ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—జాంబియా
పండ్రెండు వందల మీటర్ల ఎత్తైన పీఠభూమిపై విశాలమైన, మెట్టపల్లాలులేని మైదానం ఉంది—అదే జాంబియా, దక్షిణ మధ్య ఆఫ్రికా నడిబొడ్డునున్న దేశం. ఆగ్నేయ దిశలోని ముచింగా పర్వతాలు 2,100 మీటర్ల ఎత్తు ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విక్టోరియా జలపాతాల నుండి ఎంతో రమ్యంగా హోరునపారే జాంబెజీ మహా నది, ఈ దేశపు దక్షిణ సరిహద్దుగా రూపొందింది. ప్రజల్లో డెబ్భైకి పైగా విభిన్నమైన తెగలున్నాయి. ఇక్కడ ఎనిమిది ముఖ్య భాషలను మాట్లాడుతారు, అయితే వాటికంటే ఎక్కువే ఉన్నాయి.
జాంబియా నందు 1911లో మరొక క్రొత్త భాష నాటుకుని విస్తరించడం ప్రారంభించింది. సందర్శకులు లేఖనాలనుండి పఠనం [ఆంగ్లం] అనే పుస్తక ప్రతులను తీసుకువచ్చారు, ఆ నాటినుండి జాంబియానందు బైబిలులోని “స్వచ్ఛమైన భాషను” వ్యాపింపజేసేందుకు యెహోవాసాక్షులు కృషిచేశారు. (జెఫన్యా 3:9) మరణించినవారి పరిస్థితిని గూర్చిన లేఖనరహిత నమ్మకాలు ప్రాముఖ్యమైన సవాళ్లుగా ఉన్నాయి. ప్రజలు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరియు మూఢనమ్మకాలు తమను దాసులనుగా ఎలా చేశాయో చూసినప్పుడు, దాని పరిణామం విడుదలే!—యోహాను 8:32.
ఉదాహరణకు, ఒక విశ్వాసియైన సహోదరి ఇలా నివేదిస్తుంది: “మా చిన్న మామయ్య అకస్మాత్తుగా మరణించినప్పుడు, జాంబియాలోని యునైటెడ్ చర్చిలో స్థిర సభ్యురాలైన మా అమ్మ కలవరపడింది. ఒక వారంపాటు జరిగిన సమాధి ఆచారకర్మ తర్వాత, ఆమె ఎలా ఉంటోందో చూసేందుకు నేను మరలా ఆ గ్రామానికి వచ్చాను. అక్కడికి వెళ్లినప్పుడు, వయస్సు మళ్లిన ఒక వ్యక్తి అక్కడ ఉండడం నేను చూసి, ఆయన వెళ్లిపోయిన తర్వాత, ఆయన ఎవరని మా అమ్మమ్మను అడిగాను. ఆయన భూతవైద్యుడని ఆమె చెప్పింది. తన తమ్ముని ఆత్మ శాంతించేందుకుగాను అతని మరణం విషయంలో పగతీర్చుకునేందుకు మా అమ్మ ఆయనకు డబ్బిచ్చి ఆ పని చేయించాలని ఉద్దేశించింది. ప్రస్తుతం అది, ‘ఊరికే తిరుగులాడుతోందని’ ఆమె చెప్పింది.
“అంతేకాకుండ, భూతవైద్యునికి డబ్బు చెల్లించేందుకు తమ కుటుంబం ధనసహాయం కొరకు చూస్తోంది కనుక నేను వెళ్లడం ఒక ఆశీర్వాదం అని మా అమ్మమ్మ వివరించింది. కొంత సహాయం చేయమని ఆమె నన్ను కోరింది, కానీ ఒక క్రైస్తవురాలిగా నేను అందులో పాలుపంచుకోలేనని నేను యుక్తంగా వివరించాను. కీర్తన 146:4 నుండి నేను ఆమెతో తర్కించాను. అది, చనిపోయినవారికి ఏ ఆలోచనలూ ఉండవని—కనుక ‘తిరుగులాడే’ ఆత్మ లేదని చూపుతోంది. పగతీర్చుకోవడం యెహోవా పనే కానీ మన పని కాదని సూచించే రోమీయులు 12:19ని కూడా మేము పరిశీలించాము. ఆ తర్వాత, యోహాను 5:28, 29 నందు రాయబడివున్న యేసు చెప్పిన పునరుత్థాన నిరీక్షణను గూర్చి నేను మా అమ్మతో చెప్పాను. దేవుని వాగ్దానాల్లో నాకున్న దృఢ విశ్వాసానికి ఆమె ముగ్ధురాలైంది. వెంటనే ఆమె ఒక సాక్షితో పఠించడం ప్రారంభించి, త్వరగా పురోగమించింది. ఆమె మునుపటి మతంతో అన్ని సంబంధాలనూ తెంచుకుని, బాప్తిస్మం ద్వారా ఆమె దేవునికి తన సమర్పణను కనుపర్చుకుంది. ఇప్పుడు ఆమె ఒక యెహోవాసాక్షి.”
మరొక సహోదరి ఇలా నివేదిస్తుంది: “మా చిన్నత్తయ్య అంత్యక్రియలకు నేను వెళ్లాను. అక్కడికి వెళ్లినప్పుడు, మా చిన్న మామయ్య ఆయన కొడుకు పస్తులుండడం చూశాను. మా చిన్నత్తయ్య చనిపోయిన నాటినుండి వాళ్లు ఏమీ తినలేదు. కారణమేమిటని నేను అడిగినప్పుడు, వండుకునేందుకు నిప్పును వెలిగించడానికి ఆచారం అనుమతించదని వారు చెప్పారు. నేను వండుతానని చెప్పాను, కానీ ఈ అన్యమత ఆచారాన్ని నేను మీరితే, అందరికి పిచ్చిపడుతుందేమోనని కొందరు కుటుంబ సభ్యులు భయపడ్డారు!
“ఒక యెహోవాసాక్షిగా, లేవీయకాండము 18:30 నందు చెప్పిన విషయాన్ని నేను గౌరవిస్తాననీ, మరి ధర్మశాస్త్ర విరుద్ధమైన పారంపర్యాచారాలను నేను ఆచరించనని వివరించాను. మరణించినవారి ఆత్మలు [ఆంగ్లం] అనే బ్రోషూరును నేను చూపించాను. అప్పుడు భావావేశకలవరం తగ్గిపోయింది, వెళ్లి మా చిన్నమామయ్యకి మిగిలినవారికీ నేను భోజనం వండాను. మరణించిన వ్యక్తి బంధువు నా ధైర్యానికి కదలింపబడి, బైబిలు ఇంకా పఠించేందుకు అంగీకరించారు. ఇప్పటికే వారు బాప్తిస్మం పొందని పరిచారకులుగా ఉన్నారు మరియు ఆ కుటుంబమంతా త్వరలోనే బాప్తిస్మం తీసుకునే అవకాశముంది.”
సత్యం యొక్క స్వచ్ఛమైన భాష, మతపరమైన అబద్ధపు గందరగోళాన్ని ప్రత్యేకంగా అమాయకులైన ప్రజలను దాస్యంలోకి ఈడ్చే గట్టిగా పాతుకుపోయిన తర్కాలను తిప్పికొట్టినప్పుడు మనం ఎంత ఆనందిస్తామో కదా! భూవ్యాప్తంగా జరుగుతున్నట్లుగానే, యెహోవా ఆశీర్వాదంతో స్వచ్ఛమైన భాష జాంబియానందు కూడా వ్యాప్తి చెందుతోంది.—2 కొరింథీయులు 10:4.
[9వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు
1994 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 82,926
నిష్పత్తి: 1 సాక్షికి 107
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 3,63,372
సగటు పయినీర్ ప్రచారకులు: 10,713
సగటు బైబిలు పఠనాలు: 1,08,948
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 3,552
సంఘాల సంఖ్య: 2,027
బ్రాంచి కార్యాలయం: లుసాకా
[9వ పేజీలోని చిత్రం]
లుసాకా పొలిమేరల్లో వాచ్‌టవర్ బ్రాంచి కార్యాలయ సదుపాయాలు
[9వ పేజీలోని చిత్రం]
లుసాకాకు దక్షిణాన ఉన్న షింబాలానందు ప్రకటించడం