కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 5/15 పేజీలు 17-22
  • వివాహమందు నూతన స్వభావమును పెంపొందించుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వివాహమందు నూతన స్వభావమును పెంపొందించుకొనుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వివాహపు ఒత్తిడులను ఎదుర్కొనుట
  • ఆ శక్తిని బలపర్చుకోండి
  • ప్రవర్తనా సరళిలో విభిన్న మాదిరులు
  • వివాహబంధాన్ని బలపర్చుకోండి
  • నేటి లోకంలో వివాహం విజయవంతం కాగలదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • వివాహంలో “మూడు పేటల త్రాడును” కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • పెళ్లి తర్వాత జీవితం
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మీ వివాహాన్ని చిరకాల బంధంగా చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 5/15 పేజీలు 17-22

వివాహమందు నూతన స్వభావమును పెంపొందించుకొనుట

“మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, . . . నవీన స్వభావమును ధరించుకొనవలెను.”—ఎఫెసీయులు 4:23, 24.

1. వివాహాన్ని ఎందుకు చులకనగా తీసుకోకూడదు?

వివాహమనేది ఒకడు తన జీవితంలో తీసుకునే ఒక గంభీరమైన చర్య, కాబట్టి దానిని ఎన్నడును చులకనగా తీసుకొనరాదు. ఎందుకు? ఎందుకనగా అది జీవితాంతం మరో వ్యక్తితో ప్రమాణపూర్వకంగా కలిసివుండడాన్ని కోరుతుంది. అంటే ఆ వ్యక్తితో తన జీవితాన్నంతా పంచుకోవడమని దాని భావం. ఆ ఒడంబడిక మంచి స్థితిలో ఉండాలంటే పరిపక్వతా తీర్మానం అవసరం. అంతేకాకుండ అది ‘చిత్తవృత్తియందు నూతనపరచబడి, ఒక నవీన స్వభావాన్ని రూపుదిద్దుకోవడానికి’ క్రియత్మాక ప్రభావాన్ని కూడ కోరుతుంది.—ఎఫెసీయులు 4:23, 24; ఆదికాండము 24:10-58; మత్తయి 19:5, 6ను పోల్చండి.

2, 3. (ఎ) జ్ఞానయుక్తంగా వివాహిత భాగస్వామిని ఎంచుకోవడానికి అవసరమైనదేమి? (బి) వివాహమందు ఏమి యిమిడియుంది?

2 బలమైన శరీర కోరికల ప్రభావానికి లోనై, త్వరపడి వివాహం చేసుకోకుండుటకు మంచి కారణమున్నది. పెద్దతరహా వ్యక్తిత్వం, ప్రవర్తన వృద్ధికావడానికి సమయం అవసరం. మంచి తీర్మానం చేసుకోవడానికి ఆధారంగా పనిచేయగల అనుభవం, జ్ఞానంకూడ కాలంతోపాటే వస్తాయి. అప్పుడు, తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఎక్కువ విజయవంతం కావచ్చును. ఒక స్పానిష్‌ సామెత సరళముగా యిలా చెప్పింది: “మంచి వివాహం చేసుకొనలేకపోవడం కంటె ఒంటరిగా ఉండడం మేలు.”—సామెతలు 21:9; ప్రసంగి 5:2.

3 జయపద్రమైన వివాహానికి సరియైన జతను ఎంపిక చేసుకోవడం ఒక మూలాధార విషయం. దానికి ఒక క్రైస్తవుడు శరీర ఆకర్షణ లేదా అసాధారణమైన భావోద్రేక మరియు శరీరేచ్ఛల వత్తిడిని బట్టికాక బైబిలు నడిపింపు ప్రకారం నడుచుకోవాలి. వివాహమంటే కేవలం రెండు శరీరముల కలయికకంటె ఎక్కువ భావాన్ని కలిగియుంది. అది రెండు వ్యక్తిత్వాల్ని, రెండు కుటుంబాల్ని వారి విద్యాస్థాయిలను, బహుశ రెండు సంస్కృతుల్ని మరియు రెండు భాషల్ని ఒకటిగా చేర్చేదైయుంది. ఇద్దరు వ్యక్తుల్ని వివాహబంధమందు ఐక్యపరచుటకు నాలుకను సరిగా ఉపయోగించడం నిశ్చయంగా అవసరం; సంభాషణా శక్తి నిర్మించగలదు లేదా కూలద్రోయగలదు. దీనియంతటి నుండి ‘ప్రభువునందు మాత్రమే’ అంటే తోటి విశ్వాసిని వివాహం చేసుకోండి అని పౌలు యిచ్చిన సలహాలోవున్న జ్ఞానాన్ని కూడ మనం చూడగలం.—1 కొరింథీయులు 7:39; ఆదికాండము 24:1-4; సామెతలు 12:18; 16:24.

వివాహపు ఒత్తిడులను ఎదుర్కొనుట

4. వివాహమందు కొన్నిసార్లు సంఘర్షణ, ఉద్రేకం ఎందుకు తలెత్తును?

4 మంచి పునాదివుంటే కూడ, కొన్ని సమయాల్లో సంఘర్షణ, ఒత్తిడి, ఉద్రేకం ఉంటాయి. వివాహితుడైననూ కాకపోయిననూ ఏ వ్యక్తికైనా అవి సర్వసాధారణమే. ఎలాంటి సంబంధమందైననూ ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వత్తిడి కలుగజేస్తాయి. మంచి వివాహాల్లో సహితం మానసికస్థితిలోని మార్పులు వ్యక్తిత్వ సంఘర్షణలకు దారితీయవచ్చును. మరో వాస్తవమేమంటే యాకోబు చెప్పినట్లు ఎవరును తమ నాలుకను సంపూర్ణంగా తమ అధీనంలో ఉంచుకోలేరు: “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును. . . . నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!”—యాకోబు 3:2, 5.

5, 6. (ఎ) తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు అవసరమైనదేమి? (బి) ఆ కలతను రూపుమాపుటకు ఏ చర్య తీసుకోవడం అవసరం?

5 వివాహమందు ఒత్తిళ్లు పెరిగినప్పుడు, పరిస్థితిని మనమెట్లు అదుపుజేయగలము! తప్పుగా అర్థంచేసుకున్న విషయం ఒక జగడంగా, ఆ జగడం చెదిరిన సంబంధంగా మారకముందే దాన్ని మనమెలా ఆపుజేయగలం? ఇక్కడే చిత్తవృత్తిని నూతన పరచుకోవడం అవసరమౌతుంది. యిలా నూతనపరచుకోవడం అనుకూలంగా లేదా ప్రతికూలంగా, క్షేమాభివృద్ధికరంగా, ఆత్మీయంగా మొగ్గుచూపే లేదా శరీరేచ్ఛలచే నడిపింపబడిన పరిస్థితిని దిగజార్చే విధంగా ఉండవచ్చు. అది క్షేమాభివృద్ధికరమైనదైతే అతడు లేక ఆమె తన వివాహాన్ని కాపాడుకొనేవిధంగా ఏర్పడిన ఆ కలతను బాగుచేసేందుకు పనిచేయును. వాగ్వివాదాలు, అనంగీకారాలు వివాహాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. బైబిలు సలహాను అన్వయించుట ద్వారా ఆ కష్టభావాలు తొలగిపోయి, పరస్పర గౌరవం మరియు ఒకరినొకరు అర్థంచేసుకోవడం పునరుద్ధరింపబడగలదు.—రోమీయులు 14:19; ఎఫెసీయులు 4:23, 26, 27.

6 ఈ పరిస్థితుల్లో పౌలు చెప్పిన మాటలు ఎంతో యుక్తమైనవి: “కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించియున్న లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:12-14.

7. కొందరు తమ వివాహమందు ఏ సమస్యను కలిగియుండవచ్చును?

7 ఆ వచనాల్ని చదవడం సులభమే, కాని ఆధునిక జీవిత ఒత్తిడి క్రింద వాటిని అన్వయించడం అన్నిసమయాల్లో అంత సులభం కాదు. ప్రాథమిక సమస్యేమై యుండవచ్చును? కొన్నిసార్లు, ఒక క్రైస్తవుడు తనకు తెలియకుండానే ద్వందవైఖరితో జీవిస్తుండవచ్చును. రాజ్యమందిరంలో అతడు సహోదరుల మధ్య అతడు దయాపూర్వకంగాను, శ్రద్ధతోను ప్రవర్తించవచ్చును. అయితే, ఇంటికి వచ్చినప్పుడు, గృహములోని వాడుకనుబట్టి అతడు తన ఆత్మీయ బంధమును మర్చిపోవచ్చును. అక్కడ వారు “అతను,” “ఆమె” అన్నట్లు కేవలము భార్యాభర్తలుగానే ఉంటారు. ఒత్తిడినిబట్టి రాజ్యమందిరములో ఎన్నడూ పలుకని రీతిలో అతడు (లేదా ఆమె) నిర్దాక్షిణ్యముగా మాట్లాడచ్చును. ఏం జరిగింది? ఆ క్షణంలో క్రైస్తవ వ్యక్తిత్వం ఎగిరిపోయింది. ఆ దేవుని సేవకుడు/సేవకురాలు గృహంలో అతను (లేదా ఆమె) ఇంకను తన క్రైస్తవ సహోదరుడు (లేదా సహోదరి) అనే విషయం మర్చిపోవడం జరిగింది. చిత్తవృత్తియందు నూతనపర్చబడుట అనుకూలంగా మారడానికి బదులు ప్రతికూలంగా మారింది.—యాకోబు 1:22-25.

8. చిత్తవృత్తిని నూతనపరచే శక్తి ప్రతికూలంగా వుంటే దాని ఫలితమేమై యుంటుంది?

8 దాని ఫలితమేమి? భర్త ‘తన భార్య యెక్కువ బలహీనమైన ఘటమని ఆమెను సన్మానించక ఆమెతో కాపురం’ చేయడం మానుకుంటాడు. భార్య తన భర్తను గౌరవించడం మానివేస్తుంది; ఆమెలోని “సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము” మటుమాయమౌతుంది. నూతన పరచబడిన చిత్తవృత్తి ఆత్మీయముగా కాక శరీర సంబంధమైనదిగా మారుతుంది. “శరీర సంబంధమైన మనస్సు” చోటుచేసుకుంటుంది. కాబట్టి పురికొల్పునిచ్చే ఆ చిత్తవృత్తి ఆత్మీయమైనదిగా, అనుకూలమైనదిగా ఉండుటకు ఏమిచేయాలి? మన ఆత్మీయతను మనం బలపర్చుకోవాలి.—1 పేతురు 3:1-4, 7; కొలొస్సయులు 2:18.

ఆ శక్తిని బలపర్చుకోండి

9. మన దైనందిన జీవితంలో మనమెలాంటి ఎంపికలు చేసుకోవాల్సి ఉంటుంది?

9 మనం నిర్ణయాలు, ఎంపికలు చేయాల్సి వచ్చేప్పటికి మనకు పురికొల్పునిచ్చే ఆ శక్తి, మన మానసిక స్వభావమై రంగప్రవేశం చేస్తుంది. జీవితంలో ఎంపికల పరంపరలు అనగా మంచిచెడులు, స్వార్థ నిస్వార్థాలు, నైతిక అనైతికతల విషయాలు తదేకంగా వస్తుంటాయి. సరియైన నిర్ణయాలు చేయడానికి మనకేది సహాయం చేస్తుంది? అందుకు మనం మన నూతన పరచబడిన చిత్తవృత్తిని యెహోవా చిత్తం చేయడంపై కేంద్రీకరించాలి. కీర్తనల రచయిత యిలా ప్రార్థించాడు: “యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.”—కీర్తన 119:33; యెహెజ్కేలు 18:31; రోమీయులు 12:2.

10. చిత్తవృత్తిని నూతనపరచే శక్తిని మనమెలా అనుకూలముగా బలపరచుకోవచ్చును?

10 యెహోవాతో మనకుండే బలమైన సంబంధం మనమాయనను ప్రీతిపరచుటకు ఆలాగే వివాహమందలి అపవిత్రతతో సహా చెడుతనము నుండి వైదొలగుటకు సహాయం చేస్తుంది. “[వారి] దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునుగల దానిని” చేయుటకు ఇశ్రాయేలీయులు ప్రోత్సహింపబడిరి. అయితే దేవుడు వారికి ఈ విధంగాకూడ చెప్పాడు: “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.” “వ్యభిచరింపకూడదు” అనే పది ఆజ్ఞల్లోని ఏడవదాని దృష్ట్యా, ఇశ్రాయేలీయులు వ్యభిచారాన్ని అసహ్యించుకోవాలి. వివాహమందు నమ్మకత్వాన్ని దేవుడెంత కచ్చితంగా దృష్టించునో ఆ యాజ్ఞ చూపిస్తున్నది.—ద్వితీయోపదేశకాండము 12:28; కీర్తన 97:10; నిర్గమకాండము 20:14; లేవీయకాండము 20:10.

11. అదనంగా మరింకే విధంగా మన చిత్తవృత్తిని నూతనపరచే శక్తిని బలపర్చుకోగలం?

11 చిత్తవృత్తిని నూతనపరచే ఆ శక్తిని మనమెలా పటిష్టపర్చుకొనగలం? ఆత్మీయ కార్యములను విలువలను గుణగ్రహించుట ద్వారా చేయగలం. అంటే మనం క్రమంగా దేవుని వాక్యాన్ని పఠించి కలిసి యెహోవా ఆలోచనలను, సలహాలను చర్చించుటలో ఆనందించడాన్ని నేర్చుకునే అవసరతను నెరవేర్చాలి. మన హృదయ భావాలు కీర్తనల రచయిత భావాలను పోలియుండాలి: “నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీ కట్టడను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అపుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును.”—కీర్తన 119:10, 11, 33, 34.

12. క్రీస్తు మనస్సును ప్రతిబింబించుటలో ఏ సంగతులు మనలను ఐక్యపరచగలవు?

12 యెహోవా నీతియుక్తమైన సూత్రముల యెడల ఈ విధమైన గుణగ్రహణ బైబిలును పఠించుట ద్వారానే కాకుండ క్రమంగా క్రైస్తవ కూటములలో భాగము వహించుట ద్వారా మరియు క్రైస్తవ పరిచర్యయందు కలిసి భాగము వహించుట ద్వారా కాపాడబడుతుంది. ఈ రెండు శక్తివంతమైన ప్రభావాలు ఎడతెగక మన చిత్తవృత్తిని నూతనపరచే శక్తిని బలపరచగలవు దానితో మనం నిస్వార్థ జీవన విధానం అన్ని సమయాల్లో క్రీస్తు కలిగియున్న మనస్సును ప్రతిబింబించ గలదు.—రోమీయులు 15:5; 1 కొరింథీయులు 2:16.

13. (ఎ) చిత్తవృత్తిని నూతనపరచే శక్తిని బలపరచడంలో ప్రార్థన ఎందుకు ఒక విలువైన సంగతైయుంది? (బి) ఈ విషయంలో యేసు ఎలాంటి మాదిరి ఉంచాడు?

13 మరో వాస్తవాన్ని పౌలు తాను ఎఫెసీయులు వ్రాసిన పత్రికలో నొక్కితెల్పాడు: “ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతివిధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు . . . ఉండుడి.” (ఎఫెసీయులు 6:18) భార్యాభర్తలు కలిసి ప్రార్థించవలసిన అవసరమున్నది. హృదయాన్ని విప్పి నిర్మొహమాటంగా సంభాషించుకుని ఎలాంటి కలతవున్నా దాన్ని బాగుచేసుకోవడానికి తరచు అలాంటి ప్రార్థనలు నడుపగలవు. పరీక్ష మరియు శోధనగల సమయాల్లో, క్రీస్తు వలెనే ఆత్మీయ బలము కొరకు సహాయమడుగుతూ మనం దేవునికి ప్రార్థించాలి. పరిపూర్ణుడైన యేసు సహితం తనను బలపరచుమని అడుగుతూ, అనేక సందర్భాల్లో తన తండ్రికి ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలు హృదయపూర్వకమైనవియును, తీవ్రతగలవినై యుండెను. అదే ప్రకారం నేడు, శోధన సమయాల్లో శరీరేచ్ఛలను ఎదిరించి వివాహపు ప్రమాణానికి ద్రోహం తలపెట్టకుండుటకు సహాయము చేయుమని యెహోవాకు ప్రార్థించుట ద్వారా సరియైన నిర్ణయం చేయుటకు మనం బలపర్చబడగలం.—కీర్తన 119:101, 102.

ప్రవర్తనా సరళిలో విభిన్న మాదిరులు

14, 15. (ఎ) శోధన కలిగినప్పుడు యోసేపు ఎలా స్పందించాడు? (బి) శోధన నెదుర్కొవడానికి యోసేపుకు ఏది సహాయపడింది?

14 శోధనను మనమెట్లు ఎదుర్కొనగలం? ఈ విషయంలో యోసేపు మరియు దావీదు గైకొన్న విధానాల మధ్య స్పష్టమైన భేదం కలదు. అప్పటికింకా అవివాహితునిగా వున్న అందగాడైన యోసేపును లొంగదీసుకోవాలని పోతీఫరు భార్య తీవ్రంగా ప్రయత్నించినప్పుడు, ఆయన చివరకు ఆమెకిలా జవాబిచ్చాడు: “ఈ యింటిలో నాకంటె [నీ భర్తకంటె] పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?”—ఆదికాండము 39:6-9.

15 లొంగిపోవడం ఎంతో సులభమైనను సరియైన దానిని చేపట్టుటకు యోసేపుకు ఏది సహాయం చేసింది? తన చిత్తవృత్తిని నూతనపరచే బలమైన శక్తిని ఆయన కలిగియుండెను. ఆయన యెహోవాతో తనకున్న సంబంధమందు బహు జాగ్రత్తగలవాడై యుండెను. మదపిచ్చిగల ఈ స్త్రీతో వ్యభిచరించడం ఆమె భర్తయెడల పాపము జరిగించుటే కాకుండ, మరి ప్రాముఖ్యముగా దేవునికి వ్యతిరేకముగా పాపము చేయుటని ఆయన ఎరిగియుండెను.—ఆదికాండము 39:12.

16. శోధన కలిగినప్పుడు దావీదు ఎలా స్పందించాడు?

16 దీనికి భిన్నంగా, దావీదుకు జరిగిందేమిటి? అతడు వివాహితుడై యుండి ధర్మశాస్త్రము అనుమతించిన ప్రకారము అనేకమంది భార్యలను కలిగియుండెను. ఒక సాయంకాలం ఆయన తన రాజనగరి మిద్దె మీదనుండి స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. ఆమె ఊరియా భార్యయు, సౌందర్యవతియైన బత్షెబ. దావీదుకు రెండు ఎంపికలుండెను, తన హృదయంలో మోహపు కోరిక కలిగినవెంటనే దానినలా కొనసాగించుటయా లేక వెనుదిరిగి ఆ శోధనను త్రిప్పికొట్టుటయా? ఆయనేమి చేయడానికి ఎంచుకున్నాడు? ఆమెను తన మందిరానికి రప్పించుకొని, ఆమెతో వ్యభిచరించాడు. అంతకంటే నీచంగా, ఆయన ఆమె భర్త మరణించేటట్టు చేశాడు.—2 సమూయేలు 11:2-4, 12-27.

17. దావీదు ఆత్మీయ స్థితిని గూర్చి మనమేమి కనుక్కోగలం?

17 దావీదుకున్న సమస్యేమిటి? పశ్చాత్తాపముతో చేసిన పనిని ఒప్పుకుంటూ ఆయన ఆ తర్వాత వ్రాసిన 51వ కీర్తనలో, కొన్ని వాస్తవాలను మనం కనుక్కోగలం. ఆయనిట్లన్నాడు: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.” శోధన కలిగిన సమయంలో ఆయనకు శుద్ధమైన, స్థిరమైన మనస్సు లేదనుట స్పష్టమే. బహుశ ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించడాన్ని నిర్లక్ష్యం చేసియుండవచ్చు, దాని ఫలితంగా ఆయన ఆత్మీయంగా బలహీనపడ్డాడు. లేదా ఆయన తన ఆలోచనలకు తప్పుపట్టునట్లు తనకున్న స్థానాన్ని, రాజుగా తనకున్న అధికారాన్ని అనుమతించి యుండవచ్చు, కావున ఆయన మోహపు కోరికకు బలయ్యాడు. నిశ్చయంగా ఆయన చిత్తవృత్తిని నూతనపరచే శక్తి ఆ సమయంలో స్వార్థపూరితంగాను, పాపభరితంగాను ఉండెను. కావున, తనకు ‘నూతనముగా ఒక స్థిరమైన మనస్సు’ అవసరమని ఆయన గుర్తించాడు.—కీర్తన 51:10; ద్వితీయోపదేశకాండము 17:18-20.

18. వ్యభిచారం విషయంలో యేసు ఎలాంటి హెచ్చరికనిచ్చాడు?

18 ఒకరు లేదా భాగస్వాములిద్దరూ రాజైన దావీదువలెనే ఆత్మీయ బలహీనతలో పడిపోవుటకు అనుమతించినందున కొన్ని క్రైస్తవ వివాహాలు పాడైపోయినవి. మోహముతో మరో పురుషున్ని లేదా స్త్రీని అదేపనిగా చూడకుండా జాగ్రత్తపడే విషయంలో ఆయన ఉదాహరణ మనలను హెచ్చరిస్తుంది, ఎందుకంటె దానిఫలితంగా చివరకు వ్యభిచారం జరుగవచ్చు. ఈ విషయంలో మానవ భావోద్రేకాలను తాను అర్థంచేసుకున్నానని యేసు చూపించాడు, ఎందుకంటే ఆయనిట్లన్నాడు: “‘వ్యభిచారము చేయవద్దని’ చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా—ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” అలాంటి సందర్భంలో, చిత్తవృత్తిని నూతనపరచే శక్తి ఆత్మీయమైనది కాక స్వార్థపూరితమైనది, శరీర సంబంధమైనది. కాబట్టి క్రైస్తవులు వ్యభిచరించడాన్ని విసర్జించి తమ వివాహాన్ని సంతృప్తికరమైనదిగాను, ధన్యతగలదిగాను చేసుకొనుటకు ఏమిచేయగలరు?—మత్తయి 5:27, 28.

వివాహబంధాన్ని బలపర్చుకోండి

19. వివాహమెలా బలపర్చబడగలదు?

19 రాజైన సొలొమోను యిలా వ్రాశాడు: “ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరుకూడి వాని నెదిరింపగలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.” నిశ్చయముగా కష్టం వచ్చినప్పుడు ఒంటరిగానున్న వానికంటే శ్రావ్యతగల వివాహమందలి ఇద్దరు మరి శ్రేష్ఠముగా కలిసి నిలువబడగలరు. అయితే మూడు పేటల తాడును పోలి వారి బంధమందు దేవున్ని కలిగియుంటే, వారి వివాహం బలమైనదిగా ఉంటుంది. మరి వివాహమందు దేవుడెట్లుండగలడు? దంపతులిద్దరు వివాహ విషయమై ఆయనిచ్చిన సూత్రాలను, సలహాను అన్వయించినప్పుడు దేవుడు వారిమధ్య ఉండగలడు.—ప్రసంగి 4:12.

20. భర్తకు ఏ బైబిలు సలహా సహాయపడగలదు?

20 నిశ్చయముగా, క్రిందనున్న వచనాల్లోని సలహాను భర్త అన్వయిస్తే, తన వివాహం జయపద్రమగుటకు ఆయన మంచి ఆధారాన్ని కలిగియుంటాడు:

“పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.”—1 పేతురు 3:7.

“పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.”—ఎఫెసీయులు 5:25, 28.

“చాలామంది కుమార్తెలు పతివ్రతాధర్మమును ననుసరించి యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.”—సామెతలు 31:28, 29.

“ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. జారత్వము జరిగించువాడు . . . స్వనాశనమును కోరువాడే.”—సామెతలు 6:28, 29, 32.

21. భార్యకు ఏ బైబిలు సలహా సహాయపడగలదు?

21 ఈ క్రింది బైబిలు అంశాలకు భార్య అవధానమిస్తే, అది ఆమె శాశ్వతమైన వివాహానికి దోహదపడుతుంది:

“స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.”—1 పేతురు 3:1-4.

“భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారివారి ధర్మములు నడుపవలెను. . . . కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి.”—1 కొరింథీయులు 7:3-5.

22. (ఎ) మేలైన వివాహము కొరకు మరింకే వాస్తవాలు ప్రభావం చూపగలవు? (బి) విడాకులను యెహోవా ఎలా దృష్టిస్తాడు?

22 వివాహమనే రత్నానికి ప్రేమ, దయ, జాలి, ఓపిక, అర్థం చేసుకోవడం, ప్రోత్సాహం, పొగడ్తలు ఆవశ్యకమైన ఇతర ముఖరూపాలని కూడ బైబిలు చూపిస్తున్నది. అవి లేని వివాహం సూర్యరశ్మి, నీరు లేని మొక్కలాంటిది, అవి లేని మొక్క వికసించదు. కాబట్టి చిత్తవృత్తిని నూతనపర్చే శక్తి మన వివాహమందు ఉభయులు పరస్పరం ప్రోత్సహించుకోవడానికి, ఉపశమింపజేసుకోవడానికి పురికొల్పునివ్వాలి. యెహోవా ‘విడాకులను అసహ్యించుకొనునని’ గుర్తుంచుకొనండి. క్రైస్తవ ప్రేమను అభ్యసించినట్లయితే, వ్యభిచారానికి, వివాహ విచ్ఛిన్నతకు తావుండదు. ఎందుకు? ఎందుకనగా “ప్రేమ శాశ్వతకాలముండును.”—మలాకీ 2:16; 1 కొరింథీయులు 13:4-8; ఎఫెసీయులు 5:3-5.

మీరు వివరించగలరా?

◻ సంతోషభరిత వివాహానికి మూలాధారమేమి?

◻ చిత్తవృత్తిని నూతనపరచు శక్తి వివాహంపై ఎలా ప్రభావం చూపగలదు?

◻ చిత్తవృత్తిని నూతనపరచే శక్తిని బలపరచుకోవడానికి మనమేమి చేయవచ్చును?

◻ శోధన కలిగినప్పుడు యోసేపు మరియు దావీదు విభిన్నంగా ఎలా ప్రతిస్పందించారు?

◻ వివాహబంధాన్ని బలపరచుకోవడానికి భార్యాభర్తలకు ఏ బైబిలు సలహా సహాయం చేస్తుంది?

[18వ పేజీలోని చిత్రాలు]

సంఘములో ఒకలా ఇంటిలో మరోలా—మనం ద్వందవైఖరితో జీవిస్తున్నామా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి