5వ అధ్యాయం
యెహోవాకు నచ్చినట్టు ఆరాధిస్తూ ఆయనను వెదకండి
1. దేవుని ప్రజల మధ్య మీరు ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు?
ప్రవచనాలను నెరవేర్చే దేవుణ్ణి తెలుసుకోగలగడం మనకు దొరికిన గొప్ప వరం! హోషేయ ప్రవక్త వర్ణించిన ఈ పరిస్థితిని మనం చవిచూస్తున్నాం: “నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును.” బబులోను చెర నుండి తిరిగి వచ్చాక దేవుని ప్రజలు అనుభవించనున్న సురక్షితమైన పరదైసులాంటి పరిస్థితిని హోషేయ వర్ణించాడు. నేడు కూడా దేవుని ప్రజలు ఆధ్యాత్మిక ఆహారాన్ని పుష్కలంగా అందుకుంటున్నారు, ఆధ్యాత్మిక భద్రతను అనుభవిస్తున్నారు; వాళ్లు ఒకవిధంగా పరదైసులాంటి పరిస్థితిలో ఉన్నారు. (హోషేయ 2:18-20) మీరు యెహోవా నామాన్ని ధరించి ఆయనకు సమర్పించుకున్న ప్రజలైన యెహోవాసాక్షుల్లో ఒకరయ్యారు. ఎప్పటికీ అలాగే కొనసాగాలన్నది మీ కోరిక.—యెషయా 43:10, 12; అపొస్తలుల కార్యములు 15:14.
ఆమోసు
2, 3. (ఎ) పూర్వం యెహోవా తన ప్రజల ఆరాధనా విధానాన్ని ఎందుకు అసహ్యించుకున్నాడు? (బి) ప్రవక్తలు ప్రకటించిన సందేశాల్ని మనం ఎందుకు పరిశీలించాలి?
2 ప్రాచీన ఇశ్రాయేలు యెహోవా సమర్పిత జనాంగం. ఏ జనాంగానికీ లేని నియమావళిని దేవుడు వాళ్లకు ఇచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 4:33-35) అయితే, సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దపు చివరికల్లా ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే, దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా వాళ్లతో ఇలా అన్నాడు: “మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను . . . నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను.” (ఆమోసు 5:21, 22) నేటి ప్రపంచవ్యాప్త సంఘాలతో దేవుడు ఆ మాట అనట్లేదు. కానీ ఒకవేళ దేవుడు మీ ఆరాధన విషయంలో అలా అనివుంటే, మీకు ఎలా అనిపించివుండేదో ఊహించండి. మనలో ప్రతీ ఒక్కరికి ఆ మాటల్లో ఏదైనా పాఠం ఉందా?
3 ఆ రోజుల్లో, యెహోవా ప్రజలు ఆయనకు నచ్చినట్టే ఆరాధిస్తున్నామని చెప్పుకున్నారు. కానీ, వాళ్లలో చాలామంది కనానీయుల బయలును, దూడ విగ్రహాలను ఆరాధిస్తూ, ఉన్నత స్థలాల్లో బలులు అర్పిస్తూ వచ్చారు. ఒకవైపు వాళ్లు యెహోవా పేరు మీద ప్రమాణం చేస్తూనే, మరోవైపు ఆకాశ సమూహానికి మొక్కేవాళ్లు. అందుకే, ప్రజలు తిరిగి స్వచ్ఛారాధనను చేపట్టేలా వాళ్లను ప్రేరేపించేందుకు సత్య దేవుడు ప్రవక్తలను పంపాడు. (2 రాజులు 17:7-17; 21:3; ఆమోసు 5:26) అంటే, యెహోవాకు సమర్పించుకున్న సేవకులు కూడా తమ పనులు, వైఖరులు యెహోవాకు నచ్చే ఆరాధనకు తగ్గట్టు ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ ఉండాలన్నమాట.
‘దేవుని గురించిన జ్ఞానం’
4. రెండవ యరొబాము పరిపాలిస్తున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి?
4 ఆ 12 మందిలో మొదటి ప్రవక్త దైవ సందేశాలను ప్రకటించిన కాలం గురించి ఆలోచించండి. ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యాన్ని నాశనం చేసే యెహోవా దినం గురించిన ప్రవచనాలు వెలువడుతున్న రోజులవి. అయితే, చూడ్డానికి ఆ జనాంగం వర్ధిల్లుతున్నట్టు అనిపించింది. యోనా ప్రవచించినట్టే రెండవ యరొబాము రాజు, ఉత్తరానున్న దమస్కు సమీప ప్రాంతం నుండి మృత సముద్రం వరకు ఇశ్రాయేలు సరిహద్దును మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు. (2 రాజులు 14:24-27) యరొబాము యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించినా, యెహోవా ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేయాలనుకోలేదు. ఆయన వాళ్ల విషయంలో ఓపిక పట్టాడు. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపంతో తనను ‘ఆశ్రయించి, బ్రతికివుండడానికి’ దేవుడు కొంత సమయం ఇచ్చాడు.—ఆమోసు 5:6.
5. ఇశ్రాయేలీయుల్లో ఏమి లోపించడం వల్ల యెహోవా వాళ్లను తిరస్కరించాడు?
5 ఇశ్రాయేలీయులు ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ యెహోవాను మరింత బాగా తెలుసుకొని, ఆయనకు నచ్చింది చేసి, ఆయన దగ్గరికి తిరిగొచ్చి ఉండాల్సింది. కానీ వాళ్లు, “ఆ కీడు మనలను తరిమి పట్టదు, మనయొద్దకు రాదు” అనుకుంటూ నిశ్చింతగా ఉన్నారు. (ఆమోసు 9:10) వాళ్లు ‘తృప్తి పొందారు; తృప్తి పొంది గర్వించారు’ కాబట్టి యెహోవాను మర్చిపోయారని మనకు అనిపించవచ్చు. (హోషేయ 13:6) ‘అదొక ప్రాచీన చరిత్రే కదా, అందులో మనం నేర్చుకోవాల్సింది ఏమి ఉంటుందిలే’ అని మనం అనుకోకూడదు. ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు వ్యాజ్యం ఎందుకుందో గమనించండి: “నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును.” వాళ్లంతా ఒక జనాంగంగా యెహోవా సమర్పిత ప్రజలే. అయినా, వ్యక్తిగతంగా వాళ్లలో ‘దేవుని గురించిన’ నిజమైన ‘జ్ఞానం’ లోపించింది.—హోషేయ 4:1, 6.
6. ఇశ్రాయేలీయులకు దేవుని గురించిన జ్ఞానం ఉన్నా లేనట్టే లెక్క అని ఎందుకు చెప్పవచ్చు?
6 ఇశ్రాయేలీయులకు దేవుని మాటలు తెలియవని కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాటిని నేర్పించాలని దేవుడు ఎప్పుడో చెప్పాడు. చాలామంది ఇశ్రాయేలీయులు కొన్ని బైబిలు వృత్తాంతాలను తమ తల్లిదండ్రులు బోధిస్తున్నప్పుడో, ఇతరులు మాట్లాడేటప్పుడో, బహిరంగ సమావేశాల్లోనో వినివుంటారు. (నిర్గమకాండము 20:4, 5; ద్వితీయోపదేశకాండము 6:6-9; 31:11-13) ఉదాహరణకు, పది ఆజ్ఞలు అందుకోవడానికి మోషే సీనాయి పర్వతం మీదికి వెళ్లిన సమయంలో అహరోను బంగారు దూడను చేసినప్పుడు ఏమి జరిగిందో వాళ్లు విన్నారు. (నిర్గమకాండము 31:18–32:9) కాబట్టి, ఆ 12 మంది ప్రవక్తలు జీవించిన కాలంలోని ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం గురించి కొంత జ్ఞానం ఉంది, చారిత్రక వృత్తాంతాలను కూడా వాళ్లు విన్నారు. అయితే, దేవునికి నచ్చినట్టు ఆరాధించడానికి వాళ్లు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి వాళ్లకు ఆ జ్ఞానం ఉన్నా లేనట్టే లెక్క.
ఒక వ్యక్తి యెహోవాను మర్చిపోవడం ఎలా మొదలౌతుంది
7. (ఎ) ఇశ్రాయేలీయులు అంత సులువుగా ఎలా దేవునికి అవిధేయులయ్యారు? (బి) ఓ క్రైస్తవుడు తన ‘సృష్టికర్తను మరచిపోవడం’ ఎలా మొదలౌతుంది?
7 ‘ఇశ్రాయేలీయులు అంత సులువుగా ఎలా దేవునికి అవిధేయులయ్యారు?’ అనే సందేహం మీకు రావచ్చు. అదెలా జరిగిందో హోషేయ వివరించాడు: “ఇశ్రాయేలు వారు . . . తమ సృష్టికర్తను మరచియున్నారు.” (హోషేయ 8:14) ఇక్కడ, “మరచియున్నారు” అని అనువాదమైన ఆదిమ హీబ్రూ క్రియా పదరూపం, “మరచిపోవడం మొదలుపెట్టారు” అనే భావాన్నిస్తుంది. ఇశ్రాయేలీయులు యెహోవా కోరినవాటిని ఒక్కసారిగా ఏమీ మర్చిపోలేదు. కానీ, యెహోవాకు నచ్చినట్టు ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమనే విషయాన్ని వాళ్లు మెల్లమెల్లగా మర్చిపోతూ వచ్చారు. ఓ క్రైస్తవుడికి కూడా అలా జరిగే ప్రమాదం ఉందా? ఉదాహరణకు, కుటుంబ అవసరాలను తీర్చడానికి పట్టుదలగా కృషిచేసే వ్యక్తినే తీసుకోండి. (1 తిమోతి 5:8) కుటుంబాన్ని చూసుకోవడానికి ఉద్యోగం చాలా అవసరమని అతనికి అనిపించడం సమంజసమే. బహుశా కొంతకాలానికి ఏవో కారణాల వల్ల, పనిచేయడం కోసం క్రైస్తవ కూటాల్ని అప్పుడప్పుడు మానేయక తప్పదని అతను అనుకుంటాడు. రోజులు గడుస్తుండగా, కూటాలకు వెళ్లకపోవడం పెద్ద తప్పేం కాదులేనని అతనికి అనిపిస్తుంది, దాంతో కూటాలకు వెళ్లడం చాలావరకు తగ్గించేస్తాడు. మెల్లమెల్లగా దేవునితో అతని స్నేహం బలహీనపడుతుంది, అంటే అతను తన ‘సృష్టికర్తను మరచిపోవడం మొదలుపెట్టేశాడు’ అన్నమాట. సాక్షులుకాని తల్లిదండ్రులు లేదా బంధువులు ఉన్న క్రైస్తవునికి అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంది. వాళ్లకోసం ఎంత సమయం కేటాయించాలి, ఎప్పుడు కేటాయించాలి అన్న విషయాల గురించి అతను ఆలోచించాల్సి ఉంటుంది. (నిర్గమకాండము 20:12; మత్తయి 10:37) విహారయాత్రలకు, మనసుకు నచ్చిన పనులకు, వినోదానికి ఎంత సమయం వెచ్చించాలో నిర్ణయించుకోవడం విషయమేమిటి?
8. ఆమోసు పుస్తకంలో ఉన్న “దంతశుద్ధి” అనే మాటకు అర్థమేమిటి?
8 మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేశాం, దాంతో సంపాదించుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాం. అయినా మనలో ప్రతి ఒక్కరూ ఆమోసు పుస్తకంలోని “దంతశుద్ధి” అనే మాటను పరిశీలించాలి. ఆమోసు ద్వారా దేవుడు తన ప్రజలను ఇలా హెచ్చరించాడు: “మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు.” (ఆమోసు 4:6) ఆ ‘శుద్ధి’ పళ్లు తోముకోవడం వల్ల అయ్యింది కాదు, కరువు వచ్చి తినడానికి ఏమీ లేనందువల్ల అయ్యింది. పైగా, “అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామము” గురించిన హెచ్చరిక.—ఆమోసు 8:11.
చుట్టూ ఆధ్యాత్మిక ఆహారం పుష్కలంగా ఉన్నా, ఓ వ్యక్తి ఆధ్యాత్మికంగా పస్తులుండే ప్రమాదం ఉందా?
9, 10. (ఎ) ఓ క్రైస్తవుడి ఆధ్యాత్మిక ఆకలి చచ్చిపోయే పరిస్థితి ఎలా రావచ్చు? (బి) ఆధ్యాత్మికంగా పస్తులుండే ప్రమాదం విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
9 ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి క్రైస్తవ మత సామ్రాజ్యంలో నెలకొన్న గడ్డు పరిస్థితి ఆమోసు ప్రవచన నెరవేర్పే. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల కోసం మాత్రం “ఆకాశపువాకిండ్లు” తెరుచుకున్నాయి. వాళ్లు పుష్కలమైన ఆధ్యాత్మిక ఆహారంతో తులతూగుతున్నారు. (మలాకీ 3:10; యెషయా 65:13, 14) అయితే, ఒక క్రైస్తవుడు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఆ ఆధ్యాత్మిక ఆహారాన్ని నేను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాను?’ ఉదాహరణకు, మెదడులో ఆకలిని తెలిపే నాడులు దెబ్బతిన్న జంతువుల గురించి కొందరు జంతు పరిశోధకులు చెప్పేదాన్ని గమనించండి. ఆ జంతువుల ఆకలి ఏ స్థాయికి పడిపోతుందంటే, వాటి ముందు గంపలకొద్దీ ఆహారం పెట్టినా కనీసం దాన్ని ముట్టను కూడా ముట్టవు, అలా చివరికి అవి చచ్చిపోతాయి. అలాగే, ఓ క్రైస్తవుని చుట్టూ పుష్కలంగా ఆధ్యాత్మిక ఆహారం ఉన్నా, అతని ఆధ్యాత్మిక ఆకలి చచ్చిపోయి ఆధ్యాత్మికంగా పస్తులుండే ప్రమాదం ఉందా?
10 మీ పరిస్థితిని మనసులో ఉంచుకుని దీన్ని పరిశీలించండి: యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఆధ్యాత్మిక ఆహారాన్ని మెండుగా ఇచ్చాడు. ఆయనతో వాళ్ల బంధాన్ని పటిష్ఠపర్చే ధర్మశాస్త్రం వాళ్ల దగ్గర ఉండేది; పిల్లలకు దేవుని గురించి బోధించే ఏర్పాటు ఉండేది; దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసే ప్రవక్తలు అందుబాటులో ఉండేవాళ్లు. అన్ని ఏర్పాట్లు ఉన్నా సరే, వాళ్లు యెహోవాను మర్చిపోవడం మొదలుపెట్టారు. హోషేయ కాలంలో ప్రజలు వస్తుపరంగా ‘తృప్తిపొందారు, తృప్తిపొంది గర్వించారు’ అని బైబిలు చెబుతోంది. (హోషేయ 13:6; ద్వితీయోపదేశకాండము 8:11; 31:20) మనం మన సిరిసంపదలకు ప్రాధాన్యతనిస్తూ దేవునితో మనకున్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేయకూడదంటే, ఆ విషయంలో ప్రతీరోజు జాగ్రత్తగా ఉండాలి.—జెఫన్యా 2:3.
మరింత ప్రాముఖ్యమైన వాటి మీద దృష్టి పెట్టండి
11, 12. (ఎ) ఉజ్జియా రాజు పరిపాలనలో, యెహోవా దగ్గరకు తిరిగి రమ్మని ప్రవక్తలు ప్రజల్ని ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చింది? (బి) యోవేలు ఏ విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చాడు?
11 రెండవ యరొబాము ఇశ్రాయేలును పరిపాలించిన సమయంలో, ఉజ్జియా (మరో పేరు అజర్యా) యూదాను పరిపాలించాడు. ఉజ్జియా తన రాజ్య సరిహద్దులను విస్తరింపజేసుకున్నాడు, యెరూషలేములో దుర్గములను కట్టించాడు. ఉజ్జియాకు సత్య ‘దేవుడు సహాయం’ చేస్తూ వచ్చాడు కాబట్టి అతను “అధికముగా బలాభివృద్ధి నొందెను.” అతను ‘యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు,’ ‘దేవుణ్ణి ఆశ్రయించాడు.’ కానీ యూదాలో చాలామంది ఉన్నత స్థలాల్లో ధూపం వేయడానికి అలవాటుపడ్డారు.—2 దినవృత్తాంతములు 26:4-9.
12 ఆ మాటలను బట్టి చూస్తే యూదా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామాన్ని ధరించినా వాళ్లు ఎక్కువగా ఆయనకు నచ్చని వాటిని తమ ఆరాధనలో మిళితం చేస్తూ వచ్చారని అర్థమౌతుంది. సత్యారాధనకు, అబద్ధ ఆరాధనకు మధ్య ఉన్న తేడాను గుర్తించేలా వాళ్లకు సహాయం చేయడానికి ప్రవక్తలు ప్రయత్నించారు. యోవేలు ద్వారా దేవుడు వాళ్లను ఇలా బతిమాలాడు: “ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి.” (యోవేలు 2:12) ఇక్కడ ఒక విషయం గమనించారా? ప్రజలు “మనఃపూర్వకముగా” లేదా నిండుహృదయంతో తన దగ్గరకు తిరిగి రావాలని దేవుడు కోరుకున్నాడు. అవును, సమస్య వాళ్ల హృదయానికి సంబంధించినది. (ద్వితీయోపదేశకాండము 6:5) వాళ్లు యెహోవాను మొక్కుబడిగా ఆరాధించారే తప్ప హృదయపూర్వకంగా ఆరాధించలేదు. ఆయన పదేపదే ప్రవక్తలను పంపి, హృదయంలో జనించే కనికరం, న్యాయం, సాత్వికం వంటి లక్షణాలు ఎంత అవసరమో చెప్పాడు.—మత్తయి 23:23.
13. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులు వేటి గురించి ఆలోచించాల్సింది?
13 ఇప్పుడు, యూదులు తమ స్వదేశానికి వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందో పరిశీలించండి. వాళ్లు ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్న సత్యారాధనను మళ్లీ మొదలుపెట్టారు. అలాగని, వాళ్లు అన్నీ సరిగ్గా చేశారని కాదు. యూదులు యెరూషలేము నాశనానికి సంబంధించిన సంఘటనలను పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం ఆ తేదీల్లో ఉపవాసం ఉండేవాళ్లు. యెహోవా వాళ్లను ఇలా అడిగాడు: “నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా?” నిజానికి, యెహోవా తీర్పువల్లే యెరూషలేము నాశనమైంది, అందుకే అది దుఃఖపడాల్సిన విషయం కాదు. ఆ యూదులు గతాన్ని తలచుకొని దుఃఖంతో ఉపవాసం ఉండకుండా ఉండాల్సింది. సత్యారాధన వల్ల పొందిన ఆశీర్వాదాలకు గర్వపడుతూ పండుగలప్పుడు సంతోషంగా గడపాల్సింది. (జెకర్యా 7:3-7; 8:16, 19) వాళ్లు వేరే విషయాల గురించి కూడా ఆలోచించాల్సింది. వాటిలో మచ్చుకు కొన్ని ఏవి? “సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనుపరచుకొనుడి . . . మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడుచేయదలచకుడి.” (జెకర్యా 7:9, 10) పూర్ణహృదయంతో దేవుణ్ణి ఆరాధించడం గురించి ఆ ప్రవక్తలు బోధించిన వాటి నుండి మనందరం ప్రయోజనం పొందవచ్చు.
14. (ఎ) చెర నుండి తిరిగి వచ్చినవాళ్లు యెహోవా మెచ్చినట్టు ఆరాధించడానికి ఇంకా ఏమి చేయాలి? (బి) ఆరాధనకు సంబంధించి మరింత ప్రాముఖ్యమైన అంశాలను ప్రవక్తలు ఎలా నొక్కిచెప్పారు?
14 పూర్ణహృదయంతో ఆరాధించడం అంటే ఏమిటి? బబులోనుకు వెళ్లకముందు గానీ, తిరిగి వచ్చిన తర్వాత గానీ దేవుడు తన ప్రజల్ని కోరింది ఏమిటి? తన నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వమనే కదా. దేవుని చిత్తం గురించిన బోధలు వినడానికి, నేర్చుకోవడానికి సమకూడమని ధర్మశాస్త్రం చెప్పింది. ఇంకా, ప్రత్యేకంగా చేయాల్సిన కొన్ని పనులను, కార్యకలాపాలను అది ప్రస్తావించింది. అయితే వాటితోపాటు కనికరం, న్యాయం, సాత్వికం, జాలి, అణకువ వంటి లక్షణాలను అలవర్చుకోవడం, వాటిని చూపించడం ఎంత ప్రాముఖ్యమో కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.” “నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి.” (హోషేయ 6:6; 10:12; 12:6) మీకా ఇలా అన్నాడు: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.” (మీకా 6:6-8) దేవుని ప్రజలను జెఫన్యా ప్రవక్త ఇలా ప్రోత్సహించాడు: ‘యెహోవాను వెదకుడి; వెదకి వినయముగలవారై నీతిని అనుసరించుడి.’ (జెఫన్యా 2:3) దేవుడు మెచ్చినట్టు ఆరాధించాలంటే ఆ లక్షణాలు చాలా అవసరం.
మీరు అన్నిరకాల ప్రజలకు సువార్త ప్రకటించడానికి కృషి చేస్తున్నారా?
15. ప్రవక్తలు ఉపదేశించినట్టు క్రైస్తవులు తమ ఆరాధనలో భాగంగా ఏమి చేయాలి?
15 మన ఆరాధనలో ఆ లక్షణాలకు ఎంత ప్రాధాన్యం ఉంది? రాజ్య సువార్త ప్రకటించడం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. (మత్తయి 24:14; అపొస్తలుల కార్యములు 1:8) మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ప్రకటనా పనిని అయిష్టంగా, బలవంతంగా చేస్తున్నానా? లేదా బైబిల్లోని రక్షణ సందేశాన్ని ప్రజలకు చెప్పడానికి అదొక అవకాశమని అనుకుంటున్నానా? ప్రజల మీద నాకు నిజంగా జాలి, కనికరం ఉన్నాయా?’ ఒకవేళ ఉంటే, యెహోవా దినం గురించి ప్రజల్ని హెచ్చరిస్తాం. ఆ సందేశాన్ని అన్నిరకాల ప్రజలకు ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీతి, న్యాయం వంటివి కూడా మనలో ఉత్సాహాన్ని నింపుతాయి.—1 తిమోతి 2:4.
16, 17. మన ఆరాధనకు సాత్వికం, అణకువ ఎందుకు అవసరం?
16 క్రైస్తవ కూటాల గురించి ఆలోచిద్దాం. అవి ప్రాముఖ్యమైనవని, వాటికి హాజరుకావాల్సిన బాధ్యత మనకుందని మనకు తెలుసు. (హెబ్రీయులు 10:24, 25) కూటాలకు హాజరైతే మనం సాత్వికం, అణకువ చూపిస్తాం, అదెలా? సాత్వికులు ఉపదేశాన్ని వినయంగా స్వీకరిస్తారు, నేర్చుకున్నవాటిని ఆచరణలో పెడతారు, అలా యెహోవా న్యాయ విధుల్ని పాటిస్తారు. అణకువ గల వ్యక్తి తన పరిమితుల్ని అర్థంచేసుకుంటాడు, కూటాల్లో అందే ప్రోత్సాహం, జ్ఞానం తనకు అవసరమని గుర్తిస్తాడు.
17 ప్రవక్తలు బోధించినవి మనకు ఎలా ఉపయోగపడతాయో పై ఉదాహరణలు చూస్తే తెలుస్తుంది. అయితే, పైన పేర్కొన్న రంగాల్లో వేటిలోనైనా మీరు మార్పులు చేసుకోవాల్సి ఉందా? ఒకప్పుడు మీరు చేసిన గంభీరమైన తప్పుల తాలూకు జ్ఞాపకాలు అప్పుడప్పుడు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అలాగైతే ఆ 12 మంది ప్రవక్తల పుస్తకాల్లో మీకు ఊరట, సహాయం దొరుకుతాయి.
యెహోవా దగ్గరకు తిరిగి రండి
18. (ఎ) ఆ 12 మంది ప్రవక్తలు ప్రకటించిన సందేశాలు ప్రత్యేకంగా ఎవరికి ఊరటనిస్తాయి? (బి) ప్రజలను తన దగ్గరకు తిరిగి రమ్మని బతిమాలే యెహోవా గురించి మీకు ఏమి అనిపిస్తోంది?
18 మనం చూసినట్టు, ఆ 12 మంది ప్రవక్తలు కేవలం నాశనాన్ని ప్రకటించడం, ఖండించడం మాత్రమే చేయలేదు. ప్రజల్ని తన దగ్గరకు తిరిగి రమ్మని యెహోవా బతిమాలిన విషయం గురించి కూడా వాళ్లు చెప్పారు. హోషేయ ఇచ్చిన ఈ ప్రోత్సాహంలో స్ఫురిస్తున్న భావోద్వేగాల గురించి ఆలోచించండి: “రండి, మనం యెహోవావైపు మళ్ళీ తిరుగుదాం. ఆయన మనలను చీల్చి ముక్కలు చేశాడు గాని ఆయన మనలను బాగు చేస్తాడు. మనలను గాయపరచాడు గాని మన గాయాలకు కట్టు కడతాడు . . . యెహోవాను తెలుసుకొందాం. ఆయనను తెలుసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం.” (హోషేయ 6:1-3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) నిజమే, యెహోవా దేవుడు తన న్యాయ ప్రమాణానికి అనుగుణంగా ఇశ్రాయేలు, యూదా ప్రజల మీద తన తీర్పుల్ని అమలు చేశాడు. అయితే, ఆధ్యాత్మిక స్వస్థత కోసమే యెహోవా తమను శిక్షించాడని ఆ ప్రజలు అర్థంచేసుకొని ఉండాల్సింది. (హెబ్రీయులు 12:7-13) దారితప్పిన ఆ ప్రజలు యెహోవా దగ్గరకు తిరిగొస్తే ఆయన ‘వాళ్లను బాగుచేస్తాడు,’ ‘వాళ్లకు కట్టుకడతాడు.’ ఓ వ్యక్తి వంగి మోకాళ్ల మీద నిలబడి తోటి వ్యక్తి దెబ్బలకు కట్టుకడుతున్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు అదే పని యెహోవా చేస్తున్నట్టు ఊహించుకోండి. తన దగ్గరకు తిరిగి రావడానికి సంసిద్ధంగా ఉన్నవాళ్లకు కట్టుకట్టే యెహోవాది ఎంత జాలి గుండె కదా! మనం ఏదైనా తప్పు చేస్తే యెహోవా దగ్గరికి తిరిగి వచ్చేందుకు అది మనల్ని కదిలించడం లేదా?—యోవేలు 2:13.
19. యెహోవాను తెలుసుకోవడమంటే ఏమిటి?
19 దేవుని దగ్గరకు తిరిగి రావడం అంటే ఏమిటి? యెహోవాను ‘తెలుసుకోవడం’ ఒక్కటే సరిపోదుగానీ ‘ఆయనను తెలుసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేయడం’ అవసరమని హోషేయ మనకు గుర్తుచేస్తున్నాడు. హోషేయ 6:3కు సంబంధించి ఓ ఆధునిక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి చాలా తేడా ఉంది. ఎంతంటే ప్రేమ గురించి చదవడానికి, ప్రేమలో పడడానికి ఉన్నంత!” యెహోవా గురించి మనకు పైపైన తెలిస్తే సరిపోదు. ఆయనతో సన్నిహిత బంధాన్ని ఏర్పర్చుకోవాలి. ఆయన మనకు నమ్మకమైన మిత్రుడని, సహాయం కోసం ఎప్పుడైనా ఆయన్ను ఆశ్రయించవచ్చని మనకు అనిపించాలి. (యిర్మీయా 3:4) అలాంటి బంధం ఉన్నప్పుడే మన ప్రవర్తనకు ఆయన ఎలా స్పందిస్తాడో బాగా అర్థమౌతుంది. అప్పుడు మనం ఆయనకు నచ్చినట్టు ఆరాధించడానికి కృషి చేయగలుగుతాం.
20, 21. యోషీయా రాజు తన జీవితంలో దేవుని గురించిన జ్ఞానాన్ని ఎలా ఆచరణలో పెట్టాడు?
20 సత్యారాధన కోసం పట్టుదలగా కృషి చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి యోషీయా రాజు. ఆయన అనుభవాన్ని పరిశీలించండి. ఆయన రాజయ్యే సమయానికి దేశం విగ్రహారాధనతో, హింసతో, మోసంతో పూర్తిగా చెడిపోయి ఉంది. అవన్నీ మనష్షే, ఆమోను పాలించిన కాలంలో ఊపిరిపోసుకున్నాయి. (2 రాజులు 21:1-6, 19-21) “యెహోవాను వెదకుడి” అని జెఫన్యా ఇచ్చిన ఉపదేశం యోషీయా మీద తప్పకుండా మంచి ప్రభావం చూపించివుంటుంది. అందుకే, ‘అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకున్నాడు.’ యూదాలో విగ్రహారాధనను పూర్తిగా తీసివేయడానికి నడుంబిగించాడు. అంతేకాదు ఒకప్పుడు ఉత్తర రాజ్యం కింద ఉన్న ప్రాంతాల్లో కూడా విగ్రహారాధనను రూపుమాపాడు.—జెఫన్యా 1:1, 14-18; 2:1-3; 3:1-4; 2 దినవృత్తాంతములు 34:3-7.
యోషీయా సాకులు వెదకకుండా ఆధ్యాత్మిక శుద్ధీకరణ చేపట్టాడు
21 దేశాన్ని శుభ్రం చేసిన తర్వాత యోషీయా ‘యెహోవాను వెదుకుతూ’ అదే స్ఫూర్తిని చూపించాడు. ఆలయానికి మరమ్మతులు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ పనులు జరుగుతుండగా “మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము” కనబడింది, బహుశా అది ధర్మశాస్త్రం అసలు ప్రతి అయ్యుంటుంది. ఆ గ్రంథాన్ని చదివి వినిపించినప్పుడు యోషీయా ఎలా స్పందించాడు? “ధర్మశాస్త్రపు మాటలు” విన్న వెంటనే ‘రాజు తన వస్త్రములను చింపుకున్నాడు.’ అంతేకాదు, ‘తన హృదయాన్ని చింపుకున్నాడు,’ విన్న విషయాలను వెంటనే ఆచరణలో పెట్టాడు. అప్పటికే ఎంతో చేశానంటూ సాకులు వెదకడానికి ఆయన ప్రయత్నించలేదు. ఆయన చేపట్టిన సంస్కరణ వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయో మీకు గుర్తుందా? “అతని దినములన్నియు వారు [ఇశ్రాయేలీయులు] తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.”—2 దినవృత్తాంతములు 34:8, 14, 19, 21, 30-33; యోవేలు 2:13.
బైబిలు ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు, అవసరమైన మార్పులు చేసుకుంటారా?
22. యోషీయా ఉదాహరణ నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
22 మీరే యోషీయా స్థానంలో ఉండివుంటే ఎలా స్పందించేవాళ్లు? ఆయనలాగే మీరు కూడా ప్రవక్తలు చెప్పింది విని మీ పనుల్లో, ఆలోచనల్లో కావాల్సిన మార్పులు చేసుకొని ఉండేవాళ్లా? మనం జీవిస్తున్నది జెఫన్యా, యోషీయా కాలాల్లో కాకపోయినా, నేడు దేవుడు ఇస్తున్న సందేశాలకు, ఉపదేశాలకు మనం స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి, తన జీవితంలోగానీ ఆరాధనలోగానీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఒక క్రైస్తవునికి అనిపిస్తే, ఆ 12 మంది ప్రవక్తలు రాసిన చిన్న పుస్తకాలను పరిశీలించడం సహాయకరంగా ఉంటుంది. అలా పరిశీలిస్తే, మార్పులు చేసుకోవాలనే ప్రేరణ మనలో కలుగుతుంది.—హెబ్రీయులు 2:1.
23. ఏదైనా ఒక విషయంలో మీరు మెరుగవ్వాల్సి ఉందని మీకనిపిస్తే మీరు ఏమి చేయవచ్చు?
23 కొన్నిసార్లు మీకు కూడా యోనాలాగే అనిపించే అవకాశం ఉంది. యోనా పెద్ద చేప కడుపులో ఉండగా ఇలా అనుకున్నాడు: “నీ కనుదృష్టి నుండి నేను వెలివేయబడ్డాను! మళ్లీ నీ పరిశుద్ధ ఆలయాన్ని ఎలా చూస్తాను?” (యోనా 2:4, NW) పొరపాట్లు చేయడానికి మొగ్గుచూపే తత్వమున్న అపరిపూర్ణ మనుషులమైన మనకు యెహోవా అన్న ఈ మాటలు ఎంత ధైర్యాన్నిస్తాయో కదా: “మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును.” (మలాకీ 3:7) యెహోవాతో మీకున్న బంధాన్ని మీరు ఇంకా పటిష్ఠపర్చుకోవాల్సి ఉందని మీకు అనిపిస్తే, ఆ విషయంలో మీకు సహాయం చేయడానికి మీ సంఘ పెద్దలు ఎంతో సంతోషిస్తారు. ఉదాహరణకు, వాహనం నడపడం విషయమే తీసుకోండి. సాధారణంగా వాహనం మీద మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, ముందు వాహనాన్ని మెల్లగా పోనిస్తారు, తర్వాత వేగాన్ని పెంచుతారు. మీ ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో కూడా అంతే. మీరు ఆ దిశగా చేసే ప్రయత్నాల్లో యెహోవా సంతోషంగా మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. ఎందుకంటే, ఆయన ‘కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు.’ (యోవేలు 2:12-14) నిశ్చయంగా, దేవునికి నచ్చే విధంగా ఆరాధించడానికి కృషి చేస్తున్న వాళ్లందరికీ ఆ 12 చిన్న పుస్తకాల్లోని సందేశాలు మంచి ప్రోత్సాహాన్నిస్తాయి.
కొందరు యెహోవా దగ్గరికి తిరిగి రావడం ద్వారా ‘ఆయనను వెదకాలి’