్థలోని ఆత్మీయ సృష్టిప్రాణులచే రూపొందించబడింది.—గలతీయులు 4:26, 27.
9. (ఎ) ‘నీ కుమారులు యెహోవాచే బోధించబడతారని’ యేసు మాట్లాడినప్పుడు ఆయన ఎవరిని ఉద్దేశించాడు? (బి) ఏ ఆధారంగా ప్రజలు దేవుని ఆత్మీయ కుమారులౌతారు?
9 అలా, కపెర్నహూములోని సమాజమందిరంలో, “నీ పిల్లలందరు [కుమారులు] యెహోవాచేత ఉపదేశము నొందుదురు” అనే యెషయా ప్రవచనాన్ని యేసు ఉదాహరించినప్పుడు, దేవుని భార్య వంటి పరలోక సంస్థయైన “పైనున్న యెరూషలేముకు” “కుమారులు” కాగల వారి గురించి ఆయన మాట్లాడుతుండెను. పరలోకం నుండి వచ్చిన దేవుని ప్రతినిధియగు యేసు క్రీస్తు బోధలను అంగీకరించడం ద్వారా, ఆ యూదా శ్రోతలు దేవుని మునుపటి గొడ్రాలైన పరలోక స్త్రీ పిల్లలై, “దేవుని (ఆత్మీయ) ఇశ్రాయేలు”యగు “పరిశుద్ధజనము [“జనాంగము,” NW]”గా రూపొందించబడగల్గేవారు. (1 పేతురు 2:9, 10; గలతీయులు 6:16) దేవుని ఆత్మీయ కుమారులు కాగలిగేలా యేసు సాధ్యపర్చిన గొప్ప అవకాశాన్ని వర్ణిస్తూ, అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.”—యోహాను 1:11, 12.
యెహోవా యొక్క ప్రాముఖ్యమైన బోధలు
10. ఏదెనులో తిరుగుబాటు జరిగిన వెంటనే, “సంతానము” గురించి యెహోవా ఏమి బోధించాడు, ఆ సంతానం ఎవరని నిరూపించబడింది?
10 యెహోవా ప్రేమగల తండ్రి వలె తన పిల్లలకు తన సంకల్పాల గురించి తెలియజేస్తాడు. అలా, ఒక తిరుగుబాటుదారుడైన దూత అవిధేయత చూపించేందుకు మొదటి మానవ జంటను పురికొల్పినప్పుడు, భూమిని పరదైసుగా మార్చాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు తాను ఏమి చేస్తాననేది యెహోవా వెంటనే వారికి తెలియజేశాడు. “ఆది సర్పము” అయిన అపవాదియగు సాతానుకు, “స్త్రీకి” మధ్య వైరం పెడతానని ఆయన చెప్పాడు. స్త్రీ యొక్క “సంతానం” సాతాను “తల” మీద మరణకరంగా కొడుతుందని ఆయన వివరించాడు. (ఆదికాండము 3:1-6, 15; ప్రకటన 12:9; 20:9, 10) మనం గమనించినట్లుగా, “పైనున్న యెరూషలేము”గా ఆ తర్వాత గుర్తింపబడిన స్త్రీ—ఆత్మీయ సృష్టిప్రాణులతో కూడిన దేవుని పరలోక సంస్థ. కాని ఆమె “సంతానం” ఎవరు? ఆయన పరలోకం నుండి పంపబడినవాడు, చివరికి సాతానును నాశనం చేసేవాడు అయిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు.—గలతీయులు 4:4; హెబ్రీయులు 2:14; 1 యోహాను 3:8.
11, 12. “సంతానము”ను గూర్చిన తన ప్రాముఖ్యమైన బోధను యెహోవా ఎలా విపులీకరించాడు?
11 “నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశనక్షత్రములవలెను . . . నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; . . . భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును” అని యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు “సంతానము”ను గూర్చిన ఈ ప్రాముఖ్యమైన బోధను విపులీకరించాడు. (ఆదికాండము 22:17, 18) అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన సంతానం యేసుక్రీస్తని, కాని ఇతరులు కూడా “సంతానము”లో భాగమౌతారని వివరించడానికి యెహోవా అపొస్తలుడైన పౌలును ఉపయోగించుకున్నాడు. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దానప్రకారము వారసులైయున్నారు.”—గలతీయులు 3:16, 29.
12 సంతానమైన క్రీస్తు యూదా రాజ వంశం నుండి వస్తాడని, “ప్రజలు అతనికి విధేయులై” ఉంటారని కూడా యెహోవా బయల్పరిచాడు. (ఆదికాండము 49:10) యూదా గోత్రానికి చెందిన రాజైన దావీదు గురించి, “శాశ్వతకాలమువరకు అతని సంతానమును, ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు” యెహోవా వాగ్దానం చేశాడు. (కీర్తన 89:3, 4, 29, 35) గబ్రియేలు దూత యేసు జననం గురించి ప్రకటించినప్పుడు, బిడ్డ దేవుని నియమిత పరిపాలకుడైయుంటాడని, దావీదు సంతానమైయుంటాడని వివరించాడు. గబ్రియేలు ఇలా చెప్పాడు: “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన [యెహోవా] దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. . . . ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.”—లూకా 1:32, 33; యెషయా 9:6, 7; దానియేలు 7:13, 14.
13. యెహోవా ఆశీర్వాదాన్ని పొందేందుకు, మనం ఆయన బోధకు ఎలా ప్రతిస్పందించాలి?
13 యెహోవా ఆశీర్వాదాన్ని పొందేందుకు, దేవుని రాజ్యాన్ని గూర్చిన ఈ ప్రాముఖ్యమైన బోధను మనం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. యేసు పరలోకం నుండి దిగివచ్చాడని, ఆయన దేవుని నియమిత రాజని—భూమిపై పరదైసు పునఃస్థాపించబడడాన్ని పర్యవేక్షించే రాజ సంతానమని—ఆయన మృతులను పునరుత్థానం చేస్తాడని మనం నమ్మాలి. (లూకా 23:42, 43; యోహాను 18:33-37) మృతులను పునరుత్థానం చేయడం గురించి యేసు కపెర్నహూములో మాట్లాడినప్పుడు, ఆయన సత్యం మాట్లాడాడని యూదులకు స్పష్టమై ఉండవచ్చు. అంతెందుకు, కేవలం కొన్ని వారాల క్రితమే, బహుశా కపెర్నహూములోనే, సమాజమందిరపు అధికారి పన్నెండేళ్ల కుమార్తెను ఆయన పునరుత్థానం చేశాడు! (లూకా 8:49-56) యెహోవా రాజ్యాన్ని గూర్చిన నిరీక్షణను కలుగజేసే ఆయన బోధను నమ్మి, దానికి అనుగుణంగా నడుచుకొనేందుకు మనకు కూడా నిజంగా తగిన కారణం ఉంది!
14, 15. (ఎ) యెహోవా రాజ్యం యేసుకు ఎంత ప్రాముఖ్యమైనది? (బి) యెహోవా రాజ్యము గురించి మనం ఏమి అర్థం చేసుకోవడం, వివరించగలిగి ఉండడం అవసరము?
14 యెహోవా రాజ్యాన్ని గూర్చి బోధించడానికి యేసు తన భూ జీవితాన్ని సమర్పించాడు. ఆయన దాన్ని తన పరిచర్యయందలి ముఖ్యాంశంగా ఎంచాడు, దాని కొరకు ప్రార్థించమని ఆయన తన అనుచరులకు కూడా ఉపదేశించాడు. (మత్తయి 6:9, 10; లూకా 4:43) సహజ యూదులు “రాజ్య సంబంధులు” కాగలిగి ఉండేవారే, కాని విశ్వాస లోపం మూలంగా వారిలో అనేకులు ఆ ఆధిక్యతను పొందలేక పోయారు. (మత్తయి 8:12; 21:43) “రాజ్యసంబంధులు” కాగల ఆధిక్యతను “చిన్న మంద” మాత్రమే పొందుతుందని యేసు తెలియజేశాడు. ఈ “కుమారులు” ఆయన పరలోక రాజ్యంలో “క్రీస్తుతోడి వారసులు” అవుతారు.—లూకా 12:32; మత్తయి 13:38; రోమీయులు 8:14-17; యాకోబు 2:5.
15 తనతో పాటు భూమిపై పరిపాలన చేసేందుకు ఎంత మంది రాజ్య వారసులను క్రీస్తు పరలోకానికి తీసుకువెళ్తాడు? బైబిలు ప్రకారం 1,44,000 మందిని మాత్రమే. (యోహాను 14:2, 3; 2 తిమోతి 2:12; ప్రకటన 5:10; 14:1-3; 20:4) కాని ఆ రాజ్య పరిపాలనలో భూసంబంధ పౌరులైయుండే “వేరే గొఱ్ఱెలు” తనకు ఉన్నారని యేసు చెప్పాడు. వీరు పరదైసు భూమిపై పరిపూర్ణ ఆరోగ్యాన్ని, శాంతిని నిరంతరం అనుభవిస్తారు. (యోహాను 10:16; కీర్తన 37:29; ప్రకటన 21:3, 4) రాజ్యాన్ని గూర్చిన యెహోవా బోధను మనం అర్థం చేసుకొని, వివరించగలిగి ఉండవలసిన అవసరత ఉంది.
16. యెహోవా యొక్క ఏ ప్రాముఖ్యమైన బోధను మనం నేర్చుకొని, అనుసరించాలి?
16 యెహోవా యొక్క మరో ప్రాముఖ్యమైన బోధను అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. ఆయనిలా చెప్పాడు: “మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.” (1 థెస్సలొనీకయులు 4:9) యెహోవాను ప్రీతిపర్చేందుకు, మనం అలాంటి ప్రేమను ప్రదర్శించాలి. “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెబుతుంది, ప్రేమ చూపించడంలో మనం ఆయన మాదిరిని అనుకరించాలి. (1 యోహాను 4:8; ఎఫెసీయులు 5:1, 2) దుఃఖకరంగా, తమ తోటి మానవులను ఎలా ప్రేమించమని దేవుడు బోధిస్తున్నాడో అది నేర్చుకోవడంలో అనేకమంది ప్రజలు దయనీయంగా విఫలమయ్యారు. మన విషయమేమిటి? యెహోవా యొక్క ఈ బోధకు మనం ప్రతిస్పందించామా?
17. మనం ఎవరి దృక్పథాన్ని అనుకరించాలి?
17 యెహోవా బోధలన్నిటినీ మనం అంగీకరించేవారంగా ఉండడం ప్రాముఖ్యం. మన దృక్పథం ఇలా వ్రాసిన బైబిలు యొక్క కీర్తనల గ్రంథకర్తలవలె ఉండుగాక: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము.” ‘నీ కట్టడలను నాకు బోధించుము. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. . . . నీ న్యాయవిధులను నాకు బోధింపుము.’ (కీర్తన 25:4, 5; 119:12, 66, 108) మీ భావాలు కూడా కీర్తనల గ్రంథకర్తల భావాలవలెనే ఉంటే, మీరు యెహోవాచే బోధింపబడే గొప్ప సమూహంలో ఒకరై ఉండవచ్చు.
బోధింపబడినవారి గొప్ప సమూహము
18. మన కాలంలో ఏమి జరుగుతుందని ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు?
18 మన కాలంలో ఏమి జరుగుతుందనేదాన్ని ప్రవక్తయైన యెషయా ఇలా ప్రవచించాడు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడును . . . జనములు గుంపులు గుంపులుగా వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును . . . అని చెప్పుకొందురు.” (యెషయా 2:2, 3, ఇటాలిక్కులు మావి; మీకా 4:2) యెహోవాచే బోధింపబడే ఈ వ్యక్తులు ఎవరు?
19. నేడు యెహోవాచే బోధింపబడేవారిలో ఎవరు చేరివున్నారు?
19 క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించే వారితోపాటు ఇతరులు కూడా వారిలో చేరివున్నారు. ముందు చెప్పినట్లుగా, రాజ్య వారసుల “చిన్న మంద”నేగాక తనకు “వేరే గొఱ్ఱెలు”—రాజ్యం యొక్క భూ పౌరులు—కూడా ఉన్నారని యేసు చెప్పాడు. (లూకా 12:32; యోహాను 10:16) “మహా శ్రమలు” తప్పించుకొనే “గొప్ప సమూహము” వేరే గొర్రెల తరగతికి చెందినవారు, యేసు చిందించిన రక్తమందు తమ విశ్వాసం ఆధారంగా వారు యెహోవా ఎదుట అంగీకృత స్థానాన్ని పొందుతారు. (ప్రకటన 7:9, 14) యెషయా 54:13 నందు చెప్పబడిన “కుమారులలో” వేరే గొర్రెలు సూటిగా చేరివుండకపోయినప్పటికీ, యెహోవాచే బోధింపబడేలా వారు ఆశీర్వదింపబడ్డారు. గనుక, వారు దేవున్ని సరిగ్గానే “తండ్రి” అని పిలుస్తారు ఎందుకంటే దానికి అనుగుణ్యంగా, “నిత్యుడగు తండ్రి” అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయన వారికి పితామహుడు అవుతాడు.—మత్తయి 6:9; యెషయా 9:6.
యెహోవా ఎలా బోధిస్తున్నాడు
20. యెహోవా ఏ విధాల్లో బోధిస్తున్నాడు?
20 యెహోవా అనేక విధాలుగా బోధిస్తున్నాడు. ఉదాహరణకు, ఆయన ఉనికిని గూర్చి మరియు ఆయన గొప్ప జ్ఞానాన్ని గూర్చి సాక్ష్యమిచ్చే తన సృష్టి కార్యాల ద్వారా ఆయన బోధిస్తున్నాడు. (యోబు 12:7-9; కీర్తన 19:1, 2; రోమీయులు 1:20) అంతేగాక, మానవపూర్వపు యేసుకు బోధించినప్పటిలానే, ఆయన సూటిగా సంభాషించడం ద్వారా బోధిస్తాడు. అలాగే వ్రాయబడిన మూడు సందర్భాలలో, ఆయన భూమిపైనున్న ప్రజలతో పరలోకం నుండి సూటిగా మాట్లాడాడు.—మత్తయి 3:17; 17:5; యోహాను 12:28.
21. యెహోవా ఏ దూతను ప్రాముఖ్యంగా తన ప్రతినిధిగా ఉపయోగించుకున్నాడు, కాని ఇతరులు కూడా ఉపయోగించుకొనబడ్డారని మనకెలా తెలుసు?
21 యెహోవా తన జ్యేష్ఠకుమారుడైన “వాక్యము”తో సహా దూతలైన ప్రతినిధులను కూడా బోధించడానికి ఉపయోగించుకుంటాడు. (యోహాను 1:1-3) ఏదెను తోటలో, తన పరిపూర్ణ మానవ కుమారుడైన ఆదాముతో యెహోవా సూటిగా మాట్లాడగలిగి ఉన్నప్పటికీ, ఆయన తన తరపున మాట్లాడడానికి మానవపూర్వపు యేసును ఉపయోగించుకున్నట్లున్నాడు. (ఆదికాండము 2:16, 17) ఈయన బహుశా “ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత” అయివుండవచ్చు, ఆయన గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “ఆయన మాట వినవలెను.” (నిర్గమకాండము 14:19; 23:20, 21) యెహోషువను బలపర్చడానికి ప్రత్యక్షమైన “యెహోవా సేనాధిపతి” కూడా నిస్సందేహంగా మానవ పూర్వపు యేసే అయివుంటాడు. (యెహోషువ 5:14, 15) తన ధర్మశాస్త్రాన్ని మోషేకు అందజేయడానికి ఆయన ఉపయోగించుకున్నలాంటి ఇతర దూతలను కూడా యెహోవా తన బోధలను అందజేయడానికి ఉపయోగించుకుంటాడు.—నిర్గమకాండము 20:1; గలతీయులు 3:19; హెబ్రీయులు 2:2, 3.
22. (ఎ) యెహోవా బోధించడానికి భూమిపై ఎవరిని ఉపయోగించుకున్నాడు? (బి) యెహోవా నేడు మానవులకు ఏ ప్రాథమిక మార్గం ద్వారా ఉపదేశిస్తాడు?
22 అంతేగాక, బోధించడానికి యెహోవా దేవుడు మానవ ప్రతినిధులను ఉపయోగిస్తాడు. ఇశ్రాయేలీయులలో తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించవలసి ఉండిరి; ప్రవక్తలు, యాజకులు, రాజకుమారులు, లేవీయులు యెహోవా ధర్మశాస్త్రాన్ని జనాంగానికి బోధించేవారు. (ద్వితీయోపదేశకాండము 11:18-21; 1 సమూయేలు 12:20-25; 2 దినవృత్తాంతములు 17:7-9) యేసు భూమిపై దేవుని ప్రాథమిక ప్రతినిధిగా ఉన్నాడు. (హెబ్రీయులు 1:1, 2) తాను బోధించేది కచ్చితంగా తాను తండ్రి వద్ద నేర్చుకున్నదేనని యేసు తరచూ చెప్పాడు, తత్ఫలితంగా ఆయన శ్రోతలు యెహోవాచే బోధించబడేవారు. (యోహాను 7:16; 8:28; 12:49; 14:9, 10) యెహోవా తన మాటలను వ్రాయించి ఉంచాడు, మన కాలంలో ఆయన మానవులకు ప్రాథమికంగా ఈ ప్రేరేపిత లేఖనాల ద్వారా బోధిస్తున్నాడు.—రోమీయులు 15:4; 2 తిమోతి 3:16.
23. తర్వాతి శీర్షికలో ఏ ప్రశ్నలు పరిశీలించబడతాయి?
23 ‘[మనం నివసిస్తున్న] అంత్యదినములలో అనేకమంది ప్రజలు యెహోవా మార్గాల గురించి బోధింపబడతారు’ అని లేఖనాలు వాగ్దానం చేస్తున్నాయి గనుక, మనం ప్రాముఖ్యమైన కాలాలలో జీవిస్తున్నాము. (యెషయా 2:2, 3) ఈ ఉపదేశం ఎలా అందజేయబడుతుంది? ఇప్పుడు జరుగుతున్న యెహోవా యొక్క గొప్ప బోధనా కార్యక్రమం నుండి ప్రయోజనం పొందాలంటే, అలాగే దానిలో భాగం వహించాలంటే మనమేమి చేయాలి? ఇలాంటి ప్రశ్నలను మనం తర్వాతి శీర్షికలో పరిశీలిస్తాము.
మీరెలా సమాధానమిస్తారు?
◻ యెహోవా ఒక తండ్రిగా, బోధకునిగా, భర్తగా ఎలా అయ్యాడు?
◻ “సంతానము” గురించి యెహోవా ఏమి బోధించాడు?
◻ దేవుని నుండి వచ్చే ఏ ప్రాముఖ్యమైన బోధను మనం గమనించాలి?
◻ యెహోవా ఎలా బోధిస్తాడు?
[10వ పేజీలోని చిత్రం]
యాయీరు కుమార్తెను పునరుత్థానం చేయడం యేసు చేసిన పునరుత్థాన వాగ్దానాన్ని విశ్వసించేందుకు ఆధారాన్ని అందజేసింది