ఆ తప్పు ఎవరిది?
మొదటి మానవుడైన ఆదాము ఈ ధోరణిని ప్రారంభించాడు. తాను పాపం చేసిన తర్వాత, దేవునితో యిలా అన్నాడు: “నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిని.” అంటే, “అది నా తప్పుకాదు” అని చెప్పడమే. మొదటి స్త్రీయైన హవ్వ కూడా, “సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని” అని అన్నప్పుడు అదే పనిని చేసింది.—ఆదికాండము 3:12, 13.
ఆ విధంగా మానవులు తమ స్వంత ప్రవర్తనకు తాము బాధ్యతను వహించేందుకు నిరాకరించిన దానికి ఏదేను తోటలో వేదిక తయారైంది. మీరెప్పుడైనా ఈ విషయంలో తప్పు చేశారా? సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మీరు ఇతరులను నిందిస్తారా? లేక అసలు తప్పు ఎవరిదో తెలుసుకునేందుకు మీరు విషయాన్ని విశ్లేషించి చూస్తారా? ప్రతిదిన జీవితంలో మనం చేసిన పొరపాటులకు యితరులను నిందించి “అది నా తప్పు కాదు!” అని అనే ఉరిలో చిక్కుకోవడం చాలా సులభం. సహజ పరిస్థితులను చూసి, కొందరు ప్రజలు ఏమి చేస్తారో మనం చూద్దాం. అతి ప్రాముఖ్యంగా, అదే పరిస్థితుల్లో మీరుంటే మీరేమి చేస్తారో తలంచండి.
ఆర్థిక ఇబ్బందులు
తాము ఘోరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు “అది నా తప్పు కాదు—అది ఆర్థికవ్యవస్థ, కపట వ్యాపార వేత్తలు, పెరుగుతున్న జీవన వ్యయం వలననే,’ అని కొందరు చెప్పవచ్చు. అయితే ఈ విషయాలను నిజంగా నిందించగలమా? బహుశ అనిశ్చయమైన పరిస్థితులు వారిని ప్రశ్నార్థకమైన లేక మోసకరమైన వ్యాపార లావాదేవీలకు నడిపించివుండవచ్చు. కొన్ని సార్లు దురాశ లక్ష్యసాధనను కప్పిపుచ్చుతుంది, అంతేకాకుండ తిమింగళాల నోటికి సులభంగా ఎరగా అయ్యే తెలియని వ్యాపార నీళ్లలో ఈదుతున్న వారిగా ప్రజలు తమ్మును తాము కనుగొంటారు. “అది నిజంకాదన్నట్లు అనిపిస్తే, అది నిజంగా నిజంకాదు” అన్న లోకోక్తిని వారు మర్చిపోతారు. వారు వినాలనుకున్న సలహా కొరకు వారు వెదుకుతారు, కానీ ఆర్థిక ఇబ్బందులు దాని వికృతరూపాన్ని చూపించినప్పుడు, మరొకరిని నిందించేందుకు వారు ప్రయత్నిస్తారు. అనుకోకుండా కొన్నిసార్లు యిది క్రైస్తవ సంఘంలో కూడా సంభవిస్తుంది.
కొందరు, అసలు లేని వజ్రాల కొరకు ఖరీదు చెల్లించడం, త్వరలోనే కుంటుపడిన హిట్ అయిన దూరదర్శని కార్యక్రమాలను సమర్పించేందుకు ఆర్థిక సహాయం చేయడం, లేక దివాలా తీసిన స్థిరాస్థి వికాసాలకు మద్దతునివ్వడం వంటి బుద్ధిహీన లేక మోసకరమైన పెట్టుబడి పథకాల్లో చిక్కుకుపోయారు. “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను . . . పడుదురు. . . . నానాబాధలతో తమ్మునుతామే పొడుచుకొనిరి” అనే బైబిలు సలహా, సంపద యెడల గల విపరీత కోరికను మర్చిపోయేలా చేసింది.—1 తిమోతి 6:9, 10.
దుబారా ఖర్చు కూడా ఆర్థిక నాశనానికి దారితీస్తుంది. ఇటీవలి ఫ్యాషన్ పత్రికల్లోని ప్రజల్లా తామూ కనిపించాలని కొందరు భావిస్తారు, చాలా ఖర్చుతో కూడిన సెలవుదినాలకు వెళతారు, డాబుగా ఉండే రెస్టారెంట్లలో భోజనం చేస్తారు, మరియు క్రొత్తగా వచ్చిన వయోజనుల వినోదాత్మక బొమ్మలైన—విలాస వాహనాలను, బోట్లను, కెమెరాలను, స్టీరియో పరికరాలను కొనుక్కుంటారు. ఈ వస్తువులను కొందరు తెలివిగల పథకాల ద్వారా లేక దాచుకోవడం ద్వారా సంపాదించివుండవచ్చనుకోండి. అవి వెంటనే కావాలని కోరుకునే వారు పెద్ద పెద్ద అప్పుల్లో కూరుకుపోయినట్లు కనుగొనవచ్చు. వారలా చేస్తే, అది ఎవరి తప్పు? స్పష్టంగా సామెతలు 13:18 నందలి చక్కని సలహాను వారు అలక్ష్యం చేశారన్నమాట: “శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును.”
పిల్లలతో నిరుత్సాహము
“నా పిల్లలు సత్యాన్ని విడిచిపెట్టేందుకు ఆ పెద్దే కారణం,” అని కొందరు తలిదండ్రులు చెప్పవచ్చు. “వారు నా పిల్లల విషయంలో కావల్సినంత శ్రద్ధ చూపించలేదు.”
మందను కాయవల్సిన మరియు దాని యెడల శ్రద్ధవహించాల్సిన బాధ్యత పెద్దలకు ఉంది, అయితే మరి స్వయంగా తల్లిదండ్రుల విషయమేమిటి? వారి వ్యవహారాలన్నింటిలోనూ దేవుని ఆత్మ ఫలాలను కనపర్చడంలో మాదిరికరంగా ఉన్నారా? కుటుంబ బైబిలు పఠనం క్రమంగా నిర్వహించబడిందా? యెహోవా సేవలో తలిదండ్రులు ఆసక్తిని కనపర్చి, దానికొరకు తమ పిల్లలు సిద్ధ పడేందుకు సహాయపడ్డారా? తమ పిల్లల సహవాసుల విషయంలో వారు జాగ్రత్త వహించారా?
అదే విధంగా, “నా కొడుకు పాఠశాలలో సరిగ్గా చదవకపోడానికి కారణం టీచరే. నా కొడుకంటే వాళ్లకు యిష్టంలేదు. ఏమైనప్పటికీ ఆ పాఠశాలకు మంచి ప్రమాణాలు లేవు” అని తలిదండ్రుల్లో ఒకరు పాఠశాల పనిని గూర్చి చెప్పడం చాలా సులభం. అయితే ఆ తల్లి లేక తండ్రి పాఠశాలతో సన్నిహితంగా వ్యవహరించాడా? పిల్లవాని పాఠ్యకార్యక్రమంలోను పఠనంలోను తల్లి లేక తండ్రి శ్రద్ధ తీసుకున్నారా? వాని హోమ్‌వర్క్ క్రమంగా జరిగేదా, మరి అవసరమైనప్పుడు సహాయం ఇవ్వడం జరిగేదా? అసలు సమస్య, పిల్లవాని దృక్పథము లేక వాని బద్ధకమా లేక తలిదండ్రులదా?
పాఠశాల విధానాన్ని నిందించే బదులు, వారి పిల్లలకు సరైన దృక్పథం ఉండేలా చూసుకోవడం, అంతేకాకుండ పాఠశాల నందు వారికి అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటి నుండి నేర్చుకునేందుకు తమకున్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునేలా అనుకూల చర్యలను గైకొనడం ఫలవంతంగా ఉంటుంది.
ఆత్మీయంగా వర్థిల్లడంలో వైఫల్యం
అప్పుడప్పుడు ఎవరైనా యిలా చెప్పడం మనం వింటాము: “నేను ఆత్మీయంగా బలంగానే ఉండివుండేవాణ్ణి, కానీ నేను అలా లేకపోవడం నా తప్పు కాదు. ఈ పెద్దలు నాయెడల ఎక్కువ శ్రద్ధ తీసుకోవడంలేదు. నాకు ఏ స్నేహితులూ లేరు. యెహోవా ఆత్మ ఈ సంఘం మీద లేదు.” ఇంతలో, సంఘంలోని ఇతరులకు స్నేహితులున్నారు, వారు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చక్కని ఆత్మీయ అభివృద్ధి చేసుకున్నారు; మరి సంఘం అభివృద్ధి మరియు ఆత్మీయ సమృద్ధితో ఆశీర్వదించబడింది. మరి కొందరికి సమస్యలు ఎందుకు ఉన్నాయి?
ప్రతికూల మరియు చాడీలు చెప్పే సుముఖత గలవారితో సన్నిహిత సంబంధం కావాలని ఎవరు కోరుకోరు. బాగా పదునైన, కోసేసే నాలుక మరియు ఎడతెగక చాడీలు చెప్పడం ఎంతో నిరుత్సాహకరంగా ఉండగలవు. ఆత్మీయంగా దిగజారిపోకుండా ఉండేందుకు కొందరు అలాంటి వారితో తమ సహవాసాన్ని మితంగా ఉంచుతారు. దీన్ని బట్టి సంఘం ఏమి పట్టించుకోవడం లేదని భావించి ఒకరు మొదట ఒక సంఘానికి తర్వాత, మరోదానికి, మరోదానికి అలా మారుతూ ఉంటారు. పచ్చని పొలాలను వెతుకుతూ తిరిగే ఆఫ్రికా ప్రాంతంలోని ప్రవాసిత మందల్లా, ఈ “ప్రవాసిత” క్రైస్తవులు తగిన సంఘం కొరకు నిరంతరం వెతుకుతూనే ఉన్నారు. అలా కాకుండ, ఇతరుల్లో ఉన్న మంచిని చూసి, తమ స్వంత జీవితాల్లో దేవుని ఆత్మ ఫలాలను మరి సంపూర్ణంగా కనపర్చేందుకు కృషిచేస్తే వారు ఎంత ఆనందంగా ఉండగలరో కదా!—గలతీయులు 5:22, 23.
అలా చేసేందుకుగాను, రాజ్య మందిరంలోని ప్రతి కూటంలో వివిధ వ్యక్తులతో మాట్లాడి, ఒక మంచి విషయంలో వారిని మెచ్చుకోవడం ద్వారా కొందరు ప్రత్యేక ప్రయత్నం చేస్తారు. అది చక్కగా ప్రవర్తించే అతని పిల్లలను గూర్చి, క్రైస్తవ కూటాల్లో క్రమబద్ధతను గూర్చి, కావలికోట పఠనంలో బాగా సిద్ధపడి యిచ్చిన వ్యాఖ్యానం గూర్చి, సంఘపుస్తక పఠనం మరియు ప్రాంతీయ సేవకొరకైన కూటాల కొరకు తన యింటిని తెరచి యిచ్చిన అతని ఆతిథ్యం కొరకు, ఇంకా అలాంటి వాటి కొరకు మెచ్చుకోవచ్చు. అపరిపూర్ణతా ముసుగు క్రింద ఉన్న దాన్ని చూడాలనే గమ్యాన్ని మీరు పెట్టుకుంటే మీ క్రైస్తవ సహోదర సహోదరీల్లోని చక్కని లక్షణాలను మీరు తప్పక కనుగొంటారు. అది మిమ్మల్ని వారికి ప్రియులను చేస్తుంది, అంతేకాకుండ మీకు యథార్థ స్నేహితుల కొరతేమీ లేదని మీరు కనుగొంటారు.
తుది సాకు
“అది దేవుని చిత్తం.” “అపవాదిని నిందించండి.” బహుశ ఇక చేయగల్గినది, మనం చేసిన తప్పులకు అటు దేవున్ని గాని ఇటు అపవాదిని గానీ నిందించడమే. దేవుడు లేక సాతాను మన జీవితాల్లోని కొన్ని సంఘటనలను ప్రభావితం చేయగలరన్నది నిజమే. అయితే, తమ జీవితంలోని అన్నీ, మంచైనా చెడైనా దేవుడు లేక సాతాను జోక్యం చేసుకోవడం వల్ల కల్గినవని కొందరు భావిస్తారు. తమకు జరిగినదేదీకూడా తమ స్వంత చర్యల వల్ల జరగలేదన్నట్లుగా ఉంటుంది. “ఆ కొత్త కారును నేను పొందాలని దేవుడు అనుకుంటే, నేను దాన్ని పొందేలా చూస్తాడు.”
అలాంటి వారు, దేవుడు వాళ్లను కాపాడతాడు అనే ఊహతో ఆర్థిక మరియు ఇతర నిర్ణయాలను తీసుకుంటూ తరచూ తమ జీవితంలో ఆజాగ్రత్తగా ఉంటారు. వారి తెలివితక్కువ క్రియలు ఆర్థిక లేక వేరేదైనా విపత్తుకు దారితీస్తే, వాళ్లు అపవాదిని నిందిస్తారు. మొదట ‘లెక్కచూసుకోకుండ’ అనాలోచితంగా ఏదో ఒకటిచేసి ఆ తర్వాత తన వైఫల్యానికి సాతానును నిందించడం, లేక అంతకంటే ఘోరంగా యెహోవా మధ్యలో జోక్యం కలుగజేసుకుంటాడని అపేక్షించడం అహంకారమే కాకుండ అది లేఖనాలకు సహితం వ్యతిరేకంగా తయారౌతుంది.—లూకా 14:28, 29.
యేసు ఆవిధంగా ఆలోచించేలా చేయడానికి మరియు తన క్రియలకు తాను బాధ్యత వహించకుండా చేయడానికి సాతాను ప్రయత్నించాడు. రెండవ శోధననుగూర్చి మత్తయి 4:5-7 యిలా నివేదిస్తుంది: “అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి—నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము—ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు, అని వ్రాయబడి యున్నదని ఆయనతో చెప్పెను.” తాను స్పష్టమైన తెలివితక్కువ, ఆత్మహత్య సంబంధిత పద్ధతిని అవలంభించి యెహోవా జోక్యం చేసుకోవాలని ఎన్నడు అపేక్షించలేడని యేసు గుర్తించాడు. కనుక, ఆయన యిలా జవాబిచ్చాడు: ‘ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నది.’
తమ స్వంత ప్రశ్నార్థకమైన క్రియలకు అపవాదిని గానీ దేవున్ని గానీ నిందించే ప్రవృత్తిగల వారు, దేవునికి లేక అపవాదికి బదులుగా నక్షత్రాలను పెట్టే జ్యోతిశ్శాస్త్రాన్ని అనుసరించేవారిని పోలి ఉంటారు. ఇంచుమించు జరిగేదంతా తమ ఆధీనానికి మించి ఉంటుందనే గట్టి నమ్మకంతో గలతీయులు 6:7 నందు పేర్కొన్న చిన్న సూత్రాన్ని మర్చిపోతారు: “మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును.”
వాస్తవాన్ని ఎదుర్కోవడం
మనం అపరిపూర్ణ లోకంలో జీవిస్తున్నామనే విషయాన్ని ఎవరూ తర్కించరు. ఇక్కడ చర్చించిన సమస్యలు వాస్తవమైనవి. ప్రజలు మన నుండి ఆర్థికపరంగా లాభాన్ని పొందుతారు. కొందరు యజమానులు అన్యాయస్థులుగా ఉంటారు. పరిచితులు మన పిల్లలపై తప్పుడు ప్రభావాన్ని కనపరుస్తారు. కొందరు ఉపాధ్యాయులు, పాఠశాలలు అభివృద్ధి చెందాల్సిన అవసరముంది. పెద్దలు కొన్ని సార్లు ఇంకాస్త ప్రేమ శ్రద్ధలను కనపర్చగలరు. అయితే “లోకమంతయు దుష్టునియందున్నది” అని బైబిలు సూచించే దాన్ని బట్టి అపరిపూర్ణత తెచ్చే ప్రభావాన్ని మరలా గుర్తించాలి. కనుక జీవితంలోని మన దారి ఎల్లప్పుడూ సుగమంగా ఉంటుందని అపేక్షించడం అవాస్తవికంగా ఉంటుంది.—1 యోహాను 5:19.
దానికి తోడు, మన స్వంత అపరిపూర్ణతలను పరిమితులను గుర్తించి, మన సమస్యలు అనేకసార్లు మన స్వంత తప్పుల వల్ల కలిగినవే అని మనం గ్రహించాలి. రోమాలోనున్న క్రైస్తవులకు పౌలు యిలా ఉద్బోధించాడు: ‘తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనరాదు అని మీలోనున్న ప్రతివానితోను చెప్పుచున్నాను.’ (రోమీయులు 12:3) ఆ సలహా నేడు అలాగే మనకు అన్వయించబడుతుంది. మన జీవితాల్లో ఏదైనా చెడు జరిగితే, మన పితరులైన ఆదాము హవ్వలను మనం అనుసరించి “అది నా తప్పు కాదు!” అని అనము. బదులుగా, మనలను మనం ఇలా ప్రశ్నించుకుంటాం, ఈ అసంతోషకరమైన పరిణామం సంభవించకుండా ఉండేందుకు నేను వేరేమి చేసి ఉండేవాణ్ణి? ఈ విషయంలో నేను మంచి వివేచనను ప్రదర్శించి, జ్ఞానయుక్తమైన మూలంనుండి సలహాను పొందానా? అందులో ఇమిడివున్న నా ఎదుటి వ్యక్తికి లేక వ్యక్తులకు గౌరవాన్నిస్తూ తమ పక్షంలో ఏ తప్పు లేదనే ఆలోచనను కలిగించానా?
మనం క్రైస్తవ సూత్రాలను అనుసరించి, మంచి వివేచనను కల్గివుంటే, మనకు ఎక్కువ స్నేహితులుండి తక్కువ సమస్యలుంటాయి. మన ప్రతిదిన జీవితంలో అనవసరమైన సమస్యలు పరిష్కరించబడతాయి. ఇతరులతో మనం వ్యవహరించే విధానంలో మనం ఆనందాన్ని కనుగొనగలము, అంతేకాకుండ, “ఆ తప్పు ఎవరిది?” అనే ప్రశ్నతో మనం కలతచెందము.
[28వ పేజీలోని చిత్రాలు]
తమ పిల్లలు ఆత్మీయంగా వర్థిల్లేలా సహాయపడడంలో తల్లిదండ్రులు ఎంతో చేయగలరు