కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/15 పేజీలు 15-20
  • దేవుని ప్రవక్తలను మాదిరిగా తీసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని ప్రవక్తలను మాదిరిగా తీసుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వారు శ్రమను అనుభవించారు
  • వారు ఓర్పును చూపారు
  • ‘వారు ఆలాగుననే చేసిరి’
  • వారు అనుకూలమైన వైఖరిని కల్గివుండేవారు
  • ప్రోత్సాహానికి మూలాధారాలు
  • ఆసక్తి మరియు కనిపెట్టుకొనుండే వైఖరి
  • నేడు ఓర్పును అభ్యసించడం
  • దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ‘అన్యజనులకు ఈ సమాచారం ప్రకటించండి’
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • యెహోవా ఓర్పును అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెహోవా నామాన్ని బహిరంగంగా ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/15 పేజీలు 15-20

దేవుని ప్రవక్తలను మాదిరిగా తీసుకోండి

“నా సహోదరులారా, ప్రభువు (యెహోవా NW) నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.”—యాకోబు 5:10.

1. యెహోవా సేవకులు హింసించబడినప్పటికీ, ఆనందంగా ఉండేందుకు వారికేది సహాయపడుతుంది?

ఈ అంత్యదినాల్లో విశ్వవ్యాప్తంగా వ్యధ ఉన్నప్పటికీ యెహోవా సేవకులు ఆనందాన్ని ప్రసరింపజేస్తున్నారు. అదెందుకంటే వారు దేవున్ని ప్రీతిపరుస్తున్నారని వారికి తెలుసు. హింస, అలాగే తమ బహిరంగ ప్రకటనకు వచ్చే వ్యతిరేకతల్లో కూడా యెహోవాసాక్షులు ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే వారు నీతి కొరకే బాధననుభవిస్తున్నారని వారు గ్రహిస్తారు. యేసుక్రీస్తు తన అనుచరులకు యిలా చెప్పాడు: “నానిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునపుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” (మత్తయి 5:10-12) వాస్తవానికి, దేవుని సేవకులు శ్రమలను ఎదుర్కొన్నప్పుడెల్లా అది మహానందమని వారు పరిగణిస్తారు.—యాకోబు 1:2, 3.

2. యాకోబు 5:10 ప్రకారం, ఓర్పును చూపేందుకు మనకు ఏది తోడ్పడుతుంది?

2 శిష్యుడైన యాకోబు యిలా రాశాడు: “నా సహోదరులారా, ప్రభువు (యెహోవా NW) నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.” (యాకోబు 5:10) ఇక్కడ “మాదిరి” (హైపోడిగ్మా) అని అనువదించబడిన గ్రీకు పదాన్ని, “మంచి విధంలో, ఒకరు దాన్ని అనుసరించేటట్లుగా పురికొల్పాల్సిన లేక తప్పక పురికొల్పే ఉదాహరణ, నమూనా, మాదిరి” అని డబ్ల్యు. ఎఫ్‌. ఆర్న్‌ట్‌, ఎఫ్‌. డబ్ల్యు. గింగ్రిచ్‌ నిర్వచించారు. యోహాను 13:15 నందు చూపిన ప్రకారంగా, “యిది కేవలం ఉదాహరణే కాదు. అది నిర్దిష్టమైన నమూనా” (కొత్త నిబంధన యొక్క మతపర నిఘంటువు (ఇంగ్లీష్‌)) కనుక యెహోవా ఆధునికదిన సేవకులు, ‘శ్రమానుభవము ఓపిక’ విషయాల్లో ఆయన నమ్మకమైన ప్రవక్తల మాదిరిని తీసుకోవచ్చు. వారి జీవితాలను పరిశీలించినప్పుడు మనం యింకా ఏమి నేర్చుకోగలము? మరి యిది మన పరిచర్య పనిలో మనకు ఎలా సహాయపడగలదు?

వారు శ్రమను అనుభవించారు

3, 4. ప్రవక్తైన ఆమోసు, అమజ్యా నుండి వచ్చిన వ్యతిరేతకు ఎలా ప్రతిస్పందించాడు?

3 యెహోవా ప్రవక్తలు తరచూ శ్రమను లేక నిరాదరణను అనుభవించారు. ఉదాహరణకు సా.శ.పూ తొమ్మిదవ శతాబ్దంలో దూడను ఆరాధించే యాజకుడైన అమజ్యా, ఆమోసు ప్రవక్తను కర్కషంగా వ్యతిరేకించాడు. రెండవ యెరొబాము కత్తిచేత మరణిస్తాడని, ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్తారని ఆమోసు ప్రవచించడం ద్వారా ఆయన రాజుపై కుట్రపన్నాడని అమజ్యా అబద్ధారోపణ చేశాడు. తిరస్కారంతో అమజ్యా ఆమోసుతో యిలా అన్నాడు: “దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదాదేశమునకు పారి పొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము; బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠితస్థలము రాజధాని పట్టణమైయున్నందున నీ వికను దానిలో నీవార్త ప్రకటనచేయ కూడదు.” ఈ మౌఖిక దాడికి భయపడకుండా ఆమోసు యిలా జవాబిచ్చాడు: “నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్తయొక్క శిష్యుడనైననుకాను, కాని పసులకాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి—నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను.”—ఆమోసు 7:10-15.

4 యెహోవా ఆత్మ ఆమోసుకు ధైర్యంగా ప్రవచించే శక్తినిచ్చింది. “యెహోవా మాట ఆలకించుము—ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చునదేమనగా—నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులును కుమార్తెలును ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు” అని ఆమోసు అన్నప్పుడు అమజ్యా ప్రతిస్పందనను ఊహించుకోండి. ఆ ప్రవచనం నెరవేరింది. (ఆమోసు 7:6, 17) మతభ్రష్టుడైన అమజ్యా ఎంత ఖంగుతినివుంటాడు!

5. యెహోవా ఆధునికదిన సేవకుల పరిస్థితికీ ప్రవక్తైన ఆమోసు పరిస్థితికీ మధ్య ఏ సమాంతరం ఉంది?

5 ఇది, నేడు యెహోవా ప్రజల పరిస్థితివలె ఉంది. దేవుని వర్తమానాన్ని ప్రకటించేవారిగా మనం శ్రమను అనుభవిస్తాము, అంతేకాక అనేక మంది ప్రజలు మన పరిచర్య పనిని గూర్చి తృణీకారంతో మాట్లాడుతారు. నిజమే, ప్రకటించాలన్న అనుమతి వేదాంత పాఠశాలలనుండి మనకు రాదు. బదులుగా, రాజ్య సువార్తను ప్రకటించడానికి యెహోవా పరిశుద్ధాత్మ మనలను ప్రేరేపిస్తుంది. దేవుని సమాచారాన్ని మనం మార్చము లేక దాని ప్రభావాన్ని తగ్గించము. దానికి విరుద్ధంగా ఆమోసువలె వినేవారి ప్రతిస్పందన ఎలా ఉన్నప్పటికీ మనం విధేయతతో దానిని ప్రకటిస్తాము.—2 కొరింథీయులు 2:15-17.

వారు ఓర్పును చూపారు

6, 7. (ఎ) యెషయా ప్రవచించడంలోని విశేష లక్షణం ఏమిటి? (బి) యెహోవా ఆధునిక దిన సేవకులు యెషయాలా ఎలా ప్రవర్తిస్తున్నారు?

6 దేవుని ప్రవక్తలు ఓర్పును చూపారు. ఉదాహరణకు, సా.శ.పూ ఎనిమిదవ శతాబ్దంలో యెహోవా ప్రవక్తగా పనిచేసిన యెషయా ఓర్పును కనపర్చాడు. దేవుడు ఆయనతో యిలా అన్నాడు: “నీవు పోయి యీ జనులతో ఇట్లనుము—మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుము.” (యెషయా 6:9, 10) ప్రజలు నిజంగా అలాగే ప్రతిస్పందించారు. అయితే యిది యెషయా ఆ పనిని మానుకోడానికి దారితీసిందా? లేదు. బదులుగా, ఆయన ఓర్పుతో ఆసక్తిగా యెహోవా హెచ్చరిక వర్తమానాల్ని ప్రకటించాడు. పైన సూచించబడిన దేవుని వాక్యపు హెబ్రీ పదాలు, ప్రకటించడంలో ప్రవక్తలు “దీర్ఘంగా కొనసాగే” ఆలోచనకు మద్దతునిస్తున్నాయి, మరి ప్రజలు దాన్ని “నిత్యము” విన్నారు.—గెజెనియస్‌ హీబ్రూ గ్రామర్‌.

7 యెషయా ద్వారా అందజేయబడిన యెహోవా మాటలకు ప్రతిస్పందించినట్లుగానే నేడు అనేకమంది ప్రజలు సువార్తకు ప్రతిస్పందిస్తున్నారు. అయితే, ఆ నమ్మకమైన ప్రవక్తవలె మనం రాజ్య వర్తమానాన్ని “నిత్యము” పదేపదే చెబుతాము. దాన్ని మనం ఆసక్తితో ఓర్పుతో ఎడతెగక చేస్తాము ఎందుకంటే అదే యెహోవా చిత్తం.

‘వారు ఆలాగుననే చేసిరి’

8, 9. యెహోవా ప్రవక్తైన మోషే ఏ విధాల్లో చక్కటి మాదిరిగా ఉన్నాడు?

8 ప్రవక్తైన మోషే ఓర్పు విధేయతలు కనపర్చడంలో మాదిరికరంగా ఉన్నాడు. దాసులైన ఇశ్రాయేలీయుల పక్షం వహించేందుకు ఆయన ఎన్నుకున్నాడు, అయితే వారి విముక్తి సమయం కొరకు ఆయన వేచివుండాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలను దాసత్వం నుండి విడిపించడానికి ఆయనను దేవుడు ఉపయోగించుకునేంత వరకూ అంటే 40 సంవత్సరాలపాటు ఆయన మిద్యానులో జీవించాడు. మోషే, ఆయన అన్న అహరోను ఐగుప్తు పాలకుల ముందు నిలిచినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించినవాటిని వారు విధేయతతో చెప్పారు, చేశారు. వాస్తవానికి వారు “ఆలాగుననే చేసిరి.”—నిర్గమకాండము 7:1-6; హెబ్రీయులు 11:24-29.

9 అడవుల్లో ఇశ్రాయేలీయుల 40 కఠిన సంవత్సరాలను మోషే ఓపికతో సహించాడు. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల ఆలయగుడార నిర్మాణం, అలాగే యెహోవా ఆరాధనలో ఉపయోగించడానికి అవసరమైన యితర వస్తువులను తయారు చేయడంలోనూ ఆయన దైవిక నడిపింపును విధేయతతో అనుసరించాడు. దేవుని ఉపదేశాలను ఆ ప్రవక్త ఎంత సన్నిహితంగా అనుసరించాడంటే ఆయనను గూర్చి మనం యిలా చదువుతాము: “మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించినవాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.” (నిర్గమకాండము 40:16) యెహోవా సంస్థతో సహవసిస్తూ మన పరిచర్యను మనం నిర్వహించడంలో మోషే విధేయతను మనం జ్ఞాపకముంచుకుని, ‘నాయకులైనవారికి . . . లోబడియుండుడి’ అని అపొస్తలుడైన పౌలు చెప్పిన సలహాను అన్వయించుకుందాము.—హెబ్రీయులు 13:17.

వారు అనుకూలమైన వైఖరిని కల్గివుండేవారు

10, 11. (ఎ) ప్రవక్తైన హొషేయాకు అనుకూల దృక్పథం ఉందని ఏది సూచిస్తోంది? (బి) మనం మన ప్రాంతంలో ప్రజలను కలిసినప్పుడు అనుకూల దృక్పథాన్ని ఎలా కలిగివుండగలము?

10 ప్రవక్తలు, తీర్పుకు సంబంధించిన సమాచారాలను, అలాగే ఇశ్రాయేలు నందు చెదరివున్న నమ్మకమైన వారియెడల దేవుని ప్రేమపూర్వక శ్రద్ధను ప్రతిబింబించే ప్రవచనాలను అందించేటప్పుడు అనుకూల వైఖరిని కల్గివుండాల్సిన అవసరం ఉండేది. హొషేయా విషయంలో యిది వాస్తవమైంది, ఆయన 59 సంవత్సరాలకుపైగా ప్రవక్తగా ఉన్నాడు. ఆయన యెహోవా సమాచారాలను అనుకూలంగా అందిస్తూ తన ప్రవచన పుస్తకాన్ని యీ మాటలతో పూర్తి చేశాడు: “జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.” (హొషేయా 14:9) సాక్ష్యమిచ్చేందుకు యెహోవా మనలను అనుమతించినంత మట్టుకు మనం అనుకూల వైఖరిని కల్గివుండి, దేవుని అపారమైన కనికరాన్ని జ్ఞానయుక్తంగా అంగీకరించేవారి కొరకు ఎడతెగక వెదుకుతూనే ఉందాము.

11 ‘యోగ్యులైనవారిని’ వెదకడానికి మనం పట్టుదలను కల్గివుండి, విషయాలను అనుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. (మత్తయి 10:11) ఉదాహరణకు, మన తాళపు చెవులను మనం పోగొట్టుకుంటే తిరిగి మనం నడిచిన దారిగుండా వెళ్లి మనం వెళ్లిన వివిధ పరిసరాలలో వెదుకుతాము. దీన్ని బహుశ మనం అనేక సార్లు చేసిన తర్వాతే కొనుగొనగలం. అదే విధంగా గొర్రెలాంటి వారిని వెదకడంలో పట్టుదలను కల్గివుందాం. తరచూ పనిచేసిన ప్రాంతంలో, వారు సువార్తకు ప్రతిస్పందించినప్పుడు మనం ఎంత ఆనందిస్తాం! అంతేకాకుండా మునుపు బహిరంగ పరిచర్య నిషేధించిన దేశాల్లో మన పనిని దేవుడు ఆశీర్వదించడం చూసి మనం ఎంత ఆనందిస్తాము!—గలతీయులు 6:10.

ప్రోత్సాహానికి మూలాధారాలు

12. యోవేలు యొక్క ఏ ప్రవచనం 20వ శతాబ్దంలో నెరవేర్పును కల్గివుంది, మరియు ఎలా?

12 యెహోవా ప్రవక్తల మాటలు మన పరిచర్యలో మనకు ఎంతో ప్రోత్సాహాన్నివ్వగలవు. ఉదాహరణకు, యోవేలు ప్రవచనాన్ని పరిశీలించండి. సా.శ.పూ తొమ్మిదవ శతాబ్దంలో మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులపై, యితరులపై తీర్పు వర్తమానాలు అందులో ఉన్నాయి. అయినప్పటికీ యోవేలు యిలా ప్రవచించడానికి కూడ ప్రేరేపించబడ్డాడు: “నేను [యెహోవా] సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.” (యోవేలు 2:28, 29) సా.శ. 33 పెంతెకొస్తు నుండి యేసు అనుచరుల విషయంలో యిది నిజమైంది. అంతేకాకుండా 20వ శతాబ్దంలో ఈ ప్రవచనం యొక్క ఎంతో గొప్ప నెరవేర్పును మనం చూస్తున్నాం గదా. నేడు లక్షలమంది “ప్రవచించే” వారు లేక యెహోవా సమాచారాన్ని ప్రకటించేవారు ఉన్నారు, కాగా వారిలో 6,00,000 మంది పూర్తికాల పయినీరు సేవలో ఉన్నారు.

13, 14. యౌవన క్రైస్తవులు ప్రాంతీయసేవలో ఆనందాన్ని కనుగొనడానికి ఏది సహాయపడగలదు?

13 అనేకమంది రాజ్య ప్రచారకులు యౌవనులే. బైబిలును గూర్చి పెద్దవారితో మాట్లాడడం వారికి అన్ని వేళలా సులభం కాదు. కొన్నిసార్లు యౌవనులైన యెహోవా సేవకులతో యిలా చెప్పడం జరుగుతుంది: ‘ఇలా ప్రకటిస్తూ నీ సమయాన్ని వృథా చేసుకుంటున్నావు,’ మరియు ‘నువ్వు వేరే పనేదైనా చూసుకోవాల్సింది.’ ఆ వ్యక్తి అలా భావిస్తున్నందుకు తాము చింతిస్తున్నామని యౌవన యెహోవాసాక్షులు చాతుర్యంతో జవాబిస్తారు. సువార్తను ప్రకటించే ఒక యౌవన ప్రచారకుడు యింకా యిలా చెప్పడం సహాయకరమని కనుగొన్నాడు: “మీలాంటి పెద్దవాళ్లతో మాట్లాడడం వల్ల నేను నిజంగా ప్రయోజనం పొందుతానని భావిస్తున్నానండి, అది నాకు యిష్టంకూడాను.” నిస్సందేహంగా, సువార్తను ప్రకటించడం సమయాన్ని వృథాచేయడం కానే కాదు. జీవితాలు అపాయంలో ఉన్నాయి. యోవేలు ద్వారా దేవుడు యింకా యిలా ప్రకటించాడు: “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరును రక్షింపబడుదురు.”—యోవేలు 2:32.

14 రాజ్య ప్రచార పనిలో తమ తలిదండ్రులతో వెళ్లే పిల్లలు, వ్యక్తిగత గమ్యాలను ఏర్పర్చుకోడానికి తమ తలిదండ్రుల సహాయాన్ని అంగీకరిస్తారు. అలాంటి యౌవనులు, ఒక లేఖనం చదవడం నుండి మొదలుకుని అంచలంచెలుగా తమకున్న బైబిలు ఆధారిత నిరీక్షణను గూర్చి వివరించడం, ఆసక్తి గలవారికి సరైన ప్రచురణలను అందించడం వరకు అభివృద్ధి చెందుతారు.—కీర్తన 110:3; 148:12, 13.

ఆసక్తి మరియు కనిపెట్టుకొనుండే వైఖరి

15. యెహెజ్కేలు మాదిరి, రాజ్య ప్రచార పనిలో మన ఆసక్తిని తిరిగి రగిలించేందుకు మనకు ఎలా సహాయపడగలదు?

15 దేవుని ప్రవక్తలు, నేడు మన పరిచర్యలో మనకు అవసరమైన లక్షణాలగు ఆసక్తి మరియు కనిపెట్టుకుని ఉండే వైఖరిని కనపర్చడంలో కూడా మాదిరినుంచారు. దేవుని వాక్యం నుండి మనం మొట్ట మొదటిసారిగా సత్యాన్ని నేర్చుకున్నప్పుడు, ధైర్యంగా మాట్లాడేందుకు మనలను కదిలించిన ఆసక్తితో మనం రగిలిపోయి ఉంటాం. అయితే, నాటి నుండి అనేక సంవత్సరాలు గడిచిపోయి, సాక్ష్యమిచ్చే మన ప్రాంతాన్ని మనం అనేకసార్లు పూర్తిచేసి ఉంటాం. ఇప్పుడు చాలా తక్కువమంది రాజ వర్తమానాన్ని అంగీకరించవచ్చు. మరి ఇది మన ఆసక్తిని తగ్గించిందా? తగ్గించినట్లైతే, “దేవుడు బలపరుస్తాడు” అనే భావం తన పేరుకున్న ప్రవక్తైన యెహెజ్కేలును పరిగణలోకి తీసుకోండి. పురాతన ఇశ్రాయేలులో యెహెజ్కేలు కఠిన హృదయులైన ప్రజలను ఎదుర్కొన్నప్పటికీ, దేవుడు ఆయనను బలపర్చి సూచనార్థకంగా ఆయన నుదిటిని చెకుముకి రాయి కంటే గట్టిపర్చాడు. ఆ విధంగా ప్రజలు విన్నా వినకపోయినా యెహెజ్కేలు తన పరిచర్యను అనేకానేక సంవత్సరాల వరకు కొనసాగించగలిగాడు. మనం కూడా అలాగే చేయగలమని ఆయన ఉదాహరణ చూపుతోంది, అంతేకాదు మన ప్రకటనాపనిలో మన ఆసక్తిని తిరిగి రగిలించేందుకు అది సహాయపడగలదు.—యెహెజ్కేలు 3:8, 9; 2 తిమోతి 4:5.

16. మీకా యొక్క ఏ వైఖరిని మనం పెంచుకోవాలి?

16 మీకా తన ఓర్పుకు గణనీయుడు. ఆయన సా.శ.పూ ఎనిమిదవ శతాబ్దంలో ప్రవచించాడు. “యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థననాలకించును” అని ఆయన రాశాడు. (మీకా 7:7) మీకా మనో నమ్మకం ఆయన దృఢమైన విశ్వాసంలో నాటుకుని ఉంది. ప్రవక్తైన యెషయావలె యెహోవా ఉద్దేశించినదాన్ని ఆయన తప్పక చేస్తాడని మీకాకు తెలుసు. అది మనకు కూడా తెలుసు. (యెషయా 55:11) కనుక దేవుని వాగ్దానాల విషయంలో కనిపెట్టుకుని ఉండే వైఖరిని మనం పెంచుకుందాము. అంతేకాకుండా, రాజ్య వర్తమాన విషయంలో తక్కువ ఆసక్తిని కనపర్చే ప్రజలున్న ప్రాంతాల్లో సహితం మనం సువార్తను ఆసక్తితో ప్రకటిద్దాము.—తీతు 2:14; యాకోబు 5:7-10.

నేడు ఓర్పును అభ్యసించడం

17, 18. ఏ పురాతన మరియు ఆధునిక ఉదాహరణలు మనం ఓర్పును కనపర్చడానికి సహాయపడగలవు?

17 యెహోవా ప్రవక్తల్లో కొందరు తమకు నియమించిన పనిలో ఓపికతో కొనసాగారు కానీ తమ ప్రవచనాల నెరవేర్పును వారు చూడలేదు. అయినప్పటికీ, నిరాదరణను అనుభవించేటప్పుడు తరచూ వారు కనుపర్చిన ఓపికతో కూడిన పట్టుదల, మనం మన పరిచర్యను నెరవేర్చగలమని గ్రహించడానికి సహాయపడుతుంది. ఇరవైయ్యవ శతాబ్దం తొలి దశాబ్దాల్లో ఉన్న నమ్మకమైన అభిషక్తుల మాదిరి కూడా మనకు ప్రయోజనకరమే. వారు అపేక్షించినంత త్వరగా వారి పరలోక నిరీక్షణ నెరవేరక పోయినప్పటికీ, దేవుడు వారికి బయల్పర్చిన విధంలో ఆయన చిత్తాన్ని వారు చేయడంలో, ఆలస్యమని అనిపించేవి తమ ఆసక్తిని నిరుత్సాహపర్చనివ్వలేదు.

18 అనేక సంవత్సరాలవరకు, ఈ క్రైస్తవుల్లో అనేకులు క్రమంగా కావలికోట దాని సహ పత్రికైన తేజరిల్లు! (మునుపు ఈ పత్రిక ది గోడ్డెన్‌ ఏజ్‌ అని, తర్వాత కన్సొలేషన్‌ అని పిలువబడింది) అనే పత్రికలను అందిస్తూ వచ్చారు. నేడు మ్యాగజీన్‌ రూట్‌ అని పిలిచే పద్ధతి ద్వారా, ఈ అమూల్య పత్రికలను ప్రజలకు వీధుల్లోనూ తమ యిళ్లల్లోనూ వారు ఆసక్తితో అందించేవారు. ఒక వృద్ధ సహోదరి వీధుల్లో ప్రకటించడం చూడడం అలవాటైన దారినపోయే వ్యక్తి, ఆమె చనిపోయినప్పుడు చింతించింది. ఆమె బహిరంగ పరిచర్య చేస్తుండగా చూసినవారి మెప్పుదలతో కూడిన వ్యాఖ్యానాలు చూపినట్లుగా, అనేక సంవత్సరాల తన నమ్మకమైన సేవలో ఆమె ఎంతో చక్కటి సాక్ష్యాన్నిచ్చింది. ఓ రాజ్య ప్రచారకునిగా, కావలికోట, తేజరిల్లు! పత్రికలను క్రమంగా మీరు మీ పరిచర్యలో కలిసేవారికి అందిస్తున్నారా?

19. హెబ్రీయులు 6:10-12 మనకు ఏ ప్రోత్సాహాన్ని అందిస్తుంది?

19 యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యులుగా పనిచేసే సహోదరుల నమ్మకమైన సేవనూ ఓపికను కూడా పరిశీలించండి. వారిలో అనేకులు తమ జీవితపు తొంభై లేక నూరు సంవత్సరాల్లో ఉన్నప్పటికీ, తమకు అప్పగించిన పనులను వారు యింకా ఆసక్తితో నిర్వహించే రాజ్య ప్రచారకులుగా ఉన్నారు. (హెబ్రీయులు 13:7) అంతేకాకుండా పరలోక నిరీక్షణగల వారిలో, అలాగే “వేరే గొఱ్ఱె”ల్లో భాగమైనవారిలో వయస్సుమళ్లినవారి విషయమేమిటి? (యోహాను 10:16) వారి పనిని, దేవుని నామానికి వారు చూపిన ప్రేమను మర్చిపోడానికి ఆయన అన్యాయస్థుడుకాడనే నిశ్చయతను వారు కల్గివుండవచ్చు. యౌవనులైన తోటి విశ్వాసులతో సహా, యెహోవా యొక్క వృద్ధ సాక్షులు నమ్మకాన్ని కల్గివుంటూ దేవుని సేవ కొరకు ఓర్పును కనపరుస్తూ తమకు సాధ్యమైన దాన్ని వారు ఎడతెగక చేస్తూనే ఉండవచ్చు. (హెబ్రీయులు 6:10-12) అప్పుడు, గతంలోని ప్రవక్తలకు జరిగేటట్లుగా పునరుత్థానం ద్వారా గానీ లేక రాబోయే “మహా శ్రమ”ల్లో తప్పించుకోవడం ద్వారా గాని వారు నిత్యజీవపు గొప్ప ప్రతిఫలాన్ని అనుభవిస్తారు.—మత్తయి 24:21.

20. (ఎ) ప్రవక్తల “మాదిరి” నుండి మీరేమి నేర్చుకున్నారు? (బి) ప్రవక్తలు కల్గివున్నటువంటి ఓర్పు మనకెలా సహాయపడుతుంది?

20 దేవుని ప్రవక్తలు ఎంత చక్కటి మాదిరిని మన కొరకు ఉంచారు! వారు బాధను సహించి, ఓర్పును కనపర్చి, యితర దైవిక లక్షణాలను వ్యక్తపర్చారు గనుకనే వారు యెహోవా పేరట మాట్లాడే ఆధిక్యతను పొందారు. ఆయన ఆధునికదిన సాక్షులుగా, మనం వారిలా ఉండి ప్రవక్తైన హబక్కూకులా మనం కూడా తీర్మానించుకుందాము. ఆయన యిలా అన్నాడు: “ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొని యుందును.” (హబక్కూకు 2:1) మనం ఓర్పును కనపర్చి, మన గొప్ప సృష్టికర్తయైన యెహోవా ఘనమైన నామాన్ని బహిరంగంగా ప్రకటించడంలో ఆనందంగా కొనసాగుతూ అలాంటి నిశ్చయతనే మనం కలిగివుందాము.—నెహెమ్యా 8:10; రోమీయులు 10:10.

మీరు ఈ విషయాలను గ్రహించారా?

◻ ప్రవక్తైన ఆమోసు ఏ ధైర్యవంతమైన మాదిరినుంచాడు?

◻ ప్రవక్తైన మోషే ఏ విషయంలో మాదిరికరంగా ఉన్నాడు?

◻ యెహోవా ఆధునిక దిన సాక్షులు ఆమోసు, యెషయాలవలె ఎలా ప్రవర్తించగలరు?

◻ హొషేయ మరియు యోవేలు ప్రవర్తనలనుండి క్రైస్తవ పరిచారకులు ఏమి నేర్చుకోగలరు?

◻ యెహెజ్కేలు మరియు మీకాల ఉదాహరణల నుండి మనమెలా ప్రయోజనం పొందగలము?

[16వ పేజీలోని చిత్రం]

అమజ్యా నుండి గట్టి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆమోసు ధైర్యంగా ప్రవచించే శక్తిని యెహోవా ఆత్మ యిచ్చింది

[18వ పేజీలోని చిత్రం]

నమ్మకమైన అభిషక్తులు యెహోవా సేవలో ఓర్పును కనపరుస్తూ మంచి మాదిరినుంచారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి