“వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా . . . ఉండవలెను”
“వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను.”—హెబ్రీయులు 13:4.
1. జయపద్రమైన వివాహాన్ని గూర్చి అనేకమంది ప్రజలు ఏమి నేర్చుకున్నారు?
విడాకులు సర్వసాధారణమైన ఈ కాలంలో సహితం లక్షలాదిమంది ప్రజలు అవిచ్ఛిన్న వివాహములతో ఆనందంగా ఉన్నారు. వ్యక్తిత్వపు తేడాలు, విభిన్న జాతులవారైనను వారు విజయం సాధించడానికి ఒక సూత్రాన్ని కనుగొన్నారు. అలాంటి వివాహాలను మనం యెహోవాసాక్షుల మధ్య చూడగలం. ఒడుదుడుకులు, పరస్పరం ఫిర్యాదుచేసుకునే కారణాలు తమకూ ఉన్నట్లు ఈ దంపతుల్లో అనేకులు అంగీకరిస్తారు. అయినను, వారు ఇలాంటి చిన్నచిన్న తుఫానులను ఓర్చి, తమ దాంపత్య నావను ఎలా సరియైన మార్గంలో పెట్టాలో నేర్చుకున్నారు. వారలా నిర్విఘ్నంగా సాగిపోవడానికి దోహదపడిన కొన్ని కారకాలేవి?—కొలొస్సయులు 3:13.
2. (ఎ) వివాహాన్ని నిలుపగల కొన్ని అనుకూల వాస్తవాలు ఏమైయున్నవి? (బి) వివాహాన్ని చెరచగల కొన్ని కారకములు ఏమైయున్నవి? (14వ పుటలోని బాక్సు చూడండి.)
2 ఎవరి వివాహములు సంతోషంతో, నిలిచియున్నవో ఆ క్రైస్తవుల్లో కొందరు చేసిన వ్యాఖ్యానములు చక్కని విషయాల్ని తెలియజేశాయి. వైవాహిక జీవితంలో 16 సంవత్సరాలు గడిపిన ఒక భర్త యిలా చెప్పాడు: “ఎప్పుడు సమస్య వచ్చినా, వేరొకరి అభిప్రాయాన్ని వినడానికి మేము నిజంగా ప్రయత్నించాము.” అనగా బాహాటంగా, నిర్మొహమాటంగా పరస్పరం సంభాషించుకోవడమే అనేక వివాహాల్ని బలపరచిన కారకాల్లో ఒకటని యిది నొక్కితెల్పుచున్నది. వైవాహిక జీవితంలో 31 సంవత్సరాలు గడిపిన ఒక భార్య యిలా చెప్పింది: “చేతులు పట్టుకుని తమాషా పనులు చేయడం ద్వారా ప్రేమానురాగం ఎల్లవేళల ప్రథమ స్థానమందుండేది.” పరస్పర సంభాషణకు ఇదొక అదనపు ఆకృతి. దాదాపు 40 సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపిన మరో దంపతులు, పరస్పరం నవ్వుకుంటూ, జీవితంలో హాస్యానికో స్థానం కల్పించే ప్రాముఖ్యతను నొక్కితెల్పారు. అది తమ ఇద్దరిలోని మంచి చెడులను చూసుకోవడానికి, పరస్పరం యథార్థమైన ప్రేమ చూపుకోవడానికి కూడ సహాయపడిందని వారు చెప్పారు. తప్పులు అంగీకరించి, క్షమాపణ అడిగే ఇష్టత ఉన్నట్లు ఆ భర్త పేర్కొన్నాడు. ఎక్కడైతే తలవొగ్గే దృక్పథం ఉంటుందో, అక్కడ వివాహం విచ్ఛిన్నానికి బదులు మృదువుగా సర్దుకుపోయే విధంగా ఉంటుంది.—ఫిలిప్పీయులు 2:1-4; 4:5, కింగ్డం ఇంటర్లీనియర్.
మారుతున్న వాతావరణం
3, 4. వివాహమందలి పవిత్రత విషయంలో దృక్పథాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? మీరు ఉదాహరణలివ్వగలరా?
3 ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని దశాబ్దాలనుండి, వివాహ పవిత్రత విషయంలోవున్న భావాలు మారుతున్నవి. ప్రత్యేకంగా వివాహ జతలోని రెండవ వ్యక్తికి ఆ విషయం తెలిసి, దానిని అంగీకరిస్తే, వ్యభిచారం యెడల ఆధునికకాలం కలిగియున్న మృదు స్వభావాన్నిబట్టి ప్రేమకలాపాలు నెరపడం తప్పుకాదని కొంతమంది వివాహితులు అనుకొంటున్నారు.
4 ఈ పరిస్థితిని గూర్చి ఒక క్రైస్తవ అధ్యక్షుడు యిలా వ్యాఖ్యానించాడు: “నైతిక సూత్రావళిని బట్టి జీవించే గంభీరమైన ప్రయత్నాన్ని లోకం పూర్తిగా విడిచిపెట్టింది. పవిత్ర ప్రవర్తన పాతకాలపు పద్ధతిగా దృష్టించడం జరుగుతుంది.” ప్రముఖ రాజకీయ, క్రీడా, వినోదరంగ వ్యక్తులు బైబిలు నైతిక కట్టడలను బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు, కాగా అలాంటి ప్రజలు బహుగా ప్రస్తుతింపబడుతున్నారు. ఎలాంటి నైతిక తప్పిదమైనను, అదుపుతప్పడమైనను అపవిత్రమని దృష్టింపబడుట లేదు. ఉన్నత సమాజమని పిలువబడిన సమాజంలో పవిత్రత, యథార్థత విలువైనదిగా పరిగణింపబడడం అరుదు. యథారాజా తథాప్రజ అన్న చందాన, అనేకులు ఆ ఉన్నత సమాజ ప్రజల మాదిరినే అనుకరించి, దేవుడు ఖండించిన దానిని పెడచెవిన పెడుతున్నారు. అది పౌలు వ్యక్తపరచినట్లుగానే ఉంది: “వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.”—ఎఫెసీయులు 4:19; సామెతలు 17:15; రోమీయులు 1:24-28; 1 కొరింథీయులు 5:11.
5. (ఎ) జారత్వం విషయంలో దేవుని వైఖరి ఏమిటి? (బి) బైబిలు ఉపయోగించిన “వ్యభిచారమనే” మాటలో ఏయే సంగతులు ఇమిడివున్నాయి?
5 దేవుని కట్టడలు మారలేదు. వివాహం కాకుండానే కలిసి జీవించే విషయాన్ని ఆయన వ్యభిచారముగా, వివాహమందలి అపవిత్రతను జారత్వముగా పరిగణిస్తాడు.a అపొస్తలుడైన పౌలు స్పష్టంగా యిలా చెప్పాడు: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను, . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.”—1 కొరింథీయులు 6:9-11.
6. మొదటి కొరింథీయులు 6:9-11 నందలి పౌలు మాటల్లో మనమే ప్రోత్సాహము కనుగొనగలము?
6 ఆ వచనంలో, “మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, . . . మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారైరి” అనే మాట ప్రోత్సాహకరమైన అంశం. అవును గతంలో లోకమందలి అవినీతిని అనుసరించి “దుర్వ్యాపారమునందు” పాల్గొనిన అనేకులు బుద్ధితెచ్చుకొని, క్రీస్తును ఆయన బలిని అంగీకరించి తమను పరిశుభ్రపరచుకొనిరి. నైతిక జీవితాల్ని జీవించుట ద్వారా దేవుని ప్రీతిపరచుటకు ఎంపికచేసుకుని తత్ఫలితంగా సంతోషంగా జీవిస్తున్నారు.—1 పేతురు 4:3, 4.
7. “లైంగిక దుర్నీతిని” అర్థం చేసుకోవడంలో ఏ భిన్నత్వం ఉంది, కాగా బైబిలు దృష్టి ఏమి?
7 మరోవైపున, లైంగిక దుర్నీతిని గూర్చి ఆధునిక లోకమిచ్చే నిర్వచనం ఎంతగా దిగజారిందంటే, అది దేవుని దృష్టికి ఎంతమాత్రము సరిపోదు. “లైంగిక దుర్నీతిని” ఒక నిఘంటువు “ప్రామాణిక నైతికత్వమునకు భిన్నమైనదని” నిర్వచిస్తున్నది. వివాహానికి ముందే మరియు వివాహేతర లైంగికత్వాన్ని, ఆలాగే సలింగసంయోగాన్ని చూసిచూడనట్టుండే నేటి “ప్రామాణిక నైతికత్వాన్ని” బైబిలు లైంగిక దుర్నీతని ఖండిస్తున్నది. అవును, బైబిలు దృక్కోణాన్నుండి చూస్తే, లైంగిక దుర్నీతి ఘోరమైనదే కాక, దేవుని నైతిక సూత్రావళిని అతిక్రమించేదైయుంది.—నిర్గమకాండము 20:14, 17; 1 కొరింథీయులు 6:18.
క్రైస్తవ సంఘంపై ప్రభావం చూపబడింది
8. క్రైస్తవ సంఘమందలి వారిపై లైంగిక దుర్నీతి ఎలా ప్రభావం చూపగలదు?
8 నేడు లైంగిక దుర్నీతి ఎంత ప్రబలమై యుందంటే అది క్రైస్తవ సంఘమందున్న వారిపై సహితం వత్తిడి తీసుకురాగలదు. బహుళ వ్యాప్తమైన నీచమగు టివి కార్యక్రమాలు, వీడియోలు, అశ్లీల పుస్తకాలు వారిపై ప్రభావం చూపగలవు. క్రైస్తవుల్లో కొద్దిమంది మాత్రమే ఆ ప్రభావానికి గురియైనను, యెహోవాసాక్షుల నుండి బహిష్కరింపబడిన వారిలో ఎక్కువమంది ఏదోరకమైన లైంగిక దుర్నీతికి పాల్పడి, క్రైస్తవులకు తగని అట్టి ప్రవర్తన విషయమై పశ్చాత్తాపము చూపనివారే ఉన్నారు. అయితే అలా బహిష్కరింపబడిన వారిలో ఎక్కువమంది చివరకు తమ తప్పు తెలుసుకొని, తిరిగి స్వచ్ఛమైన జీవన మార్గాన్ని చేపట్టిన వారిగా యుక్తకాలమున తిరిగి సంఘములోనికి చేర్చబడిరి.—లూకా 15:11-32 పోల్చండి.
9. అజాగ్రత్తపరులను సాతాను ఎలా మోసగిస్తాడు?
9 సాతాను గర్జించు సింహమువలె తిరుగుచు, అప్రమత్తంగా లేనివారిని మ్రింగడానికి సిద్ధంగా ఉన్నాడనుటలో ఎంతమాత్రం సందేహం లేదు. ప్రతిసంవత్సరము అప్రమత్తంగా లేని క్రైస్తవులను అతని కుయుక్తులు, “తంత్రములు” ఉరిలో పడవేస్తున్నవి. ఎప్పుడూ అతని ప్రభావం నిండివుండే ఈ లోకం స్వార్థపూరితమైనది, సుఖమే ప్రధానమనేది, కాముకత్వంగలదై యున్నది. అది శరీర కోరికలను రెచ్చగొడుతుంది. అది ఆశానిగ్రహాన్ని తృణీకరిస్తుంది.—ఎఫెసీయులు 2:1, 2; 6:11, 12, అథస్సూచి; 1 పేతురు 5:8.
10. శోధనకు ఎవరు లోనవుతారు, ఎందుకు?
10 లైంగిక దుర్నీతిగల శోధనలకు సంఘమందలి ఎవరు గురికాగలరు? వారు స్థానిక సంఘంలోని పెద్దలు, ప్రయాణ కాపరులు, బేతేలు సభ్యులు, ప్రతినెల అనేక గంటలు ప్రకటించే పయినీర్లు కావచ్చు, కుటుంబాలు కలిగివున్న పనిరద్దీగల తలిదండ్రులు, లేదా స్నేహితుల వత్తిడి నెదుర్కొనే యౌవనులు కావచ్చు. ఇలా క్రైస్తవుల్లో అనేకులు ఈ శోధనకు గురికావచ్చు. శారీరక శోధన అందరికి సర్వసాధారణమే. అతితక్కువగా అపేక్షించినప్పుడు సహితం లైంగికాకర్షణ కలుగవచ్చును. పౌలు ఈ విధంగా వ్రాయగల్గాడు: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు.” అయితే బాధ్యతాయుత స్థానాల్లోవున్న కొంతమంది క్రైస్తవులు ఈ లైంగిక దుర్నీతి ఆకర్షణకు లోనయ్యారనుట దుఃఖకరమైన విషయం.—1 కొరింథీయులు 10:12, 13.
ఆకర్షింపబడి, ఉరిలో పడవేయబడుట
11-13. లైంగిక దుర్నీతికి నడిపిన కొన్ని పరిస్థితులేమి?
11 కొంతమందిని జారత్వము, వ్యభిచారమనే అవివేక విధానానికి నడిపిన శోధనలు మరియు పరిస్థితులు ఏమైయున్నవి? అవి అనేకం సంక్లిష్టం మరియు ఒక దేశానికి మరోదేశానికి, ఒక సంస్కృతికి మరో సంస్కృతికి విభిన్నంగా ఉంటాయి. అయితే, అనేక దేశాల్లో ఒకేవిధంగావుండే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులున్నాయి. ఉదాహరణకు, ఆల్కహాలు పానీయాలు అదుపులేకుండా అందుబాటులోవుండే పార్టీలను కొందరు ఏర్పాటుచేశారని రిపోర్టు చేయబడింది. మరికొందరు లోకతత్వాన్ని సూచించే సంగీతాన్ని, రెచ్చగొట్టే నాట్యానికి ఆకర్షితులయ్యారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, ఉంపుడుగత్తెలను కలిగియున్న—అవిశ్వాసులైన—సంపన్నులున్నారు; ఉంపుడుగత్తెగా ఉండుటలో వ్యభిచారము ఇమిడియున్నను ఆర్థిక భద్రతకొరకు అలా వుండడానికి కొంతమంది స్త్రీలు శోధింపబడ్డారు. ఇతర ప్రాంతాల్లో క్రైస్తవ భర్తలు ఉద్యోగరీత్యా గనుల్లో లేదా మరోచోట పనిచేయడానికి తమ కుటుంబాలను విడిచివెళ్లారు. అప్పుడు వారి యథార్థత, పవిత్రత కొంతమేరకు లేదా ఇంటివద్ద ఉన్నప్పుడు అనుభవింపని రీతుల్లో పరీక్షింపబడుతుంది.
12 అభివృద్ధి చెందిన దేశాల్లో కొంతమంది, మూడవవ్యక్తి లేకుండా అంటే కారు నడపడం నేర్పించడానికి క్రమంగా ఇద్దరే కారులో సన్నిహితంగా కూర్చునే పరిస్థితులవంటి పరిస్థితుల్లో తరచు వ్యతిరేకలింగ వ్యక్తులతో ఉండుటద్వారా సాతాను ఉరిలో చిక్కుకొనిరి.b షెప్పర్డింగ్ పనిలో సలహా యివ్వడానికి ఒంటరిగా వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. సంభాషణలు భావావేశాలకులోనై దాని ఫలితంగా వారిద్దరిని కలవరపరచే పరిస్థితులు ఎదురుకావచ్చును.—మార్కు 6:7; అపొస్తలుల కార్యములు 15:40 పోల్చండి.
13 ముందు ప్రస్తావించబడిన పరిస్థితులు కొందరు క్రైస్తవులు అజాగ్రత్తపరులై, లైంగిక దుర్నీతి క్రియలు చేయుటకు నడిపినవి. యిలా మొదటి శతాబ్దంలో సహితం సంభవించింది, వారు ‘తమ స్వకీయ దురాశలచే ఈడ్వబడి శోధింపబడుటకు’ తమను అనుమతించుకొనగా, అది వారు పాపము చేయుటకు నడిపింది.—యాకోబు 1:14, 15; 1 కొరింథీయులు 5:1; గలతీయులు 5:19-21.
14. వ్యభిచారం విషయంలో స్వార్థమెందుకు అంతరంగ వాస్తవమై యున్నది?
14 లైంగిక దుర్నీతి క్రియలకు సర్వసాధారణమైన కొన్ని అంతరంగ కారకములున్నవని బహిష్కరణల యొక్క నిశిత పరిశీలన చూపిస్తున్నది. అటువంటి క్రియల్లో కొంతమేరకు స్వార్థమున్నది. మనమెందుకలా చెప్పవచ్చు? ఎందుకంటే వ్యభిచారం జరిగిన సందర్భాల్లో, అమాయకునికి లేదా అమాయకులకు హాని జరుగబోవుచున్నది. అది బహుశ చట్టబద్ధమైన వివాహిత జతకే కావచ్చును. పిల్లలుండి, ఆ వ్యభిచారం విడాకులకు దారితీస్తే నిశ్చయంగా వారికి హాని కలుగుతుంది, ఐక్యకుటుంబం యొక్క భద్రతను కోరే పిల్లలు అత్యధిక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వ్యభిచారి ప్రాథమికంగా తన స్వంత సుఖాన్ని, ప్రయోజనాన్ని గూర్చి ఆలోచిస్తుంటాడు. అది స్వార్థం.—ఫిలిప్పీయులు 2:1-4.
15. వ్యభిచారానికి నడిపే కొన్ని కారణాలు ఏమైయుండవచ్చును?
15 సాధారణంగా వ్యభిచారమనేది బలహీనతయొక్క ఆకస్మిక చర్యకాదు. వివాహమే గమనించలేనంతగా, క్రమేణి పాడైపోతుంది. బహుశ పరస్పర సంభాషణ రివాజుగా లేదా నిర్జీవంగా తయారైవుంటుంది. పరస్పర ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉండవచ్చు. ఇరువురు ఒకరియెడల ఒకరు అభినందించుకోవడంలో విఫలమై యుండవచ్చు. కొంతకాలంగా భార్యాభర్తలిద్దరు లైంగికంగా ఒకరినొకరు సంతృప్తిపరచుకొనకుండా ఉండవచ్చు. జారత్వం జరిగే సమయానికి దేవునితో వారికున్న సంబంధం కూడ ప్రకాశహీనమై యుండవచ్చును. యెహోవా సమస్త తలంపులను, క్రియలను ఎరిగియున్న సజీవుడైన దేవుడనే విషయమే గ్రహింపునకు రాదు. వ్యభిచారి మనస్సులో “దేవుడు” కేవలం ఒక మాటగా, దైనందిన జీవితంలో ఎలాంటి భాగం లేనివానిగా తయారౌతాడు. అప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం సులభమౌతుంది.—కీర్తన 51:3, 4; 1 కొరింథీయులు 7:3-5; హెబ్రీయులు 4:13; 11:27.
ఎదిరించడానికి కీలకం
16. విశ్వాసఘాతకుడయ్యే శోధనను ఒక క్రైస్తవుడు ఎలా ఎదిరించగలడు?
16 విశ్వాసఘాతకంగా ప్రవర్తించే మార్గంలో పడిపోయే శోధనలో తానున్నట్లు ఏ క్రైస్తవుడైనను కనుగొంటే, ఏ వాస్తవాల్ని పరిగణలోకి తీసుకోవాలి? మొదట, పూర్తిగా బైబిలు సూత్రాలపై ఆధారపడి, క్రైస్తవ ప్రేమకున్న అర్థానికి గంభీరమైన తలంపునివ్వాలి. ఎన్నటికి భౌతికమైన, మోహముతో కూడిన ప్రేమను ఒకని భావాలపై ప్రభావం చూపడానికి మరియు స్వార్థపూరిత ఆలోచనలో పడిపోవడానికి, ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టడానికి అనుమతించకూడదు. బదులుగా, పరిస్థితిని యెహోవా దృష్టినుండి చూడాలి. మరి విశేషంగా సంఘాన్ని పరిగణలోనికి తీసుకుని సంఘానికి, యెహోవా నామానికి ఆ చెడు ప్రవర్తన తీసుకువచ్చే అవమానాన్ని దృష్టించాలి. (కీర్తన 101:3) ఆ విషయమై క్రీస్తు కలిగియున్న మనస్సును కలిగియుండి, ఆ మేరకు ప్రవర్తించుట ద్వారా ఆ విపత్తును తప్పించుకోవచ్చును. క్రీస్తును పోలిన నిస్వార్థ ప్రేమ ఎన్నటికి విఫలము కాదని గుర్తుంచుకోండి.—సామెతలు 6:32, 33; మత్తయి 22:37-40; 1 కొరింథీయులు 13:5, 8.
17. నమ్మకత్వాన్ని గూర్చిన ఏ క్షేమాభివృద్ధికరమైన మాదిరులు మనకు కలవు?
17 ఎదిరించడానికున్న ఒక కీలకమేమనగా ఒకని విశ్వాసాన్ని, సమీప భవిష్యత్తులోని నిరీక్షణా దృష్టిని అభేద్యం చేసుకోవడమే. అంటే ప్రాచీన కాలమందలి విశ్వాసులైన స్త్రీపురుషులు మరియు యేసు ఉంచిన అసాధారణమైన యథార్థతా మాదిరులను హృదయమందు ప్రముఖముగా ఉంచుకొనుటని దీని భావము. పౌలు యిలా వ్రాశాడు: “ఇంత గొప్పసాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై యున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.” (హెబ్రీయులు 12:1-3) వివాహపు నావను ముంచి వేయడానికి బదులు, వివేకియైన వ్యక్తి దానిని పునరుద్ధరించేందుకు కలిగిన నష్టానికి మరమ్మత్తు చేసే మార్గాల్నిగూర్చి ఆలోచించి విశ్వాసఘాతకం, వంచన అనే ప్రమాదాన్ని అలా తప్పించుకుంటాడు.—యోబు 24:15.
18. (ఎ) వ్యభిచారాన్ని వర్ణించడానికి విశ్వాసఘాతకమనే మాట ఎందుకు కఠినమైన పదం కాదు? (బి) ప్రమాణాలు నెరవేర్చే విషయాన్ని దేవుడెట్లు దృష్టించును?
18 ద్రోహం చేయుటయగు విశ్వాసఘాతకం అనే మాట లైంగిక దుర్నీతి విషయంలో చాలా కఠినమైన పదమా? ద్రోహం చేయడమంటే నమ్మకాన్ని లేదా నమ్మడాన్ని వంచించడమై యుంది. నిశ్చయంగా వివాహ ప్రమాణాలయందు అన్ని కష్టనష్ట సమయాల్లో నమ్మకము, ప్రేమ మరియు పోషణయొక్క వాగ్దానము ఇమిడియుంది. మనం నివసించే ఈ కాలాన్నిబట్టి చూస్తే, వివాహ సమయంలో ఒకవ్యక్తి చేసిన ప్రమాణంలో పాతకాలంనాటి మాటలు చేరియున్నాయని అనేకమంది తలంచుదురు. ఆ నమ్మకాన్ని వమ్ముచేయడం వివాహజతలోని వేరొకరికి ద్రోహం చేయడమే. ప్రమాణాల విషయంలో దేవుని దృష్టియేమిటో బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది: “నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.”—ప్రసంగి 5:4.
19. ఒక సాక్షి తప్పిపోయినప్పుడు సాతాను దేనికి భిన్నంగా సంతోషిస్తాడు?
19 దానిని గూర్చిన సందేహమే ఉండనవసరం లేదు. ఒక పాపి రక్షణ విషయంలో పరలోకమందు అధిక సంతోషమున్నట్లే, యెహోవాసాక్షుల్లో ఒకరు తన యథార్థతను కాపాడుకొనడంలో విఫలమైతే సాతానుయొక్క భూమిమీది దృశ్య, అదృశ్య సమూహముల మధ్య అధిక సంతోషం కలుగుతుంది.—లూకా 15:7; ప్రకటన 12:12.
అందరికి సర్వసామాన్యమైన సమస్యలు
20. శోధనను మనమెట్లు ఎదిరించగలం? (2 పేతురు 2:9, 10)
20 కొన్ని సందర్భాల్లో వ్యభిచారం అనివార్యమా? శరీరం మరియు సాతాను, క్రైస్తవులు ఎదిరించి తమ యథార్థతను కాపాడుకోలేనంత బలవంతులా? పౌలు ప్రోత్సాహకరమైన ఈ మాటలు చెప్పాడు: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” నేటి లోకంలో శోధనను సంపూర్ణంగా తప్పించుకోలేము, అయితే ప్రార్థనయందు దేవునితట్టు తిరుగుట ద్వారా మనము నిశ్చయముగా సహించి ఎలాంటి శోధనైనను అధిగమించగలము.—1 కొరింథీయులు 10:13.
21. మన తర్వాతి పఠనం ఏ ప్రశ్నలకు సమాధానమిస్తుంది?
21 శోధనలను సహించి విజయం సాధించులాగున మనకు సహాయపడేందుకు దేవుడేమి అందజేయును? మన వివాహాల్ని, కుటుంబాల్ని, ఆలాగే యెహోవా నామము మరియు సంఘ గౌరవాన్ని నిలిపేందుకుగాను వ్యక్తిగతంగా మనకేమి అవసరం? మన తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.
[అధస్సూచీలు]
a “మత్తయి 5:32 మరియు 19:9 నందు ఉపయోగింపబడినట్లుగా ‘వ్యభిచారమనే’ మాట దాని విశాల భావమందు, వివాహబంధము వెలుపల జరిగించే చట్టరహిత మరియు అక్రమ సంబంధాలను సూచిస్తున్నది. పోర్నియా [ఆ వచనాల్లో ఉపయోగింపబడిన గ్రీకు పదము] నందు (సహజంగా లేదా అస్వాభావికంగా) కేవలం ఒక మానవుడే తన మర్మాంగా(లను)న్ని, లైంగిక దుర్నీతియందు ఉపయోగించడం, ఆలాగే ఆ దుర్నీతియందు మరొకరు అనగా వ్యతిరేకలింగ వ్యక్తి, లేదా ఒక మృగము చేరియుండుట ఇమిడియుంది.” (ది వాచ్‌టవర్, మార్చి 15, 1983, పుట 30) జారత్వము: “ఒక వివాహిత వ్యక్తి మరియు చట్టబద్ధముగా భర్త లేదా భార్యకాని వేరొకవ్యక్తితో స్వచ్ఛందముగా లైంగిక ప్రక్రియ జరపడం.”—ది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్.
b ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రయాణానికి సహాయపడే యుక్త సమయాలు ఉండవచ్చును, అలాంటి పరిస్థితులకు విపరీత అర్థాలు చెప్పరాదు.
మీకు గుర్తున్నాయా?
◻ వివాహాన్ని బలపర్చుకోవడానికి సహాయపడే కొన్ని కారకాలేవి?
◻ నైతికత్వం విషయంలో లోక దృష్టిని మనమెందుకు విసర్జించాలి?
◻ లైంగిక దుర్నీతికి నడిపే కొన్ని శోధనలు మరియు పరిస్థితులేమై యున్నవి?
◻ పాపాన్ని ఎదిరించడానికున్న కీలక సూత్రమేమి?
◻ శోధన సమయాల్లో దేవుడు మనకెట్లు సహాయం చేస్తాడు?
[14వ పేజీలోని బాక్సు]
నిలిచివుండే వివాహాల సాధారణ వాస్తవాలు
◻ బైబిలు సూత్రాలకు గట్టిగా హత్తుకొనుట
◻ దంపతులిద్దరు యెహోవాతో బలమైన సంబంధం కలిగివుండడం
◻ భర్త తన భార్యను, ఆమె భావాలను, ఆమె అభిప్రాయాలను గౌరవించడం
◻ తమ దైనందిన జీవితంలో మంచి సంభాషణ
◻ పరస్పరం ప్రీతిపర్చుకోవడానికి ప్రయత్నించడం
◻ హాస్యభావం కలిగివుండడం; తననుతాను పరిహసించుకోగల్గటం
◻ తప్పిదాల్ని ధైర్యంగా అంగీకరించడం; ఊరకనే క్షమించేయడం
◻ వారి ప్రేమను సజీవంగా ఉంచుకోవడం
◻ పిల్లల్ని పెంచడం, వారి క్రమశిక్షణ విషయంలో ఐకమత్యం కలిగివుండడం
◻ కలిసి క్రమంగా యెహోవాకు ప్రార్థించడం
వివాహాన్ని బలహీనపరచే ప్రతికూల కారకాలు
◻ స్వార్థం మరియు మూర్ఖత్వం
◻ కలిసి పనులు చేయడంలో తప్పిపోవడం
◻ పరస్పర సంభాషణ లేకపోవడం
◻ భార్యాభర్తలిద్దరు కలిసి విషయాల్ని చర్చించకపోవడం
◻ డబ్బును సరిగా వినియోగించకపోవడం
◻ పిల్లలతో లేదా సవతి పిల్లలతో వ్యవహరించేటప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండడం
◻ ఎక్కువ గంటలు పనిచేసి భర్త ఇంటికి ఆలస్యంగా రావడం లేదా ఇతర కర్తవ్యాల విషయంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం
◻ కుటుంబ ఆత్మీయ అవసరతల యెడల శ్రద్ధచూపడంలో విఫలం కావడం
[15వ పేజీలోని చిత్రం]
వివాహాన్ని గౌరవప్రదంగా ఉంచడం శాశ్వత సంతోషం తెస్తుంది