కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 3/15 పేజీలు 15-20
  • సత్యదేవునికి భయపడడంలోని ప్రయోజనాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్యదేవునికి భయపడడంలోని ప్రయోజనాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జ్ఞానము—బంగారముకన్నా అమూల్యమైంది
  • చెడుతనం విషయంలో జాగ్రత్తపడండి
  • మనుష్యులకు భయపడకుండా రక్షణనొందడం
  • జీవితాన్ని కాపాడడం
  • యెహోవా భయంలో ఆనందాన్ని కనుగొనేందుకు నేర్చుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవాకు భయపడండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మనుష్యులకు కాక దేవునికి ఎందుకు భయపడవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 3/15 పేజీలు 15-20

సత్యదేవునికి భయపడడంలోని ప్రయోజనాలు

“నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17.

1. దైవ భయం వల్ల ఏ విపత్తులు నివారించబడగల్గి ఉండేవి?

ఆదాము దైవ భయమును అలవర్చుకుని ఉన్నట్లైతే, తన శాశ్వత మరణాన్నీ, తన సంతానానికి వేలకొలది సంవత్సరాల దుఃఖాన్ని తెచ్చిన పాపాన్ని చేయకుండా అది ఆయనను ఆపివుండేది. తనకు భయపడి తనను ప్రేమించమన్న యెహోవా సలహాను ప్రాచీన ఇశ్రాయేలీయుల జనాంగం వినివుంటే, ఆ జనాంగం బబులోనుకు చెరగా తీసుకువెళ్లబడివుండేది కాదు, లేక దేవుని కుమారుని తిరస్కరించి ఆయన రక్తాన్ని చిందించినందుకు నిందితమై ఉండేది కాదు. నేటి లోకం దేవునికి భయపడినట్లైతే, ప్రభుత్వం లేక వ్యాపారంలో ఏ దుర్నీతి గానీ, నేరం లేక యుద్ధాలుగానీ ఉండవు.—సామెతలు 3:7.

2. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, మనం యెహోవా భయాన్ని ఎందుకు అలవర్చుకోవాలి?

2 అయితే మన చుట్టూ ఉన్న లోకం ఏమి చేసినప్పటికీ, వ్యక్తిగతంగానూ కుటుంబపరంగానూ యెహోవా సేవకుల సంఘాలుగానూ నిజమైన దేవుని భయాన్ని అలవర్చుకోవడం నుండి మనం ప్రయోజనం పొందగలము. ఇశ్రాయేలు జనాంగానికి మోషే ఇచ్చిన జ్ఞాపికతో ఇది ఏకీభవిస్తుంది: “నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలుకొరకు . . . నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?” (ద్వితీయోపదేశకాండము 10:12, 13) సత్య దేవుడైన యెహోవాకు మనం భయపడడంవల్ల మనకు వచ్చే కొన్ని ప్రయోజనాలేమిటి?

జ్ఞానము—బంగారముకన్నా అమూల్యమైంది

3. (ఎ) మనం పొందగల ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? (బి) కీర్తన 111:10 భావమేమిటి?

3 మొదటి ప్రయోజనం నిజమైన జ్ఞానం. కీర్తన 111:10 ఇలా ప్రకటిస్తోంది: “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము.” దాని భావమేమిటి? సమస్యలను ఫలవంతంగా పరిష్కరించుకొనగల, అపాయాలను నివారించగల మరియు కొన్ని గమ్యాలను చేరుకునేందుకు తెలివిని సరైన విధంలో ఉపయోగించుకోగల సామర్థ్యమే జ్ఞానము. దానిలో మంచి విచక్షణ కావాలి. ఆరంభంలో, ప్రథమంగా, అలాంటి జ్ఞానానికి పునాది యెహోవా భయమే. ఎందుకు? ఎందుకంటే సృష్టి అంతా కూడా ఆయన చేతుల పనే. అది ఆయనపై ఆధారపడి ఉంది. మానవులను స్వేచ్ఛాచిత్తంతో ఆయన ఆశీర్వదించాడే గానీ, ఆయన నిర్దేశత్వం లేకుండా తమనుతామే సఫలంగా నడిపించుకునే సామర్థ్యాన్ని ఇవ్వలేదు. (యెహోషువ 24:15; యిర్మీయా 10:23) జీవితంలో ఆ మూల వాస్తవాలను మనం మెచ్చుకుని, వాటికి అనుగుణంగా ప్రవర్తించినప్పుడే మనం చిరకాల జయాన్ని పొందగలం. దేవుని చిత్తం తప్పకుండా నెరవేరుతుందని మరియు ఆయన వాగ్దానమూ విశ్వాస్యతకు ప్రతిఫలమివ్వగల ఆయన సామర్థ్యం నిశ్చయమని యెహోవాను గూర్చిన మన జ్ఞానం మనకు నిశ్చలమైన విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు, దైవ భయం మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించేందుకు ప్రేరేపిస్తుంది.—సామెతలు 3:21-26; హెబ్రీయులు 11:6.

4, 5. (ఎ) ఒక యౌవనుని విశ్వవిద్యాలయ విద్య అతనికి నిజమైన జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వలేదు? (బి) ఈ వ్యక్తి ఆయన భార్య తర్వాత నిజమైన జ్ఞానాన్ని ఎలా పొందడం ప్రారంభించారు, మరి ఇది వారి జీవితాలను ఎలా మార్చింది?

4 ఒక ఉదాహరణను పరిశీలించండి. కొన్ని దశాబ్దాల క్రితం, కెనడాలోని సస్కాట్చివాన్‌ విశ్వవిద్యాలయానికి ఒక యువకుడు హాజరయ్యేవాడు. ఆయన పాఠ్యక్రమంలో జీవశాస్త్రం ఉండేది, మరి ఆయనకు పరిణామ సిద్ధాంతం నేర్పించబడేది. డిగ్రీ తర్వాత, ఆయన అటామిక్‌ భౌతిక శాస్త్రంలో ప్రావీణ్యుడవ్వడంవల్ల, టొరెంటో విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించడానికి ఉపకార వేతనం సంపాదించాడు. ఆయన చదువుతుండగా, పరమాణు రూపంలో అద్భుతమైన క్రమబద్ధత మరియు ఆకృతుల రుజువులను చూశాడు. అయితే ఆయన ప్రశ్నలకు జవాబు లేదు: వీటినంతటినీ ఎవరు రూపొందించారు? ఎప్పుడు? మరి ఎందుకు? ఆ జవాబులు లేకుండానే అప్పట్లో యుద్ధంలో ఉన్న లోకంలో తన జ్ఞానాన్ని సరైన విధంలో ఉపయోగించుకోగలడా? ఆయనను ఏది నడిపించగలదు? జాతీయతా? వస్తుపరమైన ప్రతిఫలాల కోరికా? నిజంగా, ఆయన వాస్తవమైన జ్ఞానాన్ని సంపాదించాడా?

5 ఆయన పట్టభద్రుడైన కొంత కాలానికే ఆ యువకుడూ ఆయన భార్య యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించారు. తమకు అంతకుముందు దొరకని జవాబులను వారు దేవుని వాక్యం నుండి పొందడం ప్రారంభించారు. వారు సృష్టికర్తయైన యెహోవా దేవున్ని తెలుసుకున్నారు. ఎర్ర సముద్రము వద్ద మోషేను గూర్చి, బబులోనులో దానియేలు అతని సహవాసులను గూర్చి వారు పఠించినప్పుడు, మనుష్యులకు కాకుండ దేవునికి భయపడే ప్రాముఖ్యతను వారు నేర్చుకున్నారు. (నిర్గమకాండము 14:10-31; దానియేలు 3:8-30) అలాంటి దైవ భయంతో చేరివున్న యెహోవా యెడల నిజమైన ప్రేమ వారిని కదిలించడం ప్రారంభించింది. త్వరలోనే వారి జీవితవిధానమంతా మారిపోయింది. జీవశాస్త్రంలో తాను పఠించిన హస్తకృత్యములు ఎవరివో ఆ యువకుడు చివరికి తెలుసుకున్నాడు. భౌతిక శాస్త్రంలో ప్రతిబింబించిన జ్ఞానం గల ఆ వ్యక్తి సంకల్పాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. తన తోటి వ్యక్తులను నాశనం చేసే ఉపకరణాలను తయారు చేసేందుకు తన జ్ఞానాన్ని ఉపయోగించే బదులు, ఆయన, ఆయన భార్య ఇతరులు దేవున్ని మరియు తమ పొరుగువారినీ ప్రేమించేందుకు సహాయపడాలని అనుకున్నారు. వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించేవారిగా పూర్తికాల సేవలో చేరారు. పిమ్మట, వారు వాచ్‌టవర్‌ గిలియడ్‌ బైబిలు పాఠశాలకు హాజరయ్యారు మరియు మిషనరీలుగా పంపించబడ్డారు.

6. యెహోవా భయంలో నాటుకుని ఉన్న జ్ఞానం మనకు ఉంటే, ఎలాంటి అల్పకాల విషయాలను మనం నివారిస్తాము, మరియు దానికి బదులుగా మనం ఏమి చేస్తాము?

6 నిస్సందేహంగా, అందరూ మిషనరీలు కాలేరు. అయితే యెహోవా భయంలో నాటుకుని ఉన్న జ్ఞానాన్ని మన మందరమూ అనుభవించగలం. ఆ జ్ఞానాన్ని మనం అలవర్చుకుంటే, జీవితం అంటే ఏమిటో అని కేవలం ఊహించి చెప్పే మానవ సిద్ధాంతాలను మనం కుతూహలంతో గ్రహించము. మనకు నిత్యజీవం ఇవ్వగల మరియు జీవానికి కారకుడైన యెహోవా దేవుడు ప్రేరేపించిన బైబిలును పఠించేందుకు మనం కృషి చేస్తాము. (కీర్తన 36:9; కొలొస్సయులు 2:8) నాశనపు అంచులో సతమతమౌతున్న వాణిజ్య విధానానికి దాసులు కాకుండ, దేవునితో మన సంబంధానికి మన జీవితంలో ప్రథమ స్థానాన్నిస్తూ ఆహారము బట్టలతో సంతృప్తి పొందుడనే యెహోవా సలహాను మనం గైకొంటాము. (1 తిమోతి 6:8-12) ఈ లోకంలో సాఫీగా సాగిపోయే జీవితాన్ని పొందడంపై మన భవిష్యత్తు ఆధారపడివుందన్నట్లుగా మనం పనిచేసే బదులు, లోకమూ దాని ఆశయూ గతించిపోవును అయితే దేవుని చిత్తం చేసే వారు నిరంతరం నిలిచి ఉందురు అని యెహోవా వాక్యం మనకు చెప్పినదాన్ని మనం విశ్వసిస్తాము.—1 యోహాను 2:17.

7. (ఎ) విలువల విషయంలో సమతుల్య భావాన్ని కల్గివుండేందుకు సామెతలు 16:16 మనకు ఎలా సహాయపడుతుంది? (బి) దేవుని చిత్తాన్ని మన జీవితంలో కేంద్ర స్థానమివ్వడం ద్వారా మనకు ఏ ప్రతిఫలాలు లభిస్తాయి?

7 సామెతలు 16:16 వాస్తవికంగా ఇలా చెబుతూ మనకు ప్రోత్సాహాన్నిస్తోంది: “అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును [యెహోవాయందు భయంతో ప్రారంభమయ్యే జ్ఞానమును] సంపాదించుట ఎంతో శ్రేష్ఠము. వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.” అలాంటి జ్ఞానమూ తెలివి, దేవుని చిత్తాన్ని చేయడమే మన జీవితాల్లో ప్రాముఖ్యమైన విషయంగా చేసుకునేలా మనలను కదిలిస్తాయి. మరి మానవ చరిత్రలోని ఈ భాగంలో దేవుడు తన సాక్షులకు అప్పగించిన పని ఏమిటి? తన రాజ్యమును గూర్చి ప్రకటించడం మరియు యథార్థహృదయులు యేసుక్రీస్తు నిజమైన శిష్యులయ్యేందుకు సహాయపడడం. (మత్తయి 24:14; 28:19, 20) ఈ పని, నిజమైన సంతృప్తిని మరియు ఎంతో ఆనందాన్ని ప్రతిఫలాలుగా తెచ్చే పని. మరి మంచి కారణంతోనే బైబిలు ఇలా చెబుతోంది: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు.”—సామెతలు 3:13.

చెడుతనం విషయంలో జాగ్రత్తపడండి

8. (ఎ) దేవునికి భయపడడం వల్ల వచ్చే రెండవ ప్రయోజనాన్ని పేర్కొనండి. (బి) మనం ఏ చెడునుండి కాపాడబడతాము? (సి) దైవ భయం బలమైన ప్రేరణా శక్తిగా ఎలా అవుతుంది?

8 దేవునికి భయపడడం వల్ల వచ్చే రెండవ ప్రయోజనమేమిటంటే, చెడుతనం చేయడం విషయంలో మనం జాగ్రత్తపడడం. దేవున్ని ఎంతో గౌరవించేవారు ఏది మంచో ఏది చెడో తమకు తామే నిర్ణయించుకోరు. దేవుడు మంచి అని చెప్పే దాన్ని వారు చెడుగా భావించరు, లేక దేవుడు చెడ్డది అని చెప్పే దాన్ని మంచిదానిగా దృష్టించరు. (కీర్తన 37:1, 27; యెషయా 5:20, 21) అంతేకాకుండ, దైవ భయంతో ప్రేరితమైన వ్యక్తి, యెహోవా వేటిని మంచివి, వేటిని చెడ్డవి అని చెబుతున్నాడో ఆ విషయాలను మాత్రం తెలుసుకోవడంతో సంతృప్తిచెందడు. అలాంటి వ్యక్తి యెహోవా ప్రేమించేవాటిని ప్రేమిస్తాడు, యెహోవా అసహ్యించుకునేవాటిని అసహ్యించుకుంటాడు. ఆ విధంగా, సామెతలు 16:6 నందు చెప్పినట్లుగా “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.” అలాంటి దైవ భయం, ఒక వ్యక్తి తన స్వంత సామర్థ్యం వల్ల సాధించలేని వాటిని సాధించేందుకు బలమైన ప్రేరణాత్మక శక్తి అవుతుంది.

9. దేవున్ని అప్రీతిపర్చకూడదనే బలమైన కోరిక మెక్సికోలోని ఒక స్త్రీ నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేసింది, మరి దాని పరిణామమేమిటి?

9 ఒక వ్యక్తిలో దైవ భయం ఇప్పుడిప్పుడే ప్రారంభమౌతున్నప్పటికీ, తన తర్వాతి జీవితంలో అతను బాధపడగల పనులను చేయకుండ ఉండేలా అది అతన్ని బలపరుస్తుంది. ఉదాహరణకు, మెక్సికోలోని ఒక గర్భవతి, గర్భస్రావాన్ని గూర్చి ఒక యెహోవాసాక్షిని అడిగింది. ఆ సాక్షి ఆమెకు అనేక లేఖనాలను చదివి వినిపించి, ఇలా సహేతుకంగా తర్కించారు: “ఇంకా జన్మించని వారి జీవంతోసహా సృష్టికర్తకు జీవం చాలా ప్రాముఖ్యం.” (నిర్గమకాండము 21:22, 23; కీర్తన 139:13-16) వైద్య పరీక్ష ఆమె బిడ్డ ఆరోగ్యంగా లేదని సూచించిది. అయితే ఇప్పుడు, దేవుని వాక్యం నుండి ఆమె నేర్చుకున్న దాని వల్ల ప్రేరేపించబడి, తాను బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. ఆమె వైద్యుడు మరలా ఆమెను చూసేందుకు నిరాకరించాడు, మరి ఆమె భర్త ఆమెను విడిచిపెడతానని బెదిరించాడు కానీ ఆమె దృఢంగా నిలిచింది. సకాలంలో, ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది—ఆ బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా, అందంగా ఉంది. కృతజ్ఞతతో కదిలించబడి, ఆమె సాక్షులను వెతికింది, వారు ఆమెతో బైబిలను పఠించడం ప్రారంభించారు. ఒక సంవత్సరంలోనే ఆమె, ఆమె భర్త బాప్తిస్మం తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక జిల్లా సమావేశంలో, వారు మొదట కలిసిన సాక్షులను తిరిగి కలిసినందుకు ఎంతో సంతోషించారు మరి నాలుగు సంవత్సరాల తమ అందమైన బిడ్డను వారికి పరిచయం చేశారు. దేవుని యెడల సరైన గౌరవం మరియు ఆయనను అప్రీతిపర్చకూడదనే బలమైన కోరిక, ఒకరి జీవితంపై తప్పక బలమైన ప్రభావాలను చూపించగలదు.

10. ఎలాంటి చెడు పనులనుండి బంధవిముక్తులయ్యేందుకు దైవ భయం ప్రజలను బలపర్చగలదు?

10 దైవ భయం మనం అనేకమైన తప్పులను చేయకుండా ఉండేలా బలపరుస్తుంది. (2 కొరింథీయులు 7:1) సరైన విధంగా అలవర్చుకున్నప్పుడు, తనకూ యెహోవాకు మాత్రమే తెలిసిన రహస్య పాపములకు ఒక వ్యక్తి ముగింపు పెట్టేందుకు అతనికి సహాయం చేయగలదు. అది ఆ వ్యక్తి మద్యపాన వినియోగం మరియు మాదకద్రవ్య వినియోగ దాసత్వం నుండి బైటికి వచ్చేలా సహాయపడగలదు. దక్షిణాఫ్రికాలో మునుపు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఒక వ్యక్తి ఇలా వివరించాడు: “దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేను తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆయనను బాధపెడతానేమో లేక అప్రీతిపరుస్తానేమోననే భయాన్ని కూడా నేను వృద్ధిచేసుకున్నాను. ఆయన చూస్తున్నాడని నాకు తెలుసు, మరి ఆయన దృష్టిలో నేను అంగీకారాన్ని పొందాలనే కోరిక నాలో ఉంది. నా దగ్గిర ఉన్న మాదకద్రవ్యాలను పెరట్లోపడేసి వాటిని నాశనం చేసేలా అది నన్ను ప్రేరేపించింది.” దైవ భయం అనేకులకు అదే విధంగా సహాయం చేసింది.—సామెతలు 5:21; 15:3.

మనుష్యులకు భయపడకుండా రక్షణనొందడం

11. యెహోవా యెడల ఆరోగ్యకరమైన భయం మనలను ఏ సాధారణ ఉరినుండి కాపాడగలదు?

11 దేవుని యెడల ఆరోగ్యదాయకమైన భయం మనం మనుష్యులను చూసి భయపడకుండా ఉండేలా కాపాడుతుంది. అనేకమంది ప్రజలు మనుష్యుని భయం వల్ల కొద్దో గొప్పో ప్రభావితం చెందుతున్నారు. యేసుక్రీస్తు అపొస్తలులు సహితం, ఆయన్ను గెత్సేమనే తోటలో సైనికులు పట్టుకున్నప్పుడు ఆయన్ను విడిచి పారిపోయారు. తర్వాత, ప్రధాన యాజకుని గృహ ప్రాంగణంలో, సమత్యులం తప్పినవాడై, భయంతో పేతురు తాను యేసు శిష్యుల్లో ఒకడు కాడని, ఆయన ఎవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. (మార్కు 14:48-50, 66-72; యోహాను 18:15-27) అయితే అపొస్తలులు ఆత్మీయ సమతుల్యాన్ని పొందేందుకు సహాయం పొందారు. మరో వైపు, రాజైన యెహోయాకీము కాలంలో, షిమయా కుమారుడైన ఊరియాను భయం ఎంతగా ఆవరించిందంటే అతడు యెహోవా ప్రవక్తగా ఉండే సేవను విడిచిపెట్టి, ఆ దేశంనుండి పారిపోయాడు. అక్కడ ఆయన చెరపట్టబడడమే కాకుండ చంపబడ్డాడు కూడా.—యిర్మీయా 26:20-23.

12. (ఎ) సామెతలు 29:25 మనుష్యునికి భయపడడం నుండి కాపాడే ఏ విషయాన్ని సూచిస్తుంది? (బి) దేవుని యెడల నమ్మకం ఎలా వృద్ధి చెందుతుంది?

12 మనుష్యుని భయాన్ని జయించేందుకు ఒక వ్యక్తికి ఏది సహాయపడగలదు? “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును” అని హెచ్చరించిన తర్వాత సామెతలు 29:25 ఇలా చెబుతోంది: “యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.” యెహోవాయందు నమ్మిక యుంచడమే కీలకము. అలాంటి నమ్మకం జ్ఞానం మరియు అనుభవంపై ఆధారపడివుంటుంది. ఆయన వాక్యం పఠించడం వల్ల, యెహోవా మార్గాల నిజత్వపు రుజువులను చూడగలము. ఆయనపై ఆధారపడగలమని ప్రదర్శించే సంఘటనలతో (పునరుత్థానంతో సహా), ఆయన వాగ్దానాల నిశ్చయతతో, ఆయన ప్రేమ, సర్వశక్తితో మనం సుపరిచితులమౌతాము. మరి మనం ఆ జ్ఞానానుసారంగా నడుచుకున్నట్లైతే, అంటే యెహోవా నడిపించే విషయాలను చేస్తూ, ఆయన హెచ్చరించే విషయాలను స్థిరంగా తిరస్కరించడం ద్వారా, ఆయన ప్రేమాశ్రద్ధలనూ మరియు ఆయనిచ్చే ఆశ్రయాన్ని మనం చవిచూస్తాము. ఆయన చిత్తాన్ని సాధించేందుకు ఆయన శక్తి పనిచేస్తుందనే రుజువును మనం వ్యక్తిగతంగా చూస్తాము. ఆయనయందు మన నమ్మకం పెరుగుతుంది, మరి దానితో ఆయన యెడల ప్రేమ మరియు ఆయన్ను అప్రీతిపర్చకూడదనే మన యథార్థమైన కోరిక పెరుగుతాయి. అలాంటి నమ్మకం గట్టి పునాదిపై నిర్మించబడుతుంది. అది మానవుని భయం నుండి కాపుదలగా పనిచేస్తుంది.

13. దైవ భయం మన లౌకిక ఉద్యోగాల వద్ద, ఇంట్లో మరియు పాఠశాలలో ఎలా సహాయపడగలదు?

13 దైవ భయంతో కూడా యెహోవాయందు మనం నమ్మిక ఉంచడం, అన్యాయ వ్యాపార క్రియల్లో పాల్గొనడానికి నిరాకరించినందుకు మనలను ఉద్యోగంలోనుండి తీసివేస్తానని యజమాని భయపెట్టినప్పుడు, సరైన దాని పక్షంలో మనం దృఢంగా నిలిచేలా చేస్తుంది. (మీకా 6:11, 12 పోల్చండి.) అలాంటి దైవ భయం, అవిశ్వాసులైన కుటుంబ సభ్యులనుండి వ్యతిరేకతను ఎదుర్కోవల్సి వచ్చినప్పటికీ నిజమైన ఆరాధనలో కొనసాగేందుకు వేలాది మంది క్రైస్తవులకు సహాయపడుతోంది. పాఠశాలకు వెళుతున్న యౌవనులు తమను తాము యెహోవాసాక్షులుగా గుర్తుంచుకునే ధైర్యాన్నిస్తుంది, బైబిలు విలువలను తక్కువ చూపుచూసే తోటి సహవాసుల వెక్కిరింపుతో వ్యవహరించేందుకు బలాన్ని అనుగ్రహిస్తుంది. ఒక యౌవన సాక్షి ఇలా చెప్పింది: “వారెలా భావిస్తారన్నది ప్రాముఖ్యం కాదు. యెహోవా ఎలా భావిస్తాడన్నది ప్రాముఖ్యం.”

14. తమ జీవితాలు అపాయంలో ఉన్నప్పటికీ యెహోవా సేవకులు ఎలా విజేయులుగా వస్తున్నారు?

14 అదే విశ్వాసం, తమ జీవితాలు అపాయంలో ఉన్నా సరే, యెహోవా మార్గాలకు గట్టిగా హత్తుకుని ఉండేలా నిజ క్రైస్తవులకు సహాయపడుతుంది. వారు లోకం నుండి హింసను ఎదుర్కోవాలని వారికి తెలుసు. అపొస్తలులు కొరడాలతో కొట్టబడ్డారని, యేసుక్రీస్తును దుష్టులు కొట్టి చంపారని వారు గుర్తిస్తారు. (మార్కు 14:65; 15:15-39; అపొస్తలుల కార్యములు 5:40; దానియేలు 3:16-18 పోల్చండి.) అయితే సహించేందుకు యెహోవా తమకు శక్తిని అనుగ్రహిస్తాడని; దేవుని సహాయంతో వారు విజేయులుగా వస్తారనీ; నమ్మకంగా ఉన్నవారికి యెహోవా తప్పక ప్రతిఫలమిస్తాడని—అవసరమైతే తన నూతనలోకంలో పునరుత్థానాన్ని ఇవ్వడంద్వారా జీవం ఇస్తాడనే దృఢమైన నమ్మకం యెహోవా సేవకులకు ఉంది. దైవ భయంతో చేరిన దేవుని యెడల వారి ప్రేమ, ఆయనను అప్రీతిపర్చే ఏ పనిని చేయకుండా నివారించేందుకు వారిని బలంగా ప్రేరేపిస్తుంది.

15. నాజీ నిర్బంధ శిబిరాల్లో తమ యథార్థతను కాపాడుకునేందుకు యెహోవాసాక్షులకు ఏది సహాయపడింది?

15 ఈ ప్రేరణ, 1930 మరియు 1940 దశాబ్దాల నాజీ నిర్బంధ శిబిరాల్లోని ఘోర కృత్యాలను యెహోవాసాక్షులు తాళుకునేందుకు సహాయపడింది. లూకా 12:4, 5 నందున్న యేసు సలహాను వారు హృదయంలోకి తీసుకున్నారు: “నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా—దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.” ఆ విధంగా, సాక్‌సెన్‌హౌసెన్‌ కాన్సెన్‌ట్రేషన్‌ క్యాంప్‌నందున్న గుస్టావ్‌ ఆష్నర్‌ అనే ఒక సాక్షి తర్వాత ఇలా రాశాడు: ‘ఎస్‌.ఎస్‌లు అగస్ట్‌ డిక్‌మ్యాన్‌న్ను కాల్చారు, మేము మా విశ్వాసాన్ని త్యజిస్తున్నామన్న కాగితంపై సంతకం చేయకపోతే మిగిలియున్న మమ్మల్ని కూడా కాల్చేస్తామని బెదిరించారు. మాలో ఎవరమూ సంతకం చేయలేదు. వారి గుండ్లకంటే కూడా యెహోవాను అప్రీతిపర్చేందుకే మేము ఎక్కువ భయపడ్డాము.’ మనుష్యుని భయం రాజీపడేందుకు దారితీస్తుంది, అయితే దైవ భయం సరైనది చేసేందుకు ఒకరిని దృఢ నిశ్చయులను చేస్తుంది.

జీవితాన్ని కాపాడడం

16. జలప్రళయం వరకూ కూడా అనేక దశాబ్దాలవరకు నోవహు సరైన విధానాన్ని కల్గివుండేందుకు ఏది సహాయపడింది, మరి ఆయన, ఆయన ఇంటివారికి ఏ ఫలితం దక్కింది?

16 జలప్రళయానికి ముందున్న చివరి రోజుల్లో నోవహు జీవించాడు. ఆ కాలంలో మానవుల చెడుతనం వల్ల ఆ దుష్ట లోకాన్ని నాశనం చేయాలని యెహోవా తీర్మానించాడు. అయితే ఈ కాలంలోనే, దౌర్జన్యం, ఎంతో అనైతికత మరియు దైవ చిత్తం యెడల మెప్పుదల లేని లోకంలో నోవహు జీవించాడు. నీతిని గూర్చి నోవహు ప్రకటించినప్పటికీ, “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.” (మత్తయి 24:39) అయినప్పటికీ దేవుడు తన ముందుంచిన పనినుండి నోవహు వైదొలగలేదు. ఆయన “దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆదికాండము 6:22) జలప్రళయం వరకు కూడా నోవహును సరైన మార్గంలో ఏది ఉంచింది? హెబ్రీయులు 11:7 ఇలా జవాబిస్తోంది: ‘విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడయ్యాడు.’ తత్ఫలితంగా, ఆయన, ఆయన భార్య మరియు ఆయన కుమారులు వారి భార్యలు జలప్రళయంనుండి కాపాడబడ్డారు.

17. (ఎ) ఇతర ప్రజలు ఏమి చేసినా, మనం ఏమి చేయాలి? (బి) యెహోవాకు భయపడే ప్రజలు ఎందుకు నిజంగా ఆనందమయ ప్రజలు?

17 అనేక రంగాల్లో నోవహు కాలంతో సారూప్యంగల కాలంలో మనం జీవిస్తున్నాము. (లూకా 17:26, 27) మరలా ఒక హెచ్చరిక ఇవ్వబడుతోంది. ప్రకటన 14:6, 7, “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి” అని ప్రతి జనాంగము, ప్రతి వంశము, ప్రతి భాషలోని ప్రజలకు ఉద్బోధిస్తూ మధ్య ఆకాశంలో ఎగిరే దేవదూతను గూర్చి చెబుతోంది. మీ చుట్టూ ఉన్న లోకం ఏమి చేసినప్పటికీ, ఆ మాటలను గైకొనండి, తర్వాత ఆ ఆహ్వానాన్ని ఇతరులకు అందించండి. నోవహులా, విశ్వాసంతో ప్రవర్తించండి, దైవ భయాన్ని కనపర్చండి. మీరు అలా చేయడం మీ జీవితం మరియు అనేకుల జీవితం కాపాడబడేందుకు కూడా నడుపుతుంది. సత్యదేవునికి భయపడేవారు అనుభవించే ప్రయోజనాలను మనము కూడా ధ్యానించినప్పుడు, మనం ప్రేరేపిత కీర్తన గ్రంథకర్తతో ఏకీభవించడం తప్ప ఏమీ చేయలేము, ఆయన ఇలా పాడాడు: “యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.”—కీర్తన 112:1.

మీరెలా జవాబు చెబుతారు?

◻ నిజమైన దేవునికి భయపడడం వల్ల వచ్చే కొన్ని ప్రముఖమైన ప్రయోజనాలేమిటి?

◻ దైవ భయంనందు నాటుకుని ఉన్న జ్ఞానం మనలను ఎలా కాపాడుతుంది?

◻ దైవ భయం మనం చెడునుండి వైదొలగేలా ఎందుకు చేస్తుంది?

◻ మనుష్యునికి భయపడుట నుండి దైవ భయం మనలనెట్లు కాపాడుతుంది?

◻ దైవ భయం మన భవిష్యత్‌ జీవిత ఉత్తరాపేక్షలపై ఏ ప్రభావాన్ని కల్గివుంటుంది?

[16, 17వ పేజీలోని చిత్రాలు]

“యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.”—కీర్తన 112:1

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి