యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించండి
“దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.”—హెబ్రీయులు 13:15.
1. ప్రవక్తైన హొషేయ ఏమి చేయమని తోటి ఇశ్రాయేలీయులకు ఉద్బోధించాడు?
యెహోవా ప్రవక్తైన హొషేయ తన తోటి ఇశ్రాయేలీయులకు ఓ ప్రాముఖ్యమైన సమాచారాన్ని కల్గివున్నాడు. సామాన్య శకానికి ముందు ఎనిమిదవ శతాబ్దంలో, అవిధేయులైన తన సమకాలీకులను పశ్చాత్తాపపడమని ఆయన వేడుకున్నాడు. ఆయన యిలా ఉద్బోధించాడు: “మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా—మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.” (హొషేయ 14:2) యెహోవాకు ‘ఎడ్లకు బదులుగా వారి పెదవులనర్పించ’మని ప్రజలను ఉద్బోధించడంలో, ఇశ్రాయేలీయులను పశ్చాత్తాపపడమనీ దేవునికి యథార్థమైన స్తుతియాగాల అర్పణను అర్పించమని హొషేయ ప్రవచనం ప్రోత్సహిస్తోంది.
2. ఎలాంటి అర్పణను క్రైస్తవులు అర్పించాలని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు?
2 నేడు యెహోవాసాక్షులు ‘ఎడ్లకు బదులుగా వారి పెదవులనర్పి’స్తారు. హొషేయ ప్రవచనాన్ని సూచించిన అపొస్తలుడైన పాలు ఉద్బోధను కూడా వారు లక్ష్యపెడతారు. ఆయన యిలా రాశాడు: “ఆయనద్వారా [యేసుక్రీస్తు] మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పు”కొందుము. (హెబ్రీయులు 13:15) కాబట్టి, తమ రాజ్య ప్రచార పనిలో చేస్తున్నట్లుగా దేవుని సేవకులు యెహోవాను ఆనందంగా స్తుతిస్తారు.—మత్తయి 24:14.
3. మనం యెహోవాకు “స్తుతియాగమును” ఎలా అర్పించగలము, మరి ఎవరి కార్యాలను మనం యిప్పుడు పరిశీలిస్తాము?
3 యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించడం అపరిపూర్ణ మానవులు పొందదగని ఒక ఆధిక్యత. మన దేవున్ని గూర్చి యితరులకు ప్రకటించడం ద్వారా మనం ఎంత ఆనందాన్ని పొందుతాము, అలా మనం యెహోవాకు “స్తుతియాగము,” అనగా ‘ఎడ్లకు బదులుగా మన పెదవుల నర్పిస్తాము.’ నేడు రాజ్యసువార్తను బహిరంగంగా ప్రకటించడంలో మనం ప్రోత్సహించబడేందుకు, దేవుని ప్రవక్తలను గూర్చి, యితర యెహోవా సేవకులను గూర్చి బైబిలు మనకేమి చెబుతోందో మనం పరిశీలిద్దాం. వారి జీవిత విధానం నుండి, మన పరిచర్య పనిని ఆనందంగా జరిగించేందుకు సహాయపడగల విషయాలనెన్నింటినో మనం నేర్చుకోగలము.—రోమీయులు 15:4.
ప్రవక్తల పాత్ర
4, 5. (ఎ) బైబిలు నందలి మూల భాషలో “ప్రవక్త” అని అనువదించబడిన మాటల మూల భావమేమిటి? (బి) దేవుని ఏర్పాటులో ప్రవక్తలకు ఒక ప్రాముఖ్యమైన పాత్రవుందని ఏది సూచిస్తుంది?
4 యెహోవా ప్రవక్తలు ఆయన సమాచారాన్ని ప్రకటించే ఆధిక్యతను కల్గివుండేవారు. “ప్రవక్త” (నావి) అనే దాని హెబ్రీ పదానికి అనిర్దిష్టమైన శబ్దలక్షణం ఉంది, అయితే దాన్ని బైబిలులో ఉపయోగించడం, నిజమైన ప్రవక్తలు అంటే ప్రేరేపిత సమాచారాలుగల దేవుని మనుష్యులు యెహోవాకు వాగ్దూతలుగా ఉండేవారు అని అది సూచిస్తుంది. “ప్రవక్త” (ప్రోఫెటెస్) అని అనువదించబడిన గ్రీకు పదం యొక్క అక్షరార్థమైన భావం “బహిరంగంగా మాట్లాడడం.” ఒకరి “ఎదుట” లేక “ముందు” ఏదొక విషయాన్ని చెప్పడం. ఒక ప్రవక్త అంటే, దైవిక మూలానికి ఆపాదించబడిన సమాచారాన్ని ప్రకటించే వ్యక్తి అని అర్థం. అన్ని సమయాల్లోనూ కాకపోయినా తరచూ, దేవుని నిజమైన ప్రవక్తలు భవిష్యత్ సంఘటనలను ప్రవచించారు.
5 దేవుని ఏర్పాటులో ప్రవక్తల ప్రాముఖ్యమైన పాత్రను గూర్చి మాక్. క్లిన్టాక్ మరియు స్ట్రాంగ్స్ రాసిన సైక్లోపీడియా యిలా పేర్కొంది: “కొన్నిసార్లు వారి సలహా కోరడం జరిగింది . . . కానీ తరచూ వారి సలహా కోరబడనప్పటికీ తమంతట తామే ప్రజలనుద్దేశించి మాట్లాడడానికి వారు లోలోన పురికొల్పబడేవారు, అంతేకాకుండా వారు అలా మాట్లాడుతూ కనిపించడం బహుశ కోపాన్ని భయాన్ని కలిగించే అవకాశమున్న ప్రాంతాల్లో సహితం వారు ముందుకొచ్చి మాట్లాడడానికి భయపడలేదు.” (సంపుటి VIII, పేజీ 640) అలాంటి సాహసోపేతమైన స్థానాన్ని కొందరు ప్రవక్తలు కల్గివుండేందుకు వారిని పురికొల్పిన కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
భావాలూ మరియు ప్రేరణ
6, 7. యెహోవా తన ప్రవక్తైన యెహెజ్కేలును ఏమి తినేటట్లు చేశాడు, మరి అది ఏ ప్రభావాన్ని చూపింది?
6 సా.శ.పూ 607లో యెరూషలేము నాశనానికి ముందు, బబులోను నందు చెరలో ఉన్న యూదులతో తన ప్రవక్తైన యెహెజ్కేలు ద్వారా యెహోవా మాట్లాడాడు. యెహోవా ఆయనతో యిలా అన్నాడు: “నరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము.” యెహెజ్కేలు అలాగే చేశాడు. ఆయన యిలా అన్నాడు: “నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి—నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను.”—యెహెజ్కేలు 3:1-3.
7 మన శరీరాలు మనం తినే ఆహారంనుండి పోషక పదార్థాలను తీసుకుంటాయి, అంతేకాక ఒక భావంలో యివి మనలో ఒక భాగమౌతాయి. అదే విధంగా, యెహెజ్కేలు తినిన “గ్రంథము” అంటే, ఆ ప్రవక్త ప్రకటించాల్సిన యెహోవా సమాచారం తన భావోద్రేకాలను ప్రభావితం చేస్తూ తనలో ఒక భాగం కావాలి. దేవుని మాటలు యెహెజ్కేలు అంతర్గత భావాలను ఎంతగా కదిలించాయంటే, వాటిని బహిరంగంగా ప్రకటించడం ఆయనకు ఆనందంగా ఉండేది. మీరు యెహోవాసాక్షి అయితే, దేవుని సమాచారాన్ని బహిరంగంగా ప్రకటించడంలో మీరు సంతోషిస్తారా?
8, 9. ఆమోసు ప్రవచించేటట్లుగా ఆయనను ఏది కదిలించింది?
8 ప్రవక్తైన ఆమోసు విషయం కూడా పరిశీలించండి. సా.శ.పూ తొమ్మిదవ శతాబ్దంలో జీవిస్తూ, తన పేరుతో ఉన్న బైబిలు పుస్తకాన్ని రాసిన తొలి హెబ్రీ ప్రవక్తల్లో ఆయన ఒకడు. యెహెజ్కేలువలె ఆమోసు కూడా యెహోవా మాటలను ప్రకటించడంలో విస్పష్టంగా ఉండేవాడు. అంతెందుకు, తన పేరుగల పుస్తకమంతటిలో “యెహోవా సెలవిచ్చునది” అనే మాటను 11 సార్లు ప్రస్తావించాడు. (ఆమోసు 1:3, 6, 9, 11, 13; 2:1, 4, 6; 3:12; 5:4; 7:17) దేవుని మాటల్ని బహిరంగంగా ప్రకటించే అవసరత ఉందని ఆమోసు భావించాడు.
9 దేవుని ప్రవక్తగా సత్వర చర్యలతో దైవిక ప్రకటనలకు ఆమోసు ప్రతిస్పందించాడు. ఆమోసు ద్వారా దేవుడు యిలా అన్నాడు: “సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు.” (ఆమోసు 3:8) ఆ ప్రవక్త యెహోవా యొక్క సమాచారాన్ని ప్రకటించేందుకు ప్రబలంగా పురికొల్పబడ్డాడు.
10. యెహోవా ఆధునికదిన సేవకుల ప్రకటనాపని వ్యతిరేకించబడినప్పుడు వారు ఎలా ప్రతిస్పందిస్తారు?
10 సింహంలా, ప్రస్తుత లోక దుష్ట విధానంపై యెహోవా తన సమాచారాన్ని గర్జనతో విడుదల చేస్తున్నాడు. ఆమోసులా, యెహోవా ఆధునికదిన సేవకులు దేవుని వాక్యాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు ప్రేరేపించబడతారు. వ్యతిరేకులు బెదిరించినప్పటికీ, వారు అపొస్తలులైన పేతురు యోహానుల మాదిరిని అనుసరిస్తారు. వారు గంభీరంగా యిలా ప్రకటించారు: “మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేము.” అపొస్తలులు యిలా కూడా నిశ్చయార్థకంగా చెప్పారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.” (అపొస్తలుల కార్యములు 4:20; 5:29) మరి మన విషయమేమిటి? యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించే విషయంలో మన భావాలను పరిశీలించుకోవడం ఎంతైనా మంచిది.
“హృదయము నిండియున్నదానినిబట్టి”
11. యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించడంలో పట్టుదలతో కొనసాగడానికి మనలను ఏది పురికొల్పాలి?
11 యెహోవా ప్రవక్తలు తమ ఆధిక్యతలకు ఎంతో కృతజ్ఞులైయున్నారన్న విషయంపై ఏ సందేహమూ ఉండనవసరం లేదు. యెహోవా యెడల అలాంటి కృతజ్ఞతా భావం, బహిరంగంగా ఆయన నామాన్ని ప్రకటించేందుకు మనలను కదిలించాలి. కీర్తన 145:1, 2 యిలా పేర్కొంటోంది: “రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.” ఆ మాటలు మీ మనో వైఖరిని ప్రతిబింబిస్తున్నాయా? క్రమమైన బైబిలు పఠనం, యెహోవా మనకు చేసినవాటి యెడల, చేస్తున్న వాటి యెడల, చేయబోయే వాటి యెడల మన మెప్పును మరింత అధికం చేయడానికి సహాయపడుతుంది. మరి మనం ఒక కుటుంబంగా బైబిలును కలిసి చదువుకున్నప్పుడు, ఆయనను గూర్చి ఆయన సంకల్పాలను గూర్చి మనం మాట్లాడాలన్న కోరికను మనలో కలిగించేందుకు దేవుని వాక్యం బలముగలదని మనం కనుగొనమా? (హెబ్రీయులు 4:12) యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించడంలో మనం ఫలభరితంగా ఉండేందుకు, “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా యెహోవా దేవుడు అందించే క్రైస్తవ ప్రచురణలను కూడ మనం పూర్తిగా ఉపయోగించుకోవల్సిన అవసరముంది.—మత్తయి 24:45-47.
12. క్రైస్తవ కూటాలు మరియు ధ్యానము బహిరంగంగా ప్రకటించేందుకు ఎలా సహాయపడగలవు?
12 కృతజ్ఞతా పూర్వకమైన హృదయంతో మనం యెహోవాను స్తుతించాలంటే మనం క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావాల్సిన అవసరముంది. యెహోవా ప్రజలందరూ అపొస్తలుడైన పౌలు హెచ్చరికను లక్ష్యపెట్టాలి: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) మీరు క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరౌతున్నారా? దేవుని ప్రజల కూటాల్లో మీరు వినే లేఖనాధార సత్యాలను గూర్చి, చక్కని అనుభవాలను గూర్చి, దైవపరిపాలన విస్తరణకు సంబంధించిన ఉప్పొంగజేసే వార్తలను గూర్చి మీరు తరచూ మాట్లాడతారా? యెహోవాను గూర్చి, ఆయన సంకల్పాలను గూర్చి మాట్లాడేందుకు మీరు అయిష్టపడుతూవుంటే, ఆయన ఆలోచనలు మీ హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోయేందుకు వీలుగా ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని కేటాయించండి. (కీర్తన 77:12; 143:5) అవును, క్రైస్తవ కూటాలు, అలాగే క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం రెండు కూడా యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించే అద్భుతమైన ఆధిక్యతను గుణగ్రహించడానికి మీకు సహాయపడాలి.
13. మనం మన హృదయాల నుండి ఎలా ‘సద్విషయాలను బయటికి తీసుకు’వస్తాము?
13 యెహోవా యెడల నిండైన కృతజ్ఞతతో మనం సద్విషయాలను తీసుకొస్తాము. “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియున్నదానిని బట్టి ఒకని నోరు మాటలాడును” అని యేసు సహేతుకంగా చెప్పాడు. (లూకా 6:45) ‘సద్విషయములను బయటికి తీసుకురావడానికి,’ మన పొరుగువారికి, మన బంధువులకూ—వాస్తవానికి మనం కలిసే ప్రతిఒక్కరికీ యెహోవా నామాన్ని గూర్చి బహిరంగంగా ప్రకటించడం, ఆయన సంకల్పాలను గూర్చి మాట్లాడడం కంటే శ్రేష్ఠమైన పద్ధతి వేరే ఏముంది?
బహిరంగంగా ప్రకటించడంవల్ల కలిగే ఫలితాలు
14. (ఎ) రాజ్య వర్తమానాన్ని ప్రకటించేవారు, వినేవారు ఏమి అనుభవించగలరు? (బి) రాజ్య ప్రచార పని ద్వారా ఏమి సాధించబడుతూవుంది?
14 యెహోవా ప్రజలు తమ సేవలో ఆనందాన్ని కనుగొన్నారు, అంతేకాకుండా వారు చెప్పినదానినుండి, గ్రహించగల ప్రేక్షకులు ప్రయోజనం పొందారు. రాజ్య వర్తమానాన్ని బహిరంగంగా ప్రకటించడం, దాన్ని ప్రకటించే వారికి గొప్ప ఆనందాన్ని తెస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:35) మరి మెప్పుదల గల ప్రేక్షకులకు యిది ఎంత ప్రయోజనకరం! సువార్తను అంగీకరించడం ప్రజలు తమ కృంగుదలను జయించడానికి లేక దాన్ని తాళుకోడానికి దోహదపడుతుంది. తమ ప్రియమైనవారిని కోల్పోయినవారు పునరుత్థాన ఉత్తరాపేక్ష విషయంలో ఆనందిస్తారు. వ్యసనపరులు నికోటిన్, హెరాయిన్, యితర వ్యసనాలకు గురిచేసే పదార్థాల దాసత్వం నుండి తప్పించుకుంటారు. అనేకులు నైతికంగా ఉద్ధరించబడ్డారు, మరి బైబిలు సత్యాలను అంగీకరించేవారందరు ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని పొందుతారు. (యోహాను 5:28, 29; 8:32) మానవజాతి ఏకైక నిరీక్షణగా రాజ్యాన్ని గూర్చి ప్రకటించడం, యథార్థహృదయుల్లో ఆనందభరితమైన ప్రతిస్పందనను రేకెత్తించడమేకాకుండా దుష్టులకు ఒక హెచ్చరికగా కూడా పనిచేస్తుంది. ఆ విధంగా, ఈ దుష్టలోకంపై దైవిక తీర్పు వెలువడినప్పుడు ప్రజలు అటు “నిత్యనాశనం” వైపుకుగానీ యిటు “నిత్యజీవము” వైపుకుగానీ వేరుపర్చబడతారు. (మత్తయి 24:14; 25:31-46; యెహెజ్కేలు 33:1-9; 1 తిమోతి 2:3, 4) మన ప్రచారపని అపూర్వమైన రక్షణ పని, అది భూమి మీద యింతవరకూ సాధించబడిన వాటిలోకెల్లా అతి విస్తృతంగా వ్యాప్తమైన బహిరంగ ప్రకటనాపని!
15. సాక్ష్యమిచ్చే మన ప్రాంతంలో కాబోయే యోగ్యమైనవారికి సహాయం చేయడానికి ఏమి చేయవచ్చు?
15 యెహోవా ఆధునిక దిన సేవకులుగా మనం, ఆనందంగా విధేయతతో మన పరలోక తండ్రిని సేవిస్తాము. (రోమీయులు 12:11) కాబట్టి, రాజ్య సువార్తను బహిరంగంగా యింటింటికీ ప్రకటించే పనిలో క్రమంగా పాల్గొనేందుకు మనం సమయాన్ని కేటాయించడానికి సంతోషిస్తాము. (అపొస్తలుల కార్యములు 5:42; 20:20) మన ప్రాంతాల్లో కొందరు యోగ్యులైనవారు యింకా ఉన్నారని ప్రపంచవ్యాప్త నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచంలోని పరిస్థితులు మారుతున్నకొలది, ప్రజలు అనేక విధాల్లో ప్రభావితం చెందుతున్నారు. అనేకులు అనుకోకుండా శరణార్థులయ్యారు, అంటే పరదేశాల్లో శరణుజొచ్చారు. బహుశ మనం సాక్ష్యమిచ్చే ప్రాంతంలో అలాంటివారు ఉండివుండవచ్చు. అలా ఉన్నట్లైతే, “పరిశుద్ధపర్చబడిన” సువార్త పనిలో మనం ఎడతెగక పనిచేస్తుండగా ఆత్మీయంగా వారికి సహాయపడేందుకు మనకు చేతనైనదంతా చేద్దాము. (రోమీయులు 15:16) అలాంటి వారికి రాజ్య సువార్తను ప్రకటించేందుకు గాను కొందరు క్రైస్తవులు మరో భాషను నేర్చుకున్నారు.
16. యెహోవా నామాన్ని పట్టుదలతో ప్రకటించడంలో కొనసాగేందుకు మనకు ఏమి తోడ్పడగలదు?
16 దేవుని ప్రవక్తల్లో అనేకులకు ఎంతో కష్టతరమైన పనులు చేయవల్సి ఉండేవి. గ్రహించలేని ప్రజలకు దైవిక సమాచారాన్ని ప్రకటించడం అంత సులభమైన పనిగా ఉండేది కాదు. అదే విధంగా, ప్రత్యేకంగా ఎక్కువగా స్పందన లేని ప్రాంతాల్లో, యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించడం ఆయనకు సమర్పించుకున్న వారందరికీ సులభం కాదు. అయితే, ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని పఠించడంతో పాటు యెహోవా అందించే శక్తి మూలంగా వచ్చే నమ్మకాన్ని కల్గివుండడం ద్వారా మనం రాజ్య వర్తమానాన్ని ప్రకటించడంలో కొనసాగగలము. (ఫిలిప్పీయులు 4:13; ప్రకటన 14:6) ఈ విషయంలో, యెహోవా ప్రవక్తల నుండి, ప్రాచీన కాలంలో ఆయన యితర సేవకుల నుండి మనం యింకా ఏమి నేర్చుకోగలము?
ప్రాంతీయసేవలో తోడు
17. దేవుని సేవలో ప్రయోజనకరమైన తోడును గూర్చి లేఖనాధార ఉదాహరణలు కొన్ని ఏవి?
17 మొదట్లో తనకు అప్పగించిన పనిని నిర్వహించడంలో మోషేకు తన పెద్దన్న అహరోను సహాయం ఉండేది. యెహోవా మోషేతో యిలా చెప్పాడు: “అతడే [అహరోను] నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును.” (నిర్గమకాండము 4:16) ప్రవక్తలైన ఏలీయా ఎలీషాలు ఉన్న రోజులో, “ప్రవక్తల శిష్యులు” వర్ధిల్లుతున్న కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. నిస్సందేహంగా వీరు, ఒకరితో ఒకరు ఆహ్లాదకరమైన సహవాసాన్ని అనుభవించిన దేవునిసేవకుల గుంపులయ్యుండవచ్చు. (2 రాజులు 2:3-5; 4:38; 1 సమూయేలు 10:5, 10.) మోషే, అహరోను, “ప్రవక్తల శిష్యులు” రాజ్య సువార్త ప్రకటించే పనిచేయలేదు. అయినప్పటికీ, వారి సహవాసం అందరికీ ప్రయోజనకరంగా ఉండేది. శతాబ్దాల తర్వాత, యేసుక్రీస్తు 70 మంది శిష్యులను “ఇద్దరిద్దరినిగా” పరిచర్యకు పంపించాడు, నిస్సందేహంగా అలా వారికి అందించబడిన తోడువల్ల వారు ప్రయోజనం పొందారు.—లూకా 10:1-16; అపొస్తలుల కార్యములు 17:10, 11; 20:20లను పోల్చండి.
18. పరిచర్యకు కలిసి వెళ్లడం నేడు ఏ ఉద్దేశాన్ని నెరవేర్చింది?
18 ప్రాంతీయ సేవలో రాజ్య ప్రచారకులు కలిసి పనిచేసే కార్యక్రమాన్ని 1953వ సంవత్సరంలో యెహోవాసాక్షులు ప్రారంభించారు. దీన్ని కేవలం తోడుకొరకు జరపలేదు. ఈ శిక్షణా కార్యక్రమం దేవుని సేవకులు సువార్త యొక్క మరింత శ్రేష్టమైన బోధకులూ ప్రచారకులవ్వడానికి రూపుదిద్దబడింది. ఆ ఉద్దేశాన్ని మనస్సులో ఉంచుకుని, ఎక్కువ అనుభవం గల రాజ్య ప్రచారకులు కొత్తవారితో పరిచర్యలో పాలుపంచుకున్నారు. ఈ యింటింటి శిక్షణా కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమైంది, అంతేకాకుండా అది యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించడంలో ఆయన ప్రజలు అభివృద్ధిని సాధించేందుకు సహాయపడింది. (1 తిమోతి 4:16) నేడు, ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో, రక్షణ కొరకు క్రైస్తవులు పరిచర్యనందు ‘ఇద్దరిద్దరుగా,’ వెళ్లడం శ్రేయస్కరం.
19. పరిచర్య యందు వ్యక్తిగత గమ్యాలను ఏర్పర్చుకునే విషయంలో వేటిని మనస్సులో ఉంచుకోవాలి?
19 మీరు మీ తోటి విశ్వాసితో పరిచర్య చేస్తున్నప్పటికీ, లేక ఒంటరిగానే యింటింటికి వెళ్తున్నప్పటికీ, ఏదొక వ్యక్తిగత గమ్యాన్ని లేక ఉద్దేశాన్ని చేరుకోడానికి ప్రయత్నించండి. ఆ గమ్యం వాస్తవికంగా ఉండాలి, చేరుకునేందుకు అనువుగా ఉండాలి. మీ ప్రాంతంలో ఆసక్తిని రేకెత్తించేందుకుగాను మీ పరిచయ ప్రసంగాన్ని అనువైన విధంగా మార్చుకోవడంలో మీకు సహాయం అవసరమా? అలాగైతే, బహుశ మంచి పరిచయ ప్రసంగాన్ని ఉపయోగించడంలో ఫలభరితంగా ఉన్న పూర్తికాల రాజ్య ప్రచారకుడైన ఓ పయినీరుతో లేక ప్రకాశకునితో మీరు వెళ్లవచ్చు. మీకు తోడుగా వచ్చినవారు, మన రాజ్య పరిచర్య లేక బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే బుక్లెట్లో అందించిన ఉపోద్ఘాతాలను మీరు సిద్ధపడి ఉపయోగించడానికి బహుశ మీకు సహాయపడవచ్చు. మీరు యింటింటి సేవలో కలిసి సాక్ష్యమిస్తున్న సందర్భాల్లో, మీతో పనిచేసే వారు మాట్లాడేవాటిని శ్రద్ధగా వినండి. అప్పుడు, మీ పరిచర్యనందు ఈ విషయంలో మీరు నిష్ణాతులయ్యేంతవరకూ అలా మాట్లాడడానికి మీకై మీరు ప్రయత్నించండి.
20, 21. ప్రాంతీయ సేవలో తోడు కల్గివుండడం సహాయకరంగా ఉండేటట్లు ప్రత్యేకంగా ఏది చేయగలదు?
20 గృహ బైబిలు పఠనాలను ప్రారంభించే దృష్టితో మీరు ఫలభరితమైన పునర్దర్శనాలను చేసే విషయంలో మీకు సహాయం అవసరమైతే అప్పుడేమి చేస్తారు? బహుశ మీ సంఘ పుస్తక పఠన నిర్వాహకుని ద్వారా బైబిలు పఠనాలను ప్రారంభించడంలో ఎంతో సఫలవంతుడైన రాజ్య పరిచారకునితో మీరు ప్రాంతీయ సేవలో పనిచేయడానికి ఏర్పాట్లు చేయబడగలవు. కలిసి పునర్దర్శనాలను చేస్తున్నప్పుడు మీరు కేవలం మౌన భాగస్వామిగా ఉండకండి. బదులుగా, ఒక సందర్శనంలో ఆయన లేక ఆమె విషయాలతో ఎలా వ్యవహరిస్తారో చూపించిన తర్వాత, తదుపరి పునర్దర్శనంలో మీరే అలా మాట్లాడడం ఉపయుక్తంగా ఉన్నట్లుగా కనుగొంటారు. కలిసి పనిచేస్తున్నవారు సహాయంచేయడానికి, తర్వాత సలహాలివ్వడానికి మీతో ఉంటారు.—గలతీయులు 6:6 పోల్చండి.
21 ప్రాంతీయ సేవలో కలిసి పనిచేసే వ్యక్తినుండి పొందే అలాంటి ప్రేమపూర్వక సహాయం మీరు మీ పరిచర్యలో ఏర్పర్చుకున్న గమ్యాలను చేరుకోడానికి సహాయపడుతుంది. ఈ సహాయమూ దానికి తోడు ఈ ఆధిక్యతగల పనిలో మీరు పనిచేయడానికి అనుమతించిన యెహోవా కృప యెడల మీ నిండైన మెప్పుదల, రాజ్య ప్రచార కార్యక్రమాల్లో మీరు మరింత జయప్రదంగా పనిచేయడానికి దోహదపడుతుంది. అంతేకాకుండ, యెహోవాను గూర్చి మంచిగా మాట్లాడుతూ, ఆయన నామాన్ని గూర్చి క్రమంగా బహిరంగంగా ప్రకటించడం ద్వారా మీరు మీ ఆధిక్యతను కాపాడుకొనగలరు.—కీర్తన 145:1, 2, 9-13.
22. మన తదుపరి శీర్షిక ఏ ప్రశ్నలకు జవాబునివ్వడానికి సహాయపడుతుంది?
22 యెహోవాసాక్షులుగా మన యింటింటి పరిచర్యలో మనం అనేక పునర్దర్శనాలను చేస్తుంటాం. అనేకులు సువార్తను లోతైన మెప్పుదలతో వింటున్నారు. అయినప్పటికీ, కొందరు రాజ్య వర్తమానాన్ని వినడానికి విముఖతను కల్గివుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? యెహోవా తన ప్రజలకు నియమించిన పనిలో మనం పట్టుదలతో ఎలా కొనసాగగలము? లేఖనాధారమైన ఏ ఉదాహరణలు మనకు సహాయపడతాయి లేక మనలను నడిపిస్తాయి? ఈ ప్రశ్నలకు తదుపరి శీర్షికలో జవాబులివ్వబడతాయి.
మీరు ఈ విషయాలను గ్రహించారా?
◻ హొషేయ అలాగే అపొస్తలుడైన పౌలు, ఈ యిద్దరూ దేవునికి అర్పించేవాటిని గూర్చి ఏమి చెప్పారు?
◻ యెహెజ్కేలు, ఆమోసులు ప్రవచించేటట్లుగా వారిని ఏది కదిలించింది?
◻ మన రాజ్య ప్రచార పనిని మనం ఎలా దృష్టించాలి?
◻ ప్రాంతీయ పరిచర్యలో తోడును కల్గివుండడంవల్ల ఏ ప్రయోజనాలను పొందవచ్చు?
[13వ పేజీలోని చిత్రాలు]
ఉద్దేశసహితమైన తోడు కల్గివుండడం మనం మన పరిచర్యలో అభివృద్ధిని సాధించడానికి తోడ్పడగలదు?